యౌవనస్థులారా—యెహోవా హృదయాన్ని సంతోషపర్చండి
1 ఒకడు తన యౌవన శక్తిని, సామర్థ్యాన్ని సరైన విధంగా ఉపయోగిస్తే, జీవితం నిజంగా సంతోషకరంగా ఉంటుంది. జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా వ్రాశాడు: “యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము.” (ప్రసం. 11:9) యౌవనస్థులైన మీరు మీ ప్రవర్తనను బట్టి దేవునికి లెక్క ఒప్ప చెప్ప వలసి ఉన్నారు.
2 మీ జీవిత రీతి మీపైనే కాక, మీ తలిదండ్రులపై కూడా ప్రభావం చూపిస్తుంది. సామెతలు 10:1 ఇలా చెబుతుంది: “జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును.” కాని ఇంకా ప్రాముఖ్యమైనదేమంటే, మీరెలా జీవిస్తున్నారన్నది మీ సృష్టికర్తయైన యెహోవా దేవున్ని సహితం ప్రభావితం చేస్తుంది. అందుకే సామెతలు 27:11లో యెహోవా కూడా యౌవనస్థులను ఇలా ప్రోత్సహిస్తున్నాడు: “నా కుమారుడా జ్ఞానము సంపాదించి నా హృదయాన్ని సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.” నేడు యౌవనస్థులు యెహోవా హృదయమును ఎలా సంతోషపరచగలరు? దీనిని అనేక విధాలుగా చేయవచ్చు.
3 మంచి మాదిరి ద్వారా: యౌవనస్థులైన మీరు దేవుని వాక్యంలో ప్రవచించబడిన “అపాయకరమైన అంత్యదినము”లను అనుభవిస్తున్నారు. (2 తిమో. 3:1) అవిశ్వాసులైన తోటి విద్యార్థులనుండి, మీ బైబిలు ఆధారిత దృక్పథాలను పరిహసించే ఉపాధ్యాయులనుండి కూడ మీరు ఒత్తిడులకు గురికావచ్చు. ఉదాహరణకు, ఒక ఉపాధ్యాయుడు పరిణామ సిద్ధాంతం సత్యమని, బైబిలు కల్పితకథ అని వర్ణించాడు. అయినను, ఆ తరగతిలోని ఒక యౌవన ప్రచారకుడు నమ్మకంగా బైబిలును సమర్థించాడు. తత్ఫలితంగా, అనేక బైబిలు పఠనాలు ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న కొందరు కూటాలకు హాజరవడం మొదలు పెట్టారు. యౌవన సహోదర సహోదరీలైన మీ విశ్వాసం దైవభక్తి లేని లోకంపై నేరస్థాపన చేసి, యథార్థహృదయం గల వారిని సత్యంవైపుకు ఆకర్షిస్తుంది.—హెబ్రీ. 11:7 పోల్చండి.
4 సంఘంలోని మీ తోటివారు చెడుకు లొంగిపోకుండా ఉండే విధంగా మీరు వారిని ప్రోత్సహించగలరా? మీరు బడిలో, ఇంట్లో, సంఘంలో మంచి మాదిరినుంచుట ద్వారా ఇతర యౌవన ప్రచారకుల విశ్వాసాన్ని మీరు బలపరచగలరు. (రోమా. 1:12) ఇతరులకు మంచి మాదిరిని చూపిస్తూ యెహోవా హృదయాన్ని సంతోషపరచండి.
5 మీ వస్త్రాలు, కేశాలంకరణ ద్వారా: ఒక యౌవన సహోదరి అణకువగల వస్త్రధారణ చూసి ఆమెను ఇతరులు ఎగతాళి చేసి “అంటరానిది” అని ముద్రవేశారు. అది ఆమెను దైవభక్తి లేని లోకము స్థాయికి దిగజారునట్లు చేయలేదు. బదులుగా, తానొక యెహోవాసాక్షి అని, తాను యెహోవాసాక్షుల ఉన్నత స్థాయిని అనుసరించిందని వివరించింది. మీకు అలాంటి ధైర్యముందా? లేక సాతాను లోకం మిమ్ములను దాని ఆలోచనలకు, ప్రవర్తనకు లొంగిపోవునట్లు చేయుటకు అనుమతిస్తారా? అనేకమంది యౌవనస్థులు యెహోవా బోధనలను అనుసరించి చౌకబారు రీతులను, వెర్రితనాన్ని, విగ్రహాలను, లోక బోధలను తిరస్కరించడం చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. యెహోవా సంస్థ మనకు చెప్పినట్లుగా, లోక సంబంధమైన అలాంటి క్రియలు దయ్యాల ప్రభావం వల్ల కల్గుతాయని మనం గుర్తించాలి!—2 తిమో. 4:1.
6 వినోదాన్ని, ఉల్లాసాన్ని ఎంపిక చేసుకొనుట ద్వారా: సరైన వినోదాన్ని, ఉల్లాసాన్ని జ్ఞానయుక్తంగా ఎంపిక చేసుకొనుటకు పిల్లలకు సహాయపడవలసిన అవసరముందని తలిదండ్రులు గుర్తుంచుకోవాలి. ఒక సహోదరుడు తాను ఎంతో ప్రేమను పెంచుకున్న ఒక మంచి కుటుంబాన్ని గురించి ఉన్నతంగా చెప్పాడు. ఆత్మీయదృష్టిగల తలిదండ్రులు కుటుంబ వినోద విషయంలో కూడ మార్గదర్శకాన్నిచ్చారు. సహోదరుడు ఇలా గమనించాడు: “వాళ్ళు కలిసికట్టుగా పని చేయడం నాకు ఆశ్చర్యం కల్గిస్తుంది. పిల్లలు పరిచర్యకు సిద్ధపడడానికి తలిదండ్రులు సహాయపడటమే కాక, వినోద సమయాల్లో, సరదాగా నడుచుకుంటూ వెళ్ళి, ప్రదర్శనశాలలను సందర్శిస్తూ, ఇంట్లోనే ఉండి కుటుంబ పట్టిక ప్రకారం ఆడుతూ, కలిసి పని చేస్తూ ఉండే వారు. పరస్పరం వారికిగల ప్రేమ, ఇతరులపైగల ప్రేమ, ఏమి జరిగినా భవిష్యత్తులో కూడ వారు సత్యంలోనే నడుస్తారని మీకు నమ్మకం కల్గిస్తుంది.”
7 వినోదంలో, ఉల్లాసంలో కుటుంబమంతా పాల్గొనడం సాధ్యంకాని సమయాలుంటాయి. యౌవనస్థులైన మీరు దీన్ని గూర్చి, మీ విశ్రాంతి సమయాన్ని ఎలా గడపాలో ఎంపిక చేసుకోవలసిన గంభీరతను తెలుసుకోవాలి. సాతాను తనకు సాధ్యమైనంత మందిని తప్పుదోవ పట్టించాలని తీర్మానించుకున్నాడు. తన జిత్తులమారి పనులకు, మోసపూరిత తంత్రాలకు, విశేషంగా అనుభవం లేని యౌవనస్థులు గురయ్యే ప్రమాదం ఉంది. (2 కొరిం. 11:3; ఎఫె. 6:11) మిమ్మల్ని తప్పుదోవ పట్టించి, స్వార్థంతో స్వీయాభీష్టమగు, అవినీతికరమైన జీవిత విధానాన్ని వెంబడించులాగున మీపై ప్రభావం చూపడానికి సాతాను నేడు వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నాడు.
8 ఐశ్వర్యాసక్తిగల అనైతిక జీవితాన్ని, పద్ధతిని ప్రోత్సహించడంలో దూరదర్శిని బహు మోసపూరితంగా పనిచేస్తుంది. సినిమాలు, వీడియోలు హింస, అశ్లీలమైన లైంగికత మున్నగువాటిని నిరంతరం ప్రదర్శిస్తాయి. జనసమ్మతమైన సంగీతం అంతకంతకు నీచంగా, అశ్లీలంగా మారింది. సాతాను ప్రలోభాలు నిరపాయంగా కన్పించవచ్చు, అయినను అవి, వేలకొలది క్రైస్తవ యౌవనస్థులను చెడు ఆలోచనలకు, చెడు నడవడికి నడిపించాయి. అట్టి వత్తిడులను ప్రతిఘటించుటకు, తప్పకుండా మీరు నీతిని పట్టుదలతో వెంబడించాలి. (2 తిమో. 2:22) వినోదానికి, ఉల్లాసానికి సంబంధించిన మీ తలంపులను, ప్రవర్తనను మార్చుకోవలసి ఉంటే, మీరెలా వాటిని మార్చుకోగలరు? కీర్తనల రచయిత ఇలా జవాబిస్తున్నాడు: “నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము.”—కీర్త. 119:10.
9 క్రీడాకారులను, సినీతారలను ఆరాధించడం సాధారణమే. యెహోవాయెడల గల భయమే అపరిపూర్ణ మానవులను ఆరాధించకుండా ఉండుటకు మీకు సహాయం చేస్తుంది. నేడు అనేకులు లైంగిక అనైతికతను కూడా ఆరాధిస్తున్నారు. అశ్లీలరచన, మోసపూరితమైన సంగీతం నుండి దూరంగా ఉండడం ద్వారా మీరు ఈ స్వభావం నుండి కాపాడుకొనవచ్చు. సంగీతాన్ని గూర్చి ఇటీవలనే మన సంఘ పుస్తక పఠనమందు పఠించబడిన కావలికోట శీర్షికల బ్రోషూరు ఇలా చెబుతుంది: “సంగీతమనేది దేవుని వరమైయున్నది. అయినను, చాలా మందికి, యిది అవినీతికరమైన పూర్వాక్రమణగా తయారైంది . . . సంగీతానికి యివ్వవలసిన స్థానమిస్తూనే, మీరు ప్రాముఖ్యంగా యెహోవా పని యెడల శ్రద్ధ కల్గియుండండి. మీరెన్నుకునే సంగీతాన్ని ఎన్నుకొనుటలో జాగ్రత్త వహించండి. తద్వారా మీరు దేవుని వరాన్ని దుర్వినియోగం చేయకుండా—ఉపయోగించగలరు.”
10 చెడును పూర్తిగా ద్వేషించడం నేర్చుకోండి. (కీర్త. 97:10) చెడు చేయాలని శోధించబడినప్పుడు, యెహోవా ఆ విషయాన్ని ఎలా దృష్టిస్తాడో ఆలోచించండి, కోరని గర్భధారణ, సుఖవ్యాధులు, భావోద్రేకపరమైన సంఘర్షణ, ఆత్మగౌరవాన్ని, సంఘంలోని ఆధిక్యతల్ని కోల్పోవడం వంటి పరిణామాలను పరిగణించండి. దుష్టత్వాన్ని ప్రోత్సహించే దూరదర్శిని ప్రదర్శనలు, సినిమాలు, వీడియోలు, పాటలు, సంభాషణల నుండి దూరంగా ఉండండి. “మూర్ఖులు” అని బైబిలు పిలిచే వారితో సహవసించవద్దు. (సామె. 13:19) సరైనవారిని ఎంపిక చేసుకునేవారై ఉండండి; సంఘంలో యెహోవా దేవున్ని, ఆయన నీతిసూత్రాలను ప్రేమించే వారితో సహవసించడానికి తీర్మానించుకోండి.
11 అవును, యెహోవా హృదయాన్ని సంతోషపరచాలని నిజంగా కోరుకునే యౌవనస్థులు ఎఫెసీయులు 5:15, 16లో చెప్పబడిన మంచి సలహాను పాటిస్తారు: “దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.” ఈ అంత్యదినాల్లో మీ అభివృద్ధిని “జాగ్రత్తగా చూచుకొనుటకు” మీకు ఏది తోడ్పడుతుంది?
12 ఆత్మీయ అవసరతలను లక్ష్యం చేయుట: మత్తయి 5:3లో యేసు ఇలా చెప్పాడు: “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు.” మీ ఆత్మీయ అవసరతను గూర్చి మెలకువగా ఉండడంద్వారా మీరు కూడ ధన్యులు కాగలరు. అలాంటి అవసరతను భర్తీ చేయడం అంటే మనం నేర్చుకున్నవాటిలో మనకు గల నమ్మకాన్ని సువార్త బలపరుస్తుంది కనుక, దానిని ప్రకటించు పనిలో ఆసక్తిగా పాల్గొనడం కూడా చేరి ఉంది.—రోమా. 10:17.
13 మీ వ్యక్తిగత అనుభవం ద్వారా పరిచర్యలో ఎల్లవేళల క్రమంగా పాల్గొనడం సులభం కాదని మీకు తెలుసు. దీనికిగల అసలు కారణం ఆత్మవిశ్వాసం లేకపోవడమే కావచ్చు. కాబట్టి మీరు గట్టి తీర్మానం తీసుకోవలసిన అవసరముంది. పరిచర్యలో క్రమంగా పాల్గొనడం వలన మీ సాక్ష్యమిచ్చే సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు, ప్రకటించు పనిలో మీ సామర్థ్యాన్ని గూర్చిన మీ ఆత్మవిశ్వాసాన్ని బలపరచుకోవచ్చు.
14 సంఘంలోని క్రమ పయినీర్లు, పెద్దలు వంటి అనుభవజ్ఞులైన ప్రచారకులతో సేవకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి. వారు చెప్పే విధానాన్ని, ఇంటిద్వారము వద్ద అభ్యంతరం చెప్పేవారితో వారు ఎలా వ్యవహరిస్తారో అన్నది జాగ్రత్తగా గమనించండి. రీజనింగ్ పుస్తకాన్ని, మన రాజ్య పరిచర్యలో యివ్వబడిన సూచనలను చక్కగా ఉపయోగించండి. మీకున్నదంతా మీరు యెహోవాకే ఇస్తున్నందువల్ల మీరు త్వరలోనే పరిచర్యలో గొప్ప ఆనందాన్ని అనుభవించగలరు.—అపొ. 20:35.
15 కొంతమంది స్కూల్లో సాక్ష్యమివ్వడానికి లభించే అవకాశాలను ఉపయోగించి శిష్యులను చేసే పనిలో విజయం సాధించగల్గారు. (మత్త. 28:19, 20) ఒక యౌవన క్రైస్తవుడు ఇలా అంటున్నాడు: “క్లాస్ లేని సమయాల్లో, విశేషంగా సెలవు దినాల్లో సాక్ష్యమివ్వడానికి నాకు చాలా అవకాశాలు దొరికాయి. ఇతరులు చూచే విధంగా నేను బైబిలు ప్రచురణలు నా బల్లమీద పెట్టినపుడు, ఆసక్తిగల చాలామంది పిల్లలు నా దగ్గరికి వచ్చేవారు.” చివరికి, అనేకమంది విద్యార్థులు, ఉపాధ్యాయురాలు కూడా క్రైస్తవ కూటాలకు హాజరవడం మొదలు పెట్టారు. నిజంగా, ఆ ఉపాధ్యాయురాలు సమర్పించుకుని సాక్షి అయ్యేంతగా అభివృద్ధి చెందింది. మీలాంటి యౌవనస్థులు ఆయన నామమునకు ఘనత తెచ్చినప్పుడు యెహోవా ఎంతగానో సంతోషిస్తాడు.
16 మీ ఆత్మీయ అవసరతను తీర్చుకోవడానికి మరొక మార్గమేమంటే, వ్యక్తిగత పఠనమే. యెహోవా హృదయాన్ని సంతోషపరచడానికి, మనం ఆయననుగూర్చి, అయన ఉద్దేశాలను గూర్చి, ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడో దాన్ని గూర్చి జ్ఞానం సంపాదించాలి. మీరు వ్యక్తిగత పఠనానికి సమయం కేటాయిస్తారా? మీరు క్రమంగా ఆహారం తీసుకుంటున్నట్లే, క్రమంగా పఠిస్తారా? (యోహాను 17:3) దైవపరిపాలనా పాఠశాల కొరకు తయారు చేసిన బైబిలు పఠన పట్టికతోపాటు మీకు వ్యక్తిగతంగా బైబిలు పఠన పట్టిక ఉందా? అన్ని కూటాలకు మీరు చక్కగా సిద్ధపడతారా? మీరు కావలికోట, తేజరిల్లు! పత్రికలను క్రమంగా చదువుతారా? ప్రత్యేకంగా, “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . ” అనే పరంపరలోని ప్రతి శీర్షికను చదవడానికి, ఉదహరించిన ప్రతి లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలించడానికి సమయం తీసుకుంటారా? సంస్థ మీ ఆత్మీయ అవసరతను తీర్చుటకు ప్రత్యేకంగా తయారు చేసిన క్వశ్చన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్ అనే పుస్తకాన్ని మరువకూడదు. ప్రపంచం నలుమూలల ఉన్న యౌవన క్రైస్తవులు, వారి తలిదండ్రులు యెహోవాకు మరింత దగ్గరవడానికి ఈ పుస్తకం వారికి ఎలా తోడ్పడిందో తెలుపుతూ ఉత్తరాలు వ్రాశారు.
17 బైబిలును, దైవపరిపాలనా బైబిలు పఠన సహాయాలను చదివేటప్పుడు, అవి యెహోవాను, ఆయన తలంపులను, ఉద్దేశాలను గూర్చి చెబుతాయి. ఈ సమాచారం మీకెలా సహాయకరంగా ఉంటుందో పరిగణించండి. మీరు ఇంతకు ముందు చదివిన వివరాలను ఇప్పుడు చదివే వివరాలతో జోడించండి. దీనిలో ధ్యానించడం ఇమిడి ఉంది. ధ్యానించే వివరాలు హృదయంలోనికి చొచ్చుకుపోవడానికి, మిమ్మల్ని ప్రేరేపించడానికి అనుమతిస్తాయి.—కీర్త. 77:12.
18 తమ ఆత్మీయ అవసరతను ఎరిగి ఉన్న యౌవనస్థులు సంఘ కూటాలకు హాజరవడం మనకు సంతోషాన్ని కలుగజేస్తుంది. యౌవన క్రైస్తవులైన మీరు కూటాల్లో క్రమంగా అర్థవంతమైన వ్యాఖ్యానాలు చేయడం ద్వారా ఇతరులను ప్రోత్సహించవచ్చు. ప్రతి కూటంలోను కనీసం ఒక వ్యాఖ్యానమైనా చేయాలనే గురి పెట్టుకోండి. కూటములకు ముందు, ఆ తర్వాత కూడ ప్రోత్సాహకరమైన సహవాసం చేయడం ద్వారా సంఘంలో ఏ వయస్సువారైనా అందరితో స్నేహబంధాన్ని వృద్ధిచేసుకోండి. (హెబ్రీ. 10:24, 25) ఒక యౌవన సహోదరుడు చెప్పినదేమంటే ప్రతి కూటంలోను పెద్దవయస్సులో ఉన్న కనీసం ఒక సహోదరునితో, సహోదరితో మాట్లాడాలని అతని తలిదండ్రులు అతన్ని ప్రోత్సహించారు. అతడు సంఘంలోని పెద్దవారితో సహవసించిన అనుభవాన్ని ఈనాడు ఎంతో విలువైనదిగా పరిగణిస్తాడు.
19 ఆత్మీయ లక్ష్యాలను వెంబడించండి: అనేకమంది యౌవనస్థుల జీవితాల్లో ఓ లక్ష్యం, నడిపింపు లేకపోవడం విషాదకరం. అయినను, దైవపరిపాలనా లక్ష్యాలను పెట్టుకుని, వాటిని విజయవంతంగా సాధించామన్న భావన సంతోషకరంగా ఉండదా? దైవిక విద్యాభ్యాసం అందించిన జ్ఞానంతో ఈ లక్ష్యాలను వెంబడించడం ప్రస్తుతం వ్యక్తిగతంగా తృప్తినిస్తుంది, చివరికి అది నిత్య రక్షణకు నడిపిస్తుంది.—ప్రసం. 12:1, 13.
20 లక్ష్యాలు పెట్టుకునేటప్పుడు, వాటిని ప్రార్థనా విషయాలుగా చేయండి. మీ తలిదండ్రులతోను, పెద్దలతోను మాట్లాడండి. మిమ్మల్ని, మీ సామర్థ్యాన్ని పరిశీలించుకొని, ఇతరుల సామర్థ్యాలతో పోల్చకుండా, ఆచరణాత్మకమైన, మీరు చేయగల్గే లక్ష్యాలనే పెట్టుకోండి. ప్రతి ఒక్కరు శారీరకంగాను, మానసికంగాను, భావోద్రేకంగాను, ఆత్మీయంగాను భిన్నంగా ఉంటారు. కాబట్టి, ఇతరులు చేసే ప్రతిది మీరు చేయాలని ఆశించవద్దు.
21 మీరు సాధించగల కొన్ని లక్ష్యాలేవి? మీరు ఇంతవరకూ ప్రచారకులు కానట్లయితే, బాప్తిస్మం పొందనట్లయితే మీరు వాటిని మీ లక్ష్యాలుగా ఎందుకు పెట్టకూడదు. మీరు ప్రచారకులైనట్లయితే, ప్రతివారం ప్రాంతీయ సేవలో కొంత సమయం గడపాలనే లక్ష్యాన్ని మీరు పెట్టుకోవచ్చు. పునర్దర్శనాల్లో సామర్థ్యంగల బోధకుడగుటకు, ఒక బైబిలు పఠనాన్ని నిర్వహించుటకు లక్ష్యాన్ని పెట్టుకోండి. మీరు పాఠశాలలో చదివే బాప్తిస్మం పొందిన యౌవనస్థులైతే, వేసవి కాలంలో సహాయ పయినీరు సేవ చేయాలనే లక్ష్యాన్ని ఎందుకు పెట్టుకోకూడదు? “ప్రభువు కార్యాభివృద్ధియందు” చాలా చేయవలసి ఉంది.—1 కొరిం. 15:58.
22 తలిదండ్రుల సహాయం ప్రాముఖ్యం: సంఘంలోని యౌవనస్థులు జీవాన్ని కాపాడుకునే ప్రయత్నంలో వారు ఒంటరివారని ఎన్నటికీ భావించవద్దు. యెహోవా, తన సంస్థ ద్వారా, యౌవనస్థులు ప్రతిదినం సరైన తీర్మానము తీసుకోవడానికి, వారు జీవితంలో అడ్డంకులను ఎదుర్కోవడానికి సహాయపడే ఉపదేశాన్నిస్తున్నాడు. తమ పిల్లలు సరైన తీర్మానం చేసుకోవడానికి సహాయపడవలసిన బాధ్యత సమర్పించుకున్న తలిదండ్రులకు నిజంగా ఉంది. బైబిలు 1 కొరింథీయులు 11:3 నందు, భర్తను కుటుంబ శిరస్సుగా నియమిస్తుంది. కాబట్టి, భార్య భర్తతో సన్నిహితంగా పనిచేస్తున్న ఒక క్రైస్తవ కుటుంబంలో, తండ్రి పిల్లలకు దేవుని ఆజ్ఞలను బోధించుటలో నాయకత్వం వహిస్తాడు. (ఎఫె. 6:4) పసిబిడ్డగా ఉన్నప్పుడే ప్రారంభమయ్యే మనఃపూర్వక శిక్షణద్వారా ఇది మొదలౌతుంది. జీవితంలోని మొదటి సంవత్సరంలోనే బిడ్డ మెదడు మూడింతలవుతుంది. కాబట్టి, తలిదండ్రులు ఆ శిశువుకుగల అర్థం చేసుకొనే సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. (2 తిమో. 3:15) పిల్లలు పెరుగుతున్న కొలది, తలిదండ్రులు క్రమేణా వారికి యెహోవాను ప్రేమించడానికి, ఆయనతో మంచి సంబంధం కల్గి ఉండడానికి నేర్పించవలసిన అవసరముంది.
23 తమ పిల్లలకు సహాయం చేయగల వివిధ ఆచరణాత్మకమైన మార్గాలు తరచూ తలిదండ్రులకు చూపెట్టబడ్డాయి. తలిదండ్రుల ఒక మంచి మాదిరే శుభారంభం. పిల్లలకు ఆత్మీయంగా సహాయం చేయుటకు వారు ఏం చేయాలో ఏం చేయకూడదో మాటలతో చెప్పడం కన్నా వారికి మాదిరిని చూపడమే మంచిది. తలిదండ్రుల సరైన మాదిరియందు ఇంట్లో, మీ భార్యతోగాని, భర్తతోగాని, పిల్లలతోగాని ఆత్మ ఫలాన్ని ప్రదర్శించడం ఇమిడి ఉంది. (గల. 5:22, 23) దేవుని ఆత్మ మంచి చేయడానికి ఒక బలమైన ప్రేరకమని చాలామంది అనుభవం ద్వారా తెలుసుకున్నారు. అది మీ పిల్లల మనస్సును, హృదయాలను సరైన విధంగా మలచడానికి సహాయపడగలదు.
24 తలిదండ్రులు వ్యక్తిగత పఠన అలవాట్లలోను, కూటములకు హాజరవడంలోను, ప్రాంతీయ సేవలో క్రమంగా పాల్గొనుటలోను మంచి మాదిరిని చూపవలసిన అవసరముంది. మీరు ఇంట్లో ఉత్సాహంగా సత్యాన్ని గూర్చి మాట్లాడుతూ, పరిచర్యలో ఆసక్తిగా నాయకత్వం వహిస్తూ, వ్యక్తిగత పఠనమందు క్రియాత్మకంగా ఉంటే మీ పిల్లలు కూడా ప్రోత్సహించబడి ఆత్మీయ విషయాల్లో యథార్థమైన ఆసక్తి చూపుతారు.
25 ఆలోచనాపూర్వకంగా సిద్ధపడినప్పుడు, క్రమంగా, అర్థవంతమైన కుటుంబ బైబిలు పఠనం ఆసక్తికరంగాను ఉల్లాసంగాను, కుటుంబ ఐకమత్యాన్ని బలపర్చేదిగాను ఉండగలదు. మీ పిల్లల హృదయాలను చేరడానికి సమయం తీసుకోండి. (సామె. 23:15) అనేక కుటుంబాలు ఈ సందర్భాల్లో వారపు కావలికోట పఠనానికి సిద్ధపడడానికి ఉపయోగించినా, కొన్ని సమయాల్లో కుటుంబ అవసరాన్నిబట్టి వేరే విషయాలు చర్చించడం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రశ్నలు వేసి, ఒక్కో కుటుంబ సభ్యున్ని తన అభిప్రాయం చెప్పనిస్తే, అది విజ్ఞానదాయకంగాను, ఉల్లాసకరంగాను ఉంటుంది. ప్రతి సభ్యునికి ప్రయోజనం కల్గే విధంగా పఠనం నిర్వహించడం నిజంగా కుటుంబ శిరస్సుకు ఒక సవాలే. అయితే అందరూ ఆత్మీయంగా ఎదిగినప్పుడు అది ఎంత ప్రతిఫలదాయకంగా ఉంటుందో! అందరిని కలుపుకోవడం వలన సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
26 మీ పిల్లల జీవితాలను రక్షించుటకు ఇప్పుడు మీ ప్రేమపూర్వకమైన, ప్రత్యేక తర్ఫీదు అత్యవసరం. (సామె. 22:6) ఇది గుర్తుంచుకుంటే, మీరు ఇదివరకు చేసిన దానికన్నా ఇది చాలా ప్రాముఖ్యమైన ఉపదేశమని సులభంగా అర్థం చేసుకోగలరు. ఈ విశేషమైన, ప్రాముఖ్యమైన పనిలో మీరు ఒంటరివారని ఎన్నటికీ అనుకోవద్దు. మీ కుటుంబ బాధ్యతలను నెరవేర్చుటకు కావలసిన మార్గదర్శకానికి యెహోవాను పూర్తిగా ఆశ్రయించడం నేర్చుకోండి. అంతే కాదు. మీకు మరెంతో సహాయం చేయగల ఇతరులు కూడా ఉన్నారు.
27 సహాయపడుటకు ఇతరులు ఏమి చేయగలరు: సంఘ పెద్దలు రాజ్య మందిరం శుభ్రం చేయుటకు తలిదండ్రులతోపాటు పిల్లలను చేర్చుటకు శ్రద్ధ వహించాలి. సంఘ కూటాల్లో పిల్లలను ప్రోత్సహించాలి. ప్రేక్షకుల పాత్ర ఉన్న సేవా కూటంలోని భాగాలను నిర్వహించడానికి నియమించబడ్డ పెద్దలు, పరిచారకులు వాటిని నిర్వహించేటప్పుడు, చిన్నపిల్లలు చేతులు ఎత్తుతున్నారా లేదాయని గమనించాలి. అవకాశం దొరికినప్పుడెల్లా ప్రదర్శనలలో తలిదండ్రులతోపాటు మాదిరికరమైన పిల్లలను చేర్చాలి. కొంతమందిని ఇంటర్వ్యూ చేయడానికి, క్లుప్తంగా వ్యాఖ్యానం చెప్పడానికి అనుమతించవచ్చు.
28 వారి ప్రయత్నాలను విస్మరించవద్దు. యౌవనస్థులు సంఘానికి నిజమైన సొత్తు అని రుజువు చేయబడింది. మంచి ప్రవర్తనతో వారిలో అనేక మంది ‘మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించు’కున్నారు. (తీతు 2:6-10) చిన్నపిల్లలు కొద్దిగా పాల్గొన్ననూ వారిని మెచ్చుకోడానికి సంసిద్ధంగా ఉండాలి. అది భవిష్యత్తులో మళ్ళీ సిద్ధపడి పాల్గొనాలనే కోరికను వారిలో కల్గిస్తుంది. పిల్లల మీద పెద్దలు చూపించే అట్టి ఆసక్తికి వెల కట్టలేము; అది అమూల్యమైంది. ఒక పెద్దగా లేదా పరిచారకునిగా మీరు ఎన్నిసార్లు సంఘమందలి యౌవనుల దగ్గరకువెళ్ళి కూటమందు వారిచ్చిన ప్రసంగాన్ని మెచ్చుకున్నారు?
29 పయినీర్లూ, సహాయం చేయుటకు మీరేమి చేయగలరు? మీరు చేసే ఏర్పాట్లలో మధ్యాహ్నాలైనా, వారాంతాల్లోనైనా బడిపిల్లలను ఎంతవరకు కలుపుకుంటున్నారో తెలుసుకోడానికి మీ పట్టికను ఎందుకు పునఃసమీక్షించ కూడదు? మీరు పూర్తికాల సేవను ఎన్నుకోవడాన్నిగూర్చి అనుకూలంగా మాట్లాడతారా? మీరు పరిచర్యలో సంతోషిస్తున్నారని, మీ ముఖ కవళికల్లో కూడా కనబరుస్తున్నారా? మీరు ఇతరులను కూడా, విశేషంగా చిన్న పిల్లలను పయినీరు సేవ చేయాలని సిఫారసు చేస్తారా? మీరు ఇంటింట ప్రకటించేటప్పుడు బలపర్చేవిధంగాను, క్రియాత్మకంగాను మాట్లాడుతారా? అలాగయితే, మీరు కూడా అతి ప్రాముఖ్యమైన ఈ తర్ఫీదు పనిలో పాల్గొంటున్నారు.
30 సంఘంలోని అందరూ పిల్లలకు తర్ఫీదు ఇవ్వవలసిన ఈ ప్రాముఖ్యమైన పనిని గూర్చి మెలకువ గలవారై ఉండాలి. ప్రాంతీయ సేవలో వారితోపాటు పాల్గొనడానికి మీరు ఏదైనా కచ్చితమైన ఏర్పాటు చేయగలరా? ఇంటింటి సువార్త పనికి ఎలా సిద్ధపడాలో ఏ విధంగా మాట్లాడాలో అభ్యసించగలరా? సేవలో కలిసి ఉన్నప్పుడు భవిష్యత్తులో చేయవలసిన ఆత్మీయ పరిచర్యను ప్రోత్సహించడానికి దొరికే అవకాశాలయెడల అప్రమత్తంగా ఉంటున్నారా? ఒక చిన్న మెప్పు యౌవనస్థుల దీర్ఘకాల ప్రయోజనం కొరకు జీవితాంతం ఆత్మీయ లక్ష్యాలను పెంచుకోడానికి ప్రేరకమౌతుందని ప్రతి పరిచారకుడు గుర్తుంచుకోవాలి.
31 యౌవనస్థులు తమకు తామే సహాయపడవచ్చు: యౌవనస్థులారా, మీరు యెహోవా బోధలను అనుసరించి, లోకం అందించే చెడ్డవాటిని తిరస్కరించాలని మేము ప్రోత్సహిస్తున్నాం. మీ నడవడిని, అంతర్గత భావాలను ఎడతెగక పరిశీలించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. యెహోవాయెడల, ఆయన మీ ప్రతిదిన జీవితంలో మీనుండి ఏమి కోరుతున్నాడన్న వాటిని గూర్చి మీ దృక్పథం ఏమిటి? సాతాను ఉద్దేశాలకు లొంగిపోకుండా ప్రతిఘటించడానికి మీరు గట్టి పోరాటాన్ని పోరాడుతున్నారా? (1 తిమో. 6:12) మానవుల్లో, ప్రత్యేకంగా యౌవనుల్లో తమ తోటి వారి మెప్పును పొందాలనే కోరిక సహజంగా ఉంటుంది. కనుక, వారు చేసే చెడుపనులనే మీరు అనుసరించడానికి ఆకర్షింపబడుతున్నట్లు మీకు అన్పిస్తుందా? (నిర్గ. 23:2) లోక పద్ధతులను అనుసరించడానికి గొప్ప ఒత్తిళ్ళున్నాయని అపొస్తలుడైన పౌలు గ్రహించాడు.—రోమీయులు 7:21-23.
32 లోక ప్రభావాలను ఎదిరించడానికి, లోకంలోని తోటివారి నుండి భిన్నంగా ఉండడానికి, అలాగే దేవుని బోధలను గైకొనడానికి ధైర్యం అవసరమే. పురాతన కాలంలోని మనుష్యులు విజయవంతంగా అలా చేయగల్గారు. నోవహు ధైర్యాన్ని పరిశీలించండి. తన విశ్వాసంతో, లోకముపై నేరస్థాపనచేశాడు, తన కాలంలోని తప్పిదస్థులనుండి దూరంగా ఉన్నాడు. (హెబ్రీ. 11:7) మంచి పోరాటం పోరాడండి, ఎందుకంటే తగిన ప్రతిఫలం దొరుకుతుంది. సాతాను గుంపును అనుకరించే బలహీనులైన, ధైర్యం లేని, పిరికిపందలను అనుకరించవద్దు. దీనికి భిన్నంగా, యెహోవా దృష్టిలో అంగీకారం కొరకు ప్రయత్నించే వారి సహవాసమును వెదకండి. (ఫిలి. 3:17) దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త లోకంలోనికి మీతోపాటు నడిచేవారితో సహవసించండి. (ఫిలి. 1:27) నిత్య జీవానికి నడిపే మార్గం ఒక్కటేనని గుర్తుంచుకోండి.—మత్త. 7:13, 14.
33 దేవునికి స్తుతి, ఘనత తెచ్చే యౌవనస్థులను చూసినప్పుడు మనమే సంతోషిస్తున్నట్లయితే, మరి ఆయన ఇంకా ఎంతగా సంతోషిస్తాడో! తన శ్రేష్ఠమైన ఉద్దేశాలను ప్రకటించుటలో పూర్తిగా పాల్గొనే యౌవనస్థులను చూస్తున్నప్పుడు యెహోవా సంతోషిస్తాడనుటకు సందేహం లేదు. వారు ఆయన ఇచ్చిన “స్వాస్థ్యము,” ఆయన వారి మేలే కోరుకుంటాడు. (కీర్త. 127:3-5; 128:3-6) యేసుక్రీస్తు తన తండ్రి ఆసక్తిని ప్రతిబింబిస్తూ, పిల్లలతో సహవసించడంలో చాలా సంతోషాన్ని అనుభవించాడు, యెహోవాను ఆరాధించాలని వారిని ప్రోత్సహించడానికి కొంత సమయం గడిపాడు. యేసు వారి మీద చాలా ప్రేమ చూపాడు. (మార్కు 9:36, 37; 10:13-16) మన యౌవనస్థులను యెహోవా, యేసుక్రీస్తులు దృష్టించినట్లే మనం కూడా మన యౌవనులను దృష్టిస్తామా? వారి భక్తిని, మంచి మాదిరిని యెహోవా, దూతలు ఎలా దృష్టిస్తారో మన యౌవనస్థులకు తెలుసా? యెహోవాను సంతోషపరచే విధంగా వారు ఆత్మీయ లక్ష్యాలను సాధించడానికి వారిని మెచ్చుకోవాలి, ప్రోత్సహించాలి. యౌవనస్థులారా, మీకు ఇప్పుడును, భవిష్యత్తులోను ఆశీర్వాదాలు కల్గజేయు లక్ష్యాలను వెంబడించండి.