‘తమ మహా సృష్టికర్తను ఇప్పుడే స్మరణకు తెచ్చుకొనుటకు’ యౌవనస్థులకు సహాయం చేయుట
1 బైబిలులో ఇవ్వబడిన ఆచరణయోగ్యమైన ఉపదేశాన్ని ‘వినడం’ మాత్రం చాలదు. పూర్తిగా ప్రయోజనం పొందడానికి, ఒకరు తప్పనిసరిగా వ్రాయబడినదానిని ‘గైకొనాలి.’ (ప్రక. 1:3) సాహిత్యాన్ని అందించడం శిష్యులను చేయడంలోని మొదటి మెట్టు మాత్రమే. వినడానికి ఇష్టపడే ఆసక్తిగలవారిని ఒకసారి కనుగొన్నప్పుడు, మరెక్కువ నేర్చుకోడానికి వారికి సహాయపడేందుకు త్వరలోనే మనం వారి దగ్గరికి తిరిగి వెళ్ళాలి. ‘తమ మహా సృష్టికర్తను ఇప్పుడే స్మరణకు తెచ్చుకొని’ తద్వారా, నిత్యజీవాన్ని సంపాదించుకోగలిగే, యౌవనస్థులకు, మరితరులకు మనం సహాయం చేయవలసిన అవసరం ఉంది. (ప్రసం. 12:1) మన పునర్దర్శనంలో దేన్ని గూర్చి మనం మాట్లాడవచ్చు?
2 మీ మొదటి దర్శనంలో నేడు యౌవనస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గూర్చి మీరు మాట్లాడినట్లయితే, మీరు ఈ విధంగా మీ సంభాషణను ఆరంభించవచ్చు:
◼ “నేటి ప్రపంచంలో యౌవనస్థులు సహించవలసిన పరిస్థితుల్లో కొన్నింటిని గూర్చి మనం క్రితంసారి మాట్లాడుకున్నాం. యౌవనస్థులతో సహా ప్రతి ఒక్కరియందు యెహోవా శ్రద్ధ కలిగివున్నాడు గనుక, నేడు చాలా మంది యౌవనస్థులు చిక్కుకుంటున్న ఉరుల్లో చిక్కుకోకుండా జీవితాన్ని అనుభవించేందుకు వారికి సహాయపడే మార్గదర్శక సూత్రాలను ఆయన తన వాక్యమైన బైబిలులో ఇచ్చాడు.” యౌవనస్థులు అడుగు ప్రశ్నలు అనే పుస్తకంలోని విషయ సూచికను తీసి, ఆ పట్టికలో గృహస్థునికి ఆసక్తి కలిగించే విషయమేదో చెప్పమనండి. ఉదాహరణకు, అతడు మాదక ద్రవ్యాలు అనే అంశాన్ని ఎంపిక చేసుకున్నట్లయితే, పుట 272 నందలి 34వ అధ్యాయం తీయండి. ఇటువంటి కొన్ని ఉపశీర్షికల వైపుకు అతని శ్రద్ధను మళ్ళించండి: “మాదకద్రవ్యాలు పెరుగుదలను నిరోధిస్తాయి,” “మాదకద్రవ్యాలు నా ఆరోగ్యాన్ని పాడుచేయగలవా?” “మాదక ద్రవ్యాలు—బైబిలు ఉద్దేశం,” మరియు “వద్దు అని మీరు చెప్పగలరు!” అనే ఉపశీర్షిక క్రింద ఉన్న ఆచరణయోగ్యమైన సలహాను చూపించండి. పాఠకుడు సమాచారాన్ని పునఃసమీక్ష చేసుకుని ముఖ్యాంశాలను గ్రహించడానికి అధ్యాయం చివరనున్న “చర్చనీయమైన ప్రశ్నలు” ఎలా సహాయపడతాయో చూపించండి. క్రమంగా వాళ్ళింటికి మళ్ళీ వస్తామని వారితో పాటు ఈ విధంగా పుస్తకాన్నంతా పరిశీలించవచ్చని చెప్పండి.
3 మీరు తొలి దర్శనంలో మంచి సలహా మూలాన్ని గూర్చి చర్చించినట్లయితే, ఈ ప్రశ్నను అడుగుతూ కొనసాగించాలని మీరు తీర్మానించుకోవచ్చు:
◼ “యౌవనస్థులు అకాడమీ సబ్జెక్టుల్లో లభించే విద్యాభ్యాసాన్ని ఆర్జిస్తే సరిపోతుందని మీరనుకుంటారా? [జవాబివ్వనివ్వండి. యిర్మీయా 10:23 చదవండి.] మీరు గ్రహించగలిగినట్లు, ఒక ఉన్నతమైన మూలము నుండి తర్ఫీదు అవసరం. దేవుని సహాయం లేకుండా జీవించాలనే ప్రయత్నాలే దాదాపు మన సమస్యలన్నింటికీ కారణం. విజయవంతమైన జీవితాలను గడపడానికి నమ్మదగిన, కాలపరీక్షనెదుర్కొన్న ఉపదేశమూలము దేవుని వాక్యము మాత్రమే.” మరి 316 మరియు 317 పుటల్లోని బాక్సును ఎత్తి చూపించి, బైబిలు సూత్రాలను గౌరవించే వారితో సహవసించడం మరియు పఠించడమనేవి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి, సమస్యలను తప్పించుకోడానికి మార్గాలని, అలాగే కూటాలు ఈ అంత్యదినాల్లో బైబిలు ఆధారిత ఉపదేశానికి స్థిరమైన మూలమని చూపించండి.
4 లేఖనాధార చర్చను ప్రారంభించడానికి మీరిలా ప్రయత్నించాలని ఇష్టపడవచ్చు:
◼ యౌవనస్థులు అడుగు ప్రశ్నలు అనే పుస్తకమందలి 318వ పుటలోని చిత్రాలను చూపించి, ఈ విధంగా వివరించండి: “మన సృష్టికర్తతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడం మనం శాశ్వత ప్రయోజనాలను పొందగలమనే నిశ్చయతనివ్వగలదు. అలాంటి సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోడానికి ఒకరు ఏమి చేయవలసిన అవసరం ఉంది? ఒక చర్యేమిటంటే, దైవ ప్రేరేపిత వాక్యాన్ని క్రమంగా చదవడమే.” పుట 308లోని ఉపశీర్షికలను చర్చించి, మరి ఎక్కువగా నేర్చుకోవడానికి మన బైబిలు పఠన కార్యక్రమం నుండి ప్రయోజనం పొందమని గృహస్థున్ని ఆహ్వానించండి.
5 బైబిలు పఠనాలను ఆరంభించడమే మన లక్ష్యం గనుక, మనం ఫలవంతమైన పునర్దర్శనాలను చేయవలసిన అవసరముంది. వాటి కొరకు సమయాన్ని కేటాయించి, బాగా సిద్ధపడండి. ఈ విధంగా మనం యథార్థహృదయులకు నిజంగా సహాయపడగలము.—ప్రక. 22:6, 7.