కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • bt అధ్యా. 15 పేజీలు 117-123
  • “సంఘాల్ని బలపరుస్తూ” ఉన్నారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “సంఘాల్ని బలపరుస్తూ” ఉన్నారు
  • “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “ఇప్పుడు తిరిగెళ్లి, అక్కడున్న సహోదరుల్ని కలుద్దాం” (అపొ. 15:36)
  • ‘చాలా కోపంతో గొడవపడ్డారు’ (అపొ. 15:37-41)
  • ‘తిమోతికి మంచిపేరు ఉంది’ (అపొ. 16:1-3)
  • “సంఘాలు విశ్వాసంలో స్థిరపడుతూ ఉన్నాయి” (అపొ. 16:4, 5)
  • తిమోతి—సేవచేయడానికి సిద్ధంగావుండేవాడు, సేవచేయడానికి ఇష్టపడేవాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • మార్కు ‘పరిచారము నిమిత్తము ప్రయోజనకరమైనవాడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • తిమోతి—‘విశ్వాసమునుబట్టి నిజమైన కుమారుడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • బర్నబా—“ఆదరణ పుత్రుడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
“దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
bt అధ్యా. 15 పేజీలు 117-123

అధ్యాయం 15

“సంఘాల్ని బలపరుస్తూ” ఉన్నారు

విశ్వాసంలో స్థిరంగా ఉండేలా ప్రయాణ సేవకులు సంఘాలకు సహాయం చేశారు

అపొస్తలుల కార్యాలు 15:36–16:5 ఆధారంగా

1-3. (ఎ) పౌలుతో పాటు ప్రయాణించడానికి వచ్చిన కొత్త వ్యక్తి ఎవరు, అతను ఎలాంటివాడు? (బి) మనం ఈ అధ్యాయంలో ఏం తెలుసుకుంటాం?

కొండలు, గుట్టలు దాటుకుంటూ ఒక నగరం నుండి ఇంకో నగరానికి ప్రయాణిస్తున్న అపొస్తలుడైన పౌలు, తన పక్కనే నడుస్తున్న యువకున్ని చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. అతని పేరు తిమోతి, వయసు దాదాపు 20 ఏళ్లు. యెహోవా సేవ చేయాలనే కోరిక, ఉత్సాహం అతనిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అతను వేసే ఒక్కో అడుగు అతనికి, అతని ఇంటికి మధ్య ఉన్న దూరాన్ని పెంచుతోంది. సాయంత్రం అయ్యేసరికి వాళ్లు లుస్త్ర, ఈకొనియ నగరాలు దాటి చాలా దూరం వచ్చేశారు. వాళ్ల ప్రయాణం ఎలా ఉండబోతోంది? పౌలుకు ఇది రెండవ మిషనరీ యాత్ర, కాబట్టి చాలా ఇబ్బందులు, ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయనకు తెలుసు. ‘తిమోతి వాటన్నిటిని ఎలా ఎదుర్కొంటాడా?’ అని పౌలు ఆలోచిస్తుండవచ్చు.

2 పౌలుకు తిమోతి మీద చాలా నమ్మకం ఉంది. ఎంతంటే, బహుశా తిమోతికి కూడా తన మీద తనకు అంత నమ్మకం ఉండివుండదు. సంఘాల్ని సందర్శిస్తూ, వాటిని బలపర్చాలంటే ఆ పనిపట్ల అంకిత భావం, అందరూ ఒకే ఆలోచనతో ముందుకెళ్లడం అవసరమని పౌలుకు తెలుసు. తనతోపాటు ప్రయాణించడానికి అలాంటి ఒక వ్యక్తి అవసరం అని పౌలుకు అనిపించింది. ఆయనకు ఎందుకు అలా అనిపించి ఉంటుంది? కొన్ని రోజుల ముందు పౌలు, బర్నబాల మధ్య జరిగిన గొడవ అందుకు ఒక కారణం కావచ్చు.

3 ఈ అధ్యాయంలో, ఎవరితోనైనా అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుకుంటాం. పౌలు, తిమోతిని తనతో పాటు ప్రయాణించడానికి ఎందుకు ఎంచుకున్నాడో చూస్తాం. అలాగే నేడు ప్రయాణ పర్యవేక్షకులు చేస్తున్న ముఖ్యమైన పని గురించి ఎక్కువ తెలుసుకుంటాం.

“ఇప్పుడు తిరిగెళ్లి, అక్కడున్న సహోదరుల్ని కలుద్దాం” (అపొ. 15:36)

4. పౌలు రెండవ మిషనరీ యాత్రకు ఎందుకు వెళ్లాలనుకున్నాడు?

4 ముందటి అధ్యాయంలో పౌలు, బర్నబా, యూదా, సీల ఏం చేశారో చూశాం. సున్నతి గురించి పరిపాలక సభ తీసుకున్న నిర్ణయాన్ని అంతియొకయలోని సంఘానికి చెప్పి, వాళ్లు సహోదరుల్ని బలపర్చారు. మరి తర్వాత పౌలు ఏం చేశాడు? ఆయన బర్నబా దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు: “మనం ఏయే నగరాల్లో యెహోవా వాక్యాన్ని ప్రకటించామో ఆ నగరాలన్నిటికీ ఇప్పుడు తిరిగెళ్లి, అక్కడున్న సహోదరుల్ని కలుద్దాం. వాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.” (అపొ. 15:36) కొత్తగా క్రైస్తవులైన వాళ్లను కేవలం పలకరించి వద్దామన్న ఉద్దేశంతో పౌలు ఆ మాటలు అనలేదు. ఈ రెండవ మిషనరీ యాత్రకు గల కారణాల్ని అపొస్తలుల కార్యాలు పుస్తకం చెప్తుంది. ఒకటి, పరిపాలక సభ తీసుకున్న నిర్ణయాల్ని సంఘాలకు తెలియజేయడం. (అపొ. 16:4) రెండు, ప్రయాణ పర్యవేక్షకుడిగా సంఘాల్ని ఆధ్యాత్మికంగా బలపర్చి, విశ్వాసంలో స్థిరంగా ఉండేలా సహాయం చేయడం. (రోమా. 1:11, 12) మొదటి శతాబ్దంలోని పరిపాలక సభ ఉపయోగించిన పద్ధతిని, నేటి యెహోవాసాక్షుల సంస్థ ఎలా పాటిస్తుంది?

5. నేడు పరిపాలక సభ సంఘాలన్నిటికీ నిర్దేశాన్ని, ప్రోత్సాహాన్ని ఎలా ఇస్తుంది?

5 క్రీస్తు, నేడు సంఘాల్ని నడిపించడానికి యెహోవాసాక్షుల పరిపాలక సభను ఉపయోగిస్తున్నాడు. ఈ నమ్మకమైన అభిషిక్త సహోదరులు ఉత్తరాల్ని, ప్రచురణల్ని, మీటింగ్స్‌ని, ఇంకా వేరే పద్ధతుల్ని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నిటికీ నిర్దేశాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. పరిపాలక సభ ప్రతీ సంఘం గురించి బాగా తెలుసుకోవాలని కోరుకుంటుంది. అందుకే, ప్రయాణ పర్యవేక్షకుల్ని సంఘాలకు పంపిస్తుంది. అర్హతలు ఉన్న పెద్దల్ని పరిపాలక సభే నేరుగా ప్రాంతీయ పర్యవేక్షకులుగా నియమిస్తుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా వేలమంది ప్రాంతీయ పర్యవేక్షకులు సేవ చేస్తున్నారు.

6, 7. ప్రాంతీయ పర్యవేక్షకులు చేసే కొన్ని పనులు ఏంటి?

6 నేడు ప్రయాణ పర్యవేక్షకులు సంఘాల్లో ఉన్న ప్రతీఒక్కరి మీద శ్రద్ధ చూపిస్తారు, వాళ్లను ఆధ్యాత్మికంగా ప్రోత్సహించడానికి కృషిచేస్తారు. వాళ్లు ఆ పనిని ఎలా చేస్తారు? మొదటి శతాబ్దంలోని పౌలు లాంటి వాళ్ల ఆదర్శాన్ని వాళ్లు పాటిస్తారు. పౌలు తన తోటి ప్రయాణ పర్యవేక్షకుడైన తిమోతిని ఇలా ప్రోత్సహించాడు: “వాక్యాన్ని ప్రకటించు; అనుకూలంగా ఉన్న సమయాల్లో, కష్టమైన సమయాల్లో చురుగ్గా ఆ పని చేయి; సంపూర్ణమైన ఓర్పుతో, బోధనాకళతో గద్దించు, గట్టిగా హెచ్చరించు, ప్రోత్సహించు . . . మంచివార్త ప్రచారకుడిగా పనిచేయి.”—2 తిమో. 4:2, 5.

7 పౌలు ఇచ్చిన సలహాను పాటిస్తూ ప్రాంతీయ పర్యవేక్షకులు సంఘంలోని ప్రచారకులతో కలిసి వేర్వేరు పద్ధతుల్లో పరిచర్య చేస్తారు. ఒకవేళ ప్రాంతీయ పర్యవేక్షకునికి పెళ్లయి ఉంటే, ఆయన భార్య కూడా అలా పరిచర్య చేస్తుంది. వాళ్లు పరిచర్యలో ఉత్సాహం చూపిస్తారు, నైపుణ్యంగా బోధిస్తారు. వాళ్లను చూసి సహోదర సహోదరీలు ఎంతో నేర్చుకుంటారు. (రోమా. 12:11; 2 తిమో. 2:15) ప్రయాణ సేవలో ఉన్నవాళ్లు ఎన్నో త్యాగాలు చేస్తూ, నిస్వార్థమైన ప్రేమ చూపిస్తారు. వాళ్లు తమ సమయాన్ని, శక్తిని ఉపయోగించి ఇతరులకు ఇష్టంగా సహాయం చేస్తారు. వాతావరణం బాలేకపోయినా, ప్రమాదకరమైన దారిలో ప్రయాణించాల్సి వచ్చినా వాళ్లు వెనకడుగు వేయరు. (ఫిలి. 2:3, 4) ప్రాంతీయ పర్యవేక్షకులు బైబిలు ప్రసంగాలు ఇస్తూ సంఘాలకు బోధిస్తారు, ఉపదేశమిస్తారు, ప్రోత్సాహాన్ని ఇస్తారు. వాళ్లు చూపిస్తున్న మంచి స్ఫూర్తి గురించి ఆలోచిస్తూ, మనం వాళ్ల విశ్వాసాన్ని అనుసరించాలి.—హెబ్రీ. 13:7.

‘చాలా కోపంతో గొడవపడ్డారు’ (అపొ. 15:37-41)

8. “సహోదరుల్ని కలుద్దాం” అని పౌలు అన్నప్పుడు బర్నబా ఏం చేశాడు?

8 “సహోదరుల్ని కలుద్దాం” అని పౌలు చెప్పిన మాట బర్నబాకు నచ్చింది. (అపొ. 15:36) ఇంతకుముందు కూడా వాళ్లిద్దరు కలిసిమెలిసి పనిచేశారు. అంతేకాదు వాళ్లు వెళ్లబోయే ప్రాంతాల గురించి, అక్కడున్న సహోదరుల గురించి వాళ్లకు బాగా తెలుసు. (అపొ. 13:2–14:28) కాబట్టి ఇప్పుడు మళ్లీ వాళ్లిద్దరు కలిసి వెళ్లాలనుకోవడం మంచి ఆలోచనే. అయితే ఒక సమస్య మొదలైంది. అపొస్తలుల కార్యాలు 15:37 ఇలా చెప్తుంది: “అప్పుడు బర్నబా, మార్కు అని పిలవబడే యోహానును తమతో తీసుకెళ్లాలని పట్టుబట్టాడు.” బర్నబా కేవలం తన అభిప్రాయం చెప్పడం లేదు, తన బంధువైన మార్కును ఈ మిషనరీ యాత్రకు తీసుకెళ్లాల్సిందేనని “పట్టుబట్టాడు.”

9. బర్నబా చెప్పిన దానికి పౌలు ఎందుకు ఒప్పుకోలేదు?

9 కానీ పౌలు దానికి ఒప్పుకోలేదు. ఎందుకు? బైబిలు ఇలా చెప్తుంది: “అతన్ని [మార్కును] తమతో పాటు తీసుకెళ్లడం పౌలుకు ఇష్టంలేదు. ఎందుకంటే అతను వాళ్లతో పాటు పనిచేయకుండా, పంఫూలియలో వాళ్లను వదిలేసి వెళ్లిపోయాడు.” (అపొ. 15:38) పౌలు, బర్నబాలతో పాటు మార్కు కూడా మొదటి మిషనరీ యాత్రకు వెళ్లాడు. కానీ చివరివరకు వాళ్లతో ఉండలేదు. (అపొ. 12:25; 13:13) ఆ ప్రయాణం మొదలైన కొంతకాలానికే మార్కు వాళ్లను పంఫూలియలో వదిలేసి, తన సొంత ఊరైన యెరూషలేముకు వెళ్లిపోయాడు. మార్కు అలా వెళ్లిపోవడానికి గల కారణం ఏంటో బైబిలు చెప్పడం లేదు. ఏదేమైనా మార్కు బాధ్యతగా నడుచుకోలేదని పౌలుకు అనిపించింది. ఈసారి కూడా అలానే జరగవచ్చు అని పౌలు అనుకున్నాడు.

10. పౌలు, బర్నబా గొడవపడిన తర్వాత ఏం జరిగింది?

10 అయినా బర్నబా మొండిపట్టు వీడలేదు, పౌలు కూడా వద్దంటే వద్దు అన్నాడు. అలా, “వాళ్లిద్దరు చాలా కోపంతో గొడవపడి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.” (అపొ. 15:39) బర్నబా మార్కును తీసుకొని తన సొంత ఊరైన కుప్ర ద్వీపానికి వెళ్లాడు. పౌలు ముందే అనుకున్నట్టు రెండవ మిషనరీ యాత్రకు బయల్దేరాడు. బైబిలు ఇలా చెప్తుంది: “పౌలు సీలను ఎంచుకున్నాడు. పౌలు మీద యెహోవా తన అపారదయ చూపించాలని సహోదరులు ప్రార్థించిన తర్వాత అతను బయల్దేరాడు.” (అపొ. 15:40) వాళ్లిద్దరూ “సిరియా, కిలికియ గుండా ప్రయాణిస్తూ సంఘాల్ని బలపరుస్తూ” ఉన్నారు.—అపొ. 15:41.

11. మనల్ని బాధపెట్టిన వాళ్లతో స్నేహాన్ని కాపాడుకోవాలంటే మనకు ఏ లక్షణాలు ఉండాలి?

11 ఈ సంఘటన, మనందరం అపరిపూర్ణులమే అని గుర్తు చేస్తుంది. పౌలు, బర్నబా పరిపాలక సభ ప్రత్యేక ప్రతినిధులుగా నియమించబడ్డారు. కొంతకాలానికి పౌలు పరిపాలక సభ సభ్యుడు కూడా అయ్యుంటాడు. పౌలు, బర్నబా ఇద్దరూ మంచి సహోదరులే. కానీ ఆ సమయంలో, వాళ్లు తమ కోపాన్ని అదుపు చేసుకోలేకపోయారు. అంతమాత్రాన వాళ్లిద్దరి స్నేహం ఇక పూర్తిగా పాడైపోయిందా? పౌలు, బర్నబా అపరిపూర్ణులే అయినప్పటికీ వాళ్లకు వినయం, క్రీస్తు లాంటి మనస్తత్వం ఉంది. కొంతకాలానికి వాళ్లు ఒకరినొకరు క్షమించుకుని, ఖచ్చితంగా తమ స్నేహాన్ని కాపాడుకుని ఉంటారు. (ఎఫె. 4:1-3) తర్వాతి రోజుల్లో పౌలు మళ్లీ మార్కుతో కలిసి పనిచేశాడు.a—కొలొ. 4:10.

12. పౌలు, బర్నబాల్లాగే నేడు పెద్దలు, ప్రాంతీయ పర్యవేక్షకులు ఎలా ఉండాలి?

12 ఈ సందర్భంలో బర్నబా, పౌలు కోపం తెచ్చుకున్నారు అన్నది నిజమే; అయితే వాళ్లు చీటికి మాటికి కోపం తెచ్చుకునే వాళ్లేం కాదు. బర్నబాది మంచి మనసు, ఆయనకు ఇచ్చే గుణం కూడా ఉందని అందరికీ తెలుసు. అందుకే అపొస్తలులు ఆయన్ని, యోసేపు అనే సొంత పేరుతో పిలిచే బదులు “బర్నబా” అనే పేరు పెట్టారు. ఆ పేరుకు “ఓదార్పు పుత్రుడు” అని అర్థం. (అపొ. 4:36) పౌలుకు కూడా అందరితో దయగా, మృదువుగా ఉంటాడనే పేరు ఉంది. (1 థెస్స. 2:7, 8) పౌలు, బర్నబాల్లాగే నేడు పెద్దలు, ప్రాంతీయ పర్యవేక్షకులు ఎప్పుడూ వినయం చూపించాలి; తోటి పెద్దలతో, సంఘంలోని వాళ్లతో దయగా ఉండాలి.—1 పేతు. 5:2, 3.

‘తిమోతికి మంచిపేరు ఉంది’ (అపొ. 16:1-3)

13, 14. (ఎ) తిమోతి ఎవరు? పౌలు తిమోతిని ఎప్పుడు కలుసుకుని ఉంటాడు? (బి) పౌలు దృష్టి తిమోతి మీద ఎందుకు పడింది? (సి) తిమోతికి పెద్దలు ఏ బాధ్యత అప్పగించారు?

13 పౌలు రెండవ మిషనరీ యాత్రలో, రోమా పరిపాలన కింద ఉన్న గలతీయ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ అప్పటికే కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆయన “దెర్బేకు, ఆ తర్వాత లుస్త్రకు వెళ్లాడు. అక్కడ తిమోతి అనే శిష్యుడు ఉన్నాడు. వాళ్ల అమ్మ ఒక విశ్వాసి, ఆమె యూదురాలు. కానీ వాళ్ల నాన్న గ్రీకువాడు.”—అపొ. 16:1.b

14 దాదాపు క్రీస్తు శకం 47 లో, పౌలు తన మొదటి మిషనరీ యాత్రలోనే తిమోతి కుటుంబాన్ని కలిసుంటాడు. రెండు-మూడేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ లుస్త్రకు వచ్చినప్పుడు పౌలు దృష్టి యువకుడైన తిమోతి మీద పడింది. ఎందుకు? ఎందుకంటే తిమోతికి “సహోదరుల దగ్గర మంచిపేరు ఉంది.” అతని సొంత ఊరిలోనే కాదు, లుస్త్రకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈకొనియలో కూడా సహోదరులకు తిమోతి మీద మంచి అభిప్రాయం ఉంది. (అపొ. 16:2) పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం పెద్దలు యువకుడైన తిమోతి భుజాల మీద ఒక బరువైన బాధ్యతను పెట్టారు. అదేంటంటే ప్రయాణ సేవలో పౌలుకు, సీలకు సహాయం చేయడం.—అపొ. 16:3.

15, 16. తిమోతికి అంత మంచిపేరు ఎలా వచ్చింది?

15 యువకుడిగా ఉన్నప్పుడే, తిమోతికి అంత మంచిపేరు ఎలా వచ్చింది? అతనికి ఉన్న తెలివి, అందం, నైపుణ్యాల వల్లా? సాధారణంగా మనుషులైతే అవే చూస్తారు. ఒక సందర్భంలో సమూయేలు ప్రవక్త కూడా కంటికి కనిపించే వాటిమీదే మనసుపెట్టాడు. అప్పుడు యెహోవా ఆయనకు ఇలా గుర్తుచేశాడు: “మనుషులు చూసినట్టు దేవుడు చూడడు. మామూలు మనిషి, కంటికి కనిపించేదాన్నే చూస్తాడు; కానీ యెహోవా హృదయాన్ని చూస్తాడు.” (1 సమూ. 16:7) తెలివి, అందం, నైపుణ్యాల వల్ల కాదుగానీ మంచి లక్షణాల వల్లే, తిమోతి తోటి విశ్వాసుల దగ్గర మంచిపేరు తెచ్చుకున్నాడు.

16 కొన్నేళ్ల తర్వాత, పౌలు తిమోతిలో ఉన్న కొన్ని మంచి లక్షణాల గురించి చెప్పాడు. అతని మనస్తత్వం చాలా మంచిదని, త్యాగాలు చేయడానికి వెనకాడడని, ఇచ్చిన పనిని బాధ్యతగా చేస్తాడని పౌలు అన్నాడు. (ఫిలి. 2:20-22) అంతేకాదు, తిమోతి ‘వేషధారణలేని విశ్వాసం’ చూపించాడు.—2 తిమో. 1:5.

17. నేడు యౌవనులు తిమోతిలా ఎలా ఉండవచ్చు?

17 నేడు కూడా చాలామంది యౌవనులు తిమోతిలా మంచి లక్షణాల్ని చూపిస్తున్నారు. చిన్న వయసులోనే యెహోవా దగ్గర, ఆయన ప్రజల దగ్గర మంచిపేరు తెచ్చుకుంటున్నారు. (సామె. 22:1; 1 తిమో. 4:15) వాళ్లు వేషధారణలేని విశ్వాసాన్ని చూపిస్తున్నారు, అంటే పైకి ఒకలా లోపల ఇంకోలా ఉండడం లేదు. (కీర్త. 26:4) కాబట్టి వాళ్లు కూడా తిమోతిలా సంఘానికి ఎంతో ఉపయోగపడవచ్చు. వాళ్లు ప్రచారకులై, యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్నప్పుడు సంఘంలో అందరూ ఎంతో సంతోషిస్తారు!

“సంఘాలు విశ్వాసంలో స్థిరపడుతూ ఉన్నాయి” (అపొ. 16:4, 5)

18. (ఎ) ప్రయాణ సేవకులుగా పౌలు, తిమోతి పరిపాలక సభకు ఎలా సహాయం చేశారు? (బి) సంఘాలు ఎలా ప్రయోజనం పొందాయి?

18 పౌలు, తిమోతి చాలా ఏళ్లు కలిసి పనిచేశారు. వాళ్లు ప్రయాణ సేవకులుగా పరిపాలక సభ అప్పగించిన ఎన్నో పనులు చేశారు. బైబిలు ఇలా చెప్తుంది: “వాళ్లు ఒక నగరం నుండి ఇంకో నగరానికి వెళ్తూ యెరూషలేములోని అపొస్తలులు, పెద్దలు నిర్ణయించిన ఆజ్ఞల్ని సహోదరులకు చెప్పి వాటిని పాటించమన్నారు.” (అపొ. 16:4) యెరూషలేములో ఉన్న అపొస్తలులు, పెద్దలు ఇచ్చిన నిర్దేశాన్ని సంఘాలు పాటించాయి. దానివల్ల “సంఘాలు విశ్వాసంలో స్థిరపడుతూ ఉన్నాయి, విశ్వాసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది.”—అపొ. 16:5.

19, 20. “నాయకత్వం వహిస్తున్నవాళ్లకు” క్రైస్తవులు ఎందుకు లోబడాలి?

19 అదేవిధంగా, నేడు యెహోవాసాక్షులు తమలో “నాయకత్వం వహిస్తున్నవాళ్లకు” విధేయత చూపిస్తూ, వాళ్లు ఇచ్చే నిర్దేశాలకు లోబడుతూ ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. (హెబ్రీ. 13:17) ఈ లోకంలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. కాబట్టి “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఇస్తున్న నిర్దేశాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటిని పాటించడం చాలా ప్రాముఖ్యం. (మత్త. 24:45; 1 కొరిం. 7:29-31) అలా చేయడం వల్ల మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవచ్చు, ఈ లోక మలినం మనకు అంటకుండా చూసుకోవచ్చు.—యాకో. 1:27.

20 మొదటి శతాబ్దంలోని పౌలు, బర్నబా, మార్కు అలాగే మిగతా అభిషిక్త సహోదరుల్లాగే నేటి క్రైస్తవ పెద్దలు, చివరికి పరిపాలక సభ సభ్యులు కూడా అపరిపూర్ణులే. (రోమా. 5:12; యాకో. 3:2) అయితే పరిపాలక సభ సభ్యులు దేవుని వాక్యాన్ని, అపొస్తలులు ఉంచిన ఆదర్శాన్ని జాగ్రత్తగా పాటిస్తున్నారు కాబట్టి, వాళ్ల మీద పూర్తి నమ్మకం ఉంచవచ్చు. (2 తిమో. 1:13, 14) దానివల్ల నేడు కూడా సంఘాలు బలపడుతూ ఉన్నాయి, విశ్వాసంలో స్థిరపడుతూ ఉన్నాయి.

“మంచివార్తను వ్యాప్తిచేయడానికి” కష్టపడి పనిచేసిన తిమోతి

అపొస్తలుడైన పౌలుకు తిమోతి ఒక మంచి సహాయకునిగా ఉన్నాడు. తిమోతి సహాయాన్ని పౌలు ఎంతో విలువైనదిగా చూశాడు. వాళ్లిద్దరు దాదాపు 11 ఏళ్లు కలిసి పని చేసిన తర్వాత, పౌలు తిమోతి గురించి ఇలా రాశాడు: “అతనిలాంటి మనస్తత్వం కలిగి మీ విషయంలో నిజమైన శ్రద్ధ చూపించేవాళ్లు ఇంకెవ్వరూ నా దగ్గర లేరు . . . తిమోతి తానేంటో నిరూపించుకున్నాడని మీకు తెలుసు. ఒక పిల్లవాడు తన తండ్రితో కలిసి పనిచేసినట్టు, మంచివార్తను వ్యాప్తిచేయడానికి అతను నాతో కలిసి సేవచేశాడు.” (ఫిలి. 2:20, 22) తిమోతి తన జీవితాన్ని ప్రకటనా పనికి అంకితం చేశాడు. దానివల్లే అతను పౌలుకు దగ్గరయ్యాడు, మనకు మంచి ఆదర్శంగా నిలిచాడు.

తిమోతి.

తిమోతి వాళ్ల నాన్న గ్రీకువాడు, అమ్మ యూదురాలు. అతను లుస్త్ర నగరంలో పెరిగాడని తెలుస్తోంది. తిమోతి పసి పిల్లవాడిగా ఉన్నప్పటి నుండే వాళ్ల అమ్మ యునీకే, అమ్మమ్మ లోయి అతనికి లేఖనాల్ని నేర్పించారు. (అపొ. 16:1, 3; 2 తిమో. 1:5; 3:14, 15) పౌలు మొదటిసారి లుస్త్రకు వచ్చినప్పుడు వాళ్ల అమ్మ, అమ్మమ్మతో పాటు తిమోతి కూడా క్రైస్తవుడిగా మారి ఉంటాడు.

కొన్నేళ్ల తర్వాత పౌలు లుస్త్రకు తిరిగొచ్చే సరికి, తిమోతికి బహుశా దాదాపు 20 ఏళ్లు ఉండి ఉంటాయి. అంతేకాదు ఆ సమయానికి “తిమోతికి లుస్త్రలో, ఈకొనియలో ఉన్న సహోదరుల దగ్గర మంచిపేరు ఉంది.” (అపొ. 16:2) పవిత్రశక్తి ప్రేరణతో యువకుడైన తిమోతి గురించి కొన్ని “ప్రవచనాలు” చెప్పబడ్డాయి. వాటికి అనుగుణంగా పౌలు, అలాగే స్థానిక పెద్దలు అతనికి ఒక ప్రత్యేకమైన నియామకాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. (1 తిమో. 1:18; 4:14; 2 తిమో. 1:6) అదేంటంటే, మిషనరీ సేవలో పౌలుకు తిమోతి సహాయకుడిగా వెళ్లాలి. దానికోసం తిమోతి తన కుటుంబాన్ని విడిచి వెళ్లాలి; అలాగే ఆ మిషనరీ సేవలో కలవబోయే యూదులకు అభ్యంతరం కలగకుండా ఉండడానికి సున్నతి చేయించుకోవాలి.—అపొ. 16:3.

తిమోతి ఎన్నో ప్రయాణాలు చేశాడు. అతను ఫిలిప్పీలో పౌలు, సీలతో కలిసి ప్రకటించాడు. బెరయలో సీలతో కలిసి ప్రకటించాడు, థెస్సలొనీకలో మాత్రం ఒంటరిగా ప్రకటించాడు. తర్వాత తిమోతి మళ్లీ కొరింథులో పౌలును కలిసినప్పుడు, థెస్సలొనీక వాళ్లు శ్రమల్లో కూడా నమ్మకంగా ఉంటున్నారు, ప్రేమ చూపిస్తున్నారు అనే సంతోషకరమైన వార్తను చెప్పాడు. (అపొ. 16:6–17:14 1 థెస్స. 3:2-6) పౌలు ఎఫెసులో ఉన్నప్పుడు కొరింథు సంఘంలోని సమస్యల గురించి విన్నాడు. అప్పుడు పౌలు తిమోతిని అక్కడికి పంపించాలని అనుకున్నాడు. (1 కొరిం. 4:17) పౌలు ఆ తర్వాత తిమోతిని, అలాగే ఎరస్తును ఎఫెసు నుండి మాసిదోనియకు పంపించాడు. కానీ పౌలు రోమీయులకు ఉత్తరం రాసే సమయానికి తిమోతి మళ్లీ పౌలుతో పాటు కొరింథులో ఉన్నాడు. (అపొ. 19:22; రోమా. 16:21) మంచివార్త కోసం తిమోతి చేసిన ప్రయాణాల్లో ఇవి కొన్ని మాత్రమే.

పౌలు తిమోతిని ఇలా ప్రోత్సహించాడు: “నీ యౌవనాన్ని బట్టి నిన్ను ఎవ్వరూ, ఎప్పుడూ చిన్నచూపు చూడకుండా జాగ్రత్తపడు.” దాన్నిబట్టి తిమోతి తన అధికారాన్ని ఉపయోగించే విషయంలో కాస్త తటపటాయించేవాడని తెలుస్తోంది. (1 తిమో. 4:12) అయినా పౌలుకు తిమోతి మీద పూర్తి నమ్మకం ఉంది. అందుకే అతన్ని సమస్యలున్న సంఘానికి పంపిస్తూ ఇలా అన్నాడు: “భిన్నమైన సిద్ధాంతాల్ని బోధించేవాళ్లను అలా చేయొద్దని ఆజ్ఞాపించు.” (1 తిమో. 1:3) సంఘంలో పర్యవేక్షకుల్ని, సంఘ పరిచారకుల్ని నియమించే అధికారాన్ని కూడా పౌలు తిమోతికి ఇచ్చాడు.—1 తిమో. 5:22.

తిమోతిలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి పౌలుకు అతను అంటే చాలా ఇష్టం. యువకుడైన తిమోతి ఒక కొడుకులా పౌలుకు చాలా దగ్గరయ్యాడని, నమ్మకంగా ఉంటూ ఆయన మీద ఎంతో ప్రేమ చూపించాడని లేఖనాలు చెప్తున్నాయి. అందుకే తిమోతి కన్నీళ్లను తలచుకున్నానని, తనను చూడాలని బలంగా కోరుకుంటున్నానని, తన గురించి ప్రార్థిస్తున్నానని పౌలు రాశాడు. పౌలు ప్రేమగల ఒక తండ్రిలా తిమోతి బాగోగుల గురించి ఆలోచించేవాడు. అందుకే, తిమోతికి కడుపులో ‘తరచూ వచ్చే జబ్బు’ గురించి సలహా ఇచ్చాడు.—1 తిమో. 5:23; 2 తిమో. 1:3, 4.

పౌలు మొదటిసారి రోములో బందీగా ఉన్నప్పుడు తిమోతి ఆయన పక్కనే ఉన్నాడు. కొంతకాలం పాటు, తిమోతి కూడా జైల్లో ఉన్నాడు. (ఫిలే. 1; హెబ్రీ. 13:23) తను చనిపోయే సమయం దగ్గరపడిందని పౌలుకు అర్థమైనప్పుడు, ఆయన తిమోతికి ఉత్తరం రాస్తూ ఇలా అన్నాడు: “వీలైనంత త్వరగా నా దగ్గరికి రావడానికి ప్రయత్నించు.” ఆ మాటల్ని చూస్తే, వాళ్లిద్దరు ఒకరికొకరు ఎంత దగ్గరయ్యారో తెలుస్తుంది. (2 తిమో. 4:6-9) ఒక స్నేహితునిలా, గురువులా తనను నడిపించిన పౌలు కన్నుమూయక ముందే తిమోతి ఆయన్ని కలుసుకోగలిగాడో లేదో బైబిలు చెప్పట్లేదు.

మార్కు ఎన్నో ప్రత్యేక నియామకాలు అందుకున్నాడు

యేసును బంధించడానికి వచ్చినవాళ్లు ‘ఒక యువకుడిని’ కూడా పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు, “అతను ఒంటిమీద బట్టలు లేకుండానే పారిపోయాడు” అని మార్కు సువార్త చెప్తుంది. (మార్కు 14:51, 52) యోహాను అనే ఇంకో పేరున్న మార్కు మాత్రమే ఈ విషయాన్ని తన సువార్త పుస్తకంలో రాశాడు. దాన్నిబట్టి బహుశా ఆ యువకుడు మార్కే అయ్యుంటాడు అని చెప్పవచ్చు. ఒకవేళ అదే నిజమైతే, యేసుతో అతనికి ఎంతో కొంత పరిచయం ఉండే ఉంటుంది.

ఒక పెద్దాయన మాట్లాడుతుంటే, మార్కు విని రాసుకుంటున్నాడు.

దాదాపు 11 ఏళ్ల తర్వాత, హేరోదు అగ్రిప్ప క్రైస్తవుల్ని హింసిస్తున్న సమయంలో, యెరూషలేము సంఘంలోని “చాలామంది” ప్రార్థించడానికి మార్కు తల్లి అయిన మరియ ఇంట్లో కలుసుకున్నారు. దేవదూత జైలు నుండి విడిపించిన తర్వాత అపొస్తలుడైన పేతురు ఆ ఇంటికే వచ్చాడు. (అపొ. 12:12) కాబట్టి మార్కు పెరిగిన ఆ ఇంటినే, క్రైస్తవులు కూటాలు జరుపుకోవడానికి ఉపయోగించి ఉండవచ్చు. యేసు తొలి శిష్యుల గురించి మార్కుకు తెలుసు అనడంలో ఏ సందేహం లేదు, వాళ్ల మంచి ప్రభావం అతని మీద పడి ఉంటుంది.

మొదటి శతాబ్దంలో, క్రైస్తవ సంఘాల్ని పర్యవేక్షించిన చాలామందితో కలిసి మార్కు పని చేశాడు. మనకు తెలిసినంతవరకు మార్కు మొదటిగా, తన దగ్గరి బంధువైన బర్నబా, అలాగే అపొస్తలుడైన పౌలుతో కలిసి సిరియాలోని అంతియొకయలో పనిచేసే నియామకాన్ని పొందాడు. (అపొ. 12:25) పౌలు, బర్నబాలు చేసిన మొదటి మిషనరీ యాత్రలో, మార్కు వాళ్లతో పాటు కుప్రకు, ఆ తర్వాత ఆసియా మైనరుకు వెళ్లాడు. అయితే, అక్కడి నుండి మార్కు యెరూషలేముకు తిరిగెళ్లిపోయాడు; అతను ఎందుకు అలా వెళ్లిపోయాడో మనకు తెలీదు. (అపొ. 13:4, 13) ఆ తర్వాత అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయం చెప్తున్నట్టు మార్కు విషయంలో పౌలు, బర్నబా గొడవపడ్డారు. అప్పుడు మార్కు, బర్నబా కుప్రకు వెళ్లి తమ మిషనరీ సేవను కొనసాగించారు.—అపొ. 15:36-39.

క్రీస్తు శకం 60 లేదా 61 లో మార్కు మళ్లీ పౌలుతో కలిసి రోములో పనిచేశాడు. దాన్నిబట్టి పాతవన్నీ పూర్తిగా మర్చిపోయి, వాళ్లు మళ్లీ కలిసిపోయారని తెలుస్తుంది. రోములో బందీగా ఉన్న పౌలు కొలొస్సయి సంఘానికి ఉత్తరం రాస్తూ ఇలా అన్నాడు: “నా తోటి ఖైదీ అరిస్తార్కు, అలాగే బర్నబా దగ్గరి బంధువు మార్కు (మీ దగ్గరికి వస్తే సాదరంగా ఆహ్వానించమని నేను చెప్పింది ఇతని గురించే) మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు.” (కొలొ. 4:10) దీన్నిబట్టి, పౌలు మార్కును రోము నుండి కొలొస్సయికి తన తరఫున పంపాలనుకున్నాడని తెలుస్తుంది.

క్రీస్తు శకం 62 నుండి 64 మధ్యలో, మార్కు కొంతకాలం పాటు అపొస్తలుడైన పేతురుతో కలిసి బబులోనులో పనిచేశాడు. మనం ఈ పుస్తకంలోని 10వ అధ్యాయంలో చూసినట్టు, పేతురుకు మార్కుకు మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే పేతురు అతన్ని “నా కుమారుడైన మార్కు” అని పిలిచాడు.—1 పేతు. 5:13.

చివరికి దాదాపు క్రీస్తు శకం 65 లో, అపొస్తలుడైన పౌలు రోములో రెండోసారి బంధించబడినప్పుడు, ఎఫెసులో ఉన్న తన తోటి పనివాడైన తిమోతికి ఉత్తరం రాస్తూ ఇలా అన్నాడు: “నువ్వు వచ్చేటప్పుడు మార్కును వెంటబెట్టుకుని రా, అతను పరిచర్యలో నాకు సహాయంగా ఉంటాడు.” (2 తిమో. 4:11) మార్కు దాని గురించి విన్న వెంటనే ఎఫెసు నుండి బయల్దేరి, రోముకు ఖచ్చితంగా వెళ్లి ఉంటాడు. బర్నబా, పౌలు, పేతురు మనసుల్లో మార్కు ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు అనడంలో సందేహమే లేదు!

మార్కు పొందిన నియామకాల్లో అన్నిటికన్నా గొప్ప నియామకం, పవిత్రశక్తి సహాయంతో ఒక సువార్త పుస్తకాన్ని రాయడం. మార్కు రాసిన సమాచారం, చాలావరకు అపొస్తలుడైన పేతురు ద్వారా తెలుసుకున్నదే అని కొంతమంది అంటారు. అది నిజమే అనిపిస్తోంది, ఎందుకంటే పేతురు లాంటి ప్రత్యక్ష సాక్షులు మాత్రమే చెప్పగల చాలా వివరాల్ని మార్కు రాశాడు. అయితే మార్కు తన సువార్త పుస్తకాన్ని పేతురుతో కలిసి బబులోనులో ఉన్నప్పుడు రాయలేదు గానీ, రోములో ఉన్నప్పుడు రాశాడని తెలుస్తుంది. మార్కు చాలా లాటిన్‌ పదాల్ని వాడాడు, అలాగే యూదులుకాని వాళ్లు తేలిగ్గా అర్థం చేసుకోవడానికి వీలుగా హీబ్రూ పదాల్ని అనువదించాడు. కాబట్టి, అతను ఈ సువార్త పుస్తకాన్ని ముఖ్యంగా అన్యజనుల్ని దృష్టిలో పెట్టుకొని రాసి ఉంటాడని తెలుస్తుంది.

a “మార్కు ఎన్నో ప్రత్యేక నియామకాలు అందుకున్నాడు” అనే బాక్సు చూడండి.

b “‘మంచివార్తను వ్యాప్తిచేయడానికి’ కష్టపడి పనిచేసిన తిమోతి” అనే బాక్సు చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి