కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lv అధ్యా. 15 పేజీలు 175-208
  • కష్టపడి పనిచేసి సంతృప్తిని పొందండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కష్టపడి పనిచేసి సంతృప్తిని పొందండి
  • ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అత్యుత్తమ పనివంతుడు, ప్రధాన శిల్పి
  • మనం కష్టపడి పనిచేసి ఎలా సంతృప్తిని పొందవచ్చు?
  • ఉద్యోగాన్ని ఎంచుకోవడంలో వివేచనను ఉపయోగించండి
  • ఉద్యోగాన్ని దాని స్థానంలో ఉంచండి
  • పరిచర్యలో కష్టపడి పనిచేయండి
  • మీ పనిలో ఆనందించండి
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • మీ పని అంతటిలో ఆనందాన్ని వెదకండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • పనిపట్ల సమతుల్యమైన దృక్కోణాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • పని ఒక వరమా లేక శాపమా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
lv అధ్యా. 15 పేజీలు 175-208
ఆఫ్రికా దేశంలో కష్టపడి పని చేస్తున్న స్త్రీలు

15వ అధ్యాయం

కష్టపడి పనిచేసి సంతృప్తిని పొందండి

‘ప్రతివాడు తన కష్టార్జితమువలన సుఖమనుభవించవలెను.’—ప్రసంగి 3:13.

1-3. (ఎ) చాలామంది తమ ఉద్యోగం విషయంలో ఎలా భావిస్తారు? (బి) పని విషయంలో ఎలాంటి వైఖరి కలిగివుండాలని బైబిలు ప్రోత్సహిస్తుంది? (సి) ఈ అధ్యాయంలో మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

నేడు చాలామంది తమ పనిని ఇష్టపూర్వకంగా చేయరు. అలా రోజంతా తమకు ఇష్టంలేని ఉద్యోగంలో గడపడం వల్ల రోజూ ఉద్యోగానికి వెళ్ళడమంటే అయిష్టత ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళు పనిలో సంతృప్తి పొందడం మాట అటుంచితే అసలు దాన్ని ఆసక్తితో చేయడం ఎలా సాధ్యమవుతుంది?

2 కష్టపడి పనిచేసే విషయంలో ఎలాంటి వైఖరి కలిగివుండాలో బైబిలు చెబుతుంది. పని, దానివల్ల లభించే ప్రతిఫలం రెండూ ఆశీర్వాదాలేనని బైబిలు చెబుతోంది. సొలొమోను ఇలా రాశాడు: “ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే.” (ప్రసంగి 3:13) మనకేది మంచిదో మనల్ని ప్రేమించే యెహోవాకు బాగా తెలుసు, మన పనిలో మనం సంతృప్తిని పొంది, మన కష్టానికి తగిన ఫలితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమలో నిలిచివుండాలంటే పని విషయంలో ఆయన దృక్కోణం ఏమిటో తెలుసుకొని దాని ప్రకారం, ఆయన ఏర్పరచిన సూత్రాలకు అనుగుణంగా జీవించాలి.—ప్రసంగి 2:24; 5:18 చదవండి.

3 ఈ అధ్యాయంలో నాలుగు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం: (1) కష్టపడి పనిచేసి అందులో సంతృప్తిని ఎలా పొందవచ్చు? (2) నిజ క్రైస్తవులకు తగని ఉద్యోగాలు ఏమిటి? (3) మన ఉద్యోగాన్ని, ఆరాధనకు సంబంధించిన విషయాలను వాటి వాటి స్థానాల్లో ఎలా ఉంచాలి? (4) మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏమిటి? ముందుగా మనం విశ్వంలోనే గొప్ప పనివంతులైన యెహోవా, యేసుక్రీస్తు గురించి తెలుసుకుందాం.

అత్యుత్తమ పనివంతుడు, ప్రధాన శిల్పి

4, 5. యెహోవా కష్టపడి పనిచేస్తున్నాడని బైబిలు ఎలా చూపిస్తుంది?

4 యెహోవా అత్యుత్తమ పనివంతుడు. “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను” అని ఆదికాండము 1:1 చెబుతుంది. దేవుడు భూమిలోని వాటిని సృష్టించిన తర్వాత “అది చాలమంచిదిగ నుండెను” అని చెప్పాడు. (ఆదికాండము 1:31) మరో మాటలో చెప్పాలంటే భూమిమీద తాను చేసిన పని అంతటిని బట్టి ఆయనెంతో సంతృప్తి చెందాడు. ‘సంతోషంగా ఉండే దేవుడైన’ యెహోవా కష్టపడి పనిచేయడంలో చాలా ఆనందించి ఉంటాడనడంలో సందేహం లేదు.—1 తిమోతి 1:8, NW.

5 కష్టపడి పనిచేసే యెహోవా పనిచేయడం ఎప్పటికీ ఆపడు. యెహోవా ఈ భూమితో సహా విశ్వాన్నంతటినీ సృష్టించి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత యేసు ఇలా అన్నాడు: “నా తండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు.” (యోహాను 5:17) ఇంతకీ యెహోవా ఏ పని చేస్తున్నాడు? పరలోకం నుండి మానవజాతిని నడిపిస్తూ, సంరక్షిస్తున్నాడు. పరలోకంలో యేసుతో కలిసి పరిపాలించబోయే కొంతమంది ఆత్మాభిషిక్త క్రైస్తవులను ఎంచుకోవడం ద్వారా “నూతన సృష్టి” చేశాడు. (2 కొరింథీయులు 5:17) తనను ప్రేమించే మానవులు నూతనలోకంలో నిత్యజీవాన్ని పొందాలనే తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన పనిచేస్తున్నాడు. (రోమీయులు 6:23) లక్షలాదిమంది దేవునిచేత ఆకర్షించబడి రాజ్యసువార్తకు ప్రతిస్పందిస్తున్నారు, ఆయన ప్రేమలో నిలిచివుండడానికి వారు జీవితంలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు. (యోహాను 6:44) తన పని ఎంత మంచి ఫలితాలనిస్తుందో చూసి యెహోవా ఖచ్చితంగా సంతోషిస్తుండవచ్చు.

6, 7. యేసు కష్టపడి పనిచేసే వ్యక్తి అని ఎలా చెప్పవచ్చు?

6 యేసుకు కూడా కష్టపడి పనిచేస్తాడనే మంచి పేరు ఉంది. భూమ్మీదకు రాకముందు యేసు ‘ఆకాశంలో ఉన్నవాటిని, భూమిమీద ఉన్నవాటిని,’ సృష్టించడంలో దేవుని దగ్గర ‘ప్రధానశిల్పిగా’ పనిచేశాడు. (సామెతలు 8:22-31; కొలొస్సయులు 1:15-17) భూమ్మీద ఉన్నప్పుడు కూడా యేసు కష్టపడి పనిచేశాడు. యువకునిగా ఉన్నప్పుడే నిర్మాణపనిని నేర్చుకున్నాడు కాబట్టి ‘వడ్లవానిగా’ లేక వడ్రంగివానిగా అందరికీ తెలుసు. (మార్కు 6:3) అప్పట్లో రంపపు మరలు, కలప అమ్మే దుకాణాలు, విద్యుచ్ఛక్తితో నడిచే పరికరాలు ఉండేవి కావు. కాబట్టి వడ్రంగం చాలా కష్టంతోకూడిన పని, దానిలో భాగంగా చాలారకాల పనులు చేయాల్సివచ్చేది. యేసు స్వయంగా చెట్లను నరికి, ఆ చెట్టు మొద్దులను పనిచేసే చోటికి తీసుకొనివెళ్ళి వాటిని చెక్కి కలప తయారుచేసుకోవడాన్ని మీరు ఊహించుకోగలరా? దూలాలు తయారుచేసి వాటిని ఇంటి పైకప్పుకు బిగించడాన్ని, తలుపులు తయారుచేయడాన్ని, ఇంకా ఇంటి కోసం చెక్క సామగ్రిని తయారుచేస్తుండడాన్ని ఒకసారి ఊహించుకోండి. నేర్పుగా ఎంతో కష్టపడి పనిచేయడంలో ఎంత సంతృప్తి ఉంటుందో యేసు స్వయంగా చవిచూశాడు.

7 యేసు పరిచర్యలో కూడా ఎంతో శ్రద్ధగా పనిచేశాడు. ఎంతో ప్రాముఖ్యమైన ఈ పనిలో ఆయన మూడున్నర సంవత్సరాలపాటు పూర్తిగా నిమగ్నమైపోయాడు. సాధ్యమైనంత ఎక్కువమందికి సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో ఆయన ప్రతీరోజు ఉదయం నుండి రాత్రివరకు పరిచర్యలో గడిపాడు. (లూకా 21:37, 38; యోహాను 3:2) “ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము” చేశాడు. (లూకా 8:1) ఆయన ప్రజలకు సువార్త ప్రకటించడానికి అక్షరాలా వందలమైళ్లు మట్టిరోడ్లపై కాలినడకన వెళ్లాడు.

8, 9. యేసు ఎలా తాను పడిన కష్టానికి ఫలితాల్ని చూశాడు?

8 యేసు పరిచర్యలో తాను పడిన కష్టానికి ఫలితాన్ని చూశాడా? చూశాడు. ఆయన రాజ్య విత్తనాలను విత్తి ఎంతోమందిని తన శిష్యులుగా చేసుకున్నాడు. దేవుడు అప్పగించిన పని చేయడం ఆయనకు ఎంత బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చిందంటే ఆయన ఆ ప్రాముఖ్యమైన పని పూర్తి చేయడానికి కొన్నిసార్లు భోజనం కూడా చేయలేదు. (యోహాను 4:31-38) తన భూపరిచర్య ముగింపులో ఆయన తన తండ్రితో మనస్ఫూర్తిగా, “నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని” అని అన్నప్పుడు ఆయనకెంత సంతృప్తిగా అనిపించి ఉంటుందో ఒకసారి ఆలోచించండి.—యోహాను 17:4.

9 కష్టపడి పనిచేసి సంతృప్తి పొందే విషయంలో యెహోవా, యేసు చాలా మంచి మాదిరినుంచారు. దేవునిమీద మనకు ప్రేమవుంటే మనం ‘దేవునిపోలి నడుచుకుంటాం.’ (ఎఫెసీయులు 5:1) అలాగే యేసుపట్ల ప్రేమవుంటే మనం ఆయన ‘అడుగుజాడల్లో నడుస్తాం.’ (1 పేతురు 2:21) అయితే, కష్టపడి పనిచేసి సంతృప్తిని ఎలా పొందవచ్చో మనమిప్పుడు చూద్దాం.

మనం కష్టపడి పనిచేసి ఎలా సంతృప్తిని పొందవచ్చు?

కిటికీలు తుడుస్తున్న ఒకతను, ఆఫీసులో పని చేస్తున్న ఒక స్త్రీ

బైబిలు సూత్రాలను పాటిస్తే కష్టపడి పనిచేసి సంతృప్తిని పొందగలుగుతాం

10, 11. ఉద్యోగం విషయంలో సానుకూలంగా ఆలోచించడానికి మీకేది సహాయం చేస్తుంది?

10 నిజక్రైస్తవులు ఉద్యోగం చేయాల్సివుంటుంది. అయితే, మనం మన పనిలో సంతోషాన్ని, సంతృప్తిని పొందాలనుకుంటాం. కానీ, మనకు ఇష్టంలేని ఉద్యోగం చేయాల్సివస్తే దాన్ని పొందడం కష్టం. అయితే, సంతోషాన్ని పొందడమెలా?

11 సానుకూలంగా ఆలోచించండి. మన పరిస్థితుల్ని మార్చుకోలేం కానీ ఆలోచనా తీరును మార్చుకోవచ్చు. పని విషయంలో దేవుని దృక్కోణం గురించి ధ్యానిస్తే మనం సానుకూలంగా ఆలోచించగలుగుతాం. ఉదాహరణకు, మీరు కుటుంబ పెద్ద అయితే, మీ ఉద్యోగం ఎంత చిన్నదైనా దాని వల్లే మీరు మీ కుటుంబాన్ని పోషించగలుగుతున్నారన్న విషయం గుర్తుంచుకోండి. దేవుని దృష్టిలో కుటుంబాన్ని సంరక్షించడం చిన్న విషయం కాదు. తన కుటుంబాన్ని పట్టించుకోని వ్యక్తి “విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును” అని ఆయన వాక్యం చెబుతోంది. (1 తిమోతి 5:8) ఈ ఉద్యోగంవల్లే దేవుడు ఇచ్చిన ఆ బాధ్యతను మీరు నెరవేర్చగలుగుతున్నారని గుర్తిస్తే, ఆ పనిలో కొనసాగడానికి కారణాలు కనిపిస్తాయి, తోటి ఉద్యోగులకు లేని సంతృప్తి కూడా మీకుంటుంది.

12. నిజాయితీగా, కష్టపడి పనిచేయడంలో ఎలాంటి ఆశీర్వాదాలున్నాయి?

12 నిజాయితీగా కష్టపడి పనిచేయండి. మీ పనిని సమర్థవంతంగా ఎలా చేయాలో నేర్చుకుని, కష్టపడి పనిచేస్తే తప్పకుండా ప్రయోజనం పొందుతారు. చక్కగా, కష్టపడి పనిచేసేవారిని అధికారులు ఎంతగానో నమ్ముతారు. (సామెతలు 12:24; 22:29) నిజ క్రైస్తవులముగా మనం కూడా ఉద్యోగ స్థలం నుండి డబ్బును, వస్తువుల్ని దొంగిలించకుండా, సమయం వృథా చేయకుండా నిజాయితీగా పనిచేయాలి. (ఎఫెసీయులు 4:27, 28) ముందటి అధ్యాయంలో చూసినట్లుగా నిజాయితీగా ఉంటే ఆశీర్వాదాలు లభిస్తాయి. నిజాయితీపరులనే ఇతరులు ఎక్కువగా నమ్ముతారు. మనం కష్టపడి పనిచేసేవారమని మన పై అధికారులు గుర్తించినా, గుర్తించకపోయినా మనకు మాత్రం “మంచి మనస్సాక్షి” ఉంటుంది, మనం ప్రేమించే యెహోవాను సంతోషపెడుతున్నామన్న సంతృప్తి ఉంటుంది.—హెబ్రీయులు 13:18; కొలొస్సయులు 3:22-24.

13. ఉద్యోగ స్థలంలో మన సత్ప్రవర్తన వల్ల ఎలాంటి మంచి ఫలితాలొస్తాయి?

13 మన ప్రవర్తన దేవుణ్ణి మహిమపరుస్తుందని గుర్తుంచుకోండి. ఉద్యోగ స్థలంలో క్రైస్తవులముగా మన ప్రవర్తన చక్కగా ఉంటే ప్రజలు దాన్ని తప్పకుండా గమనిస్తారు. దానివల్ల ఏమి జరుగుతుంది? మన ప్రవర్తనతో మనం ‘దేవుని ఉపదేశమును అలంకరించగలుగుతాం’ అంటే సత్యాన్ని ఆకర్షణీయంగా చేస్తాం. (తీతు 2:9, 10) మన మంచి ప్రవర్తననుబట్టి ఇతరులు సత్యారాధన వైపు ఆకర్షితులౌతారు. మీ మంచి మాదిరిని బట్టి తోటి ఉద్యోగి సత్యాన్ని అంగీకరిస్తే మీకెంత సంతోషంగా ఉంటుందో ఆలోచించండి. అంతకన్నా ప్రాముఖ్యంగా, మీ ప్రవర్తన యెహోవాను మహిమపర్చి ఆయనను సంతోషపెడుతుంది. అంతకన్నా గొప్ప విషయం మరొకటి ఉంటుందా?—సామెతలు 27:11; 1 పేతురు 2:12 చదవండి.

ఉద్యోగాన్ని ఎంచుకోవడంలో వివేచనను ఉపయోగించండి

14-16. ఉద్యోగాన్ని ఎంచుకునేముందు మనం ఏ రెండు ప్రాముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలి?

14 ఉద్యోగం విషయంలో ఇది సరైనది, అది కాదు అని బైబిలు వివరంగా చెప్పడం లేదు. అలాగని ఉద్యోగ విధులేమిటో తెలుసుకోకుండా ఎలాంటిదైనా ఫర్వాలేదు అనుకోకూడదు. దేవునికి ఇష్టంలేని ఉద్యోగాన్ని ఎంచుకోకుండా దేవుడు ఇష్టపడేలా చట్టబద్ధమైన, మంచి ఉద్యోగాన్ని ఎంచుకోవడానికి లేఖనాలు సహాయం చేస్తాయి. (సామెతలు 2:6) ఉద్యోగాన్ని ఎంచుకునేముందు మనం రెండు ప్రాముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలి.

15 నేను ఈ ఉద్యోగం చేస్తే బైబిలు నియమాలను ఉల్లంఘించినట్లు అవుతుందా? దొంగతనాన్ని, అబద్ధం చెప్పడాన్ని, విగ్రహాలు తయారుచేయడాన్ని దేవుని వాక్యం స్పష్టంగా ఖండిస్తుంది. (నిర్గమకాండము 20:4; అపొస్తలుల కార్యములు 15:28, 29; ఎఫెసీయులు 4:27, 28; ప్రకటన 21:8) అందుకే అలాంటివి చేయాల్సివచ్చే ఏ ఉద్యోగాన్నైనా మనం అంగీకరించం. యెహోవాపట్ల ప్రేమ ఉంటే ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించే ఉద్యోగాన్ని మనం అంగీకరించం.—1 యోహాను 5:3 చదవండి.

16 నేను ఈ ఉద్యోగం చేస్తే ఏదైనా తప్పుడు పనికి పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లు అవుతుందా? ఒక ఉదాహరణ చూడండి. రిసెప్షనిస్టుగా పనిచేయడంలో తప్పేమీ లేదు. కానీ బ్లడ్‌బ్యాంక్‌ లాంటి వాటిలో క్రైస్తవులకు ఉద్యోగం దొరికితే ఏమి చేయాలి? వారేమీ రక్తాన్ని తీసి వేరేవాళ్ళకు ఎక్కించకపోవచ్చు, కానీ అక్కడ పనిచేయడం వల్ల వారు పరోక్షంగా దానికి మద్దతు ఇచ్చినట్లు అవదా? అది దేవుని వాక్యంలోని నియమాల్ని ఉల్లంఘించినట్లు అవదా? (అపొస్తలుల కార్యములు 15:28, 29) యెహోవాను ప్రేమిస్తున్నవారిగా మనం లేఖన విరుద్ధమైన ఎలాంటి పనులకైనా దూరంగా ఉండాలనుకుంటాం.

17. (ఎ) ఉద్యోగం ఎంచుకునేటప్పుడు ఏ విషయాల గురించి ఆలోచించాలి? (203వ పేజీలోని బాక్సు చూడండి.) (బి) దేవునికి ఇష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి మన మనస్సాక్షి మనకెలా సహాయం చేస్తుంది?

17 పైన రెండు పేరాల్లో ప్రస్తావించబడిన ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాల్ని పరిశీలిస్తే ఉద్యోగాన్ని ఎంచుకునే విషయంలో వచ్చే చాలా సందేహాలు తీరిపోతాయి. అంతేకాదు, ఉద్యోగం ఎంచుకునేటప్పుడు మనం ఆలోచించాల్సిన విషయాలు మరికొన్ని ఉన్నాయి.a ప్రతీ విషయంలో నమ్మకమైన దాసుడు నిర్దిష్ట నియమాలను ఇవ్వాలని మనం ఆశించలేం. కాబట్టి, ఇలాంటి సందర్భాల్లోనే మనం వివేచన ఉపయోగించాలి. మనం 2వ అధ్యాయంలో చూసినట్లుగా, దైనందిన జీవితంలో దేవుని వాక్యానుసారంగా ఎలా నడుచుకోవాలో అర్థం చేసుకొని మన మనస్సాక్షికి శిక్షణనివ్వాలి. మనం మన ‘జ్ఞానేంద్రియాలను’ ఉపయోగిస్తూ ఉంటే, దేవునికి ఇష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఆయన ప్రేమలో నిలిచివుండడానికి మన మనస్సాక్షి మనకు సహాయం చేస్తుంది.—హెబ్రీయులు 5:14.

నేను ఈ ఉద్యోగంలో చేరడం మంచిదేనా?

పని కోసం వార్త పత్రికను చూస్తున్న ఒకతను

సూత్రం: “సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.”—1 కొరింథీయులు 10:31.

ఈ ప్రశ్నలు వేసుకోండి . . .

  • దేవుని వాక్యంలో సూటిగా ఖండించబడిన పనుల్ని ఈ ఉద్యోగంలో చేయాల్సివస్తుందా?—నిర్గమకాండము 20:13-15.

  • నేను ఈ పనిలో చేరితే తప్పుడు పనులకు పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లు అవుతుందా?—ప్రకటన 18:4.

  • ఈ ఉద్యోగం లేఖన విరుద్ధమైనది కాకుండా పోస్టుమ్యాను చేసే ప్రజాసేవ లాంటిదా?—అపొస్తలుల కార్యములు 14:16, 17.

  • నేను ఈ ఉద్యోగం చేయడంవల్ల ఇతరులు అభ్యంతరపడతారా? —రోమీయులు 14:19-22.

  • నేను వేరే దేశంలో ఉద్యోగం చేయడానికి వెళ్తే నా కుటుంబ భావోద్వేగ, ఆధ్యాత్మిక అవసరాల్ని ఎవరు పట్టించుకుంటారు?—ఎఫెసీయులు 5:28–6:4.

ఉద్యోగాన్ని దాని స్థానంలో ఉంచండి

18. యెహోవాకు ఇష్టమైన నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు సులభం కాదు?

18 “అపాయకరమైన” ఈ ‘అంత్యదినాల్లో’ యెహోవాకు ఇష్టమైన నిర్ణయాలు తీసుకోవడం అంత సులభమేమీ కాదు. (2 తిమోతి 3:1) ఉద్యోగం దొరకడం, దాన్ని నిలబెట్టుకోవడం నిజంగా కష్టమే. నిజ క్రైస్తవులముగా, మన కుటుంబాన్ని పోషించడానికి కష్టపడి పనిచేయడం ఎంత ప్రాముఖ్యమో మనకు తెలుసు. కానీ, మనం జాగ్రత్తగా ఉండకపోతే, తోటి ఉద్యోగస్థుల ఒత్తిడివల్ల లేదా ఈ లోకస్థుల ప్రభావం వల్ల అత్యాశకు లొంగిపోయి మన ఆరాధన సంబంధమైన విషయాలను నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది. (1 తిమోతి 6:9, 10) అయితే, ‘శ్రేష్టమైన కార్యాలకు’ ప్రాముఖ్యతనిస్తూ ఉద్యోగాన్ని దాని స్థానంలో ఎలా ఉంచాలో చూద్దాం.—ఫిలిప్పీయులు 1:9, 10.

19. (ఎ) మనం యెహోవాపై పూర్తి నమ్మకాన్ని ఎందుకు చూపించాలి? (బి) ఆయనపై నమ్మకముంటే మనం ఏమి చేయము?

19 యెహోవాపై పూర్తి నమ్మకం చూపించండి. (సామెతలు 3:5, 6 చదవండి.) ఆయనకు మనపట్ల ఎంతో శ్రద్ధ ఉంది. (1 పేతురు 5:7) అంత ప్రేమగల దేవునిపై మనం నమ్మకాన్ని చూపించవద్దా? మనకేమి కావాలో మనకన్నా యెహోవాకే బాగా తెలుసు, ఆయన మనకు ధారాళంగా ఇస్తాడు. (కీర్తన 37:25) కాబట్టి ఆయన వాక్యం చెబుతున్న ఈ మాటల ప్రకారం చేయాలి: “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.” ఎందుకంటే, “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” అని దేవుడు చెబుతున్నాడు. (హెబ్రీయులు 13:5) జీవితావసరాలను తీర్చే శక్తి దేవునికి ఉందని పూర్తికాల సేవకులు ఎందరో తమ సొంత అనుభవం నుండి చెబుతారు. యెహోవా మన కుటుంబ అవసరాలు తీరుస్తాడని పూర్తిగా నమ్మితే మనం వాటి విషయంలో అనవసరంగా చింతించము. (మత్తయి 6:25-32) ఉద్యోగం పేరుతో సువార్త ప్రకటించడం, కూటాలకు హాజరవడం వంటి ఆధ్యాత్మిక విషయాలను నిర్లక్ష్యం చేయం.—మత్తయి 24:14; హెబ్రీయులు 10:24, 25.

20. (ఎ) కంటిని తేటగా ఉంచుకోవడం అంటే ఏమిటి? (బి) మనం ఎలా కంటిని తేటగా ఉంచుకోగలం?

20 కంటిని “తేటగా” ఉంచుకోండి. (మత్తయి 6:22, 23 చదవండి.) కంటిని తేటగా ఉంచుకోవాలి అంటే దేవుని చిత్తం చేయడానికే ప్రాముఖ్యతనివ్వాలి. జీవితంలో అంత ప్రాముఖ్యంకాని విషయాలకు చోటిచ్చి సమయం వృథా చేసుకోకూడదని యేసు మాటలకు అర్థం. ఒక క్రైస్తవుడు దేవుని చిత్తం చేయడానికే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. మన దృష్టి దానిపై ఉన్నప్పుడు పెద్దపెద్ద జీతాలు దొరికే ఉద్యోగాలు సంపాదించడానికి, జీవితాన్ని మరింత సౌకర్యవంతం చేసుకోవడానికి వెంపర్లాడం. మార్కెట్లోకి వచ్చే కొత్త కొత్త వస్తువుల్ని కొనుక్కుంటేనే సంతోషంగా జీవించగలుగుతామని అనుకోం. మరి దేవుని చిత్తం చేయడానికి ప్రాముఖ్యతనివ్వాలంటే ఏమి చేయాలి? అనవసరంగా అప్పులు చేయకండి. సమయాన్ని వృథా చేసే వస్తువులతో ఇంటిని నింపుకోకండి. బైబిలు చెబుతున్నట్లుగా ‘అన్నవస్త్రములతో’ తృప్తిపొందండి. (1 తిమోతి 6:7, 8) సాధ్యమైనంతగా నిరాడంబరమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.

21. (ఎ) ఏ విషయాలు ప్రాముఖ్యమైనవో మనం ఎందుకు గుర్తించాలి? (బి) మన జీవితంలో దేనికి మొదటి స్థానమివ్వాలి?

21 జీవితంలో ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాలకే మొదటి స్థానం ఇవ్వండి. జీవితంలో మనం అనుకున్నవన్నీ చేయలేం కాబట్టి ప్రాముఖ్యమైనవి ఏవో గుర్తించాలి. లేకపోతే, అనవసరమైన విషయాల వల్ల సమయం వృథా అయిపోయి, ప్రాముఖ్యమైన వాటికి సమయం ఉండదు. మరి వేటికి మనం మొదటి స్థానం ఇవ్వాలి? లోకంలో చాలామంది మంచి ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో పై చదువులకు ప్రాముఖ్యతనిస్తారు. కానీ ‘రాజ్యాన్ని మొదట వెదకాలి’ అని యేసు తన అనుచరులకు చెప్పాడు. (మత్తయి 6:33) అవును, నిజ క్రైస్తవులముగా మనం దేవుని రాజ్యానికే మన జీవితంలో మొదటి స్థానాన్నిస్తాం. మన నిర్ణయాలనుబట్టి, లక్ష్యాలనుబట్టి, పనులనుబట్టి మన జీవితంలో డబ్బు, చదువు, ఉద్యోగం కన్నా దేవుని చిత్తానికి, ఆయన రాజ్య సంబంధ పనులకే ఎక్కువ ప్రాముఖ్యత ఉందని తెలియాలి.

“నా నిర్ణయం నా జీవితాన్ని సంతోషభరితం చేసి, సంతృప్తినిచ్చింది”

“నేను చదువుల్లో బాగా రాణించి, న్యూయార్క్‌లో ప్రఖ్యాతి గాంచిన ఒక ప్రైవేటు పాఠశాలలో స్కాలర్‌షిప్‌ సంపాదించుకున్నాను. స్కూలు కౌన్సిలర్లు పేరుగాంచిన విశ్వవిద్యాలయాల్లో అప్లికేషన్లు పెట్టుకోమని ఒత్తిడి చేశారు. కొన్నింటిలో నాకు సీటు కూడా వచ్చింది, అమెరికాలోని ఒక ప్రఖ్యాత విశ్వవిద్యాలయంవారు నాకు స్కాలర్‌షిప్‌ ఇస్తామన్నారు. అయితే నేను రెండు కారణాలనుబట్టి వాటిని వదులుకున్నాను. ఇంటికి దూరంగా విశ్వవిద్యాలయంలో ఉండి చదువుకోవడం ఎలాంటి ప్రమాదాలను తెస్తుందో నాకు తెలుసు. అంతేకాదు నాకు పయినీరు సేవ చేయాలని చాలా ఆశగా ఉండేది.

“నేను 20 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా క్రమ పయినీరు సేవ చేస్తున్నాను. అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లడం, రాజ్య మందిర నిర్మాణ పనిలో, ప్రకృతి విపత్తులు సంభవించిన చోట సహాయం చేయడం వంటివి చేస్తూ పరిచర్యలో నిమగ్నమైపోయి ఉన్నాను. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఒక విదేశీ భాషా గుంపుతో కలిసి పనిచేస్తూ ఎంతో ఆనందంగా ఉన్నాను.

“ఇన్ని సంవత్సరాల పూర్తికాల సేవ తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, నా జీవితం ఎంత సంతోషంగా గడిచిపోయిందా అనిపిస్తుంది. నా నిర్ణయం నా జీవితాన్ని సంతోషభరితం చేసి, సంతృప్తినిచ్చింది. ఎన్నో చక్కని అనుభవాల్ని చవిచూసి, ఎంతోమంది స్నేహితుల్ని సంపాదించుకుని ఆనందంగా గడిపిన ఈ జీవితాన్ని మరి దేనికోసమూ వదులుకోలేను.”—జెనైడా.

పరిచర్యలో కష్టపడి పనిచేయండి

ప్రకటిస్తున్న ఒక జంట

పకటనా పనికి మన జీవితాల్లో ప్రాముఖ్యతనిచ్చి యెహోవాపట్ల మనకు ప్రేమ ఉందని చూపించవచ్చు

22, 23. (ఎ) నిజ క్రైస్తవులముగా మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏమిటి? (బి) అది మనకు ప్రాముఖ్యమని ఎలా చూపిస్తాం? (206వ పేజీలోని బాక్సు చూడండి.) (సి) ఏమి జరగకుండా మనం జాగ్రత్తపడాలి?

22 మనం అంత్యదినాల చివర్లో ఉన్నాం కాబట్టి, నిజ క్రైస్తవులముగా మనకివ్వబడిన ప్రకటనా పనికి, శిష్యులను చేసే పనికి ప్రాధాన్యతనిస్తాం. (మత్తయి 24:14; 28:19, 20) మన మాదిరికర్తయైన యేసులాగే ఈ జీవరక్షక పనిలో మనం పూర్తిగా నిమగ్నమై ఉండాలనుకుంటాం. ఈ పనే మనకు ప్రాముఖ్యమని ఎలా చూపించవచ్చు? దేవుని ప్రజల్లో ఎక్కువశాతం సంఘ ప్రచారకులుగా ప్రకటనా పనిని మనస్ఫూర్తిగా చేస్తున్నారు. కొందరు జీవితంలో సర్దుబాట్లు చేసుకుని పయినీర్లుగా, మిషనరీలుగా సేవచేస్తున్నారు. దేవుని సేవలో మంచి లక్ష్యాలను పెట్టుకోవడం ఎంత ప్రాముఖ్యమో తెలిసిన తల్లిదండ్రులు, తమ పిల్లల్ని పూర్తికాల సేవ చేసే లక్ష్యం పెట్టుకోమని ప్రోత్సహించారు. మరి అలా ఉత్సాహంగా పనిచేసే రాజ్య ప్రచారకులు తమ పనికి ఫలితాలను చూస్తున్నారా? నిజంగానే చూస్తున్నారు. యెహోవాను మనస్ఫూర్తిగా ఆరాధిస్తేనే మన జీవితంలో సంతోషం, సంతృప్తి ఉంటాయి, మెండైన ఆశీర్వాదాలు లభిస్తాయి.—సామెతలు 10:22 చదవండి.

23 కుటుంబాన్ని పోషించడానికి మనలో చాలామంది గంటల తరబడి పనిచేయాల్సి వస్తుంది. మనం కష్టానికి తగిన ఫలితాన్ని పొందాలన్నదే యెహోవా కోరిక అని గుర్తుంచుకోండి. ఆయన ఆలోచనలకు, సూత్రాలకు తగిన విధంగా నడుచుకుంటే మనం చేసే పనిలో సంతృప్తి ఉంటుంది. కానీ, దేవుని రాజ్యం గురించి ప్రకటించాలనే ప్రాముఖ్యమైన పనిని నిర్లక్ష్యం చేసేంతగా ఉద్యోగ పనుల్లో మునిగిపోకుండా జాగ్రత్తపడాలి. ప్రకటనా పనికి ప్రాముఖ్యతనిస్తే యెహోవాపట్ల మనకు ప్రేమ ఉందని చూపించి ఆయన ప్రేమలో నిలిచివుంటాం.

a ఉద్యోగం ఎంచుకునేముందు వేటి గురించి ఆలోచించాలో తెలుసుకోవడానికి కావలికోట ఏప్రిల్‌ 15, 1999 సంచికలోని 28-30 పేజీలు చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి