కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 1/8 పేజీలు 19-21
  • నా ప్రాణ స్నేహితుడు ఇల్లెందుకు మారాడు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నా ప్రాణ స్నేహితుడు ఇల్లెందుకు మారాడు?
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాస్తవాన్ని ఎదుర్కోవడం
  • సంబంధాన్ని కొనసాగించడం
  • వెలితిని పూడ్చడం
  • అనుకూల దృక్కోణం కలిగివుండండి
  • నేనెందుకు స్నేహితులను నిలుపుకోలేకపోతున్నాను?
    తేజరిల్లు!—1996
  • మీరు యెహోవాకు స్నేహితులు అవ్వవచ్చు
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • మంచి ఫ్రెండ్స్‌ ఎలా ఉంటారు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • నా స్నేహితురాలి వల్ల కలుగుతున్న ఊపిరాడని పరిస్థితిని ఎలా నివారించగలను?
    తేజరిల్లు!—1998
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 1/8 పేజీలు 19-21

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

నా ప్రాణ స్నేహితుడు ఇల్లెందుకు మారాడు?

‘నీవు నీ ప్రాణ స్నేహితున్ని కోల్పోయినట్లు కన్పిస్తున్నావు.’ ఎవరైనా కాస్త విషాదంగాను లేక క్రుంగిపోయినట్లుగాను కనిపిస్తే ప్రజలు అలా అంటారు. కానీ మీరు నిజంగానే మీ ప్రాణ స్నేహితున్ని పోగొట్టుకుని ఉంటే అప్పుడు ఆ లోకోక్తి మరింత విశిష్టంగా ఉంటుంది.

ఎంతైనా నిజమైన స్నేహం ప్రత్యేకమైనది, అమూల్యమైనది. బైబిలు ఇలా అంటుంది: “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.” (సామెతలు 17:17) మంచి స్నేహితులు మనకు సహచర్యాన్ని, మద్దతును అందిస్తారు. వారు మనం భావోద్రేకంగాను, ఆత్మీయంగాను అభివృద్ధి చెందడానికి సహాయం చేస్తారు. మామూలు స్నేహితులు లేక పరిచయస్థులు అనేకమంది ఉండవచ్చు, అయితే మనం నిజంగా నమ్మకముంచగల లేక ఆంతరంగిక విషయాలు చర్చించగల వ్యక్తులు సాధారణంగా అరుదుగా ఉంటారు.

కాబట్టి మీ ప్రాణ స్నేహితుడు ఇల్లు మారితే, మీరు ఎందుకు కుప్పకూలిపోతారో అర్థం చేసుకోదగిందే. బ్రయాన్‌ అనే యౌవనుడు తన స్నేహితుడు ఇల్లు మారినప్పుడు తానెలా భావించాడో గుర్తుతెచ్చుకున్నాడు. “నేను భయపడ్డాను, ఒంటరివాన్నైపోయానని భావించాను, గాయపడ్డాను” అన్నాడు ఆయన. బహశ మీరూ అదే విధంగా భావిస్తుండవచ్చు.

వాస్తవాన్ని ఎదుర్కోవడం

మీ స్నేహితుడు ఇల్లెందుకు మారాడన్నదానికిగల కారణాలపై మనస్సు నిల్పడం సహాయం చేయవచ్చు. నిశ్చయంగా, మీ స్నేహం ఎడల మెప్పుదల లేకపోవడంవల్ల కాదు. ఆధునిక జీవనంలో ఇల్లు మారడం సాధారణం అయిపోయింది. ప్రతి సంవత్సరం కేవలం అమెరికాలోనే 3.6 కోట్ల ప్రజలు ఇల్లు మారుతున్నారు! యు.ఎస్‌. బ్యూరో ఆఫ్‌ సెన్సస్‌ ప్రకారం సగటు అమెరికావాసి తన జీవితకాలంలో 12 సార్లు ఇల్లు మారతాడు.

ఇలా ఇల్లు మారడం ఎందుకు? కారణాలు వేర్వేరుగా ఉంటాయి. అనేక కుటుంబాలు మరింత మంచి ఉద్యోగాలు, ఇండ్లు సంపాదించడానికి ఇల్లు మారతారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యుద్ధం, బీదరికం మూలంగా కోట్లాది కుటుంబాలు ఇండ్లు మారక తప్పలేదు. యౌవనులు పెద్దవారైనప్పుడు ఇల్లు విడిచి తమ స్వంత కాళ్లపైన నిలబడడానికి నిర్ణయించుకోవచ్చు. కొంతమంది పెండ్లి చేసుకొని ఇల్లు విడిచిపెడ్తారు. (ఆదికాండము 2:24) అయితే ఇతరులు ఆత్మీయ ఆసక్తులను వెంబడించడానికి ఇల్లు విడిచిపెట్టవచ్చు. (మత్తయి 19:29) యెహోవాసాక్షులు క్రైస్తవ పరిచారకుల అవసరం మరింత ఎక్కువగా ఉన్న వేరే ప్రాంతాల్లో బహుశ విదేశాల్లో కూడా సేవచేయడానికి సౌకర్యాలుగల, పరిచయమున్న పరిసరాలను విడిచిపెడ్తారు. కొంతమంది తమ స్వదేశంలోని బేతేలు అని పిలువబడే యెహోవాసాక్షుల పనిని పర్యవేక్షించే స్థలాల వద్ద సేవచేయడానికి అక్కడికి మారతారు. అవును, మనం మన స్నేహితులను ప్రేమించినప్పటికీ సమయం గతించే కొలది వారు స్థలం మారవచ్చునన్నది జీవిత వాస్తవంగా దృష్టించాలి.

మీ స్నేహితుడు ఇల్లు మారడానికి కారణం ఏదైనప్పటికీ ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవచ్చునా అని మీరు ఆలోచిస్తుండవచ్చు. కానీ కొంతకాలం కాస్త ఒంటరిగాను, క్రుంగిపోయినట్లుగాను భావించడం సహజమే అయినప్పటికీ ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ అసంతోషంగా ఉండడం విషయాలను ఏమాత్రం మెరుగుపర్చదని మీరు బహుశ గ్రహించి ఉంటారు. (సామెతలు 18:1) అందువలన సహాయం చేయగల కొన్ని విషయాలవైపుకు మనం దృష్టిని సారిద్దాము.

సంబంధాన్ని కొనసాగించడం

“మీ స్నేహం ముగిసిపోలేదని గ్రహించండి” యౌవనుడైన బ్రయాన్‌ సలహా ఇస్తున్నాడు. అవును, మీ ప్రాణ స్నేహితుడు ఇల్లు మారడం మీ సంబంధాన్ని నిశ్చయంగా మారుస్తుంది, కానీ మీ స్నేహం అంతమవ్వాలని దానర్థం కాదు. టీనేజర్ల సలహాదారురాలు డా. రోజ్‌మెరీ వైట్‌ ఇలా అంది: “నష్టాన్ని ఎదుర్కోవడం జీవితంలో ఏ స్థాయిలోనైనా చాలా కష్టమైనదే, కానీ దానితో విజయవంతంగా వ్యవహరించాలంటే అది కేవలం ఒక మార్పు మాత్రమేనని ద్వారం మూసుకుపోలేదని తలంచాలి.”

స్నేహ ద్వారం తెరుచుకుని ఉండేలా చేయాలంటే మీరు ఏమి చేయవచ్చు? దావీదు యోనాతానుల వృత్తాంతాన్ని పరిశీలించండి. వయస్సులో ఎంతో తేడా ఉన్నప్పటికీ వారు అత్యంత సన్నిహితమైన స్నేహితులు. దావీదు పరదేశానికి పారిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా వేరవ్వలేదు. దానికి బదులుగా, వారు తమ వాడబారని స్నేహాన్ని స్థిరపర్చుకుని, స్నేహితులుగా నిలిచివుండాలని నిబంధన లేక ఒప్పందం చేసుకున్నారు కూడాను.—1 సమూయేలు 20:42.

