‘వినయమనే వస్త్రంతో మిమ్మల్ని అలంకరించుకొనండి’
“దేవుడు గర్వంతో ఉన్నవాళ్లకు వ్యతిరేకంగా ఉంటాడు, కాని, వినయంతో ఉన్నవాళ్లకు కృపననుగ్రహిస్తాడు.”—1 పేతురు 5:5, పరిశుద్ధ బైబల్.
1, 2. ఏ రెండు పరస్పర విరుద్ధమైన మానసిక స్వభావాలు మానవ ప్రవర్తనపై తీవ్రమైన ప్రభావాన్ని కల్గివున్నాయి?
దేవుని వాక్యం మన అవధానానికి తీసుకువచ్చే మానసిక స్వభావాల్లో రెండు పరస్పర విరుద్ధమైన మానసిక స్వభావాలు ఉన్నాయి. మానవ ప్రవర్తనపై అవి రెండూ ఎంతో ప్రభావాన్ని కల్గివున్నాయి. అందులో ఒకటి, ‘వినయమనస్సు’ అని వర్ణించబడింది. (1 పేతురు 5:5, పరిశుద్ధ బైబల్) వినయమనస్సు, అణకువకు సమానార్థక పదం, దేవుని దృక్కోణంలో నుండి చూస్తే, అది ఎంతో కోరదగిన లక్షణమైవుంది.
2 దానికి విరుద్ధమైనది గర్వం. అది, “మితిమీరిన ఆత్మ గౌరవం” కల్గివుండడంగానూ, “ఏవగించుకోవడం”గానూ నిర్వచించబడింది. అది స్వార్థపూరితమైనది, ఇతరులపై ఎంత తీవ్రమైన ప్రభావం పడినప్పటికీ అది, వస్తుపరమైన, స్వార్థపరమైన ప్రయోజనాల్నీ, ఇతర ప్రయోజనాల్నీ వెంబడిస్తుంది. దాని మూలంగా వచ్చే ఒక ఫలితాన్ని బైబిలు ఇలా పేర్కొంటుంది: “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.” అది, మరణించినప్పుడు ఒకడు తనతోపాటు దేన్నీ “చేతపట్టుకొనిపోడు” గనుక ‘ఒకరితో మరొకరు పోటీపడడం’ అన్నది “గాలిని పట్టుకొనుటకు చేయు ప్రయత్నము” వంటిదని తెలియజేస్తుంది.—ప్రసంగి 4:4, NW; 5:15; 8:9.
లోకంలో ప్రబలంగావున్న స్ఫూర్తి
3. లోకంలో ప్రబలంగావున్న స్ఫూర్తి ఏది?
3 ఆ రెండు మానసిక స్వభావాల్లో ఏది, నేటి లోకాన్ని సూచిస్తోంది? లోకంలో ప్రబలంగావున్న స్ఫూర్తి ఏది? “. . . అనాగరిక హింసల విషయంలో . . . ఈ 20వ శతాబ్దానికి సాటి రాగల శతాబ్దం మరొకటేదీ లేదు” అని వరల్డ్ మిలటరీ అండ్ సోష్యల్ ఎక్స్పెండీచర్స్ 1996 పేర్కొంటోంది. రాజకీయ, ఆర్థిక అధికారాల కోసం అలాగే జాతీయత, మతం, తెగ, జాతి వంటివాటి కోసం పోటీతత్వం, ఈ శతాబ్దంలోనే పది కోట్లకన్న ఎక్కువమందిని పొట్టనబెట్టుకుంది. వ్యక్తిగత స్థాయిలో స్వార్థపూరితమైన ప్రవర్తన కూడా పెరిగిపోయింది. చికాగో ట్రిబ్యూన్ ఇలా తెలియజేసింది: “సామాజిక రుగ్మతలో, అనాలోచిత హింస, పిల్లలపైదాడి, విడాకులు, త్రాగుబోతుతనం, ఎయిడ్స్, టీనేజ్ పిల్లల ఆత్మహత్యలు, మాదకద్రవ్యాలు, స్ట్రీట్ గ్యాంగ్‌లు, అత్యాచారాలు, అక్రమ సంబంధాలు, గర్భస్రావం చేయించుకోవడం, అశ్లీల సాహిత్యం, . . . అబద్ధాలు ఆడడం, మోసగించడం, రాజకీయ అవినీతి . . . చేరివున్నాయి. నైతిక సిద్ధాంతాలుగా తప్పొప్పులు తుడిచిపెట్టబడ్డాయి.” అందుకే, యుఎన్ క్రానికల్ ఇలా హెచ్చరించింది: “సమాజాలు ఛిన్నాభిన్నమైపోతున్నాయి.”
4, 5. మన కాలాన్ని గురించి బైబిలులో ప్రవచించబడినదానిలో లోకపు స్ఫూర్తి ఖచ్చితంగా ఎలా వర్ణించబడింది?
4 ఇలాంటి పరిస్థితులు ప్రపంచమంతటా ఉన్నాయి. మన కాలాన్ని గురించి బైబిలు ప్రవచనం ప్రవచించినట్టుగానే ఇది వుంది: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు.”—2 తిమోతి 3:1-4.
5 అది, లోకంలో ప్రబలమౌతున్న ఆ స్ఫూర్తిని గూర్చిన ఖచ్చితమైన వర్ణన. అది, నేనే ముందు అనే స్వార్థపూరితమైన వైఖరి. దేశాల మధ్య పోటీతత్వం, ఆయా వ్యక్తుల మధ్య ఉన్న పోటీ ద్వారా ప్రతిబింబించబడుతుంది. ఉదాహరణకు, పోటీ స్వభావంతో కూడిన క్రీడల్లో అనేకమంది అథ్లెట్లు తామే నెంబర్ వన్‌గా ఉండాలని కోరుకుంటారు. భావోద్వేగపరంగాగానీ, భౌతికంగాగానీ ఇతరులను అదెలా గాయపర్చినప్పటికీ వారలాగే చేయాలనుకుంటారు. ఆ స్వార్థపూరితమైన స్ఫూర్తి పిల్లల్లో ప్రవేశపెట్టబడి, వయోజనులు అవుతుండగా వారి జీవితాల్లోని అనేక భాగాల్లో కొనసాగుతుంది. అది, “ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు” వంటి వాటికి దారితీస్తుంది.—గలతీయులు 5:19-21.
6. స్వార్థాన్ని ఎవరు పెంపొందిస్తున్నారు, ఈ విధమైన మనస్సు గురించి యెహోవా ఎలా భావిస్తాడు?
6 స్వార్థపూరితమైన ఈ లోకపు స్ఫూర్తి, “సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల” వాని స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని బైబిలు చూపిస్తోంది. అపాయకరమైన ఈ అంత్యదినములలో జీవిస్తున్న ప్రజలపై సాతాను చూపిస్తున్న ప్రభావాన్ని గురించి బైబిలు ఇలా ప్రవచిస్తోంది: ‘భూమీ నీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై నీ యొద్దకు దిగివచ్చియున్నాడు.’ (ప్రకటన 12:9-12) కాబట్టి అతడూ, అతని దయ్యాలూ మానవ కుటుంబంలో స్వార్థంతో నిండిన మనస్సును పెంపొందించేందుకు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. అలాంటి వైఖరిని గురించి యెహోవా ఎలా భావిస్తాడు? ఆయన వాక్యమిలా చెబుతోంది: “గర్వహృదయులందరు యెహోవాకు హేయులు.”—సామెతలు 16:5.
యెహోవా వినయంగలవారితోనే ఉంటాడు
7. వినయంగలవారిని యెహోవా ఎలా పరిగణిస్తాడు, ఆయన వారికేమి బోధిస్తాడు?
7 మరో వైపున, యెహోవా వినయమనస్కులను ఆశీర్వదిస్తాడు. యెహోవాను స్తుతిస్తున్న ఒక గీతంలో, దావీదు రాజు ఇలా అన్నాడు: “శ్రమపడు [“వినయవంతులను,” క్యాతలిక్ అనువాదము] వారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేసెదవు.” (2 సమూయేలు 22:1, 28) అందుకే దేవుని వాక్యమిలా సలహా ఇస్తోంది: “దేశములో సాత్వికులైన సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు . . . వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.” (జెఫన్యా 2:3) యెహోవాను వినయపూర్వకంగా వెదికేవారు, ఈ లోక స్ఫూర్తికి పూర్తిగా భిన్నమైన స్ఫూర్తిని పెంపొందించుకునేందుకు ఆయనచే బోధించబడతారు. ఆయన “తన మార్గమును దీనులకు [“వినయంగలవారికి,” పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం] నేర్పును.” (కీర్తన 25:9; యెషయా 54:13) ఆ మార్గమే ప్రేమ మార్గం. అది, దేవుని ప్రమాణాల ప్రకారంగా సరియైనదేదో దాన్ని చేయడంపై ఆధారపడివుంటుంది. బైబిలు ప్రకారంగా, సూత్రానుసారమైన ఈ ప్రేమ ‘మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, . . . స్వప్రయోజనమును విచారించుకొనదు.” (1 కొరింథీయులు 13:1-8) అది దానికదే వినయమనస్సు రూపంలో వ్యక్తమవుతుంది కూడా.
8, 9. (ఎ) సూత్రానుసార ప్రేమకు మూలాధారమేమిటి? (బి) యేసు చూపించిన ప్రేమ, వినయ గుణాలను అనుకరించడమనేది ఎంత ప్రాముఖ్యమైనది?
8 యేసు బోధలనుండి అలాంటి ప్రేమను పౌలు, మొదటి శతాబ్దంలోని ఇతర క్రైస్తవులూ నేర్చుకున్నారు. దాన్ని యేసు, తన తండ్రియైన యెహోవానుండి నేర్చుకున్నాడు. ఆయనను గురించి బైబిలు ఇలా చెబుతోంది: “దేవుడు ప్రేమాస్వరూపి.” (1 యోహాను 4:8) ప్రేమ చట్టానికి తగ్గట్టుగా జీవించడమనేది తన విషయంలో దేవుని చిత్తమైవుందన్న విషయం యేసుకు తెలుసు, ఆయన అలాగే జీవించాడు. (యోహాను 6:38) అందుకే ఆయన, పీడిత ప్రజలపట్లా, బీదలపట్లా, పాపులపట్లా కనికరం చూపించాడు. (మత్తయి 9:36) ఆయన వారికిలా చెప్పాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి.”(ఇటాలిక్కులు మావి.)—మత్తయి 11:28, 29.
9 “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందుర[ని]” యేసు తన శిష్యులకు చెప్పినప్పుడు, ఆయన తాను చూపించిన ప్రేమనూ, వినయ గుణాన్నీ అనుకరించవలసిన ప్రాముఖ్యతను వారికి చూపించాడు. (యోహాను 13:35) వాళ్లు ఈ స్వార్థపూరిత లోకానికి వేరుగా నిలబడతారు. అందునుబట్టే యేసు, తన అనుచరులను గురించి ఇలా చెప్పగలిగాడు: వారు “లోకసంబంధులు కారు.” (యోహాను 17:14) వాళ్లు సాతాను లోకపు గర్వాంధకార, స్వార్థపూరిత స్ఫూర్తిని అనుకరించనే అనుకరించరు. బదులుగా వాళ్లు, యేసు చూపించిన ప్రేమ, వినయ స్ఫూర్తులను అనుకరిస్తారు.
10. మన కాలంలోని వినయమనస్కులతో యెహోవా ఏం చేస్తున్నాడు?
10 ఈ అంత్యదినాల్లో వినయవంతులైన వ్యక్తులు, ప్రేమ, అణకువలపై ఆధారపడిన ప్రపంచవ్యాప్త సమాజమందు సమకూర్చబడతారని దేవుని వాక్యం ప్రవచించింది. కాబట్టి, అంతకంతకూ అహంకారపూరితంగా తయారౌతున్న లోకం మధ్య, యెహోవా ప్రజలు దానికి విరుద్ధమైన వైఖరిని అంటే వినయమనస్సును చూపిస్తారు. అలాంటి వినయమనస్కులు ఇలా అంటారు: “యెహోవా పర్వతమునకు [ఉన్నతపర్చబడిన ఆయన సత్యారాధన స్థలానికి] మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము.” (యెషయా 2:2, 3) దేవుని మార్గాల్లో నడుస్తున్న ఈ ప్రపంచవ్యాప్త సమాజంగా యెహోవాసాక్షులు రూపొందారు. వారిలో, “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము” అంటే అంతకంతకూ పెరుగుతున్న ఒక గొప్పసమూహం కూడా ఉంది. (ప్రకటన 7:9) ఆ గొప్ప సమూహం ఇప్పుడు లక్షలాదిమంది ప్రజలచే రూపొందించబడింది. వినయమనస్కులుగా ఉండేలా యెహోవా వారికెలా తర్ఫీదు ఇస్తున్నాడు?
వినయమనస్కులుగా ఉండడాన్ని నేర్చుకోవడం
11, 12. వినయమనస్సును దేవుని సేవకులు ఎలా చూపించగలరు?
11 దేవుని ఆత్మ తన ప్రజలపై పనిచేస్తోంది. అది వాళ్లు, ఈ లోకపు చెడ్డ స్ఫూర్తిని జయించి, దేవుని ఆత్మ ఫలాలను ప్రదర్శించడాన్ని నేర్చుకునేలా చేస్తుంది. “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము”లలో అది దానంతటదే కనపర్చబడుతోంది. (గలతీయులు 5:22, 23) ఈ లక్షణాలను పెంపొందించుకునేలా వారికి సహాయపడేందుకు, దేవుని సేవకులు ‘ఒకరి నొకరు వివాదమునకు రేపువారిగానూ, ఒకరియందొకరు అసూయపడువారిగానూ, వృథాగా అతిశయపడువారిగానూ’ ఉండకూడదని వారికి సలహా ఇవ్వబడుతోంది. (గలతీయులు 5:26) అదే విధంగా, అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధిగల వాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని . . . మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.”—రోమీయులు 12:3.
12 “కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో [దేవుని సేవకులలో] ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యతరుల కార్యములను కూడ చూడవలెను” అని దేవుని వాక్యం నిజ క్రైస్తవులకు చెబుతోంది. (ఫిలిప్పీయులు 2:3, 4) “ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.” (1 కొరింథీయులు 10:24) అవును, నిస్వార్థమైన మాటలతోనూ, క్రియలతోనూ ఇతరులకు “ప్రేమ క్షేమాభివృద్ధి” కలుగజేస్తుంది. (1 కొరింథీయులు 8:1) అది పోటీతత్వాన్నిగాక పరస్పర సహకారాన్ని పెంపొందింపజేస్తుంది. నేనే ముందు అన్న స్ఫూర్తికి యెహోవా సేవకుల మధ్య తావులేదు.
13. వినయమనస్సును ఎందుకు నేర్చుకోవాలి, ఒకరు దాన్నెలా నేర్చుకోవచ్చు?
13 అయినా, స్వతఃసిద్ధమైన అపరిపూర్ణతనుబట్టి, మనం వినయమనస్సుతో జన్మించలేదు. (కీర్తన 51:5) ఈ లక్షణాన్ని నేర్చుకోవాలి. చిన్నప్పటి నుండీ యెహోవా మార్గాల గురించి బోధించబడక, అటు తర్వాత తమ జీవితంలో వాటిని అంగీకరించే వ్యక్తులకు ఆ లక్షణాన్ని గురించి నేర్చుకోవడం కష్టంకావొచ్చు. వాళ్లు, ఈ పాతలోకపు దృక్పథాలపై ఆధారపడిన వ్యక్తిత్వాల్ని అప్పటికే రూపొందించుకున్నారు. కాబట్టి వాళ్లు, “మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశలవలన చెడిపోవు [తమ] ప్రాచీనస్వభావమును వదులుకొని నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొన[డాన్ని]” నేర్చుకోవాలి. (ఎఫెసీయులు 4:22, 24) యథార్థవంతులైన వ్యక్తులు దేవుని సహాయంతో, ఆయన తమనుండి అడుగుతున్న దాన్ని చేయగలరు: “జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.” (ఇటాలిక్కులు మావి.)—కొలొస్సయులు 3:12.
14. ఒకరు తననుతాను గొప్పచేసుకోవాలనుకోవడానికి విరుద్ధంగా యేసు ఏ విధంగా మాట్లాడాడు?
14 యేసు శిష్యులు దాన్ని నేర్చుకోవాల్సి వచ్చింది. ఆయన శిష్యులైనప్పుడు వాళ్లు, వయోజనులు, వాళ్లలో ఇహలోకపు పోటీతత్వం ఓ మోస్తరుగా ఉంది. ఆ శిష్యుల్లో ఇద్దరి తల్లి, తన కుమారులకు ప్రముఖ స్థానాన్ని ఇవ్వమని అడిగినప్పుడు, యేసు ఇలా అన్నాడు: ‘అన్యజనులలో అధికారులు వారిమీద [ప్రజలమీద] ప్రభుత్వము చేయుదు[రు], వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదు[రు]. మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను. ఆలాగే మనుష్యకుమారుడు [యేసు] పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చె[ను].’ (మత్తయి 20:20-28) తమను తాము గొప్ప చేసుకోవడానికి ప్రయత్నించేందుకు బిరుదులను ఉపయోగించవద్దని యేసు తన శిష్యులకు చెప్పినప్పుడు, ఆయనిలా అన్నాడు: “మీరందరు సహోదరులు.”—మత్తయి 23:8.
15. పైవిచారణకర్త పదవికి చేరుకోవాలనుకునేవారు ఏ వైఖరిని కల్గివుండాలి?
15 యేసును అనుసరించే నిజమైన అనుచరుడు ఒక సేవకుడు, అవును, తోటి క్రైస్తవులకు అతడొక దాసుడు. (గలతీయులు 5:13) ముఖ్యంగా సంఘంలో పైవిచారణకర్తలుగా అర్హులవ్వాలని కోరుకునే వారి విషయమిదై ఉండాలి. వాళ్లు అధికారం కోసమో, ప్రాముఖ్యత కోసమో ఎన్నడూ పోటీపడకూడదు; వాళ్లు తమకు “అప్పగింపబడినవారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా” ఉండాలి. (1 పేతురు 5:3) నిజానికి స్వార్థాన్ని వెదికే స్ఫూర్తి, ఒక వ్యక్తి పైవిచారణ చేయడానికి తగడనడానికి ఒక సూచనయైవుంది. అలాంటి వ్యక్తి సంఘానికి అపాయకారి అవుతాడు. నిజమే, ‘పైవిచారణకర్త పదవికి చేరుకోవడం’ అనేది సరియైనదే అయినా అది, ఇతర క్రైస్తవులకు సేవచేయాలనే కోరిక నుండి ఉద్భవించాలి. పైవిచారణ కర్తృత్వంలో ఉన్నవారు సంఘంలో అత్యంత వినయమనస్కులైన వారైవుండాలి గనుక ఆ పదవి, ఒక ప్రాముఖ్యమైన స్థానమో, అధికారమో కాదు.—1 తిమోతి 3:1, 6, NW.
16. దేవుని వాక్యంలో థియొత్రెఫే ఎందుకు అధిక్షేపించబడ్డాడు?
16 అపొస్తలుడైన యోహాను, తప్పుడు దృక్పథాన్ని కల్గివున్న ఒక వ్యక్తివైపుకు మన అవధానాన్ని మళ్లిస్తూ, ఇలా అంటున్నాడు: “నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయతే వారిలో ప్రధానత్వము కోరుచున్న థియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు.” ఇతడు, తన సొంత అధికారాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించేందుకు ఇతరులతో అమర్యాదపూర్వకంగా వ్యవహరించాడు. దానికి బదులుగా, థియొత్రెఫే పొందిన అధిక్షేపణను బైబిలులో చేర్చేలా యోహానును దేవుని ఆత్మ కదిలించింది.—3 యోహాను 9, 10.
సరియైన వైఖరి
17. పేతురు, పౌలు, బర్నబాలు వినయమనస్సును ఎలా చూపించారు?
17 సరియైన వైఖరిని గురించిన, వినయమనస్సును గురించిన ఉదాహరణలు బైబిల్లో కోకొల్లలుగా ఉన్నాయి. పేతురు కొర్నేలి ఇంటిలోనికి రాగానే, కొర్నేలి “అతని పాదములమీద పడి నమస్కారము చేసెను.” దాన్ని అంగీకరించడానికి బదులు, “పేతురు—నీవు లేచి నిలువుము, నేనుకూడ నరుడనే అని చెప్పి అతని లేవనె[త్తాడు].” (అపొస్తలుల కార్యములు 10:25, 26) పౌలు, బర్నబాలు లుస్త్రలో ఉన్నప్పుడు, పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్న ఒక వ్యక్తిని పౌలు స్వస్థపర్చెను. ఫలితంగా ఆ అపొస్తలులు దేవతలని అక్కడున్న జనసమూహాలు అన్నాయి. అయితే, పౌలు బర్నబాలు “తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి—అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేముకూడ మీ స్వభావమువంటి స్వభావము గల నరులమే” అని చెప్పారు. (అపొస్తలుల కార్యములు 14:7-15) వినయమనస్కులైన ఈ క్రైస్తవులు, మానవులనుండి స్తుతిని అంగీకరించరు.
18. వినయపూర్వకంగా ఒక శక్తిమంతుడైన దూత, యోహానుతో ఏం చెప్పాడు?
18 యేసుక్రీస్తుకు అనుగ్రహించబడిన “ప్రత్యక్షత” అపొస్తలుడైన యోహానుకు ఇవ్వబడినప్పుడు అది, ఒక దేవదూత ద్వారా ఆయనకు అందజేయబడింది. (ప్రకటన 1:1) ఒక దేవదూతకున్న శక్తినిబట్టి, యోహాను ఎందుకు భక్తిపూర్వక భయాన్ని చూపించాడో మనం అర్థంచేసుకోవచ్చు, ఎందుకంటే ఒక దేవదూత ఒక్క రాత్రిలోనే 1,85,000 మంది అష్షూరీయులను హతంచేశాడు. (2 రాజులు 19:35) యోహాను ఇలా తెలియజేస్తున్నాడు: “నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూతపాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు—వద్దుసుమీ. నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను . . . సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.” (ప్రకటన 22:8, 9) ఈ శక్తిమంతుడైన దేవదూత ఎంత వినయమనస్కుడో గదా!
19, 20. విజేతలైన రోమా జనరల్స్ అహంకారంతో యేసు వినయమనస్సును పోల్చండి.
19 వినయమనస్కునిగా యేసు అతి శ్రేష్ఠమైన మాదిరిని చూపించాడు. ఆయన, దేవుని జనితైక కుమారుడు, దేవుని పరలోక రాజ్యానికి భావి రాజు. యేసు తననుతాను ప్రజలకు పరిచయం చేసుకున్నప్పుడు, రోమీయుల కాలంనాటి విజేతలైన జనరల్స్లా చేయలేదు. వాళ్లు పెద్ద పెద్ద ప్రదర్శనలలో—ఊరేగింపులలో ఊరేగేవారు, బంగారంతోనూ, దంతాలతోనూ అలంకరించబడి, శ్వేతాశ్వాలతోగానీ లేక ఏనుగులతోగానీ, సింహాలతోగానీ, పులులతోగానీ లాగబడే రథాల్లో సవారీ చేసేవారు. ఊరేగింపుల్లో, కొల్లగొట్టిన వాటితో నింపబడిన బళ్లతో, యుద్ధ దృశ్యాల్ని చూపించే వేదికలు ఉన్న వాహనాలతో పాటు, సంగీతకారులు విజయగీతాల్ని పాడుతుండేవారు. బంధీలుగా చిక్కిన రాజులు, అధికారులు, జనరల్స్ వాళ్ల వాళ్ల కుటుంబాల సమేతంగా ఆ ఊరేగింపుల్లో ప్రదర్శించబడేవారు, వారిని హీనపర్చేందుకు తరచుగా వారిని వస్త్రహీనులను చేసేవారు. ఆ సంఘటనలలో అహంకారగర్వాలు ప్రస్ఫుటంగా కన్పించేవి.
20 దాన్ని, యేసు తనను తాను అర్పించుకున్న విధానానికి పోల్చి చూడండి. తనను గురించి ప్రవచించబడిన ప్రవచనాన్ని నెరవేర్చేందుకు వినయపూర్వకంగా లోబడేందుకు ఆయన సుముఖత చూపించాడు. ఆ ప్రవచనమిలా ప్రవచించబడింది: “నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై [“వినయంగా,” పరిశుద్ధ బైబల్], గాడిదను . . . ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.” పెద్ద పెద్ద ఊరేగింపుల్లో జాతి గుఱ్ఱాలూ, ఏనుగులూ వంటివాటితో లాగబడే ఒక రథంలోగాక ఆయన అణకువతో, బరువుల్ని మోసే ఒక సామాన్యమైన గాడిదనెక్కి వచ్చాడు. (జెకర్యా 9:9; మత్తయి 21:4, 5) నిజంగా వినయమనస్కుడు, అణకువగలవాడు, ప్రేమగలవాడు, దయా కనికరములుగలవాడు అయిన యేసు, క్రొత్త లోకమందు యావత్ భూమిపై యెహోవా నియమిత రాజై ఉండడం అణకువగల ప్రజలకు ఎంత సంతోషాన్నిస్తుందో గదా!—యెషయా 9:6, 7; ఫిలిప్పీయులు 2:5-8.
21. వినయమనస్సు దేన్ని సూచించదు?
21 యేసు, పేతురు, పౌలు, బైబిలు కాలాల్లోని విశ్వాసులైన ఇతర స్త్రీ పురుషులు వినయమనస్కులు అన్న వాస్తవం, అణకువగా ఉండటమనేది ఒక బలహీనతనే అభిప్రాయాన్ని త్రోసిపుచ్చుతుంది. బదులుగా అది, దాన్ని కల్గివున్న వ్యక్తికున్న సౌశీల్య ధార్ఢ్యాన్ని చూపిస్తోంది, ఎందుకంటే ఆ వ్యక్తులు ధైర్యవంతులు, ఆసక్తిపరులు. గొప్ప మానసిక, నైతిక బలంతో, వాళ్లు తీవ్రమైన శ్రమల్ని సహించారు. (హెబ్రీయులు, 11వ అధ్యాయం) నేడు, యెహోవా సేవకులు వినయమనస్కులైనప్పుడు, వాళ్లకు కూడా అదే విధమైన బలంవుంది, ఎందుకంటే దేవుడు తన శక్తివంతమైన పరిశుద్ధాత్మతో వినయమనస్కులకు మద్దతునిస్తాడు. అందుకే, మనకిలా ఉద్బోధించబడుతోంది: “మీరందరు ఎదుటివానియెడల దీనమనస్సు అను [“వినయమనే,” పరిశుద్ధ బైబల్] వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు [“వినయంతో ఉన్నవాళ్ళకు,” పరిశుద్ధ బైబల్] కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై [“వినయంతో,” పరిశుద్ధ బైబల్] యుండుడి.”—1 పేతురు 5:5, 6; 2 కొరింథీయులు 4:7.
22. తర్వాతి శీర్షికలో ఏం చర్చించబడుతుంది?
22 దేవుని సేవకులు అభ్యసించాల్సిన అవసరమున్న అనుకూలమైన మరో అంశం వినయమనస్సులో ఉంది. అది, సంఘాల్లో ప్రేమా సహకార స్ఫూర్తులను పెంపొందించేందుకు దోహదపడేదై ఉంది. నిజానికి అది, వినయమనస్సు యొక్క అత్యంతావశ్యకమైన భాగం. తర్వాతి శీర్షికలో దాన్ని గురించి చర్చించబడుతుంది.
పునఃసమీక్షగా
◻ లోకంలో ప్రబలంగా ఉన్న స్ఫూర్తిని గురించి వర్ణించండి.
◻ వినయమనస్కులైన వారిపట్ల యెహోవా ఎలా అనుగ్రహం చూపిస్తాడు?
◻ వినయమనస్సును ఎందుకు నేర్చుకోవాలి?
◻ వినయమనస్సును చూపించిన వ్యక్తులను గురించిన బైబిలులోని ఉదాహరణలు కొన్ని ఏవి?
[15వ పేజీలోని చిత్రం]
దేవదూత యోహానుతో ఇలా అన్నాడు: ‘వద్దుసుమీ. నేను సహదాసుడను’