ధైర్యంగా మాట్లాడండి
1 ఇటీవలి సంవత్సరాల్లో ప్రజల్ని వారి గృహాల్లో కలిసి మాట్లాడడం మరీ కష్టమౌతున్నదని కొన్ని ప్రాంతాల్లోని ప్రచారకులు భావిస్తున్నారు. ఇంటింటి పని చేస్తున్నప్పుడు తమ ప్రాంతంలో 50 శాతం కన్నా ఎక్కువ మంది ప్రజలు ఇంటివద్ద లేనట్లు చాలా మంది నివేదించారు. తత్ఫలితంగా, గడిపిన సమయంలో అత్యధికం ప్రతిఫలం లేకుండా పోతోంది.
2 చాలా సంవత్సరాల క్రిందట, విశ్రాంతి తీసుకొనే రోజుగా సాధారణంగా దృష్టించబడ్డ ఆదివారంనాడు అనేక మంది ప్రజలు గృహాల వద్ద ఉండేవారు. అలవాట్లు మారిపోయాయి. ఉద్యోగ స్థలాల్లో పని చేయడం, షాపింగ్ వంటి కుటుంబ అవసరతలను గురించి శ్రద్ధ తీసుకోవడం, లేదా వినోదంలో మునిగిపోవడం వంటివి నేడు సర్వ సాధారణమయ్యాయి, ఇవన్నీ కూడా వారిని ఇంటి నుండి దూరంగా తీసుకు వెళతాయి. కాబట్టి ఆదివారాల్లో కూడా ఇంటింటి పనిలో ప్రజల్ని కలవడం ఓ సమస్యగా తయారైంది.
3 ప్రజలు గృహాలవద్ద లేరంటే, వారు మరెక్కడో ఉన్నారని స్పష్టమౌతుంది. మన లక్ష్యం ప్రజలతో మాట్లాడడమే గనుక వీధుల్లోనూ సంతవీధుల్లోనూ లేక పనిచేసే స్థలాల్లోనూ వారిని కలిసి ఎందుకు మాట్లాడకూడదు. “కలిసికొను వారి”ని సమీపించి వారికి సాక్ష్యమివ్వడం పౌలు వాడుకయై ఉండేది. (అపొ. 17:17) అప్పుడు అది ఫలదాయకమైన రీతిలో సాక్ష్యమిచ్చే విధానం అని నిరూపించబడింది, మన కాలంలోనూ ఇది ఫలదాయమైన రీతిలో సాక్ష్యమిచ్చే విధానమే.
4 మనం ఇంటింటి పరిచర్యకు వెళ్లినప్పుడు, ప్రజలు యథాలాపంగా నడిచి వెళ్తుండడాన్ని లేక బహుశా ఎవరి కోసమో వేచి ఉండడాన్ని మనం సాధారణంగా చూస్తాం. ఓ మంచి రోజున, వారు పార్కులో బెంచీపై కూర్చొని ఉండవచ్చు లేదా తమ వాహనాన్ని బాగుచేసుకోవడమో, శుభ్రపర్చుకోవడమో చేస్తుండవచ్చు. సంభాషణ ప్రారంభించడానికి మనకు కావాల్సినదల్లా ఓ సామరస్య పూర్వకమైన చిరునవ్వు, స్నేహపూర్వకమైన అభివాదమే కావొచ్చు. వారు సమీపంలోనే నివసిస్తుంటే, వారి ఇంట్లో వారిని కలుసుకోలేక పోయామని, వారితో మాట్లాడే ఈ అవకాశం మనకున్నందుకు మనం ఇప్పుడు సంతోషిస్తున్నామని కూడా తెలియజేయవచ్చు. మరి కొంత ధైర్యాన్ని చూపించడానికి చొరవ తీసుకోవడం ద్వారా, అనేక మంది ప్రతిఫలదాయకమైన ఆశీర్వాదాల్ని అనుభవించారు.
5 ధైర్యం ప్రతిఫలాల్ని తెస్తుంది: నిలుచున్న, బస్సు కొరకు వేచివున్న, తీరుబడిగా నడుస్తున్న, తమ కార్లలో కూర్చున్నటువంటి ప్రజల్ని తాను సమీపిస్తానని ఒక సహోదరుడు తెలియజేశాడు. ఉత్సాహపూరితమైన చిరునవ్వుతోను, ఆహ్లాదకరమైన స్వరంతోనూ వారిని సందర్శించాలని ఇష్టపడే పొరుగునున్న ఓ స్నేహితుని వలె ఆయన ప్రవర్తిస్తాడు. ఈ విధంగా ఆయన ఎక్కువ సాహిత్యాల్ని అందించడమే గాక అనేక బైబిలు పఠనాల్ని కూడా ప్రారంభించాడు.
6 మరొక సహోదరుడు ఆయన భార్య ఇంటింటి సేవలో ఉన్నప్పుడు, ఓ పెద్ద సంచిలో చిల్లర సామాన్లు మోసుకు వెళ్తున్న స్త్రీ వారికి తటస్థపడింది. తన కుటుంబావసరతల్ని ఆమెకు తీర్చడంలోగల ఆసక్తినిబట్టి ఆమెను మెచ్చుకోవడం ద్వారా వారు సంభాషణను ప్రారంభించారు. “అయితే మానవజాతి అవసరాల్ని ఎవరు తీర్చగలరు?” అని వారు ప్రశ్నించారు. అది ఆ స్త్రీ ఆసక్తిని రేకెత్తించింది. ఓ క్లుప్తమైన సంభాషణ, ఆమె తన ఇంటికి ఆహ్వానించడానికి నడిపించింది, అక్కడ ఓ బైబిలు పఠనం ప్రారంభమైంది.
7 కాబట్టి, ఈ సారి మీరు ఆదివారమైనా లేక వారంలోని మరో రోజునైనా ఇంటింటి సాక్ష్యమిస్తున్నప్పుడు, ప్రజలు ఇంటి వద్దలేనట్లు కనుగొంటే, మీరు వీధుల్లోనైనా మరెక్కడైనా కలుసుకొనే ప్రజలతో మాట్లాడడానికి ఎందుకు కొంత ధైర్యాన్ని తెచ్చుకోకూడదు? (1 థెస్స. 2:2) మీరు మరింత ప్రతిఫలదాయకమైన పరిచర్యను కల్గివుండొచ్చు మరియు మీరు మీ సేవలో గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు.