“సన్నద్ధులై ఉన్నట్లు నిరూపించుకోండి”
1 యేసు ఈ విధానాంతం గురించిన తన గొప్ప ప్రవచనంలో, జీవితపు చింతల్లో మునిగిపోకూడదని హెచ్చరించాడు. (మత్త. 24:36-39; లూకా 21:34, 35) మహా శ్రమలు ఏ సమయంలోనైనా సంభవించవచ్చు కాబట్టి, “మీరు అనుకోని గడియలో మనుష్యకుమారుడు వస్తాడు కాబట్టి మీరు సన్నద్ధులై ఉన్నట్లు నిరూపించుకోండి” అని యేసు చేసిన ఉద్బోధను మనం పాటించడం చాలా ప్రాముఖ్యం. (మత్త. 24:44, NW) దాన్ని పాటించేందుకు మనకు సహాయపడేదేమిటి?
2 చింతలతో, అవరోధాలతో పోరాడడం: మనం జాగ్రత్తగా ఉండవలసిన ఆధ్యాత్మిక ఉచ్చుల్లో ఒకటేమిటంటే, జీవనోపాధి గురించిన చింత. (లూకా 21:34) కొన్ని ప్రాంతాల్లో పేదరికం, నిరుద్యోగం, భారీ జీవన వ్యయం వంటివి జీవితావసరాలను సంపాదించుకోవడాన్ని కష్టతరం చేస్తాయి. మరికొన్ని ప్రాంతాల్లో వస్తుసంపదలు సంపాదించుకోవడం చాలా సులభం. వస్తుసంపదల గురించి మనం అధికంగా చింతిస్తున్నట్లయితే, రాజ్య వాస్తవాలపై మన అవధానాన్ని కేంద్రీకరించడంలో విఫలమయ్యే ప్రమాదముంది. (మత్త. 6:19-24, 31-33) అలా అవధానాన్ని కేంద్రీకరించడానికి మనకు క్రైస్తవ కూటాలు దోహదపడతాయి. ప్రతీ కూటానికి తప్పకుండా హాజరుకావడాన్ని మీ లక్ష్యంగా పెట్టుకుంటారా?—హెబ్రీ. 10:24, 25.
3 నేటి లోకం అవరోధాలతో నిండివుంది, అవి మన అమూల్యమైన సమయాన్ని సులభంగా హరించివేయగలవు. ఎవరైనా ఇంటర్నెట్ బ్రౌజింగ్‌లో, ఇ-మెయిల్ పంపించడం చదవడం వంటివాటిలో, కంప్యూటర్ గేమ్స్ ఆడడంలో సమయాన్ని అమితంగా వెచ్చిస్తున్నట్లయితే కంప్యూటర్ ఉపయోగం ఒక ఉచ్చుగా మారగలదు. టెలివిజన్, సినిమాలు, సరదాలు, లౌకిక పుస్తకాలు చదవడం, క్రీడలు వంటివి లెక్కలేనంత సమయాన్ని కాజేసి, ఆధ్యాత్మిక విషయాలకు సమయం, శక్తి లేకుండా చేయగలవు. వినోదం, విరామం తాత్కాలికంగా ఉత్తేజపరచినప్పటికీ, వ్యక్తిగత బైబిలు అధ్యయనం, కుటుంబ బైబిలు అధ్యయనం శాశ్వత ప్రయోజనాలను చేకూరుస్తాయి. (1 తిమో. 4:7, 8) మీరు దేవుని వాక్యాన్ని ప్రతీరోజూ ధ్యానించడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారా?—ఎఫె. 5:15-17.
4 మనం “జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు” మనకు సహాయం చేసేందుకు యెహోవా సంస్థ ఆధ్యాత్మిక సలహాలిచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనమెంత కృతజ్ఞులుగా ఉండగలమో కదా! (లూకా 21:36) మనం ఈ ఏర్పాట్లనుండి పూర్తిగా ప్రయోజనం పొందుతూ ‘సన్నద్ధులమై ఉన్నట్లు నిరూపించుకుందాం.’ ఆ విధంగా మన విశ్వాసం, ‘యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలగడానికి కారణం’ కావచ్చు.—1 పేతు. 1:7.