సింహము—ఆఫ్రికా అరణ్యపు మృగరాజు
కెన్యాలోని “తేజరిల్లు!” విలేఖరి
ఆఫ్రికాలోని సెరన్గెటీ మైదానంలో సూర్యోదయమౌతోంది. ఉషోదయపు చల్ల గాలులు వీస్తుండగా, మేం మా లాండ్ రోవర్ వాహనంలో కూర్చుని, సివంగుల గుంపును గమనిస్తున్నాం. వాటితోపాటు వాటి పిల్లలు కూడా ఉన్నాయి. వాటి బొచ్చు మృదువుగానూ, కపిల వర్ణంలోనూ ఉండి, ఏపుగా పెరిగిన ఎండుగడ్డి రంగులో కలిసిపోయింది. వాటి పిల్లలు ఉల్లాసంగా, చలాకీగా ఉన్నాయి. అవి సివంగుల భారీకాయాల చుట్టూ గంతులువేస్తూ ఆడుకుంటున్నాయి. సివంగులు వాటి చిలిపి పనుల్ని పట్టించుకోనట్టున్నాయి.
సివంగుల గుంపు అకస్మాత్తుగా కదలకుండా ఎలా ఉన్నవి అలానే ఉండిపోయాయి. కళ్లన్నీ ఒక్కసారిగా అటువైపు తిరిగాయి, అవి దూరంగా ఎక్కడో చూస్తున్నాయి. మేమున్న ఎత్తైనచోటు నుంచి అవి తేరిపారజూస్తున్న దిశలో చూస్తే, వాటి అవధానాన్ని చూరగొన్నదేంటో తెలిసింది. ఉషోదయ కిరణాల వెలుతురులో కొదమ సింహపు గంభీరమైన రూపం కనబడింది. అది మావైపు తేరిజూస్తుండగా, దాని కళ్లూ మా కళ్లూ కలుసుకున్నాయి. మా ఒంట్లో సన్నగా వణుకు పుట్టుకొచ్చినట్టు అన్పించింది. అది ఉదయకాలపు చలిమూలంగా కాదుగానీ, ఆ మృగరాజు చూపులకు చిక్కింది మేమేనని గ్రహించడంవల్ల వచ్చిన వణుకు. దాని రూపం గుండెల్లో గుబులు పుట్టించినా చూడడానికి మనోహరంగా ఉంది. అక్కడక్కడా నల్లని చారికలుగల బంగారు వర్ణపు జూలు దాని పెద్ద తలచుట్టూ అలంకరించబడి ఉంది. విశాలమైన దాని నేత్రాలు, ముదురు గోధుమ వర్ణంలో ఉండి, చురుగ్గా ఉన్నాయి. అయితే, తన కుటుంబం తన అవధానాన్ని చూరగొనడంతో, నెమ్మదిగా తన చూపును వాటివైపుకి మళ్లించి, అవి ఉన్న దిశగా కదిలింది.
దాని నడక ఠీవిగా ఉండి, రాజసం ఉట్టిపడుతోంది. మా వైపు మరోసారి చూపును తిప్పకుండానే, అది మా వాహనం ముందు నుండే వెళ్లి సివంగులనూ, వాటి పిల్లలనూ సమీపిస్తోంది. దాన్ని కలుసుకోవడానికి అవన్నీ లేచి నిలబడ్డాయి. ఒకదాని తర్వాత మరొకటిగా అవి, ముఖ ముఖాల్ని రాసుకునే విలక్షణమైన పిల్లిజాతి అభివాదంలా తమ ముఖాన్ని దాని బలిష్టమైన కండరాలపై నొక్కుతున్నాయి. వాటి మధ్యలోకి నడుచుకుంటూ వెళ్లి, తాను చేసిన వ్యాహాళిలో అలిసిపోయినదాన్లా కూలబడి, వెల్లకిలా అటూ ఇటూ దొర్లింది. దాని సోమరితనం అన్నింటికీ అంటుకుంది, దాంతో బాల భానుని నులివెచ్చని తొలి కిరణాల్లో మొత్తం గుంపంతటికీ త్వరలోనే మాగన్నుగా నిద్ర పట్టేసింది. మా కళ్లెదుట మైదానంలో బంగారు వర్ణంలో గాలికి రెపరెపలాడుతున్న గడ్డిపై సమాధాన సంతుష్టులు నెలకొనివున్న మనోహరమైన దృశ్యం ఉంది.
ఆసక్తిని రేకెత్తించే, సమ్మోహనపర్చే ప్రాణి
బహుశా సింహం పురికొల్పినంతగా మరే ఇతర జంతువూ మానవుని మనోభావాల్ని పురికొల్పలేదు. ఎంతో కాలం క్రిందట ఆఫ్రికా కళాకారులు, వేటాడుతున్న సింహాల చిత్రాల్ని బండలపై చిత్రించేవారు. పురాతన రాజ ప్రాసాదాలూ, ఆలయాలు దట్టంగా జూలు ఉన్న రాతి సింహపు ప్రతిమలతో అలంకరించబడేవి. సమ్మోహనభరితమైన వీటిని చూడడానికి నేడు ప్రజలు జూలకు వెళ్తున్నారు. చెరలో పెంచబడి చివరకు స్వేచ్ఛను పొందిన ఒక అనాథ సింహపు పిల్లను గూర్చిన వాస్తవిక వృత్తాంతమైన బోర్న్ ఫ్రీ వంటి సినిమాలలోనూ, పుస్తకాలలోనూ సింహాలు ప్రముఖమైన పాత్రలుగా చూపించబడ్డాయి. కథల్లో సింహాల్ని క్రూరమైన నరమాంస భక్షకులైన విలన్లుగా చూపించడం జరిగింది. అందులో కొంత వాస్తవం, మరి కొంత కట్టుకథ ఉంది. సింహం ఆసక్తి రేకెత్తించే, సమ్మోనపర్చే ఒక ప్రాణిగా ఉన్నదంటే ఆశ్చర్యమేమీలేదు!
సింహాలు ఎంతో క్రూరమైనవిగా ఉండవచ్చు, అప్పుడప్పుడూ అవి పిల్లి కూనల్లా సౌమ్యంగానూ, చిలిపిగానూ ఉండవచ్చు. సంతుష్టిగా ఉన్నప్పుడు మెల్లిగా గుర్రుమన్నా, అవి ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు వినబడేంత గట్టిగా గర్జించగలవు. కొన్నిసార్లు అవి సోమరిపోతుల్లా, ఉదాసీనంగా కన్పిస్తాయి, కానీ ఆశ్చర్యాన్ని కల్గించేంత వేగంతో కదిలే సామర్థ్యం వాటికి ఉంది. దానికున్న ధైర్యాన్నిబట్టి మానవుడు దాన్ని అమరజీవిని చేశాడు. ధైర్యంగల వ్యక్తిని సింహపు గుండెగలవాడని చెప్పడం వాడుక.
సింబాa—సంఘ జీవి
పిల్లిజాతికి చెందిన జంతువులన్నింట్లో ఎక్కువ సమష్టిగా జీవించేవి సింహాలే. సమూహాలు అని పిలువబడే పెద్ద పెద్ద కుటుంబ గుంపుల్లో అవి వర్ధిల్లుతాయి. ఒక్కొక్క సమూహంలో కొన్నింటి నుండి 30కన్నా ఎక్కువ సింహాల వరకూ ఉంటాయి. ఆ సమూహం సివంగుల సముదాయంతో రూపొందించబడుతుంది, అవి బహుశా ఒకదానితో మరొకటి సన్నిహిత సంబంధాన్ని కల్గివుంటాయి. అవి కలిసి జీవిస్తాయి, వేటాడతాయి, పిల్లల్ని కంటాయి. ఈ సన్నిహిత బంధం వాటి జీవితాంతం వరకూ ఉండవచ్చు, అది సింహాల కుటుంబాన్ని పటిష్టపరుస్తుంది, వాటి మనుగడకు గ్యారంటీ ఇస్తుంది.
ఒక్కొక్క సమూహం నివసించే ప్రాంతాన్ని పహారా కాయడానికి ఆ సమూహానికి చెందిన పూర్తిగా ఎదిగిన ఒకటో లేదా అంతకన్నా ఎక్కువో మగ సింహాలు ఉంటాయి. మూత్ర విసర్జన చేయడం ద్వారా తమ సమూహానికి చెందిన ప్రాంతపు పొలిమేరల్ని ఏర్పర్చుకుంటాయి. ఈ మహత్తరమైన మృగాలు తమ నల్లని నాసికల నుండి కుచ్చులా ఉన్న తోక చివరి వరకూ 3 మీటర్లకు పైగా పొడవు ఉండవచ్చు, అవి 225 కిలోలకన్నా ఎక్కువ బరువు ఉండవచ్చు. సమూహంపై అజమాయిషీ మగ సింహాలదే అయినా, సాధారణంగా నాయకత్వాన్ని వహించేది సివంగులే. చెట్టునీడకు కదిలివెళ్లడం లేదా వేట ప్రారంభించడం వంటి వాటిలో సాధారణంగా చొరవ తీసుకునేది సివంగులే.
సివంగులు సాధారణంగా ప్రతీ రెండేళ్లకోసారి పిల్లల్ని కంటాయి. సింహపు పిల్లలు, పుట్టినప్పుడు పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉంటాయి. పిల్లల్ని పెంచడం సామాజిక బాధ్యత. సివంగులన్నీ కలిసి తమ గుంపులోపల ఉన్న పిల్లల్ని కాపాడతాయి, పాలిచ్చి పెంచుతాయి. సింహపు పిల్లలు త్వరగా ఎదుగుతాయి; రెండు నెలలు వచ్చేటప్పటికి, అవి పరిగెడతాయి, ఆడుకుంటాయి. పిల్లికూనల్లా ఒకదానిపై మరొకటి పడుతూ, దొర్లుతూ, తమ తోటి కూనలపై దాడిచేస్తాయి. ఏపుగా ఎదిగిన గడ్డిలో గంతులువేస్తాయి. కదులుతున్న ప్రతీదాన్ని చూసి అవి ఆకర్షించబడతాయి. అవి సీతాకోక చిలుకలపైకి దుముకుతాయి, కీటకాల్ని తరుముతాయి. పుల్లలతోనూ, ద్రాక్షా తీగెలతోనూ కుస్తీ పడతాయి. వాటిని ఎక్కువగా ఆకట్టుకునేది వాటి తల్లి తోక కదలికే. దాన్నది కావాలని అటూ ఇటూ వయ్యారంగా తిప్పుతూ, ఆడుకోడానికి వాటిని ఆహ్వానిస్తుంది.
ప్రతీ సమూహం నిర్దిష్టమైన ఎల్లలున్న ప్రాంతంలో జీవిస్తుంది, ఆ ప్రాంతం అనేక హెక్టార్ల వరకూ విస్తరించి ఉండవచ్చు. విస్తారమైన నీటి వసతీ, మధ్యాహ్నపు సూర్య తీక్షణత నుండి కాపుదలనిచ్చే నీడా ఉండే ఎత్తైన ప్రదేశాలంటే సింహాలకు మక్కువ. అక్కడవి, ఏనుగుల మధ్యా, జిరాఫీల మధ్యా, గేదెల మధ్యా, మైదాన ప్రాంతానికి చెందిన మరితర జంతువుల మధ్యా నివసిస్తాయి. సింహం జీవిత విధానం, ఎక్కువ గంటలపాటు నిద్రపోవడానికీ, అలాగే తక్కువ కాలంపాటు వేటాడ్డానికీ, జతగట్టడానికీ మధ్య విభజించబడింది. వాస్తవం ఏమిటంటే, సింహాలు విశ్రాంతి తీసుకోవడానికీ, నిద్రపోవడానికీ, లేక కూర్చోవడానికీ నమ్మశక్యంకాని రీతిలో రోజులోని 20 గంటలను గడపవచ్చు. గాఢనిద్రలో, అవి సామరస్యంగానూ, సాధువుగానూ కన్పిస్తాయి. అయితే, మోసపోకండి—క్రూర జంతువులన్నింటిలోకెల్లా రౌద్రమైనది సింహం!
వేటగాడు
మధ్యాహ్నపు తీక్షణమైన ఎండకు వాడిపోయిన గడ్డి మైదానం సాయంత్రానికి చల్లబడనారంభించింది. మేం గమనిస్తున్న సింహాల గుంపులోని మూడు సివంగులు, తమ మధ్యాహ్నపు నిద్రావస్థనుండి లేవడం మొదలెట్టాయి. కడుపులో నకనకలాడుతుంటే, ఆ సివంగులు కదలనారంభించాయి. పసుపు వర్ణంలో ఉన్న గడ్డి మైదానంమీదుగా పరిశీలనగా పరికిస్తూ, వాసన చూస్తున్నాయి. ఎద్దులాంటి తల ఉండే ఒక రకమైన జింకలు అత్యధిక సంఖ్యలో వలసకు వచ్చాయి. వేలకొలదిగా ఉన్న వికారంగా కన్పించే ఆ జింకలు మేమున్న దక్షిణంవైపుగా ప్రశాంతంగా మేత మేస్తున్నాయి. ఇప్పుడు ఆ మూడు సివంగులూ ఆ దిశవైపుగా కదిలాయి. అవి మూడూ విడిపోయి, ఎగుడు దిగుడులున్న ప్రాంతం గుండా చాటుగా అడుగులో అడుగేసుకుంటూ వెళ్లాయి. ఆ సివంగులు ఏపుగా పెరిగిన గడ్డిలో దాదాపు కన్పించకుండా ఉన్నాయి. నిర్భయంగా ఉన్న ఆ గుంపుకు దాదాపు 100 అడుగుల దగ్గరగా వెళ్లాయి. ఆ సివంగులు ఇక దాడిచేయాలని నిశ్చయించుకున్నాయి. మెరుపులాంటి వేగంతో, ఆ గుంపుమీదకు లంఘించగా తమ ప్రాణాల్ని కాపాడుకోడానికి భయంతో భీతిల్లిన ఆ ప్రాణులు చెల్లాచెదురైపోయాయి. వందలాది గిట్టల తాకిడికి భూమి దద్దరిల్లిపోయింది, ఎఱ్ఱని దుమ్ము మేఘంలా పైకిలేచింది. దుమ్ము కమ్ముకుంటుండగా, ఆ సివంగులు ఒంటరిగా నిలబడిపోయి, దీర్ఘంగా ఎగశ్వాస తీయడం మేం చూశాం. వాటిబారి నుండి ఆ జింకలు తప్పించుకున్నాయి. వేటాడ్డానికి మరో అవకాశం ఈ రాత్రికి రావచ్చు, రాకపోనూ వచ్చు. చురుకైనవీ, హుషారైనవీ అయినా, సింహాలు వేటాడినప్పుడు 30 శాతం వరకు మాత్రమే విజయవంతం అవుతాయి. అందుకే, సింహాల మనుగడకు బెదిరింపుగా నిలిచిన గొప్ప బాధల్లో క్షుద్బాధ ఒకటి.
పూర్తిగా ఎదిగిన సింహానికుండే బలం అనూహ్యమైనది. గుంపులుగా వేటాడేటప్పుడు, అవి 1,300 కిలోలకన్నా ఎక్కువ బరువున్న జంతువుల్ని సైతం పడగొట్టి, చంపగలవని ప్రసిద్ధిగాంచాయి. తరిమేటప్పుడు మొదట్లో అవి గంటకు 59 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. కానీ అవి ఎక్కువసేపు అదే వేగంతో కొనసాగలేవు. ఈ కారణాన్నిబట్టే, తమ ఆహారాన్ని సంపాదించుకునేందుకు అవి నెమ్మదిగా నక్కి నక్కి వెళ్లి, కనబడకుండా దాక్కొని ఒక్కసారిగా దాడిచేసే పద్ధతుల్ని ప్రయోగిస్తాయి. మొత్తం వేటలో 90 శాతం సివంగులే వేటాడినా, వేటలో పెద్ద భాగం సాధారణంగా మగ సింహాలకే దక్కుతుంది. వేటాడ్డం అరుదైనప్పుడు, కొన్నిసార్లు సింహాలు ఎంత ఆకలితో ఉంటాయంటే, అవి తమ పిల్లల్ని కూడా తాము వేటాడిన జంతువు దరికి చేరనీయవు.
వేటాడబడడం
చాలాకాలం క్రిందట, ఆఫ్రికా ఖండమంతటిలోనూ, ఆసియా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లోనూ, యూరప్, ఇండియా, పాలస్తీనాలలోనూ రాచఠీవి ఉట్టిపడే సింహాలు తిరిగేవి. వేటగానిగా, అది మానవునితో పోటీపడి జీవిస్తోంది. జంతు సంపదకు ముప్పుగా పరిణమించడంవల్ల, ప్రజలకు హాని కల్గించడంవల్ల సింహం, కన్పిస్తే కాల్చివేతకు గురయ్యే జంతువులా తయారయ్యింది. త్వర త్వరగా పెరుగుతున్న మానవ జనాభా, సింహాల ఆవాసిత ప్రాంతాన్ని ఎంతగానో హరించివేసింది. ఆఫ్రికా ఖండానికి వెలుపల, నేడు అడవిలో కేవలం కొన్ని వందల సింహాలు మాత్రమే మనుగడను సాగిస్తున్నాయి. రక్షిత ప్రాంతాల సరిహద్దుల్లోనూ, వన్యప్రాణి పార్కుల్లోనూ మాత్రమే ఇప్పుడు మానవుల నుండి సింహాలు సురక్షితంగా ఉన్నాయి.
సంతోషకరంగా, మహత్తరమైన ఈ మృగరాజు కోసం మార్పులు భద్రపర్చబడి ఉన్నాయి. సింహాలు మానవులతో సమాధానంగా జీవించే భవిష్య కాలాన్ని బైబిలు వర్ణిస్తోంది. (యెషయా 11:6-9) మన ప్రేమగల సృష్టికర్త దాన్ని త్వరలోనే వాస్తవం చేస్తాడు. అప్పుడు ఆఫ్రికా అరణ్యపు మృగరాజు మిగతా సృష్టి అంతటితో శాంతి సామరస్యాలను కల్గి జీవిస్తుంది.
[అధస్సూచీలు]
a “సింహము”ను స్వాహిలీలో సింబా అంటారు.
[17వ పేజీలోని బాక్సు]
సింహము గర్జించినప్పుడు
కిలోమీటర్ల దూరంపాటు వినబడేంత గట్టిగా గర్జించగలిగే అసాధారణమైన స్వరపేటికా సామర్థ్యానికి సింహాలు పేరుగాంచాయి. సింహగర్జన “మంత్ర ముగ్దుల్నిచేసే సహజసిద్ధమైన శబ్దాల్లో” ఒకటిగా పరిగణించబడింది. సింహాలు సాధారణంగా చిమ్మ చీకటిగా ఉండే వేళల్లో, తొలిపొద్దులో గర్జిస్తాయి. సివంగులూ, సింహాలూ గర్జిస్తాయి. కొన్నిసార్లు సింహాల గుంపంతా తమ మోరల్ని పైకెత్తి ముక్తకంఠంతో గర్జిస్తాయి.
సింహాలపై అధ్యయనం చేసే సైంటిస్టులు, సింహగర్జన అనేకమైన వాటిని నెరవేరుస్తుందని సూచించారు. మగ సింహాలు తమ సామ్రాజ్యపు సరిహద్దుల్ని చాటుకోడానికి గర్జిస్తాయి. తమ సామ్రాజ్యపు సరిహద్దుల్లోకి ప్రవేశించబోయే ఇతర మగ సింహాలను హెచ్చరించేందుకొక పోరాటపు ఉచ్చారణగా కూడా గర్జిస్తాయి. దాడిచేసే, గర్విష్టియైన, దురాశాపూరితులైన అస్సీరియా, బబులోనులను దేవుని ప్రజల్ని దౌర్జన్యపూరితంగా వ్యతిరేకించిన, మ్రింగివేసిన “కొదమసింహ” గర్జనగా బైబిలు తగినవిధంగానే సూచించింది.—యెషయా 5:29; యిర్మీయా 50:17.
చీకటి మూలంగానో లేక దూరంగా చెదిరిపోవడం మూలంగానో సింహాల సమూహం ఒకదాన్నుండి మరొకటి వేరైపోయినప్పుడు అవెక్కడున్నాయో తెలుసుకునేందుకు గర్జన దోహదపడుతుంది. వేటాడిన తర్వాత, సమూహంలోని మిగతా సింహాలు, ఆహారం సిద్ధంగా వేచివున్న స్థలానికి వచ్చేలా ఆ గర్జన జాగరూకులను చేస్తుంది. ఆ లక్షణాన్ని సూచిస్తూ, బైబిలు ఇలా పేర్కొంటోంది: “ఏమియు పట్టుకొనకుండనే కొదమ సింహము గుహలోనుండి బొబ్బ పెట్టునా?”—ఆమోసు 3:3.
వన్య ప్రాణుల్ని వేటాడేటప్పుడు, వేటాడబడే జంతువును భయపెట్టేందుకు గర్జనను ఒక తంత్రంగా సింహాలు ఉపయోగించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. ది బిహేవియర్ గైడ్ టు ఆఫ్రికన్ మామాల్స్ అనే తన పుస్తకంలో, రిచర్డ్ ఎసీజ్ ఇలా పేర్కొన్నాడు: “వేటాడబడే జంతువులను [తాము] పొంచివున్న చోటుకి వచ్చేలా చేసేందుకు సింహాలు కావాలని గర్జిస్తాయనడానికి సూచన ఏదీ లేదు. (నా అనుభవంలో వేటాడబడే జంతువులు సాధారణంగా సింహగర్జనల్ని లక్ష్యపెట్టవు).”
మరైతే బైబిలు సాతాన్ని ‘గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచున్నట్టుగా’ ఎందుకు సూచిస్తోంది? (1 పేతురు 5:8) వన్య ప్రాణులు సింహగర్జనలకు బెదిరినట్టు కన్పించకపోయినా, మనుష్యుల విషయంలో, సాధు జంతువుల విషయంలో పరిస్థితి వేరుగా ఉంది. రాత్రివేళ చీకట్లో ప్రతిధ్వనించే, భీతినిగొలిపే సింహగర్జన తలుపులు బిగించుకొని సురక్షితంగా ఇంట్లో ఉండని ఏ వ్యక్తికైనా సరే భయాన్ని కలుగజేస్తుంది, దడ పుట్టిస్తుంది. ఎంతో కాలంక్రిందట, దాన్ని కచ్చితంగా ఇలా పేర్కొనడం జరిగింది: “సింహము గర్జించెను, భయపడని వాడెవడు?”—ఆమోసు 3:8.
లోబడేలా ప్రజల్ని జడిపించేందుకు భయాన్ని ఉపయోగించడంలో సాతాను నిపుణుడు. కృతజ్ఞతాపూర్వకంగా, దేవుని ప్రజలకు ఒక శక్తివంతమైన సహాయం ఉంది. యెహోవా దేవుని మద్దతునందు దృఢమైన నమ్మకంతో, వాళ్లు శక్తివంతంగా ‘గర్జించే ఆ సింహాన్ని’ విజయవంతంగా ఎదుర్కోగలరు. “విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించ”మని క్రైస్తవులు ప్రోత్సహించబడుతున్నారు.—1 పేతురు 5:9.