కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • od అధ్యా. 5 పేజీలు 30-52
  • మందను కాసే పర్యవేక్షకులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మందను కాసే పర్యవేక్షకులు
  • యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పర్యవేక్షకులకు ఉండాల్సిన అర్హతలు
  • పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు
  • ఐక్యతకు తోడ్పడే పురుషులు
  • అర్హతలు సంపాదించుకోవడానికి కృషిచేయడం
  • వ్యక్తిగత పరిస్థితులు మారవచ్చు
  • సంఘంలో బాధ్యతగల స్థానాలు
  • గుంపు పర్యవేక్షకులు
  • సంఘ సేవా కమిటీ
  • పర్యవేక్షకులకు లోబడివుండండి
  • సంస్థలో బాధ్యతగల మరికొన్ని స్థానాలు
  • ప్రాంతీయ పర్యవేక్షకుడు
  • బ్రాంచి కమిటీ
  • ప్రధాన కార్యాలయ ప్రతినిధులు
  • ప్రేమగల పర్యవేక్షణ
  • ప్రయాణ కాపరులు—సత్యమందు జతపనివారు
    యెహోవాసాక్షులు—ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు
  • ప్రయాణ పైవిచారణకర్తలు నమ్మకమైన గృహనిర్వాహకులవలె సేవ చేసే విధానం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ప్రయాణ పైవిచారణకర్తలు—మనుష్యులకు ఈవులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ప్రాంతీయ కాపరి సందర్శనమునకు మద్దతునిమ్ము
    మన రాజ్య పరిచర్య—1989
యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
od అధ్యా. 5 పేజీలు 30-52

5వ అధ్యాయం

మందను కాసే పర్యవేక్షకులు

యేసు భూమ్మీద పరిచర్య చేస్తున్నప్పుడు, తాను “మంచి కాపరి” అని నిరూపించుకున్నాడు. (యోహా. 10:11) తనను ఉత్సాహంగా అనుసరిస్తున్న ప్రజల్ని చూసి “వాళ్లమీద జాలిపడ్డాడు, ఎందుకంటే వాళ్లు కాపరిలేని గొర్రెల్లా చర్మం ఒలిచేయబడి, వదిలేయబడ్డారని ఆయన గమనించాడు.” (మత్త. 9:36, అధస్సూచి) యేసుకున్న ప్రేమపూర్వక శ్రద్ధను పేతురు, మిగతా అపొస్తలులు గమనించారు. గొర్రెలు చెదిరిపోతున్నా, ఆధ్యాత్మిక ఆకలితో అలమటిస్తున్నా మందను ఏమాత్రం పట్టించుకోని ఇశ్రాయేలు బూటకపు కాపరులకూ, యేసుకూ ఎంత తేడానో కదా! (యెహె. 34:7, 8) బోధించే విషయంలో, అలాగే తన ప్రాణం పెట్టేంతగా గొర్రెల్ని ప్రేమించే విషయంలో యేసు ఉంచిన చక్కని ఆదర్శం ద్వారా, విశ్వాసులు “[తమ] ప్రాణాల కాపరి, పర్యవేక్షకుడు” అయిన యెహోవా దగ్గరకు తిరిగిరావడానికి ఎలా సహాయం చేయాలో అపొస్తలులు నేర్చుకున్నారు.—1 పేతు. 2:25, అధస్సూచి.

2 ఒక సందర్భంలో యేసు పేతురుతో మాట్లాడుతూ గొర్రెల్ని పోషించడం, కాయడం ఎంత ప్రాముఖ్యమో నొక్కిచెప్పాడు. (యోహా. 21:15-17) ఆ మాటలు పేతురును ఖచ్చితంగా కదిలించివుంటాయి. అందుకే, ఆయన తొలి క్రైస్తవ సంఘంలోని పెద్దలకు ఈ సలహా ఇచ్చాడు: “పర్యవేక్షకులుగా సేవచేస్తూ, మీ సంరక్షణలో ఉన్న దేవుని మందను కాయండి. బలవంతంగా కాకుండా దేవుని ముందు ఇష్టపూర్వకంగా ఆ పని చేయండి; అక్రమ లాభం మీద ప్రేమతో కాకుండా, ఉత్సాహంతో కాయండి; దేవుని సొత్తుగా ఉన్నవాళ్ల మీద పెత్తనం చెలాయించకుండా, దేవుని మందకు ఆదర్శంగా ఉండండి.” (1 పేతు. 5:1-3) పేతురు ఇచ్చిన ఆ సలహా ఇప్పుడున్న సంఘాల్లోని పర్యవేక్షకులకు కూడా వర్తిస్తుంది. యేసులాగే పెద్దలు కూడా ఇష్టపూర్వకంగా, ఉత్సాహంగా సేవ చేస్తారు, మందకు ఆదర్శంగా ఉంటూ యెహోవా సేవలో ముందుండి నడిపిస్తారు.—హెబ్రీ. 13:7.

యేసులాగే పెద్దలు కూడా ఇష్టపూర్వకంగా, ఉత్సాహంగా సేవ చేస్తారు, మందకు ఆదర్శంగా ఉంటూ యెహోవా సేవలో నాయకత్వం వహిస్తారు

3 సంఘంలో పవిత్రశక్తి ద్వారా నియమించబడిన పర్యవేక్షకుల పట్ల మనం కృతజ్ఞత కలిగివుండవచ్చు. ఎందుకంటే, వాళ్లు చూపించే శ్రద్ధ వల్ల మనం ఎన్నో ప్రయోజనాలు పొందుతాం. ఉదాహరణకు, పర్యవేక్షకులు సంఘంలోని ప్రతీఒక్కరి మీద వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తారు, ప్రోత్సహిస్తారు. విశ్వాసంలో ఉన్న వాళ్లందర్నీ బలపర్చే సంఘ కూటాలకు ప్రతీవారం వాళ్లు శ్రద్ధగా నాయకత్వం వహిస్తారు. (రోమా. 12:8) అంతేకాదు హానికరమైన వాటినుండి అంటే చెడ్డవాళ్ల నుండి మందను కాపాడడానికి వాళ్లు కృషి చేయడం వల్ల మనం సురక్షితంగా ఉండగలుగుతాం. (యెష. 32:2; తీతు 1:9-11) వాళ్లు పరిచర్యను ముందుండి నడిపించడం వల్ల, మనం కూడా ప్రతీనెల క్రమంగా, చురుగ్గా మంచివార్త ప్రకటించాలనే ప్రోత్సాహాన్ని పొందుతాం. (హెబ్రీ. 13:15-17) ‘మనుషుల్లో వరాలుగా’ ఉన్న ఈ సహోదరుల ద్వారా యెహోవా సంఘాన్ని బలపరుస్తున్నాడు.—ఎఫె. 4:8, 11, 12.

పర్యవేక్షకులకు ఉండాల్సిన అర్హతలు

4 సంఘాన్ని సరిగ్గా చూసుకోవాలంటే, పర్యవేక్షకులుగా సేవచేయడానికి నియమించబడినవాళ్లు దేవుని వాక్యంలోని అర్హతల్ని చేరుకోవాలి. వాళ్లు ఆ అర్హతల్ని చేరుకున్నప్పుడు మాత్రమే, వాళ్లు పవిత్రశక్తి ద్వారా నియమించబడ్డారని చెప్పగలం. (అపొ. 20:28) క్రైస్తవ పర్యవేక్షకులుగా ఉండడం అనేది ఎంతో ముఖ్యమైన బాధ్యత కాబట్టి పర్యవేక్షకుల కోసం ఉన్నతమైన లేఖన ప్రమాణాలు ఉంటాయని ఒప్పుకోవాల్సిందే. కానీ ఆ ప్రమాణాలు, యెహోవాను నిజంగా ప్రేమిస్తూ, ఆయన సేవలో ఉపయోగపడాలని కోరుకునే క్రైస్తవ పురుషులు చేరుకోలేనంత కష్టంగా మాత్రం ఉండవు. పర్యవేక్షకులు తమ రోజువారీ జీవితంలో బైబిలు సూత్రాల్ని పాటిస్తారని అందరికీ స్పష్టంగా కనిపించాలి.

