నిత్యజీవ నిరీక్షణను ఇతరుల్లో నాటండి
1 వృద్ధాప్యానికి ఎదిగే ప్రక్రియ వేగాన్ని తగ్గించడానికీ, తన జీవితాయుష్షును పెంచుకోవడానికీ గల మార్గాల్ని మానవుడు అన్వేషించినప్పటికీ, వృద్ధాప్యమూ మరణమూ ఇప్పటికీ అనివార్యమైనవిగానే ఉన్నాయి. మానవులు ఎందుకు వృద్ధాప్యానికి ఎదిగి మరణిస్తున్నారో, వృద్ధాప్యపు విధ్వంసక ఫలితాలు ఎలా తారుమారవుతాయో, మరణం ఎలా తుడిచివేయబడుతుందో బైబిలు వివరిస్తున్నందుకు మనమెంత కృతజ్ఞులమో గదా! నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంలో ఈ సత్యాలు ఒప్పింపచేసే రీతిలో అందించబడ్డాయి. పరదైసు పునరుద్ధరించబడే కాలం వద్దకు పాఠకుణ్ణి నడిపిస్తూ, జీవ మరణాల్ని గూర్చిన కలవరపర్చే ప్రశ్నలకు ఈ పుస్తకం స్పష్టంగా జవాబిస్తోంది.
2 మార్చిలో, మనం గృహ బైబిలు పఠనాల్ని ప్రారంభించే లక్ష్యంతో జ్ఞానము పుస్తకాన్ని ప్రతిపాదిస్తాం. (మత్త. 28:19, 20) తర్వాత రాజ్య సందేశంలో ఆసక్తిని కనుపర్చిన వారందరిని పునర్దర్శిస్తాం. ఈ విధంగా మనం ఇతరుల్లో నిత్యజీవ నిరీక్షణను నాటవచ్చు. (తీతు 1:1) దీన్ని నెరవేర్చేందుకు, క్రింద ఇవ్వబడిన సలహాలు సహాయకరంగా ఉన్నట్టు మీరు చూడవచ్చు.
3 మొదటిసారి సందర్శిస్తున్నప్పుడు, మీరీ ప్రశ్నను అడుగవచ్చు:
◼ “మానవులు ఎందుకు దీర్ఘాయుష్షు కొరకు పరితపిస్తారని మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] బౌద్ధమతస్థులూ, క్రైస్తవులూ, హిందువులూ, ముస్లిమ్లూ, మరి ఇతర మతస్థులూ మరణానంతర జీవితాన్ని గూర్చిన నిరీక్షణను కల్గివున్నారు.” జ్ఞానము పుస్తకాన్ని “మనమెందుకు వృద్ధులమై మరణిస్తున్నాము?” అనే పేరుగల 6 వ అధ్యాయంవైపుకి త్రిప్పి, 3వ పేరాను చదవండి. ఎత్తివ్రాయబడని లేఖనాలపై తర్కించండి. పేరా చివరలో ఉన్న రెండు ప్రశ్నల్ని సూచిస్తూ, తనకు తానుగా జవాబుల్ని కనుగొనడానికి గృహస్థుడు ఇష్టపడతాడేమో అడగండి. అలా చేయడానికి ఇష్టపడినట్లైతే, తర్వాత ఉన్న కొన్ని పేరాల్ని చర్చించండి. అలా ఒక పఠనం ప్రారంభించబడుతుంది! అలా కాకపోతే, ఆయనకు పుస్తకాన్నిచ్చి, జవాబుల్ని చర్చించేందుకు బహుశా ఒకటి రెండు రోజుల్లోపలే పునర్దర్శనం చేయడానికి ప్రణాళిక వేసుకోండి.
4 “జ్ఞానము” పుస్తకాన్ని అందించిన తర్వాత పునర్దర్శనం చేసినప్పుడు, మీరిలా చెప్పవచ్చు:
◼ “మరణాన్ని గూర్చి మనం క్రిందటిసారి చర్చించినప్పుడు జవాబివ్వకుండా వదిలిపెట్టిన రెండు ప్రశ్నల్ని పరిశీలించడానికి నేను మరలా తిరిగి వచ్చాను.” ఆ ప్రశ్నలను గృహస్థునికి జ్ఞాపకం చేయండి. తర్వాత 6వ అధ్యాయంలో ఉన్న “ఒక దుష్టమైన కుట్ర” అనే ఉపశీర్షిక క్రిందవున్న సమాచారాన్ని చర్చించండి. పరిస్థితుల్నిబట్టి, పఠనాన్ని కొనసాగించవచ్చు లేకపోతే, తర్వాతి పఠనానికి పునాదిని వేసేందుకు 7వ పేరా చివరలో ఉన్న ఆఖరి ప్రశ్నను ఉపయోగించండి. పునర్దర్శనం చేసేందుకు ఖచ్చితమైన ప్రణాళికల్ని వేసుకోండి. గృహస్థునికి హ్యాండ్బిల్లును ఇవ్వండి, సంఘ కూటాలు ఎలా జరుగుతాయో క్లుప్తంగా వర్ణించండి. ఆయన్ని హాజరుకమ్మని హృదయపూర్వకంగా ఆహ్వానించండి.
5 ఇంటింటి పరిచర్యలోనైనా లేక అనియత సాక్ష్యమిచ్చేటప్పుడైనా మీరిలా చెప్పడం ద్వారా మీ సంభాషణను ప్రారంభించవచ్చు:
◼ “మనకూ మన భూమికీ భవిష్యత్తులో ఏమి జరుగనుందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] బైబిలు ఆ భవిష్యత్తును ఒక్క మాటలో పరదైసు అని చెబుతోంది! ఆరంభంలో దేవుడు భూమిపైనున్న ఒక ప్రాంతాన్ని ఒక అందమైన పరదైసుగా చేసి, అందులో తాను సృజించిన మానవ జతను ఉంచాడని అది వివరిస్తుంది. వాళ్లు మొత్తం భూమిని మానవులతో నింపి, క్రమేణా దాన్ని పరదైసుగా మార్చాల్సి ఉండేది. అది ఎలా ఉండి ఉండాల్సిందనే దాన్ని గూర్చిన ఈ వర్ణనను గమనించండి.” జ్ఞానము పుస్తకాన్ని 8వ పేజీవైపుకు త్రిప్పి “పరదైసులో జీవితం” అనే ఉపశీర్షిక క్రిందవున్న 9వ పేరాను చదవండి. తర్వాత 10వ పేరాలో ఉన్న విషయాల్ని చర్చించి, ఉల్లేఖించబడిన యెష. 55:10, 11 వచనాలను చదవండి. పునరుద్ధరించబడిన పరదైసులో జీవితం ఎలా ఉంటుందనే దాన్ని గూర్చిన చర్చను కొనసాగిద్దామనీ, 11-16 పేరాలను కలిసి పరిశీలిద్దామనీ చెప్పండి. లేకపోతే వాటిని ఆ వ్యక్తినే స్వయంగా చదవమని ప్రోత్సహించి, మరలా కలసి, దాన్ని చర్చించడానికి ఏర్పాటు చేసుకోండి.
6 మొదట్లో పఠనాన్ని ఆరంభించకపోతే, పునర్దర్శనం చేసేటప్పుడు మీరిలా చెప్పడం ద్వారా ఆరంభించడానికి ప్రయత్నించవచ్చు:
◼ “మనం ఇంతకు మునుపు చర్చించినట్లుగానే, యావద్భూమీ పరదైసుగా మార్చబడడమనేది దేవుని సంకల్పమైవుంది. పరదైసు దేన్ని పోలివుంటుంది? అనే ప్రశ్నను అది లేవదీస్తుంది.” జ్ఞానము పుస్తకాన్ని 1వ అధ్యాయంవైపు త్రిప్పి “పునఃస్థాపిత పరదైసులో జీవితం” అనే ఉపశీర్షిక క్రిందవున్న 11-16 పేరాలను పఠించండి.” అటు తర్వాత 4-5 పేజీల్లో ఉన్న చిత్రాన్ని చూపించి, అలాంటి సుందరమైన పరిసరాలలో జీవించడానికి ఇష్టపడతాడేమో ఆ వ్యక్తిని అడగండి. ఆపై 10వ పేజీలో ఉన్న 17వ పేరాలోని మొదటి వాక్యాన్ని చదవండి. పరిస్థితులనుబట్టి, పఠనాన్ని కొనసాగించండి లేక పునరుద్ధరించబడిన పరదైసులో జీవించేందుకు ఒకరికి అవసరమైన వాటిని గురించి మళ్ళీ వచ్చినప్పుడు వివరిస్తామని చెప్పండి. హ్యాండ్బిల్లును ఇవ్వండి, ఏ యే వేళల్లో కూటాలు జరుగుతాయో వివరించి, రాజ్యమందిరంలో జరిగే కూటానికి హాజరయ్యేందుకు ఆ వ్యక్తిని హృదయపూర్వకంగా ఆహ్వానించండి.
7 దేవుడు వాగ్దానం చేసిన ‘నిత్య జీవాన్ని’ గురించి ఇతరులకు తెలియజేయడంలో ఉపయోగించేందుకు జ్ఞానము పుస్తకము ఒక శ్రేష్ఠమైన ఉపకరణమైవుంది. ప్రజలతో మీరు నిర్వహించే గృహ బైబిలు పఠనాలు, వారిలో “అబద్ధమాడనేరని” దేవునిచే ఇవ్వబడిన ఈ దివ్యమైన నిరీక్షణను నాటగలవు.