ప్రశ్నాభాగం
▪ మనం ఒకవ్యక్తికి ప్రచురణలు ఇవ్వాలా, వద్దా అనేది ఎలా తెలుసుకోవచ్చు?
ముందుగా ఒకవ్యక్తికి ఆసక్తి ఉందో లేదో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ ఆ వ్యక్తి నిజంగా ఆసక్తి చూపిస్తే, మనం రెండు పత్రికలనుగానీ, బ్రోషురునుగానీ, పుస్తకాన్నిగానీ లేదా ఆ నెలలో అందిస్తున్న వేరే ప్రచురణనుగానీ ఇవ్వవచ్చు. ఆ వ్యక్తి విరాళంగా కొంత డబ్బే ఇచ్చినా లేదా అసలు ఇవ్వకపోయినా ఆయనకు ప్రచురణలను ఇస్తాం. (యోబు 34:19; ప్రక. 22:17) కానీ, ప్రశస్తమైన మన ప్రచురణల విలువ తెలియని వాళ్లకు వాటినివ్వం.—మత్త. 7:6.
గృహస్థునికి ఆసక్తి ఉందని మనం ఎలా తెలుసుకోవచ్చు? ముందుగా ఆ వ్యక్తి మాట్లాడడానికి సుముఖంగా ఉంటాడు. మనం చెప్పేది జాగ్రత్తగా వింటాడు, అడిగిన వాటికి సమాధానం ఇస్తాడు, మనం మాట్లాడే విషయంమీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. మనం బైబిల్లో నుండి లేఖనం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా గమనిస్తుంటే దేవుని వాక్యమంటే ఆయనకు గౌరవముందని తెలుస్తుంది. చాలా సందర్భాల్లో, మనం ఇచ్చే ప్రచురణలు చదువుతారో లేదో గృహస్థులను నేరుగా అడగడం మంచిది. ప్రజలకు ఆసక్తి ఉందో లేదో ప్రచారకులు జాగ్రత్తగా గమనించి తెలుసుకోవాలి. ఉదాహరణకు, వీధి సాక్ష్యమిస్తున్నప్పుడు అసలేమీ ఆలోచించకుండా ఎవరికి పడితే వాళ్లకు పత్రికలు, బ్రోషుర్లు లేదా పుస్తకాలు ఇవ్వడం సరికాదు. ఒక వ్యక్తికి ఆసక్తి ఉందో లేదో తెలుసుకోలేకపోతే హ్యాండ్‌బిల్లునుగానీ, కరపత్రాన్నిగానీ ఇస్తే సరిపోతుంది.
అలాగే, ఒక ప్రచారకుడు ఎంత విరాళం ఇవ్వగలడనే దాన్నిబట్టి కాదుగానీ, పరిచర్యలో తనకు ఎంత అవసరమౌతుందనే దాన్నిబట్టి సాహిత్య విభాగం దగ్గర ప్రచురణలు తీసుకోవాలి. ప్రచురణల కోసం కాదుగానీ ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి సంబంధించిన అన్ని కార్యకలాపాలకు మద్దతునివ్వడానికి మనం విరాళాలు ఇస్తున్నాం. మనకు కృతజ్ఞత ఉంటే, మన ఆర్థిక పరిస్థితి ఎలావున్నా రాజ్యసంబంధ విషయాలకు మద్దతునివ్వడానికి మన సమృద్ధిని బట్టి కాదుగానీ, మనకు ఉన్నంతలో మనస్ఫూర్తిగా ఇవ్వడానికి ముందుకొస్తాం. (మార్కు 12:41-44; 2 కొరిం. 9:7) దీన్ని మనసులో ఉంచుకుంటే, మనకు ఎన్ని ప్రచురణలు కావాలో అన్నే తీసుకుంటాం, అంతేగానీ అనవసరంగా విరాళాలను వృథా చేయం.
[2వ పేజీలోని చిత్రం]
ప్రజలకు ఆసక్తి ఉందో లేదో ప్రచారకులు జాగ్రత్తగా గమనించి తెలుసుకోవాలి