యెహోవా మిమ్మును శక్తిమంతులను చేయగలడు
“సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.”—యెషయా 40:29.
1, 2. యెహోవా యొక్క విస్తృతమైన శక్తికి కొన్ని రుజువులు ఏవి?
యెహోవా దేవుడు “అధిక శక్తిగలవాడు.” దేవుని భౌతిక సంబంధమైన సృష్టి వైభవంలో ఆయన ‘నిత్యశక్తి మరియు దేవత్వములను’ గూర్చిన రుజువును చూడగలము. ఆయన సృష్టికర్తృత్వాన్ని గూర్చిన అటువంటి రుజువును అంగీకరించడాన్ని తిరస్కరించేవారు, క్షమార్హులు కారు.—కీర్తన 147:5; రోమీయులు 1:19, 20.
2 కోటానుకోట్ల కాంతి సంవత్సరాలంత దూరం వ్యాపించిన అసంఖ్యాకమైన నక్షత్ర వీధులున్న విశ్వాంతరంలోకి విజ్ఞానశాస్త్రవేత్తలు పరిశోధిస్తుండగా యెహోవా శక్తి అత్యధికంగా నిరూపించ బడుతుంది. ఒక నిర్మలమైన చీకటిరాత్రి మీరు ఆకాశంలోకి పరికించి చూసినప్పుడు మీరు కీర్తనల గ్రంథకర్త వలె యిలా భావించగలరేమో చూడండి: “నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?” (కీర్తన 8:3, 4) మానవులమైన మన గురించి యెహోవా ఎంత శ్రద్ధ తీసుకున్నాడు! ఆయన మొదటి స్త్రీపురుషులకు అందమైన భూగృహాన్ని యిచ్చాడు. దాని నేలకు కాలుష్య రహితమైన పోషకాహారాన్నిచ్చే మొక్కలను పెంచే శక్తి కూడా వుంది. దేవుని శక్తి యొక్క ఈ వ్యక్తీకరణ నుండి మానవులు, జంతువులు భౌతిక శక్తిని పొందుతారు.—ఆదికాండము 1:12; 4:12; 1 సమూయేలు 28:22.
3. విశ్వంలోని భౌతిక విషయాలే కాకుండా, ఏది కూడా దేవుని శక్తిని వ్యక్తపరుస్తుంది?
3 ఆకాశం ఆకర్షణీయంగా వుండడం, భూమి యొక్క జంతు వృక్షాదులు ఆనందకరంగా వుండడమే కాక, అవి మనకు దేవుని శక్తిని కనపరుస్తాయి. అపొస్తలుడైన పౌలు యిలా వ్రాశాడు: “ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి.” (రోమీయులు 1:20) మన అవధానాన్ని, మెప్పును పొందదగిన ఆయన శక్తి యొక్క మరో రుజువు కూడా వుంది. ‘విశ్వం కంటే ఎక్కువగా ఏది దేవుని శక్తిని ప్రదర్శించగలదు?’ అని మీరు ఆశ్చర్యపోవచ్చు. దానికి జవాబు యేసుక్రీస్తు. వాస్తవానికి, సిలువవేయబడిన క్రీస్తు “దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు” అని అపొస్తలుడైన పౌలు ప్రేరేపింపబడినవాడై చెబుతున్నాడు. (1 కొరింథీయులు 1:24) ‘ఎందుకలా? యిప్పుడది నా జీవితంతో ఏ సంబంధాన్ని కలిగివుండగలదు?’ అని మీరడగవచ్చు.
ఆయన కుమారుని ద్వారా వ్యక్తపర్చబడిన శక్తి
4. ఆయన కుమారునికి సంబంధించి దేవుని శక్తి ఎలా చూపబడింది?
4 దేవుడు తన అద్వితీయ కుమారున్ని తన స్వరూపమందు సృష్టించినప్పుడు దేవుని శక్తి మొదట ప్రదర్శించబడింది. ఈ ఆత్మీయ కుమారుడు మిగిలిన సృష్టినంతటిని సృష్టించుట యందు దేవుని అధిక శక్తిని ఉపయోగించడం ద్వారా యెహోవా యొక్క “ప్రధానశిల్పి”గా పనిచేశాడు. (సామెతలు 8:22, 30) కొలొస్సీలోని తన క్రైస్తవ సహోదరులకు పౌలు యిలా వ్రాశాడు: “ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, . . . ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.”—కొలొస్సయులు 1:16.
5-7. (ఎ) పూర్వం, దేవుని శక్తి యొక్క వ్యక్తీకరణలో మానవులు ఎలా యిమిడివున్నారు? (బి) నేడు క్రైస్తవుల విషయంలో దేవుని శక్తి ప్రదర్శించబడగలదని విశ్వసించడానికి ఏ కారణం కలదు?
5 మనం “భూమియందు . . . సృజింపబడిన” వాటిలోని వారము. కాబట్టి దేవుని శక్తి మానవులమైన మనకు కూడా అందజేయబడగలదా? అపరిపూర్ణ మానవులతో దేవుడు వ్యవహరించిన వాటన్నిటిలో, కొన్ని సమయాల్లో తన సేవకులు తన సంకల్పాలను నెరవేర్చడానికి వీలుగా యెహోవా వారికి అదనపు శక్తిని అనుగ్రహించాడు. సాధారణంగా అపరిపూర్ణ మానవులు 70 లేక 80 సంవత్సరాలు జీవించగలరని మోషేకు తెలుసు. (కీర్తన 90:10) అయితే మోషే విషయం ఏమిటి? ఆయన 120 సంవత్సరాలు జీవించాడు, అయినా “అతనికి దృష్టి మాంద్యములేదు, అతని సత్తువు తగ్గలేదు.” (ద్వితీయోపదేశకాండము 34:7) అంటే దేవుడు తన సేవకులను అంత కాలం జీవింపనిస్తాడని లేక అలాంటి బలాన్ని యిస్తాడని దాని భావం కాదు గాని, యెహోవా మానవులకు శక్తినివ్వగలడని అది నిరూపిస్తుంది.
6 అబ్రాహాము భార్య యెడల దేవుడు చేసిన కార్యం స్త్రీ పురుషులను బలపర్చగల దేవుని సామర్థ్యాన్ని చూపిస్తుంది. “విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.” లేక ఇశ్రాయేలులోని న్యాయాధిపతులను, యితరులను దేవుడు ఎలా బలపర్చాడో చూడండి: ‘గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలు మరియు ఇతర ప్రవక్తలు . . . బలహీనులుగా ఉండి బలపర్చబడిరి.’—హెబ్రీయులు 11:11, 32-34.
7 మన విషయంలో కూడా అలాంటి శక్తి పనిచేయగలదు. అయితే, యిప్పుడు ఒక అద్భుతం ద్వారా పిల్లలు అనుగ్రహించబడతారని మనం ఎదురుచూడలేము, లేక సమ్సోను వలె మనం మహాబలాన్ని ప్రదర్శించలేకపోవచ్చు. కొలొస్సీలోని సగటు మనుష్యులకు పౌలు చెప్పినట్లుగా, మనం శక్తిమంతులం కాగలము. అవును, పౌలు పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు వ్రాశాడు, మనం నేడు అలాంటివారినే సంఘాల్లో కనుగొంటాము, వారు “సంపూర్ణ బలముతో బలపరచ” బడ్డారని ఆయన చెప్పాడు.—కొలొస్సయులు 1:12.
8, 9. మొదటి శతాబ్దంలో, మన వంటి మానవుల విషయంలో యెహోవా శక్తి ఎలా ప్రదర్శించబడింది?
8 యేసు భూపరిచర్య సమయంలో, యెహోవా తన కుమారుని ద్వారా తన శక్తి పనిచేస్తున్నదని స్పష్టపర్చాడు. ఉదాహరణకు, కపెర్నహూములో అనేకులు యేసు చుట్టు మూగినప్పుడు, “ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను.”—లూకా 5:17.
9 ‘పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు’ అని యేసు తన పునరుత్థానం తర్వాత, తన అనుచరులను ధైర్యపర్చాడు. (అపొస్తలుల కార్యములు 1:8) ఎంత వాస్తవం! సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత కొన్ని దినాలకు ఏమి జరిగిందో ఒక చరిత్రకారుడు యిలా నివేదిస్తున్నాడు: “అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి.” (అపొస్తలుల కార్యములు 4:33) దేవుడు ఆయనకు చేయమని యిచ్చిన పనులను చేయడానికి బలపర్చబడినవారిలో పౌలు తానే ఒకడు. ఆయన మారి, తిరిగి చూపు పొందిన తర్వాత, ఆయన “మరి ఎక్కువగా బలపడి—ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను.”—అపొస్తలుల కార్యములు 9:22.
10. పౌలు విషయంలో దేవుని శక్తి ఎలా సహాయకరంగా వుంది?
10 వేలాది కిలోమీటర్ల ప్రయాణంలో మూడు మిషనరీ యాత్రలను కొనసాగించడానికి అవసరమైన ఆత్మీయ, మానసిక సామర్థ్యాన్ని గూర్చి మనం పరిశీలించినప్పుడు, నిజంగా పౌలుకు అదనపు శక్తి అవసరమైయుండెను. చెరసాలలో వేయబడి, ప్రాణాపాయాన్ని ఎదుర్కోవడం ద్వారా, ఆయన అన్ని రకాలైన కష్టాలను సహించాడు. ఎలా? ఆయనిలా సమాధానమిచ్చాడు: “నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, . . . ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను.”—2 తిమోతి 4:6-8, 17; 2 కొరింథీయులు 11:23-27.
11. దేవుని శక్తికి సంబంధించి, కొలొస్సీ నందలి తన తోటి సేవకుల విషయంలో పౌలు ఏ నిరీక్షణను సూచించాడు?
11 కొలొస్సీలోని ‘క్రీస్తునందు విశ్వాసులైన తన సహోదరులకు’ వ్రాసేటప్పుడు, వారు “ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు [యెహోవా యొక్క] మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచ” బడతారని పౌలు వారికి అభయమిచ్చాడంటే అందులో ఆశ్చర్యం లేదు. (కొలొస్సయులు 1:2, 12) ఆ మాటలు ప్రాథమికంగా అభిషక్త క్రైస్తవులకు చెప్పబడినవైనప్పటికీ, క్రీస్తు అడుగుజాడలను అనుసరించి నడుచుకొనే వారందరు పౌలు వ్రాసిన దాని నుండి ఎంతో ప్రయోజనం పొందవచ్చు.
కొలొస్సీ నందు బలపర్చబడడం
12, 13. కొలొస్సయులకు వ్రాయబడిన పత్రిక పూర్వాపరాలు ఏమిటి, దానికి ప్రతిస్పందన ఏమైయుండెను?
12 ఆసియా నందలి రోములో వున్న కొలొస్సీలోని సంఘం, బహుశా ఎపఫ్రా అనే విశ్వాసియైన క్రైస్తవుడు ప్రకటించడం ద్వారా ఏర్పడివుండవచ్చు. సా.శ. 58లో రోము నందు పౌలు చెరసాలలో వేయబడటాన్ని గూర్చి అతడు విన్నప్పుడు, అపొస్తలుని దర్శించి, కొలొస్సీ నందలి ఆయన సహోదరుల ప్రేమ మరియు స్థిరత్వాన్ని గూర్చి చెప్పి ఆయనను ప్రోత్సహించాలని ఎపఫ్రా నిశ్చయించుకున్నట్లు కనిపిస్తుంది. కొలొస్సీ సంఘంలోని సరిచేయవలసిన అవసరత గల కొన్ని సమస్యలను గూర్చి కూడా ఎపఫ్రా ఉన్నదున్నట్లు తెలియజేసి వుండవచ్చు. దానికి పౌలు, సంఘాన్ని ప్రోత్సహిస్తూ, హెచ్చరిస్తూ ఉత్తరం వ్రాయాలని పురికొల్పబడ్డాడు. మీరు కూడా ఆ లేఖ యొక్క మొదటి అధ్యాయం నుండి ఎంతో ప్రోత్సాహాన్ని పొందగలరు, ఎందుకంటే యెహోవా తన సేవకులను ఎలా బలపర్చగలడనే విషయాన్ని అది తెలియజేస్తుంది.
13 పౌలు వారిని “క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు” అని వర్ణించినప్పుడు కొలొస్సీలోని సహోదర సహోదరీలు ఎలా భావించి వుంటారో మీరు ఊహించవచ్చు. వారు క్రైస్తవులైనప్పటి నుండి ‘పరిశుద్ధుల యెడల కనపర్చిన ప్రేమను’ బట్టి మరియు ‘సువార్త ఫలాలను ఫలించినందుకు’ వారు మెప్పు పొందాలి! మన సంఘాన్ని గూర్చి, వ్యక్తిగతంగా మనల్ని గూర్చి యిలాంటి భావాలనే వ్యక్తపర్చవచ్చా?—కొలొస్సయులు 1:2-8.
14. కొలొస్సయుల గురించి పౌలు కోరిక ఏమైయుండెను?
14 పౌలు తాను వినిన దాని ద్వారా ఎంతగా కదిలింపబడ్డాడంటే, వారు “సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, [దేవుని] చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని” అడుగుతూ, వారి గురించి ప్రార్థించడం తాను మానివేయలేదని కొలొస్సయులకు చెప్పాడు.—కొలొస్సయులు 1:9-12.
నేడు కూడా బలపర్చబడడం
15. పౌలు కొలొస్సయులకు వ్రాసిన దానిలో వ్యక్తపర్చబడినలాంటి దృక్పథాన్నే మనం ఎలా ప్రదర్శించవచ్చు?
15 పౌలు మన కొరకు ఎంత చక్కని మాదిరి నుంచాడు! భూ వ్యాప్తంగా వున్న మన సహోదరులు, బాధలు వున్నప్పటికీ సహించుకొని, తమ ఆనందాన్ని కాపాడుకోడానికి వారికి మన ప్రార్థనలు అవసరం. పౌలు వలె మనం, మరో సంఘంలో, లేక మరో దేశంలోవున్న సహోదరులు కష్ట సమయాలను ఎదుర్కొంటున్నారని మనకు వార్త అందినప్పుడు మన ప్రార్థనలలో వారిని ప్రత్యేకంగా గుర్తుచేసుకోవాలి. దగ్గరలోవున్న సంఘంలో ప్రకృతి వైపరీత్యం లేక ఒక ఆత్మీయ కష్టం వచ్చి వుండవచ్చు. లేదా అంతర్యుద్ధం లేక జాత్యాంతర హత్యలు జరుగుతున్న దేశంలో క్రైస్తవులు బాధపడుతుండవచ్చు. మనం ప్రార్థనలో, మన సహోదరులు “ఆయనకు [యెహోవాకు] తగినట్టుగా నడుచుకొనవలెనని,” వారు సహిస్తూ రాజ్య ఫలాలను ఫలించుటలో కొనసాగుటకు, జ్ఞానమందు వృద్ధి చెందుటకు సహాయం చేయమని దేవున్ని అడగాలి. ఈవిధంగా దేవుని సేవకులు ఆయన ఆత్మ శక్తిని పొంది, “సంపూర్ణ బలముతో బలపర్చ” బడతారు. మీ తండ్రి విని, ప్రతిఫలమిస్తాడని మీరు నమ్మవచ్చు.—1 యోహాను 5:14, 15.
16, 17. (ఎ) పౌలు వ్రాసినట్లుగా, మనం దేని గురించి కృతజ్ఞత కలిగివుండాలి? (బి) దేవుని ప్రజలు ఏ భావంలో విడుదల చేయబడ్డారు, క్షమించబడ్డారు?
16 కొలొస్సయులు ‘తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు వారిని పాత్రులనుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని’ పౌలు వ్రాశాడు. ఆయన రాజ్యం యొక్క పరలోక పరిధిలోనైనప్పటికీ లేక భూ పరిధిలోనైనప్పటికీ, ఆయన ఏర్పాటులో మన స్థానాన్నిబట్టి మనం కూడా మన పరలోకపు తండ్రికి కృతజ్ఞతలు తెలియజేద్దాము. అపరిపూర్ణ మానవులను దేవుడు ఏవిధంగా తన దృష్టికి తగినట్లు చేస్తాడు? పౌలు తన అభిషక్త సహోదరులకు యిలా వ్రాశాడు: “ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను. ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.”—కొలొస్సయులు 1:13, 14.
17 యెహోవా ప్రియ కుమారుని విమోచన క్రయధనమనే ప్రశస్తమైన ఏర్పాటు నందలి మన విశ్వాసం ద్వారా నెరవేర్చబడిన మన నిరీక్షణ పరలోక సంబంధమైనదైనా, భూలోక సంబంధమైనదైనా, అంధకారసంబంధమైన ఈ దుష్ట విధానం నుండి మనలను తప్పిస్తున్నందుకు మనం దేవునికి రోజూ కృతజ్ఞతలు తెలియజేస్తాము. (మత్తయి 20:28) ఆత్మాభిషేకం పొందిన క్రైస్తవులు ‘దేవుని ప్రేమ కుమారుని రాజ్యంలోకి మార్చబడేలా’ విమోచన క్రయధనం వారికి ఒక ప్రత్యేకమైన విధానంలో అన్వయించబడడం ద్వారా వారు ప్రయోజనం పొందారు. (లూకా 22:20, 29, 30) కాని “వేరే గొఱ్ఱెలు” కూడా విమోచన క్రయధనం ద్వారా యిప్పుడూ ప్రయోజనం పొందుతారు. (యోహాను 10:16) వారు ఆయన స్నేహితులుగా ఆయన యెదుట నీతియుక్తమైన స్థానం కలిగివుండడానికి దేవుని క్షమాపణను పొందగలరు. ఈ అంత్య కాలంలో, “ఈ రాజ్య సువార్తను” ప్రకటించడంలో వారు ఎక్కువగా పొల్గొంటున్నారు. (మత్తయి 24:14) అంతేగాక, క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనాంతానికి, పూర్తిగా నీతిమంతులు, శారీరకంగా పరిపూర్ణులు కాగల అద్భుతమైన నిరీక్షణ వారికుంది. ప్రకటన 7:13-17 నందలి వివరణను మీరు చదువుతుండగా, విడుదల చేయబడడానికి మరియు ఆశీర్వదింపబడడానికి యిది ఒక రుజువుగా వుందని మీరు అంగీకరించరేమో చూడండి.
18. కొలొస్సయులకు వ్రాసిన పత్రికలో సూచించబడిన ఏ సమాధానపడడాన్ని దేవుడు యింకా సాధిస్తున్నాడు?
18 జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషికి మనం ఎంతగా రుణపడివున్నామో గ్రహించడానికి పౌలు పత్రిక మనకు సహాయం చేస్తుంది. క్రీస్తు ద్వారా దేవుడు ఏమి సాధిస్తున్నాడు? ‘[అది] ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధాన పరచుకొనుట.’ ఏదెనులో తిరుగుబాటు జరుగక మునుపు వున్నట్లుగా, సృష్టి నంతటిని మళ్లీ తనతో పూర్తిగా సమాధానపరచుకోవాలన్నది దేవుని సంకల్పము. అన్నిటిని సృష్టించడానికి ఉపయోగించుకొనబడిన వాడే ఈ సమాధానాన్ని సాధించడానికి యిప్పుడు ఉపయోగించుకొన బడుతున్నాడు.—కొలొస్సయులు 1:20.
ఏం సాధించడానికి బలపర్చబడడం?
19, 20. మనం పరిశుద్ధంగా, నిరపరాధులుగా వుండడం దేనిపై ఆధారపడివుంది?
19 దేవునితో సమాధానపర్చబడినవారికి బాధ్యతలు వస్తాయి. మనం ఒకప్పుడు పాపులుగా వుండి, దేవుని నుండి దూరమయ్యాము. కాని, యిప్పుడు, యేసు బలియందు విశ్వాసముంచి, దుష్టక్రియలపై మన మనస్సులను ఎంత మాత్రం వుంచుకోకుండా, మనం ప్రాథమికంగా, “[దేవుని] సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను” నిలబడతాము. (కొలొస్సయులు 1:21, 22) ఊహించండి, ప్రాచీన విశ్వాసులైన సాక్షులను బట్టి దేవుడు ఎలా సిగ్గుపడలేదో, అలాగే ఆయన మనల్ని బట్టి కూడా మన దేవుడని పిలిపించుకోడానికి సిగ్గుపడడు. (హెబ్రీయులు 11:16) నేడు, ఆయన సూచనార్థక నామానికి తప్పుగా ప్రాతినిధ్యం వహిస్తున్నామని, లేక భూదిగంతాలకు ఆ నామాన్ని ప్రకటించడానికి భయపడుతున్నామని ఎవరూ మనల్ని నిందించలేరు!
20 అయినా, కొలొస్సయులు 1:23 నందు పౌలు జతచేసిన హెచ్చరికను గమనించండి: “పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచి యుండినయెడల ఇది మీకు కలుగును.” మనం యెహోవాకు యథార్థంగా వుండడంపై, ఆయన ప్రియకుమారుని అడుగుజాడలను అనుసరించడంపై ఎంతో ఆధారపడివుంది. యెహోవా మరియు యేసు మన కొరకు ఎంతో చేశారు! పౌలు ఉపదేశాన్ని అనుసరించడం ద్వారా మనం వారి యెడల మనకున్న ప్రేమను చూపిద్దాము.
21. నేడు ఉత్తేజకరంగా వుండడానికి మనకు గొప్ప కారణం ఎందుకుంది?
21 ‘వారు వినిన సువార్త’ అప్పటికే “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింప” బడిందని విన్నపుడు కొలొస్సీలోని క్రైస్తవులు ఎంతో పులకించిపోయి వుండవచ్చు. నేడు దాదాపు 45 లక్షలకంటే ఎక్కువ మందిచే, 230 కంటే ఎక్కువ దేశాల్లో రాజ్య సువార్త ప్రకటింపబడుతున్నదంటే అది వినడానికి మరింత ఉత్తేజకరంగా వుంటుంది. అంతెందుకు, అన్ని జనాంగాలలో నుండి ప్రతి సంవత్సరం దాదాపు 3,00,000 మంది దేవునితో సమాధాన పడుతున్నారు!—మత్తయి 24:14; 28:19, 20.
22. మనం బాధను ఎదుర్కొన్నప్పటికీ, దేవుడు మన కొరకు ఏమి చేయగలడు?
22 పౌలు కొలొస్సయులకు పత్రిక వ్రాసే సమయానికి చెరసాలలో వున్నట్లు సాక్ష్యాధారం వుంది, అయినప్పటికీ ఆయన దాన్ని బట్టి ప్రలాపించలేదు. బదులుగా, ఆయనిలా చెప్పాడు: “ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించు” చున్నాను. “ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును” కలిగివుండడమంటే ఏమిటో పౌలుకు తెలుసు. (కొలొస్సయులు 1:12, 24) కాని తాను యిది తన స్వంత బలముతో చేయలేదని ఆయనకు తెలుసు. యెహోవా ఆయనను శక్తిమంతుని చేశాడు! నేడు కూడా అదే విధంగా వుంది. చెరసాలలో వేయబడి, హింసింపబడిన వేలాదిమంది సాక్షులు యెహోవాను సేవించడంలోని తమ ఆనందాన్ని కోల్పోలేదు. బదులుగా, యెషయా 40:29-31 నందు కనుగొనబడే దేవుని వాక్య సత్యత్వాన్ని వారు గుణగ్రహించగలిగారు: “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే . . . యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు.”
23, 24. కొలొస్సయులు 1:26 నందు ప్రస్తావించబడిన పరిశుద్ధ మర్మం ఏమిటి?
23 క్రీస్తు చుట్టూ కేంద్రీకరింపబడివున్న సువార్తను గూర్చిన పరిచర్య పౌలుకు ఎంతో ప్రాముఖ్యమైయుండెను. దేవుని సంకల్పంలో క్రీస్తు పాత్ర యొక్క విలువను గుణగ్రహించాలని ఆయన యిష్టపడ్డాడు, అందుకే ఆయన “యుగములలోను తరములలోను మరుగుచేయబడియున్న మర్మము” అని దాన్ని వర్ణించాడు. కాని అది ఎప్పటికీ మర్మముగానే వుండనవసరం లేదు. పౌలు యిలా జతచేశాడు: ‘యిపుడు అది ఆయన పరిశుద్ధులకు బయలుపర్చబడెను.’ (కొలొస్సయులు 1:25-27) ఏదెనులో తిరుగుబాటు జరిగినప్పుడు, ‘స్త్రీ సంతానం సర్పం తలను చితక గొట్టునని’ ప్రవచించినప్పుడు రాబోయే మంచి విషయాల గురించి యెహోవా వాగ్దానం చేశాడు. (ఆదికాండము 3:15) దీని భావమేమిటి? తరతరాలుగా, శతాబ్దాలుగా, అది ఒక మర్మంగా వుండిపోయింది. అటుతర్వాత యేసు వచ్చాడు, ఆయన “జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.”—2 తిమోతి 1:10.
24 అవును, “పరిశుద్ధ మర్మము” క్రీస్తు చుట్టూ, మెస్సియా రాజ్యం చుట్టూ పరిభ్రమిస్తుంది. క్రీస్తుతోపాటు రాజ్య పరిపాలనలో భాగం వహించేవారిని సూచిస్తూ పౌలు “పరలోకమందున్నవి” అన్నాడు. ఇక్కడ నిరంతర పరదైసును అనుభవించే వారైన “భూమి మీది వారికి” అపరిమితమైన ఆశీర్వాదాలను తేవడంలో వీరు పరికరాలుగా ఉపయోగింపబడతారు. గనుక పౌలు “మర్మము యొక్క మహిమైశ్వర్యములను” సూచించడం ఎంత తగినదో మీరు చూడగలరు.—కొలొస్సయులు 1:20, 27.
25. కొలొస్సయులు 1:29 నందు సూచించబడినట్లుగా, యిప్పుడు మన దృక్పథం ఏమైయుండాలి?
25 రాజ్యంలో తన స్థానం కొరకు పౌలు ఎదురు చూశాడు. అయితే దాని కొరకు తాను కేవలం ఊరికే కూర్చుని నిరీక్షిస్తే సరిపోదని ఆయన గుణగ్రహించాడు. “అందునిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.” (కొలొస్సయులు 1:29) జీవాన్ని కాపాడే పరిచర్యను కొనసాగించడానికి యెహోవా క్రీస్తు ద్వారా పౌలును శక్తిమంతుని చేశాడని గమనించండి. యెహోవా నేడు మన కొరకు కూడా అదే చేయగలడు. కాని మనల్ని మనం యిలా ప్రశ్నించుకోవాలి, ‘నేను మొదట సత్యం నేర్చుకున్నప్పుడు సువార్త ప్రకటించడంలో నాకున్న ఆసక్తి యిప్పుడు కూడా నాలో వుందా?’ మీ సమాధానం ఏమిటి? ‘యెహోవా శక్తిని బట్టి పోరాడడం, ప్రయాసపడడం’ కొనసాగించడానికి మనలో ప్రతి ఒక్కరికి ఏది సహాయ పడగలదు? తరువాతి శీర్షిక ఈ విషయాన్ని గూర్చే పరిశీలిస్తుంది.
మీరు గమనించారా?
◻ మానవుల విషయంలో యెహోవా తన శక్తిని ప్రదర్శించగలడని మనం ఎందుకు నమ్మకం కలిగివుండవచ్చు?
◻ కొలొస్సయులు మొదటి అధ్యాయంలోని పౌలు మాటల వెనుకనున్న పూర్వాపరాలు ఏమిటి?
◻ కొలొస్సయులు 1:20 నందు చెప్పబడిన సమాధానపడడాన్ని దేవుడు ఎలా కొనసాగిస్తున్నాడు?
◻ తన శక్తితో, యెహోవా మన ద్వారా ఏమి సాధించగలడు?
[8వ పేజీలోని చిత్రం]
కొలొస్సీ