మనమా లక్ష్యాన్ని మళ్లీ సాధిస్తామా?—సహాయ పయినీర్ల కొరకు మరొక పిలుపు
1 మనమే లక్ష్యాన్ని మరోసారి సాధిస్తాము? మనం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ సమయంలో సహాయ పయినీరుసేవ చేస్తామా? ఫిబ్రవరి 1997 మనరాజ్య పరిచర్య అనుబంధ శీర్షిక “కావలెను—4,000 మంది సహాయ పయినీర్లు” అనే బోల్డు హెడ్డింగ్‌తో అందరి అవధానాన్నీ ఆకట్టుకుంది. మీరా పిలుపును గంభీరంగా తీసుకున్నారని మేము నమ్మకంగా ఉన్నాము. మేము మా సర్వే పూర్తి చేసినప్పుడు, మార్చి, ఏప్రిల్ లేక మే, ఈ మూడు నెలల్లోని కనీసం ఒక నెలలో దాదాపు 4,250 మంది ప్రచారకులు సహాయ పయినీర్లుగా సేవ చేశారనే విషయాన్ని తెలుసుకుని మేమెంతో ఆనందించాము. కేవలం 1997 ఏప్రిల్‌లోనే, 2,093 మంది సహాయ పయినీరుసేవలో భాగం వహించారు! ఆ సంఖ్యకు, ఆ నెలలో రిపోర్టు చేసిన 797 మంది క్రమ పయినీర్లనూ, 288 మంది ప్రత్యేక పయినీర్లనూ జత చేస్తే, 18 శాతం కంటే ఎక్కువమంది ప్రచారకులు పయినీరుసేవ చేసినట్లు మనం చూస్తాము. ఈ జ్ఞాపకార్థ సమయంలో మనం దాన్ని మళ్లీ సాధిస్తామా?
2 గత సంవత్సరం తమ ప్రాంతీయ సేవా కార్యకలాపాన్ని అధికం చేసుకునేందుకు అదనంగా కృషి చేసిన వారినందరినీ మేము హృదయపూర్వకంగా మెచ్చుకుంటున్నాము. మీరందరూ కూడా యెహోవా దేవుని ఎడలా, మీ తోటి వారి ఎడలాగల నిస్వార్థమైన ప్రేమ చేత ప్రేరేపించబడ్డారనే విషయం స్పష్టమౌతుంది. (లూకా 10:27; 2 పేతు. 1:5-8) జీవితంలోని విభిన్న పరిస్థితుల్లోని ప్రచారకులు సహాయ పయినీరుసేవలో భాగం వహించేందుకు తమ వ్యవహారాలను సవరించుకున్నారు. ఒక సంఘంలో, 51 మంది ప్రచారకులు కలిసి ఒకే నెలలో పయినీరుసేవ చేశారు, వారిలో సంఘ పెద్దల్లో అనేకమందితో సహా, 15 నెలల పాపవున్న తల్లీ, తాను పయినీరుసేవ చేసేందుకు వీలుగా తన ఉద్యోగాన్ని మానుకుని పార్ట్ టైమ్ ఉద్యోగాన్ని చూసుకున్న ఒక సహోదరీ, మరి మునుపెన్నడూ పయినీరుసేవ చేయని ఒక వృద్ధ సహోదరీ కూడా ఉన్నారు. ప్రాంతీయ పైవిచారణకర్త ఇలా వ్రాశాడు: “ప్రకటనాపనిలో ఎంతో అసాధారణమైన కృషి జరుగుతోంది. . . . ఇది పరిచర్య ప్రాంతంపై ప్రభావం చూపడమే కాక, సంఘాలు కూడా ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. ఒకరినొకరు మరింత ఎక్కువగా తెలుసుకోగలుగుతున్నందున, అలాగే పరిచర్యలో చక్కని ఫలితాలను చూడగలుగుతున్నందున సహోదరులు ఆనందిస్తున్నారు.”
3 యౌవనులు కూడా భాగం వహించారు. ఒక 13 సంవత్సరాల, బాప్తిస్మం తీసుకోని ప్రచారకురాలు యెహోవాకు తన సమర్పణను సూచించగల సమయం కొరకు ఎదురు చూస్తూ ఉండేది. ఫిబ్రవరిలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత, మార్చిలో సహాయ పయినీరుసేవ చేయాలన్న తన కోరికను గురించి ఆమె ఇలా వ్రాసింది: “నన్ను ఇప్పుడు ఏదీ ఆపలేదు గనుక, నేను వెంటనే నా దరఖాస్తు అందజేశాను. . . . పయినీరుసేవ చేయమని మీరు ప్రేమపూర్వకంగా ఆహ్వానించి ఉండకపోతే, మాకు లభించిన అనేక అద్భుతమైన అనుభవాలు మాకు దక్కి ఉండేవి కాదు. అలా ప్రతిస్పందించిన . . . వారిలో ఉండగలిగే ఆధిక్యతను నాకు ఇచ్చినందుకు యెహోవాకు నేనెంతో కృతజ్ఞురాలిని.” ఆమె మళ్లీ పయినీరుసేవ చేయాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకుంది.
4 గత మార్చిలో సహాయ పయినీరుసేవలో భాగం వహించిన 1,715 మందిలోనో లేక ఏప్రిల్‌లో భాగం వహించిన 2,093 మందిలోనో లేక మేలో భాగం వహించిన 1,523 మందిలోనో బహుశ మీరూ ఒకరై ఉండి ఉండవచ్చు. ఈ సంవత్సరం కూడా మీరా లక్ష్యాన్ని సాధిస్తారా? మీరు గత మార్చి, ఏప్రిల్, లేక మే నెలల్లో పయినీరుసేవ చేయలేక పోయి ఉంటే, ఈ సంవత్సరం చేయగలరా? భారత దేశంలోని ఏ ఒక నెలలోని సహాయ పయినీర్ల సంఖ్యకన్నా అత్యంత ఎక్కువైన ఏప్రిల్‌లో సహాయ పయినీరుసేవ చేసిన వారి సంఖ్య అయిన 2,093ను మనం అధిగమించగలమా?
5 ఏప్రిల్ మరియు మే నెలలపై అవధానముంచండి: ఈ సంవత్సరం జ్ఞాపకార్థ దినం ఏప్రిల్ 11 శనివారం వస్తుంది, అలా అది ఏప్రిల్‌ను పరిచర్యలో అత్యధిక సేవ చేసేందుకు అనుకూలమైనదిగా చేస్తుంది. (2 కొరిం. 5:14, 15) నెలలోని మొదటి 11 దినాల్లో, జ్ఞాపకార్థ కూటానికి వీలైనంత ఎక్కువమందిని ఆహ్వానించడంపై మనం అవధానాన్ని నిలుపుదాము. మీరు సహాయ పయినీరుసేవ చేయాలని పథకం వేసుకుంటే, మీరు ప్రారంభించాలని అనుకుంటున్న తేదీకి చాలా ముందే మీరు దయచేసి దరఖాస్తును ఇవ్వండి.—1 కొరిం. 14:40.
6 మే నెలలో ఐదు పూర్తి వారాంతాలు ఉంటాయి గనుక, ఉద్యోగం చేసే ప్రచారకులు కూడా ఆ నెలలో సహాయ పయినీరుసేవ చేయడం సులభంగా ఉంటుందని కనుగొనవచ్చు. మే నెలలో అనేకమంది పిల్లలకు పాఠశాల సెలవులు ఉంటాయి. ఐదు వారాంతాల్లోనూ, ప్రతి వారాంతంలో ప్రాంతీయ సేవలో పది గంటలు గడపటానికి పట్టిక వేసుకుంటే, మీరు చేయవలసిన 60 గంటల కొరకు మీరు నెలలో పది గంటలు సేవ చేసేందుకు మాత్రమే పట్టిక వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
7 ఏప్రిల్, మే రెండు నెలల్లోనూ, సాహిత్య అందింపుగా మనం కావలికోట, తేజరిల్లు! పత్రికల చందాలను ప్రతిపాదిస్తాము. మనం ముందుకొచ్చి పయినీరుసేవ చేసేందుకు ఇది మనలో ఎక్కువమందిని ప్రోత్సహించాలి. మనం అలాగని ఎందుకు అంటాము? పత్రికలను అందించడం చాలా సులభం, మరి పరిచర్యలో వాటితో పని చేయడం చాలా ఆనందకరంగా ఉంటుంది. సేవలోని అన్ని రంగాల్లో అంటే ఇంటింటి పరిచర్యలోనూ, దుఖాణాల వద్ద సాక్ష్యమిస్తున్నప్పుడూ, అలాగే వీధుల్లోనూ వాహనాలు నిలిపి ఉండే ప్రాంతాల్లోనూ పార్కుల్లోనూ ఉన్న వారిని కలుసుకునేందుకు వాటిని చక్కగా ఉపయోగించవచ్చు, అలాగే మరితర అనియత సందర్భాల్లోనూ వాటిని చక్కగా ఉపయోగించవచ్చు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా, కావలికోట మరియు తేజరిల్లు!లు రాజ్య సత్యాలను ఉన్నతపరుస్తాయి. దేవుని రాజ్యం పరిపాలిస్తోందని నిరూపిస్తూ బైబిలు ప్రవచనాల నెరవేర్పు వైపు అవధానాన్ని అవి మరల్చుతాయి. అవి ప్రజల నిజమైన అవసరతలతో అవగాహనా పూర్వకంగా వ్యవహరించడం ద్వారా పాఠకుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ అమూల్యమైన పత్రికల ద్వారా మన జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయో మనం ఆలోచిస్తే, ఏప్రిల్ మరియు మే నెలల్లో వాటిని వీలైనంత ఎక్కువగా పంచిపెట్టడంలో భాగం వహించేందుకు మనం ప్రేరేపించబడతాము.
8 ఈ పత్రికా ప్రభంజనానికి సిద్ధపడటంలో, “కావలికోట మరియు తేజరిల్లు!—సత్యాన్ని తెల్పే సమయోచిత పత్రికలు” (జనవరి 1, 1994, కావలికోట), “మన పత్రికల్ని బాగా ఉపయోగించండి” (జనవరి 1996 మనరాజ్య పరిచర్య), మరియు “మీ సొంత పత్రికా అందింపులను సిద్ధం చేసుకోండి” (అక్టోబరు 1996 మనరాజ్య పరిచర్య) అనే శీర్షికలను పునఃపరిశీలించడం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు.
9 పెద్దలు నాయకత్వం వహించారు: గత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పయినీరుసేవ చేస్తున్న అనేకమంది ప్రచారకులకు సహాయపడేందుకని, ఒక సంఘంలోని పెద్దలు, పూర్తి సంఘమంతటి కొరకు నెలలోని ఒక శనివారాన్ని సేవా కార్యకలాపం కొరకైన ప్రత్యేక దినంగా కేటాయించారు. వివిధ పద్ధతుల్లో సాక్ష్యమివ్వడంలో భాగం వహించేందుకు సంఘంలోని వారందరికీ అవకాశమిచ్చేందుకై, దినంలోని అనేక వేర్వేరు సమయాల్లో కలుసుకునేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయి. వ్యాపార స్థలాల్లో పరిచర్య చేయడం, వీధి సాక్ష్యమివ్వడం, ఇంటింట ప్రకటించడం, పునఃదర్శనాలు చేయడం, ఉత్తరాలు వ్రాయడం, మరియు టెలిఫోన్ ద్వారా సాక్ష్యమివ్వడం వాటిలో చేరి ఉన్నాయి. దినం మొత్తంలో 117 మంది ప్రచారకులు ప్రాంతీయ సేవలో భాగం వహించడం ద్వారా ఎంతో ఘననీయంగా ప్రతిస్పందించారు. వారంతా కలిసి పరిచర్యలో 521 గంటలు గడిపారు, 617 పత్రికలూ, బ్రొషూర్లూ మరియు పుస్తకాలూ పంచిపెట్టారు! ఆ శనివారం నాటి ఉత్సాహం ఆదివారం వరకూ కొనసాగింది, బహిరంగ కూటానికీ మరియు కావలికోట పఠనానికీ దాదాపు రికార్టు సంఖ్యలో హాజరయ్యారు.
10 ఏప్రిల్ మరియు మే నెలల్లోని ప్రతి సేవా కూటంలో, రాబోయే వారంలో ప్రాంతీయ సేవ కొరకైన కూటాలు ఎప్పుడు మరియు ఎక్కడ జరుగుతాయనే విషయాన్ని సంఘానికి జ్ఞాపకం చేయాలి, మామూలుగా పట్టిక వేయబడినవి మాత్రమే కాక అదనపు ఏర్పాట్లు చేయబడినప్పుడు అలా జ్ఞాపకం చేయడం ప్రాముఖ్యం. క్రమ పయినీర్లూ అలాగే సహాయ పయినీర్లుకాని ప్రచారకులూ, తమ పరిస్థితులు అనుమతించే కొలది ఈ గుంపు ఏర్పాట్లకు మద్దతును ఇవ్వవలసిందిగా ప్రోత్సహించబడుతున్నారు.
11 తరచుగా కవర్ చేయబడని ప్రాంతాల్లో పని చేయడానికి ఏర్పాట్లు చేసేందుకై, సేవా పైవిచారణకర్త టెరిటరీలను నియమించే సహోదరునితో సమావేశం కావలసిన అవసరముంటుంది. నాట్-ఎట్-హోమ్స్ ఎడలా, వీధుల్లోనూ దుకాణాల్లోనూ సాక్ష్యమిచ్చే విషయంలోనూ అత్యధిక శ్రద్ధ నివ్వవచ్చు. ఆ నెలల్లో పగటి వేళ ఎక్కువ ఉంటుంది గనుక, సాయంత్రం సాక్ష్యం ఇవ్వడాన్ని నొక్కిచెప్పవచ్చు. అధిక కార్యకలాపాన్ని అపేక్షిస్తూ, ఏప్రిల్ మరియు మే నెలల కొరకు తగినన్ని పత్రికలను ఆర్డరు చేయాలి.
12 అనేకమంది ప్రచారకులు యోగ్యులు కాగలరు: సహాయ పయినీరు దరఖాస్తుపైనున్న మొదటి వాక్యం ఇలా పేర్కొంటుంది: “యెహోవా ఎడల నాకుగల ప్రేమ మూలంగా, ఆయనను గురించీ ఆయన ప్రేమపూర్వక సంకల్పాలను గురించీ ఇతరులు తెలుసుకోవాలన్న నా కోరిక మూలంగా, సహాయ పయినీరుసేవ చేయడం ద్వారా ప్రాంతీయ సేవలో నేను అధికంగా భాగం వహించాలని కోరుకుంటున్నాను.” యెహోవాను ప్రేమించడమూ ఇతరులకు ఆధ్యాత్మికంగా సహాయం చేయడమూ మన సమర్పణకు మూల విషయాలు. (1 తిమో. 4:8, 10) సహాయ పయినీరుగా యోగ్యత పొందేందుకు, ఎవరైనా కూడా బాప్తిస్మం పొందిన, మంచి నైతిక ప్రమాణాలుగల, ఆ నెలలో పరిచర్యలో 60 గంటలు వెచ్చించగల స్థానంలో ఉన్న వ్యక్తులై ఉండాలి. మనమందరమూ మన పరిస్థితులను పరిశీలిస్తుండగా, మనలో మునుపెన్నడూ పయినీరుసేవ చేయని కొందరు ఈ సంవత్సరం ఏప్రిల్‌లో లేక మేలో పయినీరుసేవ చేసేందుకు ఎందుకు ప్రయత్నించకూడదు?
13 తమ వంటి పరిస్థితులలోని ఇతరులు పయినీరుసేవ చేయడానికి అప్లై చేయడాన్ని చూసినప్పుడు, తాము కూడా పయినీరుసేవ చేయగలమని సంఘాల్లోని అనేకులు గుర్తించవచ్చు. పాఠశాలకు వెళ్లే పిల్లలు, పెద్ద వయస్సు వారు, ఉద్యోగం చేసేవారు, పెద్దలూ పరిచర్య సేవకులతో సహా, ఇతరులు సహాయ పయినీరు నియామకాన్ని విజయవంతంగా నెరవేర్చగల్గారు. ఇద్దరు పిల్లల తల్లీ, ఉద్యోగం చేస్తున్న ఒక సహోదరి, ఒక నెలలో సహాయ పయినీరుసేవ చేసినప్పుడు పరిచర్యలో 60 గంటలు గడిపి, 108 పత్రికలను అందించి, 3 బైబిలు పఠనాలు ప్రారంభించింది. ఆమె అదెలా సాధించగలిగింది? ఆమె తన ఉద్యోగ స్థలానికి సమీపానున్న ప్రాంతాల్లో సాక్ష్యమిచ్చేందుకు తన మధ్యాహ్న భోజన సమయాన్ని ఉపయోగించుకుంది, ఉత్తరాలను వ్రాయడం ద్వారా సాక్ష్యమిచ్చింది, పార్కింగ్ స్థలాల్లో, వీధుల్లో సాక్ష్యమివ్వడంలో భాగం వహించింది. ఆమె ప్రతి వారం తనకు లభించే సెలవు దినాన్ని, సంఘంతో ప్రాంతీయ సేవలో భాగం వహించడం ద్వారా చక్కగా ఉపయోగించుకుంది. సహాయ పయినీరుసేవ చేయడం అందుకోలేని గమ్యమని ఆమె మొదట్లో అనుకున్నప్పటికీ, ఇతరుల ప్రోత్సాహమూ చక్కని పట్టికతో ఆమె అవాంతరాలను అధిగమించింది.
14 యేసు తన శిష్యులకు ఇలా అభయమిచ్చాడు: “నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” (మత్త. 11:30) ఆగస్టు 15, 1995 కావలికోటలోని ఒక ప్రోత్సాహకరమైన శీర్షికకున్న టైటిల్ అది. ఎంతో పని ఒత్తిడి ఉండే ఉద్యోగం చేస్తున్న సహోదరిని గురించి అది చెబుతుంది. తాను సహాయ పయినీరుసేవ చేయలేనని ఆమె అనుకుందా? లేదు. వాస్తవానికి, ఆమె ప్రతి నెలా సహాయ పయినీరుసేవ చేయగలిగింది. ఎందుకు? ఎందుకంటే పయినీరుసేవ తాను సమతుల్యతను కల్గివుండేందుకు సహాయపడిందని ఆమె భావించింది. ప్రజలు బైబిలు సత్యాలను నేర్చుకునేందుకు సహాయపడడం మరియు వారు తమ జీవితాలను దేవుని అంగీకారాన్ని పొందేలా మలుచుకోవడం చూడటం తన తీరికలేని జీవితంలో అతి గొప్ప ఆనందాన్ని తెచ్చింది.—సామె. 10:22.
15 పయినీరుసేవ చేసేందుకు ఎవరైనా చేయవలసి వచ్చే వ్యక్తిగత త్యాగాలూ, సర్దుబాట్లూ, వారు అనుభవించే దీవెనలతో పోల్చితే ఎంతో అల్పమైనవే. సహాయ పయినీరుసేవ చేసినప్పుడు తనకు లభించిన అనుభవాన్ని గురించి ఒక సహోదరి ఇలా వ్రాసింది: “నేను నా మనస్సును నా వ్యక్తిగత సంగతుల పైనుండి తొలగించి ఇతరులకు సహాయం చేయడంపై మరింత కేంద్రీకరించేందుకు ఇది నాకు సహాయం చేసింది. . . . పయినీరుసేవ చేయగలవారందరూ దాన్ని చేయమని నేను సిఫారసు చేస్తాను.”
16 దానికి మంచి పట్టిక అవసరం: ఈ అనుబంధ శీర్షిక చివరి పేజీలో, ఫిబ్రవరి 1997 మనరాజ్య పరిచర్యలో వచ్చిన అదే పట్టికను మళ్లీ ప్రచురించాము. వీటిలో ఒకటి బహుశ మీ పరిస్థితులకు సరిపోతుండవచ్చు. మీరు వాటిని పునఃపరిశీలిస్తుండగా, మీ మామూలు నెలసరి కార్యకలాపాలను ఒకసారి పరిగణించండి. మీ ఇంట్లోని ఏ పనులను మీ పయినీరుసేవ ప్రారంభించక ముందే ముగించవచ్చు లేక అది ముగిసే వరకు తాత్కాలికంగా పక్కన పెట్టవచ్చు? వినోదం, విశ్రాంతి, లేక కాలక్షేపం కొరకు మీరు వెచ్చించే సమయాన్ని తగ్గించవచ్చా? అవసరమైన 60 గంటలను ఒకేసారి పరిగణించే బదులు, మీ పట్టికను దినసరి కార్యక్రమం లేక వారపు కార్యక్రమం ఆధారంగా పట్టిక వేసుకోండి. సహాయ పయినీరుసేవ చేసేందుకు ఒక దినంలో కేవలం 2 గంటలు లేక వారంలో 15 గంటలు మాత్రమే అవసరమౌతాయి. శాంపిల్ పట్టిక వైపు చూడండి, పెన్సిల్ తీసుకుని, మీకూ మీ కుటుంబానికీ చక్కగా సరిపోయే వ్యక్తిగత సేవా పట్టికను వేసుకునేందుకు మీరేమి చేయగలరో గమనించండి.
17 పరిచర్య విషయమై గత సంవత్సరం, సంఘం చూపిన చక్కని ప్రతిస్పందనా, ఇచ్చిన అదనపు మద్దతూ, ఒక క్రమ పయినీరు ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి, ఆమె ఇలా వ్రాసింది: “సహాయ పయినీరుసేవకు మద్దతు ఇచ్చేందుకై అదనపు ప్రయత్నం చేయమని మీరు ప్రేమపూర్వకంగా ప్రోత్సహించినందుకు మీకు వందనాలు. . . . మీరు సలహా ఇచ్చిన పట్టికలు, మునుపెన్నడూ పయినీరుసేవ చేయని అనేకులు తాము కూడా పయినీరుసేవ చేయగలమనే సంగతిని గుర్తించేందుకు సహాయం చేశాయి. . . . యెహోవా సంస్థలో నేనూ భాగమై ఉండేందుకూ నమ్మకమైన వాడునూ బుద్ధిమంతుడునైన దాసుని ప్రేమపూర్వకమైన సంతోషకర నడిపింపును అనుకరించేందుకూ నేనెంతో ఆనందిస్తున్నాను.”
18 సామెతలు 21:5 మనకీ అభయాన్నిస్తోంది: “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు.” “నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును” అని సామెతలు 16:3 మనలను ప్రోత్సహిస్తోంది. అవును, ప్రార్థనా పూర్వకంగా యెహోవాను మన నిర్ణయాల్లో చేర్చడం ద్వారా, మనం విజయవంతమవ్వడానికై సహాయం నిమిత్తం ఆయనపై దృఢంగా ఆధారపడటం ద్వారా సహాయ పయినీరుసేవ చేసేందు కొరకైన మన పథకాల్లో మనం అనుకూల దృక్పథంతో ఉండగలం. ఒకటి లేక రెండు నెలలు పయినీరింగ్ చేసి మన పట్టిక ఎంత చక్కగా పని చేస్తుందో చూసిన తర్వాత, “తర్వాత తెలియజేసేంత వరకూ సహాయ పయినీరుసేవ కొనసాగించాలని మీరు కోరుకుంటున్నట్లైతే ఇక్కడ టిక్ చేయండి” అని, సహాయ పయినీరు దరఖాస్తు మీదున్న బాక్సుపై మనం టిక్ చేసేందుకు యోగ్యులం కాగలుగుతాం. ఏమైనప్పటికీ, ఐదు పూర్తి వారాంతాలుగల ఆగష్టులో సహాయ పయినీరుసేవ చేసేందుకు మనం ఎదురుచూడగలం, ఆగష్టులో మన సేవా సంవత్సరం ముగుస్తుంది గనుక, పరిచర్యలో అందరూ వీలైనంత సంపూర్ణంగా భాగం వహించగల్గేందుకు అందరూ సమిష్ఠిగా కృషి చేస్తారు.
19 యేసు ఇలా ప్రవచించాడు: “నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయు[ను].” (యోహా. 14:12) ఈ ప్రవచనం గొప్పగా నెరవేరుతున్నప్పుడు, దేవుని జత పని వారిగా సేవ చేయగలగటం మన ఆనందభరితమైన ఆధిక్యత. ఈ పని చేసేందుకు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ, సువార్త ప్రకటించడమనే ఈ పనిని మరెన్నటికంటే ఎక్కువ తీవ్రతతో చేయవలసిన సమయం ఇదే. (1 కొరిం. 3:9; కొలొ. 4:5) సహాయ పయినీరుసేవలో వీలైనంత తరచుగా భాగం వహించడం, రాజ్య ప్రచారకులుగా మన వంతు చేసేందుకు ఎంతో చక్కని మార్గం. ఈ జ్ఞాపకార్థ సమయంలో సహాయ పయినీర్ల నుండి ఎంత ఉదాత్తమైన రీతిలో స్తుతిగీతాలు వస్తాయో చూసేందుకు మేము ఆసక్తిని కలిగి ఉన్నాము. (కీర్తన 27:6) గత మార్చి, ఏప్రిల్, మే నెలల్లోని ఫలితాలను జ్ఞాపకం చేసుకుంటూ, మనమా లక్ష్యాన్ని మళ్లీ సాధిస్తామా? అని మేము ఆలోచిస్తున్నాము. మనం సాధిస్తామన్న నమ్మకం మాకుంది!
[3వ పేజీలోని బాక్సు]
మీరు సహాయ పయినీరుసేవ చేయగలరా?
“మీ వ్యక్తిగత పరిస్థితులు ఏమైనప్పటికీ, మీరు బాప్తిస్మం పొంది, మంచి నైతిక ప్రమాణాలను కలిగివుండి, ప్రాంతీయ పరిచర్యలో ఒక నెలలో 60 గంటలు వెచ్చించేలా ఏర్పాట్లు చేసుకోగలిగితే, మరియు మీరు ఒక నెల లేక ఎక్కువ నెలలు సహాయ పయినీరుగా సేవ చేయగలరని భావిస్తే, ఈ సేవాధిక్యత కొరకు మీరిచ్చే దరఖాస్తును సంఘ పెద్దలు తప్పకుండా పరిశీలిస్తారు.”—మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము, 113, 114 పేజీలు.
[6వ పేజీలోని బాక్సు]
సహాయ పయినీరు పట్టికలు
ప్రతి వారానికి 15 గంటల ప్రాంతీయ సేవను పట్టిక వేసుకునేందుకు శాంపిల్లు
ఉదయాలు—సోమవారం నుండి శనివారం వరకు
ఆదివారానికి బదులు మరే దినాన్నైనా ఉపయోగించుకోవచ్చు
దినం సమయం గంటలు
సోమవారం ఉదయం 2 1/2
మంగళవారం ఉదయం 2 1/2
బుధవారం ఉదయం 2 1/2
గురువారం ఉదయం 2 1/2
శుక్రవారం ఉదయం 2 1/2
శనివారం ఉదయం 2 1/2
త్తం గంటలు: 15
రెండు పూర్తి దినాలు
వారంలోని ఏవైనా రెండు దినాలను ఎంపిక చేసుకోవచ్చు
దినం సమయం గంటలు
బుధవారం పూర్తి దినం 7 1/2
శనివారం పూర్తి దినం 7 1/2
మొత్తం గంటలు: 15
రెండు సాయంత్రాలు మరియు వారాంతం
వారంలోని ఏవైనా రెండు దినాల సాయంత్రాలను ఎంపిక చేసుకోవచ్చు
దినం సమయం గంటలు
సోమవారం సాయంత్రం 1 1/2
బుధవారం సాయంత్రం 1 1/2
శనివారం పూర్తి దినం 8
ఆదివారం సగం దినం 4
మొత్తం గంటలు: 15
వారపు దిన మధ్యాహ్నాలు మరియు శనివారం
ఆదివారానికి బదులుగా మరే ఇతర దినాన్నైనా ఉపయోగించుకోవచ్చు
దినం సమయం గంటలు
సోమవారం మధ్యాహ్నం 2
మంగళవారం మధ్యాహ్నం 2
బుధవారం మధ్యాహ్నం 2
గురువారం మధ్యాహ్నం 2
శుక్రవారం మధ్యాహ్నం 2
శనివారం పూర్తి దినం 5
మొత్తం గంటలు: 15
నా వ్యక్తిగత సేవా పట్టిక
ఒక్కోసారి ఎన్ని గంటలు సేవ చేస్తారో తీర్మానించుకోండి
దినం సమయం గంటలు
సోమవారం
మంగళవారం
బుధవారం
గురువారం
శుక్రవారం
శనివారం
ఆదివారం
మొత్తం గంటలు: 15