‘సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును’
“మీరు . . . సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయు[ను]” అని యెరూషలేములోని దేవాలయంలో జనసమూహాలకు బోధిస్తున్నప్పుడు యేసు ప్రకటించాడు. (యోహాను 8:31, 32) యేసు బోధలు సత్యమైనవని యేసు అపొస్తలులు వెంటనే గుర్తించగలిగారు. తమ బోధకుడు దేవుని వద్దనుండి వచ్చాడనడానికి కావలసినంత సాక్ష్యాధారాన్ని వాళ్లు చూశారు.
అయితే, యేసు ఏ సత్యాన్ని గురించి మాట్లాడాడో ఆ సత్యాన్ని గుర్తించడం నేడు కొంతమందికి కష్టంగా ఉండవచ్చు. ప్రవక్తయైన యెషయా కాలంలోలా నేడు, ‘కీడు మేలనియు మేలు కీడనియు, చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొనువారు, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారు’ ఉన్నారు. (యెషయా 5:20) ఈ రోజుల్లో ఎన్నో అభిప్రాయాలు, వేదాంతాలు, జీవనశైలిలు ఏర్పడడంతో, ప్రతిదీ అసంపూర్ణమైనదేననీ, సత్యం వంటిదేదీ లేదనీ అనేకమంది ప్రజలు భావిస్తుంటారు.
సత్యము వారిని స్వతంత్రులను చేస్తుందని యేసు తన ప్రేక్షకులకు చెప్పినప్పుడు, వారు దానికి సమాధానంగా, “మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావని” అన్నారు. (యోహాను 8:33) తమను ఎవరైనా లేక ఏదైనా స్వతంత్రులను చేయవలసిన అవసరం ఉందని వారు భావించలేదు. కాని తర్వాత యేసు ఇలా వివరించాడు: “పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (యోహాను 8:34) యేసు మాట్లాడుతున్న సత్యము, పాపం నుండి విడుదల పొందడానికి మార్గాన్ని తెరువగలదు. యేసు ఇలా అన్నాడు: “కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.” (యోహాను 8:36) కాబట్టి ప్రజలను స్వతంత్రులను చేసే సత్యము ఏమిటంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన సత్యమే. యేసు పరిపూర్ణ మానవ జీవిత బలియందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఎవరైనా పాపమరణాల నుండి విడుదల పొందగల్గుతారు.
మరో సందర్భంలో యేసు ఇలా అన్నాడు: “సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.” (యోహాను 17:17) బైబిల్లో వ్యక్తపర్చబడినట్లుగా దేవుని వాక్యమే సత్యము, అది మూఢనమ్మకాల నుండీ అబద్ధ ఆరాధన నుండీ స్వతంత్రులను చేయగలదు. బైబిల్లో యేసుక్రీస్తును గురించిన సత్యం ఉంది, అది ప్రజలు ఆయనయందు విశ్వాసముంచడానికి నడిపి, భవిష్యత్తు కోసం అద్భుతమైన నిరీక్షణ కల్గివుండడానికి మార్గాన్ని తెరుస్తుంది. దేవుని వాక్య సత్యాన్ని తెలుసుకోగల్గడం అద్భుతమైన విషయం!
సత్యాన్ని తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యం? బైబిలును అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ, నేడు అనేక మతాలు మానవ వేదాంతాలతో, ఆచారాలతో ఎక్కువగా ప్రభావితమయ్యాయి. తరచూ, మతనాయకులు తాము ఇస్తున్న సందేశం ఎంత కచ్చితంగా ఉంది అనేదాని కన్నా అది ప్రజలకు అంగీకారంగా ఉందా అనే విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. యథార్థంగా ఆరాధించినంతవరకూ దేవుడు ఏ విధమైన ఆరాధననైనా అంగీకరిస్తాడని కొంతమంది భావిస్తారు. కాని యేసుక్రీస్తు ఇలా వివరించాడు: “యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు.”—యోహాను 4:23.
దేవునికి అంగీకారమైన విధంగా మనం ఆరాధించాలంటే, మనం సత్యాన్ని తెలుసుకోవాలి. ఇదొక ప్రాముఖ్యమైన విషయం. మన నిరంతర సంతోషం దానిపై ఆధారపడి ఉంది. కాబట్టి, ప్రతి ఒక్కరూ తమను తాము ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నా ఆరాధనా విధానం దేవునికి అంగీకారంగా ఉందా? దేవుని వాక్య సత్యాన్ని నేర్చుకోవడానికి నేను నిజంగా ఆసక్తి కల్గివున్నానా? లేక జాగ్రత్తతో కూడిన పరిశీలన వెల్లడించగలదాని గురించి నేను భయపడుతున్నానా?’