కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 10/1 పేజీలు 10-15
  • “శాంతి కోసమైన సమయం” సమీపించింది!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “శాంతి కోసమైన సమయం” సమీపించింది!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిజమైన శాంతికి ఆధారం
  • ఇది ‘యుద్ధము చేయుటకు సమయము,’ ఎందుకు?
  • ఇది “మాటలాడుటకు” సమయము
  • “శాంతి లేకపోయినా శాంతి”ని గురించి మాట్లాడేవారు
  • యెహోవా తన మౌనాన్ని భగ్నం చేయటం
  • నిజమైన శాంతి—ఏ మూలం నుండి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “దేవుని సమాధానము” మీ హృదయములకు కావలిగా ఉండనీయుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • మానవులను ఎవరు శాంతికి నడుపగలరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • నిజమైన శాంతిని వెదకి దానిని వెంటాడండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 10/1 పేజీలు 10-15

“శాంతి కోసమైన సమయం” సమీపించింది!

‘ప్రతిదానికి సమయము కలదు, . . . యుద్ధము చేయుటకు సమాధానపడుటకు [“శాంతి కోసమైన,” NW] సమయము కలదు.’—ప్రసంగి 3:1, 8.

1. యుద్ధమూ శాంతిల సంబంధంగా 20వ శతాబ్దంలో ఏ హాస్యాస్పదమైన పరిస్థితి నెలకొంది?

ప్రజల్లో అధికశాతం మంది శాంతి కోసం పరితపిస్తారు, అందుకు తగిన కారణాలు ఉన్నాయి. చరిత్రలో ఏ శతాబ్దంలో కన్నా ఈ 20వ శతాబ్దంలోనే శాంతి అతి తక్కువగా ఉంది. హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే శాంతిని స్థాపించడానికి ఈ శతాబ్దంలో జరిగినన్ని ప్రయత్నాలు మునుపెన్నడూ జరుగలేదు. 1920లో నానాజాతి సమితి ఏర్పడింది. “మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన శాంతి పరిరక్షక ప్రయత్నాల పరంపరలో అత్యంత ఆర్భాటంతో కూడినది” అని ఒక ఎన్‌సైక్లోపీడియా కెల్లోగ్‌-బ్రియాన్‌ సంధిని గురించి వర్ణించింది. ఆ సంధికి, 1928లో “ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలూ తమ సమ్మతిని తెలుపుతూ . . . జాతీయ విధానాల్లో యుద్ధాన్ని ఒక ఉపకరణంగా ఉపయోగించడం మానుకోవాలనే అంగీకారానికి వచ్చాయి.” తర్వాత 1945లో, అప్పటికే మూతబడిన నానాజాతి సమితి స్థానంలో ఐక్యరాజ్య సమితిని స్థాపించడం జరిగింది.

2. ఐక్యరాజ్య సమితి తన లక్ష్యంగా చెప్పుకుంటున్నదేమిటి, ఎంతమేరకు అది విజయాన్ని సాధించింది?

2 నానాజాతి సమితి లాగానే ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచ శాంతిని స్థాపించడం తన లక్ష్యంగా చెప్పుకుంటుంది. కానీ దాని విజయం పరిమితంగానే ఉంది. నిజమే, రెండు ప్రపంచ యుద్ధాలంతటి పరిమాణంలో లోకంలో ఎక్కడా యుద్ధాలు జరగడం లేదు. అయినప్పటికీ, డజన్లకొద్దీ చిన్న చిన్న పోరాటాలు ఇప్పటికీ లక్షలాది మంది ప్రజల మనశ్శాంతినీ వారి ఆస్తుల్నీ దోచుకుంటున్నాయి, తరచూ వారి ప్రాణాల్ని కూడా అవి బలిగొంటున్నాయి. ఇక, ఐక్యరాజ్య సమితి 21వ శతాబ్దాన్ని “శాంతి కోసమైన సమయం”గా మారుస్తుందని ఆశించడమా?

నిజమైన శాంతికి ఆధారం

3. ద్వేషంతోపాటే నిజమైన శాంతి ఉండటం ఎందుకు సాధ్యం కాదు?

3 ప్రజల మధ్యా, జనాంగాల మధ్యా శాంతి అనేది సాధించడానికి వారి మధ్య కేవలం సహనం ఉంటేనే సరిపోదు. తాను ద్వేషించే వ్యక్తితో నిజంగా ఎవరైనా శాంతిగా ఉండగలరా? 1 యోహాను 3:15 ప్రకారం అలాగని చెప్పలేము, అక్కడిలా ఉంది, “తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు.” ఇటీవలి చరిత్ర నిరూపిస్తున్నట్లుగా నరనరాల్లోనూ జీర్ణించుకుపోయిన ద్వేషం చాలా సులభంగా హింసాయుత చర్యలకు దారితీస్తుంది.

4. కేవలం ఎవరు మాత్రమే శాంతిని అనుభవించగలరు, ఎందుకు?

4 యెహోవా “శాంతిని ఇచ్చే దేవుడు” గనుక, దేవుడంటే ప్రేమగల ప్రజలు, నీతియుక్తమైన ఆయన సూత్రాలంటే ప్రగాఢమైన గౌరవంగల ప్రజలు మాత్రమే శాంతిని అనుభవించగలరు. యెహోవా శాంతిని అందరికీ దయచేయడన్నది స్పష్టం. “దుష్టులకు నెమ్మది [“శాంతి,” NW] యుండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు.” ఎందుకంటే దుష్టులు దేవుని పరిశుద్ధాత్మచే నడిపించబడటానికి నిరాకరిస్తారు, శాంతి ఆ పరిశుద్ధాత్మ ఫలాల్లో ఒకటి.—రోమీయులు 15:33, NW; యెషయా 57:21; గలతీయులు 5:22, NW.

5. నిజ క్రైస్తవులు దేని గురించి ఊహించను కూడా ఊహించలేరు?

5 తోటి మానవులపై యుద్ధం చేయడం—క్రైస్తవులమని చెప్పుకునేవారు ఎంతో తరచుగా చేసినట్లుగా, ప్రాముఖ్యంగా ఈ 20వ శతాబ్దంలో చేసినట్లుగా యుద్ధం చేయడం నిజ క్రైస్తవుల ఊహకందని విషయం. (యాకోబు 4:1-4) దేవుణ్ని గురించి తప్పుగా చెప్పే బోధలకు విరుద్ధంగా వీరు యుద్ధం చేస్తారన్నది నిజం, కానీ ఈ యుద్ధం ప్రజలకు సహాయం చేయడానికే రూపొందించబడింది కానీ వారికి హాని తలపెట్టాలని కాదు. మత విభేదాల మూలంగా ఇతరులను హింసించడం లేదా జాతీయవాదంతో కూడిన కారణాల నిమిత్తం శారీరక హాని తలపెట్టడం అనేవి నిజ క్రైస్తవత్వానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా [“శాంతిగా,” NW] ఉండుడి” అని పౌలు రోమ్‌లోని క్రైస్తవులకు ఉపదేశించాడు.—రోమీయులు 12:17-19; 2 తిమోతి 2:24-26.

6. నేడు నిజమైన శాంతి ఎక్కడ మాత్రమే కనబడుతుంది?

6 నేడు, దైవికంగా అనుగ్రహించబడిన శాంతి యెహోవా దేవుని నిజ ఆరాధకుల్లో మాత్రమే కన్పిస్తుంది. (కీర్తన 119:165; యెషయా 48:18) వారి ఐక్యతను ఏ రాజకీయ విభేదాలూ చెడగొట్టలేవు, ఎందుకంటే వారు ప్రతీచోట రాజకీయంగా తటస్థంగా ఉంటారు. (యోహాను 15:19; 17:14) వారు “యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను . . . సన్నద్ధులై” ఉన్నారు గనుక ఏ మతపరమైన విభేదాలూ వారి శాంతిని భంగపర్చలేవు. (1 కొరింథీయులు 1:10) యెహోవాసాక్షులు అనుభవించే శాంతి ఆధునిక కాలంలోని అద్భుతం, దేవుడు తన ఈ వాగ్దానానికి అనుగుణ్యంగా ఆయన సాధించిన శాంతి అది: “సమాధానమును [“శాంతిని,” NW] నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.”—యెషయా 60:17; హెబ్రీయులు 8:10.

ఇది ‘యుద్ధము చేయుటకు సమయము,’ ఎందుకు?

7, 8. (ఎ) యెహోవాసాక్షులు శాంతిపక్షంగా స్థానం వహించినప్పటికీ వారు ప్రస్తుత సమయాన్ని ఎలా దృష్టిస్తారు? (బి) క్రైస్తవ యుద్ధంలో ప్రాముఖ్యమైన యుద్ధోపకరణం ఏమిటి?

7 యెహోవాసాక్షులు శాంతిపక్షంగా స్థానం వహించినప్పటికీ, ప్రస్తుతం ప్రాముఖ్యంగా ‘యుద్ధము చేయుటకు సమయము’ అని వారు పరిగణిస్తారు. అయితే అది అక్షరార్థమైన యుద్ధము కాదు, ఎందుకంటే బలప్రయోగంతో బైబిలు సందేశాన్ని ఇతరులపై రుద్దడం, “ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము” అన్న దేవుని ఆహ్వానానికి విరుద్ధంగా ఉంటుంది. (ఇటాలిక్కులు మావి.) (ప్రకటన 22:17) ఇక్కడ ఎటువంటి బలవంతపు మతమార్పిడులూ జరగవు! యెహోవాసాక్షులు చేసే యుద్ధం పూర్తిగా ఆధ్యాత్మికమైనది. పౌలు ఇలా వ్రాశాడు: “మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవునియెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై యున్నవి.”—2 కొరింథీయులు 10:4; 1 తిమోతి 1:18.

8 ఈ “యుద్ధోపకరణము”ల్లో ప్రాముఖ్యమైనది “దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గము.” (ఎఫెసీయులు 6:17) ఈ ఖడ్గము శక్తివంతమైనది. “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” (హెబ్రీయులు 4:12) ఈ ఖడ్గాన్ని ఉపయోగిస్తూ క్రైస్తవులు “వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును” పడద్రోయగలుగుతున్నారు. (2 కొరింథీయులు 10:5) వారు అబద్ధ మత సిద్ధాంతాలనూ, హానికరమైన అభ్యాసాలనూ, దైవిక జ్ఞానానికి బదులుగా మానవ జ్ఞానాన్ని ప్రతిబింబించే తత్త్వజ్ఞానాన్నీ బట్టబయలు చేయడాన్ని అది సాధ్యపరుస్తుంది.—1 కొరింథీయులు 2:6-8; ఎఫెసీయులు 6:11-13.

9. పాపభరితమైన శరీరానికి విరుద్ధంగా మనం చేసే యుద్ధంలో వెనుకంజ వేసే పనిలేదు, ఎందుకని?

9 మరొక విధమైన ఆధ్యాత్మిక యుద్ధం, పాపభరితమైన శరీరానికి విరుద్ధంగా చేసేది. క్రైస్తవులు పౌలు మాదిరిని అనుకరిస్తారు, ఆయనిలా ఒప్పుకున్నాడు: “ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.” (1 కొరింథీయులు 9:27) కొలొస్సయిలోని క్రైస్తవులు “భూమిమీదనున్న [తమ] అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను” చంపేసుకోవాలని ఉద్బోధించబడ్డారు. (కొలొస్సయులు 3:5) అంతేగాక బైబిలు రచయిత అయిన యూదా, “పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము . . . పోరాడవలెనని” క్రైస్తవులకు ఉద్బోధించాడు. (యూదా 3) మనం ఎందుకు అలా చేయాలి? పౌలు జవాబిస్తున్నాడు: “మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీరక్రియలను చంపినయెడల జీవించెదరు.” (రోమీయులు 8:13) స్పష్టమైన ఈ వ్యాఖ్య దృష్ట్యా చెడు దృక్పథాలకు విరుద్ధంగా మనం చేసే యుద్ధంలో ఏమాత్రం వెనుకంజ వేసే పనిలేదు.

10. పందొమ్మిది వందల పద్నాలుగులో ఏమి జరిగింది, ఇది సమీప భవిష్యత్తులో ఏమి సంభవించడానికి దారితీసింది?

10 ప్రస్తుతము యుద్ధం చేయడానికి సమయము అని దృష్టించడానికి మరో కారణం, “మన దేవుని ప్రతిదండన దినము” ఆసన్నం కావడమే. (యెషయా 61:1, 2) 1914లో, మెస్సీయా రాజ్యాన్ని స్థాపించడానికీ, సాతాను విధానానికి విరుద్ధంగా క్రియాశీలంగా యుద్ధం చేసే అధికారం ఆ రాజ్యానికి ఇవ్వడానికీ యెహోవా నియమిత సమయం ఆసన్నమైంది. దైవిక జోక్యం లేకుండా మానవునిచే మాత్రమే రూపొందిన పరిపాలనతో ప్రయోగాలు చేయడానికి కేటాయించబడిన సమయం అప్పటితో ముగిసింది. దేవుని మెస్సీయా పరిపాలకుణ్ని స్వీకరించడానికి బదులుగా ప్రజల్లో అత్యధికులు మొదటి శతాబ్దంలో చేసినట్లుగానే నేడు కూడా ఆయన్ను తిరస్కరిస్తూనే ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 28:27) తత్ఫలితంగా, రాజ్యానికి వ్యతిరేకత ఉన్నందు మూలాన, క్రీస్తు “శత్రువులమధ్యను . . . [“లోబరచుకుంటూ,” NW] పరిపాలన” చేయవలసి వచ్చింది. (కీర్తన 110:2) ఆనందకరమైన విషయం ఏమిటంటే, ఆయన ‘తన విజయాన్ని పూర్తిచేస్తాడని’ ప్రకటన 6:2, NW వాగ్దానం చేస్తుంది. ఇది ఆయన, “హెబ్రీభాషలో హార్‌మెగిద్దోనను,” “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధ” సమయంలో చేస్తాడు.—ప్రకటన 16:14, 16.

ఇది “మాటలాడుటకు” సమయము

11. యెహోవా గొప్ప సహనాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నాడు, కానీ చివరికి ఏమి వస్తుంది?

11 మానవ వ్యవహారాల్లో 1914వ సంవత్సరం మలుపురాయిగా ఉన్నప్పటి నుండి ఇప్పటికి 85 సంవత్సరాలు గతించిపోయాయి. మానవజాతితో యెహోవా అత్యంత సహనాన్ని కనపరుస్తున్నాడు. ఆయన ఇప్పటి పరిస్థితుల అత్యవసరతను గురించి తన సాక్షులకు పూర్తిగా తెలియజేశాడు. కోట్లాదిమంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఈ ప్రజానీకం హెచ్చరించబడటానికి అర్హులు ఎందుకంటే, ‘యెహోవా యెవడును నశింపవలెనని యచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచున్నాడు.’ (2 పేతురు 3:9) అయినప్పటికీ, ‘ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకము నుండి ప్రత్యక్షమయ్యే’ సమయం త్వరలోనే వస్తుంది. అప్పుడు, దేవుని రాజ్య సందేశాన్ని ఉద్దేశపూర్వకంగా తిరస్కరించిన వారందరు, “దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని” యేసు చేసే “ప్రతిదండన”ను అనుభవిస్తారు.—2 థెస్సలొనీకయులు 1:6-9.

12. (ఎ) మహా శ్రమ ఎప్పుడు ప్రారంభమౌతుందనేదాని గురించి ఊహాగానాలు చేయడం ఎందుకు నిష్ప్రయోజనకరం? (బి) ఈ విషయంలో యేసు ఏ ప్రమాదాన్ని గురించి హెచ్చరించాడు?

12 యెహోవా సహనం ఎప్పుడు నశిస్తుంది? “మహా శ్రమ” ఎప్పుడు ప్రారంభమౌతుందనే దాని గురించి ఊహాగానాలు చేయడం నిష్ప్రయోజనకరం. యేసు స్పష్టంగా చెప్పాడు: “ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు . . . [ఎవరును] ఎరుగరు.” మరోవైపు, ఆయనిలా ఉద్బోధించాడు: “కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. . . . మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.” (మత్తయి 24:20, 21, 36, 42, 44) స్పష్టంగా చెప్పాలంటే, మనం ప్రపంచ సంఘటనల్ని ప్రతి రోజు జాగ్రత్తగా పరిశీలించి చూస్తూ, మహా శ్రమలు మనమీదకు వచ్చిపడటాన్ని దృష్టిలో ఉంచుకోవడమని దానర్థం. (1 థెస్సలొనీకయులు 5:1-5) ఇందుకు బదులుగా, మనం మన వేగాన్ని తగ్గించివేసుకుని, సాధారణమైన జీవితాలని పిలువబడే జీవితాలను గడుపుతూ, విషయాలు ఎలా అభివృద్ధి చెందుతాయో వేచిచూద్దాంలే అనే దృక్పథం కల్గివుండటం ఎంత ప్రమాదకరమైనది! యేసు ఇలా చెప్పాడు: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.” (లూకా 21:34, 35) ఈ ఒక్క విషయమై మనం నిశ్చయతను కలిగివుండవచ్చు: యెహోవా యొక్క “నలుగురు దేవదూతలు” నాశనంతో కూడిన “నాలుగు దిక్కుల వాయువులను” ప్రస్తుతం పట్టుకొని ఉన్నట్లుగా ఎల్లకాలం పట్టుకుని ఉండరు.—ప్రకటన 7:1-3.

13. దాదాపు 60 లక్షల మంది ప్రజలు ఏమి గుర్తించారు?

13 లెక్కలు తేల్చుకునే దినం ముంచుకు వస్తున్న దృష్ట్యా, “మాటలాడుటకు” ఒక సమయం ఉందన్న సొలొమోను మాటలు ప్రత్యేకమైన అర్థాన్ని సంతరించుకుంటాయి. (ప్రసంగి 3:7) మాటలాడటానికి ఇప్పుడే సమయం అని గుర్తించిన దాదాపు 60 లక్షల మంది యెహోవాసాక్షులు దేవుని రాచరిక మహిమను గురించి అత్యుత్సాహంతో మాట్లాడుతున్నారు, ఆయన ప్రతిదండన చేసే దినాన్ని గురించి హెచ్చరిస్తున్నారు. వారు క్రీస్తు యొక్క ఈ యుద్ధసన్నాహ దినాన తమను తాము ఇష్టపూర్వకంగా సమర్పించుకుంటున్నారు.—కీర్తన 110:3; 145:10-12.

“శాంతి లేకపోయినా శాంతి”ని గురించి మాట్లాడేవారు

14. సా.శ.పూ. ఏడవ శతాబ్దంలో ఏ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు?

14 యెరూషలేము దేవునికి అవిధేయతను కనపరుస్తూ దారితప్పినందున, సా.శ.పూ. ఏడవ శతాబ్దంలో దేవుని ప్రవక్తలైన యిర్మీయా యెహెజ్కేలులు దానికి విరుద్ధంగా దైవిక తీర్పు సందేశాలను ప్రకటించారు. అక్కడ ప్రసిద్ధులైన ప్రాబల్యంగల మత నాయకులు దేవుని ఈ సందేశకులు చెప్పినదాన్ని ఖండించినప్పటికీ వీరు ప్రవచించిన నాశనం సా.శ.పూ. 607లో జరిగింది. అలా ఖండించినవారు “అవివేక ప్రవక్తల”ని రుజువైంది, వీరు “సమాధానమేమియు లేకపోయినను . . . సమాధానమని [“శాంతి లేకపోయినా ‘శాంతి ఉన్నది!’ అని,” NW] చెప్పి [దేవుని] జనులను మోసపుచ్చుచున్నారు.”—యెహెజ్కేలు 13:1-16; యిర్మీయా 6:14, 15; 8:8-12.

15. నేడు అటువంటి అబద్ధ ప్రవక్తలు ఉన్నారా? వివరించండి.

15 ఆ కాలంలోని “అవివేక ప్రవక్తల” వలెనే, నేటి మత నాయకుల్లో అత్యధికులు, రానైయున్న దేవుని తీర్పు దినాన్ని గురించి ప్రజలను హెచ్చరించడంలో విఫలమౌతున్నారు. అలా హెచ్చరించడానికి బదులుగా, రాజకీయ సమూహాలు చివరికి శాంతి భద్రతలను సాధిస్తారన్న ఆశావాదంతో కూడిన అభిప్రాయాన్ని ప్రజల్లో కలుగజేస్తున్నారు. దేవుని కన్నా ఎక్కువగా మానవులను తృప్తి పర్చాలన్న ఆతురతతో వారు తమ చర్చి సభ్యులు ఏమి వినాలని కోరుకుంటారో అదే వారికి చెబుతారు గానీ, దేవుని రాజ్యం స్థాపించబడిందనీ, మెస్సీయా రాజు త్వరలోనే తన విజయాన్ని పూర్తిచేయనై ఉన్నాడనీ మాత్రం వివరించరు. (దానియేలు 2:44; 2 తిమోతి 4:3, 4; ప్రకటన 6:2) అబద్ధ ప్రవక్తలుగా వారు కూడా “శాంతి లేకపోయినా ‘శాంతి ఉన్నది!’” అని మాట్లాడుతుంటారు. కానీ వారు ఎవరికైతే తప్పుగా ప్రాతినిధ్యం వహించారో, ఎవరి నామానికైతే చెప్పనలవి కానంత అవమానాన్ని తీసుకొచ్చారో ఆ వ్యక్తి ఉగ్రతకు వారు గురైనప్పుడు వారి దృఢ నమ్మకం కాస్తా త్వరలోనే అకస్మాత్తుగా భయంగా మారుతుంది. బైబిలులో అనైతికమైన స్త్రీగా వర్ణించబడిన ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యానికి నాయకులు శాంతిని గూర్చి మోసకరమైన కేకలు వేస్తుండగానే మృత్యువాతకు గురౌతారు.—ప్రకటన 18:7, 8.

16. (ఎ) యెహోవాసాక్షులు దేని విషయంలో ప్రఖ్యాతిగాంచారు? (బి) వారు “శాంతి లేకపోయినా ‘శాంతి ఉన్నది!’” అని కేకలు వేసే వారికి ఎలా భిన్నంగా ఉన్నారు?

16 ప్రసిద్ధులైన, ప్రాబల్యంగల నాయకుల్లో అత్యధికులు వేషధారణతో శాంతి వాగ్దానాలు చేస్తూనే ఉన్నప్పటికీ, నిజమైన శాంతిని గురించిన దేవుని వాగ్దానంలో విశ్వాసం ఉన్నవారి నమ్మకాన్ని అది కదిలించదు. ఒక శతాబ్దంపైగా యెహోవాసాక్షులు దేవుని వాక్యాన్ని యథార్థతతో సమర్థిస్తూ ఉన్నవారిగా, అబద్ధమతాన్ని ధైర్యంగా వ్యతిరేకిస్తున్న వారిగా, దేవుని రాజ్యానికి దృఢ చిత్తంతో మద్దతునిస్తున్నవారిగా ప్రఖ్యాతిగాంచారు. శాంతిని గురించి ప్రజలకు తీయని మాటలు చెప్పి నిద్రబుచ్చడానికి బదులుగా, నేడు యుద్ధానికైన సమయం అన్న వాస్తవాన్ని వారి కళ్ళ ముందుంచడానికి యెహోవాసాక్షులు తీవ్రంగా కృషిచేస్తారు.—యెషయా 56:10-12; రోమీయులు 13:11, 12; 1 థెస్సలొనీకయులు 5:6.

యెహోవా తన మౌనాన్ని భగ్నం చేయటం

17. యెహోవా త్వరలోనే తన మౌనాన్ని భగ్నం చేస్తాడంటే ఏమిటి అర్థం?

17 సొలొమోను ఇలా కూడా అన్నాడు: “ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చు[ను].” (ప్రసంగి 3:17) అవును, అబద్ధమతంపైనా, “యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచు[న్న]” “భూరాజుల”పైనా తీర్పును అమలు చేయడానికి యెహోవా ఒక సమయాన్ని నియమించాడు. (కీర్తన 2:1-6; ప్రకటన 16:13-16) ఒక్కసారి ఆ సమయం ఆసన్నమైన తర్వాత యెహోవా ‘ఊరకుండే’ రోజులు ముగుస్తాయి. (కీర్తన 83:1; యెషయా 62:1; యిర్మీయా 47:6, 7) సింహాసనాసీనుడైన తన మెస్సీయా రాజైన యేసుక్రీస్తు ద్వారా ఆయన తన వ్యతిరేకులు అర్థం చేసుకునే ఏకైక భాషలో ‘మాట్లాడతాడు’: “యెహోవా శూరునివలె బయలుదేరును యోధునివలె ఆయన తన ఆసక్తి రేపుకొనును ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారియెదుట తన పరాక్రమము కనుపరచుకొనును. చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని ప్రసవవేదనపడు స్త్రీవలె విడువకుండ నేను బలవంతముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచునున్నాను. పర్వతములను కొండలను పాడుచేయుదును వాటిమీది చెట్టు చేమలన్నిటిని ఎండిపోచేయుదును నదులను ద్వీపములుగా చేయుదును మడుగులను ఆరిపోచేయుదును. వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసికొని వచ్చెదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును.” (ఇటాలిక్కులు మావి.)—యెషయా 42:13-16.

18. దేవుని ప్రజలు ఏ విధంగా త్వరలోనే ‘మౌనముగా ఉంటారు’?

18 యెహోవా తన దైవత్వాన్ని సమర్థించుకుంటూ ‘మాట్లాడినప్పుడు,’ ఇక ఆయన ప్రజలు తమను తాము సమర్థించుకుంటూ మాట్లాడాల్సిన అవసరం ఉండదు. అప్పుడు “మౌనముగా నుండుట” వారి వంతు. గతకాలాల్లోని దైవ సేవకులకు వర్తించినట్లుగానే వీరికీ ఈ మాటలు వర్తిస్తాయి: “ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; . . . మీరు యుద్ధపంక్తులు తీర్చి నిలువబడుడి; మీతోకూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు.”—2 దినవృత్తాంతములు 20:17.

19. క్రీస్తు యొక్క ఆధ్యాత్మిక సహోదరులకు త్వరలో ఏ ఆధిక్యత లభిస్తుంది?

19 సాతానుకూ వాని సంస్థకూ ఎంత ఘోరమైన పరాజయమో కదా! మహిమపర్చబడిన క్రీస్తు సహోదరులు, “సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును” అన్న వాగ్దానానికి అనుగుణ్యంగా నీతి నిమిత్తమై తిరుగులేని విజయాన్ని సాధించడంలో భాగం వహిస్తారు. (రోమీయులు 16:20) ఎన్నో ఏండ్లుగా పరితపించిన శాంతి ఎట్టకేలకు చేరువైంది.

20. త్వరలోనే దేనికి సమయమై ఉంటుంది?

20 యెహోవా శక్తి ఈ విధంగా గొప్పగా ప్రదర్శితం అయినప్పుడు చూడగలిగే భూప్రజల జీవితం ఎంత ధన్యం! అటుతర్వాత త్వరలోనే, గతకాలాల్లోని విశ్వసనీయులైన స్త్రీపురుషుల పునరుత్థానానికి నియమిత సమయం ఆసన్నమైనప్పుడు వారు వీరిలో చేరుతారు. క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన నిజంగా, “నాటుటకు . . . బాగుచేయుటకు . . . కట్టుటకు . . . నవ్వుటకు . . . నాట్యమాడుటకు . . . కౌగలించుటకు . . . ప్రేమించుటకు” సమయమై ఉంటుంది. అవును, అది నిరంతరం “శాంతి కోసమైన సమయం”గా ఉంటుంది!—ప్రసంగి 3:1-8; కీర్తన 29:11; 37:11; 72:7.

మీ జవాబు ఏమిటి?

◻ నిరంతరం నిలిచే శాంతికి ఆధారం ఏమిటి?

◻ యెహోవాసాక్షులు ప్రస్తుత సమయాన్ని యుద్ధానికైన సమయంగా ఎందుకు పరిగణిస్తారు?

◻ దేవుని ప్రజలు ఎప్పుడు ‘మాట్లాడాలి,’ వారు ఎప్పుడు ‘మౌనముగా ఉండాలి’?

◻ యెహోవా తన మౌనాన్ని ఎలా, ఎప్పుడు భగ్నం చేస్తాడు?

[13వ పేజీలోని బాక్సు]

యెహోవా వీటికి సమయాన్ని నియమించాడు

◻ దేవుని ప్రజలపై దాడిచేసేలా చేయడానికి గోగును లాగటం.—యెహెజ్కేలు 38:3, 4, 10-12

◻ మహా బబులోనును నాశనం చేయాలన్న ఆలోచనను మానవ పరిపాలకుల హృదయాల్లో పెట్టడం.—ప్రకటన 17:15-17; 19:2

◻ గొఱ్ఱెపిల్ల వివాహాన్ని జరిపించడం.—ప్రకటన 19:6, 7

◻ హార్‌మెగిద్దోను యుద్ధాన్ని ప్రారంభించడం.—ప్రకటన 19:11-16, 19-21

◻ యేసు వెయ్యేండ్ల పరిపాలనను ప్రారంభించడానికి సాతానును బంధించడం.—ప్రకటన 20:1-3

ఇక్కడ పేర్కొనబడిన సంఘటనలు కేవలం లేఖనాల్లో అవి సూచించబడిన క్రమంలో మాత్రమే ఇవ్వబడ్డాయి. ఈ ఐదు సంఘటనలూ యెహోవా నిర్ణయించిన క్రమంలోనే సంభవిస్తాయనీ, ఆయన ఎప్పుడు నిర్ణయిస్తాడో కచ్చితంగా అప్పుడే సంభవిస్తాయనీ మనం పూర్తి నిశ్చయతను కలిగివుండవచ్చు.

[15వ పేజీలోని చిత్రాలు]

క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన నిజంగా . . .

నవ్వుటకు . . .

కౌగలించుటకు . . .

ప్రేమించుటకు . . .

నాటుటకు . . .

నాట్యమాడుటకు . . .

కట్టుటకు . . . సమయమై ఉంటుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి