మన పాత పుస్తకాలను చక్కగా ఉపయోగించుకోవడం
1 సమృద్ధియైన ఆత్మీయ పోషకాహారాన్ని యెహోవా మనకు దయ చేశాడు. ఈ సమాచారంలోని అధికభాగం ఇటీవలి సంవత్సరాల్లో ప్రచురించబడిన 192 పుటల పుస్తకాల రూపంలో ఉంది. జనవరి నెలలో ప్రత్యేక వెలకు పంచిపెట్టడానికి మనరాజ్య పరిచర్యలో చెప్పబడిన 192 పుటల పుస్తకాల్లో ఏదైనా ఒక పుస్తకాన్ని అందిస్తాము. ఇప్పటికీ ఉపయోగించగల్గే స్థితిలో ఈ పుస్తకాలేవైనా మీ యింట్లో ఉన్నాయా? మీ సంఘం నుండి స్టాకును పొందారా? అలాగైతే, వాటిలోని విషయాలను పునఃసమీక్షించి, మాట్లాడే కొన్ని అంశాలను ఎంపిక చేసుకొని, మీ సంభాషణలో ఉపయోగించుకోవడం మంచిది.
2 మీరు “నిన్ను సంతోషపరచు సువార్త” అనే పుస్తకాన్ని పరిచయం చేస్తున్నట్లయితే మీరు యీ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయవచ్చు:
◼ “ఈ లోకంలో అనేక సమస్యలున్నందువల్ల చాలామంది ప్రజలకు సంతోషాన్ని కనుగొనడం కష్టతరంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సంతోషంగా ఉండడం సాధ్యమని మీరు అనుకుంటున్నారా? [జవాబివ్వనివ్వండి. పుట 106కు తిప్పి హింసకు భయపడుతూ మానవులు ఎలా జీవిస్తున్నారో చెప్పండి.] మనము నేటి సమస్యలను ఎలా ఎదుర్కొనవచ్చో, చివరికి సమాధానకరమైన క్రొత్త లోకంలో అనంతమైన సంతోషాన్ని ఎలా అనుభవించవచ్చో అని బైబిలు చూపుతుంది. [పుట 188 తిప్పి 2 పేతు. 3:13 చదవండి; 189వ పుటలోని చిత్రాన్ని వివరించండి.] బైబిలు యీ సువార్తకు మూలం, దీనిని అర్థం చేసుకోడానికి యీ పుస్తకము మీకు సహాయపడగలదు.”
3 గహస్థుడు చర్చిసంబంధమైన పుట్టుపూర్వోత్తరాలు గలవాడైతే మీరు యీ విధంగా చెబుతూ, “నీ రాజ్యం వచ్చుగాక,” (ఆంగ్లం) అనే పుస్తకాన్ని అందించగలరు:
◼ “క్రైస్తవులు దేవునిరాజ్యం రావాలని దాదాపు 2,000 సంవత్సరాలుగా ప్రార్థించారు. రాజ్యం మానవజాతి కొరకు ఏమి చేస్తుందని మీరనుకుంటున్నారు? [జవాబివ్వనివ్వండి. పుట 25లోని బాక్స్‌ను తీసి, రాజ్యపరిపాలన క్రింద వచ్చే ఆశీర్వాదాల్లో కొన్నింటిని చూపించండి.] ఈ పుస్తకం రాజ్యం సాధించనున్న కార్యాలను గూర్చి చర్చిస్తుంది. మీరు, మీ ప్రియమైనవారు ఎలా ప్రయోజనం పొందగలరు అనే విషయాన్ని అది వివరిస్తుంది. మీరు చదవాలని కోరుకుంటున్నట్లయితే, మీకు ఒక ప్రతినివ్వడానికి నేను యిష్టపడుతున్నాను.”
4 మీరు “నిజమైన శాంతి భద్రతలు—ఏ మూలము నుండి?,” (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఉపయోగిస్తున్నట్లయితే మీరు యీ విధంగా చెప్పడానికి ప్రయత్నించవచ్చు:
◼ “శాంతి భద్రతలున్న లోకంలో జీవించడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. విచారకరమైనదేమంటే, మన జీవిత కాలంలో మనం దానిని అనుభవించలేదు. శాంతి భద్రతలను వాస్తవం చేయడానికి మనం ఏమి చేయవలసిన అవసరం ఉన్నదని మీరనుకుంటున్నారు? [జవాబివ్వనివ్వండి.] భూమిపైకి శాంతిని తీసుకు వచ్చే శక్తి దేవునికుంది, ఆయన అలా చేస్తానని వాగ్దానం చేశాడు.” పుట 4లోని చిత్రానికి తిప్పి మీకా 4:3, 4 చదవండి. మంచి ప్రతిస్పందన ఉన్నట్లయితే, రాజ్య నిరీక్షణను గూర్చి ఎక్కువగా వివరించి, పుస్తకాన్ని అందించి, పునర్దర్శనానికి ఏర్పాట్లు చేయండి.
5 “జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?” అనే పుస్తకాన్ని అందించాలని మీరు నిర్ణయించుకోవచ్చు. అలాగైతే మీరీ విధంగా చెప్పవచ్చు:
◼ “దేవుడు యీ లోకంలో యింత కష్టాన్నెందుకు అనుమతించాడని అనేకమంది ప్రజలు ఆలోచిస్తారు. ఆయన సర్వశక్తిమంతుడైనప్పటికీ, మన దురవస్థకు అంతం తేవడానికి ఆయన ఎందుకు ఏమీ చేయడం లేదు? మీరేమనుకుంటున్నారు? [జవాబివ్వనివ్వండి.] దేవుడు మనలను విడనాడలేదని బైబిలు హామీ యిస్తుంది.” పుటలు 142, 143 తిప్పి మనం నిరీక్షణ కలిగి ఉండవచ్చని చూపించే యెషయా 11:6-9 మరియు ప్రకటన 21:2-4 లలోని ఉద్ధరణలను చదవండి. బైబిలు నుండి కీర్తన 37:11, 29 చదవండి. పుస్తకాన్ని తీసుకున్నట్లయితే, దానిని వివరించడానికి పునర్దర్శిస్తామని చెప్పండి.
6 బైబిలును క్షుణ్ణంగా పరిశీలించడానికి మన సాహిత్యం వేలాదిమందిని పురికొల్పింది. వారు నేర్చుకున్న విషయాలు వారికి సంతోషకరమైన భవిష్యత్తు కొరకైన నిరీక్షణను యిచ్చాయి. (కీర్త. 146:5) వారికి సహాయం చేయడం మన ఆధిక్యత.