అనుదిన ఆత్మీయాహారము—క్రైస్తవ కుటుంబమునకు తప్పక అవసరము
1 “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.” (మత్త. 4:4) ఆ మాటలు ఎంత సత్యమైనవి! మనకు అనుదినము భౌతిక ఆహారము ఎలా అవసరమో, అలాగే ఆత్మీయాహారము కూడ క్రమముగా తీసికొనుట అవసరము. ఆత్మీయాహారమును క్రమముగా తీసికొనుటకు సహాయపడేందుకై సొసైటి ఎగ్జామినింగ్ ది స్క్రిప్చ్ర్స్ డైలీ అనే చిన్న పుస్తకమును ప్రచురించింది. క్రైస్తవ కుటుంబముగా మీరు ప్రతి దినము దినవచనమును పరిశీలించుటకు సమయమును కేటాయిస్తున్నారా?
2 తల్లిదండ్రులు తప్పక మాదిరి చూపవలెను: పనిరద్దీగా వుండు బాధ్యతతో, సరే మరొక సమయములో చూసుకుందాములే అనే తలంపుతో దినవచనమును పరిశీలించు విషయాన్ని ప్రక్కనపెట్టుట సులభంగా జరుగవచ్చును. కాని తల్లిదండ్రులు తమ కుటుంబ ఆత్మీయ అవసరతయెడల మనస్సు కలిగివుంటే, వారు సమయాన్ని కనుగొంటారు, అవును కుటుంబమంతా కలిసివున్నప్పుడు ప్రతిరోజు అలాచేయుటకు సమయమును ఏర్పరచుకొంటారు. (మత్త. 5:3) తల్లిదండ్రులు తమపిల్లలతో దిన వచనమును చదువుటయేగాక కావలికోట వ్యాఖ్యానము, అందులోని అంశములను ఉన్నతపరస్తూ ఆ సమాచారమును, హితోపదేశమును అభ్యాసయుక్తంగా ఎలా అన్వయించుకొనవచ్చునో చర్చిస్తారు. నిజమే, అట్టి అలవాటులో పడుటకు కృషి మరియు సాధన అవసరము కావొచ్చుగానీ దానివలన కలుగు ఫలితాలు ప్రయోజనకరమైనవే. (అపొ. కా. 17:11, 12 పోల్చుము) కావున తల్లిదండ్రులారా, మంచి మాదిరిని చూపుటకై కష్టించి పనిచేయండి.
3 అనుకూలమైన సమయమును చూసుకొనుము: ఏదో జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు అనే వ్యవహారంగా కాక కుటుంబమంత కలసి దినవచనమును చర్చించుటకు మంచి సమయము ఏది? ప్రతిదినమును బైబిలు వచనమును చర్చించి ప్రారంభించుటలో ప్రయోజనము కలదు. ప్రపంచవ్యాప్తంగా బేతేలు మరియు మిషనరీ గృహాలలో క్లుప్తమైన దినవచనపు చర్చతో కూడిన ఉదయకాల ఆరాధనతోనే ప్రతిదినము ప్రారంభమౌతుంది. ఇది ప్రతిదినమును ఒక మంచి ప్రారంభముతో మొదలుపెట్టుటకు, అనుదినము యెహోవా జ్ఞాపికలను తలపోయుటకు సహోదరులకు సహాయపడుతుంది.—కీర్త. 1:1, 2; ఫిలి. 4:8.
4 అలాగే క్రైస్తవ కుటుంబములు కూడా ఉదయకాల బైబిలు చర్చలనుండి ప్రయోజనము పొందగలవు. పాఠశాలలో ఆత్మీయతను పాడుచేయు ప్రమాదములతో వ్యవహరించుటకు వారు సహాయము పొందెదరు. ఒకవేళ కొంత కాలంవరకు దినవచన చర్చకు కుటుంబమంత కలసి కూర్చొనుట సాధ్యపడకపోయినను, అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటులనుగూర్చి తలంచి ఈ ప్రాముఖ్యమైన ఆత్మీయ పోషణ తప్పిపోకుండా చూడవచ్చును. ఉదాహరణకు, ఉదయమున పిల్లలు లేవకముందే తండ్రి తప్పక పనికి వెళ్లవలసివుంటే, బహుశా తల్లి కొంతసమయమును వెచ్చించి దినవచనమును చర్చించవచ్చును. మరోప్రక్క కొన్ని కుటుంబములు సాయంకాలం అందరూ కలసివుంటారు గనుక అప్పుడు చర్చించుకొనే ఏర్పాటు చేసికొంటారు. ప్రతి కుటుంబము వారి పరిస్థితులకు బాగా సరిపోయిన కాలక్రమ పట్టికను వేసికొనవచ్చును.
5 ఒక క్రైస్తవ కుటుంబమునకు అనుదిన ఆత్మీయ పోషణ తప్పక అవసరము. దినవచనమును పరిశీలించుటకు ప్రాధాన్యతనివ్వండి. (ఫిలి. 1:10) ప్రతిదినము బైబిలు వచనమును చర్చించుట యెహోవాయొక్క నీతియుక్తమైన సూత్రములకు, శాసనములకు హత్తుకొనియుండుటకు సహాయపడును. కుటుంబములోని ప్రతి సభ్యునియొక్క సహకారము ఈ ఏర్పాటు అందరికి గొప్ప ప్రయోజనకరమగునట్లు చేస్తుంది.