కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 12/1 పేజీలు 10-15
  • తలిదండ్రులారా, మీ పిల్లలనుబట్టి ఆనందించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తలిదండ్రులారా, మీ పిల్లలనుబట్టి ఆనందించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మాటలకు ప్రాధాన్యత
  • బాల్యం నుండే క్రమశిక్షణ లేక తర్ఫీదునివ్వడం
  • క్రమంగా “నీరు” అందజేయడం
  • పిల్లలకు కాపుదలను ఇవ్వడం
  • ప్రేమపూర్వక శిక్షణనివ్వడం
  • ప్రయాసకు తగిన ప్రతిఫలం
  • పసితనంనుండే మీ పిల్లవానికి తర్ఫీదునివ్వండి
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • తల్లిదండ్రులారా—మీ పిల్లలకు ప్రేమతో శిక్షణనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబాన్ని నిర్మించుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • మన పిల్లలు—ఒక అమూల్యమైన స్వాస్థ్యము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 12/1 పేజీలు 10-15

తలిదండ్రులారా, మీ పిల్లలనుబట్టి ఆనందించండి

“నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను.”—సామెతలు 23:25.

1. తలిదండ్రులు తమ పిల్లలనుబట్టి ఆనందాన్ని పొందేలా చేసేదేమిటి?

మీరే ఒక మొక్కను నాటి, దాన్ని పెంచడంలో శ్రద్ధ వహించినట్లైతే, అది పెరిగి కనులవిందు కలిగించే, నీడనిచ్చే వృక్షంగా మారడాన్ని చూడడం ఎంత బాగుంటుందో కదా! అలాగే, “నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును. నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను” అని బైబిలు సామెత చెబుతున్నట్లుగా, పరిణతి చెందిన దేవుని సేవకులయ్యేలా ఎదిగే పిల్లల గురించి శ్రద్ధ తీసుకునే తలిదండ్రులు వారినిబట్టి ఎంతో ఆనందాన్ని పొందుతారు.—సామెతలు 23:24, 25.

2, 3. (ఎ) తలిదండ్రులు వ్యసనమును దుఃఖాన్ని ఎలా తప్పించుకోవచ్చు? (బి) ఆనందానికి మూలం అయ్యేందుకు మొక్కలకు మరియు పిల్లలకు ఏమి అవసరం?

2 అయినప్పటికీ, ఒక బాలుడు తనంతట తాను “నీతిమంతుని”గా లేక “జ్ఞానముగలవాని”గా తయారుకాడు. ఒక మొక్కను వృక్షంగా మార్చడంలో పని ఇమిడి ఉన్నట్లుగానే, యౌవనులను “వ్యసనము” మరియు “బాధ” కలగడానికి మూలం కాకుండ ఉంచడానికి ఎంతో కృషి అవసరం. (సామెతలు 17:21, 25) ఉదాహరణకు, మొక్క నిటారుగా, బలంగా ఎదగడానికి కర్రలు తోడ్పడగలవు. క్రమమైన నీటిపారుదల అవసరం, ఒక మొక్కను తెగుళ్ల నుండి కాపాడవలసి ఉంటుంది. చివరగా, చక్కని వృక్షం తయారయ్యేందుకు అనవసరమైన కొమ్మలను నరికివేయడం సహాయం చేస్తుంది.

3 పిల్లలకు దైవిక తర్ఫీదు, బైబిలు సత్యపు నీటితో తడపడం, నైతిక దుర్‌వ్యవహారాల నుండి కాపుదల, అకాంక్షణీయమైన ఉరులను తొలగించడానికి ప్రేమపూర్వకమైన క్రమశిక్షణ వంటివి అవసరమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ అవసరతలను తీర్చడానికి, ప్రాముఖ్యంగా తండ్రులు తమ పిల్లలను “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచాలని కోరబడ్డారు. (ఎఫెసీయులు 6:4) దీనిలో ఏమి ఇమిడి ఉంది?

యెహోవా మాటలకు ప్రాధాన్యత

4. తలిదండ్రులకు తమ పిల్లల ఎడల ఏ బాధ్యత ఉంది, వారు దాన్ని నెరవేర్చకముందు ఏమి చేయడం అవసరం?

4 “ప్రభువు యొక్క . . . బోధ” అంటే మన ఆలోచనా విధానాన్ని యెహోవా చిత్తానికి అనుగుణంగా మలచుకోవడమని భావం. కాబట్టి తలిదండ్రులు తమ పిల్లల్లో యెహోవా ఆలోచనా విధానాన్ని నాటాలి. వాత్సల్యపూరిత శిక్షణను లేక సరిదిద్దే తర్ఫీదును ఇవ్వడంలో వారు దేవుని మాదిరిని కూడా అనుసరించాలి. (కీర్తన 103:10, 11; సామెతలు 3:11, 12) కాని, “నేడు నేను నీకాజ్ఞాపించు [యెహోవా నుండి వచ్చిన] ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను” అని దేవుని ప్రవక్తయైన మోషే ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఉపదేశించినట్లుగా తలిదండ్రులు ఈ పని చేయకముందు తమకై తాము యెహోవా మాటలను అన్వయించుకోవాలి.—ద్వితీయోపదేశకాండము 6:6, ఇటాలిక్కులు మావి.

5. ఇశ్రాయేలు తలిదండ్రులు తమ పిల్లలకు ఎప్పుడు మరియు ఏ విధంగా బోధించాలి, “అభ్యసింప”జేయడం అంటే ఏమిటి?

5 బైబిలును క్రమంగా పఠించడం, ధ్యానించడం మరియు ప్రార్థన, మోషే తర్వాత ఆజ్ఞాపించిన దీనిని చేయడానికి తలిదండ్రులను ఆయత్తపరుస్తాయి: “నీవు నీ కుమారులకు [యెహోవా మాటలను] అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.” “అభ్యసింప”జేయడమని అనువదింపబడిన హెబ్రీ పదానికి “పునరుద్ఘాటించడం,” “మరల మరల చెప్పడం,” “స్పష్టంగా ముద్రించడం” అనే భావాలున్నాయి. యెహోవా మాటలకు ప్రథమ స్థానాన్నివ్వవలసిన అవసరతను ఆ తర్వాత మోషే ఎలా నొక్కి తెలియజేశాడో గమనించండి: “సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను. నీ యింటి ద్వారబంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.” తలిదండ్రులు తమ పిల్లల ఎడల క్రమమైన, ప్రేమపూర్వకమైన శ్రద్ధ చూపాలని యెహోవా కోరుతున్నాడన్నది స్పష్టమౌతుంది!—ద్వితీయోపదేశకాండము 6:7-9, ఇటాలిక్కులు మావి.

6. తలిదండ్రులు తమ పిల్లలకు ఏమి అభ్యసింపజేయాలి, దాని ప్రయోజనమేమిటి?

6 తలిదండ్రులు తమ పిల్లలకు అభ్యసింపజేయవలసిన యెహోవా యొక్క “ఈ మాటలు” ఏవి? నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, దురాశ పడకూడదు వంటి ఆజ్ఞలతో సహా, సాధారణంగా పది ఆజ్ఞలు అని పిలువబడే వాటిని మోషే ఇప్పుడే పునరుద్ఘాటించాడు. ఇశ్రాయేలు తలిదండ్రులు తమ పిల్లలకు ప్రాముఖ్యంగా అలాంటి నైతికావసరతలను, అలాగే ‘నీ దేవుడైన యెహోవాను పూర్ణహృదయంతోను పూర్ణాత్మతోను పూర్ణశక్తితోను ప్రేమించమనే’ ఆజ్ఞను అభ్యసింపజేయాలి. (ద్వితీయోపదేశకాండము 5:6-21; 6:1-5) పిల్లలకు నేడు అవసరమైనది ఈ విధమైన బోధనేనని మీరు అంగీకరించరా?

7. (ఎ) బైబిలునందు పిల్లలు వేటితో పోల్చబడ్డారు? (బి) మనం ఇప్పుడు ఏమి పరిశీలిస్తాము?

7 ఇశ్రాయేలీయుడైన తండ్రికి ఇలా చెప్పబడింది: “నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.” (కీర్తన 128:3) అయితే, తలిదండ్రులు తమ “మొక్కలను” బట్టి వ్యసనపడే బదులు ఆనందాన్ని కనుగొనడానికి, వారు తమ పిల్లల విషయంలో వ్యక్తిగతంగా, అనుదినం శ్రద్ధ తీసుకోవాలి. (సామెతలు 10:1; 13:24; 29:15, 17) తలిదండ్రులు తాము తమ పిల్లలనుబట్టి ఆనందించగలిగేలా వారికి ఎలా తర్ఫీదివ్వవచ్చో, ఆత్మీయంగా నీరుపోయవచ్చో, కాపాడవచ్చో, ప్రేమపూర్వకంగా క్రమశిక్షణలో పెట్టవచ్చో మనం పరిశీలిద్దాము.

బాల్యం నుండే క్రమశిక్షణ లేక తర్ఫీదునివ్వడం

8. (ఎ) తిమోతికి తర్ఫీదునివ్వగల్గే సహాయక కర్రలుగా ఎవరు పనిచేశారు? (బి) శిక్షణ ఎప్పుడు ప్రారంభమయ్యింది, దాని ఫలితమేమిటి?

8 స్థిరంగా పాతబడి తర్ఫీదునివ్వగల్గే రెండు సహాయక కర్రలవంటి తన తల్లి, అవ్వల నుండి మద్దతును పొందిన తిమోతిని పరిశీలించండి. తిమోతి తండ్రి గ్రీసుదేశస్థుడు, అవిశ్వాసి అయ్యుండవచ్చునని స్పష్టమౌతుంది గనుక, యూదురాలైన ఆయన తల్లి యునీకే మరియు ఆమె తల్లియైన లోయీ ఆ పిల్లవానికి ‘బాల్యం నుండి పరిశుద్ధ లేఖనాల్లో’ శిక్షణనిచ్చారు. (2 తిమోతి 1:5; 3:15; అపొస్తలుల కార్యములు 16:1) తిమోతి పసివాడై ఉన్నప్పుడు కూడా “[యెహోవా] చేసిన ఆశ్చర్యకార్యములను” ఆయనకు బోధించడంలో వారు కనబర్చిన పట్టుదల గొప్ప ప్రతిఫలాన్ని పొందింది. (కీర్తన 78:1, 3, 4) బహుశా యౌవనుడై ఉండగానే తిమోతి సుదూర ప్రాంతాలకు మిషనరీ అయ్యాడు, తొలి క్రైస్తవ సంఘాలను బలపర్చడంలో ఆయన ప్రముఖ పాత్ర నిర్వహించాడు.—అపొస్తలుల కార్యములు 16:2-5; 1 కొరింథీయులు 4:17; ఫిలిప్పీయులు 2:19-23.

9. వస్తుసంపద ఉరులను తప్పించుకోవడాన్ని పిల్లలు ఎలా నేర్చుకోవచ్చు?

9 తలిదండ్రులారా, మీరు ఏ విధమైన తోడ్పాటునిచ్చే ఊతకర్రలుగా ఉన్నారు? ఉదాహరణకు, మీ పిల్లలు వస్తుసంబంధ విషయాల గురించి సమతూక దృక్పథాన్ని వృద్ధి చేసుకోవాలని మీరు ఇష్టపడుతున్నారా? అయితే మీరు ఆధునిక ఉపకరణాలన్నిటినీ లేక మీకు నిజంగా అవసరం లేని ఇతర వస్తువులను సంపాదించుకోవడానికి పాటుపడకుండా ఉండడం ద్వారా మీరు సరైన మాదిరినుంచాలి. మీరు వస్తుసంబంధ లాభాలను పొందేందుకు పాటుపడడాన్ని ఎంపిక చేసుకుంటే, మీ పిల్లలు మిమ్మల్ని అనుకరిస్తే ఆశ్చర్యపోకండి. (మత్తయి 6:24; 1 తిమోతి 6:9, 10) వాస్తవానికి ఆ కర్రలు నిటారుగా లేకపోతే, మొక్క నిటారుగా ఎలా పెరగగలదు?

10. తలిదండ్రులు ఎల్లప్పుడూ ఎవరి నడిపింపును తీసుకోవాలి, వారి దృక్పథం ఏమైవుండాలి?

10 తమ పిల్లలనుబట్టి ఆనందాన్ని పొందే తలిదండ్రులు, తమ పిల్లలకు ఆత్మీయంగా ప్రయోజనకరమైన దానిని ఎల్లవేళలా పరిగణనలోకి తీసుకుంటూ, వారికి తర్ఫీదునిచ్చేందుకు ఎల్లప్పుడు దైవిక సహాయం కొరకు వెదుకుతారు. నలుగురు పిల్లల తల్లి ఇలా తెలియజేసింది: “మా పిల్లలు జన్మించక ముందే, మంచి తలిదండ్రులుగా ఉండడానికి యెహోవా వాక్యంచే నడిపించబడడానికి దాన్ని మా జీవితాల్లో అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయమని మేము ఆయనకు క్రమంగా ప్రార్థించేవాళ్లము.” ఆమె ఇంకా ఇలా తెలియజేసింది: “‘యెహోవాకు మొదటి స్థానం’ అన్నది కేవలం ఒక సాధారణ వాక్యం కాదు గాని మేము మా జీవితాలను దానికనుగుణంగా జీవించాము.”—న్యాయాధిపతులు 13:8.

క్రమంగా “నీరు” అందజేయడం

11. మొక్కలకు మరియు పిల్లలకు పెరుగుదల కొరకు ఏమి అవసరం?

11 నది ప్రక్కన ఉండే వృక్షాలు ఎంత చక్కగా ఎదుగుతాయనేది సూచిస్తున్నట్లుగా, మొక్కలకు ప్రాముఖ్యంగా ఎల్లప్పుడూ నీటిపారుదల అవసరం. (ప్రకటన 22:1, 2 పోల్చండి.) బైబిలు సత్యపు నీటిని క్రమంగా అందజేస్తే పసిపిల్లలు కూడా ఆత్మీయంగా వర్ధిల్లుతారు. అయితే తలిదండ్రులు తమ బిడ్డ యొక్క అవధాన పరిధిని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. ఎక్కువ కాలనిడివిగల కొన్ని ఉపదేశ కార్యక్రమాలకంటే తక్కువ కాలనిడివిగల ఉపదేశ కార్యక్రమాలను తరచూ ఏర్పాటు చేసుకోవడం ఎక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చు. తక్కువ కాలనిడివిగల అలాంటి కార్యక్రమాల విలువను తక్కువ అంచనా వేయకండి. తల్లి/తండ్రికి బిడ్డకు మధ్య ఒక అనుబంధాన్ని ఏర్పరచడానికి సమయాన్ని కలిసి గడపడం ఎంతో ప్రాముఖ్యం, లేఖనాల్లో అలాంటి సన్నిహితత్వం పదే పదే ప్రోత్సహింపబడింది.—ద్వితీయోపదేశకాండము 6:6-9; 11:18-21; సామెతలు 22:6.

12. పిల్లలతో కలిసి ప్రార్థించడం యొక్క విలువేమిటి?

12 దినాంతంలో పిల్లలతో సమయాన్ని గడపవచ్చు. ఒక యౌవనస్థురాలు ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది: “ప్రతిరాత్రి మా తలిదండ్రులు మా పక్క చివరలో కూర్చుని, మేము మా సొంతగా ప్రార్థిస్తుండగా వినేవారు.” అలా చేయడం యొక్క విలువను గూర్చి మరో బాలిక ఇలా తెలియజేసింది: “అది, ప్రతిరాత్రి నేను నిద్రపోవడానికి ముందు యెహోవాకు ప్రార్థించడం నాకు అలవాటయ్యేలా చేసింది.” తమ తలిదండ్రులు యెహోవా గురించి మాట్లాడడం, ఆయనకు ప్రార్థించడం పిల్లలు ప్రతిదినం వింటే, ఆయన వారికి వాస్తవమైన వ్యక్తి అవుతాడు. ఒక యౌవనస్థుడు ఇలా చెప్పాడు: “నేను యెహోవాకు ప్రార్థించేటప్పుడు నా కళ్లు మూసుకుని, వాస్తవంగా తాతయ్యవంటి వ్యక్తిని చూడగలుగుతాను. మనం చేసే, చెప్పే ప్రతిదానిలోనూ యెహోవా ఒక పాత్ర నిర్వహిస్తాడని తెలుసుకోవడానికి నా తలిదండ్రులు నాకు సహాయం చేశారు.”

13. క్రమ ఉపదేశ కార్యక్రమాల్లో ఏమి ఇముడ్చవచ్చు?

13 తలిదండ్రులు బైబిలు సత్య నీటిని పీల్చుకునేందుకు పిల్లలకు సహాయం చేయడానికి, క్రమమైన ఉపదేశ కార్యక్రమాల్లో ఆచరణాత్మకమైన అనేక విషయాలను ఇముడ్చవచ్చు. ఇద్దరు పిల్లల తలిదండ్రులు ఇలా చెప్పారు: “పిల్లలిద్దరూ తమ జీవితంలోని మొదటి కొద్ది వారాల నుండే రాజ్యమందిరంలో నిశ్శబ్దంగా కూర్చోవాలనే శిక్షణను పొందడం ప్రారంభించారు.” తమ కుటుంబం ఏమి చేసిందో ఒక తండ్రి ఇలా వివరించాడు: “మేము బైబిలు పుస్తకాలన్నిటినీ ఇండెక్స్‌ కార్డులపై వ్రాసి వాటిని క్రమానుసారంగా పెట్టడాన్ని ఒకరి తర్వాత ఒకరం వంతులు తీసుకుంటూ అభ్యాసం చేసేవాళ్లము. పిల్లలు దీని కొరకు ఎప్పుడూ ఎదురుచూసేవారు.” అనేక కుటుంబాలు భోజనానికి ముందు లేక ఆ తర్వాత స్వల్ప ఉపదేశ కార్యక్రమాన్ని పెట్టుకుంటాయి. ఒక తండ్రి ఇలా చెప్పాడు: “అనుదిన బైబిలు లేఖనాన్ని చర్చించడానికి మాకు సాయంకాల భోజనవేళ మంచి సమయంగా ఉండేది.”

14. (ఎ) ఆత్మీయంగా ప్రతిఫలదాయకమైన ఏ కార్యకలాపాలను పిల్లలతో పంచుకోవచ్చు? (బి) పిల్లలకు నేర్చుకునే సామర్థ్యం ఎంతగా ఉంటుంది?

14 నా బైబిలు కథల పుస్తకం (ఆంగ్లం) నుండి ఉత్తేజవంతమైన బైబిలు వృత్తాంతాలను వినాలని కూడా పిల్లలు ఇష్టపడతారు.a ఒక జంట ఇలా తెలియజేసింది: “పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, బైబిలు కథల పుస్తకం నుండి ఒక పాఠాన్ని ముగించిన తర్వాత, పిల్లలు కాస్ట్యూమ్స్‌ వేసుకుని అందులోని భాగాలను చిన్న నాటకంలాగా ప్రదర్శించి చూపేవారు. వాళ్లు దీన్ని ఎంతగానో ఇష్టపడేవారు, తరచూ ఒక పఠనంలో ఒకటికంటే ఎక్కువ కథలు చేయాలని పట్టుబట్టేవారు.” మీ బిడ్డకుగల నేర్చుకునే సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి! నాలుగేళ్ల పిల్లలు బైబిలు కథల పుస్తకంలోని మొత్తం అధ్యాయాలను కంఠస్థం చేశారు, బైబిలు చదవడం కూడా నేర్చుకున్నారు! తనకు దాదాపు మూడున్నర సంవత్సరాలున్నప్పుడు తాను “జ్యుడీషియల్‌ డెసిషన్స్‌” అనే పదాన్ని పదే పదే తప్పుగా ఉచ్చరించేదానినని ఒక యౌవనస్థురాలు జ్ఞాపకం చేసుకుంటోంది, కాని ఆమె తండ్రి ఆ పదాన్ని సరిగ్గా ఉచ్చరించడాన్ని అభ్యసించమని ఆమెను ప్రోత్సహించేవాడు.

15. పిల్లలతో చర్చల్లో ఏ విషయాలను ఇముడ్చవచ్చు, అలాంటి చర్చలు విలువైనవనడానికి ఏ సాక్ష్యాధారం ఉంది?

15 మీరు మీ పిల్లలతో గడిపే సమయాన్ని, కూటాలలో వ్యాఖ్యానించడం వంటి వాటి ద్వారా ఇతరులతో సత్యపు నీటిని పంచుకోవడానికి వారిని సిద్ధం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. (హెబ్రీయులు 10:24, 25) “మేము అభ్యాసం చేసే సమయాల్లో, నేను నా స్వంత మాటల్లో వ్యాఖ్యానించవలసి ఉండేది, అర్థం చేసుకోకుండా కేవలం చదవడానికి నాకు అనుమతి లభించేదికాదు” అని ఒక యౌవనస్థురాలు గుర్తు చేసుకుంటోంది. అంతేగాక, ప్రాంతీయ పరిచర్యలో అర్థవంతమైన భాగం కలిగి ఉండేందుకు పిల్లలకు తర్ఫీదునివ్వవచ్చు. దైవభయంగల తలిదండ్రులచే పెంచబడిన ఒక స్త్రీ ఇలా వివరిస్తుంది: “తమ ప్రకటన పని మీద వెళుతున్న మా తలిదండ్రులను కేవలం అనుసరించేవారిగా మేము ఎన్నడూ ఉండలేదు. కేవలం డోర్‌బెల్‌ మోగించి కరపత్రాన్ని అందించేదే అయినా, అందులో మేము భాగం వహించవలసి ఉందని మాకు తెలుసు. ప్రతి వారాంత కార్యకలాపాల కొరకు ముందే జాగ్రత్తగా సిద్ధపడడం ద్వారా, మేము ఏమి చెబుతామో మాకు తెలిసేది. శనివారం ఉదయం నిద్రలేవగానే, పరిచర్యకు వెళతామా లేదా అనే ప్రశ్నే ఉత్పన్నమయ్యేదికాదు. మేము వెళుతున్నామని మాకు తెలుసు.”

16. పిల్లలతో కుటుంబ పఠనాన్ని నిర్వహించేటప్పుడు క్రమం తప్పకుండా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

16 పిల్లలకు బైబిలు సత్యపు నీటిని క్రమంగా అందజేయడం ఎంతో ప్రాముఖ్యం, అంటే వారపు కుటుంబ బైబిలు పఠనం ఆవశ్యకమని భావం. “పిల్లలకు చికాకు కలిగించే ఒక ముఖ్యకారణం అస్థిరత” అని ఇద్దరు పిల్లల తండ్రి చెబుతున్నాడు. (ఎఫెసీయులు 6:4) ఆయనిలా చెప్పాడు: “నేను నా భార్య ఒక దినాన్ని ఒక సమయాన్ని ఎంపిక చేసుకుని, ఆ పట్టిక ప్రకారం కుటుంబ పఠనం నమ్మకంగా నిర్వహించేవాళ్లం. ఆ సమయంలో పిల్లలు దాని కొరకు ఎదురుచూడడానికి ఎక్కువ కాలం పట్టలేదు.” ‘మొక్కను ఎటు వంచితే, చెట్టు అలాగే పెరుగుతుంది’ అనే నిర్వివాద సత్యం అనుసారంగా, బాల్యం నుండి అలాంటి శిక్షణ ఇవ్వడం ప్రాముఖ్యం.

17. పిల్లలకు బైబిలు సత్యాలను అందజేయడమంత ప్రాముఖ్యమైనదేమిటి?

17 పిల్లలకు బైబిలు సత్యాలను అందజేయడం ప్రాముఖ్యమే, అయితే తలిదండ్రుల మాదిరి కూడా అంత ప్రాముఖ్యమైనదే. మీరు పఠించడాన్ని, క్రమంగా కూటాలకు హాజరు కావడాన్ని, పరిచర్యలో పాల్గొనడాన్ని, అంటే యెహోవా చిత్తం చేయడంలో మీరు ఆనందం పొందడాన్ని మీ పిల్లలు చూస్తున్నారా? (కీర్తన 40:8) వారలా చూడడం ప్రాముఖ్యం. విశేషంగా, తన భర్త వ్యతిరేకతను సహించి ఆరుగురు పిల్లలను నమ్మకమైన సాక్షులయ్యేలా పెంచిన తమ తల్లి గురించి ఒక కుమార్తె ఇలా తెలియజేసింది: “మమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది మా అమ్మ స్వంత మాదిరే—అదే మాటలకంటే ఎక్కువ ప్రభావాన్ని చూపింది.”

పిల్లలకు కాపుదలను ఇవ్వడం

18. (ఎ) పిల్లలకు అవసరమైన కాపుదలను తలిదండ్రులు వారికెలా ఇవ్వగలరు? (బి) ప్రత్యుత్పత్తి శరీర భాగాల గురించి ఇశ్రాయేలు పిల్లలకు ఏ విధమైన ఉపదేశం లభించింది?

18 మొక్కలకు తరచూ ప్రమాదకరమైన తెగుళ్ల నుండి కాపుదల అవసరమైనట్లే, ఈ దుష్టవిధానంలో పిల్లలకు “దుర్జనుల” నుండి కాపుదల అవసరం. (2 తిమోతి 3:1-5, 13) తలిదండ్రులు ఈ కాపుదలను ఎలా ఇవ్వగలరు? వారు దైవిక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సహాయం చేయడం ద్వారా! (ప్రసంగి 7:12) సరైన మరియు సరైనదికాని లైంగిక ప్రవర్తనను గుర్తించడం ఇమిడివున్న తన ధర్మశాస్త్రం చదువబడుతున్నప్పుడు వినమని యెహోవా వారి ‘పిల్లలతో’ సహా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. (ద్వితీయోపదేశకాండము 31:12; లేవీయకాండము 18:6-24) “వృషణములు” మరియు “జననేంద్రియం” వంటివాటితోసహా ప్రత్యుత్పత్తి శరీర భాగాలు పదే పదే ప్రస్తావించబడ్డాయి. (లేవీయకాండము 15:1-3, 16, NW; 21:20; 22:24; సంఖ్యాకాండము 25:8; ద్వితీయోపదేశకాండము 23:10) నేటి ప్రపంచపు విపరీత కలుషితం మూలంగా, “చాలమంచిది” అని దేవుడు పిలిచిన సృష్టిలోని భాగమైన అలాంటి శరీరభాగాల సరైన మరియు సరికాని ఉపయోగం గురించి పిల్లలు తెలుసుకోవలసిన అవసరత ఉంది.—ఆదికాండము 1:31; 1 కొరింథీయులు 12:21-24.

19. తమ గుప్త శరీర భాగాల గురించి ఏ సమాచారం పిల్లలకు చెప్పడం సముచితంగా ఉంటుంది?

19 తలిదండ్రులిద్దరూ కలిసి లేక సంరక్షకుడు పిల్లవానికి వాని గుప్త శరీర భాగాల గురించి తెలియజేయాలి. తర్వాత, ఏ ఇతర వ్యక్తి ఈ భాగాలను ముట్టకూడదని వివరించాలి. పిల్లలపై అత్యాచారానికి పాల్పడేవారు కుయుక్తితో కూడిన చేష్టలకు పిల్లలు తరచూ ఎలా ప్రతిస్పందిస్తారనేది పరీక్షిస్తారు గనుక, దృఢంగా వ్యతిరేకించి “నీ గురించి చెబుతాను” అని చెప్పడాన్ని పిల్లవానికి నేర్పించాలి. తమకు అసౌకర్యం కలిగే విధంగా ముట్టుకోవడానికి ఎవరు ప్రయత్నించినా, వాళ్లు ఎంత భయం గొలిపేలా బెదిరించినా వారి గురించి ఎల్లప్పుడు చెప్పాలని మీ పిల్లలకు నేర్పండి.

ప్రేమపూర్వక శిక్షణనివ్వడం

20. (ఎ) క్రమశిక్షణ ఎలా అనవసరమైన కొమ్మలను నరికివేయడం వంటిది? (బి) క్రమశిక్షణ యొక్క ప్రారంభ ప్రభావం ఏమిటి, అయితే దాని ఫలితమేమిటి?

20 అనవసరమైన కొమ్మలను నరికివేయడం ద్వారా వృక్షం ప్రయోజనం పొందినట్లే పిల్లలు ప్రేమపూర్వక క్రమశిక్షణ ద్వారా ప్రయోజనం పొందుతారు. (సామెతలు 1:8, 9; 4:13; 13:1) అనవసరమైన కొమ్మలను నరికివేసినప్పుడు, వేరే కొమ్మలు బాగా పెరగగలుగుతాయి. కాబట్టి మీ పిల్లలు ప్రాముఖ్యంగా వస్తుసంబంధ సంపదలపై దృష్టిని కేంద్రీకరిస్తుంటే లేక చెడు సహవాసాల వైపు లేక అంతమంచిదికాని వినోదం వైపు మొగ్గుచూపుతుంటే, ఈ చెడు కోరికలు నరికివేయవలసిన కొమ్మలవంటివి. వాటిని తీసివేస్తే, మీ పిల్లలు ఆత్మీయ దిశలో ఎదగడానికి సహాయాన్ని పొందుతారు. అనవసరమైన కొమ్మలను తీసివేయడం వృక్షానికి భంగం కలిగించేలానే, ప్రారంభంలో అలాంటి క్రమశిక్షణ ప్రీతికరంగా ఉండకపోవచ్చు. కాని క్రమశిక్షణ యొక్క చక్కని ఫలితం ఏమిటంటే, మీ బిడ్డ ఏ దిశలో ఎదగాలని మీరు కోరుకుంటే ఆ దిశలో పునర్నూతనం చేయబడిన పెరుగుదల.—హెబ్రీయులు 12:5-11.

21, 22. (ఎ) క్రమశిక్షణనివ్వడం మరియు తీసుకోవడం ఆహ్లాదకరమైనవి కావని ఏది సూచిస్తుంది? (బి) తలిదండ్రులు ఎందుకు క్రమశిక్షణనివ్వకుండా ఉండకూడదు?

21 క్రమశిక్షణ ఇవ్వడమైనా తీసుకోవడమైనా ప్రీతికరంగా ఉండదన్నది అంగీకరించవలసిన విషయమే. “నా కుమారుడు ఒక యౌవనస్థునితో ఎక్కువ సమయాన్ని గడుపుతుండేవాడు, అతనితో సహవసించడం మంచిది కాదని పెద్దలు నన్ను హెచ్చరించారు. నేను చర్య తీసుకున్నదానికంటే ఇంకా త్వరగా చర్య తీసుకోవలసింది. నా కుమారుడు మరీ నీచమైన తప్పు చేయకపోయినా, అతని ఆలోచనా విధానాన్ని సరిచేయడానికి కొంత సమయం పట్టింది” అని ఒక తండ్రి తెలియజేస్తున్నాడు. ఆ కుమారుడు ఇలా చెప్పాడు: “నేను నా ప్రాణ స్నేహితుని నుండి వేరుచేయబడినప్పుడు, నేను చితికిపోయాను.” కాని అతడిలా జతచేశాడు: “అది మంచి నిర్ణయం, ఎందుకంటే ఆ తర్వాత త్వరలోనే అతడు బహిష్కరింపబడ్డాడు.”

22 “శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు” అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి క్రమశిక్షణనివ్వడం మీకు ఎంత కష్టం అనిపించినప్పటికీ మీ పిల్లలను క్రమశిక్షణలో పెట్టకుండా ఉండకండి. (సామెతలు 6:23; 23:13; 29:17) తగినకాలంలో, మీరు వారిని సరిచేసినందుకు వారు మీ ఎడల కృతజ్ఞత కలిగివుంటారు. “నన్ను క్రమశిక్షణలో పెట్టినప్పుడు నేను మా తలిదండ్రుల ఎడల కోపంగా ఉండడం నాకు గుర్తుంది. నా తలిదండ్రులు నాకు ఆ క్రమశిక్షణను ఇవ్వకపోయినట్లయితే నేను ఇప్పుడు ఇంకా కోపంగా ఉండేవాడిని” అని ఒక యౌవనస్థుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు.

ప్రయాసకు తగిన ప్రతిఫలం

23. పిల్లల ఎడల చూపించే ప్రేమపూర్వక శ్రద్ధంతా ఎందుకు ప్రతిఫలానికి తగినది?

23 తలిదండ్రులు మరియు ఇతరులు ఆనందాన్ని కనుగొనేలాంటి పిల్లలు అనుదిన అమిత ప్రేమపూర్వక శ్రద్ధ యొక్క ఉత్పాదకాలన్నది నిర్వివాదాంశము. అయితే, వారి కోసం పడిన ప్రయాసంతా—వారు భౌతికసంబంధమైన పిల్లలైనా లేక ఆత్మీయ పిల్లలైనా—తర్వాత లభించే ప్రతిఫలానికి తగినదే. వృద్ధుడైన అపొస్తలుడగు యోహాను ఇలా వ్రాసినప్పుడు అదే చూపించాడు: “నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.”—3 యోహాను 4.

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సంస్థ ప్రచురించినది.

మీకు జ్ఞాపకం ఉన్నాయా?

◻ ప్రశంసించదగినట్లు ఉండడానికి మొక్కలకు మరియు పిల్లలకు ఏమి అవసరం?

◻ తలిదండ్రులు ప్రభావవంతమైన తర్ఫీదునిచ్చే కర్రలుగా ఎలా పనిచేయగలరు?

◻ పిల్లల కొరకైన ఉపదేశ కార్యక్రమాల్లో ఏమి ఇముడ్చవచ్చు, వారికి దేన్ని ఎదిరించడం నేర్పాలి?

◻ పనికిరాని కొమ్మలను తీసివేయడం వృక్షానికి ప్రయోజనకరమైనదైనట్లు, ఒక పిల్లవానికి క్రమశిక్షణ ఎలా ప్రయోజనకరమైనది?

[10వ పేజీలోని చిత్రసౌజన్యం]

Courtesy of Green Chimney’s Farm

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి