‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించుట’
విజయవంతమైన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైన నియమాలకు దేవుని వాక్యం నెలవు. ఉపదేశించేందుకు, ఖండించేందుకు మరి తప్పుదిద్దేందుకు అది పరిచారకునికి సహాయం చేయగలదు. (2 తిమోతి 3:16, 17) అయితే, దైవికంగా అందించబడిన ఈ మార్గనిర్దేశకం నుండి పూర్తిప్రయోజనం పొందేందుకు, అపొస్తలుడైన పౌలు తిమోతికిచ్చిన సలహాను మనం పాటించాలి: “దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము.”—2 తిమోతి 2:15.
దేవుని వాక్యాన్ని, ఇతర విషయాలతోపాటు పోషణనిచ్చే పాలకు, బలమైన ఆహారానికి, సేదదీర్చే మరియు శుభ్రపర్చే నీళ్లకు, ఓ అద్దానికి మరియు పదునైన ఖడ్గానికి పోల్చడం జరిగింది. ఈ పదాలు దేన్ని సూచిస్తున్నాయన్నది అర్థం చేసుకోవడం బైబిలును ప్రభావవంతంగా ఉపయోగించేందుకు పరిచారకునికి సహాయపడుతుంది.
దేవుని వాక్యపు పాలను అందించడం
పాలు నవజాత శిశువులకు అవసరమయ్యే ఆహారం. శిశువు పెరిగే కొలది బలమైన ఆహారాన్ని దానికి క్రమంగా ఇవ్వవచ్చు, అయితే మొదట్లో అది పాలను మాత్రమే అరిగించుకోగలదు. అనేక విషయాల్లో, దేవుని వాక్యాన్ని గురించి తక్కువ తెలిసిన వారు శిశువులవలె ఉన్నారు. ఒక వ్యక్తి దేవునివాక్యంలో క్రొత్తగా ఆసక్తి కలిగివున్నా లేక కొంత కాలంనుండి దానితో పరిచయం కలిగివున్నా, బైబిలు చెప్పే విషయాలను గూర్చి కొంత అవగాహనను మాత్రమే కలిగివుంటే అతను ఆత్మీయశిశువు, అతనికి సులభంగా అరిగించుకునే ఆహారం, అంటే ఆత్మీయ “పాలు” కావాలి. దేవుని వాక్యం యొక్క లోతైన విషయాలైన “బలమైన ఆహారాన్ని” అతనింకా అరిగించుకునే స్థితిలో ఉండడు.—హెబ్రీయులు 5:12.
పౌలు వారికిలా వ్రాసినప్పుడు, కొరింథులో క్రొత్తగా ఏర్పడిన సంఘంలోని పరిస్థితి అలాగే ఉండేది: “అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు.” (1 కొరింథీయులు 3:2) కొరింథీయులు మొదట “దేవోక్తులలో మొదటి మూలపాఠములను” నేర్చుకోవలసిన అవసరత ఉండినది. (హెబ్రీయులు 5:12) వారి అభివృద్ధి చెందుతున్న ఈ దశలో, వారు “దేవుని మర్మములను” అరిగించుకోగల్గి ఉండేవారు కాదు.—1 కొరింథీయులు 2:10.
పౌలు వలె, ఆత్మీయ శిశువులకు “పాలను” ఇవ్వడం ద్వారా, అంటే క్రైస్తవ మూల సిద్ధాంతాలలో స్థిరంగా అయ్యేందుకు సహాయం చేయడం ద్వారా, నేడు క్రైస్తవ పరిచారకులు వారిపట్ల శ్రద్ధ చూపిస్తారు. అలాంటి క్రొత్త లేక పరిపక్వత లేనివారు ‘నిర్మలమైన వాక్యమను పాలను అపేక్షించాలని’ వారు ప్రోత్సహిస్తారు. (1 పేతురు 2:2) అపొస్తలుడైన పౌలు ఈ క్రింది విధంగా వ్రాసినప్పుడు, క్రొత్త వాళ్లకు అవసరమయ్యే ప్రత్యేకమైన శ్రద్ధను తాను గుర్తించానని చూపించాడు: “పాలు త్రాగు ప్రతివాడును శిశువేగనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు.” (హెబ్రీయులు 5:13) దేవుని పరిచారకులు వాక్యమను స్వచ్ఛమైన పాలను క్రొత్త వారికి, అనుభవం లేనివారికి గృహ బైబిలు పఠనాలలో మరియు సంఘంలో అందించేటప్పుడు వారు ఓర్పును, సహనాన్ని, అవగాహనను మరియు కోమలత్వాన్ని కలిగివుండాల్సిన అవసరత ఉంది.
దేవుని వాక్యపు బలమైన ఆహారాన్ని అందించడం
రక్షణకు ఎదిగేందుకు, ఓ క్రైస్తవునికి “పాల” కంటే ఎక్కువే అవసరం. బైబిలు యొక్క ప్రాథమిక సత్యాలను ఒకసారి స్పష్టంగా అర్థం చేసుకుని, అంగీకరించిన తర్వాత ‘వయస్సు వచ్చినవారికి తగిన బలమైన ఆహారాన్ని’ తీసుకోడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. (హెబ్రీయులు 5:14) ఆయన దీన్నెలా చేయగలడు? మూలవిషయంగా, వ్యక్తిగతపఠనం యొక్క క్రమంద్వారా, క్రైస్తవ కూటాలలో సహవాసం ద్వారా దీన్ని చేయగలడు. అలాంటి మంచి అలవాట్లు ఒక క్రైస్తవున్ని ఆత్మీయంగా బలపరుస్తాయి, పరిపక్వతనిస్తాయి మరియు పరిచర్యలో ప్రభావవంతంగా పనిచేయడంలో సహాయపడతాయి. (2 పేతురు 1:8) జ్ఞానంతోపాటు, యెహోవా చిత్తం చేయడం కూడా ఆత్మీయ ఆహారంలో భాగమని మనం మర్చిపోకూడదు.—యోహాను 4:34.
నేడు, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన ఒక దాసుడు’ దేవుని సేవకులకు తగినవేళలో ఆహారాన్ని అందించేందుకు మరియు “తన [దేవుని] యొక్క నానావిధమైన జ్ఞానము”ను అర్థం చేసుకోడానికి వారికి సహాయం చేసేందుకు నియమింపబడ్డాడు. యెహోవా తన ఆత్మవలన, ఈ యథార్థమైన దాసునిద్వారా లోతైన ఆత్మీయ సత్యాలను బయల్పరుస్తాడు, ‘తగిన వేళలకు’ ఆ ఆత్మీయ ‘ఆహారాన్ని’ నమ్మకంగా దాసుడు ప్రచురిస్తున్నాడు. (మత్తయి 24:45-47; ఎఫెసీయులు 3:10, 11; ప్రకటన 1:1, 2 పోల్చండి.) ప్రతీ క్రైస్తవుడు కూడా అలాంటి ప్రచురిత ఏర్పాట్లను పూర్తిగా ఉపయోగించుకోవలసిన బాధ్యత కలిగివున్నాడు.—ప్రకటన 1:3.
బైబిలులోని కొన్ని విషయాలు పరిపక్వత చెందిన క్రైస్తవులకు కూడా “గ్రహించుటకు కష్టమైనవి” అన్నది వాస్తవమే. (2 పేతురు 3:16) పఠించడం మరి ధ్యానించడం అవసరమైన భావసూచక విషయాలు, ప్రవచనాలు మరియు ఉపమానాలు ఉన్నాయి. కాబట్టి, వ్యక్తిగత పఠనంలో దేవుని వాక్యాన్ని త్రవ్వడం ఇమిడివుంది. (సామెతలు 1:5, 6; 2:1-5) పెద్దలు సంఘానికి బోధిస్తున్నప్పుడు వారికి ప్రాముఖ్యంగా ఈ విషయంలో బాధ్యతవుంది. సంఘానికి పెద్దలు బలమైన ఆత్మీయ ఆహారాన్ని ఇస్తున్నప్పుడు, అంటే సంఘ పుస్తకపఠనాన్ని లేక కావలికోట పఠనాన్ని నిర్వహిస్తున్నా, బహిరంగ ప్రసంగాలు ఇస్తున్నా లేక వేరే ఇతర బోధనాస్థాయిలో సేవ చేస్తున్నా, తాము చెప్పవలసిన విషయాలతో పూర్తి పరిచయాన్ని కలిగివుండాలి మరియు తమ “బోధనా కళ”పట్ల అవధానాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి.—2 తిమోతి 4:2, NW.
సేదదీర్చే, శుభ్రపర్చే నీళ్లు
త్రాగేందుకు తాను ఇచ్చేవి ఆమెలో ‘నిత్యజీవమునకై ఊరెడి నీటి బుగ్గగా’ అవుతాయని యేసు బావివద్ద సమరయ స్త్రీతో చెప్పాడు. (యోహాను 4:13, 14; 17:3) జీవాన్నిచ్చే ఈ జలాల్లో దేవుని గొర్రెపిల్ల ద్వారా జీవం కొరకై దేవుడు చేసిన ఏర్పాట్లన్నీ ఇమిడివున్నాయి, ఈ ఏర్పాట్లు బైబిలులో వివరించబడ్డాయి. ఆ “జలము” కొరకు దప్పిగొనిన వ్యక్తులవలె, ‘జీవజలమును ఉచితముగా పుచ్చుకొనుము’ అని ఆత్మ మరియు క్రీస్తు యొక్క పెండ్లికుమార్తె ఇస్తున్న ఆహ్వానాన్ని మనం అంగీకరిస్తాం. (ప్రకటన 22:17) ఈ నీళ్లను త్రాగడం నిత్యజీవాన్ని ఇవ్వగలదు.
అంతేకాకుండా, నిజక్రైస్తవుల కొరకు బైబిలు నైతిక మరియు ఆత్మీయప్రమాణాలను ఏర్పర్చుతుంది. దైవికంగా ఏర్పర్చబడిన ఈ ప్రమాణాలను మనం అన్వయించుకుంటుండగా, మనం యెహోవా వాక్యం ద్వారా శుభ్రపర్చబడతాం, యెహోవా దేవుడు ద్వేషించే ఆచారాలన్నింటినుండి “కడుగ”బడతాం. (1 కొరింథీయులు 6:9-11) ఈ కారణం చేతనే, ప్రేరేపిత వాక్యంలోవున్న సత్యం “ఉదకస్నానము” అని పిలువబడింది. (ఎఫెసీయులు 5:26) దేవుని సత్యం మనల్ని ఈ పద్ధతిలో శుభ్రపర్చడానికి మనం అనుమతించకపోతే, మన ఆరాధన ఆయనకు అంగీకృతమైనదిగా ఉండదు.
ఆసక్తికరంగా, ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించే’ పెద్దలు కూడా నీళ్లకు పోల్చబడ్డారు. వారు “ఎండినచోట నీళ్లకాలువలవలె” ఉంటారని యెషయా చెబుతున్నాడు. (యెషయా 32:1, 2) ప్రేమగల పెద్దలు ఆత్మీయ కాపరులవలె దృఢపరచి బలపర్చే ప్రోత్సాహకరమైన, ఓదార్పుకరమైన ఆత్మీయ సమాచారాన్ని అందించేందుకు సేదదీర్పునిచ్చే దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తూ తమ సహోదరులను దర్శించినప్పుడు, వారు ఈ వర్ణనకు సరిపోతారు.—మత్తయి 11:28, 29 పోల్చండి.a
పెద్దలు తమను సందర్శించాలని సంఘసభ్యులు ఆసక్తితో ఎదురుచూస్తారు. “పెద్దలు ఎంత ఓదార్పుకరంగా ఉండగలరో నాకు తెలుసు, యెహోవా ఈ ఏర్పాటు చేసినందుకు నేనెంతో సంతోషిస్తున్నానని,” బోనీ చెబుతుంది. ఒంటరి తల్లియైన లిండా ఇలా వ్రాస్తుంది: “నేను ఎదుర్కోడానికి లేఖనాధార ప్రోత్సాహంతో పెద్దలు నాకు సహాయం చేశారు. వారు విని కనికరాన్ని చూపారు.” మైకెల్ ఇలా చెబుతున్నాడు: “శ్రద్ధవహించే ఒక సంస్థలో నేను కూడా ఒక భాగమని భావించేలా వారు చేశారు.” “తీవ్రమైన కృంగుదలగల సమయాలను అధిగమించడానికి పెద్దల సందర్శనాలు నాకు సహాయం చేశాయని” మరొకరు చెబుతున్నారు. ఒక పెద్ద ఆత్మీయంగా ప్రోత్సహించే రీతిలో సందర్శించడం చల్లని, సేదదీర్పునిచ్చే నీళ్లలాంటిది. తమ పరిస్థితికి లేఖనాధారనియమాలు ఎలా అన్వయిస్తాయో చూసేందుకు గొర్రెలవంటి వారికి ప్రేమగల పెద్దలు సహాయం చేసినప్పుడు వారు ఓదార్పును పొందుతారు.—రోమీయులు 1:11, 12; యాకోబు 5:14.
దేవుని వాక్యాన్ని ఓ అద్దంలా ఉపయోగించండి
ఒక వ్యక్తి బలమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు, దాని రుచిని ఆస్వాదించాలన్నది మాత్రమే అతని సంకల్పంకాదు. బదులుగా, తాను పని చేయడానికి సహాయపడే పోషణను పొందాలని కూడా అతను అపేక్షిస్తాడు. ఒకవేళ అతను పిల్లవాడైతే, పెరిగి పెద్దయ్యేందుకు ఆహారం అతనికి సహాయం చేస్తుందని అతను అపేక్షిస్తాడు. ఆత్మీయాహారం విషయం కూడా అంతే. వ్యక్తిగత బైబిలు పఠనం ఆనందదాయకంగా ఉండగలదు, అయితే పఠనం చేసేందుకు అదొక్కటే కారణంకాదు. ఆత్మీయ ఆహారం మనల్ని మార్చాలి. ఆత్మఫలాలను గుర్తించి, వాటిని ఫలించడానికి అది మనకు సహాయం చేస్తుంది మరియు “జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీనస్వభావమును ధరించు”కునేందుకు మనకు తోడ్పడుతుంది. (కొలొస్సయులు 3:10; గలతీయులు 5:22-24) మన సమస్యలతో వ్యవహరించడానికి అలాగే ఇతరులు తమ వాటితో వ్యవహరించడంలో సహాయం చేయడానికి లేఖనాధార సూత్రాలను మేలైన రీతిలో అన్వయించుకోవడంలో మనల్ని సమర్థులను చేస్తూ, పరిపక్వతకు ఎదగడానికి ఆత్మీయాహారం మనకు సహాయపడుతుంది.
బైబిలు మనపై అలాంటి ప్రభావాన్ని చూపుతుందో లేదో మనమెలా చెప్పగలం? మనం బైబిలును ఓ అద్దంలా ఉపయోగిస్తాం. యాకోబు ఇలా చెప్పాడు: ‘మీరు వినువారు మాత్రమైయుండక, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికిపోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా. అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడుకాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.’—యాకోబు 1:22-25.
మనం వాక్యాన్ని నిశితంగా పరిశీలించి, దేవుని ప్రమాణాల ప్రకారం మనం ఏమై ఉండాలనే దాన్ని, మనం ఏమైవున్నామనే దానితో పోల్చినప్పుడు మనం వాక్యంలోకి ‘తేరి చూస్తాం.’ ఇది చేయడం ద్వారా మనం ‘వినువారం మాత్రమై ఉండక, వాక్యప్రకారం చేసేవారం’ అవుతాం. బైబిలు మనపై చక్కని ప్రభావాన్ని కలిగివుంటుంది.
దేవుని వాక్యం ఒక ఖడ్గం వలె
చివరగా, దేవుని వాక్యాన్ని ఓ ఖడ్గంవలె మనమెలా ఉపయోగించవచ్చో చూసేందుకు అపొస్తలుడైన పౌలు మనకు సహాయం చేస్తున్నాడు. ‘ప్రధానులకును, అధికారులకును, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులకును, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములకును’ విరుద్ధంగా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, “దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి” అని ఆయన మనల్ని పురికొల్పుతున్నాడు. (ఎఫెసీయులు 6:12, 17) “దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు” ఏ ఆలోచననైనా తీసివేయడానికి మనం ఉపయోగించగల దేవుని వాక్యం ఒక ఉపయుక్తమైన అస్త్రంవంటిది.—2 కొరింథీయులు 10:3-5.
నిస్సందేహంగా, “దేవుని వాక్యము సజీవమై బలముగలదై” ఉంది. (హెబ్రీయులు 4:12) తన ప్రేరేపితవాక్యం యొక్క పుటల ద్వారా యెహోవా మానవజాతితో మాట్లాడతాడు. ఇతరులకు బోధించడంలో మరి అబద్ధసిద్ధాంతాలను బయల్పర్చడంలో దాన్ని చక్కగా ఉపయోగించండి. ఇతరులను ప్రోత్సహించడానికి, నిర్మించడానికి, సేదదీర్చడానికి, ఓదార్చడానికి, పురికొల్పడానికి మరియు ఆత్మీయంగా బలపర్చడానికి దాన్ని అందుబాటులో ఉంచుకోండి. ఆయన “దృష్టికి అనుకూలమైనదానిని” మీరు ఎల్లప్పుడూ చేసేలా “ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు” యెహోవా “మిమ్మును సిద్ధపరచును గాక.”—హెబ్రీయులు 13:21.
[అధస్సూచీలు]
a సెప్టెంబరు 15, 1993, 20-3 పేజీలలోవున్న “వారు గొర్రెపిల్లలను కనికరముతో కాయుదురు” అనే కావలికోట శీర్షికను చూడండి.
[31వ పేజీలోని చిత్రం]
‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించు’చు, పెద్దలు ఇతరులను ప్రోత్సహిస్తారు