కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 11/1 పేజీలు 10-15
  • నీతి నోటిమాట పారంపర్యాచారము ద్వారా కాదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నీతి నోటిమాట పారంపర్యాచారము ద్వారా కాదు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • రెండు రకముల నీతి
  • “మనుష్యుల యెదుట నీతిమంతులుగా యుండుట” సరిపోదు
  • “చెప్పబడిన మాట మీరు విన్నారు”
  • రాజ్యమును మరియు దేవుని నీతిని వెదకుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • మౌఖిక ధర్మశాస్త్రం—వ్రాతలో ఎందుకు పెట్టబడింది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • “నాయొద్ద నేర్చుకొనుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • వినువారు మాత్రమేగాక, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 11/1 పేజీలు 10-15

నీతి నోటిమాట పారంపర్యాచారము ద్వారా కాదు

“శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు.”—మత్తయి 5:20.

1, 2. యేసు కొండమీది ప్రసంగము చెప్పుటకు ముందు ఏమి సంభవించెను?

యేసు ఆ రాత్రంతయు కొండమీద గడిపెను. పైన ఆకాశము నిండా నక్షత్రములు పరచుకొనియుండెను. పొదలలో చిన్న చిన్న నిశాచర జీవుల కీచురాళ్ల చప్పుళ్లు. తూర్పున గలిలయ సముద్రపు నీటి అలలు మృదువుగా ఒడ్డును తాకుచున్నవి. అయితే యేసు ప్రశాంతమైన, నెమ్మదియైన ఈ రమణీయ పరిసరములను అంతగా పట్టించుకొనక యుండవచ్చును. ఆయన తన తండ్రియైన యెహోవాకు ప్రార్థించుటలో ఆ రాత్రంతయు గడిపెను. ఆయనకు తన తండ్రి నడిపింపు కావలెను. ముందున్న దినము కీలకమైన దినమైయుండెను.

2 తూర్పున ఆకాశము తెల్లబడెను. పక్షులు కిలకిలలాడుచు ఎగురుట కారంభించెను. అడవిపువ్వులు పిల్లగాలికి నెమ్మదిగా అటునిటు ఊగుచున్నవి. తూర్పున సూర్యకిరణములు పైకివచ్చుచుండగా, యేసు తనయొద్దకు శిష్యులను పిలిపించి వారిలోనుండి 12 మందిని తన అపొస్తలులుగా ఎంచుకొనెను. ఆ పిమ్మట, వారందరితో కలిసి ఆయన కొండదిగుచుండగా, అప్పటికే గలిలయ, తూరు, సీదోను, యూదయ మరియు యెరూషలేమునుండి జనులు ప్రవాహముగా వచ్చుటను వారు చూడగల్గిరి. అనేకులు యేసును ముట్టుకొనుచు స్వస్థపరచబడుచుండగా యేసునుండి యెహోవా శక్తి బయటకు వెళ్లుచుండెను. వారాయన మాటలను వినుటకును వచ్చిరి, అవి వారి కలతచెందిన ఆత్మలకు నివారణనిచ్చు మలామువలె నుండెను.—మత్తయి 4:25; లూకా 6:12-19.

3. యేసు మాట్లాడనారంభించినప్పుడు శిష్యులు మరియు జన సమూహములు ఎందుకు ఆశతోనుండిరి?

3 సాధారణ బోధనా సమయములో, బోధకులు క్రింద కూర్చొనుట అలవాటు, కాగా సా.శ 31లోని ఈ ప్రత్యేక వసంతకాల ఉదయమున, దానినే చేయుచు, యేసు కొండదిగువన చదునైన ప్రదేశములో కొంత ఎత్తుగానున్న స్థలములో కూర్చొనెను. ఆయన శిష్యులు మరియు జనసమూహములు దీనిని చూసినప్పుడు, ఎదో ప్రత్యేకమైన సంగతి జరుగనైయుండెనని గ్రహించిరి, కావున వారు ఆశతో ఆయనచుట్టు చేరిరి. ఆయన మాట్లాడుటకు ఆరంభించినప్పుడు, వారాయన మాటలకొరకు ఎదురుచూసిరి; ఆ తర్వాత కొద్ది సమయమునకు ఆయన ముగించినప్పుడు, తాము వినిన దాని విషయమై వారెంతో విస్మయమొందిరి. ఎందుకో మనము చూద్దాము.—మత్తయి 7:28.

రెండు రకముల నీతి

4. (ఎ) ఏ రెండు రకముల నీతి వివాదమందుండెను? (బి) నోటిమాట పారంపర్యాచారముల ఉద్దేశ్యమేమైయుండెను, మరియు అది సాధించబడెనా?

4 మత్తయి 5:1–7:29 మరియు లూకా 6:17-49 లో వ్రాయబడియున్న, తన కొండమీది ప్రసంగములో యేసు రెండు తరగతుల వారిని: శాస్త్రుల, పరిసయ్యుల మరియు వారు అణగద్రొక్కిన సామాన్య ప్రజలమధ్యవున్న తీవ్రభేదమును ప్రస్తావించెను. ఆయన రెండు రకములైన నీతినిగూర్చి మాట్లాడెను, ఒకటి పరిసయ్యుల వేషధారణతోకూడిన నీతి రెండోది నిజమైన దేవుని నీతి. (మత్తయి 5:6, 20) పరిసయ్యుల స్వనీతితోకూడిన నోటిమాట పారంపర్యాచారముల యందు వేరుపారియుండెను. అన్యవాదమునుండి (గ్రీకు సంస్కృతి) కాపాడుటకు “ధర్మశాస్త్రమునకు కంచెగా” సా.శ.పూ. రెండవ శతాబ్దములో అవి రూపొందించబడెను. అవి ధర్మశాస్త్రములో ఒక భాగముగా దృష్టింపబడెను. వాస్తవానికి, శాస్త్రులు ఈ నోటిమాట పారంపర్యాచారములను వ్రాతపూర్వకమైన ధర్మశాస్త్రముకంటె ఉన్నతమైనవిగా చేసిరి. మిష్నా ఇట్లనుచున్నది: “వ్రాతపూర్వకమైన ధర్మశాస్త్రములోని మాటలను పాటించుటకంటె శాస్త్రుల మాటలను [వారి నోటిమాట పారంపర్యాచారములను] పాటించుట మరి ఖచ్ఛితముగా అన్వయించును.” కావున, కాపాడుటకు “ధర్మశాస్త్రమునకు కంచెగా” ఉండుటకు మారుగా, యేసు చెప్పినట్లు వారి పారంపర్యాచారములు ధర్మశాస్త్రమును బలహీనపరచి దానిని నిరర్థకమైన దానిగాచేసెను. ఆయనిట్లనెను: “మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు.”—మార్కు 7:5-9; మత్తయి 15:1-9.

5. (ఎ) యేసును వినుటకు వచ్చిన సామాన్య ప్రజల పరిస్థితి ఏమైయుండెను, మరియు వారిని శాస్త్రులు, పరిసయ్యులు ఎట్లు దృష్టించెడివారు? (బి) నోటిమాట పారంపర్యాచారములను పనిచేయువారి భుజములపై అంత మోయశక్యముకాని భారముగా ఏదిచేసెను?

5 యేసును వినుటకు గుమికూడిన సామాన్య ప్రజలు ఆత్మీయముగా బలములేనివారును, “కాపరిలేని గొర్రెలవలె విసికి చెదరియున్న” వారునైయున్నారు. (మత్తయి 9:36) గర్వం మరియు అహంకారముతో శాస్త్రులు, పరిసయ్యులు వారిని హేళనచేసి, వారిని ఆమ్‌హరెట్స్‌ (మట్టి మనుషులు), అని పిలిచెడివారు మరియు వారిని అజ్ఞానులని, నోటిమాట పారంపర్యాచారములను పాటించనందున వారు పునరుత్థానమునకు అనర్హులైన, శపింపబడిన పాపులని త్రోసిపుచ్చెడి వారు. యేసు కాలమునాటికి, ఆ పారంపర్యాచారములు ఎంత అపరిమితముగా మరియు భరించరాని గందరగోళముగా తయారయ్యెనంటే న్యాయబద్ధముగా వెన్నులు త్రుంచుట, కాలయాపనచేయు ఆచార పద్ధతులతో భరింపరాని విధముగా, పనిచేయు ఎవడును వాటిని పాటించశక్యము కానంతగా ఉండెను. కావున యేసు ఆ పారంపర్యాచారములను ‘మనుష్యుల భుజములపై మోయశక్యము కాని భారములని’ ఖండించుటలో ఆశ్చర్యము లేదు.—మత్తయి 23:4; యోహాను 7:45-49.

6. యేసు ప్రారంభ ప్రకటనలలో అంత ఉలికిపడజేయు సంగతి ఏమైయుండెను, అవి శిష్యులకు, శాస్త్రులకు మరియు పరిసయ్యులకు ఎటువంటి మార్పును సూచించెను?

6 కావున యేసు కొండప్రాంతమున కూర్చొనియుండగా, ఆయన మాటలు వినుటకు వచ్చినవారు ఆయన శిష్యులును ఆత్మీయముగా ఆకలిగొనియున్న జనసమూహములునై యుండిరి. ఆయన ప్రారంభపుమాటలు వారికి ఉలికిపడజేయునవిగా యుండవచ్చును. ‘బీదలైనవారు ధన్యులు, ఆకలిగొనియున్నవారు ధన్యులు, ఏడ్చుచున్నవారు ధన్యులు, ద్వేషింపబడుచున్నవారు ధన్యులు.’ అయితే బీదలుగా, ఆకలితో, ఏడ్చుచున్న, మరియు ద్వేషింపబడుచున్న ఎవరు మాత్రము ధన్యులుగా ఉండగలరు? ధనవంతులకు, తృప్తినొందువారికి, నవ్వెడివారికి, మరియు కొనియాడబడువారికి శ్రమలు ప్రకటింపబడెను! (లూకా 6:20-26) కొద్దిమాటలలోనే, యేసు సమస్త సంప్రదాయ అంచనాలను మరియు అమితముగా యెంచబడిన మానవ కట్టడల నమ్మకాలను తల్లక్రిందులు చేసెను. యేసు ఆ తర్వాత పలికిన మాటల ప్రకారము, అది స్థానముల నాటకీయమైన తిరోగమనమై యుండెను. ఆయనిట్లనెను: “తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.—లూకా 18:9-14.

7. ఆత్మీయముగా ఆకలిగొనియుండి యేసును వినుచుండిన జనసమూహము మీద యేసు ప్రారంభపు మాటలు ఎలాంటి ప్రభావమును కలిగియుండవచ్చును?

7 స్వయం సంతృప్తిగల శాస్త్రులు, పరిసయ్యులకు భిన్నముగా, ప్రత్యేకముగా ఈ ఉదయము యేసునొద్దకు వచ్చువారు తమ దుఃఖకర ఆత్మీయ స్థితిని ఎరిగినవారై యుండిరి. ఆయన ప్రారంభపు మాటలు వారిని నిరీక్షణతో నింపియుండవచ్చును: “ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.” మరియు ఆయన ఇంకను ఇట్లనినప్పుడు వారి ఆత్మ తెప్పరిల్లియుండవచ్చును: “నీతికొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తి పరచబడుదురు.”! (మత్తయి 5:3, 6; యోహాను 6:35; ప్రకటన 7:16, 17) నీతితో నిండియుండుట, అవును, అయితే పరిసయ్యుల ముద్రతో కాదు.

“మనుష్యుల యెదుట నీతిమంతులుగా యుండుట” సరిపోదు

8. శాస్త్రుల, పరిసయ్యుల నీతికంటె తమనీతి ఎలా అధికము కాగలదని కొందరెందుకు ఆశ్చర్యపడుదురు, అయినను అది ఎందుకు అట్లు కావలెను?

8 “శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు” అని యేసు చెప్పెను. (మత్తయి 5:17-20; మార్కు 2:23-28; 3:1-6; 7:1-13 చూడుము.) కొందరు ఇట్లు తలంచియుండవచ్చును. ‘పరిసయ్యులకంటే నీతియుక్తముగానా? వారు ఉపవాసముందురు, ప్రార్థనచేయుదురు, పదియవ భాగము చెల్లింతురు, దానమిత్తురు మరియు ధర్మశాస్త్రమును చదువుటలో తమ జీవితమును గడుపుదురు? అలాంటప్పుడు మా నీతి వారినీతికంటె ఎట్లు అధికము కాగలదు?’ అయితే అది అంతకంటే ఎక్కువ అధికము కావలెను. మనుష్యులు పరిసయ్యులను ఘనముగా ఎంచియుండవచ్చును, అయితే దేవుడట్లు ఎంచుటలేదు. మరొక సందర్భములో యేసు ఈ పరిసయ్యులతో ఇట్లనెను: “మీరు మనుష్యుల యెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును; మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము.”—లూకా 16:15.

9-11. (ఎ) దేవుని యెదుట నీతియుక్తమైన స్థానము పొందుటకు ఒక మార్గమేమని శాస్త్రులు, పరిసయ్యులు తలంచిరి? (బి) నీతిని సంపాదించుటకు రెండవ మార్గమేదని వారు అపేక్షించిరి? (సి) వారు లెక్కించిన మూడవ మార్గము ఏమైయున్నది, మరియు దీనిని నిరర్థకముచేసిన ఏ మాటలను అపొస్తలుడైన పౌలు చెప్పెను?

9 రబ్బీలు నీతిని సంపాదించుటకు తమ స్వంత నియమములను ప్రవేశపెట్టిరి. అందు ఒకటేమనగా తాము అబ్రాహాము సంతానమనుచు దానినిగూర్చి వారు ఇట్లు చెప్పుకొందురు: “మన తండ్రియైన అబ్రాహాము శిష్యులు ఈ లోకము ననుభవింతురు మరియు రానైయున్న లోకమును స్వతంత్రించుకొందురు.” (మిష్నా) ఈ పారంపర్యాచారమును త్రిప్పికొట్టుటకు బహుశ బాప్తిస్మమిచ్చు యోహాను ఒకసారి తనయొద్దకు వచ్చిన పరిసయ్యులతో ఇట్లనెను: “మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ‘అబ్రాహాము మాకు తండ్రి’ అని మీలోమీరు చెప్పుకొన తలంచవద్దు.”—మత్తయి 3:7-9; యోహాను 8:33, 39 కూడ చూడుము.

10 నీతిని సంపాదించుటకు వారు చెప్పు రెండవ మార్గమేదనగా, దానమిచ్చుట. సా.శ.పూ. రెండవ శతాబ్ద కాలములో భక్తిపరులైన యూదులు వ్రాసిన రెండు అప్రసిద్ధ వ్రాతలు ఈ సంప్రదాయక దృష్టిని ప్రతిబింబించుచున్నవి. తోబియానందు ఈ మాట కన్పించును: “దానమిచ్చుట ఒకని మరణమునుండి రక్షించును మరియు ప్రతిపాపము నుండి ప్రాయశ్చిత్తము కల్గించును.” (12:9, ది న్యూ అమెరికన్‌ బైబిల్‌) సిరాకు గ్రంథము (ప్రసంగి) ఇట్లనుచున్నది: “నీరు అగ్నిజ్వాలను ఆర్పివేయును, ఆలాగే దానము పాపములను పరిహరించును.”—3:29, NAB.

11 మూడవ మార్గముగా వారు ధర్మశాస్త్ర క్రియలద్వారా నీతిని వెదకిరి. ఒకని క్రియలన్నియు దాదాపు మంచివైనట్లయిన, అతడు రక్షింపబడునని వారి నోటిమాట పారంపర్యాచారము బోధించినది. “అధికముగా క్రియల ప్రకారమే, అవి మంచివైనను లేక చెడ్డవైనను వాటి ప్రకారమే” తీర్పు జరుగును. (మిష్నా) తీర్పునందు ఆదరింపబడుటకు, “పాపములకంటె ఎక్కువ బరువుతూగు అనుగ్రహమును సంపాదించుటయే” వారి ముఖ్యచింతయై యుండవలెను. ఒకని చెడ్డక్రియలకంటే సత్క్రియలు ఒక్కటి ఎక్కువవుంటే, అతడు రక్షింపబడును—అంటే వారి స్వల్ప క్రియలను లెక్కపెట్టుట ద్వారా దేవుడు తీర్పుతీర్చునని వారి నమ్మకము! (మత్తయి 23:23, 24) సరియైన దృష్టిని అందజేయుచు, పౌలు ఇట్లు వ్రాసెను: “ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన [దేవుని] దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు.” (రోమీయులు 3:20) నిశ్చయముగా, క్రైస్తవ నీతి శాస్త్రుల, పరిసయ్యుల నీతికంటె అధికమై యుండవలెను!

“చెప్పబడిన మాట మీరు విన్నారు”

12. (ఎ) తన కొండమీది ప్రసంగములో హెబ్రీ లేఖనముల ఉల్లేఖనములను పరిచయముచేయు తన సాధారణ పద్ధతినుండి యేసు ఎటువంటి మార్పు చేసెను, మరియు ఎందుకు? (బి) “చెప్పబడిన మాట” అని ఉపయోగింపబడిన ఆరవ పదభాగమునుండి మనమేమి నేర్చుకొందుము?

12 యేసు అంతకుముందు హెబ్రీలేఖనములను ఎత్తిచెప్పినప్పుడు, ఆయనిట్లనెను: “అని వ్రాయబడియున్నది.” (మత్తయి 4:4, 7, 10) అయితే కొండమీది ప్రసంగములో “చెప్పబడిన మాట” అను పదములతో ఆరు సార్లు ఆయన, హెబ్రీలేఖనములలో చెప్పబడినవన్నట్లున్న వాక్యములను సూచించెను. (మత్తయి 5:21, 27, 31, 33, 38, 43) ఎందుకు? ఎందుకనగా, దేవుని ఆజ్ఞలకు భిన్నమైన పరిసయ్యుల పారంపర్యాచారముల పరిధిలో భావము చెప్పబడిన లేఖనములను ఆయన సూచించుచుండెను. (ద్వితీయోపదేశకాండము 4:2; మత్తయి 15:3) ఈ పరంపరలో యేసుచెప్పిన చివరిది మరియు ఆరవ ఉల్లేఖనమందు ఇది స్పష్టము చేయబడెను: “‘నీ పొరుగువాని ప్రేమించి. నీ శత్రువును ద్వేషించుమని’ చెప్పబడిన మాట మీరు విన్నారు.” అయితే మోషే ధర్మశాస్త్రములో ఎక్కడను, “నీ శత్రువును ద్వేషించుమని” చెప్పబడలేదు. శాస్త్రులు, పరిసయ్యులు దీనిని చెప్పిరి. నీ పొరుగువానిని—నీ యూదామత పొరుగువానిని, ఇంకెవరిని కాదు—ప్రేమించుమని వారు ధర్మశాస్త్రమునకు భావము చెప్పిరి.

13. నిజమైన నరహత్యకు నడుపగల ప్రవర్తన తొలిదశకు సహితము వ్యతిరేకముగా యేసు ఎట్లు హెచ్చరికచేసెను?

13 ఈ ఆరు వాక్యముల పరంపరలో మొదటి దానిని ఇప్పుడు విచారించుము. “‘నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని’ పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును.” (మత్తయి 5:21, 22) హృదయమందలి కోపము దుర్భాషలాడుటకు, అక్కడనుండి నిందాపూర్వక తీర్పులకు, చివరకు అది నరహత్య చేయుటకు దారితీయవచ్చును. హృదయములో ఆలాగే కోపము నిలుపుకొనుట మరణకరము: “తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు.”—1 యోహాను 3:15.

14. వ్యభిచారమునకు నడుపు మార్గమున వెళ్లుటకు సహితము ఆరంభించకుము అని యేసు మనకెట్లు సలహానిచ్చుచున్నాడు?

14 యేసు ఆ తర్వాత ఇట్లు చెప్పెను: “‘వ్యభిచారము చేయవద్దని’ చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును.” (మత్తయి 5:27, 28) నీవు వ్యభిచారము చేయబోవుట లేదా? అట్లయిన దానిని గూర్చిన తలంపులతో ఆ మార్గమున వెళ్లుటకూడ చేయకుము. నీ హృదయమును భద్రపరచుకొనుము, అది ఇటువంటి సంగతులకు మూలము. (సామెతలు 4:23; మత్తయి 15:18, 19) యాకోబు 1:14, 15 ఇట్లు హెచ్చరించుచున్నది: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమైనదై మరణమును కనును.” ప్రజలు కొన్నిసార్లు ఇట్లందురు: ‘నీవు ముగించలేని దానిని ప్రారంభించకుము.’ అయితే ఈ విషయములో మనమిట్లనవలెను: ‘నీవు ఆపలేని దానిని ప్రారంభించకుము.’ తుపాకితో కాల్చి చంపు సైనిక దళము ఎదుట మరణముచే బెదిరింపబడినను నమ్మకముగా ఉండిన కొందరు ఆ తర్వాత మోహముతో కూడిన లైంగికదుర్నీతి ఆకర్షణలో పడిపోయిరి.

15. విడాకుల విషయములో యేసు స్థానము యూదుల నోటిమాట పారంపర్యాచారములలో వివరించబడిన దానినుండి ఎట్లు పూర్తిగా భిన్నమైయున్నది?

15 మనమిప్పుడు యేసు చెప్పిన మూడవ సంగతికి వస్తున్నాము. ఆయనిట్లనెను: “‘తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్పబడి యున్నది గదా. నేను మీతో చెప్పునదేమనగా, వ్యభిచార కారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడిన [అనగా, లైంగిక దుర్నీతి కాకుండ ఇతర కారణములచే విడాకులివ్వబడిన] దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు.” (మత్తయి 5:31, 32) కొందరు యూదులు తమ భార్యలతో విశ్వాసఘాతుకముగా వ్యవహరించి అతిచిన్న కారణములతో వారికి విడాకులిచ్చెడివారు. (మలాకీ 2:13-16; మత్తయి 19:3-9) నోటిమాట పారంపర్యాచారములు “ఆమె అతని కూర పాడుచేసినను” లేక “అతడు ఆమెకంటె అందమైన మరొక స్త్రీని ఇష్టపడినను” ఆ మనుష్యుడు తన భార్యకు విడాకులిచ్చుటను అనుమతించెను.—మిష్నా.

16. యూదుల ఏ అభ్యాసము ప్రమాణములు చేయుటను అర్థరహితము చేసెను, మరియు యేసు ఏ స్థానము వహించెను?

16 అదే ధోరణిలో యేసు ఇంకను ఇట్లు కొనసాగించెను: “‘నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను . . . చెల్లింపవలెనని’ పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారుగదా. నేను మీతో చెప్పునదేమనగా, ఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు.” అప్పటికే యూదులు ప్రమాణము చేయుటను దుర్వినియోగము చేయుచు, చెల్లించకుండా చిన్నచిన్న విషయములలో అనేక ప్రమాణములు చేయుచుండిరి. అయితే యేసు ఇట్లనెను: “మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను.” ఆయన నియమము సరళము: ప్రమాణము చేయుటద్వారా మీ మాటకు అభయమివ్వ నవసరము లేకుండానే, అన్ని సమయములో సత్యవంతముగా ఉండండి. ప్రమాణములను అతిప్రాముఖ్యమైన విషయముల కొరకు ఉంచండి.—మత్తయి 5:33-37; 23:16-22 పోల్చుము.

17. “కంటికి కన్ను పంటికి పల్లు” కంటే ఏ శ్రేష్ఠమైన మార్గమును యేసు బోధించెను?

17 ఆ తర్వాత యేసు ఇట్లనెను: “‘కంటికి కన్ను, పంటికి పల్లు’ అని చెప్పబడిన మాట విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడా త్రిప్పుము.” (మత్తయి 5:38-42) యేసు ఇక్కడ హానిచేయవలెనని ఉద్దేశించు పిడిదెబ్బను కాదుగాని, అవమానపరచవలెనని చెయ్యి వెనుక భాగముతో చెంపదెబ్బ కొట్టుటను సూచించుచున్నాడు. పరస్పరము అవమానించుకొనుట ద్వారా నిన్నునీవు అధఃకృతం చేసికొనవద్దు. కీడుకు ప్రతి కీడుచేయుటను తృణీకరించుము. బదులుగా, తిరిగి మేలుచేయుము అలా “మేలుచేత కీడును జయించుము.”—రోమీయులు 12:17-21.

18. (ఎ) నీ పొరుగువాని ప్రేమించుమను నియమమును యూదులెట్లు సవరించిరి, అయితే యేసు దీనినెట్లు ప్రతిఘటించెను? (బి) “పొరుగువానికి” అన్వయించు విషయమును పరిమితము చేయగోరిన ఒక న్యాయవాదికి యేసు సమాధానమేమై యుండెను?

18 ఆరవది మరియు చివరి ఉదాహరణలో, రబ్బీల పారంపర్యాచారము మోషే ధర్మశాస్త్రమును ఎట్లు బలహీనపరచెనో యేసు స్పష్టముగా చూపించెను: “‘నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని’ చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. . . . మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి.” (మత్తయి 5:43, 44) వ్రాతపూర్వక మోషే ధర్మశాస్త్రము ప్రేమకు హద్దులను నియమించలేదు: “నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను.” (లేవీయకాండము 19:18) దానిని తప్పించుకొనుటకు ఈ ఆజ్ఞకు పరిసయ్యులు తప్పు భావము చెప్పి “పొరుగువాడు” అను మాటను నోటిమాట పారంపర్యాచారములను పాటించిన వారికి పరిమితము చేసిరి. అందువలననే ‘నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుమని’ యేసు ఒక న్యాయవాదికి గుర్తుచేసినప్పుడు, ఆ మనుష్యుడు, “అవునుగాని, నా పొరుగు వాడెవడు?” అని చమత్కరించెను. మంచి సమరయుని ఉపమానము ద్వారా యేసు దానికి జవాబిచ్చెను—నీవు అవసరమగు వానికి నిన్నునీవు పొరుగువానిగా చేసికొనుము.—లూకా 10:25-37.

19. దుష్టులయెడల యెహోవాచేసిన ఏ పనిని మనము అనుసరించవలెనని యేసు సిఫారసు చేసెను?

19 తన ప్రసంగమును కొనసాగించుచు, ‘దేవుడు దుష్టులకు ప్రేమచూపించెనని, ఆయన వారిపై సూర్యుని ఉదయింపజేసి వర్షము కురిపించెనని, నిన్ను ప్రేమించువారిని ప్రేమించుటలో అసాధారణమైనదేమియు లేదని, దుష్టులును అట్లే చేయుచున్నారని, దానియందు ప్రతిఫలమునకు కారణమేమియు లేదని, మిమ్మునుమీరు దేవుని కుమారులుగా నిరూపించుకొమ్మని, ఆయనను అనుకరించుమని, అందరికి నిన్నునీవు పొరుగువానిగా చేసికొనుమని మరియు నీ పొరుగువానిని ప్రేమించుమని, ఆ విధముగా “మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక, మీరును పరిపూర్ణులుగా ఉండుడని”’ యేసు ప్రకటించెను. (మత్తయి 5:45-48) తగిన రీతిలో జీవించుటకు అది ఎంతటి సవాలుపూర్వకమైన కట్టడ! అది శాస్త్రుల, పరిసయ్యుల నీతి ఎట్లు అల్పమైనదో ఎంతగా చూపుచున్నది!

20. మోషే ధర్మశాస్త్రమును ప్రక్కనబెట్టుటకు బదులు, యేసు ఎట్లు దాని ప్రభావమును విశాలమైనదిగా మరియు గాఢమైనదిగా చేసి, దానిని మరింత ఉన్నత స్థానమందుంచెను?

20 కావున యేసు ధర్మశాస్త్రములోని కొన్ని భాగములను సూచించుచు, వాటికి “అయితే, నేను మీతో చెప్పునదేమనగా,” అని చేర్చినప్పుడు, ఆయన మోషే ధర్మశాస్త్రమును ప్రక్కనబెట్టుట లేదు మరియు దాని స్థానములో మరొకదానిని ప్రత్యామ్నాయముగా ఉంచుట లేదు. అయితే దాని వెనుకగల ఆత్మను చూపించుచు ఆయన దాని శక్తిని విశాలము మరియు గాఢము చేయుచున్నాడు. సహోదరత్వముయొక్క ఉన్నత నియమము ఎడతెగక కొనసాగు హానికరమైన తలంపును నరహత్యగా తీర్పుతీర్చును. స్వచ్ఛతయొక్క ఉన్నత నియమము ఎడతెగని మోహపు ఆలోచనను వ్యభిచారముగా నేరస్థాపన చేయును. వివాహముయొక్క ఉన్నత నియమము చపలచిత్తమైన విడాకులను వ్యభిచారపూర్వక పునర్వివాహములకు నడుపు విధానముగా తృణీకరించుచున్నది. సత్యమును గూర్చిన ఉన్నత నియమము పునరుచ్చరించు ప్రమాణములు అనవసరమని చూపించుచున్నది. సాత్వికమును గూర్చిన ఉన్నత నియమము పగతీర్చుకొనుటను ప్రక్కనబెట్టుచున్నది. ప్రేమను గూర్చిన ఉన్నత నియమము ఎల్లలెరుగని దైవిక ప్రేమ కొరకు పిలుపునిచ్చుచున్నది.

21. రబ్బీల స్వనీతి సంబంధముగా యేసు ఉపదేశములు ఏమి బహిర్గతముచేసెను, మరియు జనసమూహములు ఇంకను ఏమి నేర్చుకొందురు?

21 ముందెన్నడు ఎరిగియుండని ఆ ఉపదేశములు మొదటిసారిగా వినుచున్న వారి చెవులబడినప్పుడు అవి ఎంత గంభీరమైన ప్రభావమును కలిగియుండవచ్చును! బోధకుల పారంపర్యాచారములకు దాసులైయుండుట వలన కలుగు వేషధారణతో కూడిన స్వనీతిని అవి ఎంత బొత్తిగా విలువలేనిదిగా చేసెను! అయితే యేసు ఇంకను తన కొండమీది ప్రసంగమును కొనసాగించుచుండగా, దేవుని నీతికొరకు ఆకలిదప్పులుగల జనసమూహములు దానినెట్లు సంపాదించుకొనవలెనో ప్రత్యేకముగా నేర్చుకొనవలెను. దీనిని తర్వాతి శీర్షిక చూపించుచున్నది. (w90 10/1)

పునఃసమీక్ష ప్రశ్నలు

◻ యూదులెందుకు తమ నోటిమాట పారంపర్యాచారములను సృష్టించుకొనిరి?

◻ శాస్త్రులు, పరిసయ్యులు మరియు సామాన్య ప్రజల సంబంధముగా యేసు నాటకీయమైన ఏ తిరోగమనమును ప్రస్తావించెను?

◻ శాస్త్రులు, పరిసయ్యులు దేవునియెదుట నీతియుక్త స్థానమును సంపాదించుకొనుటకు ఎట్లు అపేక్షించిరి?

◻ జారత్వము మరియు వ్యభిచారమును విసర్జించుటకు యేసు దేనిని మార్గముగా చూపించెను?

◻ మోషే ధర్మశాస్త్రము వెనుకగల ఆత్మను చూపించుట ద్వారా, యేసు ఎటువంటి ఉన్నత కట్టడలను స్థిరపరచెను?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి