ఇతరులతో కలిసి పనిచేయడం వలన వచ్చే ఆశీర్వాదాలు
1 పరిచర్యలో ఇతరులతో కలిసి పనిచేయడంవలన ప్రయోజనాలను అనుభవించగలమని మీరు భావిస్తున్నారా? యేసు అలా చేశాడు. కోత విస్తారంగా ఉండి, పనిచేసేవాళ్ళు కొందరే ఉన్నప్పటికీ, పరిచర్యకు ఆయన తన 70 మంది శిష్యులను “ఇద్దరిద్దరి”నిగా పంపాడు. వారందరూ ‘ఆయన వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని’ వెళ్ళి, ప్రకటన పనిలో పాల్గొనడం వారికి ఎంత ప్రతిఫలదాయకమైన సమయంగా ఉండేదో!—లూకా 10:1, 17; మత్త. 9:37.
2 ఇతరులతో కలిసి పని చేయడం పురికొల్పునిస్తుంది. మనలో కొందరు పరిచయంలేనివారితో మాట్లాడడానికి సిగ్గుపడతారు, కష్టమని తలస్తారు. మన ప్రక్కన ఒకరున్నారనేది దేవుని వాక్యాన్ని ధైర్యంగా మాట్లాడడానికి మనకు ఆత్మవిశ్వాసాన్నివ్వవచ్చును. మనతోపాటు ఎవరైనా ఉన్నప్పుడు, మనం శిక్షణ పొందిన విధంగా పరిచర్య చేయడం సులభం కావచ్చు. (సామె. 27:17) జ్ఞానియైన ఒక వ్యక్తి యిలా చెప్పాడు: “ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు.”—ప్రసం. 4:9.
3 వేర్వేరు ప్రచారకులతోను, పయినీర్లతోను పనిచేయడం మంచిది. బర్నబా, సీలా, తిమోతి, యోహాను మార్కు, అనేవారితోసహా అపొస్తలుడైన పౌలుకు సేవా సహచరులు ఉండేవారు, వారందరూ కలిసి ప్రకటించడం వలన అనేక ఆశీర్వాదాలను అనుభవించారు. అది నేడు కూడా నిజంకాగలదు. ఎంతో కాలంగా సత్యంలో ఉంటున్న ఎవరితోనైనా మీరు పరిచర్య చేశారా? సాక్ష్యమివ్వడంలోని అతని నిపుణతను గమనించిన తర్వాత మీరు అభివృద్ధిని సాధించేందుకు సహాయపడే కొన్ని మంచి అంశాలను గ్రహించివుండవచ్చు. మీకన్నా కొత్తవారైన ప్రచారకులతో మీరు వెళ్ళారా? అలాగైతే మీరు నేర్చుకున్న వాటిని పంచుకోవచ్చు, అలా వాళ్ళు పరిచర్యలో మరింత ఫలవంతులుగా ఉండేందుకు, తమ పరిచర్యలో మరింత సంతోషాన్ని అనుభవించేందుకు తోడ్పడి ఉండవచ్చు.
4 మీరు ప్రస్తుతం బైబిలు పఠనం నిర్వహిస్తున్నారా? అలాగైతే, పెద్దల్లో ఒకరినిగాని లేదా ప్రాంతీయ కాపరిని గాని మీతోపాటు రమ్మని ఎందుకు ఆహ్వానించకూడదు? అధ్యక్షులతో పరిచయం కలిగివుండడం మన బైబిలు విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పెద్ద సమక్షంలో పఠనం నిర్వహించడానికి మీరు సంకోచిస్తున్నట్లయితే, ఆయనను శ్రద్ధగా గమనించడానికి మిమ్మల్ని అనుమతిస్తూ తనే నిర్వహించడానికి సిద్ధపడవచ్చు. ఆ తర్వాత, అతి త్వరగా అభివృద్ధి సాధించేందుకు విద్యార్థికి మీరెలా తోడ్పడగలరో అనేదాని గురించి సలహాల కొరకు ఆయనను నిర్భయంగా అడగండి.
5 మీరు యితరులతో కలిసి పరిచర్య చేసేటప్పుడు, మీరు ప్రోత్సహించే సహచరులుగా ఉండండి. మీ ప్రాంతాన్ని గూర్చిన మీ వ్యాఖ్యానాలు అనుకూలంగా ఉండాలి. ఇతరులను దూషించవద్దు లేదా సంఘ ఏర్పాట్లను గూర్చి ఎన్నడూ ఫిర్యాదు చేయవద్దు. మీ మనస్సును పరిచర్యపైన, అలాగే యెహోవా నుండి వచ్చే ఆశీర్వాదాలపైన కేంద్రీకరించండి. మీరు అలా చేస్తే, మీరు, మీ సహచరులు ఆత్మీయంగా మరింత బలం పొందినవారై యింటికి తిరిగి వెళ్తారు.
6 ఇతర సహోదర సహోదరీలతో క్రమంగా పరిచర్యలో పాల్గొనడాన్ని మీ పరిస్థితులు కష్టతరం చేస్తుండవచ్చు. అయినప్పటికీ, మీకు సాధ్యమైతే మరొక ప్రచారకునితో కొంత సేపైనా కలిసి పని చేయడానికి కొంత సమయాన్ని ఎందుకు ఏర్పరచుకోకూడదు? మీరిద్దరూ ఆశీర్వదించబడతారు!—రోమా. 1:11, 12.