కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 2/15 పేజీలు 13-16
  • ప్రేతోర్య సేనలోని వాళ్లు సువార్త విన్నారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రేతోర్య సేనలోని వాళ్లు సువార్త విన్నారు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పౌలు ‘ఏ ఆటంకమూ లేకుండా’ ప్రకటించాడు
  • పౌలు అల్పులకు, ఘనులకు సాక్ష్యమిచ్చాడు
  • ‘నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధించండి’
  • “పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వడం
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • అధికారుల ముందు సువార్తను సమర్థించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • యెహోవా రాజ్యమును నిర్భయముగా ప్రకటించుము!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 2/15 పేజీలు 13-16

ప్రేతోర్య సేనలోని వాళ్లు సువార్త విన్నారు

[13వ పేజీలోని చిత్రం]

అది సా.శ. 59వ సంవత్సరం. ప్రయాణ భారంతో అలసిపోయిన సైనికులు, వాళ్ల అదుపులో ఉన్న చాలామంది ఖైదీలు పోర్టా కాపేనా ద్వారం గుండా రోము నగరంలోకి ప్రవేశించారు. అక్కడున్న పాలన్‌టైన్‌ కొండ మీద నీరో చక్రవర్తి రాజభవనం ఉంది, ప్రేతోర్య సైనికులు దాన్ని 24 గంటలూ కాపలా కాస్తుంటారు.a ఆ సైనికులు తమ పైవస్త్రం కింద రహస్యంగా కత్తులు ఉంచుకునేవాళ్లు. శతాధిపతియైన యూలి తన అదుపులో ఉన్న ఖైదీలతో కలిసి రోమన్‌ ఫోరమ్‌ దాటి నడుచుకుంటూ విమినల్‌ కొండ ఎక్కాడు. వాళ్లంతా రోమా దేవుళ్ల బలిపీఠాలు ఉన్న తోటను దాటి, రోమా సైనికులు కవాతు నిర్వహించే మైదానం గుండా నడక సాగించారు.

[13వ పేజీలోని చిత్రం]

సా.శ. 51కి చెందిన ఆర్చ్‌ ఆఫ్‌ క్లౌదియా మీదిదని భావిస్తున్న ప్రేతోర్య సైనికుల శిల్పం

ఆ బందీల్లో అపొస్తలుడైన పౌలు కూడా ఉన్నాడు. అప్పటికి కొన్ని నెలల క్రితం, ఆయన ఎక్కిన ఓడ తుఫాను ధాటికి బద్దలైన సందర్భంలో ఒక దేవదూత, “నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది” అని పౌలుకు చెప్పాడు. (అపొ. 27:24) మరి ఆ దేవదూత చెప్పినట్లు జరిగిందా? పౌలు రోము నగరంకేసి చూస్తున్నప్పుడు ఆయనకు యెరూషలేములోని అంటోనియా కోట దగ్గర యేసు చెప్పిన ఈ మాటలు తప్పక జ్ఞాపకం వచ్చి ఉంటాయి: “ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలోకూడ సాక్ష్యమియ్యవలసియున్నది.”—అపొ. 23:10, 11.

బహుశా పౌలు అప్పుడు కాస్ట్రా ప్రైటోరీయా కోటవైపు ఒకసారి దృష్టి సారించివుంటాడు. ఎర్రటి ఇటుకలతో కట్టిన ఎత్తైన గోడలు, వాటిమీద దుర్గాలు, బురుజులు ఉన్న పెద్ద కోట అది. ఆ కోటలోనే చక్రవర్తి అంగరక్షకులైన ప్రేతోర్య సేన ఉండేది, అలాగే నగరంలో శాంతిభద్రతలను కాపాడే దళాలు కూడా ఉండేవి. సుమారు 12 వేలమంది ప్రేతోర్య సైనికులు, ఇతర సేనలు, అశ్వదళాలు అలా వేలమంది సైనికులు ఆ కోటలో ఉండేవాళ్లు. ఆ కోట రోమా సైనిక పాటవానికి నిదర్శనంగా ఉండేది. ఇతర ప్రాంతాల నుండి ఖైదీలను రోముకు తరలించే బాధ్యత కూడా ప్రేతోర్య సేనదే కాబట్టి, శతాధిపతియైన యూలి తన అధీనంలో ఉన్న బందీలను నాలుగు ప్రధాన ద్వారాల్లోని ఒక దాని గుండా రోము నగరానికి తీసుకువచ్చాడు. ఎన్నో ప్రమాదాలను తప్పించుకుంటూ కొన్ని నెలలపాటు ప్రయాణించి చివరికి ఆయన ఆ ఖైదీలను చేర్చాల్సిన చోటుకు చేర్చాడు.—అపొ. 27:1-3, 43, 44.

పౌలు ‘ఏ ఆటంకమూ లేకుండా’ ప్రకటించాడు

ఓడ బద్దలౌతుందని, ఆ ప్రమాదం నుండి అందులో ఉన్న వాళ్లందరూ బ్రతికి బయటపడతారని ప్రయాణంలో ఉండగా పౌలుకు దర్శనాల ద్వారా తెలిసింది. పాము కాటేసినప్పుడు కూడా ఆయనకు ఏమీ కాలేదు. పౌలు మెలితే ద్వీపంలో రోగులను బాగు చేసిన తర్వాత అక్కడున్న ప్రజలు ఆయనను ఒక దేవుడిలా చూశారు. మూఢనమ్మకాలను ఇట్టే నమ్మే ప్రేతోర్య సైనికులు కూడా ఈ విషయాల్ని బహుశా వినేవుంటారు.

అంతకుముందే పౌలు తనను చూడడానికి రోము నుండి ‘అప్పీయా సంతపేట వరకును, త్రిసత్రములవరకు వచ్చిన’ సహోదరులను కలిశాడు. (అపొ. 28:15) అయితే ఇప్పుడు రోములో ఖైదీగా ఉన్న పౌలు సువార్త ప్రకటించడం ఎలా కుదురుతుంది? (రోమా. 1:14, 15) ఖైదీలను సాధారణంగా సైనికుల నాయకునికి అప్పగించేవాళ్లని కొంతమంది నమ్ముతారు. అదే నిజమైతే గనుక, బహుశా పౌలును ఆఫ్రాన్యస్‌ బుర్రోస్‌ అనే ప్రేతోర్య నాయకునికి అప్పగించి ఉంటారు.b బహుశా ఆయన చక్రవర్తి తర్వాతి స్థానంలో ఉన్న అధికారి అయ్యుండవచ్చు. విషయం ఏదైనా, పౌలు శతాధిపతుల కావలిలో కాకుండా ఒక సాధారణ ప్రేతోర్య సైనికుని కాపలా క్రింద ఉన్నాడు. ఒక అద్దె ఇంటిలో ఉండేందుకు, సందర్శకుల్ని ఇంట్లోకి రానిచ్చేందుకు, ‘ఏ ఆటంకం లేకుండా’ వాళ్లకు ప్రకటించేందుకు పౌలుకు అనుమతి లభించింది.—అపొ. 28:16, 30, 31.

నీరో కాలంలో ప్రేతోర్య సేన

[14వ పేజీలోని చిత్రం]

ప్రేతోర్య సేన ఆధ్వర్యంలోని జైలు బొమ్మ ఉన్న మొదటి శతాబ్దపు నాణెం

ప్రేతోర్య సైనికులు చక్రవర్తిని, ఆయన కుటుంబాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేసి, తమ పదవీ కాలమంతటిలో దానికి కట్టుబడాల్సి ఉండేది. యుద్ధాలప్పుడు చక్రవర్తి బొమ్మ ఉన్నవాటిని, తిబెరి కైసరు రాశియైన తేలు గుర్తు ఉన్న కవచాలను ధరించి ప్రత్యేకమైన విధంగా తయారయ్యేవాళ్లు. అధికారుల, శతాధిపతుల నిర్దేశం క్రింది వీళ్లు క్రీడా ప్రాంగణాల్లో, నాటక ప్రదర్శనశాలల్లో ప్రజలను అదుపు చేసేవాళ్లు, అగ్నిమాపక దళాల్లో కూడా సేవలందించేవాళ్లు. ఇతర సైనికులు సైన్యంలో 25 ఏళ్ల పాటు పనిచేయాల్సి వస్తే ప్రేతోర్య సేనలోని సైనికులు మాత్రం 16 సంవత్సరాలు మాత్రమే పని చేసేవాళ్లు. ఇతర సైనికులతో పోలిస్తే వాళ్లకు మూడు రెట్లు ఎక్కువ జీతభత్యాలు వచ్చేవి, పదవీ విరమణ సమయంలో కూడా చాలా ఆదాయం లభించేది. ఖైదీలను హింసించి, చంపే పనిని కూడా వీళ్లే చేసేవాళ్లు. అంతకుముందు తాను ఏ ప్రేతోర్య సైనికులను కాపాడడానికి ప్రయత్నించాడో బహుశా అటువంటి సైనికుల చేతుల్లోనే పౌలు రెండవసారి ఖైదీగా ఉన్న సమయంలో హతమై ఉంటాడు.—2 తిమో. 4:16, 17.

Courtesy Classical Numismatic Group, Inc./cngcoins.com

పౌలు అల్పులకు, ఘనులకు సాక్ష్యమిచ్చాడు

[15వ పేజీలోని చిత్రం]

జైల్లో ఉన్న పౌలు, సంఘాలకు పంపించే పత్రికల్లో ఏమేమి రాయాలో చెబుతున్నప్పుడు సైనికులు విన్నారు

పౌలు విషయాన్ని నీరోకి నివేదించే ముందు న్యాయ విచారణలో భాగంగా బహుశా బుర్రోస్‌ పౌలును రాజభవనం వద్ద లేదా ప్రేతోర్య సేన జైలు వద్ద చాలా ప్రశ్నలు అడిగివుంటాడు. “అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చే” ఈ అరుదైన అవకాశాన్ని పౌలు విడిచిపెట్టలేదు. (అపొ. 26:19-23) విచారణ తర్వాత బుర్రోస్‌ ఏ ముగింపుకు వచ్చాడో మనకు తెలియదు కానీ పౌలు మాత్రం ప్రేతోర్య సేన జైల్లో ఉండకుండా మినహాయింపు పొందాడు.c

పౌలు అద్దెకు తీసుకున్న ఇల్లు “యూదులలో ముఖ్యులైనవారిని” ఆహ్వానించడానికి, అలాగే “అతని బసలోనికి అతనియొద్దకు” వస్తున్న అనేకులకు సాక్ష్యమివ్వడానికి సరిపోయేంత పెద్దగా ఉండేది. ఇంకా ఆయన “ఉదయమునుండి సాయంకాలమువరకు” యూదులకు దేవుని రాజ్యం గురించి, యేసు గురించి ‘పూర్తిగా సాక్ష్యం’ ఇస్తుండగా ఆయనకు కాపలా ఉండే ప్రేతోర్య సైనికులు కూడా వినేవాళ్లు.—అపొ. 28:17, 23

[15వ పేజీలోని చిత్రం]

ప్రస్తుతం కాస్ట్రా ప్రైటోరీయా కోట గోడలు ఇలా ఉన్నాయి

రాజ భవనం దగ్గర విధులు నిర్వహించే ప్రేతోర్య సైనికుల బృందం ప్రతీ ఎనిమిది గంటలకు ఒకసారి మారుతుంది. అలాగే పౌలుకు కాపలా కాసే సైనికులు కూడా క్రమంగా మారేవాళ్లు. అక్కడున్న రెండు సంవత్సరాల్లో పౌలు ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సయులకు, హెబ్రీయులకు తన సహాయకుని చేత పత్రికలను రాయిస్తూ, వాటిలోని విషయాలను బయటకు చెబుతున్నప్పుడు సైనికులు విన్నారు. అలాగే ఆయన స్వయంగా ఫిలేమోనుకు ఉత్తరం రాయడాన్ని కూడా వాళ్లు చూశారు. యజమాని నుండి పారిపోయిన ఒనేసిము అనే దాసుని విషయంలో పౌలు ఎంత శ్రద్ధ వహించాడంటే, అతని గురించి చెబుతున్నప్పుడు, ‘నా బంధకములలో నేను కనిన నా కుమారుడు’ అని సంబోధించాడు. ఆ తర్వాత అతణ్ణి తన యజమాని దగ్గరికి తిరిగి పంపించాడు. (ఫిలే. 8-10) తనకు కాపలాగా ఉన్న సైనికుల మీద కూడా పౌలు ఎంతో శ్రద్ధ చూపించివుంటాడు. (1 కొరిం. 9:22) సైనికులు ధరించే కవచంలో ఉన్న వివిధ భాగాల గురించి ఆయన తనకు కాపలాగా ఉన్న సైనికుణ్ణి ప్రశ్నించడాన్ని, తర్వాత ఆ వివరాలను ఒక చక్కని ఉదాహరణలో ఉపయోగించడాన్ని మనం ఊహించుకోవచ్చు.—ఎఫె. 6:13-17.

‘నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధించండి’

పౌలు బందీగా ఉండడం ప్రేతోర్య సైనికుల మధ్య, మరితరుల మధ్య ‘సువార్త మరి యెక్కువగా ప్రబలమవ్వడానికి’ దోహదపడింది. (ఫిలి. 1:12, 13) కాస్ట్రా ప్రైటోరీయా కోటలో ఉన్న వాళ్లకు రోమా సామ్రాజ్యమంతటా, అలాగే చక్రవర్తితోనూ, విస్తారమైన ఆయన బంధుగణంతోనూ మంచి సంబంధాలు ఉండేవి. ఆ బంధుగణంలో కుటుంబ సభ్యులు, సేవకులు, బానిసలు ఉండేవాళ్లు, వాళ్లలో కొంతమంది క్రైస్తవులయ్యారు. (ఫిలి. 4:22) పౌలు నిబ్బరంగా సాక్ష్యం ఇవ్వడం వల్ల, రోమాలో ఉన్న సహోదరులు ‘నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి’ కావాల్సిన ధైర్యాన్ని పొందారు.—ఫిలి. 1:14.

[16వ పేజీలోని చిత్రం]

మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనకు ఆయా సేవలు అందించడానికి మన దగ్గరికి వచ్చేవాళ్లకు సాక్ష్యమివ్వవచ్చు

మనం ‘సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటిస్తుండగా’ రోములో పౌలు చేసిన సాక్ష్యపు పని మనకు కూడా ప్రోత్సాహాన్నిస్తుంది. (2 తిమో. 4:2) మనలో కొంతమందికి ఇళ్లలో నుండి లేదా ఆసుపత్రుల్లో నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొంతమంది విశ్వాసం నిమిత్తం జైళ్లలో ఉన్నారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనల్ని చూడడానికి ఇంటికి వచ్చే వాళ్లకు లేదా మనకు కొన్ని రకాలైన సేవలను అందించడానికి వచ్చేవాళ్లకు మనం సాక్ష్యమివ్వవచ్చు. మనం ప్రతీ సందర్భంలో ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తే, ‘దేవుని వాక్యం బంధింపబడదు’ అనే విషయాన్ని మనం స్వయంగా చవిచూస్తాం.—2 తిమో. 2:8, 9.

సెక్‌స్టస్‌ ఆఫ్రాన్యస్‌ బుర్రోస్‌

[16వ పేజీలోని చిత్రం]

సెక్‌స్టస్‌ ఆఫ్రాన్యస్‌ బుర్రోస్‌ పేరు ఉన్న ఓ శిలాఫలకం

బుర్రోస్‌ బహుశా ప్రస్తుతం దక్షిణ ఫ్రాన్స్‌లో భాగంగా ఉన్న వెజాన్‌-లా-రొమాన్‌ పట్టణంలో జన్మించి ఉంటాడు. ఆ పట్టణంలో ఆయన పేరున్న ఒక శిల సా.శ. 1884లో దొరికింది. క్లౌదియ కైసరుకు మేనకోడలూ భార్యా అయిన అగ్రిప్పినా ద యంగర్‌ సా.శ. 51వ సంవత్సరంలో బుర్రోస్‌ను ప్రేతోర్య సేనకు ప్రధానాధిపతిగా నియమించింది. రోముకు తర్వాతి చక్రవర్తిగా తన కొడుకైన నీరో ఉండేందుకు ఆమె అతనికి చిన్నప్పటి నుండే ఇద్దరు ఉపదేశకుల ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించింది. ఆ ఇద్దరిలో ఒకాయన నైపుణ్యంగల సైనికుడైన బుర్రోస్‌. ఈయన నీరోకు యుద్ధ మెళకువలు నేర్పాడు. రెండో వ్యక్తి సెనెకా, తత్వజ్ఞానియైన ఈయన నీరోకి జ్ఞానాభ్యాసం చేయించాడు. అదును చూసి అగ్రిప్పినా తన భర్తకు విషం పెట్టి చంపింది. చక్రవర్తి మరణవార్త బయటకు పొక్కేలోగా, బుర్రోస్‌ తెలివిగా నీరోని కాస్ట్రా ప్రైటోరియా కోటకు తోడుకొని వెళ్లి ప్రేతోర్య సేన చేత నీరోని చక్రవర్తిగా ప్రకటింపజేశాడు. దాంతో చేసేదేమీలేక రోమా శాసనసభ కూడా దాన్ని అంగీకరించింది. సా.శ. 59లో నీరో చక్రవర్తి తన తల్లిని హత్య చేయించినప్పుడు బుర్రోస్‌ ఆ మరణం వెనక ఎవరున్నారనే నిజాన్ని బయటికి పొక్కకుండా చూశాడు. చివరికి బుర్రోస్‌ని సా.శ. 62లో నీరో విషం పెట్టి చంపించాడని రోమా చరిత్రకారులైన స్యుటోనియస్‌, కాస్యుస్‌ డీయో రాశారు.

Musée Calvet Avignon

a “నీరో కాలంలో ప్రేతోర్య సైనికుడు” అనే బాక్సు చూడండి.

b “సెక్‌స్టస్‌ ఆఫ్రాన్యస్‌ బుర్రోస్‌” అనే బాక్సు చూడండి.

c త్వరలో కలిగ్యల అనే వ్యక్తి రోముకు చక్రవర్తి కావచ్చనే అభిప్రాయాన్ని హేరోదు అగ్రిప్ప వ్యక్తం చేసినందుకు ఆయనను సా.శ. 36/37లో తిబెరి కైసరు ఈ జైల్లోనే నిర్బంధించాడు. చక్రవర్తి అయిన తర్వాత కలిగ్యల హేరోదుకు రాజరికాన్ని బహుమతిగా ఇచ్చాడు.—అపొ. 12:1.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి