సత్య దేవుని గూర్చిన జ్ఞానం జీవానికి నడిపిస్తుంది
1 “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని పొందడమే నిత్యజీవము” అని దేవునికి తాను చేసిన ప్రార్థనలో యేసు అన్నాడు. (యోహా. 17:3, NW) అది ఎంతటి ఉదారమైన ప్రతిఫలం! నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని ఉపయోగించడం ద్వారా, నిరంతరం జీవించేందుకు వారు ఏమి చేయవలసిన అవసరముందో తెలుసుకోవడానికి ఇతరులకు మనం సహాయం చేయగలం. వారి ఆసక్తిని రేకెత్తించ్చేందుకు, జ్ఞానము అనే పుస్తకాన్ని చదవాలని కోరుకునేలా వారిని పురికొల్పేందుకు మనం ఏమి చెప్పగలం?
2 ఈ విధంగా నేర్పుగా చెబుతూ నడిపింపుకు బైబిలు ఆచరణాత్మక మూలమని మీరు సూచించవచ్చు:
◼ “జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి నడిపింపుకు ఆచరణాత్మక మూలాన్ని ఎక్కడ కనుగొనవచ్చు అనే దాని గురించి మేము మన పొరుగు వారితో మాట్లాడుతున్నాం. ప్రజలు బైబిలుతో సహా విభిన్న మత గ్రంథాలను పరిశీలిస్తారు. కాని ప్రజల దృక్పథాలు మారుతున్నాయి; కొందరు తమ మత గ్రంథాలు కేవలం మనుష్యుల చేత వ్రాయబడినవిగా దృష్టించి వాటిని అనుమానిస్తున్నారు. మీ అభిప్రాయమేమిటి? [ప్రతిస్పందించనివ్వండి.] మన కాలంలో బైబిలు ఆచరణాత్మకమైనదని చెప్పడానికి ఓ మంచి కారణముంది. [2 తిమోతి 3:16, 17 చదవండి.] బైబిలు సూత్రాలు దేవుడు బైబిలు రచనను ప్రేరేపించినప్పుడు ఎంతగా వర్తించేవో ఇప్పుడూ అంతే వర్తిస్తాయి.” జ్ఞానము అనే పుస్తకంలోని 16వ పేజీని త్రిప్పి, కొండ మీద యేసు ఇచ్చిన ప్రసంగంలో కనుగొనబడే ఆచరణాత్మక నడిపింపుపై క్లుప్తంగా వ్యాఖ్యానించండి. 11వ పేరాలో లేదా 13వ పేరాలో ఎత్తివ్రాయబడిన దానిని చదవండి. పుస్తకాన్ని ప్రతిపాదించి, బైబిలులోవున్న జ్ఞానం నుండి వ్యక్తిగతంగా మనమెలా ప్రయోజనం పొందగలం? అనే ప్రశ్నకు జవాబు చెప్పేందుకు తిరిగి వెళ్ళే ఏర్పాట్లను చేసుకోండి.
3 ప్రార్థన అనేది చాలా మందికి ఆసక్తికరమైన విషయం గనుక ఈ విధంగా అడగడం ద్వారా మీరు దానిని చర్చించవచ్చు:
◼ “ఆధునిక దిన జీవితంలో మనకు సమస్యలన్నీ ఎదురౌతుండగా ప్రార్థన మనకు నిజమైన సహాయంగా ఉండగలదని మీరు భావిస్తున్నారా? [ప్రతిస్పందన కోసం వేచి చూడండి.] దేవునికి ప్రార్థన చేయడం ద్వారా ఆయనకు చేరువైనట్లు, బైబిలు దేనిని వాగ్దానం చేసిందో ఆ అంతరంగ బలాన్నే అలా చేయడం తమకు ఇచ్చినట్లు కొందరు భావిస్తారు. [జ్ఞానము పుస్తకం 156వ పేజీ తీసి ఫిలి. 4:6, 7 చదవండి.] అయినప్పటికీ, ఒక వ్యక్తి తన ప్రార్థనలకు జవాబు లభించలేదని కొన్నిసార్లు భావించవచ్చు. ‘మీరెలా దేవునికి సన్నిహితులు కాగలరు’ అన్న విషయాన్ని ఈ అధ్యాయం చర్చిస్తుంది. [పుస్తకాన్ని ప్రతిపాదించండి] దేవునితో సంభాషణ అనేది ఒక వైపు నుండి మాత్రమే కాదు గనుక ఆయన చెప్పేదానిని మనమెలా వినగలం అని కూడా ఇది వివరిస్తుంది. నేను ఈ సారి వచ్చినప్పుడు మనం దానిని చర్చించుకోవచ్చు.”
4 బైబిలును గౌరవించే ప్రజలతో మాట్లాడేటప్పుడు, ఒక పఠనాన్ని ఆరంభించేందుకు మీరు సూటియైన పద్ధతిని ప్రయత్నించవచ్చు. మీ విషయంలో ఈ పద్ధతి ఫలవంతం కావచ్చు:
◼ “మేము ఉచిత బైబిలు పఠన కోర్సును ప్రతిపాదిస్తున్నాం. మీరు క్రితమెన్నడైనా బైబిలు కోర్సును చేశారా? [ప్రతిస్పందించనివ్వండి.] మేము ఉపయోగించే పఠన సహాయకాన్ని మీకు చూపిస్తాను.” జ్ఞానము అనే పుస్తకాన్ని చూపి, గృహస్థుడు విషయసూచికను చూడగల్గేలా 3వ పేజీని తెరిచి చూపించి, “ఈ విషయాలను గూర్చి బైబిలు ఏమి చెబుతుందనే దానిని మీరెన్నడైన ఆలోచించారా?” అని మీరడగండి. ఎక్కువ ఆసక్తి చూపించిన అధ్యాయాన్ని తీసి, ఉపశీర్షికలను చదవండి. మన పఠన కోర్సులో మనం ఈ సమాచారాన్ని ఎలా పరిశీలిస్తామో ప్రదర్శించి చూపించడానికి మీరు ఇష్టపడుతున్నారని వివరించండి. ఒక పఠనం మొదలైనా లేకపోయినా, ఆ పుస్తకాన్ని ప్రతిపాదించి, చదవమని గృహస్థున్ని ప్రోత్సహించండి.
5 నేడు చాలామంది ప్రజలు సత్యదేవుని గూర్చిన కచ్చితమైన జ్ఞానానికి ప్రతిస్పందిస్తున్నారు. (యెష. 2:2-4) యెహోవాను గూర్చి తెలుసుకొని, జీవానికి నడిపింపబడేందుకు మనకు సాధ్యమైనంత మందికి సహాయపడడం మన ఆధిక్యత.–1 తిమో. 2:4.