దైవిక శాంతి సందేశకులుగా సేవచేయడం
“సమాధానము [“శాంతిని,” NW] చాటించు . . . వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.”—యెషయా 52:7.
1, 2. (ఎ) యెషయా 52:7 వచనంలో ప్రవచించినట్లుగా ఏ సువార్త ప్రకటించబడాల్సివుంది? (బి) ప్రాచీనకాల ఇశ్రాయేలీయుల విషయంలో యెషయా ప్రవచనాత్మక మాటలు ఏ భావాన్ని కల్గివున్నాయి?
సువార్త ప్రకటించాల్సి ఉంది! అది శాంతిని గూర్చిన అంటే నిజమైన శాంతిని గూర్చిన వార్త. అది దేవుని రాజ్యాన్ని గూర్చిన రక్షణ సందేశం. దానిని గురించి ఎంతోకాలం క్రిందటే ప్రవక్తయైన యెషయా వ్రాశాడు, మరి ఆయన మాటలు మనకోసం యెషయా 52:7 వచనంలో భద్రపర్చబడి ఉన్నాయి, అక్కడ మనమిలా చదువుతాం: “సువార్త ప్రకటించుచు సమాధానము [“శాంతిని,” NW] చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.”
2 ప్రాచీన ఇశ్రాయేలీయుల ప్రయోజనార్థం, నేడు మన ప్రయోజనార్థం ఆ సందేశాన్ని వ్రాయడానికి యెహోవా తన ప్రవక్తయైన యెషయాను ప్రేరేపించాడు. ఆ మాటల భావం ఏమిటి? ఈ మాటల్ని యెషయా వ్రాసే నాటికి ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలును అస్సీరీయులు చెరపట్టి ఉండొచ్చు. అటుతర్వాత దక్షిణ రాజ్యమైన యూదాదేశ నివాసులు బబులోను దేశానికి బందీలుగా కొనిపోబడ్డారు. ఆ రోజులు జనాంగమంతటికీ వేదనను సంక్షోభాన్ని తెచ్చిపెట్టిన రోజులైవున్నాయి, ఎందుకంటే ప్రజలు యెహోవాకు విధేయత చూపించలేదు. ఆ విధంగా వాళ్లు దేవునితో సమాధానాన్ని కోల్పోయారు. యెహోవా వారికి తెలియజేసినట్లుగానే, వారి పాపభరితమైన ప్రవర్తన వారికి వారి దేవునికి మధ్య అగాధాన్ని సృష్టించింది. (యెషయా 42:24; 59:2-4) అయినా, యుక్తకాలంలో బబులోను ద్వారాలు తెరవబడతాయని యెహోవా యెషయా ద్వారా ప్రవచించాడు. దేవుని ప్రజలు తమ స్వదేశానికి తిరిగివెళ్లి అక్కడ యెహోవా ఆలయాన్ని పునర్నిర్మించేందుకు విడుదల చేయబడతారు. సీయోను పునరుద్ధరించబడి, యెరూషలేములో సత్యదేవుని ఆరాధన మరలా నిర్వహించబడుతుంది.—యెషయా 44:28; 52:1, 2.
3. ఇశ్రాయేలీయుల పునరుద్ధరణను గూర్చిన వాగ్దానం ఏవిధంగా శాంతి ప్రవచనంగా కూడా ఉంది?
3 విడుదలను గూర్చిన ఈ వాగ్దానం కూడా ఓ శాంతి ప్రవచనమే. యెహోవా ఇశ్రాయేలీయులకు అనుగ్రహించిన దేశానికి మరలా తిరిగి వెళ్లడం దేవుని దయకు, వారు పశ్చాత్తాపపడ్డారనడానికి తార్కాణమైవుంది. అది వాళ్లు దేవునితో సమాధానాన్ని కల్గివున్నారని సూచించింది.—యెషయా 14:1; 48:17, 18.
‘నీ దేవుడు ఏలుచున్నాడు!’
