పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగరడం
నాజీ కాన్‌సెన్‌ట్రేషన్ క్యాంపుల్లో ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవించిన తరువాత ఒక వ్యక్తి ఎలా భావిస్తున్నాడు? అధైర్యమా? ద్వేషమా? ప్రతికారభావమా?
ఒకవేళ ఆయన భావన వింతగా అనిపించవచ్చు, అయినప్పటికీ అలాంటి ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు: “నేనెన్నడూ ఆశించనంతగా నా జీవితం మరింత మెరుగుపడింది.” ఆయన ఆ విధంగా ఎందుకు భావించాడు? ఆయన ఈ విధంగా వివరించాడు: “అత్యున్నతుని రెక్కల క్రింద అభయాన్ని కనుగొన్నాను, ‘యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు . . . సొమ్మసిల్లక నడిచిపోవుదురు’ అని యెషయా చెప్పిన మాటల నెరవేర్పు నా అనుభవంలోకి వచ్చింది.”—యెషయా 40:31.
మనం ఊహించగలిగినంత అత్యంత కఠోరంగా వ్యవహరించబడి, శరీరమంతా హూనమయ్యేలా కొట్టబడిన ఈ క్రైస్తవుడు అలంకారికమైన విధంలో పైకెగిరే స్ఫూర్తిని, నాజీ క్రూరత్వం గెలవలేని స్ఫూర్తిని కలిగివున్నాడు. దావీదువలె దేవుని “రెక్కల” నీడలో అభయాన్ని ఆయన కనుగొన్నాడు. (కీర్తన 57:1) ఆకాశంలో ఎత్తుగా ఎగిరే గ్రద్ద బలంతో తన ఆత్మీయ బలాన్ని పోల్చుకున్న యెషయా ప్రవక్త ఉపయోగించిన ఉపమాలంకారాన్ని ఈ క్రైస్తవుడు తీసుకున్నాడు.
సమస్యలతో కృంగిపోయినట్లు మీరెప్పుడైనా భావిస్తారా? “పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురు”టకు అత్యున్నతుని హస్తం క్రింద ఆశ్రయాన్ని పొందడానికి మీరు కూడా నిస్సందేహంగా ఇష్టపడతారు. ఇదెలా సాధ్యమో అర్థం చేసుకునేందుకు, లేఖనాల్లో అలంకారిక అర్థంలో తరచూ ఉపయోగించబడిన గ్రద్ద గురించి కొంత తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.
గ్రద్ద పతాకం క్రింద
ప్రాచీన కాల ప్రజలు గమనించిన పక్షులన్నింటిలోకెల్లా, శక్తినిబట్టి మరియు అద్భుతమైన కంటిచూపునుబట్టి బహుశ గ్రద్దే ఎక్కువగా మెచ్చుకోబడింది. బబులోను, పారసీక మరియు రోమా సైన్యాలతో సహా అనేక ప్రాచీన సైన్యాలు గ్రద్ద పతాకం క్రింద కవాతు చేశాయి. గొప్ప కోరెషు సైన్యం వీటిలో ఒకటి. ఈ పారసీక రాజు బబులోను సామ్రాజ్యాన్ని మ్రింగివేసేందుకు తూర్పు నుండి వస్తున్న వేటాడే పక్షివలె ఉంటాడని బైబిలు ప్రవచించింది. (యెషయా 45:1; 46:11) ఈ ప్రవచనం వ్రాయబడిన రెండువందల సంవత్సరాల తర్వాత, తమ పతాకంపై గ్రద్ద చిహ్నంగల కోరెషు సైన్యాలు గ్రద్ద తన ఎరపై దూకి పట్టుకున్నట్లు బబులోను నగరాన్ని అకస్మాత్తుగా ఆక్రమించాయి.
ఆ తరువాతి కాలంలో, షార్లమేన్, నెపోలియన్ వంటి రణధీరులు మరియు అమెరికా, జర్మనీవంటి దేశాలు కూడా గ్రద్దను తమ చిహ్నంగా ఎంచుకోవడం జరిగింది. గ్రద్దల ప్రతిమలను లేక మరే ప్రాణి ప్రతిమలను గానీ ఆరాధించకూడదని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించబడింది. (నిర్గమకాండము 20:4, 5) అయితే, తమ సందేశాన్ని వివరించేందుకు బైబిలు రచయితలు గ్రద్ద లక్షణాలను ఉదాహరించారు. అలా, లేఖనాల్లో చాలా తరచూ పేర్కొనబడిన గ్రద్ద జ్ఞానం, దైవిక సంరక్షణ మరియు వేగం వంటి విషయాలను సూచించేందుకు ఉపయోగించబడింది.
గ్రద్ద కన్ను
గ్రద్ద సూక్ష్మ దృష్టి సామెతగా ఎప్పుడూ చెప్పబడుతుంది. సువర్ణ గ్రద్ద ఐదు కిలోగ్రాములకన్నా ఎక్కువ బరువుండకపోయినా, దాని కన్ను నిజానికి మానవుని కంటికన్నా పెద్దది, దాని కంటి చూపు చాలా సూక్ష్మమైనది. తన ఆహారం కోసం వెదుక్కునే గ్రద్ద సామర్థ్యాన్ని గూర్చి యోబుకు వివరిస్తూ యెహోవా స్వయంగా ఇలా చెప్పాడు: “దాని కన్నులు . . . దూరమునుండి కనిపెట్టును.” (యోబు 39:27, 29) అలస్ పార్మలీ ఆల్ ద బర్డ్స్ ఆఫ్ ద బైబిల్ అనే తన పుస్తకంలో, “ఒకసారి ఒక గ్రద్ద చెరువులో తేలుతున్న చచ్చిన చేపను ఐదు కిలోమీటర్ల దూరం నుండి కనిపెట్టి, కచ్చితంగా ఆ స్థలంలోకి నేరుగా రివ్వున దూకింది. మానవుని కన్నా చాలా దూరం నుండే ఒక చిన్న వస్తువును చూడగల్గడమే కాక, అది ప్రయాణం చేస్తూనే మూడు మైళ్ళ నుండే ఆ చేపపై దృష్టిని నిలకడగా పెట్టింది” అని నివేదిస్తుంది.
గ్రద్దకు సూక్ష్మ దృష్టి ఉన్నందువల్లే, యెహోవా యొక్క ప్రముఖ గుణాల్లో ఒకటైన బుద్ధికి తగిన ప్రతీక అయ్యింది. (యెహెజ్కేలు 1:10; ప్రకటన 4:7 పోల్చండి.) ఎందుకలా? బుద్ధిలో మనం తీసుకునే ఏ చర్యవల్లనైనా కలిగే పర్యవసానాలను ముందుగా చూడడం ఇమిడి ఉంది. (సామెతలు 22:3) యేసు ఉపమానంలో, తుపాను రాగల సాధ్యతను ముందుగా కనిపెట్టి, బండ మీద ఇల్లు కట్టిన వివేచనగల మనిషివలె, దూరం నుండే చూసే తన సామర్థ్యంతో గ్రద్ద దూరం నుండే ప్రమాదాన్ని పసికట్టి, ముందు జాగ్రత్తలు తీసుకోగలదు. (మత్తయి 7:24, 25) ఆసక్తికరంగా, స్పానిష్ భాషలో ఎవరినైనా గ్రద్దతో పోల్చుతున్నారంటే, అతనికి అంతర్దృష్టి లేదా వివేచన ఉందని భావం.
గ్రద్దను దగ్గరి నుండి చూసే అవకాశం మీకెప్పుడైనా లభిస్తే, అది తన కళ్ళను ఎలా ఉపయోగిస్తుందో గమనించండి. అది మిమ్మల్ని పైపైన మాత్రమే చూడదు; బదులుగా, మీరెలా ఉంటారు అనే దానిని గూర్చిన ప్రతి వివరాన్ని పరిశీలిస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే, బుద్ధిగల ఒక వ్యక్తి తన సహజ జ్ఞానంపై లేక తన భావాలపై ఆధారపడక, విషయాన్ని జాగ్రత్తగా విశ్లేషిస్తాడు. (సామెతలు 28:26) గ్రద్ద సూక్ష్మ దృష్టి దానిని దైవిక గుణమైన జ్ఞానానికి ప్రతీకగా చేస్తుండగా, అది అద్భుతంగా ఎగరడాన్ని గూర్చి కూడా బైబిలు రచయితలు అలంకారికంగా ఉపయోగించారు.
“అంతరిక్షమున పక్షిరాజు జాడ”
“అంతరిక్షమున పక్షిరాజు జాడ” దాని వేగాన్ని, నిర్దిష్ట మార్గమనేది లేకుండా, జాడ దొరకని రీతిలో అనాయాసంగా ఎగిరిపోవడాన్ని సూచిస్తుంది. (సామెతలు 30:18) విలాపవాక్యములు 4:19 నందు, “మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్న వడిగలవారు. పర్వతములమీద వారు మమ్మును తరుముదురు” అని బబులోను సైనికులు వర్ణించబడిన చోట, గ్రద్ద వేగాన్ని గూర్చి పరోక్షంగా సూచించబడింది. గ్రద్ద తన ఎర పై భాగం నుండి గుండ్రంగా తిరుగుతూ తన రెక్కలను ఒక కోణంలోకి చాచి సూటిగా దూకుతుంది, కొన్ని నివేదికల ప్రకారం ఆ సమయంలో అది గంటకు 130 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుంది. ముఖ్యంగా సైన్యముల విషయంలో లేఖనాలు వేగానికి పర్యాయపదంగా గ్రద్దను ఉపయోగించడంలో ఆశ్చర్యం లేదు.—2 సమూయేలు 1:23; యిర్మీయా 4:13; 49:22.
మరొకవైపు, గ్రద్ద అనాయాసంగానే ఎగరడాన్ని గూర్చి యెషయా సూచిస్తున్నాడు. “యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.” (యెషయా 40:31) గ్రద్ద తేలికగా ఎగరడానికిగల రహస్యమేమిటి? ఉష్ణవాయువులను, లేదా పైకెగసే వేడి గాలి కెరటాలను ఉపయోగిస్తుంది కనుక, పైకి ఎగరడానికి గ్రద్ద శ్రమపడనవసరం లేదు. ఉష్ణవాయువులు కనిపించవు కాని, గ్రద్ద దానిని కనుగొనడంలో నేర్పు గలది. ఒకసారి ఉష్ణవాయువును కనుగొన్నాక, గ్రద్దను పైపైకి తీసుకు వెళ్ళే ఆ వేడి తరంగంలో అది తన రెక్కలను, తోకను విప్పి గుండ్రంగా తిరుగుతుంది. కావలసినంత ఎత్తుకు చేరుకున్నాక, అది తరువాయి ఉష్ణవాయువుకు నెమ్మదిగా వెళ్తుంది, అక్కడ ఆ ప్రక్రియ పునరావృతం చేయబడుతుంది. ఈ విధంగా, గ్రద్ద శక్తిని చాలా తక్కువగా వినియోగిస్తూ గంటల తరబడి ఎత్తులో ఉండగలుగుతుంది.
ఇశ్రాయేలులో, ముఖ్యంగా ఎర్రసముద్ర తీరప్రాంతాల్లో ఉన్న ఎజియొన్-గిబర్ నుండి ఉత్తరాన దాన్ వరకు వ్యాపించి ఉన్న రిఫ్ట్ వాలీలో గ్రద్దలు ఉండడం చాలా పరిచితమైన దృశ్యము. అవి వలస వెళ్ళేటప్పుడు ముఖ్యంగా, వసంతకాలంలోను శరత్కాలంలోను ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని సంవత్సరాల్లో దాదాపు 1,00,000 గ్రద్దలు లెక్కించబడ్డాయి. ఉదయసూర్యుడు గాలిని వెచ్చగా చేసినప్పుడు, రిఫ్ట్ వాలీ అంచు గుండా కొండశిఖరాలపై ఎగురుతున్న వేటాడే పక్షులు వందలకొలది కనిపిస్తాయి.
మనం మన పనిని కొనసాగించగల్గేలా యెహోవా శక్తి మనలనెలా ఆత్మీయంగాను, భావోద్రేకంగాను బలపరచగలదో చూపించడానికి శ్రమలేకుండా ఎగిరే గ్రద్దలు చక్కని ఉదాహరణ. గ్రద్ద తన స్వంత బలముతో అంత పైకి ఎగరలేనట్లే మనం మన సామర్థ్యాలపై ఆధారపడితే సఫలులం కాలేము. “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” అని అపొస్తలుడైన పౌలు వివరించాడు. (ఫిలిప్పీయులు 4:13) గ్రద్ద అదృశ్యమైన ఉష్ణవాయువు కొరకు వెతుకుతున్నట్లే, మనం ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా యెహోవా యొక్క అదృశ్యమైన చురుకైన శక్తి కొరకు ‘అడుగుతూ ఉందాం.’—లూకా 11:9, 13.
వలసవెళ్ళే గ్రద్దలు తరచూ వేటాడే ఇతర పక్షులను గమనించడం ద్వారా ఉష్ణవాయువులను కనుగొంటాయి. ప్రకృతి శాస్త్రజ్ఞుడైన డి. ఆర్. మ్యాకిన్‌టోష్ ఒకసారి 250 గ్రద్దలు రాబందులు ఒకే ఉష్ణవాయువులో గుండ్రంగా తిరగడం కనిపించిందని నివేదించాడు. అలాగే నేటి క్రైస్తవులు కూడా మిగిలిన దైవభక్తిగల సేవకుల నమ్మకమైన మాదిరిని అనుసరించడం ద్వారా యెహోవా శక్తిపై ఆధారపడడాన్ని నేర్చుకోవచ్చు.—1 కొరింథీయులు 11:1 పోల్చండి.
గ్రద్ద రెక్కల నీడలో
గ్రద్ద ఎగరడానికి నేర్చుకునే సమయం దాని అత్యంత అపాయకరమైన సమయాల్లో ఒకటి. నేర్చుకునే ప్రయత్నంలో చనిపోయే గ్రద్దల సంఖ్య తక్కువేమీ కాదు. అనుభవరహితమైన ఇశ్రాయేలు జనాంగం కూడా ఐగుప్తు నుండి బయలువెళ్లినప్పుడు ప్రమాదంలో ఉండింది. కనుక, “నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గ్రద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి” అని ఇశ్రాయేలీయులతో యెహోవా చెప్పిన మాటలు ఎంతో సముచితమైనవి. (నిర్గమకాండము 19:4) గ్రద్ద పిల్ల ఎగరడానికి చేసే మొదటి ప్రయత్నాల్లో అది క్రింద పడిపోకుండా ఉండేందుకు గ్రద్ద తన వీపుపై దానిని కొంతసేపు మోసినదానిని గూర్చిన నివేదికలున్నాయి. జి. ఆర్. డ్రైవర్ అలాంటి నివేదికలను గూర్చిన పాలెస్టయిన్ ఎక్స్‌ప్లొరేషన్ క్వార్టర్‌లీలో వ్యాఖ్యానిస్తూ ఈ విధంగా చెప్పాడు: “ఆ [బైబిలు] వర్ణన కేవలం ఊహాజనిత విషయం కాదు, కాని ఉన్న వాస్తవాలపై ఆధారపడినది.”
వేరే విధాల్లో కూడా గ్రద్దలు మాదిరికరమైన తలిదండ్రులే. అవి గూడువిడవని తన చిన్నారి బిడ్డకు, క్రమంగా ఆహారాన్ని ఇవ్వడం మాత్రమే కాక, మగ గ్రద్ద గూటికి తీసుకువచ్చే మాంసాన్ని పిల్ల గ్రద్ద మ్రింగగలిగేలా తల్లి గ్రద్ద దానిని జాగ్రత్తగా తునకలు చేస్తుంది. అవి సాధారణంగా కొండశిఖరాలమీద, లేదా పొడవైన చెట్ల మీద గూళ్ళను కట్టుకుంటాయి గనుక, చిన్న పక్షులు తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు గురయ్యేవి. (యోబు 39:27, 28) చిన్న పక్షుల ఎడల వాటి తలిదండ్రులు శ్రద్ధ తీసుకోకపోతే, బైబిలు ప్రాంతాల్లో సాధారణమైన మండుటెండ వాటి మరణాలకు కారణమయ్యేది. గూడు విడువని తన చిన్నారి బిడ్డకు నీడనిచ్చేందుకు పెద్ద గ్రద్ద తన రెక్కలను చాచి ఉంచుతుంది, కొన్నిసార్లు అది గంటల తరబడి అలాగే రెక్కలు చాచి ఉంచుతుంది.
కనుక, దైవిక సంరక్షణకు ప్రతీకగా గ్రద్ద రెక్కలు లేఖనాల్లో ఉపయోగించబడడం చాలా సముచితమే. ఇశ్రాయేలీయులు అరణ్యం గుండా ప్రయాసకరమైన ప్రయాణం చేస్తుండగా యెహోవా వారినెలా సంరక్షించాడో ద్వితీయోపదేశకాండము 32:9-12 ఈ విధంగా వర్ణిస్తుంది: “యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్యభాగము యాకోబే. అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను.” మనమాయనయందు నమ్మకముంచితే ప్రేమపూర్వకమైన అదే సంరక్షణను యెహోవా మనకిస్తాడు.
తప్పించుకునే మార్గం
కొన్నిసార్లు మనకు సమస్యలు ఎదురైనప్పుడు, మన కష్టాలన్నింటి నుండి పారిపోవాలని మనం అభిలషిస్తుండవచ్చు. దావీదు కచ్చితంగా అలాగే భావించాడు. (కీర్తన 55:6, 7 పోల్చండి.) ఈ విధానంలో మనం పరీక్షలను, బాధలను ఎదుర్కుంటుండగా మనకు సహాయం చేస్తానని యెహోవా వాగ్దానం చేసినప్పటికీ, మనం పూర్తిగా తప్పించుకునే మార్గాన్నిస్తానని ఆయన చెప్పడం లేదు. “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును” అనే బైబిలు అభయం మనకుంది.—1 కొరింథీయులు 10:13.
“వెలుపలికి వెళ్ళే మార్గం” లేదా “తప్పించుకొనే మార్గం”లో (కింగ్ జేమ్స్ వర్షన్) యెహోవాయందు నమ్మకముంచడాన్ని నేర్చుకోవడం ఇమిడి ఉంది. ఈ శీర్షిక ఆరంభంలో ఉటంకించబడిన వ్యాఖ్యానకర్త మాక్స్ లీబ్స్‌టర్ కనుగొన్నది ఇదే. ఆయన కాన్‌సెన్‌ట్రేషన్ క్యాంపుల్లో ఉన్న సంవత్సరాల్లో యెహోవాను తెలుసుకుని, ఆయనను ఆశ్రయించాడు. మాక్స్ కనుగొన్నట్లే, యెహోవా తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా, తన సంస్థ ద్వారా మనలను బలపరుస్తాడు. సాక్షులు క్యాంపుల్లో ఉన్నప్పుడు కూడా తోటి విశ్వాసులను కనుగొని, లేఖనాధార తలంపులను, తమ దగ్గరున్న బైబిలు సాహిత్యాలను పంచుకుని వారికి ఆత్మీయ సహాయాన్ని అందించారు. నమ్మకస్థులుగా తప్పించుకున్నవారు మళ్ళీ మళ్ళీ సాక్ష్యమిచ్చినట్లుగా యెహోవా వారిని బలపరచాడు. “నేను యెహోవాను ఎడతెగక సహాయమడిగాను, ఆయన ఆత్మ నాకు స్థయిర్యాన్నిచ్చింది” అని మాక్స్ వివరిస్తున్నాడు.
మనమే పరీక్షను ఎదుర్కున్నా, మనం ఎడతెగక దేవుని పరిశుద్ధాత్మ కొరకు యాచిస్తే మనం దానిపై ఆధారపడవచ్చు. (మత్తయి 7:7-11) ఈ “బలాధిక్యము” చేత మనం శక్తిని పొందినవారమై, మన సమస్యల చేత కృంగిపోకుండా మనం పైకి ఎగురగలుగుతాము. మనం యెహోవా మార్గంలో నడుస్తూనే ఉంటాం, మనం సొమ్మసిల్లి పోము. మనం గ్రద్దలవలె రెక్కలు చాపి పైకెగురుతాము.—2 కొరింథీయులు 4:7; యెషయా 40:31.
[10వ పేజీలోని చిత్రం]
అది మిమ్మల్ని పైపైన మాత్రమే చూడదు
[9వ పేజీలోని చిత్రసౌజన్యం]
Foto: Cortesía de GREFA
[10వ పేజీలోని చిత్రసౌజన్యం]
Foto: Cortesía de Zoo de Madrid