మా పాఠకుల నుండి
నిద్ర “మీ శరీరానికి నిద్ర ఎందుకవసరం” (జూన్ 8, 1995) అనే శీర్షిక కొరకు కృతజ్ఞతలు. అది నా కళ్ళను తెరిపించిందనే నేను చెప్పాలి. ఒక వైద్య విద్యార్థిగా, నా చదువుల మూలాన నేనెన్నో గంటల నిద్రను పోగొట్టుకుంటాను. శీర్షికలో పేర్కొనబడిన కొన్ని పరిణామాలు నేను అనుభవించాను. శ్రేష్ఠమైన నిద్రా పద్ధతులను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తాను.
ఎల్. హెచ్., ట్రినిడాడ్
తాత మామ్మలు “మీరు తాత మామ్మలను గౌరవిస్తారా?” (జూలై 8, 1995) శీర్షికల పరంపరను నేను చదివినప్పుడు నా కళ్ళవెంట ఆనందబాష్పాలు రాలాయి. నా అత్తింటి వారితో చాలా కష్టాలను అనుభవిస్తున్నాను, అందువలన మీ శీర్షిక రావడానికి ఇంతకంటే శ్రేష్ఠమైన సమయం ఉండకపోవచ్చు. వారు పాత్రులైనా నేను వారితో సరైన గౌరవంతో వ్యవహరించడం లేదని నేను తెలుసుకునేలా అది చేసింది. నేను అవసరమైన మార్పులు చేసుకోవడం మొదలు పెట్టాను, మరి మేమంతా సంతోషంగా ఉన్నాము.
ఏ. టి., కెనడా
మా తండ్రిని నర్సింగ్ హోమ్‌లో ఉంచాల్సి వచ్చింది, వారానికి మూడుసార్లు సందర్శించాలని మేం తీర్మానించుకున్నాము. రెండు సంవత్సరాలు ఆ వాగ్దానం నిలబెట్టుకున్నాము. ఇంట్లోని చిన్నచిన్న ప్రతిదిన వార్తలు ఆయనకు ఎంతో ప్రాముఖ్యం! దీన్ని నిలబెట్టుకోవడానికి దృఢమైన తీర్మానం అవసరమౌతుంది, కానీ మనుమలు మనుమరాండ్రు, వారితో పాటు తాత మామ్మలు కూడా ప్రయోజనం పొందుతారు.
పి. ఎల్., అమెరికా
శీర్షికలు మతసిద్ధాంతం లేక మతంపైన కేంద్రీకరించలేదు గానీ నిష్పక్షపాతంగా ఉన్నాయన్న వాస్తవాన్నిబట్టి ఒక కాథోలిక్కుగా, నేను చాలా ముగ్ధురాలినయ్యాను. దరిదాపుగా ఉపేక్షించబడ్డ ఆవశ్యకతతో మీరు ధైర్యంగా వ్యవహరించారు.
ఏ. బి., కోస్టరికా
దుర్వాసన ఉపదేశాత్మకమైన మీ శీర్షిక, “నోటి దుర్వాసనకు మీరేమి చేయగలరు?” (జూలై 8, 1995) కొరకు నేను కృతజ్ఞతలు తెలపాలి. అది నా సమస్య! దుర్వాసన మీరు ఒత్తిడిని అనుభవించేలా చేస్తుందన్నది నిజమే. నేను దంతవైద్యున్ని రెండుసార్లు సందర్శించాను, కానీ వాసన ఇంకా విడిచిపోలేదు. నేను శీర్షికలోని సూచనలు పాటించాను, మరవి పనిచేస్తున్నాయి. దయచేసి భూగోళవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సహాయం చేయడంలో కొనసాగండి.
ఆర్. ఓ. ఐ., నైజీరియా
భారతీయ వనితలు “భారతీయ వనితలు—21వ శతాబ్దంలోనికి అడుగుపెట్టడం” (ఆగస్టు 8, 1995) శీర్షికను నేనెంతో మెచ్చుకున్నాను. నా స్వంత సంస్కృతికి ఎంతో భిన్నమైనది అది కలిగివుండడం వలన నేనెప్పుడూ భారతదేశం ఆకర్షణీయంగా ఉన్నట్లు కనుగొన్నాను. మీ శీర్షిక దేవుని రాజ్యం క్రింద మాత్రమే భారతీయ వనితలకు నిజమైన స్వేచ్ఛ వస్తుందని చూపించాయి. స్త్రీలందరూ తాము గౌరవించే భర్తలచే నిజంగా ప్రేమింపబడి, సంరక్షింపబడే కాలం కొరకు నేను ఎదురు చూస్తున్నాను.
డబ్ల్యు. ఎస్., బ్రిటిష్ కొలంబియా
మెనోపాజ్ గైనకాలజీ మందులలో స్పెషలైజ్ అయివున్న ఒక మందుల కంపెనీని మేము నడుపుతాము. “ఒక శ్రేష్ఠమైన అవగాహనను పెంపొందిచుకోవడం” (ఫిబ్రవరి 22, 1995, [ఆంగ్లం]) అనే పేరుతో మెనోపాజ్ గురించిన శీర్షిక ఆసక్తికరంగా ఉన్నట్లు మేము కనుగొన్నాము, మరి మీరు ఆ విషయాన్ని చక్కగా వ్రాశారు. అయితే, “ఈస్ట్రోజన్ ప్రతిస్థాపన చికిత్స విషయం మాటేమిటి?” అనే బాక్సు, “హార్మోనుల ప్రతిస్థాపన రెజిమన్‌కు ప్రాజెస్టరాన్‌ను చేర్చడం . . . హృద్రోగాలపై ఈస్ట్రోజన్ మేలుకరమైన ప్రభావాన్ని త్రిప్పికొడుతుంది” అని చెబుతుంది. ఇది ఎల్లప్పుడూ, ప్రత్యేకంగా సహజ ప్రాజెస్టిన్‌ల విషయంలో నిజం కాదు.
డా. టి.డబ్ల్యు. మరియు జె.కె., జర్మనీ
తాజా సమాచారం అందించినందుకు కృతజ్ఞతలు. పాత మూలాలు, ప్రాజెస్టిన్లు హెచ్.డి.ఎల్, లేక “మంచి” కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించగలవని తద్వారా హృద్రోగ ప్రమాదాన్ని పెంచగలవని సూచించగా, ఈ మధ్యే జరిగిన పరిశోధన ఇంకొక విధంగా సూచిస్తుంది. “జె.ఎ.ఎమ్.ఎ.” జనవరి 18, 1995 సంచికలో నివేదించబడిన ఇటీవలనే జరిగిన ఒక అధ్యయనం, “కేవలం ఈస్ట్రోజన్ గానీ లేక ఒక ప్రాజెస్టిన్‌తో కలిపి గానీ, [“మంచి” కొలెస్ట్రాల్ స్థాయిని] మెరుగుపరుస్తుంది. హార్మోను చికిత్సల దీర్ఘకాలిక ప్రభావాలన్నీ పూర్తిగా అర్థం చేసుకునేంత వరకు, మరింత పరిశోధన చేయవలసి ఉందన్నది నిస్సందేహమైనది.—ఎడిటర్.