నిత్యజీవ నిరీక్షణనిచ్చు మరణమును ఆచరించుట
1 ఏప్రిల్ 6, 1993 సూర్యాస్తమయము తరువాత, జీవాధిపతియైనవాని మరణమును మనము ఆచరిస్తాము. (అపొ. 3:15) యేసు జీవితాన్ని, ఆయన మరణమును జ్ఞాపకంచేసికొనుట నిజంగా ఎంతో యుక్తమైనది. నిరంతరము జీవించు మన నిరీక్షణే యేసు చిందించిన రక్తముపై ఆధారపడి ఉంది.
2 యెహోవా సంకల్పముయొక్క కార్యశీలతలో క్రీస్తు మరణ ప్రాధాన్యతను ఈ జ్ఞాపకార్థ ఆచరణ గుర్తిస్తుంది. ఆ సంకల్పములో ఆదాము సంతతిని విమోచించుటకు పరిపూర్ణ మానవుని అర్పించుట, తద్వారా విశ్వసించు కోట్లాదిమందికి పరదైసు భూమిపై నిత్యమూ జీవించునట్లు సాధ్యపరచుట ఇమిడివుంది.—యోహాను 3:16.
3 సత్యమును, జీవమును ప్రేమించు వారంతా యేసు ఆజ్ఞకు విధేయులై ప్రభువురాత్రి భోజనమును ఆచరించుటకు ఎదురుచూస్తారు. (లూకా 22:19) క్రీస్తు విమోచన క్రయధన బలి ఏర్పాటుయెడల మెప్పుచూపుటకు వ్యక్తిగతముగా మనము ఏమిచేయగలము? ఈ ఆచరణ ప్రాముఖ్యతకు అనుగుణంగా మంచి వ్యవస్థీకరణ చాలా ప్రాముఖ్యము. ఈ ప్రత్యేక సంఘటనకు మీరు ఏయే విషయాలలో సిద్ధపడుతున్నారు?
4 ముందు సిద్ధపాటు అవసరము: అవును, మన కుటుంబములోని సభ్యులంతా హాజరయ్యేటట్లు మనము చూసుకుంటాము. అంతేగాక 1993 కేలండరులో ఏప్రిల్ 1-6లో గుర్తించబడిన బైబిలు భాగాలను చదువుకొని, వాటిని ధ్యానించుటద్వారా మనము మానసికంగాను సిద్ధపడి ఉండాలి. జ్ఞాపకార్థ ప్రాముఖ్యతను తెలియజేసే సమాచారమును ఏప్రిల్ 6కు ముందు చేసే వ్యక్తిగత మరియు కుటుంబ పఠనములో చేర్చవచ్చును. జ్ఞాపకార్థ ఆచరణకు మొదటిసారిగా హాజరయ్యే క్రొత్తవారిని ఆహ్వానించుటకు వీలుగా ఆ యాచరణ సమయానికి ముందుగా రావడానికి, అది అయిన తదుపరికూడా కొంతసమయం గడపగలిగేలా పథకం వేసికొనుము.
5 జ్ఞాపకార్థ దినమునకు ముందటి వారాలలో, మీకు తెలిసిన ఆసక్తిగల వారినందరిని ఈ ఆచరణకు ఆహ్వానించండి. ముద్రించబడిన ఆహ్వాన పత్రములు సంఘములకు సంవత్సరానికొకసారి పంపే ఫారములతోపాటు పంపించడం జరిగింది. వీటిని ఉపయోగించేటప్పుడు ఆసక్తిగలవారికి స్థానికంగా ఆచరణ జరిగే అడ్రసును సమయాన్ని తెలియపరచండి. మీరు ఆహ్వానించగోరే వారి పట్టికను తయారుచేసుకొనండి. హాజరయ్యేందుకు ఇష్టపడేవారందరికి రవాణా సౌకర్యముందా? అలా లేనట్లయితే వారికి సహాయం చేయడానికి మీరేమి చేయగలరు? ఉదాహరణకు, మీ కారులో ఖాళీ ఉంటే ఎవరికైనా రవాణా సౌకర్యం అవసరమేమో పెద్దలనెందుకు అడగకూడదు?
6 సంవత్సరంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన ఆచరణయై, ఎక్కువ మంది హాజరవుతారుగాన, పెద్దలు ముందుగానే ప్రత్యేక సిద్ధపాట్లు చేయవలసిన అవసరం ఉంటుంది. (1 కొరిం. 14:40) ఏప్రిల్ 6కు ఒక వారం లేక అంతకు ముందు పెద్దలు ఈ ఆచరణలో సహాయపడే సహోదరులతో ఒక ప్రత్యేక కూటమును ఏర్పరచి, కూర్చునే ఏర్పాట్లు, చిహ్నాలను అందించే ఏర్పాట్లనుగూర్చి వారు అర్థంచేసుకొనేలా చూస్తారు. మీరు ఒకవేళ ఈ ఆచరణలో సహాయపడే అటెండెంటుగానో లేక చిహ్నములను అందించే వ్యక్తిగానో నియమించబడితే ఈ విషయాలలో జాగ్రత్తగా పెద్దల సూచనలను గైకొనుము. ఏడవ పేజిలోని బాక్స్‌లో ఇవ్వబడిన జ్ఞాపికలను పరిశీలించుటద్వారా అటెండెంట్లు, చిహ్నములనందించేవారు, చిహ్నములు, ప్రసంగీకుడు మొదలగు ఏర్పాట్లవిషయాలలో ముందే తగు శ్రద్ధ తీసుకొనేలా చూడవలెను.
7 నేడు క్రీస్తు సహోదరులు బహుకొద్దిమంది మాత్రమే భూమిపై ఉన్నారు. ప్రభువురాత్రి భోజన ఆచరణను జరుపుకొనుట ముగిసిపోయే సమయము ఎంతో దూరంలో లేదు. (1 కొరిం. 11:25, 26) దానిని ఆచరించగలిగే ఆధిక్యత మనకున్నంతవరకు, నిత్యజీవ నిరీక్షణనిచ్చే ఈ మరణమును యుక్తముగా ఆచరిద్దాము.