సంఘాన్ని సరిగ్గా చూసుకోవాలంటే, పర్యవేక్షకులుగా నియమించబడినవాళ్లు దేవుని వాక్యంలోని అర్హతల్ని చేరుకోవాలి

5 పర్యవేక్షకులకు ఉండాల్సిన ప్రాథమిక లేఖన అర్హతల గురించి అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి ఉత్తరంలో, అలాగే తీతుకు రాసిన ఉత్తరంలో చెప్పాడు. 1 తిమోతి 3:1-7 లో ఇలా ఉంది: “ఒక వ్యక్తి పర్యవేక్షకుడు అవ్వడానికి కృషిచేస్తుంటే, అతను మంచిపని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. కాబట్టి, పర్యవేక్షకుడు ఎలా ఉండాలంటే: అతని మీద ఏ నిందా ఉండకూడదు, అతనికి ఒకే భార్య ఉండాలి, అలవాట్ల విషయంలో మితంగా ఉండాలి, మంచి వివేచన ఉండాలి, పద్ధతిగా నడుచుకోవాలి, ఆతిథ్యం ఇచ్చేవాడై ఉండాలి, బోధించే సామర్థ్యం ఉండాలి, అతను తాగుబోతు గానీ ఇతరుల్ని కొట్టేవాడు గానీ పట్టుబట్టేవాడు గానీ అయ్యుండకూడదు, గొడవలు పెట్టుకునేవాడు గానీ డబ్బును ప్రేమించేవాడు గానీ అయ్యుండకూడదు, అతను తన ఇంటివాళ్లకు చక్కగా నాయకత్వం వహించేవాడై ఉండాలి, అతనికి చక్కని ప్రవర్తన కలిగి లోబడివుండే పిల్లలు ఉండాలి (ఎందుకంటే తన ఇంటివాళ్లకు ఎలా నాయకత్వం వహించాలో తెలియని వ్యక్తి దేవుని సంఘాన్ని ఎలా చూసుకుంటాడు?), అతను ఈ మధ్యే విశ్వాసిగా మారినవాడు అయ్యుండకూడదు, లేదంటే అతను గర్వంతో ఉప్పొంగిపోయి అపవాది పొందిన తీర్పునే పొందే అవకాశం ఉంది. అంతేకాదు, అతనికి బయటివాళ్ల దగ్గర కూడా మంచిపేరు ఉండాలి. అప్పుడే అతను నిందలపాలు కాకుండా, అపవాది ఉరిలో చిక్కుకోకుండా ఉంటాడు.”

6 పౌలు తీతుకు ఇలా రాశాడు: “నేను నీకు ఇచ్చిన నిర్దేశాల ప్రకారం, నువ్వు లోపాల్ని సరిచేయాలని, ఒక్కో నగరానికి వెళ్తూ పెద్దల్ని నియమించాలని నిన్ను క్రేతులో ఉంచి వచ్చాను. ఒక సహోదరుణ్ణి పెద్దగా నియమించాలంటే అతని మీద ఏ నిందా ఉండకూడదు, అతనికి ఒకే భార్య ఉండాలి, అతని పిల్లలు విశ్వాసులై ఉండాలి, ఆ పిల్లలకు చెడు తిరుగుళ్లు తిరుగుతారనే లేదా తిరగబడేవాళ్లనే చెడ్డపేరు ఉండకూడదు. పర్యవేక్షకుడు దేవుని సంఘాన్ని చూసుకునే వ్యక్తి కాబట్టి అతని మీద ఏ నిందా ఉండకూడదు, అతను మొండివాడు గానీ, ముక్కోపి గానీ, తాగుబోతు గానీ, కొట్టేవాడు గానీ, అక్రమ లాభాన్ని ఆశించేవాడు గానీ అయ్యుండకూడదు. బదులుగా అతను ఆతిథ్యమిచ్చేవాడు, మంచితనాన్ని ప్రేమించేవాడు, మంచి వివేచన గలవాడు, నీతిమంతుడు, విశ్వసనీయుడు, ఆత్మ నిగ్రహం గలవాడు అయ్యుండాలి; బోధించేటప్పుడు నమ్మకమైన వాక్యాన్ని గట్టిగా అంటిపెట్టుకునేవాడై ఉండాలి. అప్పుడే అతను మంచి బోధతో ఇతరుల్ని ప్రోత్సహించగలుగుతాడు, ఆ బోధను వ్యతిరేకించేవాళ్లను గద్దించగలుగుతాడు.”—తీతు 1:5-9.

7 పర్యవేక్షకులయ్యేందుకు కావాల్సిన ఆ లేఖన అర్హతల్ని చూడగానే వాటిని సంపాదించుకోవడం కష్టమని సహోదరులకు అనిపించవచ్చు. కానీ వాటిని చేరుకునే విషయంలో వెనకడుగు వేయకూడదు. వాళ్లు పర్యవేక్షకులకు ఉండాల్సిన చక్కని క్రైస్తవ లక్షణాల్ని చూపిస్తే, సంఘంలోని ఇతరులు కూడా అలాంటి లక్షణాలు చూపించేలా ప్రోత్సహించబడతారు. ‘మనుషుల్లో వరాలైన’ అలాంటి వాళ్లు, “పవిత్రుల్ని సరైన దారిలో పెట్టడానికి, పరిచర్య పని చేయడానికి, క్రీస్తు శరీరాన్ని బలపర్చడానికి” ఏర్పాటు చేయబడ్డారనీ, “మనందరం విశ్వాసం విషయంలో, దేవుని కుమారుని గురించిన సరైన జ్ఞానం విషయంలో ఒక్కటయ్యేవరకు, సంపూర్ణ పరిణతిగల క్రీస్తులా పూర్తిస్థాయిలో పరిణతి సాధించేవరకు వాళ్లు ఆ పని” చేసేందుకు ఏర్పాటు చేయబడ్డారనీ పౌలు రాశాడు.—ఎఫె. 4:8, 12, 13.

8 పర్యవేక్షకులు లేత వయసు అబ్బాయిలు గానీ కొత్తగా విశ్వాసిగా మారినవాడు అయ్యుండకూడదు. బదులుగా, క్రైస్తవ జీవితంలో అనుభవం, విస్తృత బైబిలు పరిజ్ఞానం, లేఖనాలపై లోతైన అవగాహన, సంఘంపట్ల నిజమైన ప్రేమ ఉన్నవాళ్లే పర్యవేక్షకులుగా ఉంటారు. పర్యవేక్షకులు తప్పు చేసినవాళ్లతో ధైర్యంగా మాట్లాడి, వాళ్లను సరిదిద్దుతారు. అలా చేయడం ద్వారా, స్వార్థం కోసం వాడుకోవాలనుకునే వాళ్లనుండి గొర్రెల్ని కాపాడతారు. (యెష. 32:2) పర్యవేక్షకులు ఆధ్యాత్మిక పరిణతిగల వ్యక్తులనీ, వాళ్లకు దేవుని మందపై నిజమైన శ్రద్ధ ఉందనీ సంఘంలోని వాళ్లందరూ స్పష్టంగా గుర్తిస్తారు.

9 పర్యవేక్షకులు అవ్వడానికి అర్హత సాధించేవాళ్లు జీవితంలో ఆచరణాత్మక తెలివితో నడుచుకుంటారు. పర్యవేక్షకునికి పెళ్లయి ఉంటే, ఆయన వివాహం విషయంలో క్రైస్తవ ప్రమాణాన్ని పాటిస్తాడు. అవేంటంటే: ఆయనకు ఒకే భార్య ఉండాలి, తన ఇంటివాళ్లకు చక్కగా నాయకత్వం వహించేవాడై ఉండాలి. ఒక పర్యవేక్షకుని పిల్లలు విశ్వాసులై, చక్కని ప్రవర్తన కలిగి లోబడేవాళ్లు అనే మంచిపేరు ఉండి, చెడు తిరుగుళ్లు తిరుగుతారనే లేదా తిరగబడేవాళ్లనే చెడ్డపేరు ఉండకపోతే, సంఘంలోనివాళ్లు కుటుంబ జీవితానికి అలాగే క్రైస్తవ జీవితానికి సంబంధించిన ఉపదేశాలు, సలహాలు ధైర్యంగా అడగగలుగుతారు. ఒక పర్యవేక్షకుని మీద ఏ నిందా ఉండకూడదు, బయటివాళ్ల దగ్గర కూడా మంచిపేరు ఉండాలి. సంఘానికి మచ్చ తీసుకొచ్చే విధంగా అవినీతికరమైన ప్రవర్తన విషయంలో ఆయనపై ఎలాంటి అభియోగాలు ఉండకూడదు. ఆయన ఈ మధ్యకాలంలో ఘోరమైన తప్పు చేసినందుకు గద్దింపు పొందినవాడు అయ్యుండకూడదు. సంఘంలోనివాళ్లు పర్యవేక్షకుల చక్కని ఆదర్శాన్ని అనుసరించాలని కోరుకుంటారు, తమ జీవితంలోని ఆధ్యాత్మిక విషయాల్ని చూసుకునే పూర్తి బాధ్యతను వాళ్లకు అప్పగిస్తారు.—1 కొరిం. 11:1; 16:15, 16.

10 అలాంటి అర్హతలు ఉన్న క్రైస్తవ పురుషులు, ఇశ్రాయేలు కాలంలో “తెలివి, బుద్ధి, అనుభవం ఉన్న” పురుషులుగా వర్ణించబడిన పెద్దలు చేసినలాంటి సేవనే చేస్తున్నారు. (ద్వితీ. 1:13) క్రైస్తవ పెద్దలు పరిపూర్ణులు కాదు. అయినప్పటికీ, వాళ్లు చాలాకాలంగా దైవిక సూత్రాల ప్రకారం జీవిస్తూ నిజాయితీగా, దైవభక్తితో నడుచుకుంటున్నారని ఇటు సంఘంలో, అటు సమాజంలో వాళ్లకు మంచిపేరు ఉంటుంది. తమపై ఎలాంటి నిందలు లేనందువల్ల వాళ్లు సంఘంలో ధైర్యంగా మాట్లాడగలుగుతారు.—రోమా. 3:23.

11 పర్యవేక్షకులు అవ్వడానికి అర్హతలు సంపాదించుకుంటున్న వాళ్లు, తమ అలవాట్ల విషయంలో అలాగే ఇతరులతో వ్యవహరించే విషయంలో మితంగా ఉంటారు. వాళ్లు సన్యాసుల్లా ఉండరు గానీ జీవితంలో సమతుల్యతను, ఆత్మనిగ్రహాన్ని చూపిస్తారు. తినడం, తాగడం, ఉల్లాస కార్యకలాపాలు, హాబీలు, వినోదం వంటి విషయాల్లో మితంగా ఉంటారు. వాళ్లు మద్యాన్ని మితంగా తీసుకుంటారు; పీకలదాకా తాగుతాడని లేదా తాగుబోతు అనే పేరు తెచ్చుకోరు. మద్యం మత్తులో బుద్ధి మందగించిన వ్యక్తి త్వరగా ఆత్మనిగ్రహం కోల్పోతాడు, సంఘాన్ని ఆధ్యాత్మికంగా కాసే స్థితిలో ఉండడు.

12 ఒక వ్యక్తి సంఘాన్ని పర్యవేక్షించాలంటే, ఆయన పద్ధతిగా నడుచుకునేవాడై ఉండాలి. ఆయనకున్న మంచి అలవాట్లు ఆయన కనబడేతీరులో, ఇంటిని చక్కగా పెట్టుకునే విధానంలో, రోజువారీ పనుల్లో కనిపిస్తాయి. అలాంటి వ్యక్తి పనుల్ని వాయిదా వేసుకుంటూ పోడు, ఏమేమి చేయాలో చూసి, వాటి ప్రకారం ప్రణాళిక వేసుకుంటాడు. ఆయన దైవిక సూత్రాలకు కట్టుబడి ఉంటాడు.

13 పర్యవేక్షకుడు, సహేతుకంగా ఉండాలి అంటే పట్టుబట్టేవాడై ఉండకూడదు. ఆయన పెద్దల సభలో తోటివాళ్లతో ఐక్యంగా పని చేయగలగాలి, వాళ్లతో సహకరించగలగాలి. తన గురించి తాను ఎక్కువ అంచనా వేసుకోకూడదు, అలాగే ఇతరుల నుండి మరీ ఎక్కువ ఆశించకూడదు. సహేతుకతగల వ్యక్తిగా పర్యవేక్షకుడు, తోటి పెద్దల అభిప్రాయాల కన్నా తనవే చాలా బాగున్నాయని అనుకుంటూ వాటిగురించి మొండిగా వాదించడు. ఎందుకంటే, ఆయనలో లేని కొన్ని లక్షణాలు లేదా సామర్థ్యాలు ఇతరుల్లో ఉండవచ్చు. విషయాల్ని లేఖనాల వెలుగులో ఆలోచించడం ద్వారా, యేసుక్రీస్తు ఆదర్శాన్ని పాటించడానికి కృషి చేయడం ద్వారా తాను పట్టుబట్టే వ్యక్తిని కానని చూపిస్తాడు. (ఫిలి. 2:2-8) ఆయన గొడవలు పెట్టుకునేవాడు గానీ ఇతరుల్ని కొట్టేవాడు గానీ అయ్యుండకూడదు. బదులుగా, ఆయన ఇతరుల్ని తనకన్నా గొప్పవాళ్లని ఎంచుతూ వాళ్లను గౌరవిస్తాడు. ఆయన మొండివాడు అయ్యుండకూడదు, అంటే ఎప్పుడూ తన పద్ధతిని లేదా తన అభిప్రాయాన్ని ఇతరులు అంగీకరించాలని పట్టుబట్టడు. ఆయన ముక్కోపి అయ్యుండకూడదు, ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు శాంతంగా ఉండడానికి కృషిచేస్తాడు.

14 అదేవిధంగా, పర్యవేక్షకునిగా సేవచేయడానికి కావాల్సిన అర్హతలు సంపాదించుకుంటున్న వ్యక్తికి మంచి వివేచన ఉంటుంది. అంటే తొందరపడి ఒక నిర్ణయానికి రాకుండా అన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకుంటాడు. యెహోవా సూత్రాలు ఏమిటి, వాటిని ఎలా పాటించాలి అనేవాటిపై ఆయనకు మంచి అవగాహన ఉంటుంది. మంచి వివేచన ఉన్న వ్యక్తి, తనకు ఎవరైనా సలహాగానీ నిర్దేశంగానీ ఇచ్చినప్పుడు వాటిని స్వీకరిస్తాడు. ఆయన పైకి ఒకలా, లోపల ఒకలా ఉండడు.

15 పర్యవేక్షకుడు మంచితనాన్ని ప్రేమించేవాడై ఉండాలని పౌలు తీతుకు గుర్తుచేశాడు. అంతేకాదు ఆ వ్యక్తి నీతిమంతుడు, విశ్వసనీయుడు అయ్యుండాలి. ఆయన ఇతరులతో ప్రవర్తించేటప్పుడు, సరైనదాని వైపు, మంచి వైపు స్థిరంగా నిలబడినప్పుడు ఆ లక్షణాలు కనిపిస్తాయి. యెహోవాపట్ల నిశ్చలమైన భక్తి చూపిస్తాడు, అన్ని సందర్భాల్లో నీతి సూత్రాలకు కట్టుబడి ఉంటాడు. ఆయన విషయాల్ని రహస్యంగా ఉంచగలడు. అంతేకాదు, ఆయన మనస్ఫూర్తిగా ఆతిథ్యమిచ్చేవాడై ఉంటాడు. ఇతరుల కోసం నిస్వార్థంగా తన సమయాన్ని, శక్తిని వెచ్చిస్తాడు, తనకున్నవాటిని సంతోషంగా ఇస్తాడు.—అపొ. 20:33-35.

16 పర్యవేక్షకుడు సమర్థవంతంగా సేవ చేయాలంటే, ఆయనకు బోధించే సామర్థ్యం ఉండాలి. పౌలు తీతుకు రాసిన మాటల ప్రకారం, పర్యవేక్షకుడు “బోధించేటప్పుడు నమ్మకమైన వాక్యాన్ని గట్టిగా అంటిపెట్టుకునేవాడై ఉండాలి. అప్పుడే అతను మంచి బోధతో ఇతరుల్ని ప్రోత్సహించగలుగుతాడు, ఆ బోధను వ్యతిరేకించేవాళ్లను గద్దించగలుగుతాడు.” (తీతు 1:9) ఒక పర్యవేక్షకుడు తర్కించగలడు, రుజువులు చూపించగలడు, అభ్యంతరాలను అధిగమించగలడు, ఇతరుల్ని ఒప్పించేలా, వాళ్ల విశ్వాసం బలపడేలా లేఖనాల్ని అన్వయించగలడు. ఆయన పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే కాదుగానీ కష్టంగా ఉన్నప్పుడు కూడా అలాంటి బోధనా సామర్థ్యాన్ని ఉపయోగిస్తాడు. (2 తిమో. 4:2) తప్పు చేసిన వ్యక్తిని సౌమ్యంగా గద్దించడానికీ లేదా సందేహాలున్న వ్యక్తిని ఒప్పించి, విశ్వాసంతో మంచి పనులు చేసేలా పురికొల్పడానికీ అవసరమైన ఓపిక ఆయనకు ఉంటుంది. ప్రేక్షకులకు లేదా ఒకవ్యక్తికి బోధించగలగడం ద్వారా ఒక పర్యవేక్షకునికి ఉండాల్సిన ఈ ముఖ్యమైన అర్హతను ఆయన చేరుకున్నాడని రుజువు చేస్తాడు.

17 పెద్దలు పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొనడం ప్రాముఖ్యం. ఈ విషయంలో కూడా వాళ్లు యేసు ఆదర్శాన్ని పాటిస్తున్నారని అందరికీ స్పష్టంగా కనిపించాలి. యేసు మంచివార్త ప్రకటించడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. అంతేకాదు, తన శిష్యులమీద శ్రద్ధ చూపిస్తూ, వాళ్లు మంచి సువార్తికులయ్యేలా సహాయం చేశాడు. (మార్కు 1:38; లూకా 8:1) పెద్దలు ఎన్నో పనులతో బిజీగా ఉన్నప్పటికీ పరిచర్యలో పాల్గొనడానికి సమయం వెచ్చిస్తే, సంఘంలో వాళ్లందరూ కూడా అలాంటి ఉత్సాహాన్నే చూపించాలని కోరుకుంటారు. పెద్దలు తమ కుటుంబ సభ్యులతో, సంఘంలోని ఇతరులతో కలిసి పరిచర్య చేసినప్పుడు, “ఒకరి విశ్వాసం వల్ల ఒకరు ప్రోత్సాహం” పొందుతారు.—రోమా. 1:11, 12.

18 ఇవన్నీ చూసినప్పుడు, ఒక పర్యవేక్షకుని నుండి మరీ ఎక్కువ ఆశి స్తున్నట్లు అనిపించవచ్చు. నిజమే, బైబిల్లోని ఉన్నత ప్రమాణాలకు పర్యవేక్షకుల్లో ఎవరూ పూర్తిగా సరితూగలేరు. కానీ, సంఘ పెద్దలుగా నియమితులైన సహోదరుల్లో ఆ లక్షణాల్లో ఏ ఒక్కటైన మరీ ఎక్కువగా, అంటే ఘోరమైన తప్పుగా పరిగణించేంతగా లోపించకూడదు. కొంతమంది పెద్దలకు కొన్ని అసాధారణమైన లక్షణాలు ఉండవచ్చు, మరికొంతమంది పెద్దలకు వేరే విషయాల్లో ఎక్కువ సామర్థ్యాలు ఉండవచ్చు. అలా దేవుని సంఘాన్ని సరిగ్గా పర్యవేక్షించడానికి అవసరమైన మంచి లక్షణాలన్నీ పెద్దల సభకు ఉంటాయి.

19 సహోదరుల్ని పర్యవేక్షకులుగా సిఫారసు చేసేటప్పుడు పెద్దల సభ, అపొస్తలుడైన పౌలు రాసిన ఈ మాటల్ని మనసులో ఉంచుకుంటుంది: “ఎవ్వరూ తన గురించి తాను ఎక్కువగా అంచనా వేసుకోవద్దు. బదులుగా ప్రతీ ఒక్కరు దేవుడు తనకు ఇచ్చిన విశ్వాసం ప్రకారం, తనకు మంచి వివేచన ఉందని చూపించేలా అంచనా వేసుకోవాలి.” (రోమా. 12:3) ప్రతీ పెద్ద తనను తాను తక్కువవాణ్ణని అనుకోవాలి, సహోదరుల అర్హతల్ని పరిశీలిస్తున్నప్పుడు “అతి నీతిమంతునిగా” ఉండాలని చూడకూడదు. (ప్రసం. 7:16) పర్యవేక్షకులకు ఉండాల్సిన లేఖన అర్హతల్ని మనసులో స్పష్టంగా ఉంచుకొని, ఒక సహోదరుడు వాటిని సముచితమైన మేరకు చేరుకున్నాడో లేదో పెద్దల సభ నిర్ధారించాలి. అలా చేస్తున్నప్పుడు, పెద్దలు మనుషుల అపరిపూర్ణతల్ని పరిగణనలోకి తీసుకుంటారు, పక్షపాతానికి గానీ కపటానికి గానీ చోటివ్వరు. ఆ విధంగా, వాళ్లు యెహోవా నీతి ప్రమాణాలపట్ల గౌరవాన్ని చూపిస్తారు. అంతేకాదు సంఘం కూడా ప్రయోజనం పొందుతుంది. పెద్దల సభ ప్రతీ సిఫారసును ప్రార్థనాపూర్వకంగా పరిశీలించి, పవిత్రశక్తి నిర్దేశాన్ని పాటిస్తుంది. పెద్దలు నిర్వర్తించే గంభీరమైన బాధ్యతల్లో ఇదొకటి కాబట్టి పౌలు చెప్పిన ఈ మాటల్ని వాళ్లు పాటించాలి: “తొందరపడి ఎప్పుడూ ఏ పురుషుని మీదా చేతులు ఉంచకు.”—1 తిమో. 5:21, 22.

పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు

20 లేఖన అర్హతల్ని సంపాదించుకున్న పురుషులు, పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం నడుచుకుంటూ, తమ జీవితంలో పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని చూపిస్తారు. పవిత్రశక్తి పుట్టించే తొమ్మిది లక్షణాల గురించి పౌలు ప్రస్తావించాడు. అవేంటంటే: “ప్రేమ, సంతోషం, శాంతి, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, సౌమ్యత, ఆత్మనిగ్రహం.” (గల. 5:22, 23) ఈ లక్షణాలు చూపించే పర్యవేక్షకులు సహోదరులకు సేదదీర్పును ఇస్తారు, సంఘమంతా ఐక్యంగా పవిత్ర సేవ చేసేందుకు తోడ్పడతారు. వాళ్ల ప్రవర్తన, అలాగే వాళ్ల కృషికి వచ్చిన ఫలితాలు వాళ్లు పవిత్రశక్తి చేత నియమించబడ్డారని చూపిస్తాయి.—అపొ. 20:28.

ఐక్యతకు తోడ్పడే పురుషులు

21 సంఘ ఐక్యతకు దోహదపడేందుకు పెద్దలు కలిసికట్టుగా పనిచేయడం చాలా ప్రాముఖ్యం. వాళ్ల వ్యక్తిత్వాలు వేరుగా ఉండవచ్చు. చర్చించే ప్రతీ విషయంలో వాళ్లందరికీ ఒకే అభిప్రాయం లేకపోయినా ఒకరు చెప్పేది ఒకరు గౌరవపూర్వకంగా వినడం ద్వారా పెద్దల సభలో ఉన్న ఐక్యతను కాపాడతారు. బైబిలు సూత్రాల్ని మీరనంతవరకు, పెద్దల సభలోని ప్రతీఒక్కరు తోటి పెద్దల అభిప్రాయాల్ని గౌరవించాలి, పెద్దల సభ తీసుకున్న తుది నిర్ణయానికి మద్దతివ్వాలి. ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించడం ద్వారా వాళ్లు “పరలోకం నుండి వచ్చే తెలివి” ప్రకారం నడుచుకుంటున్నారని చూపిస్తారు. ఆ తెలివి “శాంతికరమైనది, పట్టుబట్టే స్వభావం లేనిది.” (యాకో. 3:17, 18) పెద్దల్లో ఏ ఒక్కరూ మిగతా పెద్దల కన్నా గొప్పవాళ్లమని అనుకోకూడదు, వాళ్లమీద పెత్తనం చేయడానికి ప్రయత్నించకూడదు. సంఘ ప్రయోజనం కోసం పెద్దలందరూ చక్కగా సహకరించుకున్నప్పుడు, వాళ్లు నిజానికి యెహోవాకు సహకరించినవాళ్లౌతారు.—1 కొరిం., 12వ అధ్యా; కొలొ. 2:19.

అర్హతలు సంపాదించుకోవడానికి కృషిచేయడం

22 పరిణతిగల క్రైస్తవ పురుషులకు, పర్యవేక్షకులు అవ్వాలనే కోరిక ఉండాలి. (1 తిమో. 3:1) అయితే, సంఘ పెద్దగా సేవ చేయాలంటే కష్టపడే గుణం, స్వయంత్యాగ స్ఫూర్తి అవసరం. అంటే సహోదరుల అవసరాలకు తగ్గట్టు సహాయం చేయడానికి, వాళ్ల ఆధ్యాత్మిక బాగోగులు చూసుకోవడానికి తమను తాము అందుబాటులో ఉంచుకోవాలి. పర్యవేక్షకుడు అవ్వడానికి కృషి చేయడమంటే లేఖనాల్లో ఉన్న అర్హతల్ని సంపాదించుకోవడమని అర్థం.

వ్యక్తిగత పరిస్థితులు మారవచ్చు

23 చాలాకాలం పాటు నమ్మకంగా సేవచేసిన ఒక సహోదరుడు అనారోగ్యానికి గురవ్వవచ్చు లేదా వేరే కారణంవల్ల బలహీనపడవచ్చు. బహుశా వయసు పైబడడంవల్ల ఆయన పర్యవేక్షకునిగా తన బాధ్యతల్ని సరిగ్గా చేస్తుండకపోవచ్చు. అయినా సరే, ఆయన ఆ బాధ్యతలో ఉన్నంతకాలం ఆయన్ని ఓ పెద్దగా పరిగణిస్తూ, గౌరవించాలి. ఆయన తనకున్న పరిమితుల్ని బట్టి రాజీనామా చేయాల్సిన అవసరంలేదు. మందను కాయడానికి తమ సామర్థ్యాల్ని పూర్తిగా ఉపయోగిస్తూ, కష్టపడి పనిచేస్తున్న ఇతర పెద్దల్లాగే, ఆయన కూడా రెట్టింపు గౌరవానికి అర్హుడు.

24 ఒకవేళ, తన పరిస్థితులు మారడంవల్ల ఇంతకుముందులా సేవ చేయలేకపోతున్న ఓ పెద్ద, రాజీనామా చేయడం తనకు మంచిదని అనుకుంటే, ఆయన అలా చేయవచ్చు. (1 పేతు. 5:2) అయినప్పటికీ ఆయన్ని గౌరవించాలి. పెద్దలకు ఉండే నియామకాలు, బాధ్యతలు ఆయనకు లేకపోయినా సంఘానికి ఆయన ఎంతో సహాయంగా ఉండగలడు.

సంఘంలో బాధ్యతగల స్థానాలు

25 పెద్దలకు సంఘంలో వేర్వేరు బాధ్యతలు ఉంటాయి. సంఘంలో పెద్దల సభ సమన్వయకర్త, కార్యదర్శి, సేవా పర్యవేక్షకుడు, కావలికోట అధ్యయన నిర్వాహకుడు, క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ పర్యవేక్షకుడు ఉంటారు. చాలామంది పెద్దలు, గుంపు పర్యవేక్షకులుగా సేవచేస్తారు. ఆ స్థానాల్లో పెద్దలు ఎప్పటికీ సేవచేస్తారు. అయితే, ఒక పెద్ద వేరే ప్రాంతానికి వెళ్లిపోయినా, ఆరోగ్య కారణాలవల్ల తన బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నా, లేఖన అర్హతలు కోల్పోయి అనర్హుడైనా, ఆ బాధ్యత వేరే పెద్దకు అప్పగించబడుతుంది. పెద్దలు తక్కువమంది ఉన్న సంఘాల్లో, ఇతర సహోదరులు పెద్దలుగా సేవచేయడానికి అర్హులయ్యేవరకు, ఒక పెద్ద ఒకటికన్నా ఎక్కువ బాధ్యతలు నిర్వర్తించాల్సిరావచ్చు.

26 పెద్దల సభ సమన్వయకర్త పెద్దల సభ కూటాలకు ఛైర్మన్‌గా ఉంటాడు. అయినప్పటికీ, దేవుని మందను చూసుకునే విషయంలో ఆయన మిగతా పెద్దలతో కలిసి వినయంగా పనిచేస్తాడు. (రోమా. 12:10; 1 పేతు. 5:2, 3) పనుల్ని చక్కగా వ్యవస్థీకరించే నైపుణ్యం, శ్రద్ధగా పర్యవేక్షించే సామర్థ్యం ఆయనకు ఉండాలి.—రోమా. 12:8.

27 కార్యదర్శి సంఘ రికార్డులను చూసుకుంటాడు, ముఖ్యమైన ఉత్తరప్రత్యుత్తరాల గురించి పెద్దలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాడు. అవసరమైతే, ఇంకో పెద్దనుగానీ సమర్థుడైన సంఘ పరిచారకుణ్ణిగానీ ఆయనకు సహాయకునిగా నియమించవచ్చు.

28 సేవా పర్యవేక్షకుడు క్షేత్రసేవా ఏర్పాట్లను, పరిచర్యకు సంబంధించిన మిగతా విషయాల్ని చూసుకుంటాడు. ఆయన అన్ని క్షేత్రసేవా గుంపుల్ని క్రమంగా సందర్శించడానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఆయన, నెలలో ఒక వారాంతం ఒక గుంపును సందర్శిస్తాడు. క్షేత్రసేవా గుంపులు తక్కువ ఉన్న సంఘాల్లో, ఆయన ఒక్కో గుంపును సంవత్సరానికి రెండుసార్లు సందర్శించవచ్చు. అలా సందర్శించినప్పుడు, ఆయన క్షేత్రసేవా కూటాలు నిర్వహిస్తాడు; గుంపుతో కలిసి పరిచర్య చేస్తాడు; ప్రచారకులతో కలిసి పునర్దర్శనాలకు, బైబిలు అధ్యయనాలకు వెళ్తాడు.

గుంపు పర్యవేక్షకులు

29 సంఘంలో మరో గొప్ప సేవావకాశం ఏంటంటే గుంపు పర్యవేక్షకునిగా సేవ చేయడం. ఆయన బాధ్యతలు ఏమిటంటే: (1) క్షేత్రసేవా గుంపులోని ప్రతీఒక్కరి ఆధ్యాత్మిక సంక్షేమాన్ని కనిపెట్టుకొని ఉండడం; (2) పరిచర్యలో క్రమంగా, ఉత్సాహంగా, సంతోషంగా పాల్గొనేలా గుంపులోని ప్రతీఒక్కరికి సహాయం చేయడం; (3) సంఘ బాధ్యతలు చేపట్టడానికి అర్హులయ్యేలా గుంపులోని సంఘ పరిచారకులకు సహాయం చేయడం, శిక్షణ ఇవ్వడం. ఈ బాధ్యతలన్నిటినీ నిర్వర్తించడానికి ఎవరు ఎక్కువ అర్హులో పెద్దల సభ నిర్ణయిస్తుంది.

30 గుంపు పర్యవేక్షకునికి ఉన్న బాధ్యతల్ని బట్టి చూస్తే, వీలైనంతవరకు ఆ స్థానంలో సంఘ పెద్దలు ఉండాలి. లేకపోతే, ఒక పెద్ద ఆ బాధ్యతను చేపట్టేంతవరకు, సమర్థుడైన ఓ సంఘ పరిచారకుడు ఆ స్థానంలో సేవచేయవచ్చు. అలా సేవచేసే సంఘ పరిచారకుణ్ణి, గుంపు సేవకుడు అంటాం. ఎందుకంటే, ఆయన సంఘ పర్యవేక్షకునిగా పని చేయడు. బదులుగా, తన బాధ్యతను నిర్వర్తించడానికి ఆయన పెద్దల నిర్దేశం కింద పనిచేస్తాడు.

31 గుంపు పర్యవేక్షకుడు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని, క్షేత్ర పరిచర్యలో నాయకత్వం వహించడం. ఆయన పరిచర్యలో క్రమంగా, ఆసక్తిగా, ఉత్సాహంగా పాల్గొన్నప్పుడు గుంపులోని వాళ్లు ప్రోత్సాహం పొందుతారు. కలిసి పరిచర్య చేయడంవల్ల పొందే ప్రోత్సాహాన్ని, సహాయాన్ని ప్రచారకులు ఇష్టపడతారు. కాబట్టి, ఎక్కువమంది ప్రచారకులకు అనుకూలంగా ఉండే సమయంలో పరిచర్యను ఏర్పాటు చేయడం మంచిది. (లూకా 10:1-16) తన గుంపులోని ప్రచారకులు పరిచర్య చేయడానికి సరిపడా ప్రాంతం ఎప్పుడూ ఉండేలా గుంపు పర్యవేక్షకుడు చూసుకోవాలి. సాధారణంగా ఆయనే క్షేత్రసేవా కూటం నిర్వహిస్తాడు, ఆ రోజు పరిచర్యకు ప్రచారకుల్ని నియమిస్తాడు. ఆయన అందుబాటులో లేనప్పుడు, మరో పెద్దనుగానీ సంఘ పరిచారకుణ్ణిగానీ ఏర్పాటు చేయాలి. వాళ్లెవరూ లేకపోతే, అర్హుడైన ఓ ప్రచారకుణ్ణి ఏర్పాటు చేయవచ్చు. అలా ప్రచారకులకు కావాల్సిన నిర్దేశాలివ్వడానికి ఎవరోఒకరు ఉంటారు.

32 సేవా పర్యవేక్షకుని సందర్శనం కోసం గుంపు పర్యవేక్షకుడు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. ఆయన దానిగురించి గుంపులోని వాళ్లకు చెప్పి, దానివల్ల వచ్చే ప్రయోజనాల గురించి వాళ్లలో ఆసక్తిని పెంచాలి. ఈ ఏర్పాటు గురించి గుంపులోని ప్రచారకులకు తెలియజేస్తే, వాళ్లు దానికి ఉత్సాహంగా మద్దతు ఇవ్వగలుగుతారు.

33 క్షేత్రసేవా గుంపులను ఉద్దేశపూర్వకంగానే చిన్నవిగా ఉంచుతారు. దానివల్ల, గుంపు పర్యవేక్షకుడు గుంపులోని వాళ్లందరి గురించి బాగా తెలుసుకోగలుగుతాడు. ప్రేమగల కాపరిగా ఆయన ప్రతీఒక్కరి మీద ఎంతో శ్రద్ధ చూపిస్తాడు. పరిచర్యకు, కూటాలకు హాజరయ్యే విషయంలో వాళ్లకు వ్యక్తిగతంగా సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తాడు. అంతేకాదు, ఆధ్యాత్మికంగా బలంగా ఉండేలా ప్రతీఒక్కరికి కావాల్సిన సహాయాన్ని అందించడానికి కృషిచేస్తాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లను, కృంగిపోయిన వాళ్లను ఆయన వెళ్లి కలిసినప్పుడు వాళ్లు ఎంతో ప్రయోజనం పొందుతారు. ప్రచారకుల్ని ఆయన ప్రోత్సహించినప్పుడు లేదా వాళ్లకు సలహా ఇచ్చినప్పుడు, వాళ్లు సంఘంలో మరిన్ని బాధ్యతలు చేపట్టడానికి కృషిచేసేలా ప్రోత్సాహం పొందవచ్చు. అలా వాళ్లు సంఘంలోని సహోదరులకు మరింత సహాయకరంగా ఉంటారు. గుంపు పర్యవేక్షకుడు ముందు తన గుంపులోని వాళ్లకు సహాయం చేయడానికే కృషిచేస్తాడు. అయితే ఆయన ఓ సంఘ పెద్దగా, కాపరిగా సంఘంలోని వాళ్లందరి పట్ల ప్రేమపూర్వక శ్రద్ధ చూపిస్తాడు, అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు.—అపొ. 20:17, 28.

34 తన గుంపులోనివాళ్ల క్షేత్రసేవా రిపోర్టులను సేకరించాల్సిన బాధ్యత కూడా గుంపు పర్యవేక్షకునిదే. ఆ రిపోర్టులను ఆయన సంఘ కార్యదర్శికి ఇస్తాడు. ప్రచారకులు, సమయానికి తమ క్షేత్రసేవా రిపోర్టులను ఇవ్వడం ద్వారా గుంపు పర్యవేక్షకునికి మద్దతివ్వవచ్చు. వాళ్లు ప్రతీనెల చివర్లో తమ రిపోర్టులను నేరుగా గుంపు పర్యవేక్షకునికి ఇవ్వవచ్చు, లేదా రాజ్యమందిరంలో వాటికోసం పెట్టిన బాక్సులో వేయవచ్చు.

సంఘ సేవా కమిటీ

35 సంఘ సేవా కమిటీలో పెద్దల సభ సమన్వయకర్త, కార్యదర్శి, సేవా పర్యవేక్షకుడు ఉంటారు. ఆ కమిటీ కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఉదాహరణకు పెళ్లిళ్లకు, అంత్యక్రియలకు రాజ్యమందిరాన్ని సేవా కమిటీ ఆమోదిస్తుంది. ఏ ప్రచారకుల్ని ఏ క్షేత్రసేవా గుంపుల్లో నియమించాలో సేవా కమిటీయే నిర్ణయిస్తుంది. క్రమ పయినీరు, సహాయ పయినీరు దరఖాస్తులను, ఇతర సేవా దరఖాస్తులను సేవా కమిటీ ఆమోదిస్తుంది. సేవా కమిటీ పెద్దల సభ నిర్దేశం కింద పనిచేస్తుంది.

36 సేవా కమిటీలోని సహోదరులు చేయాల్సిన నిర్దిష్టమైన పనుల గురించి బ్రాంచి కార్యాలయం స్పష్టంగా తెలియజేసింది. అంతేకాదు కావలికోట అధ్యయన నిర్వాహకుడు, క్రైస్తవ జీవితం, పరిచర్య పర్యవేక్షకుడు, పెద్దల సభలోని ఇతర సహోదరులు చేయాల్సిన పనుల గురించి కూడా బ్రాంచి తెలియజేస్తుంది.

37 ప్రతీ సంఘంలోని పెద్దల సభ, సంఘ ఆధ్యాత్మిక ప్రగతి గురించి చర్చించుకోవడానికి ఎప్పటికప్పుడు కలుసుకుంటుంది. ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనమప్పుడు ఒక కూటం జరుగుతుంది. అంతేకాకుండా, ప్రాంతీయ పర్యవేక్షకుని ప్రతీ సందర్శనం అయిపోయిన తర్వాత, దాదాపు మూడు నెలలకు మరో కూటాన్ని పెద్దలు జరుపుకుంటారు. పరిస్థితుల్ని బట్టి వేరే సమయాల్లో కూడా పెద్దల కూటం జరుపుకోవచ్చు.

పర్యవేక్షకులకు లోబడివుండండి

38 పర్యవేక్షకులు అపరిపూర్ణులు; అయినప్పటికీ సంఘంలోని సహోదర సహోదరీలందరూ వాళ్లకు లోబడివుండాలని ప్రోత్సహించబడుతున్నారు. ఎందుకంటే, పర్యవేక్షకుల్ని ఏర్పాటు చేసింది యెహోవాయే. పర్యవేక్షకులు చేసే పనులకు యెహోవా వాళ్లను లెక్క అడుగుతాడు. వాళ్లు యెహోవాకు, ఆయన దైవ పరిపాలనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హెబ్రీయులు 13:17 ఇలా చెప్తుంది, “మీలో నాయకత్వం వహిస్తున్నవాళ్లకు విధేయత చూపిస్తూ, వాళ్లకు లోబడివుండండి. ఎందుకంటే వాళ్లు మీ ప్రాణాలకు కాపలాగా ఉన్నారు, ఈ విషయంలో వాళ్లు దేవునికి లెక్క అప్పజెప్పాలి. మీరు అలా లోబడివుంటే వాళ్లు దుఃఖంతో కాకుండా సంతోషంతో ఆ పని చేయగలుగుతారు. ఒకవేళ వాళ్లు దుఃఖంతో ఆ పని చేయాల్సివస్తే మీకే నష్టం.” ఒక సహోదరుణ్ణి సంఘ పెద్దగా నియమించడానికి యెహోవా ఏ పవిత్రశక్తిని ఉపయోగిస్తాడో, అదే పవిత్రశక్తిని ఉపయోగించి, అది పుట్టించే లక్షణాలు చూపించని, లేఖన అర్హతలకు తగ్గట్లు జీవించని వ్యక్తిని సంఘపెద్దగా తొలగిస్తాడు.

39 సంఘంలోని పర్యవేక్షకులు చేస్తున్న కృషిని, వాళ్ల చక్కని ఆదర్శాన్ని మనం ఎంతో విలువైనదిగా ఎంచుతాం. థెస్సలొనీక సంఘంలోని సహోదరుల్ని పౌలు ఇలా ప్రోత్సహించాడు: “సహోదరులారా, ఇప్పుడు మేము మిమ్మల్ని కోరేదేమిటంటే, మీ మధ్య కష్టపడి పనిచేస్తూ, ప్రభువు సేవలో మీకు నాయకత్వం వహిస్తూ, మీకు ఉపదేశిస్తున్న వాళ్లను గౌరవించండి; వాళ్లు చేసే పనిని బట్టి, ప్రేమతో వాళ్లమీద విశేషమైన గౌరవం చూపించండి.” (1 థెస్స. 5:12, 13) చాలావరకు, సంఘ పర్యవేక్షకులు చేసే కృషి వల్లే మనం మరింత సునాయాసంగా, ఆనందంగా దేవుని సేవ చేయగలుగుతున్నాం. అంతేకాదు, సంఘంలోనివాళ్లు పర్యవేక్షకుల్ని ఎలా చూడాలో పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో తెలియజేశాడు. ఆయనిలా రాశాడు: “చక్కగా నాయకత్వం వహించే పెద్దలు, ముఖ్యంగా దేవుని వాక్యం గురించి మాట్లాడే విషయంలో, బోధించే విషయంలో కష్టపడి పనిచేసే పెద్దలు రెట్టింపు గౌరవానికి అర్హులు.”—1 తిమో. 5:17.

సంస్థలో బాధ్యతగల మరికొన్ని స్థానాలు

40 కొన్నిసార్లు, రోగి సందర్శనా గుంపులో సేవ చేసేందుకు కొంతమంది పెద్దలు నియమించబడతారు. ఇతరులు ఆసుపత్రి అనుసంధాన కమిటీల్లో సేవచేస్తారు. వాళ్లు హాస్పిటళ్లకు వెళ్లి డాక్టర్లను కలుస్తారు, యెహోవాసాక్షులకు రక్తం ఎక్కించకుండా చికిత్సను కొనసాగిస్తూ, వేర్వేరు పద్ధతుల్లో చికిత్స చేయమని డాక్టర్లను కోరతారు. ఇతర పర్యవేక్షకులు రాజ్యమందిరాలను-సమావేశ హాళ్లను నిర్మించడంలో, వాటిని సరైన స్థితిలో ఉంచడంలో సహాయం చేస్తారు. మరికొంతమంది సమావేశ కమిటీల్లో సభ్యులుగా సేవచేస్తారు. అలా వాళ్లు రాజ్య పనిని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు. ఈ సహోదరులు ఇష్టపూర్వకంగా చేస్తున్న సేవ పట్ల, వాళ్ల కృషి పట్ల సంస్థలోని వాళ్లందరూ కృతజ్ఞత కలిగివుంటారు. నిజానికి అలాంటివాళ్లను మనం చాలా “విలువైనవాళ్లుగా” చూస్తాం.—ఫిలి. 2:29.

ప్రాంతీయ పర్యవేక్షకుడు

41 పరిపాలక సభ, అర్హులైన పెద్దల్ని ప్రాంతీయ పర్యవేక్షకులుగా నియమించే ఏర్పాటును చేస్తుంది. తమ సర్క్యూట్‌లలో ఉన్న సంఘాల్ని సందర్శించేలా బ్రాంచి కార్యాలయం వాళ్లను నియమిస్తుంది. సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు వాళ్లు సంఘాల్ని సందర్శిస్తారు. అప్పుడప్పుడు, వాళ్లు మారుమూల క్షేత్రాల్లో ఉన్న పయినీర్లను కూడా సందర్శిస్తారు. ఏయే సంఘాన్ని ఎప్పుడెప్పుడు సందర్శించాలో ప్రణాళిక వేసుకొని, తమ సందర్శనం గురించి ప్రతీ సంఘానికి ఎన్నో రోజుల ముందే తెలియజేస్తారు. అలా ఆ సందర్శనం నుండి అందరూ ప్రయోజనం పొందగలుగుతారు.

42 ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనం నుండి అందరూ ఆధ్యాత్మిక సేదదీర్పు పొందేలా, పెద్దల సభ సమన్వయకర్త ఏర్పాట్లన్నీ క్రమపద్ధతిలో జరిగేలా చూస్తాడు. (రోమా. 1:11, 12) సందర్శనం గురించి, అలాగే ప్రాంతీయ పర్యవేక్షకుని, (ఒకవేళ వివాహమైతే) ఆయన భార్య అవసరాల గురించి తెలిసిన వెంటనే, పెద్దల సభ సమన్వయకర్త ఇతర సహోదరుల సహాయంతో వాళ్లకోసం వసతి, మరితర ఏర్పాట్లు చేస్తాడు. అంతేకాదు, ఆ ఏర్పాట్ల గురించి ప్రాంతీయ పర్యవేక్షకునితో సహా, సంఘంలోని వాళ్లందరికీ తెలిసేలా చూస్తాడు.

43 సందర్శనా వారంలో జరిగే కూటాల గురించి, క్షేత్రసేవా కూటాల ఏర్పాట్ల గురించి, ప్రాంతీయ పర్యవేక్షకుడు పెద్దల సభ సమన్వయకర్తను అడిగి తెలుసుకుంటాడు. ఈ కూటాల్ని ప్రాంతీయ పర్యవేక్షకుని సలహాల ఆధారంగా, బ్రాంచి కార్యాలయం నిర్దేశాల ఆధారంగా ఏర్పాటు చేస్తారు. ఆ వారంలో సంఘ కూటాలు, పయినీర్లతో కూటం, పెద్దలతో-సంఘ పరిచారకులతో కూటం, అలాగే క్షేత్రసేవా కూటాలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో అందరికీ ముందే తెలియజేయాలి.

44 మంగళవారం మధ్యాహ్నం ప్రాంతీయ పర్యవేక్షకుడు సంఘ ప్రచారకుల రికార్డులను, కూటాల హాజరు రికార్డులను, టెరిటరీ రికార్డులను, అకౌంట్స్‌ను పరిశీలిస్తాడు. దానివల్ల సంఘ అవసరాలేమిటో, రికార్డులను చూసుకునే సహోదరులకు ఎలాంటి సహాయం అవసరమో ఆయనకు తెలుస్తుంది. రికార్డులన్నీ ప్రాంతీయ పర్యవేక్షకునికి ముందే అందేలా పెద్దల సభ సమన్వయకర్త ఏర్పాట్లు చేయాలి.

45 ప్రాంతీయ పర్యవేక్షకుడు కూటాల్లోగానీ, పరిచర్యలోగానీ, కలిసి భోంచేస్తున్నప్పుడుగానీ, మరితర సమయాల్లోగానీ సంఘంలోని వాళ్లను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాదు, పెద్దలతో-సంఘ పరిచారకులతో జరిగే కూటంలో, వాళ్లకు అవసరమైన లేఖన సలహాల్ని, సూచనల్ని, ప్రోత్సాహాన్ని ఇస్తాడు. ఆ విధంగా, వాళ్లు తమ సంరక్షణలో ఉన్న మందను చక్కగా చూసుకోగలుగుతారు. (సామె. 27:23; అపొ. 20:26-32; 1 తిమో. 4:11-16) అలాగే పయినీర్ల కూటంలో, పయినీర్లను ప్రోత్సహించి పరిచర్యలో వాళ్లకు ఎదురైన సమస్యల విషయంలో వ్యక్తిగతంగా సహాయం చేస్తాడు.

46 సంఘంలో దృష్టి పెట్టాల్సిన ఇతర విషయాలు ఏమైనా ఉంటే, ప్రాంతీయ పర్యవేక్షకుడు ఆ వారంలో తనకు వీలైనంతవరకు సహాయం చేస్తాడు. సందర్శనా వారంలో అది పూర్తవ్వకపోతే, దానికి వర్తించే లేఖన నిర్దేశం గురించి పరిశోధన చేసేలా పెద్దలకు, సంబంధిత సహోదర సహోదరీలకు ఆయన సహాయం చేయవచ్చు. ఒకవేళ, ఈ విషయంలో బ్రాంచి కార్యాలయం చేయాల్సింది ఏమైనా ఉంటే ప్రాంతీయ పర్యవేక్షకుడు, పెద్దలు కలిసి పూర్తి వివరాలతో కూడిన ఓ నివేదికను బ్రాంచి కార్యాలయానికి పంపిస్తారు.

47 ప్రాంతీయ పర్యవేక్షకుడు సంఘ కూటాలకు, తాను సందర్శిస్తున్న సంఘంలో హాజరౌతాడు. ఆ సందర్శనా వారంలో జరిగే కూటాల ఏర్పాట్లు ఎప్పటికప్పుడు బ్రాంచి కార్యాలయం ఇచ్చే నిర్దేశాల్ని బట్టి మారుతుంటాయి. సంఘాన్ని ప్రోత్సహించడానికి, పురికొల్పడానికి, ఉపదేశించడానికి, బలపర్చడానికి రూపొందించిన ప్రసంగాల్ని ఆయన ఇస్తాడు. యెహోవామీద, యేసుక్రీస్తుమీద, సంస్థమీద వాళ్లకున్న ప్రేమను వృద్ధిచేయడానికి ఆయన కృషిచేస్తాడు.

48 ప్రాంతీయ పర్యవేక్షకుడు సంఘాల్ని సందర్శించడానికి ఒక కారణం, పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొనమని సంఘంలోని వాళ్లను ప్రోత్సహించి, వాళ్లకు అవసరమైన సూచనలు ఇవ్వడం. సంఘంలోని చాలామంది ఆ వారంలో పరిచర్యలో పూర్తిగా పాల్గొనేలా, వీలైతే ఆ నెలలో సహాయ పయినీరు సేవ చేసేలా తమ పనుల్ని సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రాంతీయ పర్యవేక్షకునితో లేదా ఆయన భార్యతో కలిసి సేవ చేయాలనుకునేవాళ్లు ఆ విషయాన్ని ముందుగానే తెలియజేయవచ్చు. బైబిలు అధ్యయనాలకు గానీ పునర్దర్శనాలకు గానీ వాళ్లను తీసుకెళ్లడంవల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనా వారంలో జరిగే ఈ ఏర్పాటుకు పూర్తి మద్దతివ్వడానికి మీరు చేసే కృషి మెచ్చుకోదగినది.—సామె. 27:17.

49 ప్రతీ సర్క్యూట్‌లో సంవత్సరానికి రెండు ప్రాంతీయ సమావేశాలు ఏర్పాటు చేయబడతాయి. సమావేశం క్రమబద్ధంగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రాంతీయ పర్యవేక్షకునిదే. ఆయన ఒక ప్రాంతీయ సమావేశ పర్యవేక్షకుణ్ణి, సహాయ పర్యవేక్షకుణ్ణి నియమిస్తాడు. సమావేశ ఏర్పాట్లను చూసుకునే విషయంలో వాళ్లు తనతో కలిసి సన్నిహితంగా పనిచేస్తారు. దానివల్ల, ప్రాంతీయ పర్యవేక్షకుడు సమావేశ కార్యక్రమంపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతాడు. సమావేశంలోని వేర్వేరు విభాగాల్ని చూసుకునే బాధ్యతను సమర్థులైన ఇతర సహోదరులకు ఆయన అప్పగిస్తాడు. అంతేకాదు, ప్రతీ ప్రాంతీయ సమావేశం ముగిసిన తర్వాత సర్క్యూట్‌ అకౌంట్స్‌ ఆడిట్‌ చేపిస్తాడు. సంవత్సరంలో ఒక ప్రాంతీయ సమావేశం, బ్రాంచి ప్రతినిధి ఆధ్వర్యంలో జరుగుతుంది, ఆయన సందర్శక ప్రసంగీకునిగా ఉంటాడు. ప్రాంతీయ సమావేశం జరిగే స్థలం దూరంగా ఉంటే లేదా ఆ హాళ్లు చిన్నగా ఉంటే, కొన్ని సర్క్యూట్‌లను సెక్షన్ల వారీగా విభజించి, ప్రతీ సెక్షన్‌కు ఒక ప్రాంతీయ సమావేశం జరిగే ఏర్పాటు చేయబడుతుంది.

50 ప్రతీనెల చివర్లో ప్రాంతీయ పర్యవేక్షకుడు తన క్షేత్రసేవా రిపోర్టును నేరుగా బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాడు. సంఘాల్ని సందర్శిస్తున్నప్పుడు అయిన ఖర్చులను అంటే ప్రయాణం, ఆహారం, వసతి, తన పనిని నిర్వర్తించడానికి అవసరమైన మరితర ఖర్చులను సంఘం చెల్లించకపోతే, ఆయన బ్రాంచి కార్యాలయానికి సబ్‌మిట్‌ చేయవచ్చు. యేసు వాగ్దానం చేసినట్లు, యెహోవా రాజ్యానికి మొదటి స్థానమిస్తే, తమ అవసరాలు దేవుడే తీరుస్తాడని ప్రయాణ ప్రతినిధులు నమ్ముతారు. (లూకా 12:31) అంకితభావంతో సేవ చేస్తున్న ఇలాంటి పెద్దలకు ఆతిథ్యం ఇవ్వడం గొప్ప గౌరవమనే విషయాన్ని సంఘాలు ఎప్పుడూ గుర్తుంచుకుంటాయి.—3 యోహా. 5-8.

బ్రాంచి కమిటీ

51 ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాల్లో, ఆధ్యాత్మిక అర్హతలున్న, పరిణతిగల ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువమంది సహోదరులు బ్రాంచి కమిటీగా సేవచేస్తారు. వాళ్లు తమ బ్రాంచి పరిధిలో ఉన్న దేశంలో లేదా దేశాల్లో జరిగే ప్రకటనా పనిని పర్యవేక్షిస్తారు. వాళ్లలో ఒకరు బ్రాంచి కమిటీ సమన్వయకర్తగా సేవచేస్తారు.

52 బ్రాంచి కమిటీలోని సహోదరులు, బ్రాంచి క్షేత్రంలో ఉన్న అన్ని సంఘాలకు సంబంధించిన విషయాల్ని చూసుకుంటారు. బ్రాంచి క్షేత్రంలో జరుగుతున్న ప్రకటనా పనిని బ్రాంచి కమిటీ పర్యవేక్షిస్తుంది. అలాగే, క్షేత్రానికి సంబంధించి అవసరమైన వాటిని పర్యవేక్షించడానికి సంఘాలను, సర్క్యూట్‌లను ఏర్పాటు చేస్తుంది. మిషనరీల, ప్రత్యేక పయినీర్ల, క్రమ పయినీర్ల, సహాయ పయినీర్ల సేవను కూడా బ్రాంచి కమిటీ చూసుకుంటుంది. అంతేకాదు ప్రాంతీయ సమావేశాల, ప్రాదేశిక సమావేశాల ఏర్పాట్లను, నియామకాలను బ్రాంచి కమిటీ చూసుకుంటుంది. దానివల్ల “అన్నీ మర్యాదగా, పద్ధతి ప్రకారం” జరుగుతాయి.—1 కొరిం. 14:40.

53 కొన్ని దేశాల్లో కంట్రీ కమిటీని ఏర్పాటు చేస్తారు. అది వేరే దేశంలోని బ్రాంచి కమిటీ పర్యవేక్షణ కింద పనిచేస్తుంది. దానివల్ల, ఆ దేశాల్లో జరుగుతున్న పనిని కంట్రీ కమిటీ దగ్గరుండి చూసుకోగలుగుతుంది. బెతెల్‌ గృహంలో, కార్యాలయంలో జరిగే పనుల్ని, అలాగే ఉత్తరప్రత్యుత్తరాలను, నివేదికలను, క్షేత్రంలో జరిగే పనిని కంట్రీ కమిటీ చూసుకుంటుంది. రాజ్య సంబంధ పనుల్ని వ్యాప్తిచేసే విషయంలో కంట్రీ కమిటీ బ్రాంచి కమిటీకి సహకరిస్తుంది.

54 బ్రాంచి కమిటీల్లో, కంట్రీ కమిటీల్లో సేవ చేసేవాళ్లందర్నీ పరిపాలక సభ నియమిస్తుంది.

ప్రధాన కార్యాలయ ప్రతినిధులు

55 అప్పుడప్పుడు, అర్హులైన కొంతమంది సహోదరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ బ్రాంచిని సందర్శించేలా పరిపాలక సభ ఏర్పాట్లు చేస్తుంది. అలా సందర్శించే సహోదరుణ్ణి ప్రధాన కార్యాలయ ప్రతినిధి అంటారు. ఆయన బ్రాంచిని సందర్శించినప్పుడు, బెతెల్‌ కుటుంబాన్ని ప్రోత్సహించి, ప్రకటనా పనికి అలాగే శిష్యుల్ని చేసే పనికి సంబంధించి ఎదురయ్యే సమస్యల లేదా సందేహాల విషయంలో బ్రాంచి కమిటీకి సహాయం చేయడమే ఆయన ముఖ్యమైన పని. అంతేకాదు, ఆయన కొంతమంది ప్రాంతీయ పర్యవేక్షకుల్ని, క్షేత్రంలో సేవచేస్తున్న మిషనరీల్ని అప్పుడప్పుడు కలుస్తాడు. అలా కలిసినప్పుడు, ఆయన వాళ్ల సమస్యల గురించి, అవసరాల గురించి అడిగి తెలుసుకుంటాడు, వాళ్లు చేస్తున్న అత్యంత ప్రాముఖ్యమైన పనిలో అంటే ప్రకటించి-శిష్యుల్ని చేసే పనిలో వాళ్లకు కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇస్తాడు.

56 క్షేత్రంలో జరిగిన అభివృద్ధి విషయంలో అంటే ప్రకటనా పనిలో అలాగే ఇతర సంఘ కార్యకలాపాల్లో జరిగిన అభివృద్ధి విషయంలో ప్రధాన కార్యాలయ ప్రతినిధి ఎంతో ఆసక్తి చూపిస్తాడు. సమయం ఉంటే, ఆయన రిమోట్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీస్‌లను (RTO) కూడా సందర్శించవచ్చు. ప్రధాన కార్యాలయ ప్రతినిధి ఏదైనా బ్రాంచిని సందర్శించినప్పుడు, వీలైనంత వరకు రాజ్య ప్రకటనా పనిలో కూడా పాల్గొంటాడు.

మందను కాయడానికి నియమించబడిన పర్యవేక్షకులకు మనం ఎల్లప్పుడూ లోబడివుంటే, సంఘ శిరస్సైన క్రీస్తు యేసుతో ఐక్యమౌతాం

ప్రేమగల పర్యవేక్షణ

57 పరిణతిగల క్రైస్తవ సహోదరులు చేస్తున్న కృషి వల్ల, వాళ్లు చూపించే ప్రేమపూర్వక శ్రద్ధ వల్ల మనమెంతో ప్రయోజనం పొందుతాం. మందను కాయడానికి నియమించబడిన పర్యవేక్షకులకు మనం ఐక్యంగా లోబడివుంటే, సంఘ శిరస్సైన క్రీస్తుయేసుతో ఐక్యమౌతాం. (1 కొరిం. 16:15-18; ఎఫె. 1:22, 23) అప్పుడు, దేవుని పవిత్రశక్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలపై విరివిగా పనిచేస్తుంది. అంతేకాదు, దేవుని వాక్యం మన పనుల్ని నిర్దేశిస్తుందని చూపిస్తాం.—కీర్త. 119:105.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి