మనం మెలకువగా ఉంటున్నామా అంటే పరధ్యానం కలుగజేసేవాటిని తప్పించుకొంటున్నామా?
1 కచ్చితంగా రానైయున్న కష్టాలను ‘తప్పించుకొనుటకు శక్తిగలవారగునట్లు మెలకువగా ఉండుడి’ అని యేసు హెచ్చరించాడు. (లూకా 21:36) మనం మానవ చరిత్రలోని అత్యంత అపాయకరమైన కాలంలో జీవిస్తున్నాము. ఆత్మీయ మగతలోకి జారిపోయే వారి కొరకు నాశనం వేచి ఉంది. ఇది మనలో ప్రతి ఒక్కరికి ప్రమాదాన్ని కలుగజేస్తుంది. తినడం, త్రాగడం, మరియు ప్రతిదిన జీవన వ్యాకులతల గురించి యేసు ప్రస్తావించాడు. ఎందుకని? ఎందుకంటే ఈ విషయాలు కూడా మన మనస్సును ఎక్కువగా ఆక్రమించి, పరధ్యానం కలిగించేవిగా తయారై, ప్రమాదకరమైన ఆత్మీయ మగతను కలుగజేస్తాయి.
2 సాధారణంగా పరధ్యానం కలుగజేసేవి: కొందరు చివరికి దూరదర్శిని వ్యసనపరులుగా కూడా తయారౌతూ, విపరీతమైన లేక ప్రశ్నించదగిన వినోదంలో పూర్తిగా నిమగ్నమైపోయారు. అయితే, రాజ్యాన్ని మొదట వెదకడమంటే మనం అన్ని విధాలైన వినోదాన్ని మానుకోవాలని భావం కాదు. మనం సహేతుకతను, మితాన్ని పాటించినప్పుడు వినోదం ప్రయోజనకరమైనది కాగలదు. (1 తిమోతి 4:8 పోల్చండి.) కాని, మన సమయాన్ని, వనరులను ఎక్కువగా తీసేసుకుంటూ లేదా రాజ్యప్రకటన పనిలోని మన వంతును తగ్గించేస్తూ, అదే మన జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యమైన విషయం అయినప్పుడు అది పరధ్యానం కలుగజేసేదవుతుంది.
3 ఆత్మీయ మగతను కలుగజేసే మరో సాధారణ పరధ్యానం ఏమిటంటే, అనవసరమైన వస్తుసంపదల కొరకైన ఆశ. దీని కొరకు ఒక వ్యక్తి ఉద్యోగంలో ఎక్కువ సమయం గడపవలసి వస్తుంది, అది ఆత్మీయ లక్ష్యాలను ప్రక్కనపెట్టేలా చేస్తుంది. మరింత సుఖప్రదమైన జీవన విధానాన్ని పొందడానికి వస్తు సంపదలను సంపాదించుకోవడంలో నిమగ్నమైపోవడం ద్వారా కొందరు ఆత్మీయ గమ్యాలపై శ్రద్ధను పోగొట్టుకున్నారు. మనకు “అన్నవస్త్రములు” అవసరమైనప్పటికీ, మనల్ని విశ్వాసం నుండి వైదొలగజేసే ధనాపేక్ష పెంపొందకుండా మనం జాగ్రత్త వహించాలి. (1 తిమోతి 6:8-10) రాజ్యాసక్తులపై దృష్టిని కేంద్రీకరించి ఉంచడానికి విఫలమవ్వడం ద్వారా, మనం మన కుటుంబ ఆత్మీయ అవసరతల గురించి శ్రద్ధ వహించడాన్ని నిర్లక్ష్యం చేసి, మన పరిచర్యను నెరవేర్చడంలో విఫలమౌతాము.—1 తిమో. 5:8; 2 తిమో. 4:5.
4 మరి ఇతరులు తాము ఆత్మీయపరంగా నిద్రలోకి జారుకునేంతగా, ‘తమ హృదయములు ఐహిక విచారములవలన మందముగా తయారవ్వడానికి’ అనుమతిస్తారు. (లూకా 21:34) కొన్నిసార్లు, ఆరోగ్య సమస్యల మూలంగా లేక బాధ కలిగించే కుటుంబ పరిస్థితుల మూలంగా వ్యాకులత కలుగుతుంది. కాని అలాంటి వ్యక్తిగతమైన విషయాలు, త్వరగా సమీపిస్తున్న ఈ విధానాంతాన్ని గూర్చిన మన జాగరూకతను నాశనం చేయడానికి అనుమతించకూడదు.—మార్కు 13:33.
5 లోకసంబంధమైన కోరికలను తీర్చుకోవడానికి ప్రయాసపడుతూ ఉండేటువంటి స్వప్నావస్థలోకి మనల్ని పడవేయడంలో విజయం సాధించడం కంటే మరేది సాతానుకు ఎక్కువ సంతోషాన్ని కలుగజేయదు. ఆత్మీయపరంగా మెలకువగా ఉండడానికి మనం పోరాడాలి. ‘యెహోవా దినం దొంగ వలె వస్తుందని’ మనకు తెలుసు, మనం “మెలకువగా ఉండి మత్తులము కాక” ఉండడం ప్రాముఖ్యం. (1 థెస్స. 5:2, 6) మనలో మగత సంబంధమైన సూచనలు ఉన్నట్లు మనం కనుగొంటే, మనం “అంధకార క్రియలను విసర్జిం”చడం అత్యవసరం.—రోమా. 13:11-13.
6 మనం మెలకువగా ఉండేందుకు తోడ్పడే సహాయకాలు: అలాంటి సహాయకాలు ఏవి? ప్రార్థన ప్రాముఖ్యం. మనం పట్టుదలతో ప్రార్థించాలి. (1 థెస్స. 5:17) క్రైస్తవ సంఘానికి సన్నిహితంగా ఉండడం ‘ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు మనల్ని పురికొల్పుతుంది.’ (హెబ్రీ. 10:24) మనల్ని మనం క్రమంగా, యథార్థంగా పరీక్షించుకోవడం బలహీనతలను అధిగమించవలసిన మన అవసరత గురించి జాగ్రత్త కలిగివుండడానికి సహాయం చేయగలదు. (2 కొరిం. 13:5) మంచి వ్యక్తిగత పఠన అలవాట్లు మనం “విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపా”రేలా చేస్తాయి. (1 తిమో. 4:6) మనం పట్టుదల కలిగివుంటే, పరధ్యానం కలుగజేసే వాటిని తప్పించుకొని, ‘మెలకువగా ఉండి, విశ్వాసమందు నిలకడగా ఉండగలమని’ నమ్మకం కలిగివుండవచ్చు.—1 కొరిం. 16:13.