4. (ఎ) ‘యెహోవా ఏలుచున్నాడని’ సా.శ.పూ. 537లో ఏ భావంలో చెప్పబడింది? (బి) తర్వాత సంవత్సరాల్లో తన ప్రజల ప్రయోజనార్థమై యెహోవా విషయాల్ని ఎలా మలిచాడు?
4 సా.శ.పూ. 537లో యెహోవా వారిని విడుదల చేసినప్పుడు ‘నీ దేవుడు ఏలుచున్నాడు’ అనే ఈ ప్రకటన సీయోనుకు చక్కగా సరిపోయింది. నిశ్చయంగా యెహోవాయే ‘నిత్యుడగు రాజు.’ (ప్రకటన 15:3) కాని తన ప్రజల్ని తానీవిధంగా విడుదల చేయడం, ఆయన సర్వాధిపత్యాన్ని మరోసారి చూపించింది. అప్పటివరకున్న మానవ సామ్రాజ్యాధిపతుల్లోకెల్లా బలవంతుడైన వానిపై ఆయన బలాధిపత్యాన్ని అది కొట్టొచ్చినట్లుగా ప్రదర్శించింది. (యిర్మీయా 51:56, 57) యెహోవా ఆత్మ పనిచేసినందువల్ల ఆయన ప్రజలకు వ్యతిరేకంగా పన్నిన ఇతర కుట్రలు నీరుగారిపోయాయి. (ఎస్తేరు 9:24, 25) తన సర్వోన్నత చిత్తాన్ని నెరవేర్చడంలో మాదీయ-పారశీక రాజులు సహకరించేలా చేసేందుకు యెహోవా ఎన్నెన్నో రీతుల్లో పదేపదే జోక్యం కలుగజేసుకున్నాడు. (జెకర్యా 4:6) ఆ రోజుల్లో జరిగిన ఆ అద్భుతకరమైన సంఘటనలు మన నిమిత్తం బైబిలు పుస్తకాలైన ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, హగ్గయి మరియు జెకర్యా పుస్తకాల్లో వ్రాయబడ్డాయి. వాటిని పునఃసమీక్షించడం విశ్వాసాన్ని ఎంతగా బలపరుస్తోందో కదా!
5. యెషయా 52:13–53:12 వచనాల్లో ఏ భావగర్భితమైన సంఘటనలు సూచించబడ్డాయి?
5 కాని, సా.శ.పూ. 537లోను అటు తర్వాతను జరిగిన సంగతులు కేవలం ఆరంభం మాత్రమే. యెషయా, 52వ అధ్యాయంలోని పునరుద్ధరణ ప్రవచనాన్ని వ్రాసిన తర్వాత వెనువెంటనే మెస్సీయ రాకడను గురించి వ్రాశాడు. (యెషయా 52:13–53:12) విడుదలను గూర్చిన సందేశాన్ని, సా.శ.పూ. 537లో అనుభవించిన శాంతికన్నా మరెంతో గొప్ప భావాన్ని కల్గివున్న శాంతిని గూర్చిన సందేశాన్ని యేసుక్రీస్తు అనబడిన మెస్సీయ ద్వారా యెహోవా దయచేశాడు.
యెహోవా యొక్క గొప్ప శాంతి సందేశకుడు
6. యెహోవా దేవుని మహాగొప్ప శాంతి సందేశకుడు ఎవరు, ఏ నియామకాన్ని ఆయన తనకు అన్వయించుకున్నాడు?
6 యేసుక్రీస్తు యెహోవా దేవుని గొప్ప శాంతి సందేశకుడు. ఆయనే దేవుని వాక్కు అంటే యెహోవా దేవుని స్వంత వాగ్దూత. (యోహాను 1:14) దీనికి అనుగుణ్యంగానే యేసు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందిన కొంత కాలానికి నజరేతులోని సమాజమందిరంలో నిలబడి, యెషయా 61వ అధ్యాయంలో నుండి తన నియామకాన్ని గూర్చిన భాగాన్ని బిగ్గరగా చదివాడు. “విడుదల,” ‘స్వస్థత’ అలాగే యెహోవాతో సమాధానపడే సదవకాశం ఇమిడివున్న బోధను ప్రకటించేందుకు ఆయన పంపించబడ్డాడన్న విషయాన్ని ఆ నియామకం స్పష్టం చేసింది. కాని, యేసు శాంతి సందేశాన్ని ప్రకటించడంకన్నా ఎంతో ఎక్కువే చేశాడు. దేవుడు శాశ్వతమైన శాంతికి ఆధారాన్ని ఇవ్వడానికి కూడా ఆయన్ని పంపించాడు.—లూకా 4:16-21.
7. దేవునితో సమాధానంగా ఉండడం యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమైంది, దానినుండి ఏ ఫలితాలు వస్తాయి?
7 యేసు జనన సమయంలో బెత్లేహేముకు సమీపంలో దేవదూతలు కాపరులకు ప్రత్యక్షమై దేవునిని స్తుతిస్తూ ఇలా తెలియజేశారు: “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక.” (లూకా 2:8, 13, 14, ఇటాలిక్కులు మావి.) అవును, దేవునికి ఇష్టులైన వారికి సమాధానం ఉంటుంది ఎందుకంటే వాళ్లు ఆయన తన కుమారుని ద్వారా చేసిన ఏర్పాటునందు విశ్వాసాన్ని ఉంచారు. దాని భావం ఏమైవుంది? మానవులు పాపమందే జన్మించినప్పటికీ, వాళ్లు దేవుని ఎదుట పవిత్రమైన స్థానాన్ని అంటే ఆయనతో ఓ అంగీకృతమైన సంబంధాన్ని సంపాదించుకోగలరని దాని భావం. (రోమీయులు 5:1) మరి ఏవిధంగానూ పొందలేని నెమ్మదిని, సమాధానాన్ని వాళ్లు అనుభవించగలరు. దేవుని నియమిత కాలంలో రోగ మరణాలతోపాటు ఆదాము నుండి వచ్చిన స్వాభావిక పాప ప్రభావాలన్నిటి నుండి విడుదల కల్గుతుంది. ప్రజలు ఇక గ్రుడ్డివారుగాను మూగవారుగాను అంగవిహీనులుగాను ఉండరు. నిరుత్సాహపర్చే బలహీనతలు, హృదయాన్ని ద్రవింపజేసే మానసిక రుగ్మతలు శాశ్వతంగా తీసివేయబడతాయి. నిరంతరమూ పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించడం సాధ్యమౌతుంది.—యెషయా 33:24; మత్తయి 9:35; యోహాను 3:16.
8. దైవిక శాంతి ఎవరికి ఇవ్వబడింది?
8 దైవిక శాంతి ఎవరికి లభ్యమౌతుంది? అది యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారందరికీ లభ్యమౌతుంది. ‘ఆయన హింసాకొయ్యపై చిందించిన రక్తంచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తాన్ని తనతో సమాధానపరచుకోవాలనేదే దేవుని అభీష్టం’ అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. ఈ సంధిలో ‘పరలోకమందున్నవి’—అంటే పరలోకమందు క్రీస్తుతోపాటు సహపాలకులుగా పాలించబోయే వాళ్లు చేరివున్నారని అపొస్తలుడైన పౌలు దానికి జోడించాడు. ఇందులో ‘భూలోకమందున్నవి’ అంటే భూమి పూర్తిస్థాయిలో పరదైసుగా మార్చబడినప్పుడు దానిలో నిరంతరం జీవించే అవకాశం అనుగ్రహించబడిన వారు కూడా ఇమిడివున్నారు. (కొలొస్సయులు 1:19, 20) యేసు బలిమరణ విలువను వారు ఉపయోగించుకున్నందున, హృదయపూర్వకంగా వాళ్లు దేవునికి విధేయత చూపించినందున వీళ్లంతా దేవునితో హృదయపూర్వక స్నేహబంధాన్ని అనుభవించగలిగారు.—యాకోబు 2:22, 23 పోల్చండి.
9. (ఎ) దేవునితో సమాధానంగా ఉండడం ఏ ఇతర సంబంధాలను ప్రభావితం చేస్తుంది? (బి) అంతటా శాశ్వతమైన శాంతిని తీసుకురావాలనే ఉద్దేశంతో యెహోవా ఏ అధికారాన్ని తన కుమారునికి ఇచ్చాడు?
9 దేవునితో అటువంటి సమాధానాన్ని కల్గివుండడం ఎంత ప్రాముఖ్యమో కదా! దేవునితో సమాధానమే లేకపోతే ఇతరత్రా ఏవిధమైన సంబంధాల్లోనైనా శాశ్వతమైన లేక అర్థవంతమైన సమాధానం ఉండనే ఉండదు. యెహోవాతో సమాధానం భూమిపై నిజమైన శాంతికి పునాది. (యెషయా 57:19-21) యేసుక్రీస్తు సమాధానకర్తయగు అధిపతియై ఉండడం సముచితమే. (యెషయా 9:6) దేవునితో మానవులు సంధి చేసుకొనడాన్ని సాధ్యంచేసిన ఈయనకే యెహోవా పరిపాలనాధికారాన్ని కూడా అప్పగించాడు. (దానియేలు 7:13, 14) మానవజాతిపై యేసుచేసే అధికారిక పాలనా ఫలితాలను గురించి యెహోవా ఇలా వాగ్దానం చేస్తున్నాడు: ‘మితిలేకుండ . . . క్షేమము కలుగును.’—యెషయా 9:7; కీర్తన 72:7.
10. దేవుని శాంతి సందేశాన్ని ప్రకటించడంలో యేసు ఏ విధంగా ఓ మాదిరిని ఉంచాడు?
10 దేవుని శాంతి సందేశం మానవాళికంతటికీ అవసరం. యేసు దానిని ప్రకటించడంలో తానుగా ఆసక్తికరమైన మాదిరిని ఉంచాడు. యెరూషలేములోని ఆలయ ప్రాంతంలోను, పర్వత ప్రాంతాల్లోను, రహదార్లలోను, బావి దగ్గర సమయరయ స్త్రీకి, ప్రజల నివాస గృహాల్లోను ఆయన అలాగే ప్రకటించాడు. ప్రజలు ఎక్కడవున్నా సరే యేసు దేవుని రాజ్యాన్ని గూర్చి, శాంతిని గూర్చి ప్రకటించడానికి అవకాశాల్ని కల్పించుకున్నాడు.—మత్తయి 4:18, 19; 5:1, 2; 9:9; 26:55; మార్కు 6:34; లూకా 19:1-10; యోహాను 4:5-26.
క్రీస్తు అడుగు జాడల్లో నడిచేందుకు తర్ఫీదు పొందుట
11. యేసు తన శిష్యులకు ఏ పనిలో తర్ఫీదునిచ్చాడు?
11 దేవుని శాంతి సందేశాన్ని ప్రకటించమని యేసు తన శిష్యులకు బోధించాడు. యేసు యెహోవా యొక్క “నమ్మకమైన సత్యసాక్షి”యైనట్లుగానే తాము కూడా సాక్ష్యమిచ్చే బాధ్యతను కల్గివున్నామని వాళ్లు గుర్తించారు. (ప్రకటన 3:14; యెషయా 43:10-12) వాళ్లు తమ నాయకునిగా క్రీస్తువైపు చూశారు.
12. ప్రకటనాపని ప్రాముఖ్యతను పౌలు ఏవిధంగా చూపించాడు?
12 అపొస్తలుడైన పౌలు ప్రకటనాపని ప్రాముఖ్యతను గూర్చి తర్కిస్తూ ఇలా చెబుతున్నాడు: “ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.” అంటే యెహోవా రక్షణాధిపతిగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచు వాడెవడూ నిరుత్సాహం చెందడు. “యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువైయుండి, తనకు ప్రార్థనచేయు వారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు. ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును” అని పౌలు తెలియజేస్తున్నాడు గనుక ఒకని జాతి ఏదైనా అది అతనిని అనర్హునిగా చెయ్యదు. (రోమీయులు 10:11-13) ఆ అవకాశాన్ని గూర్చి ప్రజలు ఏవిధంగా తెలుసుకోగల్గుతారు?
13. ప్రజలు సువార్తను వినాలంటే కావాల్సిందేమిటి, ఆ అవసరతకు మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఎలా ప్రతిస్పందించారు?
13 యెహోవా దేవుని సేవకుడైన ప్రతిఒక్కడూ ఆలోచించాల్సిన ప్రశ్నల్ని అడుగుతూ పౌలు ఆ అవసరతను గురించి చర్చించాడు. అపొస్తలుడు ఇలా అడిగాడు: “వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు?” (రోమీయులు 10:14, 15) క్రీస్తు, ఆయన అపొస్తలులు ఉంచిన మాదిరికి పురుషులు, స్త్రీలు, యౌవనులు, వృద్ధులు ప్రతిస్పందించారని అనడానికి తొలి క్రైస్తవత్వ చరిత్రే శక్తివంతమైన తార్కాణంగా నిలుస్తోంది. వాళ్లు సువార్తను ఆసక్తిగా ప్రకటించే ప్రచారకులయ్యారు. యేసును అనుకరించడంలో వాళ్లు ప్రజల్ని కనుగొన్న ప్రతిచోటా ప్రకటించారు. ప్రతి ఒక్కరికీ ప్రకటించాలనే అభిలాషతోనే వాళ్లు బహిరంగ స్థలాల్లోను, ఇంటింటా తమ పరిచర్యను కొనసాగించారు.—అపొస్తలుల కార్యములు 17:17; 20:20.
14. సువార్త ప్రకటించువాని “పాదములు సుందరములు” అని ఎలా రుజువైంది?
14 క్రైస్తవ ప్రచారకుల్ని అందరూ సాదరంగా ఆహ్వానించరనుకోండి. అయినా, యెషయా 52:7 వచనం నుండి పౌలు ఉదాహరించిన విషయం వాస్తవమని రుజువైంది. “ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు?” అని ప్రశ్నించిన తర్వాత, ఆయన ఇంకా ఇలా తెలియజేశాడు: “ఇందు విషయమై—ఉత్తమమైనవాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి యున్నది.” మన పాదాలు సుందరంగానో అందంగానో ఉన్నాయని మనలో అనేకులం అనుకోము. మరైతే ఈ లేఖన భావం ఏమిటి? అది ఒక వ్యక్తి ఇతరులకు ప్రకటించడానికి వెళ్తుండగా అతన్ని తీసుకెళ్లే పాదమే. అటువంటి పాదం నిజానికి ఆ వ్యక్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అపొస్తలుల నుండి, మొదటి శతాబ్దంలోని యేసుక్రీస్తు ఇతర శిష్యులనుండి సువార్తను గూర్చి వినిన అనేకమందికి, ఈ తొలి క్రైస్తవులు నిజానికి చూడ ముచ్చటైన దృశ్యంగా ఉన్నారని మనం నిశ్చయంగా చెప్పగలం. (అపొస్తలుల కార్యములు 16:13-15) అంతేగాక వాళ్లు దేవుని దృష్టికి అమూల్యమైన వ్యక్తులై ఉన్నారు.
15, 16. (ఎ) తొలి క్రైస్తవులు తాము నిజంగా శాంతి సందేశకులని ఏవిధంగా చూపించుకున్నారు? (బి) మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు చేసినట్లుగానే మన పరిచర్యను జరిగించడానికి మనకు ఏది సహాయపడగలదు?
15 యేసు అనుచరులు శాంతి సందేశాన్ని కల్గివున్నారు, వారు దానిని సామరస్యపూరితమైన విధానంలో అందించారు. యేసు తన శిష్యులకు ఈ ఉపదేశాల్ని ఇచ్చాడు: “మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడు—ఈయింటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి. సమాధానపాత్రుడు అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగి వచ్చును.” (లూకా 10:5, 6) షాలోమ్ లేదా “సమాధానము” అనేది యూదుల సాంప్రదాయక అభివాదం. అయినా, యేసు ఉపదేశాల్లో ఇంతకన్నా ఎక్కువే ఇమిడివుంది. ‘క్రీస్తుకు రాయబారులుగా’ ఆయన అభిషిక్త శిష్యులు ప్రజలకు ఇలా ఉద్బోధించారు: ‘దేవునితో సమాధానపడండి.’ (2 కొరింథీయులు 5:20) యేసు ఉపదేశాలకు అనుగుణంగా వాళ్లు ప్రజలతో దేవుని రాజ్యాన్ని గూర్చి మాట్లాడి, వారికది ఏ భావాన్ని ఇస్తుందో తెలియజేశారు. వినినవారు ఆశీర్వాదాల్ని పొందారు; తిరస్కరించినవారు కోల్పోయారు.
16 అదేవిధంగా నేడు యెహోవాసాక్షులు తమ పరిచర్యను కొనసాగిస్తున్నారు. ప్రజల దగ్గరకు వారు తీసుకువెళ్తున్న సువార్త వారిది కాదు; అది వారిని పంపించిన వానిది. దానిని తెలియజేయడమే వారి నియామకం. ప్రజలు దానిని అంగీకరిస్తే, అద్భుతకరమైన ఆశీర్వాదాల్ని పొందగలిగే స్థానంలో తమ్మును ఉంచుకోగల్గుతారు. వారు దానిని తిరస్కరిస్తే, వాళ్లు యెహోవా దేవునితోను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోను సమాధానపడడాన్ని తిరస్కరిస్తున్నారు.—లూకా 10:16.
కల్లోలిత లోకంలో సమాధానంగా ఉండడం
17. దూషించే ప్రజల్ని కలుసుకున్నప్పుడు కూడా మనం ఎలా ప్రవర్తించాలి, ఎందుకు?
17 ప్రజల ప్రతిస్పందన ఏదైనా సరేగాని తాము దైవిక శాంతి సందేశకులమని యెహోవా సేవకులు తమ మనస్సులో ఉంచుకోవడం ప్రాముఖ్యం. ఈ లోకపు జనులు తీవ్రమైన వాగ్వివాదాల్లోను, కోపాన్ని వ్యక్తంచేయడంలోను మునిగిపోయి ఉండొచ్చు, వాళ్లు దీనిని గాయపర్చే మాటలద్వారాగాని తమ్మును చికాకుపర్చే వారిని తీవ్రమైన పదజాలంతో కేకలు వేయడంద్వారాగాని చేయవచ్చు. బహుశా మనలో కొందరు ఇంతకు మునుపు అలాగే చేసివుండొచ్చు. అయినా, మనం నూతన వ్యక్తిత్వాన్ని ధరించి, ఈ లోక సంబంధులం కాకపోయినట్లయితే మనం వారి పద్ధతుల్ని అనుకరించం. (ఎఫెసీయులు 4:23, 24, 31; యాకోబు 1:19, 20) ఇతరులు ఎలా ప్రవర్తించినా సరే, మనం ఈ సలహాను అన్వయించుకుంటాం: “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.”—రోమీయులు 12:18.
18. ప్రభుత్వాధికారి మన ఎడల కఠినంగా ప్రవర్తిస్తే మనం ఏవిధంగా ప్రతిస్పందించాలి, ఎందుకు?
18 మన పరిచర్య మనల్ని కొన్నిసార్లు ప్రభుత్వాధికారుల ఎదుటకు తీసుకువెళ్లవచ్చు. తమ అధికారాన్ని ఉపయోగించి, మనం ఫలాన పనుల్ని ఎందుకు చేస్తున్నామో లేక మనం ఫలాన కార్యక్రమంలో ఎందుకు పాల్గొనడంలేదో వివరణ ఇవ్వమని వాళ్లు ‘మనల్ని డిమాండ్’ చేయవచ్చు. అబద్ధ మతాన్ని బయల్పర్చి, ప్రస్తుత విధానాంతాన్ని గురించి తెలియజేస్తున్న సందేశాన్ని మనం ఎందుకు ప్రకటిస్తున్నామో వాళ్లు తెల్సుకొనగోరవచ్చు. క్రీస్తు ఉంచిన మాదిరి ఎడల మనకుగల గౌరవం మనం సాత్వికాన్ని ప్రగాఢమైన గౌరవాన్ని చూపించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. (1 పేతురు 2:23; 3:15) తరచుగా, అటువంటి అధికారులు మతగురువుల ఒత్తిడికో లేక బహుశా తమ పైఅధికారుల ఒత్తిడికో లోనవుతారు. మన పని వారికి హానిని కల్గించేది కాదని లేక సమాజ సామరస్యానికి ముప్పును తెచ్చేది కాదని గుణగ్రహించడానికి సాత్వికమైన జవాబు సహాయపడవచ్చు. అలాంటి జవాబును అంగీకరించిన వారిలో అది గౌరవాన్ని సహకారాన్ని సామరస్యాన్ని కల్గించే స్ఫూర్తిని ప్రేరేపిస్తుంది.—తీతు 3:1, 2.
19. ఏ కార్యకలాపాల్లో యెహోవాసాక్షులు ఎన్నడూ పాల్గొనరు?
19 యెహోవాసాక్షులు ప్రపంచ కలహాల్లో ఏ విధమైన భాగాన్ని వహించని ప్రజలుగా భూవ్యాప్తంగా పేరుగాంచారు. జాతి, మతం లేక రాజకీయాలకు సంబంధించిన ప్రపంచ పోరాటాల్లో వారు చేరరు. (యోహాను 17:14) “పై అధికారులకు లోబడియుండవలెను” అని దేవుని వాక్యం మనకు బోధిస్తోంది గనుక ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనను వ్యక్తంచేసే ఉద్దేశంతో పౌర శాంతికి భంగంకల్గించే కార్యకలాపాల్లో పాల్గొనాలనే తలంపును కూడా రానివ్వం. (రోమీయులు 13:1) ఒక ప్రభుత్వాన్ని కూలద్రోయాడానికి ఉద్దేశించిన ఏ ఉద్యమాల్లోనైనా యెహోవాసాక్షులు ఎప్పుడూ చేరలేదు. తన క్రైస్తవ సేవకుల కొరకు యెహోవా ఏర్పాటు చేసిన ప్రమాణాలనుబట్టి ఏ రూపంలోనైనా రక్తాన్ని చిందించడం లేక హింసాత్మక చర్యల్లో పాల్గొనడం అనే విషయం తలంచని విషయం! నిజ క్రైస్తవులు శాంతిని గురించి మాట్లాడడం మాత్రమే కాదుగాని వాళ్లు తాము ప్రకటించినదానికి అనుగుణంగా జీవిస్తారు.
20. శాంతికి సంబంధించినంతవరకూ మహాబబులోను ఎటువంటి చరిత్రను కల్గివుంది?
20 నిజ క్రైస్తవులకు భిన్నంగా, క్రైస్తవమత సామ్రాజ్య మత సంస్థలకు ప్రాతినిధ్యం వహించిన వారు శాంతి సందేశకులుగా రుజువు చేసుకోలేదు. మహాబబులోను మతాలైన క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు, క్రైస్తవేతర మతాలు దేశాలమధ్య యుద్ధాల్ని సమ్మతించి మద్దతునిచ్చి అలాగే నాయకత్వాన్ని వహించాయి. అవి యెహోవా నమ్మకమైన సేవకులను హింసించి, హత్యచేయడానికి కూడా ప్రేరేపించాయి. అందునుబట్టే మహాబబులోను గురించి ప్రకటన 18:24 ఇలా ప్రకటిస్తోంది: “ప్రవక్తలయొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింపబడినవారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను.”
21. యథార్ధ హృదయులు అనేకులు యెహోవా ప్రజల ప్రవర్తనలోను, అబద్ధమతాన్ని అవలంభించేవారి ప్రవర్తనలోను వ్యత్యాసాన్ని కనుగొన్నప్పుడు ఏవిధంగా ప్రతిస్పందిస్తారు?
21 నిజమైన మతమనేది క్రైస్తవ సామ్రాజ్య మతాలు, మహాబబులోనుకు చెందిన మిగతా మతాలవలెగాక ఓ అనుకూలమైన సమైక్య శక్తియైవుంది. యేసుక్రీస్తు తన నిజమైన అనుచరులకు ఇలా చెప్పాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” (యోహాను 13:35) ఇప్పుడు మానవజాతిని విభజిస్తున్న దేశ, సామాజిక, ఆర్థిక, జాతి సంబంధమైన హద్దుల్ని ఆ ప్రేమ అధిగమిస్తోంది. దీనిని గుర్తించిన భూవ్యాప్తంగానున్న లక్షలాదిమంది ప్రజలు యెహోవా అభిషిక్త సేవకులతో ఇలా చెబుతున్నారు: “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుము.”—జెకర్యా 8:23.
22. ఇంకా జరగాల్సివున్న సాక్ష్యమిచ్చే పనిని మనమెలా దృష్టించాలి?
22 యెహోవా ప్రజలుగా మనం, సాధించిన దానినిబట్టి ఎంతగానో ఆనందిస్తాం, కాని ఆ పని ఇంకా పూర్తికాలేదు. విత్తనాన్ని విత్తి, తన పొలాన్ని సాగుచేసిన తర్వాత వ్యవసాయకుడు ఊరకే కూర్చోడు. అతడు పనిచేస్తూనే ఉంటాడు, విశేషంగా కోత పక్వానికివచ్చే కాలంలో మరింతగా పని చేస్తూ ఉంటాడు. కోతకాలంలో నిర్విరామ ప్రయత్నం తీవ్రమైన కృషి అవసరం. ఎప్పటికన్నా ఇప్పుడు సత్య దేవుని ఆరాధికుల మహోన్నతమైన కోతవుంది. ఇది ఆనందించే కాలం. (యెషయా 9:3) మనం వ్యతిరేకత ఉదాసీనతలను ఎదుర్కుంటాం. వ్యక్తులుగా, మనం తీవ్రమైన రోగాలతోను క్లిష్టమైన కుటుంబ పరిస్థితులతోను లేక ఆర్థిక సంక్షోభాలతోను వ్యవహరించేందుకు పోరాడాల్సివుండొచ్చు. కాని యెహోవా ఎడలగల ప్రేమ, మనం పట్టుదల కల్గివుండేలా మనల్ని ప్రేరేపిస్తుంది. దేవుని ద్వారా మనకు అప్పగించబడిన ఈ సందేశాన్ని ప్రజలు వినాల్సివుంది. అది ఓ శాంతి సందేశమే. అది యేసు కూడా ప్రకటించిన దేవుని రాజ్య సువార్తను గూర్చిన సందేశం.
మీ జవాబు ఏమిటి?
◻ ప్రాచీనకాల ఇశ్రాయేలీయుల విషయంలో యెషయా 52:7 వచనం ఏ నెరవేర్పును కల్గివుంది?
◻ యేసు మహాగొప్ప శాంతి సందేశకునిగా ఏవిధంగా రుజువు చేసుకున్నాడు?
◻ క్రైస్తవులు పాలుపంచుకునే పనికి అపొస్తలుడైన పౌలు యెషయా 52:7 వచనాన్ని ఎలా ముడిపెట్టాడు?
◻ మన కాలంలో శాంతి సందేశకులుగా ఉండడంలో ఇమిడివున్నది ఏమిటి?
[13వ పేజీలోని చిత్రం]
యేసువలె యెహోవాసాక్షులు దైవిక శాంతి సందేశకులు
[15వ పేజీలోని చిత్రం]
ప్రజలు రాజ్య సందేశానికి ఎలా ప్రతిస్పందించినా యెహోవాసాక్షులు శాంతి కాముకులుగానే ఉంటారు