క్రొత్త బ్రోషూరును ఫలవంతంగా ఉపయోగించుట
1 మన ఇటీవలి జిల్లా సమావేశంలో, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే ... అనే క్రొత్త బ్రోషూరును అందుకోవడంలో మనం చాలా సంతోషించాం. ఎందుకంటే చాలా మంది తమ ప్రియమైన వారిని కోల్పోవడం వలన బాధను అనుభవించారు గనుక, అది అన్ని తరహాల ప్రజలను ఆకట్టుకోవాలి. చూపునాకట్టుకొనే ఫొటోలు మరియు చిత్రాలు వాటిని అందించడాన్ని సులభతరం చేయాలి. పుట 29లో లాజరు మరణం నుండి పునరుత్థానం చేయబడిన అద్భుతమైన వర్ణచిత్రం యేసుకు గల “మరణం వల్ల వచ్చే దుష్పరిణామాలను తొలగించాలనే ప్రగాఢ కోరికను” చూపిస్తుంది. తరువాతి పుట నిండా ఉన్న చిత్రం క్రొత్త లోకంలోని ఆనందదాయకమైన పునరుత్థాన దృశ్యాన్ని వర్ణిస్తుంది. దుఃఖపడే వారి హృదయాలకు ఇది ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో!
2 చనిపోయినవారి ప్రియులకు ఓదార్పునిచ్చుటకు ఈ బ్రోషూరు అద్భుతమైన సహాయాన్నివ్వగలదు. సంభాషణ రూపంలో చర్చించడానికి ఇది తయారు చేయబడింది. ముఖ్య అంశాలను సూచించే ప్రశ్నలు ప్రతి పుట చివరిలో కాకుండా ప్రతి భాగం అంతాన బాక్సులో కనిపిస్తాయి. మీ విద్యార్థికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని మీరు తలంచే ఏ రీతిలోనైనా ఈ ‘పునఃపరిశీలనా ప్రశ్నలను’ మీరు ఉపయోగించగలరు.
3 పునర్దర్శనాలు చేసేటప్పుడు బ్రోషూరులో కనిపించే అంశాలను చర్చించే విషయంలో సరైన ఎంపిక చేసుకునేవారై ఉండండి. పుట 2లోని విషయసూచికను చూపించి, గృహస్థునికి ఏది ఆసక్తికరంగా ఉందో సూచించమని చెప్పడం మంచిదని మీరనుకోవచ్చు. ఒక్కొక్కరి అవసరాలను గుర్తించండి. అతని భావాలను వ్యక్తపరచనివ్వండి, ఆ తర్వాత బ్రోషూరు ఎలా ఓదార్పునిస్తుందో చూపించండి. మన నిరీక్షణకు ఆధారాన్నిచ్చే బైబిలు లేఖనాలను ప్రతి భాగం విరివిగా ఉపయోగిస్తుంది.
4 పుట 5లోని “నిజమైన నిరీక్షణ ఉంది,” అనే ఉపశీర్షిక మృతులకు ఓదార్పునిచ్చే బైబిలు ఆధారిత నిరీక్షణను ఉన్నతపరుస్తుంది. ఇది పుటలు 26-31లో కనిపించే “మరణించిన వారికిగల నిశ్చయమైన నిరీక్షణ” అనే శీర్షికను చర్చించడానికి ఆసక్తిని రేకెత్తించాలి. పుట 27లోని బాక్సు ఇతర ‘ఓదార్పునిచ్చే లేఖనాలను’ ఇస్తుంది. యెహోవా నిజంగా “ఆదరణను అనుగ్రహించు దేవుడు” అని దుఃఖిస్తున్న గృహస్థుడు తొందరలోనే తెలుసుకుంటాడు.—2 కొరిం. 1:3-7.
5 ప్రియమైనవారి మరణం వల్ల కలిగే విభిన్న ప్రతిస్పందనలను మధ్య భాగాలు సున్నితమైన విధంగా చర్చిస్తాయి. అవి దుఃఖాన్ని ఎలా తాళుకోవాలో మరియు ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో ఇతరులెలా ఓదార్చవచ్చో చూపిస్తాయి. పుట 25నందు “మరణ విషాదాన్ని ఎదుర్కోడానికి పిల్లలకు సహాయపడుట” అనే శీర్షిక గల బాక్సు ఉంది. ఈ సమస్యను ఎదుర్కోవలసిన తల్లిదండ్రులకు ఇది నిజమైన సహాయంగా ఉంటుంది.
6 మీ వద్ద అదనపు ప్రతిని ఉంచుకుని, దానిని అనియత సాక్ష్యానికి ఉపయోగించండి. మీ ప్రాంతమందలి శవ సంస్కార మందిరాలను వేటినైనా దర్శించి, ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాలను ఓదార్చడానికి వారు ఈ ప్రతులను అందుబాటులో ఉంచుకునేందుకు ఇష్టపడతారేమో తెలుసుకోవాలని మీరు ఇచ్చయించవచ్చు. దుఃఖపడుతున్నవారు చనిపోయినవారి సమాధులను సందర్శించడానికి తిరిగి వెళ్ళే సందర్భాల్లో వారిని మీరు యుక్తిగా సమీపించవచ్చు.
7 యెహోవా “దీనులను ఆదరించు” దేవుడు గనుక మనం సంతోషిస్తాము. (2 కొరిం. 7:6) ‘ఈ దుఃఖాక్రాంతులను ఓదార్చడంలో’ భాగం వహించడం ఆధిక్యతగా మనం ఎంచుతాము.—యెష. 61:2.