ఈ సేవా సంవత్సరములో మనమేమి సాధిస్తాము?
1 సెప్టెంబరు 1తో 1994వ సేవా సంవత్సరం ప్రారంభమవుతుండగా, యెహోవా ప్రజలుగా మనందరము వ్యక్తిగతంగా, అలాగే ఒక సంస్థగా ఈ క్రొత్త సంవత్సరంలో ఏమి సాధించాలనుకుంటున్నామో ఇది మన మనస్సులలో కచ్చితంగా నిర్ణయించుకోవడానికి తగిన సమయము.
2 ఆత్మీయంగా ఎదుగుతుండండి: మనం సత్యంతో క్రొత్తగా సహవసిస్తున్నవారమైతే, విశ్వాసంలో బలపడటానికి మనం కోరుకోవాలి. (హెబ్రీ. 6:1-3) ఒక వేళ మనం ఇప్పటికే ఆత్మీయంగా బలంగా వున్నట్లైతే, మనం క్రొత్తవారికి, ఇతరులకు సహాయం చేయడమేకాక, మనకు తగినంత బైబిలు జ్ఞానం, క్రైస్తవజీవితంలో అనుభవమున్నదని ఎన్నటికీ భావించకుండ, మన స్వంత ఆత్మీయతకు కూడా తగినంత శ్రద్ధనివ్వాలి. మనం రోజూ దినవచనాన్ని పరిశీలిస్తూ, దైవపరిపాలనా పాఠశాల పట్టిక ప్రకారం బైబిలు పఠనం చేస్తూ, సంఘ పుస్తక పఠనానికి, కావలికోట పఠనానికి సిద్ధపడుతున్నామా? అది మనందరి కనీస గురియైవుండాలి. మనం ఈ దుష్టవిధాన నాశనాన్ని తప్పించుకుని దేవుని నూతన లోకంలోకి రక్షించబడాలంటే మనం ఆత్మీయంగా అభివృద్ధిచెందాలి.—ఫిలిప్పీయులు 3:12-16 పోల్చండి.
3 ఆత్మీయంగా పరిశుభ్రంగా వుండండి: మనం యెహోవా యెదుట పూర్తిగా అంగీకరింపబడాలంటే, మనం “శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి” పరిశుభ్రంగా వుండాలి. (2 కొరిం. 7:1) మనం ఒకసారి పరిశుభ్రమైన తరువాత దుష్టత్వంతో నిండిన ఈ పాత లోక ‘బురదలో దొర్లుటకు’ మరల ఎందుకు ఇష్టపడాలి? (2 పేతురు 2:22 పోల్చండి.) మనం ఆత్మీయంగా బలంగా, పరిశుభ్రంగా వుండటానికి కృతనిశ్చయం గలవారమైయుండాలి. అప్పుడు మనం సాతాను దుష్ట ఆలోచనలను ఎరుగనివారమై మోసపోకుండ, పాపంలో పడిపోకుండ, యెహోవా అనుగ్రహానికి దూరమవ్వకుండ వుండవచ్చు.—2 కొరిం. 2:11.
4 జ్ఞానయుక్తమైన సలహాను లక్ష్యపెట్టండి: “ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును” అని సామెతలు 15:22 తెలియజేస్తుంది. ఆ మాటలు పల్కిన సొలొమోను కూడా అన్యులైన భార్యలను కలిగివుండవద్దని దేవుడిచ్చిన సలహాను లక్ష్యపెట్టలేదు గనుక తరువాత ‘అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేయ’గల్గుటకు అనుమతించాడని గుర్తుంచుకోండి. (1 రాజులు 11:1-4) కాబట్టి మనం వ్యక్తిగతంగా జ్ఞానయుక్తమైన సలహాను లక్ష్యపెట్టకపోతే, యెహోవా సేవలో మనమెలా ప్రభావవంతంగా ఉండగలం లేక అనుసరించదగిన మంచి మాదిరిని ఎలా కలిగుండగలము? (1 తిమోతి 4:15) బైబిలు ఉపదేశం మన హృదయాల్ని కాపాడుకోటానికి మనకు సహాయం చేయును. (సామెతలు 4:23) యెహోవా ప్రేమించేదాన్ని ప్రేమిస్తూ, యెహోవా ద్వేషించేదాన్ని ద్వేషిస్తూ, ఆయన నడిపింపును ఎడతెగక వెదకుతూ, ఆయనను సంతోషపరచే పనులు చేస్తూ వుండడమే మనకు నిజమైన రక్షణగా ఉంటుంది.—సామె 8:13; యోహాను 8:29; హెబ్రీ. 1:9.
5 మనం యెహోవాను ఆరాధించడం ఏదో యాంత్రికంగా, లోకంలోని నామకార్థ క్రైస్తవులు చేసే ఆరాధన వంటిది కాదు. కాని, అది ఆత్మతో, ఉత్సాహంగా, సజీవంగా, దేవుని వాక్యంలో కనుగొనబడే సత్యానికి అనుగుణ్యమైనదై ఉన్నది.—యోహాను 4:23, 24.
6 దేవుని చిత్తాన్ని చేయాలనే మన నిర్ణయం ప్రతిరోజు పరీక్షింపబడుతుంది. “లోకమందున్న మన సహోదరులు” కూడా ఇలాంటి పరీక్షలనే ఎదుర్కొంటున్నారని, యెహోవాయే మనలను బలపరచువాడని తెలుసుకొనుట ద్వారా మనం దృఢంగా వుండాలి. (1 పేతు. 5:9, 10) అలా మనం 1994 సేవా సంవత్సరంలో మనం సాధించాలనుకున్న దాన్ని సంపూర్తిగా సాధించగలము. —2 తిమోతి 4:5.