అదేవిధంగా, మీ స్నేహితుడు గానీ స్నేహితురాలు గానీ మిమ్మల్ని విడిచి వెళ్లే ముందు మీరు వారితో మాట్లాడవచ్చు. మీరు స్నేహాన్ని ఎంత విలువైనదిగా ఎంచుతారో, మీరు సంబంధాన్ని కొనసాగించాలని ఎంతగా అనుకుంటున్నారో మీ స్నేహితునికి తెలియజేయండి. పాటీ, మలీనలు ప్రాణ స్నేహితురాండ్రు, వారిప్పుడు ఒకరికొకరు 8,000 కిలోమీటర్ల సముద్ర భూభాగాలవతల దూరంగా ఉన్నారు, వారు సరిగ్గా అదే చేశారు. “మేము సంబంధాన్ని కొనసాగించాలని పథకం వేసుకున్నాము” వివరిస్తుంది పాటీ. అయితే మీరు కచ్చితమైన ఏర్పాట్లు చేసుకోకపోయినట్లైతే మాత్రం అటువంటి పథకాలు విఫలమవ్వవచ్చు.—ఆమోసు 3:3 పోల్చండి.

అపొస్తలుడైన పౌలు తన స్నేహితుడైన గాయును చూడడానికి సాధ్యపడనప్పుడు, ‘ఆయనకు సిరాతోను, కలముతోను వ్రాసి’ సంబంధాన్ని కొనసాగించాడని బైబిలు మనకు చెబుతుంది. (3 యోహాను 13) మీరు ఒకరికొకరు ఒక ఉత్తరమో లేక కార్డో వారానికి లేక నెలకు ఒకసారి క్రమంగా పంపుకోవాలని కూడా ఒప్పుకోవచ్చు. సుదూర ఫోను బిల్లులు వస్తుండడం మీ తలిదండ్రులకు అభ్యంతరం లేకపోతే మీరు అప్పుడప్పుడు ఒకరినొకరు ఫోను చేసుకొంటూ మీ జీవితంలోని క్రొత్త మార్పులను తెలుసుకుంటూ ఉండవచ్చు. లేక క్యాసెట్టుపైన లేక వీడియో టేపుపైన రికార్డు చేసిన సందేశాలను ఒకరినొకరు పంపుకోవాలని ఒప్పందానికి రావచ్చు. భవిష్యత్తులో ఒక వారాంతంలో సందర్శించడాన్ని లేక కలిసి సెలవును గడపడానికి సాధ్యమౌతుండవచ్చు కూడాను. ఆ విధంగా స్నేహం వృద్ధి చెందడంలో కొనసాగగలదు.

వెలితిని పూడ్చడం

అయినప్పటికీ, ప్రాణ స్నేహితుని వీడ్కోలు మీ జీవితంలో ఒక వెలితిని తెస్తుంది. తత్ఫలితంగా, మీకు ఎక్కువ సమయం లభిస్తున్నట్లు మీరు గ్రహించవచ్చు. మరి ఆ సమయాన్ని వృథాగా పోనివ్వవద్దు. (ఎఫెసీయులు 5:16) ఏదైనా ప్రయోజనకరమైనది చేయడానికి దాన్ని ఉపయోగించండి—బహుశ మీరు ఒక సంగీత వాద్యాన్ని వాయించడం నేర్చుకోవచ్చు, ఒక క్రొత్త భాషపై పట్టును సంపాదించవచ్చు, లేక ఏదైన సరదా పనిని చేయవచ్చు. అవసరంలో ఉన్నవారికి దుకాణం నుండి సామగ్రిని తేవడం ద్వారా సమయాన్ని చక్కగా ఉపయోగించవచ్చు. మీరు యెహోవాసాక్షులలో ఒకరైతే మీరు బహిరంగ ప్రకటనా కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనవచ్చు. (మత్తయి 24:14) లేక మీరు ఆసక్తిదాయకమైన బైబిలు అధ్యయన ప్రాజెక్టును ప్రారంభించవచ్చు.

దీనికి తోడు, అపొస్తలుడైన పౌలు కొరింథులోని క్రైస్తవులను “విశాలపరచు”కొనుమని—అంటే తమ స్నేహితులలో ఇతరులను చేర్చుకోమని సలహా ఇచ్చాడు. (2 కొరింథీయులు 6:13) బహుశ మీరు కేవలం ఒకే స్నేహితునితో ఎంతో సమయం గడిపి ఉండవచ్చు, స్నేహితులవ్వగల్గే ఇతరులను మీరు ఆ విధంగా నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. యెహోవాసాక్షులలోని యౌవనులు సరిగ్గా తమ స్థానిక సంఘంలోనే స్నేహాలను ప్రారంభించడానికి అవకాశాలను కనుగొంటారు. అందుకని సంఘ కూటాలకు ముందుగా చేరుకుని కూటం అయిన తర్వాత కొంచెంసేపు ఉండడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం మీరు వ్యక్తులను గురించి తెలుసుకోవడానికి మరింత సమయం దొరుకుతుంది. క్రొత్త స్నేహాలను ప్రారంభించడానికి క్రైస్తవ సమావేశాలు, చిన్న చిన్న సాంఘిక కూటాలు ఇతర అవకాశాలను ఇస్తాయి.

అయితే ఒక హెచ్చరిక సముచితంగా ఉంటుంది: క్రొత్త స్నేహితులను సంపాదించుకోవాలని మీరు మీ ఆత్మీయ లక్ష్యాలను, విలువలను పంచుకోని యౌవనులతో సన్నిహితంగా సహవసించడం ప్రారంభించడానికి త్వరపడకండి. అటువంటివారు మీపై ప్రతికూలంగా ప్రభావం చూపి, మీకు మేలు కన్నా కీడే ఎక్కువగా చేయగలరు. (సామెతలు 13:20; 1 కొరింథీయులు 15:33) సత్ప్రవర్తన కలిగివున్నవారని పేరు తెచ్చుకున్న యౌవనులతో ఆత్మీయ విషయాల్లో ఆసక్తిగల యౌవనులతో మాత్రమే అంటిపెట్టుకుని ఉండండి.

మీరు అటువంటివారిని కలిసినప్పుడు కలిసి ఏదైనా చేయడానికి పథకం వేయడం ద్వారా స్నేహాన్ని పెంపొందించుకోండి. కలిసి భోజనం చేయండి. ఏదైనా వస్తు ప్రదర్శనశాలకు వెళ్లండి. అలా నడుచుకుంటూ వెళ్లండి. దేవుని రాజ్య సువార్తతో ప్రజలను కలుస్తూ, క్రైస్తవ పరిచర్యలో ఒక దినాన్ని కలిసి గడపడానికి ఏర్పాటు చేసుకోండి. సమయం గడిచే కొలది, ప్రయత్నాలు చేసే కొలది క్రొత్త స్నేహం వృద్ధిచెందగలదు. క్రైస్తవ ప్రేమ విస్తరించేది, అది ఇతరులను చేర్చుకోవడానికి ‘విశాలమౌతుంది’ గనుక మీరు క్రొత్త స్నేహితులను సంపాదించుకున్నప్పుడు ఇల్లు మారిపోయిన మీ స్నేహితునికి ద్రోహం చేస్తున్నారని భావించనవసరం లేదు.

మిమ్మల్ని అత్యంత అధికంగా ప్రేమించే మీ తలిదండ్రులకు సన్నిహితమయ్యే అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవచ్చు. మీరు వారి సహవాసాన్ని కోరుకోవడం మొదట ఇబ్బందికరంగా అన్పించినా వారు చాలా సహాయకంగా ఉండగలరు. జాష్‌ అనే యౌవనుడు ఇలా అన్నాడు: “నేను అప్పట్లో మా అమ్మకి లేక నాన్నకి అంత సన్నిహితంగా లేను, అందుకని వారితో సమయం గడపడానికి నన్ను నేను బలవంతపెట్టుకోవల్సివచ్చేది. కానీ ఇప్పుడు వారు నాకు అత్యంత సన్నిహితమైన స్నేహితులు!”

మీకు పరలోకంలో ఇంకా ఒక స్నేహితుడు ఉన్నాడన్నది కూడా గుర్తుంచుకోండి. 13 సంవత్సరాల డాన్‌ చెబుతున్నట్లుగా, “మీరు నిజంగా ఒంటరిగా లేరు, ఎందుకంటే మీకు యెహోవా ఉన్నాడు.” మన పరలోకపు తండ్రి ఎల్లప్పుడూ ప్రార్థనలో అందుబాటులో మనకు ఉన్నాడు. మీరు ఆయనయందు నమ్మకముంచితే ఆయన ఈ కష్టతరమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి సహాయం చేస్తాడు.—కీర్తన 55:22.

అనుకూల దృక్కోణం కలిగివుండండి

జ్ఞానియైన సొలొమోను ఇలా సలహా ఇచ్చాడు: “ఈ దినములకంటె మునుపటి దినములు ఏల క్షేమకరములు అని యడుగవద్దు.” (ప్రసంగి 7:10) వేరే మాటల్లో చెప్పాలంటే, గతం గురించే ఆలోచిస్తూ కాలం వెళ్లబుచ్చవద్దు; వర్తమాన కాలం అందించే అవకాశాలన్నింటినుండి ప్రయోజనం పొందండి. ఇప్పుడు తన 20వపడి తొలి భాగంలో ఉన్న బిల్‌ తన ప్రాణ స్నేహితున్ని పోగొట్టుకున్నప్పుడు సరిగ్గా అదే చేశాడు. ఆయనిలా గుర్తు తెచ్చుకుంటున్నాడు: “కొంతకాలం తర్వాత నేను క్రొత్త స్నేహితులను సంపాదించుకోవడం ప్రారంభించాను, నేను గతం గురించి ఎక్కువగా తలంచలేదు. నేను భవిష్యత్తు కొరకు సిద్ధపడుతూ, వర్తమానంలో జీవించడానికి ప్రయత్నించాను.”

ఈ సలహాలు పనిచేయవచ్చు, అయినా మీ ప్రాణ స్నేహితుడు ఇల్లుమారిపోవడం ఎంతైనా విషాదకరమైన సంఘటనే. మీరు కలిసి ఆనందించిన సమయాల మధుర స్మృతులు మీకు బాధను కలిగించని సమయం రావడానికి కాస్త సమయం పట్టవచ్చు. మార్పు అనేది జీవితంలో భాగమని మాత్రం గుర్తుంచుకోండి, అది మీరు పరిణతి చెందడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశాన్నిస్తుంది. ఒక ప్రత్యేక స్నేహితుని స్థానంలోని వెలితిని పూర్తిగా పూడ్చడం సాధ్యంగా కన్పించకపోయినా, ‘యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లే’ లక్షణాలను పెంపొందించుకోగలరు. (1 సమూయేలు 2:26) మీరలా చేసినప్పుడు స్నేహితుడని పిలువగల ఒకరు మీకెన్నడూ ఉంటాడు!

[21వ పేజీలోని చిత్రం]

మీ ప్రాణ స్నేహితునికి వీడ్కోలు చెప్పడం బాధాకరమైన అనుభవం

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి