ప్రశ్నా భాగము
◼ క్రైస్తవ తల్లిదండ్రుల చిన్న పిల్లలు, బాప్తిస్మముపొందని ప్రచారకులుగా గుర్తించబడకముందు ఎంతమేరకు ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనవచ్చును?
క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలు పరిపక్వత కెదిగి, యెహోవాకు అంకితమైన సేవకులుగా తయారు కావాలని కోరుకుంటారు. (1 సమూ. 2:18, 26; లూకా 2:40) బహు చిన్నవయస్సులో కూడ క్రైస్తవ గృహములలోని పిల్లలు బైబిలుపై ఆధారపడిన తమ విశ్వాసమును సమర్ధించుకోగల స్పష్టమైన భావాలను వ్యక్తము చేయవలెను. బాల్యమునుండే పిల్లలు తమ తల్లిదండ్రులతోపాటు ప్రాంతీయ పరిచర్యలో వెళ్తున్నయెడల వారి ఆత్మీయ పెరుగుదల బాగా అధికము కాగలదు. అయితే బాలలు ప్రాంతీయ సేవను ఆనందించాలంటే, బాప్తిస్మము పొందని ప్రచారకులుగా కావాలంటే, రాజ్యప్రకటన పనిలో కొనసాగాలంటే వారు హృదయపూర్వకంగా ప్రేరేపించబడటం ప్రాముఖ్యం. తల్లిదండ్రులయొక్క శ్రద్ధతో కూడిన తర్ఫీదు అవసరము. (1 తిమో. 4:6; 2 తిమో. 2:15) తల్లిదండ్రులకు అంగీకృతమైతే, కొన్నిసార్లు ఇతర అర్హులైన ప్రచారకులు ఇందుకు సహాయపడవచ్చును.—అవర్ మినిస్ట్రీ, పేజీలు 99-100 చూడండి.
బాగుగా ప్రవర్తించే పిల్లలు ఇంటింటి సేవా పనిలో తమ క్రైస్తవ తల్లిదండ్రులతో వెళ్లినప్పుడు, పరిచర్యలో ఎలా పాల్గొనాలో వారు నేర్చుకుంటారు. అయితే వారికై వారు తమ స్వంతగా కొంత నైపుణ్యమును, సామర్ధ్యమును పెంచుకొనేంతవరకు బాప్తిస్మము పొందని ప్రచారకులుగా గుర్తించబడరు. పిల్లలు తమతో కలిసి పనిచేస్తున్నప్పుడు, సాక్ష్యమిచ్చు పనిలో ఎంతమేరకు వారు పాల్గొనవలెనో క్రైస్తవ తల్లిదండ్రులు నిర్ణయించవచ్చును. బాప్తిస్మము పొందని ప్రచారకులుగా గుర్తించబడని పిల్లలు తమకైతాము స్వంతగాగాని, లేక ఇతర పిల్లలతోగాని ప్రాంతీయ సేవలో పాల్గొనకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రాంతీయ సేవకు సిద్ధపరచి, అనేక రీతులలో ప్రాంతీయ సేవలో పాల్గొనేలా, అనగా లేఖనం చదువుటద్వారా, ఒక కరపత్రమునేగాని, పత్రికనేగాని అందించుటద్వారా, లేక ఇంటివారికి ప్రచురణలోని ఒక దృష్టాంతమును చూపుటద్వారా పాల్గొనవచ్చును. పిల్లలు పెరిగేకొలది చర్చలలో ఎక్కువ మేరకు పాల్గొనగలుగుదురు.
సరైన తర్ఫీదుతో, తల్లిదండ్రుల నడిపింపుకు స్పందిస్తూ, తమ్మును తాము మర్యాదపూర్వకంగా నడుచుకొనునట్లు చేసుకొనే కొలది, పరిచర్యయొక్క గంభీరతను వారు మెచ్చుకొనుటకు నేర్చుకొందురు. తల్లిదండ్రులు, ఇంకను బాప్తిస్మము పొందని ప్రచారకులుగా గుర్తించబడని తమపిల్లలను, వారినిగూర్చి ఇతరులు శ్రద్ధతీసుకుంటారులే అనే ఉద్దేశ్యంతో ప్రాంతీయ సేవకొరకైన కూటములలో విడిచిపెట్టకూడదు. శ్రద్ధగల తల్లిదండ్రులు తమ పిల్లల కార్యమును పర్యావేక్షించవలసిన బాధ్యతను గుర్తిస్తారు. అయినను, పరిచర్యలో యెహోవాను సేవించవలెనను నిజమైన ఆసక్తిని చూపు పిల్లలకు సంఘములో తర్ఫీదునిచ్చుటయందు, బహుశా ఇతర బాధ్యతగల ప్రచారకులు సహాయంచేయుటకు ఇష్టపడవచ్చును.