ఆత్మీయ గమ్యములు వెంటాడునట్లు ప్రోత్సహించుము
1 రాజ్యసువార్తను ప్రకటించుటలో మునుపెన్నడు ఇంత ఎక్కువమంది యౌవనస్థులు పాల్గొనలేదు. వేలాదిమంది ప్రసంగి 12:1 లో చెప్పబడినట్టి “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము” అను సలహా గైకొంటున్నారు. ఈ యౌవనస్థులు పరిచర్యలో క్రమముగా పాల్గొనులాగున వారిని నడిపిస్తున్నదేమిటి, వారిలో అనేకమంది ఎందుకు పయినీరు సేవలో పాల్గొంటున్నారు?
2 నిశ్చయంగా అనేకమంది, ప్రముఖుడైన యౌవనస్థుడగు తిమోతి ప్రవర్తనను అనుకరిస్తున్నారు. ఆయన తల్లి, అవ్వ ఆత్మీయ విద్యయొక్క ప్రయోజనాన్ని బాల్యమునుండే అందించి, ఆత్మీయగమ్యములను వెంటాడునట్లు ఆయనను ప్రోత్సహించారు. (2 తిమో. 3:14, 15) తద్వారా, విస్తృతమైన సేవా ఆధిక్యతలు లభించు అవకాశమొచ్చినప్పుడు, ఆయన అర్హుడై వాటికి సిద్ధంగా ఉండెను.—అపొ. కా. 16:1-3.
3 అనేకమంది యౌవనస్థులు ఆత్మీయగమ్యములను వెంటాడునట్లు ఎలా ప్రోత్సహించబడగలరు? అందుకు ఎటువంటి పునాదిని వెయ్యాలి? తల్లిదండ్రులు తమ పిల్లలలో సత్యముయెడల ఎలా మెప్పును నిర్మించి, వారు తమకొరకు దీర్ఘకాల గమ్యములను ఏర్పరచుకొనునట్లు ఎలా సహాయపడగలరు?
4 లేఖనసంబంధమైన పునాదిని వేయుము: తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించేవి వారికి “రక్షణార్థమైన జ్ఞానము”ను కలిగించునట్లు, అవి యెహోవా నుండియే వచ్చునవై యుండునట్లు ఖచ్చితంగా చూసుకోవాలి. (2 తిమో. 3:15) వారిలో దేవునివాక్యమైన బైబిలు యెడల లోతైన ప్రేమ కలిగియుండునట్లు గట్టిగా శ్రమపడుము. ఇందుకై వారి అవసరతలకు తగినట్లు క్రమమైన అర్థవంతమైన బైబిలు పఠనము దానితోపాటు క్రమముగా కూటములకు హాజరగుట అవసరము. ఆత్మీయ గమ్యములను వెంటాడునట్లు వారిని ప్రోత్సహించే బలమైన విశ్వాసము కలిగియుండుటకు యౌవనులు తమ వ్యక్తిగత బైబిలు పఠనకార్యక్రమమును కలిగివుంటూ, యెహోవాతో తమ స్వంత సంబంధమును వృద్ధిచేసుకోవాలి.—1 థెస్స. 5:21; హెబ్రీ. 11:1.
5 తల్లిదండ్రులు, సంఘములోని ఇతర పరిపక్వత కెదిగినవారు మంచిమాదిరిని చూపుతూ, “యెహోవాయందు ఆనందించుటను” ప్రతిబింబిస్తుంటే, క్రైస్తవయౌవనులు ఇంకెంతో సిద్ధముగా ఆత్మీయ గమ్యములను వెంటాడెదరు. (నెహె. 8:10) మనమందరము ఆనందమును ప్రదర్శిస్తుంటే మనపిల్లలు నిజమైన క్రైస్తవత్వముయొక్క నిబంధనలు భారమైనవి కావని గుణగ్రహించెదరు.—1 యోహా. 5:3.
6 అనేకమంది యౌవనులు తమతో ప్రాంతీయసేవలో పనిచేసిన, లేక వారితో ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడిన పయినీర్లు, మిషనరీలు, ప్రయాణకాపరుల వల్ల గొప్పగా ప్రభావితం చెందారు. తల్లిదండ్రులు వీరికి సహాయముచేయుటకై మాదిరికరమైన పూర్తికాల సేవకులను తమ గృహములకు భోజనానికి లేక ఇతర సమయాలలో క్రైస్తవ సహవాసమునకు ఆహ్వానించ వచ్చును. పిల్లలకు సమతూకమైన అవధానమునిచ్చుటలో యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన మాదిరిని ఉంచాడు.—మార్కు 10:13-16.
7 గమ్యములను ఏర్పరచుట: తల్లిదండ్రుల యుక్తమైన నడిపింపుద్వారా పిల్లలు తమ జీవితపు తొలి దశలోనే తరచూ ఆత్మీయగమ్యములను తమకుతామే ఏర్పరచుకుంటారు. ఒకసారి పిల్లలు, వారు చేరుకోవాలనుకొన్న గమ్యము ఏమిటో—అది పయినీరు సేవయేగాని, బేతేలు లేక మిషనరీ సేవయేగాని, అలాంటిదేనినైనను నిర్ణయించుకొన్నప్పుడు తల్లిదండ్రులు లేక ఇతర పరిపక్వత కెదిగినవారు, వారాగమ్యమువైపు పనిచేయునట్లు వారిని పురికొల్పుచూ అభ్యాసయుక్తమెన సలహాలనందిస్తూ ప్రోత్సహించవచ్చును.
8 ప్రతి సంఘము ఒక కుటుంబము లాంటిది. కావున మనలో ప్రతి ఒక్కొరము మన పిల్లలు సత్యమందు యెడతెగక నడుస్తూ, ఆత్మీయాభివృద్ధి చేసికొనునట్లు వారికి సహాయముచేయుటలో శ్రద్ధచూపవలెను. వారియెడల మన ప్రేమను దృఢపరస్తూ, ఆత్మీయగమ్యములను వెంటాడునట్లు వారిని ప్రోత్సహించుట ద్వారా మనము దీనిని చేయగలము.