గృహ బైబిలు పఠనాలు ప్రారంభించుట
1 నిజక్రైస్తవుని ప్రతిఫలదాయకమైన, సంతృప్తికరమైన అనుభవాలలో ఒకటేదంటే, గృహబైబిలు పఠనం ద్వారా ఎవరికైనా సత్యం బోధించడమే. కొంతమంది తాము బైబిలు పఠనాన్ని ప్రారంభించలేమని, నిర్వహించలేమని భావించడం మూలంగా పరిచర్యలోని ఈ ప్రతిఫలదాయకమైన, సంతృప్తికరమైన అంశభాగంలో పాల్గొనలేక పోతుండవచ్చును. ప్రగతి సాధించిన అనేకమంది విశిష్టమైన ప్రచారకులు, పయినీర్లు కూడా ఒకప్పుడు అలాగే భావించారు. అయిననూ, యెహోవా యందు నమ్మికయుంచి, మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడే సలహాలను పాటించడం ద్వారా, వారు బైబిలు పఠనాలను ఎలా ప్రారంభించి నిర్వహించాలో నేర్చుకుని, వారు పరిచర్యలోని తమ ఆనందాన్ని ఇనుమడింపజేసుకున్నారు. మీరు కూడా అదే గమ్యాన్ని కలిగివుండవచ్చు.
2 సూటియైన పద్ధతిని, కరపత్రాలను ఉపయోగించుట: ఒక పఠనాన్ని ప్రారంభించటానికి సుళువైన మార్గాలలో ఒకటి సూటియైన పద్ధతే. కొంతమంది ప్రజలకు బైబిలును పఠించటానికి కావలసింది కేవలం స్నేహపూర్వకంగా ఆహ్వానించడమే. గృహస్థున్ని ఇలా అడగడం ద్వారా ఇది చేయవచ్చు: “మీరు వ్యక్తిగత గృహ బైబిలు పఠనం చేసి బైబిలు జ్ఞానాన్ని, భూమి యెడల దేవుని సంకల్పాన్ని గూర్చిన జ్ఞానాన్ని పెంపొందించుకొనుటకు ఇష్టపడతారా?” లేక గృహబైబిలు పఠనం ఎలా నిర్వహింపబడుతుందో మీకు ప్రదర్శించి చూపించటానికి నేను సంతోషిస్తానని గృహస్థునితో చెప్పవచ్చును. బహుశా అనేకులు దీన్ని నిరాకరించినప్పటికీ, అంగీకరించేవారిని కనుగొనుట ద్వారా మీరు పొందే ఆనందాన్ని గూర్చి ఆలోచించండి!
3 గృహబైబిలు పఠనాన్ని ప్రారంభించుటకు మరో పద్ధతి కరపత్రాలను ఉపయోగించడము. అవి పరిమాణంలో చిన్నవే అయినప్పటికీ, అవి శక్తివంతమైన, ఒప్పించగల సమాచారాన్ని అందజేస్తాయి. ఒక కరపత్రంతో పఠనాన్ని ఎలా ప్రారంభించవచ్చు? గృహస్థునికి ఆసక్తి కలిగిస్తుందని మీరు భావించే ఒక కరపత్రాన్ని అతనికివ్వడం ద్వారా చేయవచ్చు. తరువాత, చొరవ తీసుకుని మీతో పాటు మొదటి పేరాను చదవమని గృహస్థున్ని ఆహ్వానించండి. సూచించబడిన లేఖనాలను తెరిచిచూచి, అవి ఆ సమాచారానికి ఎలా అన్వయిస్తాయో చర్చించండి. మొదటి దర్శనంలో మీరు కేవలం ఒకటి లేక రెండు పేరాలనే పరిశీలించవచ్చు. బైబిలునుండి తాను ఆసక్తికరమైన విషయాలను నేర్చుకుంటున్నానని గృహస్థుడు మెచ్చుకుంటుంటే, చర్చలో మీరు ఎక్కువ సమయాన్ని గడపవచ్చు.
4 కేవలం బైబిలునే ఉపయోగించుట: కొన్నిసార్లు ఒకవ్యక్తి బైబిలును గూర్చి చర్చించటానికి అంగీకరించవచ్చు, కాని ఒక నిర్దారిత పఠనాన్ని అంగీకరించటానికి లేక మన ప్రచురణలలో ఒకదాన్ని ఉపయోగించటానికి నిరాకరించవచ్చు. అయినప్పటికీ, నిరంతరము జీవించగలరు లేక రీజనింగ్ పుస్తకాలలోని భాగాల ఆధారంగా ఆసక్తికరమైన లేఖనానుసార చర్చలను తయారుచేసుకుని, ఆసక్తిగల వ్యక్తిని దర్శించునప్పుడు బైబిలును మాత్రమే ఉపయోగిస్తూ మీరు బైబిలు పఠనాన్ని ప్రారంభించవచ్చును. అలాంటి చర్చలు 15 లేక 20 నిమిషాలు, లేదా పరిస్థితుల కనుగుణంగా ఇంకా ఎక్కువ సేపుగాని కొనసాగవచ్చు. క్రమంగా, ప్రగతిశీలక పద్ధతిలో బైబిలు సత్యాలను బోధిస్తుంటే మీరు బైబిలు పఠనాన్ని ప్రారంభించినట్లే, దాన్ని మీరు రిపోర్టు చేయవచ్చు. సమయం అనుకూలించినప్పుడు, నిరంతరము జీవించగలరు పుస్తకాన్ని పరిచయం చేసి, నిర్దారిత పఠనాన్ని దాని నుండి నిర్వహించవచ్చును.
5 ప్రాంతీయ సేవలో అవకాశాలను కనుగొనడమే కాక, మీరు పొరుగువారితో, సహచరులతో, కుటుంబ సభ్యులతో బైబిలు పఠనాలు మొదలుపెట్టడానికి ప్రయత్నించారా? కొంతకాలం క్రితం ప్రయత్నించారా? మళ్లీ ఈ మధ్య ప్రయత్నించి చూశారా? ఒక పద్ధతి పనిచేయకపోతే, ఇంకొక పద్ధతిని అవలంభించటానికి ప్రయత్నించారా?
6 ఇవ్వబడిన సలహాలను పాటిస్తే, ప్రాంతీయ సేవలో పట్టుదలతో పనిచేస్తే, యెహోవా దీవెన కొరకు ఆయనయందు నమ్మిక యుంచితే బైబిలు పఠనాలను మొదలుపెట్టడంలో మీరు విజయం సాధించవచ్చు. సత్యానికున్న శక్తిని, యెహోవా అందించే సహాయాన్ని ఎన్నడూ తక్కువ అంచనావేయకండి. గృహ బైబిలు పఠనాలను మొదలుపెట్టి, నిర్వహించడం ద్వారా పరిచర్యలోని మీ ఆనందాన్ని మీరు అధికం చేసుకోండి.