కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 11/15 పేజీలు 25-28
  • మిష్నా మరియు మోషేకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మిష్నా మరియు మోషేకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవాలయం లేని యూదా మతం
  • మౌఖిక ధర్మశాస్త్ర సమీకరణ
  • మిష్నా తయారీ
  • మౌఖిక ధర్మశాస్త్రం—వ్రాతలో ఎందుకు పెట్టబడింది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • టాల్‌ముడ్‌ అంటే ఏమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • క్రీస్తుకు పూర్వమున్న ధర్మశాస్త్రము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • నీతి నోటిమాట పారంపర్యాచారము ద్వారా కాదు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 11/15 పేజీలు 25-28

మిష్నా మరియు మోషేకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం

“మన గ్రహింపుకు అసలేమాత్రం అందని విషయాల గురించి అప్పటికే జరుగుతున్న సుదీర్ఘమైన చర్చలో మనమూ వచ్చి చేరామన్న భావన కలుగుతుంది . . . మనం . . . ఎక్కడో దూరదేశంలోని విమానాశ్రయంలో ప్రయాణికుల విశ్రమగదిలో ఉన్నామన్న భావన కలుగుతుంది. ప్రక్కనున్న ప్రజలు మాట్లాడే కొన్ని పదాలు మనకు అర్థం అవుతాయి, కానీ వారి మాటలకు అర్థాలేమిటో, వారి చింతలు ఏమిటో మన గ్రహింపుకు అందదు. అన్నింటికీపైగా, వారి స్వరాల్లో ధ్వనిస్తున్న ఆదుర్దా ఎందుకో అర్థంకాక మన తలతిరుగుతుంది.” ఆ విధంగా, పాఠకులు మిష్నాను మొదటిసారిగా చదువుతున్నప్పుడు వారికి కలిగే భావనలను యూదా మత విద్వాంసుడైన జేకబ్‌ నోయ్‌స్నెర్‌ వర్ణిస్తున్నాడు. నోయ్‌స్నెర్‌ ఇంకా ఇలా అంటున్నాడు: “మిష్నాకు ఓ ఆరంభం లేదు. అర్థాంతరంగా ముగుస్తుంది.”

డానియెల్‌ జెరమీ సిల్వర్‌ ఎ హిస్టరీ ఆఫ్‌ జుడాయిజం అనే పుస్తకంలో మిష్నాను “రబ్బీయ యూదా మత రాజ్యాంగ గ్రంథం” అని పిలుస్తున్నాడు. వాస్తవానికి, ఆయన ఇంకా ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “కొనసాగింపబడిన [యూదా] ముఖ్య విద్యాభ్యాస పాఠ్యక్రమంలో బైబిలు స్థానాన్ని మిష్నా ఆక్రమించింది.” అంత గజిబిజిగా ఉన్న పుస్తకం ఎందుకంత ప్రాముఖ్యతను సంతరించుకుంది?

దానికి కొంత జవాబు మిష్నాలోని ఈ వ్యాఖ్యానంలో ఉంది: “మోషే తోరహ్‌ను సీనాయి పర్వతంపైన స్వీకరించాడు, దాన్ని యెహోషువకు అందించాడు, యెహోషువ దాన్ని పెద్దలకు, పెద్దలు ప్రవక్తలకు అందించారు. తర్వాత ప్రవక్తలు దాన్ని మహా సభలోని పురుషులకు అందించారు.” (అవొట్‌ 1:1) మిష్నాకు సీనాయి పర్వతంపైన మోషేకు అందించబడిన సమాచారంతో సంబంధం ఉందని—అది ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రంలోని లిఖితం కాని భాగం అని మిష్నా చెబుతుంది. మహా సభలోని (ఇది అటుతర్వాత సన్హెడ్రిన్‌ అని పిలువబడింది) పురుషులు జ్ఞానులైన విద్వాంసుల లేక వివేకుల పొడవైన వరుసలో భాగమని దృష్టించబడేవారు. వీరు ఆయా బోధలను ఒక తరం నుండి మరో తరానికి నోటిద్వారా అందిస్తూ వచ్చారని, చివరికి ఈ బోధలు మిష్నాలో నమోదు చేయబడ్డాయని నమ్మబడుతుంది. కానీ ఇది వాస్తవమా? మిష్నాను నిజానికి ఎవరు వ్రాశారు, మరి ఎందుకు? అందులోని విషయాలు సీనాయి పర్వతంపైన మోషే పొందినవేనా? అది నేడు మనకు ఉపయోగకరమా?

దేవాలయం లేని యూదా మతం

దైవ ప్రేరేపణచే లేఖనాలు వ్రాయబడుతున్న కాలంలో, మోషే యొక్క లిఖిత ధర్మశాస్త్రానికి తోడుగా నోటిద్వారా అందజేయబడిన దైవిక ధర్మశాస్త్రం ఉన్నదన్న నమ్మకం అసలు లేదు.a (నిర్గమకాండము 34:27) అనేక శతాబ్దాల తర్వాత, యూదా మతంలోనే పరిసయ్యుల గుంపు ఈ భావనను అభివృద్ధి చేసి దాన్ని పెంపొందించింది. సా.శ. మొదటి శతాబ్దంలో సద్దూకయ్యులు వారితోపాటు మరితర యూదులు ఈ బైబిలేతర బోధను వ్యతిరేకించారు. అయితే, యెరూషలేములోని దేవాలయం యూదా ఆరాధనకు కేంద్ర బిందువుగా ఉన్నంతకాలమూ నోటిద్వారా అందించబడిన ధర్మశాస్త్ర ప్రస్తావన అంత ప్రాముఖ్యతను కలిగిలేదు. దేవాలయం వద్ద ఆరాధన ప్రతి యూదుని ఉనికికీ ఒక వ్యవస్థనూ కొంత మేరకు స్థిరత్వాన్నీ ఇచ్చింది.

అయితే, సా.శ. 70లో యూదా జనాంగం అనూహ్యమైన పరిమాణంలో మత సంక్షోభాన్ని ఎదుర్కొంది. రోమా సైన్యాలు యెరూషలేమును నాశనం చేశాయి, పది లక్షలకుపైగా యూదులు హతులయ్యారు. వారి ఆధ్యాత్మిక జీవితాలకు కేంద్రమైన దేవాలయం ఇక లేకుండా పోయింది. మోషే ధర్మశాస్త్రానికి అనుగుణంగా జీవించడం అసంభవమైపోయింది, ఎందుకంటే దాని ప్రకారం దేవాలయంలో బలులూ యాజక సేవలూ అవసరమయ్యాయి. యూదా మత పునాది నేలమట్టమైంది. టాల్ముడ్‌ విద్వాంసుడైన ఆడన్‌ స్టైన్‌సాల్ట్స్‌ ఇలా వ్రాస్తున్నాడు: “సా.శ. 70లోని . . . నాశనంతో మతపరమైన జీవితాన్ని పునరుజ్జీవనం చేయడం అత్యంతావశ్యకమైంది.” వారా పునరుజ్జీవనం చేయనే చేశారు.

దేవాలయం నాశనం కాకమునుపే, పరిసయ్యుల నాయకులలో ఒకరైన హిల్లెల్‌ శిష్యుడైన యోహాన్నాన్‌ బెన్‌ జాక్కై అనే గౌరవనీయుడైన ఒక వ్యక్తి, యూదామత ఆధ్యాత్మిక కేంద్రాన్నీ సన్హెడ్రిన్‌నూ జెరూసలేమ్‌ నుండి జాబ్నెహ్‌కు తరలించడానికి వెస్పాసియన్‌ (ఈయన త్వరలోనే కాబోయే చక్రవర్తి) నుండి అనుమతిని పొందాడు. స్టైన్‌సాల్ట్స్‌ వివరిస్తున్నట్లుగా, యెరూషలేము నాశనం తర్వాత యోహాన్నాన్‌ బెన్‌ జాక్కై, “ప్రజల కొరకు ఒక క్రొత్త కేంద్రాన్ని స్థాపించే సవాలును, క్రొత్త పరిస్థితులకు సర్దుకోవడంలో సహాయపడే సవాలును ఎదుర్కొన్నాడు. దేవాలయం ఇక లేనందున మతాసక్తిని మరొక కేంద్ర బిందువు వైపుగా మళ్లించాల్సివచ్చింది.” ఆ క్రొత్త కేంద్ర బిందువే మౌఖిక ధర్మశాస్త్రం.

దేవాలయం నాశనమైపోవడంతో, సద్దూకయ్యులూ మరితర యూదామత తెగలవారూ శక్తివంతమైన ఏ ప్రత్యామ్నాయాన్నీ చూపించలేకపోయారు. పరిసయ్యులు వ్యతిరేకతకు తల ఒగ్గి యూదామత స్రవంతిలో కలిసిపోయారు. ఐక్యతను నొక్కిచెబుతూ రబ్బీ నాయకులు తమను తాము పరిసయ్యులని పిలుచుకోవడాన్ని ఆపేశారు. ఆ పదం నిండా తెగ సంబంధమైన భావాలు వేర్పాటువాద భావాలు ఉన్నాయి. వారిని కేవలం రబ్బీలు అని, అంటే “ఇశ్రాయేలు యొక్క వివేకులు” అని పిలువడం ప్రారంభమైంది. ఈ వివేకులు తమ మౌఖిక ధర్మశాస్త్ర భావనను స్థాపించడానికి విశ్వాసాల సముదాయాన్ని తయారు చేయడానికి కార్యోన్ముఖులయ్యారు. అది దేవాలయంలాగా కాక మానవులు దాడి చేయలేని విధంగా ఒక ఆధ్యాత్మిక వ్యవస్థగా రూపొందనైయుండెను.

మౌఖిక ధర్మశాస్త్ర సమీకరణ

జాబ్నెహ్‌లోని రబ్బీ విద్యా కేంద్రం (ఇది యెరూషలేముకు పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో ఉంది) ఇప్పుడు ప్రధాన కేంద్రంగా ఉన్నప్పటికీ, మౌఖిక ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న ఇతర విద్యా కేంద్రాలు యెరూషలేమంతటా చివరికి బబులోను, రోము అంతటి దూర ప్రాంతాల్లోనూ పుట్టుకొచ్చాయి. అయితే, ఇదొక సమస్యను సృష్టించింది. స్టైన్‌సాల్ట్స్‌ ఇలా వివరిస్తున్నాడు: “జ్ఞానులందరూ ఒకే చోట సమకూడి, వారి పాండిత్యమంతా [యెరూషలేములోని] పురుషుల సమూహం చేత నియంత్రించబడుతున్నంత వరకూ సాంప్రదాయ వ్యవహారాల్లో ఏకరూపత ఉంటూ వచ్చింది. కానీ బోధకులు విపరీతంగా పెరిగిపోయే కొలది, వేర్వేరు పాఠశాలలు స్థాపించే కొలది . . . విషయాల్ని వ్యక్తం చేసే పద్ధతులూ సవాలక్ష రీతులూ ఉత్పన్నమయ్యాయి.”

మౌఖిక ధర్మశాస్త్ర బోధకులు టాన్నైమ్‌ అని పిలువబడ్డారు. ఈ పదం “అధ్యయనం చేయు,” “తిరిగి చెప్పు,” లేక “బోధించు” అనే అర్థమిచ్చే అరామిక్‌ భాషకు చెందిన మూలపదం నుండి వచ్చింది. ఇది వారు మళ్లీ మళ్లీ చెబుతూ, కంఠస్థం చేస్తూ మౌఖిక ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని దాన్ని బోధించే వారి పద్ధతిని నొక్కిచెబుతుంది. మౌఖిక సాంప్రదాయాల్ని కంఠస్థం చేయడాన్ని సులభతరం చేయడానికి ఒక్కొక్క ఆదేశమూ, సంప్రదాయమూ ఒక సంక్షిప్తమైన సంగ్రహమైన పదబంధంగా తగ్గించబడింది. పదాలెంత తక్కువగా ఉంటే అంత మంచిదిలా మారింది. విలక్షణమైన పద్య రూపంలో పెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి, ఆ పదబంధాల్ని జపించేవారు, లేకపోతే పాటలా పాడేవారు. అయినప్పటికీ, ఈ ఆదేశాలు గజిబిజిగా ఉండేవి, ఒక బోధకుడు ఒకటి చెబితే మరో బోధకుడు మరోటి చెప్పేవాడు.

అనేకానేక విభిన్నమైన మౌఖిక సాంప్రదాయాలకు ఒక నిర్దిష్టమైన రూపాన్నిచ్చి వాటిని వ్యవస్థీకరించిన మొదటి రబ్బీ అకీవా బెన్‌ జోసెఫ్‌ (దాదాపు సా.శ. 50-135), ఆయన గురించి స్టైన్‌సాల్ట్స్‌ ఇలా వ్రాస్తున్నాడు: “ఆయన సమకాలీనులు ఆయన కార్యాన్ని, ఒక రైతు పొలంకెళ్లి చేతికందినదల్లా బుట్టలోనికి నింపుకుని ఇంటికి వచ్చి వాటిని వేరుచేసి క్రమంలో పెట్టడంతో పోల్చారు. అకీవా చిందరవందరగా ఉన్న అసంఖ్యాకమైన విషయాల్ని అధ్యయనం చేసి వాటిని విభిన్నమైన తరగతుల్లోకి వర్గీకరించాడు.”

సా.శ. రెండవ శతాబ్దంలో—యెరూషలేము నాశనం తర్వాత 60 సంవత్సరాల అనంతరం—బార్‌ కోఖ్‌బా అనే వ్యక్తి రోముకు విరుద్ధంగా రెండవ భారీ తిరుగుబాటును లేవదీశాడు. మరోసారి, తిరుగుబాటు వినాశనాన్ని తెచ్చింది. ఈ వినాశనంలో బలైన దాదాపు పది లక్షలమంది యూదుల్లో అకీవా, ఆయనతోపాటు ఆయన శిష్యులు అనేకమంది కూడా ఉన్నారు. రోమా చక్రవర్తి హేడ్రియన్‌ యూదులను యెరూషలేములో ప్రవేశించడాన్ని నిషేధిస్తూ ఆజ్ఞ జారీచేయడంతో దేవాలయాన్ని పునర్నిర్మించే ఆశలు అడుగంటిపోయాయి. దేవాలయం నాశనం జరిగిన సాంవత్సరిక స్మరణకు తప్ప మిగతా రోజుల్లో వారి ప్రవేశం నిషేధించబడింది.

అకీవా తర్వాత వచ్చిన టాన్నైమ్‌లు యెరూషలేములోని దేవాలయాన్ని అసలు ఎన్నడూ చూడలేదు. కానీ మౌఖిక ధర్మశాస్త్రంలోని సాంప్రదాయాలను క్రమబద్ధంగా అధ్యయనం చేయడమే వారికి “దేవాలయం” అయ్యింది లేక ఆరాధనా కేంద్రంగా తయారయ్యింది. ఈ మౌఖిక ధర్మశాస్త్ర వ్యవస్థను దృఢం చేయడంలో అకీవా, ఆయన శిష్యులు కలిసి ప్రారంభించిన కార్యాన్ని టాన్నైమ్‌లలో ఆఖరువాడైన జూడా హ-నసీ అనే వ్యక్తి చేపట్టాడు.

మిష్నా తయారీ

జూడా హ-నసీ, హిల్లెల్‌ గమాలియేలు వంశీయుడు.b బార్‌ కోఖ్‌బా తిరుగుబాటు కాలంలో జన్మించిన ఆయన రెండవ శతాబ్దం చివర్లోనూ మూడవ శతాబ్దం ప్రారంభంలోనూ ఇశ్రాయేలులోని యూదా సమాజానికి పెద్దగా ఉన్నాడు. హ-నసీ అనే బిరుదుకు “అధిపతి” అని అర్థం, ఇది ఆయనకు తోటి యూదుల్లో కలిగివున్న హోదాను సూచిస్తుంది. ఆయన్ను తరచూ కేవలం రబ్బీ అని పిలిచేవారు. జూడా హ-నసీ తన స్వంత పాఠశాలకు మాత్రమే గాక మొదట బేత్‌ షియారిమ్‌లోను అటుతర్వాత గలిలయలోని సెఫోరిస్‌లోని సన్హెడ్రిన్‌కు కూడా అధ్యక్షత వహించాడు.

రోమ్‌తో భావి సంఘర్షణలు, మౌఖిక ధర్మశాస్త్రం రానున్న తరాలకు అందడాన్ని ప్రమాదంలో పడవేస్తాయని గ్రహించిన జూడా హ-నసీ అది సంరక్షించబడేందుకు దాన్ని వ్యవస్థీకరించాలని అనుకున్నాడు. ఆయన తన పాఠశాలవద్ద తన కాలంలోని అత్యంత ఉత్కృష్టమైన విద్వాంసుల్ని సమకూర్చాడు. మౌఖిక ధర్మశాస్త్రంలోని ఒక్కొక్క అంశాన్నీ ఒక్కొక్క సంప్రదాయాన్నీ కూలంకషంగా చర్చించారు. హెబ్రీ భాషయొక్క కచ్చితమైన గద్య శైలిని అనుసరిస్తూ ఈ చర్చల సారాంశాన్ని సంక్షిప్తమైన మాటల్లో సంగ్రహపర్చారు.

ఈ సారాంశాలు ప్రధాన విషయాల ఆధారంగా ఆరు పెద్ద పెద్ద విభాగాలుగా లేక వర్గాలుగా విభజించబడి వ్యవస్థీకరించబడ్డాయి. జూడా వీటిని ఇంకా 63 ఉప విభాగాలుగా లేక ప్రబంధాలుగా విభజించాడు. ఇప్పుడు ఆధ్యాత్మిక వ్యవస్థ పూర్తి అయ్యింది. ఇప్పటి వరకూ అటువంటి సాంప్రదాయాలు కేవలం మౌఖికంగా అందజేయబడేవి. కానీ గట్టి భద్రతకుగాను ఒక విప్లవాత్మకమైన చర్య తీసుకోబడింది—వాటినన్నింటిని వ్రాతపూర్వకంగా పెట్టే చర్య తీసుకోబడింది. మౌఖిక ధర్మశాస్త్రం ఉన్న ఈ ఆకర్షణీయమైన క్రొత్త లిఖిత వ్యవస్థ మిష్నా అని పిలువబడింది. మిష్నా అనే పేరు “బోధించు” లేక “మళ్లీ చెప్పు” అనే అర్థంగల హెబ్రీ మూల పదమైన షానా నుండి వచ్చింది. అది అరామిక్‌ పదమైన టేనాకు తత్సమానమైన పదం. ఈ టేనా నుండి వచ్చిన టాన్నైమ్‌ అనే పదం మిష్నాను బోధించే వారికి అన్వయించబడింది.

మిష్నా యొక్క సంకల్పం ఒక నిర్దిష్టమైన నియమావళిని స్థాపించడం కాదు. అది చదువరులకు ప్రాథమిక సూత్రాలు తెలుసు అన్న పూర్వభావనా మినహాయింపులతో ఎక్కువగానే వ్యవహరిస్తుంది. నిజానికి అది జూడా హ-నసీ కాలంలో రబ్బీ పాఠశాలల్లో చర్చించబడిన, నేర్పించబడిన విషయాల్ని సంక్షిప్తపర్చింది. మిష్నా అనేది మౌఖిక ధర్మశాస్త్రానికి ఒక రూపు రేఖ మాత్రమే. దానిపైన ఇంకా చర్చలు చేయవచ్చు, అది అస్తిపంజరంలాంటిది, లేక ప్రధానమైన వ్యవస్థ మాత్రమే, దానిపైన నిర్మాణం కొనసాగాల్సివుంది.

మిష్నా సీనాయి పర్వతంపైన మోషేకు ఇవ్వబడినదాంట్లో దేనినో బయల్పర్చడానికి బదులుగా, అది పరిసయ్యులతో మొదలైన మౌఖిక ధర్మశాస్త్రం భావన ఎలా అభివృద్ధి అయ్యిందన్న విషయంపై అంతర్దృష్టిని అందజేస్తుంది. మిష్నాలో నమోదు చేయబడిన సమాచారం క్రైస్తవ గ్రీకు లేఖనాల వ్యాఖ్యానాలపైనా, యేసు క్రీస్తుకు పరిసయ్యులకూ జరిగిన కొన్ని చర్చలపైనా కొంత వెలుగును ప్రసరింపజేస్తుంది. అయితే, ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిష్నాలోని తలంపులు సా.శ. రెండవ శతాబ్దంలోని యూదుల దృష్టికోణాల్ని ప్రతిబింబిస్తున్నాయి. మిష్నా రెండవ దేవాలయం కాలానికి టాల్ముడ్‌ కాలానికి మధ్య వంతెన లాంటిది.

[అధస్సూచీలు]

a అదనపు సమాచారం కోసం, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన యుద్ధం లేని లోకం ఎప్పుడైనా వస్తుందా? (ఆంగ్లం) అనే బ్రోషూరులో 8-11 పేజీలను చూడండి.

b జూలై 15, 1996, కావలికోటలోని “గమలీయేలు—ఆయన తార్సువాడైన సౌలుకు బోధించాడు” అనే శీర్షిక చూడండి.

[26వ పేజీలోని బాక్సు]

మిష్నాలోని విభాగాలు

మిష్నా ఆరు వర్గాలుగా విభజించబడింది. వీటిలో 63 చిన్న పుస్తకాలు లేక ప్రబంధాలు ఉన్నాయి, ఇవి అధ్యాయాలుగాను, మిష్నాయొత్‌ అంటే పేరాలుగాను (వచనాలుగా కాదు) విభాగించబడివున్నాయి.

1. జెరైమ్‌ (వ్యవసాయ సంబంధ చట్టాలు)

ఈ ప్రబంధాలలో ఆహారం కొరకు చేసే ప్రార్థనలపైనా, వ్యవసాయ సంబంధమైన విషయాలపైనా చర్చలు ఉన్నాయి. వాటిలో దశమభాగం, యాజక వాటాలు, పరిగె ఏరుకోవడం, సబ్బాతు సంవత్సరాల వంటివాటికి సంబంధించిన నియమాలు ఉన్నాయి.

2. మోయెడ్‌ (పర్వదినాలు, పండుగలు)

ఈ వర్గంలోని ప్రబంధాలు సబ్బాతు, ప్రాయశ్చిత్తార్థ దినము, మరితర పండుగలకు సంబంధించిన చట్టాల్ని చర్చిస్తాయి.

3. నాషిమ్‌ (స్త్రీలు, వివాహ చట్టాలు)

ఈ ప్రబంధాలు వివాహము, విడాకులు, మ్రొక్కుబడులు, నాజీరులు, వ్యభిచారం జరిగిందన్న అనుమానాల వంటి విషయాల గురించి చర్చిస్తాయి.

4. నెజికిన్‌ (నష్టం, పౌర చట్టం)

ఈ వర్గంలోని ప్రబంధాలు పౌర చట్టాలు, ఆస్తి చట్టాలు, న్యాయసభలు జుల్మానాలు, సన్హెడ్రిన్‌ కార్యకలాపాలు, విగ్రహారాధన, ప్రమాణాలు, పెద్దల నీతిశాస్త్రాలు వంటి విషయాలను చర్చిస్తాయి (అవొత్‌).

5. కోడాషిమ్‌ (బలులు)

ఈ ప్రబంధాలు జంతు బలులు, నైవేద్యములు, దేవాలయం కొలతలు వంటివాటిని చర్చిస్తాయి.

6. టోహారోత్‌ (శుద్ధీకరణ ఆచారాలు)

ఈ వర్గంలోని ప్రబంధాలు ఆచారబద్ధమైన శుద్ధత, స్నానం చేయడం, చేతులు కడుక్కోవడం, చర్మవ్యాధులు, వివిధ వస్తువుల అశుద్ధత వంటివాటిని చర్చిస్తాయి.

[28వ పేజీలోని బాక్సు]

మిష్నా మరియు క్రైస్తవ గ్రీకు లేఖనాలు

మత్తయి 12:1, 2: “ఆ కాలమందు యేసు విశ్రాంతిదినమున పంట చేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులది చూచి—ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని చె[ప్పిరి].” యేసు శిష్యులు చేసిన దానిని హెబ్రీ లేఖనాలు నిషేధించడంలేదు. కానీ మిష్నాలో సబ్బాతు దినమందు చేయకూడదని రబ్బీలు నిషేధించిన 39 కార్యకలాపాల పట్టికను మనం చూస్తాము.—షబ్బాత్‌ 7:2.

మత్తయి 15:3: ‘అందుకాయన [యేసు]—మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? అని వారితో చెప్పెను.’ మిష్నా ఈ వైఖరిని ధృవపరుస్తోంది. (సన్హెడ్రిన్‌ 11:3) మనం ఇలా చదువుతాము: “[లిఖిత] ధర్మశాస్త్రంలోని మాటలను [పాటించడం]కన్నా శాస్త్రుల మాటలను [పాటించడానికే] ఎక్కువ కచ్చితత్వం వర్తిస్తుంది. ఎవరైనా ‘ఫైలాక్టరీలు ధరించే అవసరం లేదు’ అని చెప్పి ధర్మశాస్త్రంలోని మాటల్ని ఉల్లంఘిస్తే ఆయన నిందార్హుడు కాడు; [కానీ ఒకవేళ ఆయన] ‘వాటిలో ఐదు విభాగాలు ఉండాలి’ అని చెబుతూ శాస్త్రుల మాటలకు అదనంగా ఏమైనా చేర్చితే అప్పుడు ఆయన నిందార్హుడు.”—ద మిష్నా, హెర్బర్ట్‌ డాన్‌బీ, పేజీ 400.

ఎఫెసీయులు 2:14: “ఆయన [యేసు] మన సమాధానమైయుండి . . . విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును, తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.” మిష్నా ఇలా చెబుతుంది: “దేవాలయం లోపల పది జానెల ఎత్తున్న ఒక అడ్డుగోడ (సోరెగ్‌) ఉంది.” (మిద్దోత్‌ 2:3) అన్యులు దీన్ని దాటి ముందుకు వెళ్లడం, లోపలి ఆవరణములోనికి ప్రవేశించడం నిషేధించబడింది. అపొస్తలుడైన పౌలు సా.శ. 60లో గాని లేక 61లో గాని ఎఫెసీయులకు వ్రాసినప్పుడు, ఆ కాలంలో ఇంకా అక్కడే నిలిచియున్న ఈ గోడనే ఉద్దేశించి ఉండవచ్చు. ఆ సమయంలో అది ఇంకా నిలిచే ఉంది. ఈ సూచనార్థకమైన గోడ ధర్మశాస్త్ర నిబంధనే, ఇది ఎంతోకాలంగా యూదులను అన్యులను వేర్పరచింది. అయితే, సా.శ. 33లో యేసు క్రీస్తు మరణం ఆధారంగా ఆ గోడ తీసివేయబడింది.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి