కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 12/1 పేజీలు 15-20
  • ‘ఒకని నొకడు క్షమించుడి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘ఒకని నొకడు క్షమించుడి’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇతరులను ఎందుకు క్షమించాలి?
  • ‘ఒకనినొకడు సహించుడి’
  • గాయాలు లోతుగా ఉన్నప్పుడు
  • క్షమించడం అసంభవంగా అనిపిస్తున్నప్పుడు
  • ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • క్షమించి, మర్చిపోవడం—ఎలా సాధ్యం?
    తేజరిల్లు!—1995
  • ఎందుకు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • క్షమించడం అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 12/1 పేజీలు 15-20

‘ఒకని నొకడు క్షమించుడి’

“ఒకని నొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి.”—కొలొస్సయులు 3:13.

1. (ఎ) మనం ఇతరులను ‘ఏడుమారులమట్టుకు’ క్షమించాలని పేతురు సూచించినప్పుడు తాను ఔదార్యంతో ప్రవర్తిస్తున్నట్లు ఆయన ఎందుకు భావించివుండవచ్చు? (బి) మనం ‘డెబ్బది ఏడు మారులమట్టుకు’ క్షమించాలని యేసు చెప్పినప్పుడు ఆయన భావమేమిటి?

“ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా?” (మత్తయి 18:21) అలా సూచించడంలో తాను ఎంతో ఔదార్యంతో ప్రవర్తిస్తున్నట్లు పేతురు భావించి ఉండవచ్చు. ఆ కాలంలో, ఒకే అపరాధానికి మూడుకన్నా ఎక్కువసార్లు క్షమించకూడదని రబ్బీల సాంప్రదాయం చెబుతుంది.a అందుకని, “ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను” అని యేసు అన్నప్పుడు పేతురు ఉలికిపాటును మీరు ఊహించండి! (మత్తయి 18:22) ఏడును రెండుమారులు తిరిగిచెప్పడం, “నిరవధికంగా” అని చెప్పడంతో సమానం. యేసు దృష్టిలో, ఇతరులను ఎన్నిసార్లు క్షమించాలన్నదానికి అసలు పరిమితిలేదు.

2, 3. (ఎ) ఇతరులను క్షమించడం కష్టంగా అనిపించే కొన్ని సందర్భాలు ఏవి? (బి) ఇతరులను క్షమించడం మనకు ప్రయోజనకరమని మనం ఎందుకు నమ్మిక కలిగివుండవచ్చు?

2 అయితే, ఈ సలహాను అన్వయించుకోవడం అన్నివేళలా సులభం కాదు. మనలో ఎవరం అన్యాయంగా గాయపడడం మూలాన కలిగే బాధను అనుభవించలేదు? బహుశా మీరు నమ్మిన ఒక వ్యక్తి ఒక ఆంతరంగిక విషయాన్ని బయటపెట్టివుండవచ్చు. (సామెతలు 11:13) ఒక సన్నిహిత స్నేహితుడు ఆలోచనారహితంగా మాట్లాడిన మాటలు ‘కత్తిపోటుల్లా’ ఉండవచ్చు. (సామెతలు 12:18) మీరు ప్రేమించిన వ్యక్తి లేక మీరు నమ్మిన వ్యక్తి మీతో దురుసుగా ప్రవర్తించడం మీ మనస్సును లోతుగా గాయపర్చివుండవచ్చు. ఇటువంటివి జరిగినప్పుడు మనం సహజంగా కోపంగా ప్రతిస్పందిస్తాము. మనపట్ల అపరాధం చేసిన వ్యక్తితో మాట్లాడడం మానేసి, సాధ్యమైతే పూర్తిగా తప్పించుకుని తిరగడానికి మనం ప్రయత్నిస్తుండవచ్చు. ఆయన్ను క్షమించడం అంటే ఆయనను శిక్షనుండి మినహాయించడం అని అనిపిస్తుండవచ్చు. అయితే, ఉక్రోషాన్ని మనసులో ఉంచుకుంటే మనకు మనమే హానితెచ్చుకుంటాము.

3 అందుకనే యేసు—‘డెబ్బది ఏడు మారులమట్టుకు’ క్షమించమని మనకు బోధిస్తున్నాడు. నిశ్చయంగా ఆయన బోధలు మనకు ఎన్నడూ హాని చేయవు. ఆయన బోధించినవన్నీ కూడా, ‘మనకు ప్రయోజనము కలుగునట్లు మనకు ఉపదేశము చేసే’ యెహోవా నుండి వచ్చినవే. (యెషయా 48:17; యోహాను 7:16, 17) న్యాయసమ్మతముగానే, ఇతరులను క్షమించడం మనకు పూర్తి ప్రయోజనకరమే. మనం ఎందుకు క్షమించాలి, ఎలా క్షమించాలి అనేవి చర్చించడానికి ముందుగా, అసలు క్షమాపణ అంటే ఏమిటి, క్షమాపణ అంటే ఏమి కాదు అనేవి స్పష్టం చేసుకోవడం సహాయకరంగా ఉండవచ్చు. క్షమాపణ విషయంలో మన భావన, ఇతరులు మనల్ని నొప్పించినప్పుడు వారిని క్షమించే మన సామర్థ్యంపైన ప్రభావం కలిగివుండగలదు.

4. ఇతరులను క్షమించడం అంటే ఏమి అర్థం కాదు, దానికి బదులుగా క్షమాపణ ఎలా నిర్వచించబడింది?

4 ఇతరులు చేసిన వ్యక్తిగత అపరాధాలను క్షమించడం అంటే వారు చేసినదాన్ని చూసీచూడనట్లు ఊరుకోవడం అని లేక వాటి తీవ్రతను తగ్గించడం అని అర్థం కాదు; ఇతరులు మన నుండి అన్యాయంగా లాభం పొందడాన్ని అనుమతిస్తున్నట్టూ కాదు. యెహోవా కూడా మనల్ని క్షమించినప్పుడు, ఆయన నిశ్చయంగా మన పాపాల్ని అల్పమైనవిగా దృష్టించడంలేదు, అంతేగాక ఆయన పాపులైన మానవులు తన దయను దుర్వినియోగపర్చడానికి అనుమతించడు. (హెబ్రీయులు 10:29) క్షమాపణ అనేది “అపరాధిని క్షమించే ఒక క్రియ; ఒక వ్యక్తి అపరాధం చేసినందుకు ఆయనపట్ల ఉక్రోషాన్ని ప్రదర్శించడాన్ని మానివేయడం, పరిహారాన్ని ఏమాత్రం కోరకపోవడం” అని లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) క్షమాపణను నిర్వచించింది. (సంపుటి 1, పేజీ 861)b ఇతరులను క్షమించడానికి చక్కని కారణాలను బైబిలు మనకు అందిస్తుంది.

ఇతరులను ఎందుకు క్షమించాలి?

5. ఎఫెసీయులు 5:1లో ఇతరులను క్షమించడానికి ఏ ప్రాముఖ్యమైన కారణం ఇవ్వబడింది?

5 ఇతరులను క్షమించడానికిగల ఒక ప్రాముఖ్యమైన కారణం ఎఫెసీయులు 5:1లో సూచించబడింది: “కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.” మనం ఏ రీతిలో ‘దేవునిపోలి నడుచుకోవాలి?’ “కావున” అనే పదం ముందు వచనంతో కలుపుతుంది, అందులో ఇలా ఉంది: “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.” (ఇటాలిక్కులు మావి.) (ఎఫెసీయులు 4:32) అవును, క్షమాపణ విషయానికొచ్చినప్పుడు మనం దేవునిపోలి నడుచుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు అచ్చం తన తండ్రిలా ఉండడానికి ప్రయత్నించినట్లే, యెహోవా ఎంతో ప్రియంగా ప్రేమించే పిల్లలమైన మనం కూడా మనల్ని క్షమించే మన పరలోకపు తండ్రిలా ఉండాలని కోరుకోవాలి. ఒకరినొకరు క్షమించుకోవడం ద్వారా తనలా ఉండడానికి ప్రయత్నిస్తున్న, భూమ్మీదనున్న తన పిల్లల్ని పరలోకంనుండి చూస్తుండడం యెహోవాకు ఎంత హృదయానందకరంగా ఉంటుంది!—లూకా 6:35, 36; మత్తయి 5:44-48 పోల్చండి.

6. యెహోవా క్షమాపణకు మన క్షమాపణకు ఏ రీతిలో గొప్ప తారతమ్యం ఉంది?

6 నిజమే, మనం యెహోవా క్షమించినంత పరిపూర్ణంగా ఎన్నడూ క్షమించలేము. కానీ ఒకరినొకరు క్షమించడానికి ఇది మరింత గొప్ప కారణాన్ని ఇస్తుంది. ఆలోచించండి: యెహోవా క్షమాపణకు మన క్షమాపణకు గొప్ప వ్యత్యాసం ఉంది. (యెషయా 55:7-9) మనకు విరుద్ధంగా పాపం చేసిన వారిని మనం క్షమించినప్పుడు, ఇప్పుడు కాకపోతే తర్వాత ఎప్పుడైనా వారు కూడా మనల్ని క్షమించడం ద్వారా మన ఋణం తీర్చుకోవల్సివస్తుందని తెలిసే క్షమిస్తుంటాము. మానవుల విషయంలో ఎప్పుడూ పాపులు పాపుల్ని క్షమించడమే జరుగుతుంది. కానీ యెహోవా విషయంలోనైతే క్షమాపణ ఎప్పుడూ ఒక వైపు నుండే వస్తుంది. ఆయన మనల్ని క్షమిస్తాడు, కానీ మనం ఎన్నడూ ఆయన్ని క్షమించాల్సిన అవసరం రాదు. పాపం చేయని యెహోవాయే అంత ప్రేమపూర్వకంగానూ, పరిపూర్ణంగానూ మనల్ని క్షమించగల్గుతున్నప్పుడు, పాపభరిత మానవులమైన మనము ఒకరినొకరం క్షమించడానికి ప్రయత్నించకూడదా?—మత్తయి 6:12.

7. జాలి కనుపర్చడానికి ఆధారమున్నా ఒకవేళ మనం ఇతరులను క్షమించడానికి నిరాకరిస్తే, అది యెహోవాతో మన సంబంధంపై ఎలాంటి తీవ్ర ప్రభావం చూపిస్తుంది?

7 మరి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, జాలిని కనుపర్చడానికి ఆధారమున్నా మనం ఇతరులను క్షమించడానికి నిరాకరిస్తే, అది దేవునితో మన స్వంత సంబంధం మీద తీవ్ర ప్రభావం చూపగలదు. యెహోవా మనం ఒకరినొకరు క్షమించమని అడగడం మాత్రమే కాదు; మనం అలా చేయాలని ఆయన అపేక్షిస్తున్నాడు కూడా. లేఖనాల ప్రకారం చూస్తే, మనం క్షమించేవారిగా ఉండడానికి మనం పొందే ప్రేరేపణలో కొంత, యెహోవా మనల్ని క్షమించవచ్చు లేక ఆయన ఇప్పటికే మనల్ని క్షమించాడు అనే కారణంగా రావచ్చు. (మత్తయి 6:14; మార్కు 11:25; ఎఫెసీయులు 4:32; 1 యోహాను 4:11) అందుకని, ఒకవేళ సరైన కారణం ఉన్నా ఇతరులను క్షమించడానికి మనం ఇష్టపడకపోతే, మనం యెహోవా నుండి అటువంటి క్షమాపణను నిజానికి ఎలా అపేక్షించగలము?—మత్తయి 18:21-35.

8. క్షమించేవారిగా ఉండడం మనకు ఎలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది?

8 యెహోవా తన ప్రజలకు, “వారు నడువవలసిన సన్మార్గమును” ఉపదేశిస్తాడు. (1 రాజులు 8:36) ఒకరినొకరు క్షమించమని ఆయన మనకు ఉపదేశించినప్పుడు, ఆయన మన ప్రయోజనాలను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాడని మనం నిశ్చయతను కలిగివుండవచ్చు. బైబిలు “ఉగ్రతకు చోటియ్యుడి” అని మంచి కారణంతోనే చెబుతుంది. (రోమీయులు 12:19) కోపాన్ని నిలుపుకోవడం జీవితంలో చాలా భారమైనదిగా ఉండగలదు. మనం దాన్ని నిలుపుకున్నప్పుడు అది మన ఆలోచనలను దహించివేస్తుంది, మనశ్శాంతి కోల్పోయేలా చేస్తుంది, మన ఆనందాన్ని దోచేస్తుంది. క్రోధాన్ని దీర్ఘకాలం ఉంచుకుంటే అది ఈర్ష్యలాగా మన శరీర ఆరోగ్యంపై ప్రమాదకర ప్రభావాన్ని చూపిస్తుంది. (సామెతలు 14:30) మనం ఇంత క్షోభను అనుభవిస్తుండగా అపరాధం చేసిన వ్యక్తికి అసలు ఇదేమీ తెలియకపోవచ్చు! మనం ఇతరులను ధారాళంగా క్షమించేది వారి ప్రయోజనం కొరకే గాక మన స్వంత ప్రయోజనం కొరకు కూడా అని మన ప్రేమగల సృష్టికర్తకు తెలుసు. క్షమించమని బైబిలు ఇచ్చే సలహా నిజంగానే మనం ‘నడవవలసిన సన్మార్గము.’

‘ఒకనినొకడు సహించుడి’

9, 10. (ఎ) ఎటువంటి సందర్భాలకు క్షమాపణలు ఇచ్చిపుచ్చుకోవల్సిన అవసరం లేదు? (బి) ‘ఒకనినొకడు సహించుడి’ అన్న మాటలు ఏమి సూచిస్తున్నాయి?

9 శరీరానికి చిన్న చిన్న గాయాలు, కొన్నిసార్లు లోతైన గాయాలు తగలవచ్చు, అన్నింటికీ ఒకే విధమైన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉండదు. గాయపడిన భావాల విషయంలోనూ అంతే—కొన్ని గాయాలు మిగతావాటికన్నా లోతైనవి. ఇతరులతో మన సంబంధాల విషయంలో మనకు కలిగే ప్రతి చిన్న గాయానికీ రాద్దాంతం చేయాల్సిన అవసరం నిజంగా ఉందా? చిన్న చిన్న చీకాకులు, స్వల్పమైన విషయాలు, విసుగు తెప్పించే సంఘటనలు జీవితంలో ఒక భాగం. వీటన్నింటికీ క్షమాపణ ఇచ్చిపుచ్చుకోవల్సిన అవసరం లేదు. ఇతరులు చేసిన ప్రతి చిన్న తప్పిదానికి వారిని తప్పించుకు తిరుగుతూ—మనకు క్షమాపణ చెప్పిన తర్వాతే వారితో సరిగ్గా వ్యవహరిస్తామని మనం మొండిపట్టు పడితే, అప్పుడు మన సమక్షంలో వారు చాలా జాగ్రత్తగా ఉండేందుకు, లేదా మనకు తగినంత దూరంలో మసిలేందుకు వారిని బలవంతపెట్టిన వారమవుతుండవచ్చు!

10 దానికి బదులుగా, “సహేతుకమైనవారమన్న పేరు మనకు ఉండడం” చాలా శ్రేష్ఠం. (ఫిలిప్పీయులు 4:5, ఫిలిప్స్‌) అపరిపూర్ణ మానవులమైన మనం భుజభుజాలు కలిపి సేవచేస్తున్నాము గాబట్టి, మన సహోదరులు అప్పుడప్పుడు మనకు చిరాకు కలిగించవచ్చు, అదేవిధంగా మనం కూడా వారిని చిరాకు పెడుతుండవచ్చు. కొలొస్సయులు 3:13 మనకిలా సలహా ఇస్తుంది: ‘ఒకనినొకడు సహించుడి.’ ఈ మాటలు, ఇతరులతో ఓర్పుతో ప్రవర్తించాలని, వారిలో మనకు ఇష్టంలేని విషయాలను లేక మనకు చిరాకు కలిగించే వైఖరులను సహించాలని సూచిస్తున్నాయి. అటువంటి ఓర్పు, అటువంటి ఆత్మనిగ్రహం మనం ఇతరులతో వ్యవహరించేటప్పుడు సంభవించే చిన్న చిన్న అపరాధాలను—సంఘంలోని శాంతికి భంగం వాటిల్లజేయకుండా ఎదుర్కోవడానికి సహాయం చేయగలదు.—1 కొరింథీయులు 16:14.

గాయాలు లోతుగా ఉన్నప్పుడు

11. ఇతరులు మనకు విరుద్ధంగా పాపం చేసినప్పుడు వారిని క్షమించడానికి మనకు ఏమి సహాయపడగలదు?

11 అయితే, ఇతరులు మనకు విరుద్ధంగా పాపంచేసి మనకు లోతైన గాయాన్ని కలుగజేస్తే అప్పుడేమిటి? ఒకవేళ ఆ పాపం మరీ గంభీరమైనది కాకపోతే “ఒకరినొకరు క్షమించుడి” అన్న బైబిలు సలహాను అన్వయించుకోవడం అంత కష్టంగా ఉండదు. (ఎఫెసీయులు 4:32) క్షమించడానికి ఆ విధంగా సిద్ధమనస్సుతో ఉండడం పేతురు వ్రాసిన ప్రేరేపిత మాటలకు పొందికగా ఉంటుంది: “ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.” (1 పేతురు 4:8) మనం కూడా పాపులమేనన్న విషయాన్ని మనస్సులో ఉంచుకోవడం ఇతరుల అపరాధాల్ని సహించడానికి మనకు సహాయం చేస్తుంది. ఆ విధంగా మనం క్షమించినప్పుడు మనం ఉక్రోషాన్ని నిలిపి ఉంచుకోవడానికి బదులుగా దాన్ని విడనాడుతాము. తత్ఫలితంగా, అపరాధితో మనకుగల సంబంధానికి దీర్ఘకాలిక హాని కలుగకపోవచ్చు. ఆ విధంగా మనం సంఘంలోని అమూల్యమైన శాంతిని కాపాడడంలో కూడా సహాయపడతాము. (రోమీయులు 14:19) కొంతకాలానికి ఆ వ్యక్తి ఏమి చేశాడన్నది మనం మర్చిపోతుండవచ్చు.

12. (ఎ) మనల్ని లోతుగా గాయపర్చిన వారిని క్షమించడానికి మనం ఏ విధంగా చొరవ తీసుకోవచ్చు? (బి) మనం విషయాల్ని త్వరగా పరిష్కరించుకోవాలని ఎఫెసీయులు 4:26లోని మాటలు ఎలా సూచిస్తున్నాయి?

12 అయితే, ఎవరైనా మనకు విరుద్ధంగా చాలా గంభీరంగా పాపంచేసి మనకు లోతైన గాయాన్ని కలుగజేస్తే అప్పుడేమిటి? ఉదాహరణకు, ఒక నమ్మకమైన స్నేహితునికి మీరు చెప్పుకున్న పూర్తిగా ఆంతరంగికమైన విషయాలను కొన్నింటిని ఆయన బయటపెట్టి ఉండవచ్చు. మీరు చాలా లోతుగా గాయపడినట్లు, కలవరపెట్టబడినట్లు, వంచించబడినట్లు భావించవచ్చు. మీరు దాన్ని కొట్టిపడేయాలని ప్రయత్నిస్తారు, కానీ విషయం మనస్సులో నుండి పోవడం లేదు. ఈ సందర్భంలో మీరు సమస్యని పరిష్కరించడానికి కొంచెం చొరవ తీసుకోవాల్సి రావచ్చు, బహుశ అపరాధం చేసిన వ్యక్తితో మాట్లాడాల్సి రావచ్చు. సమస్య ముదరకముందే ఈ పని చేయడం జ్ఞానయుక్తమైన పని. పౌలు ఇలా వేడుకుంటున్నాడు: “కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.” (ఎఫెసీయులు 4:26) యూదులలో సూర్యాస్తమయంతో ఒక రోజు ముగిసి, మరో రోజు ప్రారంభమౌతుందన్న వాస్తవం పౌలు మాటలకు మరింత శక్తిని చేకూరుస్తుంది. అందుకని మంచి సలహా ఏమిటంటే: విషయాన్ని త్వరగా పరిష్కరించండి!—మత్తయి 5:23, 24.

13. మనపట్ల అపరాధం చేసినవ్యక్తిని సమీపిస్తున్నప్పుడు మన లక్ష్యం ఏమై ఉండాలి, దాన్ని సాధించడానికి ఏ సూచనలు మనకు సహాయం చేయగలవు?

13 అపరాధం చేసిన వ్యక్తిని మీరు ఎలా సమీపిస్తారు? “సమాధానమును వెదకి దాని వెంటాడవలెను” అని 1 పేతురు 3:11 చెబుతుంది. కాబట్టి మీ లక్ష్యం ఏమిటంటే, కోపాన్ని వ్యక్తం చేయడం కాదు గాని, మీ సహోదరునితో శాంతిని నెలకొల్పడమే. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం కఠినంగా మాట్లాడకపోవడం, ప్రవర్తించకపోవడం మంచిది; ఇలా చేస్తే అవతలి వ్యక్తి కూడా అదే విధంగా ప్రతిస్పందించవచ్చు. (సామెతలు 15:18; 29:11) అంతేగాక, “నువ్వెప్పుడూ ఇంతే . . . !” లేక, “నువ్వసలు ఎన్నడూ . . . !” వంటి తీవ్రపదజాలాన్ని ఉపయోగించకండి. అటువంటి తీవ్రమైన మాటలు ఆయన తనను తాను సమర్థించుకోవడానికి నడిపించగలవు. దానికి బదులుగా, మీ స్వరము మీ ముఖకవళికలు మిమ్మల్ని లోతుగా గాయపర్చిన విషయాన్ని పరిష్కరించాలన్న మీ కోరికను వ్యక్తం చేయనివ్వండి. జరిగిన విషయం గురించి మీరు ఎలా భావిస్తున్నారన్నది స్పష్టంగా వివరించండి. అవతలి వ్యక్తికి తన చర్యలను వివరించడానికి అవకాశమివ్వండి. ఆయన చెప్పాలనుకున్నది వినండి. (యాకోబు 1:19) దీనివల్ల ఏ మంచి జరుగుతుంది? సామెతలు 19:11 ఇలా వివరిస్తుంది: “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.” అవతలి వ్యక్తి భావాలను, ఆయన చర్యలకు కారణాలను అర్థం చేసుకోవడం ఆయనపట్ల మీకున్న ప్రతికూల తలంపులను భావాలను తీసివేయవచ్చు. శాంతిని నెలకొల్పాలన్న లక్ష్యంతో మనం పరిస్థితితో వ్యవహరించి, అదే దృక్పథంతో ముందుకు సాగినప్పుడు అపార్థాల్ని రూపుమాపి, మన్నించి, క్షమాపణలు అందించవచ్చు.

14. మనం ఇతరులను క్షమించినప్పుడు, మనం ఏ భావంలో దాని గురించి మర్చిపోవాలి?

14 ఇతరులను క్షమించడం అంటే దానర్థం మనం వాస్తవంగా జరిగినదాన్ని మర్చిపోవడమనా? ఈ విషయంలో ముందటి శీర్షికలో చర్చించబడినట్లుగా యెహోవాయే ఎటువంటి మాదిరినుంచాడో గుర్తు తెచ్చుకోండి. మన పాపాల్ని యెహోవా మర్చిపోతాడని బైబిలు చెప్పినప్పుడు, వాటిని జ్ఞాపకం చేసుకోవడం ఆయనకు ఇక సాధ్యంకాదని కాదు దానర్థం. (యెషయా 43:25) బదులుగా, ఆయన ఏ భావంలో మర్చిపోతాడంటే ఆయన ఒక్కసారి క్షమించిన తర్వాత ఆ పాపాలను భవిష్యత్తులో మనకు విరుద్ధంగా పైకి తోడడు. (యెహెజ్కేలు 33:14-16) అదే విధంగా, మనం తోటి మానవులను క్షమిస్తున్నాము అంటే దానర్థం వారు చేసింది జ్ఞాపకం చేసుకోవడం మనకు ఇక సాధ్యం కాదని కాదు. అయితే, మనం మర్చిపోవడం సాధ్యమే, ఎటువంటి భావంలోనంటే అపరాధం చేసిన వ్యక్తికి విరుద్ధంగా భవిష్యత్తులో వాటిని పైకి తీసుకురాకుండా, భవిష్యత్తులో మళ్లీ వాటిని బయటపెట్టకుండా ఉండటమే. విషయం ఈ విధంగా పరిష్కరించబడిన తర్వాత, దాని గురించి వృథా ప్రసంగం చేయడం యుక్తం కాదు; ఆయనేదో బహిష్కరించబడిన వ్యక్తియన్నట్లు అపరాధికి పూర్తిగా దూరంగా ఉండడం కూడా ప్రేమపూర్వకమైన విషయం కాదు. (సామెతలు 17:9) నిజమే, ఆయనతో మన సంబంధం బాగుపడడానికి కొంత సమయం పట్టవచ్చు; మునుపటిలాగా మనం సన్నిహితత్వాన్ని అనుభవించకపోవచ్చు. కానీ మనం ఇంకా ఆయన్ని మన క్రైస్తవ సహోదరునిగానే ప్రేమిస్తాము, అలాగే శాంతియుతమైన సంబంధాలను కొనసాగించడానికి యథాశక్తి కృషి చేస్తాము.—లూకా 17:3 పోల్చండి.

క్షమించడం అసంభవంగా అనిపిస్తున్నప్పుడు

15, 16. (ఎ) పశ్చాత్తాపం చూపని తప్పిదస్తుని క్షమించాల్సిన అవసరం క్రైస్తవులకు ఉందా? (బి) కీర్తన 37:8లోని బైబిలు సలహాను మనం ఎలా అన్వయించుకోవచ్చు?

15 అయితే, ఇతరులు మనకు అత్యంత లోతైన గాయాన్ని కలుగజేస్తూ మనకు విరుద్ధంగా పాపము చేస్తే, తమ పాపాన్ని ఏమాత్రం గుర్తించకపోతే, పశ్చాత్తాపమే లేకపోతే, అసలు క్షమాపణలే కోరకపోతే అప్పుడేమిటి? (సామెతలు 29:13) పశ్చాత్తాపం చెందని, కఠినులైన పాపులను యెహోవా క్షమించడని లేఖనాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. (హెబ్రీయులు 6:4-6; 10:26, 27) మన విషయం ఏమిటి? లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) ఇలా అంటుంది: “హానికరమైన, ఉద్దేశపూర్వకమైన పాపాన్ని చేస్తూనే ఉంటూ, ఏమాత్రం పశ్చాత్తాపం చూపనివారిని క్షమించాల్సిన అవసరం క్రైస్తవులకు లేదు. అటువంటివారు దేవునికి శత్రువులవుతారు.” (సంపుటి 1, పేజీ 862) చాలా అన్యాయమైన, హేయమైన, దారుణమైన ప్రవర్తనను సహించిన ఏ క్రైస్తవుడూ, అలా ప్రవర్తించిన పశ్చాత్తాపం చూపని తప్పిదస్తుడిని క్షమించాలనో లేక మన్నించాలనో బలవంతపెట్టబడుతున్నట్లు భావించకూడదు.—కీర్తన 139:21, 22.

16 క్రూరమైన దుష్ప్రవర్తనను సహించిన వ్యక్తులు గాయపడినట్లుగాను, కోపంగాను భావించవచ్చన్నది అర్థం చేసుకోదగినదే. అయితే, కోపాన్ని నిలిపి ఉంచుకోవడం, ఉక్రోషంతో నిండిపోవడం మనకు చాలా హానికరమనే విషయం గుర్తుతెచ్చుకోండి. తప్పిదాన్ని ఒప్పుకుంటారనో, క్షమాపణలు కోరుతుండవచ్చనో మనం వేచిచూస్తూ కూర్చుంటే, అది రానప్పుడు మనం మరింత కల్లోలానికి గురికావచ్చు. అన్యాయం జరిగిందన్న భావనలు మనల్ని ముంచెత్తుతుంటే మనలో కోపం పెరిగిపోతుండవచ్చు. తత్ఫలితంగా ఇది మన ఆధ్యాత్మిక, భావోద్వేగ, శారీరక ఆరోగ్యాలపై వినాశనకరమైన ప్రభావాల్ని చూపించగలదు. ఒక విధంగా మనల్ని గాయపర్చిన వ్యక్తి, మనల్ని అలా గాయపరుస్తూనే ఉండడానికి అనుమతిస్తున్నామన్నమాట. బైబిలు జ్ఞానయుక్తంగా ఇలా సలహా ఇస్తుంది: “కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము.” (కీర్తన 37:8) అందువల్ల, కోపాన్ని నిలిపివుంచుకోవడాన్ని ఆపివేయడమన్న భావంలో క్షమించాలని కొంతమంది క్రైస్తవులు కొంత కాలానికి నిర్ణయించుకోగలిగారు—తమకు జరిగినదాన్ని క్షమించివేయడం అని కాదు గాని, కోపంతో రగిలిపోకుండా ఉండాలని నిర్ణయించుకోగలిగారు. విషయాన్ని పూర్తిగా న్యాయానికి దేవుడైన యెహోవా చేతుల్లో విడిచిపెట్టడం ద్వారా వారు ఎంతో ఉపశమనాన్ని అనుభవించారు, తమ జీవితాల్లో మళ్లీ మామూలుగా కొనసాగారు.—కీర్తన 37:28.

17. ప్రకటన 21:4లో నమోదు చేయబడిన యెహోవా వాగ్దానం ఏ ఆదరణకరమైన హామీనిస్తుంది?

17 గాయం చాలా లోతుగా ఉంటే, దాన్ని మన మనస్సునుండి పూర్తిగా తుడిచివేయడంలో మనం విజయం సాధించకపోవచ్చు, కనీసం ఈ లోక విధానంలో మాత్రం సాధ్యం కాదు. కానీ యెహోవా ఒక నూతన లోకాన్ని వాగ్దానం చేస్తున్నాడు, అందులో “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి[పోతాయి].” (ప్రకటన 21:4) ఆ సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోగలిగే ఏ సంగతీ కూడా—ఇప్పుడు మన హృదయాల్ని కృంగదీస్తున్నప్పటికీ అప్పుడు—లోతైన గాయాన్నిగాని, బాధనుగాని కలిగించదు.—యెషయా 65:17, 18.

18. (ఎ) మనం మన సహోదర సహోదరీలతో వ్యవహరించేటప్పుడు క్షమించేవారిగా ఉండాల్సిన అవసరం ఎందుకుంది? (బి) ఇతరులు మనకు విరుద్ధంగా పాపం చేసినప్పుడు మనం ఏ భావంలో క్షమించి దాని గురించి ఇక మర్చిపోవచ్చు? (సి) ఇది మనకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?

18 ఈలోగా, మనం అపరిపూర్ణులైన సహోదర సహోదరీలతో, పాపభరిత మానవులతో కలిసి జీవించాలి, కలిసి పనిచేయాలి. మనమందరం తప్పులు చేస్తాము. అప్పుడప్పుడు మనం ఒకరినొకరం నిరుత్సాహపర్చుకుంటాము. ఒకరినొకరం గాయపర్చుకుంటాము కూడా. మనం ఇతరుల్ని “ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టు”కు క్షమించాల్సిన అవసరం ఉందని యేసుకు బాగా తెలుసు. (మత్తయి 18:22) నిజమే, మనం యెహోవా క్షమించినంత సంపూర్ణంగా క్షమించలేక పోవచ్చు. అయినా, మన సహోదరులు మనకు విరుద్ధంగా పాపం చేసినప్పుడు చాలా సందర్భాల్లో, మనం మనలోని కోపాన్ని నిలిపి ఉంచుకోమన్న భావంలో మనం వారిని క్షమించగలము, అంతేకాదు, భవిష్యత్తులో ఎన్నడూ వాటిని వారికి విరుద్ధంగా పైకి తీసుకురాము అన్న భావంలో మనం వాటిని మర్చిపోవచ్చు కూడాను. ఆ విధంగా మనం క్షమించి ఇక దానిగురించి మర్చిపోయినప్పుడు మనం సంఘంలోని శాంతిని కాపాడడానికి సహాయం చేయడమే కాదు గాని, మన మనశ్శాంతిని హృదయ శాంతిని కూడా కాపాడుకున్నవారమవుతాము. అన్నింటికీ మించి, మన ప్రేమమయ దేవుడైన యెహోవా మాత్రమే అందించగల సమాధానాన్ని మనం అనుభవిస్తాము.—ఫిలిప్పీయులు 4:7.

[అధస్సూచీలు]

a బాబిలోన్‌ టాల్ముడ్‌ ప్రకారం రబ్బీల సంప్రదాయం ఇలా చెబుతుంది: “ఒక వ్యక్తి అతిక్రమం చేస్తే, మొదటిసారి, రెండవసారి మూడవసారి అతనిని క్షమించవచ్చు, నాలుగవసారి ఆయనకు క్షమాపణ దొరకదు.” (యోమా 86బి) ఇది కొంతమేరకు ఆమోసు 1:3; 2:6; యోబు 33:29 వంటి వచనాలను తప్పుగా అర్థం చేసుకోవడం మూలాన సంభవించింది.

b వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది.

పునఃసమీక్ష కొరకైన ప్రశ్నలు

◻ మనం ఇతరులను క్షమించడానికి ఎందుకు సుముఖంగా ఉండాలి?

◻ ‘ఒకనినొకడు సహించుడి’ అన్న మాటలు ఏ విధమైన సందర్భాలకు వర్తిస్తాయి?

◻ ఇతరుల పాపాల మూలాన మనం లోతుగా గాయపడ్డప్పుడు విషయాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి మనం ఏమి చేయగలము?

◻ మనం ఇతరులను క్షమించినప్పుడు ఏ భావంలో మనం దాని గురించి మర్చిపోవాలి?

[16వ పేజీలోని చిత్రం]

మనం కోపాన్ని నిలుపుకుంటున్నప్పుడు, మనం అనుభవించే క్షోభ గురించి అపరాధికి అసలు ఏమీ తెలియకపోవచ్చు

[17వ పేజీలోని చిత్రం]

శాంతిని నెలకొల్పడానికి ఇతరులను సమీపించినప్పుడు, మీరు అపార్థాలను సులభంగానే రూపుమాపవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి