మన సాహిత్యాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించండి
1 మన సాహిత్యాలను సంస్థీకృత రీతిలో పంపిణీ చేయటం ఆరువేల కాపీలతో కావలికోట జూలై 1, 1879 [ఆంగ్ల] సంచికతో ప్రారంభమైంది. అప్పట్నుంచి, గొప్పవైవిధ్యంగల సాహిత్యాలు పుంఖానుపుంఖాలుగా ప్రచురించబడి పంపిణీ చేయబడ్డాయి.
సరళీకృత సాహిత్య పంపిణీ ఏర్పాటు
2 మనకు 1999 నవంబరు మధ్యలో వివరించబడినట్లుగా పత్రికలు సాహిత్యాలు ప్రచారకులకు, ఆసక్తిగల ప్రజలకు సరళీకృత సాహిత్య పంపిణీ ఏర్పాటు మీద ఆధారపడే అందించబడతాయి, అంటే వాటిని పొందటానికి నిర్దిష్టమైన విరాళాన్ని ముందే చెల్లించాలన్న లేక అడగాలన్న నియమం లేకుండానే వారికి అందుబాటులో ఉంటాయి. సాహిత్యాన్ని ప్రతిపాదించినప్పుడు, సువార్త ప్రకటనాపని యొక్క ప్రపంచవ్యాప్త పనికి మద్దతుగా స్వచ్ఛంద విరాళాలు అంగీకరించబడతాయని చెప్పవచ్చు. యెహోవా ఈ ఏర్పాటును ఆశీర్వదిస్తాడని మేము విశ్వసిస్తున్నాము.—పోల్చండి మత్తయి 6:33.
క్షేత్రంలోని పరిస్థితులతో వ్యవహరించటం
3 ఇతరులకు సువార్తపట్ల ఆసక్తి రేకెత్తించటంలో మనం కొనసాగుతాము. ఎక్కడైతే ఆసక్తి ఉండదో అక్కడ సాహిత్యాల్ని ఇవ్వనవసరం లేదు. ఆసక్తిలేని వారికిచ్చి మన సాహిత్యాన్ని వృథాచేసుకోవాలనుకోము. మరోవైపు, ఎక్కడైతే ఆసక్తి కనబడుతుందో, మన సాహిత్యాన్ని చదవటానికి ఇంటివారు ఇష్టపడతారో అక్కడ వాటిని ఇవ్వవచ్చు. మనం మన సాహిత్యాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలనుకుంటాము.
4 మీరు సాహిత్యాన్ని చూపించిన తర్వాత చెప్పటానికి ఈ క్రింద కొన్ని సూచనలున్నాయి: “మీరు దీన్ని చదవటానికి ఇష్టపడితే నేను మీకివ్వటానికి సంతోషిస్తాను.” మామూలుగా ఇంటివారు ఇలా అడుగవచ్చు: “దీని ఖరీదు ఎంత?” మీరిలా అనవచ్చు: “మేము వ్యాపారం చేయటంలేదు. మేము ఈ సాహిత్యాన్ని అమ్మటంలేదు. ప్రజలు నిత్యజీవ మార్గాన్ని గూర్చి నేర్చుకోవటానికి సహాయం చేసేలా స్వచ్ఛందంగా మేము చేస్తున్న ఈ పని, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా 233 దేశాల్లో జరుగుతూ ఉంది. ఈ పని జరగటానికి మీరు కూడా ఏమైనా విరాళం ఇవ్వాలనుకుంటే దాన్ని స్వీకరించటానికి మేము సంతోషిస్తాము.”
5 పత్రికను ప్రతిపాదిస్తున్నప్పుడు అందులోని ఒకానొక శీర్షికకు సంబంధించి ప్రశ్నలను అడిగి, ఇలా చెప్పవచ్చు: “వాటిని గూర్చిన వివరాలను మీరు ఈ శీర్షికలో చూడవచ్చు. మీరీ రెండు పత్రికలనూ చదవాలనుకుంటే వీటిని మీకు ఇస్తాను.” వారు అంగీకరించినట్లైతే మీరింకా ఇలా అనవచ్చు: “మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇందులోని సమాచారం మీకు అనేక విషయాల్ని తెలియజేయగలదని అనుకుంటున్నాను. వీటిపైన మీ అభిప్రాయం తెలుసుకోవటానికి నేను వచ్చేవారం మళ్లీ వస్తాను. ఈ కావలికోట 132 భాషల్లో ప్రచురించబడి ప్రపంచమంతటా 2,20,00,000 కంటే ఎక్కువ కాపీలు పంపిణీ చేయబడుతున్నాయి. ఈ పని అంతా స్వచ్ఛంద విరాళాల మద్దతుపైనే జరుగుతుంది. మీరు కూడా ఈ విద్యాపని జరగటానికి కొంత విరాళాన్నివ్వటానికి ఇష్టపడినట్లైతే సంతోషంగా మేము దాన్ని అంగీకరిస్తాము.”
6 కొన్నిసార్లు ప్రపంచవ్యాప్త పనికి సంబంధించిన విరాళాల విషయం ప్రస్తావించటం ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఉదాహరణకు ఆసక్తి చూపిన ఇంటివారు ఇలా అడుగవచ్చు: “మీరు దీన్ని ఊరకే ఇచ్చేస్తారా?” మీరిలా చెప్పవచ్చు: “దీన్ని మీరు చదవాలనుకుంటే, మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు. మనం మాట్లాడిన దాన్ని గూర్చి, మా ప్రపంచవ్యాప్త పనిని గూర్చి మీతో ఇంకా చెప్పటానికి మరో వారం వస్తాను.” ఆ తర్వాత చేసే సందర్శనాల్లో ఆ ఇంటివ్యక్తి మన పనికి ఎలా ఆర్థిక మద్దతు అందుతుందో తెలుసుకోవచ్చు.
7 లేదా ఆ ఇంటివ్యక్తి సాహిత్యాన్ని వెంటనే తీసుకుని “థాంక్యూ” అని చెప్పవచ్చు. అప్పుడు మీరు ఇలా చెప్పవచ్చు: “మీరు వాటిని చదివి ఆనందిస్తారని అనుకుంటున్నాను. చాలామంది ఆశ్చర్యపోతుంటారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పనికి డబ్బు ఎక్కణ్నుంచి వస్తుందా అని. ఈ పుస్తకాల్ని తీసుకున్న చాలామంది తాము నేర్చుకున్న విషయాల్నిబట్టి తమ ప్రశంసను తెలియజేసి ఈ పని ముందుకు కొనసాగటానికి వారే స్వచ్ఛందంగా చిన్న విరాళాన్ని ఇచ్చారు. ప్రజలు అలా ఇస్తున్నప్పుడు అలాంటివాటిని మేము సంతోషంగా స్వీకరిస్తాము.”
అసలైన ఆసక్తి ఉందా?
8 సాహిత్యాన్ని గుడ్డిగా ప్రజల చేతుల్లోకి పడేయాలన్నది మన సంకల్పంగాదు. మన సాహిత్యాలు వాటి నిశ్చయమైన సంకల్పాన్ని నెరవేర్చాలని మనం కోరుకుంటాము, అంటే, యెహోవా మహోన్నత సంకల్పాల్ని గూర్చి నేర్చుకోవాలనుకునే నిష్కపటమైన ప్రజలకు సహాయం చేయాలనుకుంటాము. ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి ఎంతమాత్రం లేని వ్యక్తులకు సాహిత్యాన్నిస్తే అవి వ్యర్థం అయిపోవచ్చు. (హెబ్రీ. 12:16) ఫలవంతమైన సాహిత్య పంపిణీ, అసలైన ఆసక్తిని గుర్తించే మీ సామర్థ్యంపై ఆధారపడివుంటుంది. అలాంటి ఆసక్తి ఎలా కనబడుతుంది? మీతో మాట్లాడటానికి చూపే ఇష్టతే ఒక మంచి సూచన. లేదా మీరు మాట్లాడుతున్నప్పుడు వారు శ్రద్ధ చూపటం, ప్రశ్నలకు ప్రత్యుత్తరమివ్వటం, చర్చలో పాల్గొని తన అభిప్రాయాల్ని వ్యక్తం చేయటం వంటివి అసలైన ఆసక్తిని సూచించవచ్చు. మైత్రీభావంగల పొరుగువానిలా గౌరవంగా మీతో మాట్లాడటం వాళ్లకు ఆసక్తి ఉందని సూచించవచ్చు. మీరు బైబిలునుంచి చదువుతుండగా గమనించటం దేవుని వాక్యం పట్ల గౌరవం ఉందని తెలియజేయవచ్చు. సాహిత్యాన్ని గానీ ఇస్తే చదువుతారేమోనని అడగటం తరచూ సహాయకరంగా ఉంటుంది. ఆ సంభాషణని కొనసాగించటానికి మరోసారి వస్తామని కూడా మీరు చెప్పవచ్చు. అనుకూలమైన సమాధానం వారి ఆసక్తికి మరో నిదర్శనం. అలాంటి నిజమైన ఆసక్తిని గూర్చిన నిదర్శనాలను మీరు గమనించినప్పుడు, అలాంటి వ్యక్తులు అందుకున్న సాహిత్యాన్ని వారు సరైన రీతిలో ఉపయోగించే సాధ్యత ఉంటుంది.
9 మన పనికి సంబంధించిన పద్ధతిలోని సవరణ మనం ‘దైవ సందేశాన్ని సంతలో సరకులా అమ్మే వాళ్ళము కాదు’ అనటానికి మరో నిదర్శనం. (2 కొరిం. 2:17, పరిశుద్ధ బైబిల్) ఇంకా మనం ఈ లోకానికి వేరై ఉన్నామని కూడా అది నిరూపిస్తుంది.—యోహా. 17:14.
10 మహా బబులోను నాశనం సమీపిస్తుండగా, మత శక్తులన్నింటిపైనా ఒత్తిడి అంతకంతకూ ఎక్కువవుతుంది. మన ముఖ్యచింత ప్రాముఖ్యమైన ప్రపంచవ్యాప్త రాజ్య ప్రకటన పని ఆటంకం లేకుండా ముందుకు కొనసాగించి మరింత మందిని రక్షణలోకి తీసుకురావాలన్నదే.—మత్త. 24:14; రోమా. 10:13, 14.