కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 7/1 పేజీలు 8-13
  • పునరుత్థానంలో మీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పునరుత్థానంలో మీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • భవిష్యద్‌ జీవితాన్ని గూర్చిన సందేహాలు
  • మరణానంతర జీవితం గురించి క్రైస్తవమత సామ్రాజ్య దృక్పథం
  • మృతులకు నిజమైన నిరీక్షణ
  • శరీరం, అమర్త్యమైన ఆత్మ
  • ప్రాణమునకు మరింత శ్రేష్ఠమైన నిరీక్షణ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • మరణానంతర జీవితం—బైబిలేమి చెప్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 7/1 పేజీలు 8-13

పునరుత్థానంలో మీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంది?

“పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయనను బ్రదుకును.”—యోహాను 11:25.

1, 2. యెహోవా ఆరాధకునికి పునరుత్థాన నిరీక్షణయందు ఎందుకు నమ్మకం ఉండాలి?

పునరుత్థానంలో మీ నిరీక్షణ ఎంత దృఢంగా ఉంది? ఆ నిరీక్షణ మరణానికి భయపడకుండా మిమ్మల్ని బలపరుస్తుందా, ప్రియమైనవారు మరణించినప్పుడు మిమ్మల్ని ఓదారుస్తుందా? (మత్తయి 10:28; 1 థెస్సలొనీకయులు 4:13) పునరుత్థానమందలి తమ నమ్మకం ద్వారా, కొరడాదెబ్బల్నీ, తిరస్కారాన్నీ, హింసనీ, బంధకాల్నీ సహించిన ప్రాచీన కాలానికి చెందిన అనేకమంది దేవుని సేవకులవలే మీరున్నారా?—హెబ్రీయులు 11:35-38.

2 అవును, పునరుత్థానం జరుగుతుందనే విషయంలో, యెహోవాను యథార్థంగా ఆరాధించే వ్యక్తికి ఏ విధమైన సందేహాలూ ఉండకూడదు. పునరుత్థానమందు ఆ వ్యక్తికున్న నమ్మకం, అతని జీవిత విధానాన్ని ప్రభావితం చేయాలి. దేవుని నియమిత కాలంలో, సముద్రము, మరణము, పాతాళలోకము తమలోవున్న మృతులను అప్పగిస్తాయనే, పునరుత్థానులైన వీరు పరదైసు భూమిపై నిరంతరం జీవించే ఉత్తరాపేక్షను కల్గివుంటారనే వాస్తవాల గురించి ఆలోచించడం అద్భుతంగా ఉంటుంది.—ప్రకటన 20:13; 21:4, 5.

భవిష్యద్‌ జీవితాన్ని గూర్చిన సందేహాలు

3, 4. మరణానంతర జీవితం గురించి అనేకులకు ఇంకా ఏ నమ్మకం ఉంది?

3 మరణానంతర జీవితం ఉందని క్రైస్తవమత సామ్రాజ్యం ఎంతోకాలంగా బోధించింది. యు. ఎస్‌. క్యాథలిక్‌ అనే పత్రికలో ప్రచురించబడిన ఒక శీర్షిక ఇలా తెలియజేసింది: “గడిచిన యుగాలన్నిటిలోనూ క్రైస్తవులు, శాంతి సంతృప్తులతో, సుఖ సంతోషాలతో కూడిన మరో జీవితం కొరకు ఎదురుచూస్తూ, ఈ జీవితంలోని నిరుత్సాహాలనూ, బాధలనూ అంగీకరించి, వాటిని తాళుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించారు.” అనేక క్రైస్తవమత సామ్రాజ్య దేశాల్లో ప్రజలు లౌకికవాదులుగా మారి, మతం విషయంలో ఒక విధమైన అపనమ్మకంలోకి జారిపోయినప్పటికీ, ఒకవిధమైన మరణానంతర జీవితం ఉండి ఉంటుందని అనేకులు ఇప్పటికీ అనుకుంటున్నారు. కాని వాళ్లకు ఖచ్చితంగా తెలియనిది ఎంతో ఉంది.

4 టైమ్‌ పత్రికలోని ఒక శీర్షిక ఇలా పేర్కొంది: “ప్రజలు [మరణానంతర జీవితాన్ని] ఇప్పటికీ విశ్వసిస్తున్నారు: ఖచ్చితంగా అది ఏమైవుందనేదాని గురించిన వారి తలంపు అస్పష్టంగా ఉంటుంది, వాళ్లు తమ పాస్టర్ల నుండి దాని గురించి చాలా అరుదుగా వింటున్నారు.” మరణానంతర జీవితం గురించి మత పరిచారకులు మునుపటి కన్నా ఇప్పుడు ఎందుకు తక్కువగా మాట్లాడుతున్నారు? మత విద్వాంసుడైన జఫ్రీ బర్టన్‌ రస్సెల్‌ ఇలా చెబుతున్నాడు: “ప్రజాదరణ పొందిన సందేహవాదమనే గోడను తాము దాటాల్సి ఉంటుందని [మతనాయకులు] భావిస్తున్నారు గనుక బహుశ వాళ్లు ఆ అంశాన్ని దాటవేయాలనుకుంటున్నారని నేను భావిస్తున్నాను.”

5. నరకాగ్ని సిద్ధాంతాన్ని నేడు అనేకమంది ఎలా దృష్టిస్తున్నారు?

5 మరణానంతర జీవితాన్ని గూర్చి అనేక చర్చీలు చేసే బోధల్లో, స్వర్గనరకాలు చేరివున్నాయి. మతనాయకులు స్వర్గం [పరలోకం] గురించి మాట్లాడడానికి వెనుకాడుతుంటే, నరకాన్ని గురించి మాట్లాడడానికి మరింత వెనుకాడతారు కూడా. ఒక వార్తాపత్రిక శీర్షిక ఇలా తెలియజేసింది: “అక్షరార్థమైన నరకంలో నిత్యశిక్ష ఉందని నమ్మే చర్చీలు కూడా ఈ రోజుల్లో . . . [నరకాగ్ని] బోధను అంతగా నొక్కి చెప్పడం లేదు.” వాస్తవానికి, అనేకమంది ఆధునిక మతాచార్యులు, మధ్యయుగాల్లో బోధించబడినట్లుగా నరకం యాతనలుపెట్టే ఒక అక్షరార్థమైన స్థలమని ఇక ఎంత మాత్రం నమ్మడం లేదు. బదులుగా, వాళ్లు మరింత “మానవతా” దృక్పథంగల నరకాన్ని ఇష్టపడతారు. అనేకమంది ఆధునికవాదుల అభిప్రాయం ప్రకారం, నరకంలో ఉన్న పాపులు అక్షరార్థంగా హింసించబడరు కాని వారు తాము “దేవుని నుండి మతసంబంధంగా వేరై” ఉన్నందుకు బాధించబడతారు.

6. దుర్ఘటనను ఎదుర్కునేటప్పుడు తమకు విశ్వాసం కొరవడినట్టు కొందరు ఎలా కనుగొన్నారు?

6 ఈ ఆధునిక దృక్పథం కల్గివున్న వారిని అభ్యంతరపర్చకూడదనే ఉద్దేశంతో చర్చి సిద్ధాంతాన్ని బలహీనపర్చడం, ప్రజలకు నచ్చనిదాన్ని నివారించడానికి తోడ్పడవచ్చు, కాని అది చర్చికెళ్లే యథార్థపరులైన కోట్లాదిమంది ఏది నమ్మాలా అని సందిగ్ధంలో పడిపోయేలా చేస్తుంది. అందుకే, మరణాన్ని ముఖాముఖి ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, తరచుగా వీళ్లు తమలో విశ్వాసం కొరవడుతున్నట్లు కనుగొంటారు. వారి దృక్పథం, ఒక విషాదకరమైన దుర్ఘటనలో అనేకమంది కుటుంబ సభ్యులను పోగొట్టుకొన్న ఒక స్త్రీ దృక్పథంలా ఉంది. ఆమె మత విశ్వాసం ఆమెకేమైనా ఓదార్పునిచ్చిందా అని అడిగినప్పుడు, దానికామె “ఇచ్చిందనుకుంటా” అని సందేహాస్పదంగా చెప్పింది. తన మత విశ్వాసం తనకు సహాయం చేసిందని ఆమె ఒకవేళ దృఢనమ్మకంతో జవాబిచ్చినప్పటికీ, ఆమె నమ్మకాలకు సరైన పునాదులు లేకపోతే, అది ఏ దీర్ఘకాల ప్రయోజనాన్ని ఆమెకు ఇవ్వగలదు? వాస్తవానికి, భావి జీవితాన్ని గురించి అనేక చర్చీలు బోధించేది బైబిలు బోధిస్తున్నదానికి ఎంతో భిన్నంగా ఉంది గనుక ఇదొక ప్రాముఖ్యమైన విషయమై ఉంది.

మరణానంతర జీవితం గురించి క్రైస్తవమత సామ్రాజ్య దృక్పథం

7. (ఎ) అనేక చర్చీలు సాధారణంగా కల్గివున్న నమ్మకమేమిటి? (బి) అమర్త్యమైన ఆత్మను గూర్చిన సిద్ధాంతాన్ని ఒక క్రైస్తవ మతాచార్యుడు ఎలా వర్ణించాడు?

7 క్రైస్తవమత సామ్రాజ్యంలోని మతశాఖల మధ్య ఎన్ని తేడాలున్నప్పటికీ దాదాపు అన్ని మతశాఖలూ, శరీర మరణాన్ని తప్పించుకుని జీవించే అమర్త్యమైన ఆత్మ మానవులకు ఉందనే విషయాన్ని అంగీకరిస్తున్నాయి. ఒక వ్యక్తి మరణించినప్పుడు, ఆయన ఆత్మ పరలోకానికి వెళుతుందని అనేకమంది విశ్వసిస్తారు. తమ ఆత్మ మండుతున్న నరకానికో లేక పాపవిమోచన స్థలానికో పోతుందని కొందరు భయపడతారు. కాని అమర్త్యమైన ఆత్మను గూర్చిన తలంపే వారి భావి జీవిత దృక్కోణానికి కేంద్రకమైవుంది. అమరత్వము, పునరుత్థానము అనే పుస్తకంలో ప్రచురించబడిన ఒక వ్యాసంలో, మతాచార్యుడైన ఆస్కార్‌ కుల్‌మాన్‌ దీనిపై వ్యాఖ్యానించాడు. ఆయనిలా వ్రాశాడు: “నేడు మనం ఒక సగటు క్రైస్తవుడ్ని . . . మరణానంతరపు మానవ భవిష్యత్తును గూర్చి క్రొత్త నిబంధన బోధిస్తున్నదాన్నుండి మీరేం గ్రహించారని అడిగితే, ‘అమర్త్యమైన ఆత్మ’ అనే సమాధానం మనకు సాధారణంగా లభిస్తుంది.” అయితే, కుల్‌మాన్‌ ఇంకా ఇలా జతచేశాడు: “విస్తృతంగా అంగీకరించబడిన ఈ తలంపు, క్రైస్తవత్వాన్ని గూర్చిన అతిపెద్ద అపోహల్లో ఒకటైవుంది.” తాను మొదటిసారి ఈ విషయాన్ని చెప్పినప్పుడు పెద్ద అలజడి చెలరేగిందని కుల్‌మాన్‌ పేర్కొన్నాడు. అయినా, ఆయన చెప్పింది కరెక్టే.

8. యెహోవా మొదటి స్త్రీ పురుషుల ఎదుట ఏ నిరీక్షణను ఉంచాడు?

8 మరణించిన తర్వాత పరలోకానికి వెళ్లేందుకు యెహోవా దేవుడు మానవులను సృష్టించలేదు. అసలు వాళ్లు మరణించాలన్నదే ఆయన అసలు సంకల్పం కాదు. ఆదాము హవ్వలు పరిపూర్ణులుగా సృష్టించబడ్డారు, నీతియుక్తమైన సంతానంతో భూమిని నింపే అవకాశం వారికివ్వబడింది. (ఆదికాండము 1:28; ద్వితీయోపదేశకాండము 32:4) దేవునికి అవిధేయత చూపించినప్పుడు మాత్రమే వాళ్లు మరణిస్తారని మన మొదటి తల్లిదండ్రులకు చెప్పబడింది. (ఆదికాండము 2:17) వాళ్లు తమ పరలోక తండ్రికి విధేయులుగా ఉన్నట్లైతే, వాళ్లు భూమిపై నిరంతరం జీవిస్తూనే ఉండేవారు.

9. (ఎ) మానవునికి అమర్త్యమైన ఆత్మ ఉందా? (బి) మానవుడు మరణించినప్పుడు ఆయనకేమౌతుంది?

9 అయితే విచారకరంగా, ఆదాము హవ్వలు దేవునికి విధేయత చూపడంలో విఫలమయ్యారు. (ఆదికాండము 3:6, 7) విషాదకరమైన ఆ పరిణామాలను అపొస్తలుడైన పౌలు ఇలా వర్ణించాడు: “ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:12) భూమిపై నిరంతరం జీవించివుండడానికి బదులు, ఆదాము హవ్వలు మరణించారు. ఆ తర్వాతేం జరిగింది? తమ పాపాన్నిబట్టి నరకాగ్నికి అప్పగించబడే అమర్త్యమైన ఆత్మ వాళ్ల శరీరాల్లోపల ఏమైనా ఉందా? ఆదాము హవ్వలు మరణించినప్పుడు, వాళ్లు పూర్తిగా మృతులయ్యారు. చివరికి, “నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని” యెహోవా ఆదాముతో చెప్పినట్లుగానే వాళ్లకు జరిగింది.—ఆదికాండము 3:19.

10, 11. ఆత్మను గూర్చిన బైబిలు బోధ విషయంలో డాన్‌ ఫ్లెమింగ్‌ వ్రాసిన బైబిల్‌ డిక్షనరి (హిందీ) ఏమి అంగీకరిస్తుంది, బైబిలు బోధిస్తున్నదానికీ దీనికీ ఉన్న పోలికేమిటి?

10 ప్రాథమికంగా, డాన్‌ ఫ్లెమింగ్‌ వ్రాసిన బైబిల్‌ డిక్షనరి (హిందీ) దీనితో ఏకీభవిస్తోంది. ఆత్మ గురించి చర్చించబడుతున్న ఒక శీర్షికలో, అదిలా చెబుతుంది: “ఆత్మ అనేది శరీరం నుండి వేరై జీవించగలదని పాత నిబంధన రచయితలు ఎన్నడూ సూచించలేదు. ఆత్మ (నెఫెష్‌) అంటే జీవము అనే వాళ్లు భావించారు. జంతువులూ మానవులూ కూడా నెఫెష్‌లే, అంటే ‘జీవం-గలవే/గలవారే.’ ‘మానవుడు జీవించు ఆత్మ (ప్రాణి) ఆయెను’ అని అనువదించడం ద్వారా ప్రాచీన ఇంగ్లీష్‌ బైబిళ్లు ఎంతో గందరగోళాన్ని సృష్టించాయి. (ఆదికాండము 2:7) ఎందుకంటే, మునుపు ‘జీవించు ప్రాణి’ అని అనువదించబడిన పదమే ఇతర అనువాదాల్లో ‘జీవించు ఆత్మ’ అని అనువదించబడింది. (ఆదికాండము 1:21, 24)” అదింకా ఇలా జత చేసింది: బైబిలు ప్రకారం, “మానవుడు జీవంలేని శరీరంతోనూ, శరీరంలేని ప్రాణముతోను తయారు చేయబడ్డాడని మనం అర్థం చేసుకోకూడదు. బదులుగా ఆయన ఒకే సంపూర్ణ సజీవ శరీరం. ఈ నెఫెష్‌ను ‘వ్యక్తి’ అని కూడా అనువదించవచ్చు.” అలాంటి స్పష్టత సేదదీర్పునిస్తుంది, కాని సాధారణంగా చర్చికెళ్లేవారికి ఈ విషయాల గురించి ఎందుకు తెలియజేయబడలేదా అని ఒకరు ఆశ్చర్యపోవచ్చు.

11 మరణానంతరం జీవించివుండి బాధించబడే అమర్త్యమైనదేదీ మానవునిలో లేదనే సరళమైన బైబిలు సత్యాన్ని చర్చీకెళ్లేవారికి బోధించివుంటే వాళ్లెంత భయాందోళనలను తప్పించుకొని ఉండేవారో కదా. క్రైస్తవమత సామ్రాజ్యం బోధిస్తున్నదాని నుండి ఇదెంతో భిన్నమైనదే అయినప్పటికీ, అది జ్ఞానియైన సొలొమోను ప్రేరేపించబడినవాడై చెప్పిన దీనితో పూర్తి పొందిక కల్గివుంది: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు అయతే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడియున్నది, వారికిక [ఈ జీవితములో] ఏ లాభమును కలుగదు. చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళము [మానవజాతి సామాన్య సమాధి] నందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.”—ప్రసంగి 9:5, 10.

12. అమర్త్యమైన ఆత్మను గూర్చిన క్రైస్తవమత సామ్రజ్య బోధ ఎక్కడి నుండి వచ్చింది?

12 క్రైస్తవమత సామ్రాజ్యం బైబిలు చెబుతున్నదాని నుండి ఎంతో భిన్నమైన దానిని ఎందుకు బోధిస్తుంది? తొలి చర్చి బోధకులు అమర్త్యమైన ఆత్మకు మద్దతును కనుగొన్నది బైబిల్లో కాదుగాని, “కవుల్లోను, తత్వవేత్తల్లోను, గ్రీకు తలంపు యొక్క సాధారణ సాంప్రదాయంలోను” కనుగొన్నారనీ, “ఆ తర్వాత, పండితులు ప్లేటో లేక అరిస్టాటిల్‌ల సూత్రాలను ఉపయోగించుకోవడానికి ఇష్టపడ్డారు” అనీ న్యూ క్యాథోలిక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతుంది. అమర్త్యమైన ఆత్మనందలి నమ్మకంతోపాటు “ప్లేటో, నియోప్లేటో తలంపు యొక్క ప్రభావం” చివరికి “క్రైస్తవ మత ధర్మశాస్త్రపు అంతర్భాగంలోకే” ప్రవేశపెట్టబడిందని అది తెలియజేస్తుంది.

13, 14. అన్యులైన గ్రీకు తత్త్వవేత్తల నుండి జ్ఞానాన్ని పొందాలని అపేక్షించడం ఎందుకు సహేతుకమైనది కాదు?

13 క్రైస్తవులమని చెప్పుకుంటున్నవారు, మరణానంతర జీవితం వంటి ప్రాథమికమైన నిరీక్షణ గురించి తెలుసుకోవడం కోసం అన్యులైన గ్రీకు తత్వవేత్తల వైపు తిరిగి ఉంటారా? ఎంతమాత్రం కాదు. గ్రీసునందలి కొరింథులో నివసిస్తున్న క్రైస్తవులకు వ్రాస్తున్నప్పుడు, పౌలు ఇలా చెప్పాడు: “ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును; మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు [“యెహోవాకు,” NW] తెలియును అని వ్రాయబడియున్నది.” (1 కొరింథీయులు 3:19, 20) ప్రాచీన గ్రీకులు విగ్రహారాధకులు. మరి వారెలా సత్యానికి మూలమౌతారు? పౌలు కొరింథీయులనిలా ప్రశ్నించాడు: “దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును. వారు నా ప్రజలైయుందురు.”—2 కొరింథీయులు 6:16-18.

14 పరిశుద్ధ సత్యాలను గూర్చిన ప్రకటన మొదట ఇశ్రాయేలు జనాంగం ద్వారా బయల్పర్చబడింది. (రోమీయులు 3:1, 2) సా.శ. 33 తర్వాత, అది మొదటి శతాబ్దపు అభిషిక్త క్రైస్తవ సంఘం ద్వారా ఇవ్వబడింది. మొదటి శతాబ్దపు క్రైస్తవుల గురించి మాట్లాడుతూ, పౌలు ఇలా చెప్పాడు: “మనకైతే దేవుడు తన ఆత్మవలన [తనను ప్రేమించేవారి కొరకు సిద్ధం చేయబడిన విషయాలను] బయలుపరచి యున్నాడు.” (1 కొరింథీయులు 2:10; ప్రకటన 1:1, 2 కూడ చూడండి.) అమర్త్యమైన ఆత్మను గూర్చిన క్రైస్తవమత సామ్రాజ్య సిద్ధాంతం గ్రీకు తత్త్వం నుండి తీసుకోబడింది. కానీ ఇది దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ప్రకటనల ద్వారా లేక అభిషిక్త క్రైస్తవుల మొదటి శతాబ్దపు సంఘం ద్వారా బయల్పర్చబడలేదు.

మృతులకు నిజమైన నిరీక్షణ

15. యేసు చెప్పినట్లుగా, మృతులకున్న నిజమైన నిరీక్షణ ఏమిటి?

15 అమర్త్యమైన ఆత్మ లేనట్లైతే, మరి మృతులకున్న నిజమైన నిరీక్షణ ఏమిటి? ఆ నిరీక్షణే బైబిలు కేంద్ర సిద్ధాంతమూ, నిజంగా అద్భుతమైన దైవిక వాగ్దానమూ అయిన పునరుత్థానం. యేసు తన స్నేహితురాలైన మార్తతో ఇలా చెప్పినప్పుడు, పునరుత్థాన నిరీక్షణ గురించి తెలియజేశాడు: “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయనను బ్రదుకును.” (యోహాను 11:25) యేసునందు విశ్వాసముంచడం అంటే అమర్త్యమైన ఆత్మనందు కాదుగాని పునరుత్థానమందు విశ్వాసముంచడమని భావం.

16. పునరుత్థానమందు నమ్మకముంచడం ఎందుకు సహేతుకమైనది?

16 కొంతమంది యూదులకిలా చెప్పిన సందర్భంలో, యేసు మునుపు ఒకసారి పునరుత్థానం గురించి మాట్లాడాడు: “దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.” (యోహాను 5:28, 29) యేసు ఇక్కడ వర్ణిస్తున్నది, శరీర మరణాన్ని తప్పించుకుని తిన్నగా పరలోకానికి పోయే అమర్త్యమైన ఆత్మ నుండి ఎంతో భిన్నమైనది. శతాబ్దాలుగా, చివరికి కొన్ని వేల సంవత్సరాలుగా సమాధులలో ఉన్న ప్రజలు భవిష్యత్తులో ‘బయటికి రావడం’ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే, మృతులు తిరిగి జీవానికి రావడం. అసాధ్యమా? “మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన” దేవునికి మాత్రం అసాధ్యం కాదు. (రోమీయులు 4:17) ప్రజలు మరణం నుండి తిరిగి రావడమనే తలంపును సంశయవాదులు వెక్కిరించవచ్చు, కాని “దేవుడు ప్రేమాస్వరూపి,” ఆయన ‘తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడు’ అనే వాస్తవంతో అది సంపూర్ణ పొందిక కల్గివుంది.—1 యోహాను 4:16; హెబ్రీయులు 11:6.

17. పునరుత్థానం ద్వారా దేవుడు ఏమి నెరవేరుస్తాడు?

17 “మరణమువరకు నమ్మకముగా” ఉన్నట్లు నిరూపించుకున్న వారిని తిరిగి జీవానికి తీసుకురాకపోతే, దేవుడు మరి వారికెలా ప్రతిఫలమివ్వగలడు? (ప్రకటన 2:10) అంతేగాక పునరుత్థానం, “అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను” అని అపొస్తలుడైన యోహాను వ్రాసినదాన్ని దేవుడు నెరవేర్చడాన్ని కూడా సాధ్యపరుస్తుంది. (1 యోహాను 3:8) పూర్వం ఏదెను తోటలో, సాతాను మన మొదటి తల్లిదండ్రులను పాపమరణాలలోకి నడిపించినప్పుడు యావత్‌ మానవ జాతి నిర్మూలకునిగా తయారయ్యాడు. (ఆదికాండము 3:1-6; యోహాను 8:44) ఆదాము చూపిన ఉద్దేశపూర్వక అవిధేయత మూలంగా పాపానికి వారసత్వంగా సంక్రమించిన దాస్యం నుండి మానవజాతిని విడిపించడానికి మార్గాన్ని తెరిచేందుకు తత్సమానమైన విమోచన క్రయధనంగా తన పరిపూర్ణ జీవితాన్ని ఇచ్చినప్పుడే యేసు సాతాను క్రియలను లయం చేయడం ప్రారంభించాడు. (రోమీయులు 5:18) ఆదాము చేసిన ఈ పాపం మూలంగా మరణించినవారిని పునరుత్థానం చేయడం, అపవాది క్రియలను మరింతగా లయం చేయడమై ఉంటుంది.

శరీరం, అమర్త్యమైన ఆత్మ

18. యేసు పునరుత్థానం చేయబడ్డాడన్న పౌలు వ్యాఖ్యానానికి గ్రీకు తత్త్వవేత్తలు ఎలా ప్రతిస్పందించారు, ఎందుకు?

18 అపొస్తలుడైన పౌలు ఏథెన్సులో ఉన్నప్పుడు, కొంతమంది గ్రీకు తత్వవేత్తలు కూడా ఉన్న ఒక గుంపుకు ఆయన సువార్త ప్రకటించాడు. ఏకైక సత్య దేవుని గురించిన ఆయన చర్చనూ, పశ్చాత్తాపపడమని ఆయన ఇస్తున్న పిలుపునూ వాళ్లు విన్నారు. కాని తర్వాతేం జరిగింది? ఇలా చెబుతూ పౌలు తన ప్రసంగాన్ని ముగించాడు: “తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును [దేవుడు] నిర్ణయంచియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.” ఆ మాటలు అలజడిని రేపాయి. “మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి.” (అపొస్తలుల కార్యములు 17:22-32) మతాచార్యుడైన ఆస్కర్‌ కుల్‌మాన్‌ ఇలా పేర్కొంటున్నాడు: “పునరుత్థానాన్ని గూర్చిన క్రైస్తవ ప్రకటనను అంగీకరించడమనేది ఇతురులకన్నా, అమర్త్యమైన ఆత్మయందు విశ్వాసముంచిన గ్రీకులకు ఎక్కువ కష్టమైవుండవచ్చు. . . . గొప్ప తత్వవేత్తలైన సోక్రటిస్‌, ప్లేటోల బోధను క్రొత్త నిబంధనతో ఏవిధంగానూ పొందిక [జత] చేయడం కుదరదు.”

19. క్రైస్తవమత సామ్రాజ్య మతాచార్యులు పునరుత్థాన బోధను అమర్త్యమైన ఆత్మ సిద్ధాంతంతో ఎలా జతచేయడానికి ప్రయత్నించారు?

19 అయినప్పటికీ, అపొస్తలుల మరణానంతరం ఏర్పడిన గొప్ప మతభ్రష్టత్వం తర్వాత, పునరుత్థానాన్ని గూర్చిన క్రైస్తవ బోధను అమర్త్యమైన ఆత్మకు సంబంధించిన ప్లేటో నమ్మకంతో జతచేయడానికి [క్రైస్తవ] మతాచార్యులు కృషి చేశారు. కొంతకాలానికి, ఒక క్రొత్త పరిష్కారానికి కొందరు అంగీకరించారు: మరణమందు, ఆత్మ శరీరం నుండి వేరైపోతుంది (కొందరు చెబుతున్నట్టుగా, “స్వేచ్ఛను పొందుతుంది”). ఆ తర్వాత, ఆర్‌. జె. కూక్‌ వ్రాసిన పునరుత్థాన సిద్ధాంత ప్రధాన లక్షణాలు (ఆంగ్లం) అనే పుస్తకం ప్రకారం, తీర్పు దినాన “ప్రతి శరీరము మళ్లీ దాని సొంత ఆత్మతోనూ, ప్రతి ఆత్మా దాని సొంత శరీరంతోనూ ఐక్యమౌతాయి.” భవిష్యత్తులో జరగబోయే శరీరాత్మల పునఃకలయికే పునరుత్థానమని చెప్పబడుతుంది.

20, 21. పునరుత్థానాన్ని గూర్చిన సత్యాన్ని ఒకే విధంగా ఎవరు బోధించారు, ఇది వారికెలా ప్రయోజనం చేకూర్చింది?

20 ఈ సిద్ధాంతం ఇప్పటికీ ప్రముఖ చర్చీల అధికారిక బోధగా ఉంది. అలాంటి తలంపు ఒక [క్రైస్తవ] మతాచార్యునికి సహేతుకమైనదిగానే అనిపించినప్పటికీ, చర్చీకెళ్లే చాలామందికి దానితో పరిచయం లేదు. తాము మరణించినప్పుడు నేరుగా పరలోకానికి వెళతామనే వాళ్లు నమ్ముతున్నారు. ఈ కారణాన్నిబట్టి, కామన్‌వీల్‌ 1995 మే 5 సంచికలో, జాన్‌ గేర్వీ అనే రచయిత ఇలా ఆరోపించాడు: “[మరణానంతర జీవితాన్ని గూర్చిన విషయంలో] అనేకమంది క్రైస్తవుల నమ్మకం, నిజంగా క్రైస్తవత్వానికి సంబంధించిన దేనికన్నా కూడా నియోప్లేటోనిజమ్‌కు ఎంతో దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది పైగా బైబిలు ఆధారం లేదు.” వాస్తవానికి, బైబిలును ప్లేటో సిద్ధాంతానికి మారకం చేయడం ద్వారా, క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు బైబిలునందున్న పునరుత్థాన నిరీక్షణను తమ చర్చి సభ్యులకు అందకుండా చేశారు.

21 మరోవైపున, యెహోవాసాక్షులు అన్య తత్త్వజ్ఞానాన్ని నిరాకరించి, పునరుత్థానాన్ని గూర్చిన బైబిలు బోధను హత్తుకుంటారు. అలాంటి బోధ ఆధ్యాత్మిక వికాసాన్నిస్తుంది, సంతృప్తినిస్తుంది, ఓదార్పునిస్తుంది. భూ నిరీక్షణగల వారికీ, పరలోక జీవితానికి పునరుత్థానం చేయబడే ఉత్తరాపేక్షగల వారికీ, పునరుత్థానాన్ని గూర్చిన బైబిలు బోధ వాస్తవాలపై ఎంతగా ఆధారపడి ఉన్నది, ఎంత సహేతుకమైనది అనే విషయాన్ని మనం తదుపరి శీర్షికల్లో చూద్దాము. ఈ శీర్షికలను పరిశీలించడానికొక సిద్ధపాటుగా, మొదటి కొరింథీయుల పత్రికలోని 15వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదవమని మేము సిఫారసు చేస్తున్నాము.

మీకు జ్ఞాపకమున్నాయా?

◻ పునరుత్థానంలో మనం స్థిర నమ్మకాన్ని ఎందుకు పెంపొందింపజేసుకోవాలి?

◻ యెహోవా ఆదాము హవ్వల ఎదుట ఏ ఉత్తరాపేక్షను ఉంచాడు?

◻ గ్రీకు తత్త్వంలో సత్యాన్ని వెదకడం ఎందుకు సహేతుకమైనది కాదు?

◻ పునరుత్థానం ఎందుకు సహేతుకమైన నిరీక్షణైవుంది?

[10వ పేజీలోని చిత్రం]

మన మొదటి తల్లిదండ్రులు పాపం చేసినప్పుడు, వాళ్లు భూమిపై నిత్యజీవ నిరీక్షణను కోల్పోయారు

[12వ పేజీలోని చిత్రం]

అమర్త్యమైన ఆత్మను గూర్చిన ప్లేటో నమ్మకంతో చర్చి పండితులు ప్రభావితమయ్యారు

[క్రెడిట్‌ లైను]

Musei Capitolini, Roma

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి