యెహోవాను స్తుతించడాన్ని మీ పిల్లలకు నేర్పించండి
1. చిన్నపిల్లలు యెహోవాను స్తుతించగలరా?
1 ‘యెహోవా నామాన్ని స్తుతించమని’ కీర్తన 148:12, 13 యువతీ యువకులను ప్రోత్సహిస్తోంది. అలా స్తుతించిన యౌవనుల ఉదాహరణలు లేఖనాల్లో చాలా ఉన్నాయి. ఉదాహరణకు, “బాలుడైన సమూయేలు . . . యెహోవాకు పరిచర్య చేయుచుండెను.” (1 సమూ. 2:18) ఒక ‘చిన్నది,’ నయమానుకు కలిగిన కుష్ఠరోగాన్ని ఇశ్రాయేలులో ఉన్న యెహోవా ప్రవక్త బాగుచేయగలడని నయమాను భార్యకు చెప్పింది. (2 రాజు. 5:1-3) యేసు దేవాలయంలోకి వచ్చి, శక్తివంతమైన కార్యాలను చేసినప్పుడు, “దావీదు కుమారునికి జయము అని” ‘చిన్నపిల్లలే’ కేకలు వేశారు. (మత్త. 21:15) తల్లిదండ్రులు తమ పిల్లలకు యెహోవాను స్తుతించడాన్ని ఎలా నేర్పించగలరు?
2. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి మాదిరిని ఉంచడం ఎందుకు ప్రాముఖ్యం?
2 ఉదాహరణ: ఇశ్రాయేలు తండ్రులు వారి పిల్లల హృదయాల్లో సత్యాన్ని నాటడానికి ముందు, వారు యెహోవాను ప్రేమించి, ఆయన ఆజ్ఞలను తమ సొంత హృదయాల్లో ఉంచుకోవాలి. (ద్వితీ. 6:5-9) మీరు పరిచర్య గురించి ప్రోత్సహకరంగా మాట్లాడుతూ, దానిని మీ వారపు సమయపట్టికలో భాగంగా చేసుకున్నట్లయితే మీ పిల్లలు పరిచర్యను ప్రాముఖ్యమైనదిగా, సంతృప్తినిచ్చేదిగా దృష్టించడానికి ఇష్టపడతారు.
3. ఒక సహోదరి తన తల్లిదండ్రుల మాదిరినిబట్టి ఎలా ప్రయోజనం పొందింది?
3 ఒక సహోదరి సంతోషంతో ఇలా గుర్తుచేసుకుంటుంది: “నేను ఎదుగుతుండగా, మా కుటుంబ దైనందిన కార్యక్రమంలో ప్రతీ వారం పరిచర్యలో పాల్గొనడం భాగంగా ఉండేది. మా తల్లిదండ్రులు నిజంగా ప్రకటనా పనిని ఆనందించడాన్ని నేను చూడగలిగాను. మేము పరిచర్యను సంతోషాన్నిచ్చే పనిగా దృష్టిస్తూ పెరిగాం.” ఈ సహోదరి 7 సంవత్సరాల వయసులో బాప్తిస్మం తీసుకొనని ప్రచారకురాలైంది, ఆమె 32 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా పూర్తికాల సేవ చేస్తుంది.
4. పిల్లలకు ప్రగతిదాయకంగా శిక్షణ ఇవ్వడమంటే అర్థమేమిటి?
4 ప్రగతిదాయక శిక్షణ: మీరు పరిచర్యలో భాగం వహిస్తుండగా మీ పిల్లలు కూడా దానిలో పాల్గొనేలా చేయండి. వారు కాలింగ్ బెల్ నొక్కవచ్చు, గృహస్థుడికి ఒక కరపత్రాన్ని అందించవచ్చు లేదా ఒక లేఖనాన్ని చదవవచ్చు. ఇది వారి సంతోషాన్ని అధికం చేయడమేగాక, రాజ్య సందేశాన్ని పంచుకునే విషయంలో తమ సామర్థ్యంపై నమ్మకం పెంచుకునేలా వారికి సహాయం చేస్తుంది. వారు ఎదుగుతుండగా, వారు పరిచర్యలో ఎక్కువగా భాగం వహించాలి. కాబట్టి వారు ప్రగతి సాధించడానికి, తమ సేవను మెరుగుపరచుకునేందుకు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోగలరనే విషయం గురించి వారు ఆలోచించేలా వారికి సహాయం చేయండి.
5. బాప్తిస్మం తీసుకొనని ప్రచారకునిగా అర్హుడవడానికి ఒక పిల్లవానికి ఏమి అవసరం?
5 మీ పిల్లలు బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులయ్యేందుకు అర్హులయ్యారని మీకు అనిపించినప్పుడు, అలా కావాలని మీ పిల్లలు కోరికను వ్యక్తపరిచినప్పుడు పెద్దలతో మాట్లాడండి. వారు పరిచారకులైతే యెహోవాను స్తుతించడం తమ వ్యక్తిగత బాధ్యతని గుర్తుంచుకుంటారు. ఒక పిల్లవాడు బాప్తిస్మం తీసుకొనని ప్రచారకునిగా అర్హుడయ్యేందుకు, బాప్తిస్మం తీసుకున్న వయోజనునికి తెలిసినంతగా ఆయనకి తెలియాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. మీ పిల్లవాడు బైబిలు ప్రాథమిక బోధలను అర్థం చేసుకున్నాడా? బైబిలు నైతిక ప్రమాణాలను పాటిస్తున్నాడా? పరిచర్యలో పాల్గొనడానికి, ఒక యెహోవాసాక్షిగా గుర్తించబడాలని కోరుకుంటున్నాడా? అలాగైతే, మీ పిల్లవాడు బాప్తిస్మం తీసుకొనని ప్రచారకుడయ్యేందుకు అర్హుడని పెద్దలు నిర్ణయించవచ్చు.—యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం, 79-82 పేజీలను చూడండి.
6. తల్లిదండ్రులు తమ పిల్లలకు శిక్షణనివ్వడం ఎందుకు ప్రయోజనకరం?
6 యెహోవాను హృదయపూర్వకంగా స్తుతించడాన్ని పిల్లలకు నేర్పించడానికి కృషి చేయాలి. అయితే పిల్లలు ఆధ్యాత్మిక ప్రగతి సాధించడాన్ని చూడడం కన్నా గొప్ప ఆనందం తల్లిదండ్రులకు మరొకటి లేదు. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, తన అద్భుతకార్యాల గురించి పిల్లలు మాట్లాడడం యెహోవాకు సంతోషాన్నిస్తుంది.