చేపవిందుల కొరకు గ్రద్దలు పయనించే స్థలం
అవి వేల సంఖ్యలో, విందు కొరకు చక్కగా అలంకరించుకొని అలాస్కా అంతటి నుండి, బ్రిటిష్ కొలంబియా మరియు వాషింగ్‌టన్ రాష్ట్రమంత దూరం నుండి ఎగిరి వస్తాయి. వాటి తెల్లని తలలు, అవి క్రిందికి దిగుతుండగా విడివడి, చూడముచ్చటగా ఉండే తెల్లని ఈకలుగల తోకలున్న ఈ పక్షులు ఎంతో విశేషమైనవి, ఎంతో ముగ్ధుల్ని చేస్తాయి. ఇవి సగటున ఆరు కిలోల బరువుండి, ముదురు గోధుమ రంగు శరీరాలు కల్గి, ఆడ పక్షులు మగ పక్షులకంటే కొంచెం పెద్దగా ఉండి, 1.8 నుండి 2.4 మీటర్ల విస్తీర్ణంలో రెక్కలు చాపుతూ, గంటకు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి—అయితే ఒక కిలోమీటరు దూరంలోవున్న చేప వాటి దీర్ఘ దృష్టికి కనిపిస్తే, గంటకు 160 కిలోమీటర్ల వేగంతో క్రిందకు దిగి దాన్ని తీసుకుని పోగలవు!
అయితే, చిల్కాట్ నదివద్ద జరిగే వాటి విందుకు మాత్రం అలాంటి విశేషమైన విహంగ దృశ్యాలు అవసరం లేదు. వాటి సాల్మన్ చేపల భోజనం ఎక్కడికీ పారిపోవడం లేదు. కేవలం తాము మ్రింగి వేయబడటానికి ఎదురు చూస్తూ, ఆ చేపలు వాటి ఎదుట పుష్కలంగా ఉన్నాయి. ఈ సంబరాలన్నీ కూడా, “ప్రపంచంలోకల్లా అతి పెద్ద గ్రద్దల సముదాయాన్ని, వాటి అరుదైన నివాస స్థలాన్ని పరిరక్షించి పెంపొందింపజేయాలని” అలాస్కా రాష్ట్రం 1982లో రూపొందించిన అలాస్కా చిల్కాట్ బట్టతల గ్రద్దల సంరక్షణ ప్రాంతం వాటి కొరకు ఈ ఏర్పాట్లు చేసింది.
ఆ సంరక్షణ ప్రాంతం చిల్కాట్, క్లెహెనీ మరియు సిర్‌కూ నదుల యొక్క 48,000 ఎకరాల నదీ ప్రవాహ ప్రాంతం వరకు వ్యాపించి ఉంది, గ్రద్దల నివాసానికి ప్రాముఖ్యమైన ప్రాంతాలు మాత్రమే దానిలో చేరివున్నాయి. వేలకొలది గ్రద్దల సముదాయం ఉండే ప్రత్యేకమైన ప్రాంతం, వాటిని చూసేందుకు సందర్శకులు పోగయ్యే స్థలం, హెయిన్స్ మరియు క్లుక్‌వాన్ పట్టణాల మధ్యనున్న రహదారిని ఆనుకొనివున్న చిల్కాట్ నదికి ఎనిమిది కిలోమీటర్ల పొడుగునా ఉండే ప్రాంతమే.
ఈ ఎనిమిది కిలోమీటర్ల పొడవున్న నది, సాల్మన్ చేపలు పెట్టిన గ్రుడ్లతో గ్రద్దలకు ఎలా విందు చేయగలుగుతుందో, “అలాస్కా చిల్కాట్ బట్టతల గ్రద్దల సంరక్షణ ప్రాంతం” అనే పేరుగల ఒక ప్రభుత్వ కరపత్రం తెలియజేస్తుంది.
“చలితో గడ్డకట్టే నెలల్లో కూడా చిల్కాట్ నదిపై ఎనిమిది కిలోమీటర్ల వరకు గడ్డకట్టకుండా ఉండే నీటికి కారణమైన సహజ అద్భుతం, ‘అలూవియల్ ఫాన్ జలాశయం’ అని పిలువబడుతుంది. సిర్‌కూ, క్లెహెనీ మరియు చిల్కాట్ నదులు కలిసే స్థలంలో గులకరాళ్లు, పెద్ద రాళ్లు, ఇసుక, హిమఖండాల చెత్తా మొదలైనవి చేరిన త్రికోణాకారంలోవుండే సిర్‌కూ ఫాన్ ఓ పెద్ద జలాశయంలా పని చేస్తుంది.”
సాధారణంగా, ఒక నది మరో జలాశయంలోకి ప్రవేశించే సమయంలో దాని తగ్గిన వేగాన్ని బట్టి డెల్టా రూపొందుతుంది, కాని అక్కడ జలాశయం ఏది మిగలకుండా మష్టు చేరుతుంది. అయితే, సిర్‌కూ నది చిల్కాట్ నదిని కలిసే స్థలంలో, పొరల వరుసలో క్రమభంగం అవుతుంది మరియు సముద్ర మట్టానికి 230 మీటర్ల దిగువకంటే లోతున పెద్ద పల్లం కావడానికి శీతలీకరణ ప్రక్రియ కారణమౌతుంది. హిమఖండాలు కరిగినప్పుడు, చెత్తా చెదారం వెనుక మిగిలిపోతుంది, చివరకు పల్లంలో అడుగుభాగం నుండి 230 మీటర్ల దట్టమైన, విడివిడిగా రంధ్రాలతో కూడిన మట్టి ఏర్పడేంత వరకు, నది ఇసుకను గుళక రాళ్లను చేరుస్తుంది.
వెచ్చని వసంత కాలం, వేసవి కాలం మరియు ఆకులు రాలే కాలం తొలిభాగంలో మంచు నుండి వచ్చే నీరు మరియు కరిగిన హిమం అలూవియల్ ఫాన్‌లోకి పారుతుందని వృత్తాంతం చూపుతుంది. త్వరగా బయటికి ప్రవహించగలిగేటంత కంటే ఎక్కువ నీరు ఫాన్‌లోకి ప్రవహిస్తూ, ఒక పెద్ద జలాశయాన్ని సృష్టిస్తుంది. గ్రద్దల సంరక్షణ ప్రాంతం యొక్క కరపత్రం ఇంకా ఇలా చెబుతుంది: “చలికాలం వచ్చినప్పుడు, చల్లని వాతావరణం ఏర్పడడంతో చుట్టుప్రక్కలనున్న నీరు గడ్డ కడుతుంది. అయితే, ఈ పెద్ద జలాశయంలోవున్న నీరు చుట్టుప్రక్కలనున్న నీటికంటే 5 నుండి 10 డిగ్రీల సెల్సియస్‌పైనే ఉండిపోతుంది. ఈ వెచ్చని నీరు చిల్కాట్ నదిలోకి ‘వడగట్టబడి’ గడ్డకట్టకుండా దాన్ని కాపాడుతుంది.
“వీటిలో మరియు సమీపంలోవున్న ఇతర ఏరుల్లోను ఉపనదుల్లోను సాల్మన్ చేపల్లోని ఐదు జాతులు గ్రుడ్లు పెడతాయి. వేసవికాలంలో సాల్మన్ చేపలు సమూహంగా కూడి గ్రుడ్లు పెట్టడం ప్రారంభించి, ఆకులు రాలేకాలం చివరి భాగం లేక తొలి శీతాకాలం వరకు కొనసాగుతుంది. గ్రుడ్లు పెట్టిన తర్వాత కొంతకాలానికి సాల్మన్ చేపలు మరణిస్తాయి, వాటి శవాలు గ్రద్దలకు పెద్ద మొత్తంలో ఆహారాన్ని అందజేస్తాయి.”
సాల్మన్ చేపల విందు అక్టోబరులో ప్రారంభమై ఫిబ్రవరిలో ముగుస్తుంది, ఆ తర్వాత వెంటనే వేలాది గ్రద్దలు చుట్టుప్రక్కల గ్రామాలకు చెదరిపోవడం ప్రారంభిస్తాయి. అయితే, ప్రిసర్వ్ 200 నుండి 400 గ్రద్దలకు సంవత్సరమంతా నివాసంగా ఉంటుంది. అవి తాము పట్టుకోగల చేపలకు తోడుగా, నీటికోళ్లను చిన్న జంతువులను కాకులను కూడా తింటాయి.
ఉత్తేజపూరితమైన జతకట్టడం, నిరంతరం నిలిచే “వివాహాలు”
అవి జీవితాంతం కలిసివుండడానికి జతకడతాయి—అవి 40 సంవత్సరాల వయస్సు వరకు బ్రతుకుతాయి—కాని సాధారణంగా కేవలం గూడు కట్టుకొనే కాలంలోనే అవి కలిసి ఉంటాయి. గ్రద్దలు—అలాస్కా చిల్కాట్ బట్టతల గ్రద్దల సంరక్షణ ప్రాంతం యొక్క ఫోల్డర్ ప్రకారం, జతకట్టే ప్రవర్తన ఏప్రిల్‌లో ప్రారంభమౌతుంది, అందులో “గ్రద్దలు ఒకదాని గోర్లు ఒకటి పట్టుకొని ఎగురుతూ చేసే జతకట్టే విన్యాసాలు, గాలిలో పల్టీలు కొట్టడం చేరివుంటాయి.” అదీ, మళ్లీ చేతులు పట్టుకోవడం కూడానా? అతిగా ప్రేమించుకుంటున్నట్లు అనిపిస్తుంది!
సంరక్షణ ప్రాంతంలో 94 గూళ్లున్నట్లు గమనించడం జరిగింది. 34 లేక 35 రోజుల పొదిగే కాలం తర్వాత మే చివరిబాగం నుండి జూన్ తొలిభాగం మధ్యలో సాధారణంగా ఒకటి నుండి మూడు గ్రుడ్లు పొదుగబడి పిల్లలు బయటకొస్తాయి. చిన్న పక్షులు సెప్టెంబరు కల్లా గూటిని విడిచిపెడతాయి, కాని అవి గోధుమవర్ణం మచ్చలు, తెల్లని ఈకలు కలిగివుంటాయి. అవి నాలుగు లేక ఐదు సంవత్సరాల వయస్సుకు చేరే వరకు వాటికి చక్కని తెల్లని తలలు, తోకలు రావు!
ఉనికిలో ఉండడానికి గ్రద్దలు చేసే పోరాటం యొక్క పూర్వరంగం గురించి కూడా కొంత తెలియజేస్తూ, సంరక్షణ ప్రాంతంలో సురక్షితంగా ఎలా ఆనందించవచ్చనేదాని గురించి సందర్శకులకు ఫోల్డర్ ఇలా సలహా ఇస్తుంది:
“అలాస్కా చిల్కాట్ బట్టతల గ్రద్దల సంరక్షణ ప్రాంతంలో, వాటి రక్షణ కొరకు 48,000 ఎకారాలు కేటాయించబడ్డాయి. కాని గ్రద్దలు ఎల్లప్పుడూ రక్షించబడడం లేదు; ఒకప్పుడు అవి, దుష్టమృగాల నాశనాన్ని ప్రోత్సహించడానికి ఇవ్వబడే పారితోషికం కొరకు వేటాడే వారి దాడికి గురయ్యేవి. సజీవమైన సాల్మన్ చేపలు మరియు చిన్న జంతువుల ఎడల గ్రద్దలకున్న అమితమైన మోజును గూర్చిన నివేదిక ఆధారంగా, 1917లో అలాస్కా రాజ్యాంగ చట్టం గ్రద్దలను వేటాడేవారికి పారితోషికం లభించేలా ఏర్పాటు చేసింది. ఒక జత గోర్లకు ఇవ్వబడే ఒక డాలరును (ఆ తర్వాత అది రెండు డాలర్లకు పెంచబడింది) సైనికుల చాలీచాలని జీతంతో జతచేసుకోవడాన్ని గూర్చిన కథలను హెయిన్స్‌లోని విలియమ్ కోటకు చెందిన మాజీ సైనికుడు హెచ్. సీవార్డ్ చెబుతాడు.
“సాల్మన్ చేపలకు గ్రద్దలు చేస్తున్న హాని కేవలం ఎక్కువ చేసి చెప్పబడిందని తర్వాత జరిగిన పరిశోధనలవల్ల తెలిసింది, వాటిని చంపినందుకు పారితోషికం ఇచ్చే పద్ధతి 1953లో నిషేధించబడింది. ఆ సమయానికల్లా, పారితోషికం కొరకు 1,28,000 గ్రద్దలు కాల్చివేయబడ్డాయి. 1940వ దశాబ్ద కాలంలో, అంటే పారితోషికం ఇచ్చే పద్ధతి ఇంకా అమలులో ఉన్నప్పుడు, ఆగ్నేయ అలాస్కా యొక్క బట్టతల గ్రద్దల సంఖ్య 1970వ దశాబ్దంలో దానికి సగం ఉండిందని అంచనా వేయబడింది.
“1959లో అలాస్కా ఒక రాష్ట్రమైనప్పుడు, అలాస్కాలోని బట్టతల గ్రద్దలు 1940 బట్టతల గ్రద్దల చట్టం యొక్క సమాఖ్య భద్రత క్రిందికి వచ్చింది. గ్రద్దను చంపడం సంయుక్త అపరాధం, ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్ప, సజీవమైన లేదా మృత గ్రద్దను లేక వాటి భాగాలను (ఈకలతో సహా!) ఉంచుకోవడం చట్టవ్యతిరేకం.
“అలాస్కా రాష్ట్ర చట్టం 1972లో, ఎక్కువగా గ్రద్దల సముదాయానికి భద్రత కలిగించడానికి అలాస్కా యొక్క చేప మరియు ఆటల విభాగించే నడిపించబడే చిల్కాట్ రివర్ క్రిటికల్ హాబిటాట్ ఏరియా అనే పేరుగల ప్రాంతాన్ని స్థాపించింది. గ్రద్దలనేకం భద్రత లేకుండానే ఉండిపోయాయి, వాతావరణ నిపుణులకు మరియు అభివృద్ధిని అపేక్షించే శక్తులకు మధ్య చిల్కాట్ లోయలో భూమిని ఉపయోగించుకోవడమనే అంశాలపై దీర్ఘమైన, తరచూ కఠినమైన పోరాటం జరుగుతూనే ఉంది. నేషనల్ అడుబాన్ సంస్థ మరియు రాష్ట్ర ఆర్థిక సహాయాన్ని పొందిన హెయిన్స్/క్లుక్‌వాన్ రిసోర్స్ అధ్యయనాల తీవ్రమైన పఠనం తర్వాత చెట్లు నరికేవాళ్లు, మత్స్యకారులు, వాతావరణ నిపుణులు, వ్యాపారస్థులు, స్థానిక రాజకీయవేత్తలు చివరికి ఒక ఒప్పందానికి వచ్చారు. 48,000 ఎకారాల అలాస్కా చిల్కాట్ బట్టతల గ్రద్దల సంరక్షణ ప్రాంతాన్ని సృష్టించడం ద్వారా 1982లో రాష్ట్ర చట్టం ఆ ఒప్పందాన్ని ఆచరణలో పెట్టింది.
“సంరక్షణ ప్రాంతంలో చెట్లునరకడం లేక గనులు త్రవ్వడం అనుమతించబడలేదు, కాని నేలను సాంప్రదాయబద్ధంగా ఉపయోగించడం అంటే పళ్లు ఏరుకోవడం, చేపలు పట్టడం, వేటాడం వంటివి కొనసాగించవచ్చు. స్థానిక నివాసులు, రాష్ట్ర అధికారులు, ఒక జీవ శాస్త్రవేత్త మొదలైనవారితో రూపొందించబడిన సలహా బోర్డు యొక్క పన్నెండుమంది సభ్యుల సహాయంతో అలాస్కా డివిజన్ ఆఫ్ పార్క్స్ చేత సంరక్షణ ప్రాంతం నిర్వహించబడుతోంది.
“పర్యావరణాన్ని పాడుచేయకుండా లోయ యొక్క సహజ వనరులను ఎలా ఉపయోగించుకోవాలన్నది తీరని ప్రశ్నే, భూమి వాడకం అంశాలు చిల్కాట్ లోయలో ఇప్పటికీ వివాదం రేపవచ్చు. కాని గ్రద్దల రక్షణార్థం ఒక స్థానిక పరిష్కారం కనుగొనబడినందుకు స్థానిక నివాసులు గర్విస్తున్నారు.”
సందర్శకులు గ్రద్దలను చూడగల ముఖ్య స్థలం హెయిన్స్ రహదారి వెంబడి ఉంది, అది చిల్కాట్ నదికి సమాంతరంగా ఉంటుంది, దీని కొరకు స్థాపించబడిన ఎత్తైన స్థలాలున్నాయి.
[15వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
చిల్కాట్ నది చిల్కూట్ నది
క్లెహెనీ నది క్లుక్‌వాన్
గ్రద్దలను చూసే స్థలం
(అలూవియల్ ఫాన్)
▴
▴
హెయిన్స్ రహదారి
సిర్‌కూ నది ▾ చిల్కాట్ సరస్సు
చిల్కూట్ సరస్సు ▾
చిల్కాట్ నది ▾ లుటాక్ ప్రవేశద్వారం
టాకిన్ నది ▾
హెయిన్స్
[క్రెడిట్ లైను]
Mountain High Maps™ copyright © 1993 Digital Wisdom, Inc.
[Picture Credit Line on page 15]
Bald eagles on pages 15-18: Alaska Division of Tourism