గొప్పనిధిని కనుగొనుటకు ఇతరులకు సహాయం చేయుట
1 మనం ఇతరులకు రాజ్యసువార్తను ప్రకటించునప్పుడు, దేవుని వాక్యపు మిన్నయైన విలువను గుణగ్రహించటానికి యథార్థవంతులకు సహాయం చేయడం మన ఉద్దేశాలలో ఒకటైయుండాలి. (ఫిలిప్పీ. 3:8) రాజ్య సమాచారాన్ని వ్యాప్తిచేయడంలో మన బైబిలు ఆధారిత ప్రచురణలు ప్రముఖమైన పాత్రవహిస్తున్నాయి. ఉదాహరణకు, నిరంతరము జీవించగలరు అనే పుస్తకం నుండి తాము నేర్చుకొన్న బైబిలు సత్యాల ఫలితంగా లక్షలాదిమంది ప్రజలు యెహోవాను సేవించుటకు తీర్మానించుకున్నారు.
2 మన పరిచర్యలో, తీసుకోవాలని ఇష్టపడేవారికి కేవలం సాహిత్యాన్ని ఇవ్వడం కంటే ఇంకా ఎంతో యిమిడివుంది. మనం సమాచారాన్ని ఆకట్టుకొనే విధంగా పరిచయం చేసి, గృహస్థుడు చెప్పేదాన్ని వివేకంతో విని, తరువాత ‘అతనితో లేఖనాల నుండి తర్కించటానికి’ సిద్ధంగా వుండాలి.—అపొ. 17:2.
3 ఇదెలా చేయవచ్చు? గృహస్థులకు బైబిలునందు, దాని సమాచారమందు నిజంగా ఆసక్తి వుందో లేదో చూపించటానికి మన ఉపోద్ఘాతాలు మార్గాన్ని తెరువగలవు.
మీరిలా అనవచ్చు:
◼ “ఈనాడు ప్రపంచంలో మనచుట్టూ జరుగుతున్న దాని భావాన్ని గూర్చి చర్చించటానికి మేము వస్తున్నాము. చాలామందిలో దేవునియందు, జీవించుటకు బైబిలులో ఆయన ఇచ్చిన ప్రమాణాల యందు ఆసక్తి సన్నగిల్లి పోతున్నది. ఒకరి యెడల ఒకరు కలిగివుండే దృక్పథాన్ని ఇది బాగా ప్రభావితం చేస్తున్నది. దీనిని మీరు గమనించారా? [వారిని మాట్లాడనివ్వండి. కొన్ని ప్రత్యేక సంఘటనలను గూర్చి మీరు చెప్పవచ్చు.] రెండవ తిమోతి 3:1-5 నందు చెప్పబడినవారి దృక్పథాన్ని దయచేసి మీరు గమనించి, నేడున్న లోకాన్ని ఇది ప్రతిబింబిస్తుందని మీరు తలస్తున్నారో లేదో చెప్పండి. [చదవండి; వారిని చెప్పనివ్వండి] భవిష్యత్తులో మంచి పరిస్థితుల కొరకు ఎదురుచూడటానికి తగిన కారణం వుందా?” ఆసక్తి కనపరిస్తే, నిరంతరము జీవించగలరు పుస్తకాన్నుండి 12, 13 పేజీలలోని చిత్రాన్ని చూపించి, 12 ,13 పేరాలవైపు వారి దృష్టిని మళ్లించండి. ఆసక్తి మితంగా వుంటే, పీస్పుల్ న్యూ వరల్డ్ కరపత్రాన్ని అందజేయవచ్చు.
4 ఒక తల్లి లేక తండ్రి గుమ్మము వద్దకొస్తే, మనం మన సంభాషణను ఇలా ప్రారంభించవచ్చు:
◼ “కుటుంబ జీవిత సమస్యలను మనమెలా ఎదుర్కొనవచ్చు అనేదానిపై ఆసక్తి కలిగివున్న వారితో మేము మాట్లాడుతున్నాము. మనమందరము మనం చేయగలిగినదంతా చేయటానికి ప్రయత్నిస్తాము, అయితే ఇంకా ఎక్కువ సఫలత పొందుటకు సహాయపడే దేదైనా వుంటే, మనం ఆసక్తి చూపుతాము, అవునంటారా? [జవాబు చెప్పనివ్వండి.] కొలొస్సయులు 3:12-14 నందు వున్నట్లుగా ఈ విషయంలో బైబిలు మనకు నడిపింపు నిస్తున్నది. కాబట్టి, విజయవంతమైన కుటుంబ జీవితాన్ని అనుభవించుటకు ఏది అవసరము? ఈ ప్రచురణలోని ‘కుటుంబ జీవితమును విజయవంతము చేసికొనుట’ అనే అధ్యాయంలో ఏం చెప్పబడిందో చూడండి.” నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలోని 238వ పేజీ నందలి 3వ పేరా చదవండి. ఒకవేళ గృహస్థుడు పనితొందరలో వుంటే లేక వెంటనే ప్రతిస్పందించకపోతే, కుటుంబ విషయాలను గూర్చి చర్చించే ఇటీవలి పత్రికనుగాని లేక ఎంజాయ్ ఫ్యామిలీ లైఫ్ అనే కరపత్రాన్ని అందించటానికి ప్రయత్నించండి.
5 రాజ్యాన్ని గూర్చి సంపూర్ణంగా సాక్ష్యం ఇవ్వాలన్న మన సంకల్పాన్ని మనమెన్నడు మరచిపోకూడదు. (మత్తయి 24:14) బైబిలును, మనకు అందుబాటులోవున్న దైవపరిపాలనా సాహిత్యపు అద్భుతమైన ఏర్పాట్లను బాగా ఉపయోగించుకొనుట ద్వారా, ఈ ప్రాముఖ్యమైన కాలాల్లో యెహోవా చిత్తాన్ని నెరవేర్చుటలో ఆయనిచ్చే దీవెనలను పొందుటకు మనం ఆయన వైపు నమ్మకంతో చూడవచ్చును.—గలతీ. 6:9.