కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • bt అధ్యా. 25 పేజీలు 196-202
  • “నేను కైసరుకే విన్నవించుకుంటాను!”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నేను కైసరుకే విన్నవించుకుంటాను!”
  • “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “న్యాయపీఠం ముందు” (అపొ. 25:1-12)
  • “నేను అవిధేయత చూపించలేదు” (అపొ. 25:13–26:23)
  • “నువ్వు నన్ను క్రైస్తవుడిగా మార్చేస్తావు” (అపొ. 26:24-32)
  • పౌలు అధికారుల ముందు ధైర్యంగా సాక్ష్యమిచ్చాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • రాజ్య సందేశాన్ని అంగీకరించడానికి ఇతరులకు సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ‘నేను కైసరు ఎదుటనే చెప్పుకొందును!’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • యెహోవా రాజ్యమును నిర్భయముగా ప్రకటించుము!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
“దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
bt అధ్యా. 25 పేజీలు 196-202

అధ్యాయం 25

“నేను కైసరుకే విన్నవించుకుంటాను!”

మంచివార్త తరఫున వాదించే విషయంలో పౌలు మంచి ఆదర్శం ఉంచాడు

అపొస్తలుల కార్యాలు 25:1–26:32 ఆధారంగా

1, 2. (ఎ) పౌలు ఏ పరిస్థితిలో ఉన్నాడు? (బి) పౌలు తీసుకున్న నిర్ణయం విషయంలో మనకు ఏ ప్రశ్నలు రావచ్చు?

కైసరయలో, పౌలు సైనికుల భారీ బందోబస్తు కింద ఉన్నాడు. రెండేళ్ల క్రితం ఆయన యూదయకు తిరిగి వచ్చినప్పుడు, అక్కడున్న కొన్ని రోజుల్లోనే యూదులు కనీసం మూడుసార్లు పౌలును చంపడానికి ప్రయత్నించారు. (అపొ. 21:27-36; 23:10, 12-15, 27) కానీ ఇప్పటివరకు వాళ్లు పౌలును ఏం చేయలేకపోయారు. అయినా, వాళ్ల ప్రయత్నాల్ని మాత్రం ఆపట్లేదు. వాళ్ల వల్ల ఇంకా ప్రమాదం పొంచివుంది అని తెలిసినప్పుడు, పౌలు రోమా అధిపతైన ఫేస్తుతో, “నేను కైసరుకే విన్నవించుకుంటాను!” అన్నాడు.—అపొ. 25:11.

2 రోమా చక్రవర్తికి విన్నవించుకోవాలి అని పౌలు నిర్ణయించుకున్నాడు, సరే. మరి ఆ నిర్ణయానికి యెహోవా మద్దతు ఇచ్చాడా? మనం ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే, ఈ చివరి రోజుల్లో మనం కూడా దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇస్తున్నాం. “మంచివార్త తరఫున వాదించే విషయంలో, దాన్ని ప్రకటించేలా చట్టబద్ధమైన హక్కును సంపాదించే విషయంలో” పౌలు మనకు ఆదర్శం ఉంచాడో లేదో మనం తెలుసుకోవాలి.—ఫిలి. 1:7.

“న్యాయపీఠం ముందు” (అపొ. 25:1-12)

3, 4. (ఎ) పౌలును యెరూషలేముకు తీసుకురమ్మని యూదులు అడగడం వెనక ఏ కుట్ర ఉంది? పౌలుకు ఎలా ప్రాణాపాయం తప్పింది? (బి) పౌలుకు చేసినట్టే, యెహోవా ఇప్పుడున్న సేవకులకు ఎలా సహాయం చేస్తాడు?

3 ఫేస్తు యూదయకు కొత్త రోమా అధిపతి అయ్యాడు. అధిపతైన మూడు రోజులకే అతను యెరూషలేము వెళ్లాడు.a అక్కడికి వెళ్లాక ముఖ్య యాజకులు, యూదుల్లో ప్రముఖులు పౌలు మీద పెద్దపెద్ద నేరాలు ఆరోపించారు. కొత్త అధిపతి తమతో, అలాగే మిగతా యూదులందరితో సఖ్యతగా ఉండాలన్న ఒత్తిడిలో ఉంటాడని వాళ్లకు తెలుసు. అందుకే, వాళ్లు పౌలును యెరూషలేముకు తీసుకొచ్చి అక్కడ విచారణ చేయమని ఫేస్తును అడుగుతారు. దాని వెనక పెద్ద కుట్రే ఉంది. పౌలును కైసరయ నుండి యెరూషలేముకు తరలిస్తున్న సమయంలో, దారిలోనే ఆయన్ని వేసేయాలన్నది వాళ్ల పథకం. ఫేస్తు వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లుతూ, “అతను నిజంగా ఏదైనా తప్పు చేసివుంటే, మీలో పలుకుబడి ఉన్నవాళ్లు నాతో పాటు [కైసరయకు] వచ్చి అతని మీద ఆరోపణలు చేయవచ్చు” అన్నాడు. (అపొ. 25:5) అలా పౌలుకు మరోసారి ప్రాణాపాయం తప్పింది.

4 పౌలుకు ఎదురైన కష్టాలన్నిటిలో, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా యెహోవా ఆయన్ని బలపరుస్తూ వచ్చాడు. మీకు గుర్తుందా? ఒక దర్శనంలో యేసు పౌలుకు “ధైర్యంగా ఉండు!” అని చెప్పాడు. (అపొ. 23:11) ఇప్పుడు దేవుని సేవకులకు కూడా ఆటంకాలు, ప్రమాదాలు వస్తాయి. యెహోవా మనల్ని ప్రతీ కష్టం నుండి కాపాడడు గానీ ఆ కష్టాన్ని తట్టుకోవడానికి కావాల్సిన తెలివిని, బలాన్ని ఇస్తాడు. మన ప్రేమగల దేవుడు ఎప్పుడూ మనకు “అసాధారణ శక్తి” ఇస్తాడని మనం నమ్మకంతో ఉండవచ్చు.—2 కొరిం. 4:7.

5. ఫేస్తు పౌలుతో ఎలా ప్రవర్తించాడు?

5 కొన్ని రోజుల తర్వాత, ఫేస్తు కైసరయలో “న్యాయపీఠం మీద” కూర్చున్నాడు.b అతని ముందు పౌలు, పౌలు మీద ఆరోపణలు చేసేవాళ్లు నిలబడ్డారు. వాళ్లు చేస్తున్న అర్థంపర్థంలేని ఆరోపణలకు పౌలు ఇలా జవాబిచ్చాడు: “యూదుల ధర్మశాస్త్రం విషయంలో గానీ, ఆలయం విషయంలో గానీ, కైసరు విషయంలో గానీ నేను ఏ పాపం చేయలేదు.” నిజంగానే పౌలు ఏ తప్పు చేయలేదు, కాబట్టి ఆయన్ని విడుదల చేయాలి. మరి ఫేస్తు ఏ నిర్ణయం తీసుకుంటాడు? యూదుల్ని మచ్చిక చేసుకోవాలనే ఉద్దేశంతో, ఫేస్తు పౌలును ఇలా అడిగాడు: “మనం యెరూషలేముకు వెళ్లడం, ఈ విషయాల గురించి అక్కడ నా సమక్షంలో నీకు తీర్పు జరగడం నీకు ఇష్టమేనా?” (అపొ. 25:6-9) అది పిచ్చి ఆలోచన! ఎందుకంటే, పౌలును యెరూషలేముకు పంపించేస్తే, ఆయన మీద ఆరోపణలు చేస్తున్నవాళ్లే ఆయనకు న్యాయమూర్తులై ఖచ్చితంగా మరణశిక్ష వేసే అవకాశం ఉంది. ఈ సందర్భంలో, ఫేస్తు తన రాజకీయ లబ్ధి కోసం న్యాయాన్ని గాలికి వదిలేశాడు. గతంలో పొంతి పిలాతు అనే అధిపతి అంతకంటే ముఖ్యమైన ఖైదీ విషయంలో, అంటే యేసు విషయంలో ఇలాగే చేశాడు. (యోహా. 19:12-16) మన కాలంలోని న్యాయమూర్తులు కూడా జనాల్ని మెప్పించాలనే ఒత్తిడికి లొంగిపోయే అవకాశం ఉంది. కాబట్టి కోర్టులు కొన్నిసార్లు సాక్ష్యాధారాల్ని పక్కనపెట్టేసి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

6, 7. కైసరుకే విన్నవించుకుంటానని పౌలు ఎందుకు అన్నాడు? ఆయన నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

6 ఫేస్తు యూదుల మెప్పు పొందాలనుకోవడం వల్ల, పౌలు ప్రాణాలకు ముప్పు వచ్చింది. అందుకే, పౌలు రోమా పౌరుడిగా తనకున్న హక్కును ఉపయోగించుకుని ఫేస్తుతో ఇలా అన్నాడు: “నేను కైసరు న్యాయపీఠం ముందు నిలబడి ఉన్నాను, నాకు తీర్పు జరగాల్సింది ఇక్కడే. నేను యూదుల విషయంలో ఏ తప్పూ చేయలేదు. దీని గురించి నీకు కూడా బాగా తెలుసు. . . . నేను కైసరుకే విన్నవించుకుంటాను!” సాధారణంగా, ఎవరైనా కైసరుకే విన్నవించుకుంటాను అన్నప్పుడు ఇంక ఆ మాటను వెనక్కి తీసుకోలేరు. ఆ విషయాన్ని ఫేస్తు నొక్కిచెప్తూ, “కైసరుకు విన్నవించుకుంటానని అన్నావు కదా, కైసరు దగ్గరికే వెళ్తావు” అన్నాడు. (అపొ. 25:10-12) పై అధికారికి విన్నవించుకుంటాను అని చెప్పడం ద్వారా, పౌలు ఇప్పుడున్న నిజ క్రైస్తవులకు మంచి ఆదర్శం ఉంచాడు. శత్రువులు ఎవరైనా “చట్టం పేరుతో సమస్యలు సృష్టించడానికి” ప్రయత్నించినప్పుడు, యెహోవాసాక్షులు మంచివార్త ప్రకటించే హక్కు కోసం కోర్టుల్ని ఆశ్రయిస్తారు.c—కీర్త. 94:20.

7 పౌలు రెండేళ్లకు పైగా, చేయని నేరానికి బలౌతున్నాడు. మొత్తానికి రెండేళ్ల తర్వాత, రోములో తన వాదనను వినిపించుకునే అవకాశం ఆయనకు దొరికింది. అయితే ఆయన కైసరు దగ్గరికి వెళ్లే ముందు, ఇంకొకరు ఆయన్ని చూడాలనుకుంటున్నారు.

కోర్టులో తీర్పు ఇచ్చాక ప్రజల స్పందన. ఒక సహోదరుడు, ఆయన తరఫు లాయర్లు, ఇతర సాక్షులు బాధగా ఉన్నారు. సాక్షులుకాని వాళ్లు, ఆ సహోదరుడికి వ్యతిరేకంగా కేసు వాదించిన లాయర్లకు శుభాకాంక్షలు చెప్తూ సంబరపడిపోతున్నారు.

మనకు అనుకూలంగా తీర్పు రానప్పుడు పై కోర్టులో అప్పీల్‌ చేసుకుంటాం

“నేను అవిధేయత చూపించలేదు” (అపొ. 25:13–26:23)

8, 9. అగ్రిప్ప రాజు కైసరయకు ఎందుకు వచ్చాడు?

8 కైసరుకు విన్నవించుకుంటాను అని పౌలు అన్న కొన్ని రోజుల తర్వాత, అగ్రిప్ప రాజు, అతని చెల్లి బెర్నీకే కొత్త అధిపతిని “పలకరించడానికి అధికారిక సందర్శనం” మీద వచ్చారు.d కొత్తగా అధిపతులైన వాళ్లను పలకరించడానికి అలా రావడం అప్పట్లో ఆనవాయితీగా ఉండేది. ఫేస్తుతో సత్సంబంధాలు పెంచుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడతాడన్న ఉద్దేశంతో అగ్రిప్ప ఇలా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాడు.—అపొ. 25:13.

ప్రకటించే స్వేచ్ఛ కోసం మన కాలంలో చేసిన అప్పీళ్లు

దేవుని రాజ్యం గురించి ప్రకటించే విషయంలో ఆటంకాలు వచ్చినప్పుడు, యెహోవాసాక్షులు కొన్నిసార్లు పైకోర్టుల్లో అప్పీల్‌ చేసుకున్నారు. రెండు ఉదాహరణలు చూడండి.

జార్జియాలోని గ్రిఫిన్‌లో బైబిలు ప్రచురణలు పంచి పెడుతున్నందుకు కొంతమంది సాక్షుల్ని అరెస్ట్‌ చేశారు. 1938, మార్చి 28న, అమెరికా సుప్రీంకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టి, మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మంచివార్త ప్రకటించే హక్కు కోసం మనం ఆ కోర్టులో చేసుకున్న ఎన్నో అప్పీళ్లలో ఇది మొదటిది.g

ఇంకో ఉదాహరణ, గ్రీసుకు చెందిన మీనోస్‌ కోకినాకిస్‌ అనే సహోదరుడిది. మతమార్పిడి చేస్తున్నాడనే కారణంతో 48 సంవత్సరాల్లో ఆయన్ని 60 కంటే ఎక్కువసార్లు అరెస్టు చేశారు, 18 సార్లు కోర్టులో విచారణ చేశారు. జైల్లో, ఏజియన్‌ సముద్రంలోని మారుమూల ద్వీపాల్లో ఆయన సంవత్సరాలు తరబడి బందీగా ఉన్నాడు. 1986 లో చివరి విచారణ తర్వాత, సహోదరుడు కోకినాకిస్‌ గ్రీసులోని పైకోర్టుల్లో పెట్టుకున్న అప్పీళ్లు అన్నీ ఓడిపోయాడు. అప్పుడు ఆయన యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టును ఆశ్రయించాడు. చివరికి 1993, మే 25న ఆ కోర్టు సహోదరుడికి అనుకూలంగా తీర్పు ఇస్తూ, ఆయన మత స్వేచ్ఛకు గ్రీసు ప్రభుత్వం భంగం కలిగించిందని చెప్పింది.

యెహోవాసాక్షులు డజన్ల కొద్దీ కేసుల్ని యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టు ముందుకు తీసుకెళ్లారు. వాటిలో చాలా కేసులు గెలిచారు కూడా. ఆ కోర్టును ఆశ్రయించిన వేరే ఏ సంస్థ (మతపరమైనదైనా, కాకపోయినా), ప్రాథమిక మానవ హక్కుల కోసం పోరాడే విషయంలో ఇన్ని కేసులు గెలవలేదు.

యెహోవాసాక్షులు కేసులు గెలిస్తే వేరేవాళ్లకు ఏంటి ఉపయోగం? ఛార్లెస్‌ సి. హేన్స్‌ అనే పండితుడు ఇలా రాశాడు: “మనందరం యెహోవాసాక్షులకు ఎంతో రుణపడి ఉన్నాం. వాళ్లను ఎన్నిసార్లు అవమానించినా, ఊరిలో నుండి గెంటేసినా, ఆఖరికి కొట్టినా వాళ్లకు (అలాగే మనకు) ఉన్న మత స్వేచ్ఛ కోసం పోరాడుతూనే ఉంటారు. ఆ పోరాటంలో వాళ్లు గెలిస్తే, మనందరం గెలిచినట్టే.”

g వాక్‌ స్వాతంత్ర్యం విషయంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి తెలుసుకోవడానికి, తేజరిల్లు! (ఇంగ్లీషు) జనవరి 8, 2003, 3, 4-5, 6-8, 9-11 పేజీలు చూడండి.

9 ఫేస్తు పౌలు గురించి చెప్పినప్పుడు, అగ్రిప్ప రాజుకు పౌలుతో మాట్లాడాలని కుతూహలం కలిగింది. తర్వాతి రోజు ఫేస్తు, అగ్రిప్ప “ఎంతో ఆడంబరంగా” వచ్చి న్యాయపీఠం మీద కూర్చున్నారు. వాళ్ల ఎదుటవున్న ఖైదీ మాట్లాడబోయే మాటల ముందు వాళ్ల వైభవం, రాజసం, ఆర్భాటం ఎందుకూ పనికిరావు.—అపొ. 25:22-27.

10, 11. పౌలు అగ్రిప్పను ఎలా గౌరవించాడు? పౌలు తన గతం గురించి ఏ వివరాల్ని రాజుకు చెప్పాడు?

10 అగ్రిప్ప రాజుకు తన వాదన వినిపించుకునే అవకాశం ఇచ్చినందుకు, పౌలు గౌరవపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాడు. ఎందుకంటే, అగ్రిప్పకు యూదుల ఆచారాలన్నిటి గురించి, వాళ్ల మధ్యవున్న వివాదాల గురించి బాగా తెలుసు. పౌలు తన గతం గురించి ఇలా చెప్పాడు: “నేను పరిసయ్యుల తెగకు చెందినవాణ్ణి . . . మిగతా యూదుల కన్నా ఈ తెగవాళ్లు చాలా నిష్ఠగా ఉంటారు.” (అపొ. 26:5) ఒక పరిసయ్యుడిగా పౌలు మెస్సీయ రాక కోసం ఎదురుచూశాడు. ఆయన్ని నిందించేవాళ్లు ఎదురుచూసింది కూడా, మెస్సీయ గురించిన దేవుని వాగ్దానం నెరవేరడం కోసమే. కానీ క్రైస్తవుడిగా మారిన పౌలు, యేసే మెస్సీయ అని ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. ఆ కారణంగానే ఈ రోజు తనకు విచారణ జరుగుతుందని పౌలు అన్నాడు. దాంతో, పౌలు ఇంకేం చెప్తాడో అని అగ్రిప్పకు ఆసక్తి పెరిగింది.e

11 గతంలో తాను క్రైస్తవుల్ని ఎంతగా హింసించేవాడో చెప్తూ, పౌలు ఇలా అన్నాడు: “ఒకప్పుడు నేను కూడా నజరేయుడైన యేసు పేరుకు వ్యతిరేకంగా చాలా పనులు చేయాలని గట్టిగా నమ్మాను. . . . వాళ్ల మీద [క్రీస్తు అనుచరుల మీద] నాకు చాలా కోపం ఉండేది కాబట్టి వాళ్లను హింసించడానికి వేరే నగరాలకు కూడా వెళ్లాను.” (అపొ. 26:9-11) పౌలు ఏమీ ఎక్కువ చేసి చెప్పట్లేదు. ఆయన క్రైస్తవుల్ని ఎంతగా వెంటాడి హింసించాడో చాలామందికి తెలుసు. (గల. 1:13, 23) ‘మరి అలాంటివాడు ఎలా మారాడు?’ అని అగ్రిప్పకు సందేహం వచ్చి ఉంటుంది.

12, 13. (ఎ) పౌలు తాను ఎలా మారానని అగ్రిప్పకు వివరించాడు? (బి) పౌలు ఎలా ‘ముల్లుకర్రకు ఎదురుతన్నుతున్నాడు’?

12 ఆ ప్రశ్నకు జవాబు, పౌలు తర్వాత అన్న మాటల్లో ఉంది: “ఒక సందర్భంలో, ముఖ్య యాజకులు ఇచ్చిన అధికారంతో, వాళ్ల ఆజ్ఞమేరకు నేను దమస్కుకు ప్రయాణిస్తున్నాను. రాజా, మధ్యాహ్నం అప్పుడు దారిలో సూర్యకాంతి కన్నా గొప్ప వెలుగు ఆకాశం నుండి నా చుట్టూ, నాతో ప్రయాణిస్తున్న వాళ్ల చుట్టూ ప్రకాశించడం చూశాను. దాంతో మేమంతా నేల మీద పడిపోయాం. అప్పుడు ఒక స్వరం హీబ్రూ భాషలో, ‘సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు? ముల్లుకర్రకు ఎదురుతన్నడం వల్ల నీకే హాని జరుగుతుంది’ అని నాతో చెప్పడం విన్నాను. అప్పుడు నేను, ‘ప్రభువా, నువ్వెవరు?’ అని అడిగాను. దానికి ప్రభువు ఇలా అన్నాడు: ‘నేను నువ్వు హింసిస్తున్న యేసును.’”f—అపొ. 26:12-15.

13 ఈ అసాధారణ సంఘటన జరగడానికి ముందు, పౌలు ఒకవిధంగా ‘ముల్లుకర్రకు ఎదురుతన్నుతున్నాడు.’ ఒక జంతువు ముల్లుకర్రకు ఎదురుతన్నితే, ఆ కర్రకు ఉన్న సూదిమొన గుచ్చుకొని నొప్పి పెడుతుంది. పౌలు కూడా దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేయడం ద్వారా తనకు తానే హాని చేసుకున్నాడు. పౌలు మంచివాడే గానీ, తను సరైనదే చేస్తున్నాను అనే భ్రమలో ఉన్నాడు. అందుకే పునరుత్థానమైన యేసు, దమస్కుకు వెళ్తున్న దారిలో పౌలుకు కనిపించి ఆయన ఆలోచనను సరిదిద్దాడు.—యోహా. 16:1, 2.

14, 15. పౌలు తన జీవితంలో ఏ మార్పులు చేసుకున్నానని చెప్పాడు?

14 పౌలు తన జీవితంలో పెద్దపెద్ద మార్పులు చేసుకున్నాడు. ఆయన అగ్రిప్పతో ఇలా అన్నాడు: “పరలోకం నుండి వచ్చిన ఆ దర్శనానికి నేను అవిధేయత చూపించలేదు. అయితే ముందుగా దమస్కులోని వాళ్లకు, తర్వాత యెరూషలేములో, అలాగే యూదయ దేశమంతటా ఉన్నవాళ్లకు, అన్యజనులకు, ‘పశ్చాత్తాపపడండి, పశ్చాత్తాపానికి తగిన పనులు చేస్తూ దేవుని వైపుకు తిరగండి’ అనే సందేశాన్ని ప్రకటిస్తూ వచ్చాను.” (అపొ. 26:19, 20) ఆ రోజు దర్శనంలో యేసుక్రీస్తు అప్పగించిన పనిని, పౌలు కొన్ని సంవత్సరాలుగా నమ్మకంగా చేస్తున్నాడు. దానికి ఎలాంటి ఫలితాలు వచ్చాయి? పౌలు ప్రకటించిన మంచివార్తను విన్నవాళ్లు పశ్చాత్తాపపడి వాళ్ల తప్పుడు జీవితాన్ని, అవినీతిని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు. అంతేకాదు వాళ్లు మంచి పౌరులయ్యారు, చట్టానికి లోబడుతూ ఎక్కడున్నా శాంతిగా జీవిస్తున్నారు.

15 అన్ని ఫలితాలు కళ్లముందే ఉన్నా, పౌలును వ్యతిరేకిస్తున్న యూదులకు అవేమీ కనిపించట్లేదు. పౌలు ఇలా అన్నాడు: “అందుకే యూదులు ఆలయంలో నన్ను పట్టుకొని చంపడానికి ప్రయత్నించారు. అయితే దేవుడిచ్చిన సహాయంతో ఈ రోజు వరకు నేను సామాన్యులకు, గొప్పవాళ్లకు ప్రకటిస్తున్నాను.”—అపొ. 26:21, 22.

16. పౌలులాగే మనం కూడా న్యాయమూర్తులతో, పాలకులతో మన నమ్మకాల గురించి ఎలా చెప్పవచ్చు?

16 నిజ క్రైస్తవులుగా, మనం మన విశ్వాసం గురించి అడిగే ప్రతీఒక్కరికి “జవాబు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా” ఉండాలి. (1 పేతు. 3:15) న్యాయమూర్తులతో, పాలకులతో మన నమ్మకాల గురించి చెప్తున్నప్పుడు అగ్రిప్పతో, ఫేస్తుతో పౌలు ఎలా మాట్లాడాడో అలాగే మాట్లాడవచ్చు. బైబిలు సత్యం తెలుసుకోవడం వల్ల మన జీవితాలు, మన సందేశాన్ని వినేవాళ్ల జీవితాలు ఎలా మెరుగయ్యాయో వాళ్లకు గౌరవపూర్వకంగా చెప్పవచ్చు. అలా చేస్తే ఆ అధికారుల హృదయాలు కరగొచ్చు.

“నువ్వు నన్ను క్రైస్తవుడిగా మార్చేస్తావు” (అపొ. 26:24-32)

17. పౌలు వాదన విన్నాక ఫేస్తు ఏమన్నాడు? ఇప్పుడు కూడా చాలామంది మనల్ని ఎలా చూస్తున్నారు?

17 పౌలు అంత బాగా తన వాదనను వినిపించేసరికి ఫేస్తు, అగ్రిప్ప జీర్ణించుకోలేకపోయారు. అప్పుడు ఏం జరిగిందో గమనించండి: “పౌలు ఇలా తన వాదన వినిపిస్తున్నప్పుడు ఫేస్తు బిగ్గరగా, ‘పౌలూ! నీకు మతిపోయింది. అతిగా చదువుకోవడం వల్ల నీకు పిచ్చి పట్టింది!’ అన్నాడు.” (అపొ. 26:24) ఫేస్తు పౌలును చూసినట్టే ఇప్పుడు చాలామంది మనల్ని చూస్తున్నారు. మనం బైబిలు నిజంగా ఏం బోధిస్తుందో చెప్తుంటే, వాళ్లు మనకు పిచ్చి పట్టిందని అనుకుంటున్నారు. ఈ లోకంలో బాగా చదువుకున్న కొంతమంది, చనిపోయినవాళ్లు పునరుత్థానం అవుతారని బైబిలు చెప్తున్న విషయాన్ని ఒప్పుకోలేకపోతున్నారు.

18. పౌలు ఫేస్తుకు ఏమని జవాబిచ్చాడు? అప్పుడు అగ్రిప్ప ఏమన్నాడు?

18 కానీ పౌలు అధిపతికి ఇలా జవాబిచ్చాడు: “గౌరవనీయుడివైన ఫేస్తూ, నాకు పిచ్చి పట్టలేదు. నేను సత్యమే చెప్తున్నాను, మంచి వివేచనతో మాట్లాడుతున్నాను. నిజానికి, నేను ఎవరితోనైతే ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నానో ఆ రాజుకు ఈ విషయాల గురించి బాగా తెలుసు. . . . అగ్రిప్ప రాజా, నువ్వు ప్రవక్తల్ని నమ్ముతావా? నమ్ముతావని నాకు తెలుసు.” అప్పుడు అగ్రిప్ప పౌలుతో, “త్వరలోనే నువ్వు నన్ను క్రైస్తవుడిగా మార్చేస్తావు” అన్నాడు. (అపొ. 26:25-28) ఆ మాటలు నిజంగా అతని మనసులో నుండి వచ్చాయో, లేక ఉత్తుత్తిగా అన్నాడో మనకైతే తెలీదు. కానీ ఖచ్చితంగా, పౌలు చెప్పిన విషయాలు అగ్రిప్ప మీద ప్రభావం చూపించే ఉంటాయి.

19. ఫేస్తు, అగ్రిప్ప పౌలు విషయంలో ఏ నిర్ణయానికి వచ్చారు?

19 తర్వాత అగ్రిప్ప, ఫేస్తు ఇక విచారణ అయిపోయింది అన్నట్టుగా లేచి నిలబడ్డారు. “వాళ్లు వెళ్లిపోతూ ఒకరితో ఒకరు, ‘ఇతను మరణశిక్ష వేసేంత, చెరసాలలో వేసేంత తప్పేదీ చేయట్లేదు’ అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తర్వాత అగ్రిప్ప ఫేస్తుతో ఇలా అన్నాడు: ‘ఇతను కైసరుకు విన్నవించుకుంటానని అనకపోయుంటే ఇతన్ని విడుదల చేయగలిగేవాళ్లం.’” (అపొ. 26:31, 32) వాళ్ల ముందు నిలబడిన వ్యక్తి నిర్దోషి అని వాళ్లకు తెలుసు. బహుశా ఇప్పటి నుండైనా వాళ్లు క్రైస్తవుల్ని చూసే తీరు మారుతుంది.

20. పౌలు పైఅధికారులకు సాక్ష్యం ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

20 పౌలు ప్రకటించింది విన్న తర్వాత ఫేస్తు గానీ, అగ్రిప్ప గానీ క్రైస్తవులుగా మారి ఉండకపోవచ్చు. మరి పౌలు వాళ్లముందు తన వాదన వినిపించుకోవడం వల్ల ఉపయోగం ఉందా? ఉంది. మామూలుగా అయితే వాళ్లను కలవడమే కష్టం. కానీ పౌలును యూదయలో “రాజుల ముందుకు, అధిపతుల ముందుకు” తీసుకెళ్లడం వల్ల, వాళ్లకు సాక్ష్యమిచ్చే అవకాశం ఆయనకు దొరికింది. (లూకా 21:12, 13) అంతేకాదు పౌలు కష్టాలుపడడం, నమ్మకంగా ఉండడం చూసి తోటి సహోదర సహోదరీలు కూడా ప్రోత్సాహం పొందారు.—ఫిలి. 1:12-14.

21. కష్టాలు వచ్చినా ప్రకటిస్తూ ఉండడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు రావచ్చు?

21 ఇప్పుడు కూడా అంతే. కష్టాలు, వ్యతిరేకత అడ్డొచ్చినా ప్రకటనా పనిని ముందుకు తీసుకెళ్తే ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. మామూలుగా అయితే, మనం అధికారుల్ని కలవడం వీలు అవ్వకపోవచ్చు. కానీ ఇలా అయినా మనం వాళ్లకు సాక్ష్యమిచ్చే అవకాశం దొరుకుతుంది. అంతేకాదు, మనం నమ్మకంగా ఉండడం చూసి తోటి సహోదర సహోదరీలు ప్రోత్సాహం పొందవచ్చు. దాంతో వాళ్లు, దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యమిచ్చే పనిలో ఇంకా ధైర్యంగా కొనసాగవచ్చు.

యూదయకు అధిపతైన పోర్కియు ఫేస్తు

పోర్కియు ఫేస్తు గురించి ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలు, అపొస్తలుల కార్యాలు పుస్తకంలో అలాగే ఫ్లేవియస్‌ జోసిఫస్‌ రాసిన పుస్తకాల్లో మాత్రమే దొరుకుతాయి. దాదాపు క్రీస్తు శకం 58 లో, యూదయ అధిపతైన ఫేలిక్సు స్థానంలోకి ఫేస్తు వచ్చాడు. అధిపతి అయిన రెండు-మూడేళ్లకే ఫేస్తు చనిపోయాడు.

పోర్కియు ఫేస్తు.

ఫేస్తు చాలావరకు తన ముందున్న ఫేలిక్సు కన్నా, తర్వాత వచ్చిన ఆల్బీనస్‌ కన్నా ఎంతో తెలివి, సత్తా ఉన్న అధిపతి అని తెలుస్తుంది. ఫేస్తు పరిపాలించిన కొత్తలో, యూదయలో బందిపోటు దొంగల బెడద ఎక్కువగా ఉండేది. జోసిఫస్‌ చెప్తున్నట్టు, “ఫేస్తు . . . ఆ సమస్యను తీసేయడమే పనిగా పెట్టుకున్నాడు. అతను చాలామంది దొంగల్ని పట్టుకున్నాడు, పట్టుకున్న వాళ్లలో ఎక్కువమందిని చంపేశాడు.” అతను అధిపతిగా ఉన్నప్పుడు, ఆలయ ప్రాంగణంలో ఏం జరుగుతుందో అగ్రిప్ప రాజు చూడకుండా ఉండేలా యూదులు ఒక గోడను కట్టారు. మొదట, ఫేస్తు ఆ గోడను కూల్చేయమని ఆదేశించాడు. కానీ తర్వాత యూదులు విన్నవించుకున్నప్పుడు, ఆ విషయాన్ని రోమా చక్రవర్తి అయిన నీరో దృష్టికి తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చాడు.

ఫేస్తు నేరస్తులకు, తిరగబడేవాళ్లకు చెమటలు పట్టించాడని తెలుస్తుంది. అయితే, యూదుల దగ్గర మంచిపేరు కోసం అతను న్యాయాన్ని తాకట్టు పెట్టాడు. ముఖ్యంగా, అపొస్తలుడైన పౌలు విషయంలో అలా చేశాడు.

రాజైన హేరోదు అగ్రిప్ప II

అపొస్తలుల కార్యాలు 25వ అధ్యాయంలో చెప్పిన అగ్రిప్ప ఎవరంటే, రాజైన హేరోదు అగ్రిప్ప II. ఇతను హేరోద్‌ ద గ్రేట్‌కు మునిమనవడు, అలాగే 14 సంవత్సరాల క్రితం యెరూషలేము సంఘం మీద దాడిచేసిన హేరోదుకు కొడుకు. (అపొ. 12:1) హేరోదు రాకుమారుల్లో అగ్రిప్పే చివరివాడు.

రాజైన హేరోదు అగ్రిప్ప II.

క్రీస్తు శకం 44 లో, అగ్రిప్పకు 17 ఏళ్లు ఉన్నప్పుడు వాళ్ల నాన్న చనిపోయాడు. అప్పుడు అతను రోములో క్లౌదియ చక్రవర్తి ఆస్థానంలో విద్య నేర్చుకుంటున్నాడు. అగ్రిప్ప ఇంకా చిన్నవాడే కాబట్టి, అతన్ని వాళ్ల నాన్న సింహాసనం మీద కూర్చోబెట్టలేం అని చక్రవర్తి దగ్గరున్న సలహాదారులు చెప్పారు. అందుకే ఒక రోమా అధిపతిని అతని బదులు నియమించారు. అయినప్పటికీ ఫ్లేవియస్‌ జోసిఫస్‌ చెప్తున్నట్టు, అగ్రిప్ప రోములో ఉంటూనే యూదుల విషయంలో జోక్యం చేసుకుని, వాళ్ల తరఫున మాట్లాడేవాడు.

దాదాపు క్రీస్తు శకం 50 లో, క్లౌదియ చక్రవర్తి అగ్రిప్పను కల్కిస్‌ మీద రాజుగా నియమించాడు. తర్వాత క్రీస్తు శకం 53 లో ఇతూరయ, త్రకోనీతి, అబిలేనే ప్రాంతాల్ని ఇచ్చాడు. యెరూషలేము ఆలయాన్ని చూసుకుంటూ, యూదుల ప్రధానయాజకుల్ని నియమించే అధికారం కూడా అగ్రిప్ప పొందాడు. క్లౌదియ తర్వాత వచ్చిన నీరో చక్రవర్తి అగ్రిప్పకు గలిలయ, పెరయలోని కొన్ని ప్రాంతాల్ని ఇచ్చాడు. పౌలును కలిసే సమయానికి, అగ్రిప్ప తన చెల్లి బెర్నీకేతో కలిసి కైసరయలో ఉన్నాడు. అప్పటికే ఆమె కిలికియకు రాజుగా ఉన్న తన భర్తను వదిలేసింది.—అపొ. 25:13.

క్రీస్తు శకం 66 లో, రోమా ప్రభుత్వం మీద యూదులు చేస్తున్న తిరుగుబాటును అగ్రిప్ప ఆపాలని చూశాడు. కానీ వాళ్లు అగ్రిప్ప మీదే తిరగబడేసరికి, ఏ దారీ లేక అతను రోమన్లతో చేతులు కలిపాడు. రోమన్లు ఆ తిరుగుబాటును అణచివేసిన తర్వాత, వెస్పేసియన్‌ అనే కొత్త చక్రవర్తి అగ్రిప్పకు ఇంకొన్ని ప్రాంతాల్ని బహుమతిగా ఇచ్చాడు.

a “యూదయకు అధిపతైన పోర్కియు ఫేస్తు” అనే బాక్సు చూడండి.

b “న్యాయపీఠం” అంటే ఒక వేదిక మీద ఉండే కుర్చీ. అది చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడినుండి వచ్చే ఏ తీర్పైనా చాలా ప్రాముఖ్యంగా ఉండేది, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. యేసు మీద వచ్చిన ఆరోపణల్ని పరిశీలిస్తున్నప్పుడు పిలాతు కూర్చున్నది కూడా న్యాయపీఠం మీదే.

c “ప్రకటించే స్వేచ్ఛ కోసం మన కాలంలో చేసిన అప్పీళ్లు” అనే బాక్సు చూడండి.

d 201వ పేజీలో ఉన్న “రాజైన హేరోదు అగ్రిప్ప II” అనే బాక్సు చూడండి.

e క్రైస్తవుడయ్యాక పౌలు యేసే మెస్సీయ అని నమ్మాడు. యూదులు యేసును నమ్మకపోగా, పౌలును ఒక మతభ్రష్టుడిలా చూశారు.—అపొ. 21:21, 27, 28.

f పౌలు “మధ్యాహ్నం అప్పుడు” ప్రయాణించడం గురించి ఒక బైబిలు విద్వాంసుడు ఇలా చెప్పాడు: “సాధారణంగా, ఒక ప్రయాణికుడు మిట్టమధ్యాహ్నం బాగా ఎండ ఉంటుంది కాబట్టి విశ్రాంతి తీసుకుంటాడు. ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్ప ఆ సమయంలో ప్రయాణించడు. కానీ పౌలు మధ్యాహ్నం పూట ప్రయాణిస్తున్నాడంటే, క్రైస్తవుల్ని హింసించాలని ఆయన ఎంత కసిగా ఉన్నాడో అర్థమౌతుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి