యెహోవా యొక్క గొప్ప ఆత్మీయ ఆలయం
‘మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడైయున్నాడు.’—హెబ్రీయులు 8:1, 2.
1. పాపులైన మానవజాతి కొరకు దేవుడు ఏ ప్రేమపూర్వక ఏర్పాటును చేశాడు?
యెహోవా దేవుడు మానవజాతి ఎడల తనకున్న గొప్ప ప్రేమనుబట్టి, ఈ లోక పాపాలను తీసివేయడానికి ఒక బలిని ఏర్పాటు చేశాడు. (యోహాను 1:29; 3:16) దాని కొరకు తన మొదటి కుమారుని జీవాన్ని పరలోకం నుండి యూదా కన్యయైన మరియ గర్భంలోకి మార్చే అవసరం ఏర్పడింది. తాను జన్మనిచ్చే బిడ్డ “పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును” అని యెహోవా దేవదూత మరియకు స్పష్టంగా వివరించాడు. (లూకా 1:34, 35) మరియ ప్రదానము చేయబడిన యోసేపుకు యేసు జననాన్ని గూర్చిన అద్భుతమైన విధానం తెలియజేయబడింది, “తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును” అని ఆయన తెలుసుకున్నాడు.—మత్తయి 1:20, 21.
2. యేసు 30 సంవత్సరాల వయస్సులో ఉండగా ఏమి చేశాడు, ఎందుకు?
2 యేసు పెద్దవాడౌతుండగా, అద్భుతమైన తన జననాన్ని గూర్చిన ఈ వాస్తవాలను గ్రహించివుండవచ్చు. భూమిపై తాను జీవాన్ని రక్షించే పని చేయాలన్నది తన పరలోకపు తండ్రి ఉద్దేశమని ఆయనకు తెలుసు. కాబట్టి యేసు దాదాపు 30 సంవత్సరాల వయస్సు గలిగి పూర్తిగా ఎదిగిన వ్యక్తిగా దేవుని ప్రవక్తయైన యోహానుచేత బాప్తిస్మం పొందడానికి యొర్దాను నది దగ్గరికి వచ్చాడు.—మార్కు 1:9; లూకా 3:23.
3. (ఎ) ‘బలిని అర్పణను నీవు కోరలేదు’ అని చెప్పినప్పుడు యేసు భావమేమై ఉండెను? (బి) యేసు శిష్యులు కావాలని కోరుకొనే వారికందరికి ఆయన ఏ విశేషమైన మాదిరినుంచాడు?
3 యేసు తన బాప్తిస్మం సమయంలో ప్రార్థన చేశాడు. (లూకా 3:21) తన జీవితంలోని ఈ సమయం నుండి ఆయన కీర్తన 40:6-8 నందలి మాటలను స్పష్టంగా నెరవేర్చాడు, దీనిని అపొస్తలుడైన పౌలు తర్వాత ఇలా సూచించాడు: “బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి.” (హెబ్రీయులు 10:5) అలా, యెరూషలేము ఆలయంలో జంతు బలులు అర్పించడాన్ని దేవుడు “కోరలేదు” అనే విషయాన్ని తాను ఎరిగివున్నట్లు యేసు చూపించాడు. బదులుగా, బలిగా అర్పించడానికి దేవుడు తనకొక పరిపూర్ణ శరీరాన్ని సిద్ధం చేశాడని యేసు గ్రహించాడు. దీని మూలంగా ఇక జంతు బలుల అవసరత ఉండదు. దేవుని చిత్తానికి లోబడివుండాలన్న తన హృదయపూర్వక కోరికను చూపిస్తూ, యేసు ప్రార్థించడాన్ని ఇలా కొనసాగించాడు: ‘గ్రంథపుచుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నాను.’ (హెబ్రీయులు 10:7) భవిష్యత్తులో తన శిష్యులుకాగల వారందరి కొరకు ధైర్యం మరియు నిస్వార్థ భక్తి విషయంలో యేసు ఆనాడు ఎంత అద్భుతమైన మాదిరినుంచాడో కదా!—మార్కు 8:34.
4. యేసు తననుతాను అర్పించుకోవడాన్ని తాను అంగీకరిస్తున్నట్లు దేవుడు ఎలా చూపించాడు?
4 యేసు బాప్తిస్మం సమయంలో చేసిన ప్రార్థనను దేవుడు తాను అంగీకరించినట్లు చూపించాడా? యేసు ఎంపిక చేసుకున్న అపొస్తలులలో ఒకరు మనకిలా సమాధామివ్వనివ్వండి: “యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు—ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.”—మత్తయి 3:16, 17; లూకా 3:21, 22.
5. అక్షరార్థమైన ఆలయ బలిపీఠం దేన్ని సూచించింది?
5 యేసు తన శరీరాన్ని బలిగా అర్పించడాన్ని దేవుడు అంగీకరించడం, ఆత్మీయ భావంలో, యెరూషలేము ఆలయంలోని బలిపీఠం కంటే గొప్పదొకటి ప్రముఖ స్థానంలోకి వచ్చిందని తెలియజేసింది. జంతువులు బలి అర్పింపబడే స్థలమైన భూ సంబంధ బలిపీఠం, ఆ ఆత్మీయ బలిపీఠాన్ని సూచించింది, అది యేసు మానవ జీవాన్ని బలిగా అంగీకరించే దేవుని “చిత్తము” లేక ఏర్పాటు అయ్యుంది. (హెబ్రీయులు 10:10) అందుకే అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులకు ఇలా వ్రాయగలిగాడు: “మనకొక బలిపీఠమున్నది; దాని సంబంధమైనవాటిని తినుటకు గుడారములో [లేక, ఆలయంలో] సేవచేయువారికి అధికారము లేదు.” (హెబ్రీయులు 13:10) వేరే మాటల్లో చెప్పాలంటే, అనేకమంది యూదా యాజకులు నిరాకరించిన, శ్రేష్ఠమైన పాపప్రాయశ్చిత్త బలినుండి నిజ క్రైస్తవులు ప్రయోజనం పొందుతారు.
6. (ఎ) యేసు బాప్తిస్మం సమయంలో ఏది ప్రముఖ స్థానంలోకి వచ్చింది? (బి) మెస్సీయ, లేదా క్రీస్తు అనే బిరుదు యొక్క భావమేమిటి?
6 యేసును పరిశుద్ధాత్మతో అభిషేకించడమనేది, యేసు ప్రధాన యాజకునిగా సేవచేస్తున్న తన మొత్తం ఆత్మీయ ఆలయ ఏర్పాటును దేవుడు ఇప్పుడు తీసుకువచ్చాడని సూచించింది. (అపొస్తలుల కార్యములు 10:38; హెబ్రీయులు 5:5) ఈ చారిత్రాత్మకమైన సంఘటన జరిగిన సంవత్సరాన్ని “తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమ”ని సూచించేలా శిష్యుడైన లూకా ప్రేరేపించబడ్డాడు. (లూకా 3:1-3) అది సా.శ. 29వ సంవత్సరానికి సరిపోతుంది, అంటే యెరూషలేము గోడలు పునర్నిర్మింపబడాలని అర్తహషస్త రాజు ఆజ్ఞ ఇచ్చిన కాలం నుండి సరిగ్గా 69 వారాల సంవత్సరాలు లేక 483 సంవత్సరాలు. (నెహెమ్యా 2:1, 5-8) ఈ ప్రవచనం ప్రకారం, “అభిషిక్తుడగు అధిపతి” ప్రవచింపబడిన ఆ సంవత్సరంలో వస్తాడు. (దానియేలు 9:25) అనేకమంది యూదులకు దీని గురించి స్పష్టంగా తెలుసు. “అభిషిక్తుడు” అనే భావంగల హెబ్రీ, గ్రీకు పదాల నుండి వచ్చిన పేరులైన మెస్సీయ లేక క్రీస్తు యొక్క ప్రత్యక్షత గురించి “ప్రజలు కనిపెట్టుచు” ఉన్నారని లూకా నివేదిస్తున్నాడు.—లూకా 3:15.
7. (ఎ) ‘అతిపరిశుద్ధ స్థలాన్ని’ దేవుడు ఎప్పుడు అభిషేకించాడు, దాని భావమేమిటి? (బి) తన బాప్తిస్మం సమయంలో యేసుకు ఇంకా ఏమి జరిగింది?
7 యేసు బాప్తిస్మం సమయంలో, దేవుని పరలోక నివాసస్థలం అభిషేకించబడింది లేక గొప్ప ఆత్మీయ ఆలయ ఏర్పాటులో “అతి పరిశుద్ధ స్థలము”గా ప్రత్యేకించబడింది. (దానియేలు 9:24) “మనుష్యుడుకాక ప్రభువే [“యెహోవా,” NW] స్థాపించిన నిజమైన గుడారము [లేక, ఆలయం]” పని ప్రారంభించింది. (హెబ్రీయులు 8:2) అంతేగాక, మానవుడైన యేసుక్రీస్తు నీటితో, పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందడం ద్వారా దేవుని ఆత్మీయ కుమారునిగా తిరిగి జన్మించాడు. (యోహాను 3:3 పోల్చండి.) తగిన కాలంలో దేవుడు తన కుమారున్ని పరలోక జీవితానికి తిరిగి పిలుస్తాడని ఇది సూచించింది, అక్కడ ఆయన తన తండ్రి కుడిపార్శ్వమున “నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున” రాజుగా, ప్రధానయాజకునిగా సేవచేస్తాడు.—హెబ్రీయులు 6:20; కీర్తన 110:1, 4.
పరలోక అతిపరిశుద్ధ స్థలము
8. పరలోకంలో దేవుని సింహాసనం ఇప్పుడు ఏ క్రొత్త అంశాలను చేపట్టింది?
8 యేసు బాప్తిస్మం పొందిన దినాన, దేవుని పరలోక సింహాసనం క్రొత్త అంశాలను చేపట్టింది. లోక పాపాల ప్రాయశ్చిత్తం కొరకు పరిపూర్ణ మానవ బలిని సూచించడం, మానవుని పాపభరిత స్థితికి భిన్నంగా దేవుని పరిశుద్ధతను నొక్కి తెలియజేసింది. శాంతిపర్చడానికి లేక ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు ఇప్పుడు తన సుముఖతను తెలియజేయడం ఆయన దయను ఉన్నతపర్చింది. అలా, పరలోకంలో దేవుని సింహాసనం, సూచనార్థక రీతిలో పాపానికి ప్రాయశ్చిత్తం చేసేందుకు జంతు రక్తంతో ఎక్కడైతే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ప్రవేశించేవాడో ఆ ఆలయంలోని అతిపరిశుద్ధ స్థలంగా తయారైంది.
9. (ఎ) పరిశుద్ధ స్థలానికి మరియు అతిపరిశుద్ధ స్థలానికి మధ్యనున్న తెర దేన్ని సూచించింది? (బి) దేవుని ఆత్మీయ ఆలయంలోని తెర లోపలికి యేసు ఎలా ప్రవేశించగలిగాడు?
9 అతి పరిశుద్ధ స్థలం నుండి పరిశుద్ధ స్థలాన్ని వేరుచేసే తెర యేసు భౌతిక శరీరాన్ని సూచించింది. (హెబ్రీయులు 10:19, 20) యేసు ఈ భూమి మీద మానవునిగా ఉన్నప్పుడు తన తండ్రి సముఖంలోకి ప్రవేశించేందుకు ఆయనకు అది ఒక అడ్డంకుగా ఉండింది. (1 కొరింథీయులు 15:50) యేసు మరణ సమయంలో, “దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను.” (మత్తయి 27:51) యేసు పరలోకంలోకి ప్రవేశించడాన్ని ఆటంకపరుస్తున్న అడ్డంకు ఇప్పుడు తొలగించబడిందని ఇది అద్భుతంగా సూచించింది. మూడు రోజుల తర్వాత, యెహోవా దేవుడు విశేషమైన అద్భుతం చేశాడు. ఆయన యేసును రక్త మాంసాలుగల మర్త్యమైన మానవునిగా గాక ‘నిరంతరము ఉండేవానిగా’ మహిమకరమైన ఆత్మసంబంధమైన వ్యక్తిగా మృతులలో నుండి తిరిగి లేపాడు. (హెబ్రీయులు 7:24) నలభై రోజుల తర్వాత, యేసు “మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు” పరలోకానికి ఆరోహణమై నిజమైన “అతి పరిశుద్ధ స్థలము”లోకి ప్రవేశించాడు.—హెబ్రీయులు 9:24.
10. (ఎ) యేసు తన బలి విలువను తన పరలోక తండ్రికి అందజేసిన తర్వాత ఏమి జరిగింది? (బి) క్రీస్తు శిష్యుల విషయంలో పరిశుద్ధాత్మతో అభిషేకించడం అంటే ఏమిటి?
10 యేసు చిందించిన రక్తం యొక్క విలువను లోక పాపాల ప్రాయశ్చిత్తంగా దేవుడు అంగీకరించాడా? వాస్తవంగా ఆయన అంగీకరించాడు. యేసు పునరుత్థానం తర్వాత సరిగ్గా 50 దినాలకు అంటే పెంతెకొస్తు పండుగ దినాన దీనికి రుజువు వచ్చింది. యెరూషలేములో సమకూడిన 120 మంది యేసు శిష్యుల మీద దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. (అపొస్తలుల కార్యములు 2:1, 4, 33) తమ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వలెనే వారు ఇప్పుడు దేవుని గొప్ప ఆత్మీయ ఆలయ ఏర్పాటు క్రింద “ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు, పరిశుద్ధయాజకులుగా” సేవచేయడానికి అభిషేకించబడ్డారు. (1 పేతురు 2:5) అంతేగాక, ఈ అభిషిక్తులు ఒక క్రొత్త జనాంగంగా, దేవుని ఆత్మీయ ఇశ్రాయేలీయుల “పరిశుద్ధ జనాంగము”గా ఏర్పాటు చేయబడ్డారు. అప్పటి నుండి, యిర్మీయా 31:31 నందు వ్రాయబడివున్న “క్రొత్త నిబంధన” వాగ్దానం వంటి, ఇశ్రాయేలీయులకు సంబంధించిన మంచి విషయాలను గూర్చిన ప్రవచనాలన్నీ అభిషిక్త క్రైస్తవ సంఘానికి, ‘దేవుని నిజమైన ఇశ్రాయేలుకు’ అన్వయిస్తాయి.—1 పేతురు 2:9; గలతీయులు 6:16.
దేవుని ఆత్మీయ ఆలయపు ఇతర భాగాలు
11, 12. (ఎ) యేసు విషయంలో యాజకుల ఆవరణ దేన్ని సూచించింది, ఆయన అభిషిక్త అనుచరుల విషయంలో దాని భావమేమిటి? (బి) నీటి గంగాళం దేన్ని సూచిస్తుంది, అది ఎలా ఉపయోగించబడుతుంది?
11 అతిపరిశుద్ధ స్థలం దేవుడు సింహాసనాసీనుడైవున్న ‘పరలోకాన్నే’ సూచించినప్పటికీ, దేవుని ఆత్మీయ ఆలయాన్ని గూర్చిన ఇతర భాగాలన్నీ భూమిపైనున్న వాటికి సంబంధించినవే. (హెబ్రీయులు 9:24) యెరూషలేములోని ఆలయంలోపల యాజకులకు సంబంధించిన ఆవరణ ఉండేది, దానిలో బలి అర్పించడానికి ఒక బలిపీఠం, ఒక పెద్ద నీటి గంగాళం ఉండేవి, పరిశుద్ధ సేవ చేయడానికి ముందు తమను తాము పరిశుభ్రపరచుకోవడానికి యాజకులు ఆ నీళ్లను ఉపయోగించుకొనేవారు. దేవుని ఆత్మీయ ఆలయ ఏర్పాటులో ఇవి వేటిని సూచిస్తాయి?
12 యేసుక్రీస్తు విషయంలో, లోపలి యాజక ఆవరణ అనేది దేవుని పరిపూర్ణ మానవ కుమారునిగా ఆయన పాపరహిత స్థితిని సూచించింది. యేసు బలియందు విశ్వాసముంచడం ద్వారా, క్రీస్తు అభిషిక్త అనుచరులకు నీతి ఆపాదించబడింది. అలా, వారు పాపరహితులైనట్లు దేవుడు వారితో న్యాయంగా వ్యవహరించగలడు. (రోమీయులు 5:1; 8:1, 33) కాబట్టి ఈ ఆవరణ, పరిశుద్ధ యాజకులలోని ఒక్కో సభ్యుడు దేవుని ఎదుట కలిగివుండే ఆపాదించబడిన నీతియుక్తమైన మానవ స్థితిని కూడా సూచిస్తుంది. అదే సమయంలో, అభిషిక్త క్రైస్తవులు ఇంకా అపరిపూర్ణులే, పాపం చేసే అవకాశమున్నవారే. ఆవరణలో ఉండే నీటి గంగాళం, పరిశుద్ధ యాజకులను క్రమేణ శుద్ధిపర్చడానికి ప్రధాన యాజకుడు ఉపయోగించే దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. ఈ శుద్ధపరిచే కార్యక్రమానికి విధేయులు కావడం ద్వారా, వారు దేవునికి గౌరవాన్ని తీసుకువచ్చే, బయటివారిని ఆయన స్వచ్ఛారాధనవైపుకు ఆకర్షించే గౌరవప్రదమైన రూపాన్ని సంపాదించుకున్నారు.—ఎఫెసీయులు 5:25, 26; మలాకీ 3:1-3 పోల్చండి.
పరిశుద్ధ స్థలము
13, 14. (ఎ) యేసు విషయంలో, ఆయన అభిషిక్త అనుచరుల విషయంలో పరిశుద్ధ ఆలయం దేన్ని సూచించింది? (బి) సువర్ణ దీపస్తంభం దేన్ని సూచించింది?
13 ఆలయంలోని మొదటి విభాగం, ఆవరణ కంటే ఉన్నతమైన స్థితిని సూచిస్తుంది. పరిపూర్ణ మానవుడైన యేసుక్రీస్తు విషయంలో అది, పరలోక జీవితానికి తిరిగి వెళ్లే ఉద్దేశంగల దేవుని ఆత్మసంబంధమైన కుమారునిగా ఆయన తిరిగి జన్మించడాన్ని సూచిస్తుంది. క్రీస్తు చిందించిన రక్తమందు ఉంచిన విశ్వాసమాధారంగా నీతిమంతులుగా తీర్పుతీర్చబడిన తర్వాత, ఈ అభిషిక్త అనుచరులు దేవుని పరిశుద్ధాత్మ యొక్క ఈ ప్రత్యేక పనిని కూడా చవిచూస్తారు. (రోమీయులు 8:14-17) ‘నీటి ద్వారా [అంటే వారి బాప్తిస్మం] ఆత్మ ద్వారా’ వారు దేవుని ఆత్మ సంబంధమైన కుమారులుగా ‘క్రొత్తగా జన్మించారు.’ అలాగే, వారు మరణం వరకు విశ్వాసంగా ఉంటే, వారు దేవుని ఆత్మ సంబంధమైన కుమారులుగా పరలోక జీవితానికి పునరుత్థానం చేయబడే నిరీక్షణ వారికుంటుంది.—యోహాను 3:5, 7; ప్రకటన 2:10.
14 భూ సంబంధ ఆలయంలోని పరిశుద్ధ స్థలంలో యాజకులుగా సేవచేసేవారు, ఆలయం వెలుపల ఉండే ఆరాధికులకు కనిపించేవారు కాదు. అలాగే అభిషిక్త క్రైస్తవులు, పరదైసు భూమి మీద నిరంతరం జీవించే నిరీక్షణగల, అనేకమంది దేవుని ఆరాధికులు భాగం వహించని లేక పూర్తిగా గ్రహించలేని ఆత్మీయ స్థితిని అనుభవిస్తారు. గుడారంలోని సువర్ణ దీపస్తంభం అభిషిక్త క్రైస్తవుల జ్ఞానాభివృద్ధికి చెందిన స్థితిని సూచిస్తుంది. ప్రదీపములలోని నూనెలా దేవుని పరిశుద్ధాత్మ యొక్క చర్య బైబిలుపై వెలుగును ప్రసరింపజేస్తుంది. తత్ఫలితంగా క్రైస్తవులు తాము సంపాదించుకొనే గ్రహింపును తమవరకే ఉంచుకోరు. బదులుగా, వారు ఇలా చెప్పిన యేసుకు విధేయులైవుంటారు: “మీరు లోకమునకు వెలుగైయున్నారు. . . . మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.”—మత్తయి 5:14, 16.
15. సన్నిధి భక్ష్యముల బల్లపైనుండే భక్ష్యములు దేన్ని సూచిస్తున్నాయి?
15 జ్ఞానాభివృద్ధి చెందిన ఈ స్థితిలో నిలిచి ఉండడానికి, సన్నిధి భక్ష్యముల బల్లపైనుండే భక్ష్యములు సూచించేదాన్ని అభిషిక్త క్రైస్తవులు క్రమంగా తీసుకోవలసి ఉంటుంది. వారి ఆత్మీయ ఆహారం యొక్క ముఖ్య మూలం దేవుని వాక్యం, వారు దాన్ని ప్రతిరోజు చదివి, ధ్యానించడానికి కృషి చేస్తారు. తన ‘నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా ‘తగినవేళకు ఆహారం’ అందజేస్తానని కూడా యేసు వాగ్దానం చేశాడు. (మత్తయి 24:45) ఈ ‘దాసుడు’ ఏదైనా ఒక ప్రత్యేక సమయంలో భూమిపైనుండే అభిషిక్త క్రైస్తవుల మొత్తం గుంపుతో ఏర్పడినది. బైబిలు ప్రవచనాల నెరవేర్పుపై సమాచారాన్ని ప్రచురించడానికి, ఆధునిక అనుదిన జీవితంలో బైబిలు సూత్రాలను అన్వయించుకొనేందుకు సమయానుకూల నడిపింపును ఇవ్వడానికి క్రీస్తు ఈ అభిషిక్త గుంపును ఉపయోగించుకున్నాడు. కాబట్టి, అభిషిక్త క్రైస్తవులు అలాంటి ఆత్మీయ ఏర్పాట్లన్నిటి నుండి అభినందనపూర్వకంగా ప్రయోజనం పొందుతారు. కాని వారు తమ ఆత్మీయ జీవితాలను కాపాడుకోవడానికి, దేవుని గూర్చిన జ్ఞానాన్ని తమ మనస్సుల్లోకి, హృదయాల్లోకి తీసుకోవడం కంటే ఎక్కువే చేయవలసిన అవసరం ఉంది. యేసు ఇలా చెప్పాడు: “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.” (యోహాను 4:34) అలాగే, బయల్పర్చబడిన దేవుని చిత్తాన్ని చేయడానికి అనుదినం తమను తాము సమర్పించుకోవడం ద్వారా వచ్చే సంతృప్తిని అభిషిక్త క్రైస్తవులు అనుభవిస్తారు.
16. ధూప వేదిక మీద జరిగే సేవ దేన్ని సూచిస్తుంది?
16 పరిశుద్ధ స్థలంలోని ధూప వేదికమీద ఒక యాజకుడు ఉదయాన, సాయంకాలాన దేవునికి ధూపం వేసేవాడు. అదే సమయంలో, యాజకులుకాని ఆరాధికులు దేవుని ఆలయం వెలుపలి ఆవరణలలో నిలబడి ఆయనకు ప్రార్థించేవారు. (లూకా 1:8-10) “పాత్రలు [“ధూపద్రవ్యములు,” NW] పరిశుద్ధుల ప్రార్థనలు” అని బైబిలు వివరిస్తుంది. (ప్రకటన 5:8) ‘నా ప్రార్థన ధూపమువలె నీ దృష్టికి అంగీకారమగును గాక’ అని కీర్తనల గ్రంథకర్త దావీదు వ్రాశాడు. (కీర్తన 141:2) అభిషిక్త క్రైస్తవులు కూడా ప్రార్థనలో యేసుక్రీస్తు ద్వారా యెహోవాను సమీపించే తమ ఆధిక్యతను అమూల్యమైనదిగా ఎంచుతారు. హృదయంలోనుండి వచ్చే మనఃపూర్వక ప్రార్థనలు పరిమళ సువాసనగల ధూపమువలె ఉంటాయి. అభిషిక్త క్రైస్తవులు ఇతరులకు బోధించడానికి తమ పెదవులను ఉపయోగించడం ద్వారా దేవున్ని ఇతర విధాలుగా కూడా స్తుతిస్తారు. కష్ట సమయాల్లో వారి సహనం, శ్రమల నెదుర్కొంటున్నప్పుడు వారి యథార్థత ప్రాముఖ్యంగా దేవునికి ప్రీతిపాత్రమైనవి.—1 పేతురు 2:20, 21.
17. ప్రాయశ్చిత్త దినాన అతిపరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు మొదటిసారి ప్రవేశించడాన్ని గురించిన మొదటి ప్రవచనార్థక దృశ్య నెరవేర్పులో ఏమి ఇమిడివుండెను?
17 ప్రాయశ్చిత్త దినాన, ఇశ్రాయేలీయుల ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి, మండుతున్న నిప్పులుగల సువర్ణ ధూపవేదిక మీద ధూపాన్ని వేస్తాడు. ఆయన పాపానికి అర్పించే అర్పణల రక్తాన్ని తీసుకురాక ముందే ఇది జరగాలి. ఈ ప్రవచనార్థక దృశ్య నెరవేర్పుగా మానవుడైన యేసు, మన పాపాల కొరకు నిరంతరం నిలిచే బలిగా తన జీవితాన్ని అర్పించడానికి ముందు యెహోవా దేవుని ఎడల సంపూర్ణ యథార్థతను చూపించాడు. అలా సాతాను తన మీదికి ఏ ఒత్తిడిని తీసుకువచ్చినప్పటికీ, పరిపూర్ణ మానవుడు దేవుని ఎడల తన యథార్థతను కాపాడుకోగలడని చూపించాడు. (సామెతలు 27:11) శోధన సమయంలో, యేసు ప్రార్థనను ఉపయోగించుకొని, “మహా రోదనముతోను కన్నీళ్లతోను . . . ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.” (హెబ్రీయులు 5:7) ఈ విధంగా ఆయన యెహోవాను ఈ విశ్వం యొక్క నీతియుక్తమైన, న్యాయమైన సర్వాధికారిగా మహిమపర్చాడు. యేసును అమర్త్యమైన పరలోక జీవితానికి మృతులలో నుండి పునరుత్థానం చేయడం ద్వారా దేవుడు ఆయనకు ప్రతిఫలమిచ్చాడు. ఈ ఉన్నత స్థానంలో, యేసు తాను భూమిపైకి రావడానికిగల రెండవ కారణం వైపుకు తన అవధానాన్ని మళ్లిస్తాడు, అదేమిటంటే పశ్చాత్తాపపడే పాపులైన మానవులకు దేవునికి మధ్య సమాధానాన్ని కుదర్చడం.—హెబ్రీయులు 4:14-16.
దేవుని ఆత్మీయ ఆలయం యొక్క గొప్ప మహిమ
18. యెహోవా తన ఆత్మీయ ఆలయానికి విశేషమైన మహిమను ఎలా తెచ్చాడు?
18 “ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించునని” యెహోవా ముందే తెలియజేశాడు. (హగ్గయి 2:9) యేసును అమర్త్యమైన రాజుగా, ప్రధాన యాజకునిగా పునరుత్థానం చేయడం ద్వారా యెహోవా తన ఆత్మీయ ఆలయానికి విశేషమైన మహిమను తెచ్చాడు. యేసు ఇప్పుడు, “తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణ” తీసుకువచ్చే స్థానంలో ఉన్నాడు. (హెబ్రీయులు 5:9) అలా విధేయత చూపిన వారిలో మొదటివారు, సా.శ. 33 పెంతెకొస్తు నాడు పరిశుద్ధాత్మను పొందిన 120 మంది శిష్యులు. ఈ ఆత్మీయ ఇశ్రాయేలీయుల సంఖ్య చివరికి 1,44,000 అయ్యుంటుందని ప్రకటన గ్రంథం ప్రవచించింది. (ప్రకటన 7:4) మరణించిన తర్వాత, వారిలో అనేకులు యేసు రాజుగా అధికారం చేపట్టే సమయం కొరకు ఎదురు చూస్తూ మానవజాతి యొక్క సామాన్య సమాధిలో అచేతనంగా ఉండవలసిందే. దానియేలు 4:10-17, 20-27 నందున్న ప్రవచనార్థక వంశక్రమం 1914ను, యేసు తన శత్రువుల మధ్య పరిపాలన ప్రారంభించే సమయమని తెలియజేస్తుంది. (కీర్తన 110:2) దశాబ్దాల ముందే, అభిషిక్త క్రైస్తవులు ఆ సంవత్సరం కొరకు ఆసక్తిగా ఎదురు చూశారు. మొదటి ప్రపంచ యుద్ధం, దాని వెంట మానవజాతిపైకి వచ్చిన శ్రమలు, నిజంగా యేసు 1914లో రాజుగా అభిషేకింపబడ్డాడు అనడానికి రుజువునిచ్చాయి. (మత్తయి 24:3, 7, 8) ఆ తర్వాత వెంటనే, “తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు” కాలం రావడంతో, “మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును” అని మరణమందు నిద్రిస్తున్న తన అభిషిక్త శిష్యులతో తాను చేసిన వాగ్దానాన్ని యేసు ఇప్పుడు నెరవేరుస్తాడు.—1 పేతురు 4:17; యోహాను 14:3.
19. పరలోక అతిపరిశుద్ధ స్థలంలోకి 1,44,000 మందిలోని శేషము ఎలా ప్రవేశిస్తుంది?
19 పరిశుద్ధ యాజకులలోని 1,44,000 మంది సభ్యులందరూ చివరికి ముద్రించబడి తమ పరలోక గృహానికి తీసుకువెళ్లబడలేదు. వారిలో మిగిలిన వారు ఇప్పటికీ, దేవుని పరిశుద్ధ సముఖం నుండి వారి భౌతిక శరీరాల “తెర” ద్వారా లేక అడ్డంకు ద్వారా వేరు చేయబడి, పరిశుద్ధ స్థలంగా సూచించబడిన ఆత్మీయ స్థితిలో భూమి మీద జీవించివున్నారు. వీరు నమ్మకంగా ఉండి మరణిస్తే, ఇప్పటికే పరలోకంలో ఉన్న 1,44,000 మందితో కలవడానికి అమర్త్యమైన ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా కనురెప్పపాటులో పునరుత్థానం చేయబడతారు.—1 కొరింథీయులు 15:51-53.
20. పరిశుద్ధ యాజకులలోని మిగిలినవారు ఈ సమయంలో ఏ ప్రాముఖ్యమైన పనిని చేస్తున్నారు, ఏ ఫలితాలతో?
20 అంతమంది యాజకులు గొప్ప ప్రధాన యాజకునితోపాటు పరలోకంలో సేవ చేస్తుండగా, దేవుని ఆత్మీయ ఆలయం మరింత మహిమను పొందుతుంది. ఈ మధ్యలో, పరిశుద్ధ యాజకులలో మిగిలిన వారు భూమ్మీద విలువైన పనిని చేస్తున్నారు. హగ్గయి 2:7 నందు ముందే తెలియజేయబడినట్లుగా, వారి ప్రకటన పని ద్వారా, దేవుడు తన తీర్పు ప్రకటనలతో ‘అన్యజనులనందరిని కదిలిస్తున్నాడు.’ అదే సమయంలో, “అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు” అని వర్ణించబడిన లక్షలాదిమంది ఆరాధికులు యెహోవా ఆలయంలోని భూ సంబంధ ఆవరణలలోకి సమకూడుతున్నారు. ఆరాధన కొరకైన దేవుని ఏర్పాటులోకి వీరు ఎలా ఇముడుతారు, ఆయన గొప్ప ఆత్మీయ ఆలయానికి ఏ భవిష్యత్ మహిమ ఉంటుందని మనం ఎదురుచూడవచ్చు? ఈ ప్రశ్నలు తరువాతి శీర్షికలో పరిశీలించబడతాయి.
పునఃపరిశీలన ప్రశ్నలు
◻ సా.శ. 29లో యేసు ఏ విశేషమైన మాదిరినుంచాడు?
◻ సా.శ. 29లో ఏ ఏర్పాటు ప్రారంభమయ్యింది?
◻ పరిశుద్ధ స్థలం, అతిపరిశుద్ధ స్థలం దేన్ని సూచిస్తున్నాయి?
◻ గొప్ప ఆత్మీయ ఆలయం ఎలా మహిమపర్చబడింది?
[17వ పేజీలోని చిత్రం]
సా.శ. 29లో యేసు పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు, దేవుని గొప్ప ఆత్మీయ ఆలయం పనిచేయనారంభించింది