మీరు దేవుని వాక్యాన్ని సరిగా ఉపదేశిస్తున్నారా?
1 భూమిమీద జీవించినవారిలోకెల్లా యేసు క్రీస్తు గొప్ప బోధకుడు. ప్రజల హృదయాలను స్పర్శించేలా, వారి భావోద్రేకాలను ప్రేరేపించేలా, సత్క్రియలను చేయడానికి వారిని పురికొల్పేలా ఆయన మాట్లాడాడు. (మత్త. 7:28, 29) ఆయన తన బోధకు ఆధారంగా దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ ఉపయోగించాడు. (లూకా 24:44, 45) ఆయన తనకు తెలిసిన వాటన్నింటికి, తను బోధించగలిగిన వాటన్నింటికీ యెహోవాకు మహిమను చెల్లించాడు. (యోహా. 7:16) యేసు దేవుని వాక్యాన్ని సరిగా ఉపదేశిస్తూ తన అనుచరులకు శ్రేష్ఠమైన మాదిరిని ఉంచాడు.—2 తిమో. 2:15.
2 అపొస్తలుడైన పౌలు కూడా దేవుని వాక్యాన్ని ఫలకరంగా ఉపయోగించడం ద్వారా చాలా చక్కని మాదిరిని ఉంచాడు. ఆయన లేఖనాలను ఇతరులకు చదివి వినిపించడం కన్నా ఎక్కువే చేశాడు; తాను చదివిన దానిని వివరించి, తర్కించి, యేసే క్రీస్తని లేఖనాల నుండి రుజువునిచ్చాడు. (అపొ. 17:2-4) అలాగే, వాక్క్పటిమ గల శిష్యుడైన అపొల్లో “లేఖనములయందు ప్రవీణుడై” యుండెను, మరియు అతడు సత్యాన్ని శక్తివంతంగా అందిస్తూ దానిని సరిగా బోధించాడు.—అపొ. 18:24, 28.
3 దేవుని వాక్య బోధకులై ఉండండి: ఆధునిక దిన రాజ్య ప్రచారకులు బైబిలులోని విషయాలను సూచించడం ద్వారా బైబిలు నుండి తర్కించడం ద్వారా యథార్థహృదయులైన ప్రజలకు బోధించడంలో ఉత్కృష్టమైన సాఫల్యతను పొందారు. ఒక సందర్భంలో, ఒక సహోదరుడు ఒక పాస్టర్తోను, అతని చర్చిలోని ముగ్గురు సభ్యులతోను దుష్టులకు మరియు నీతిమంతులకు లభించే ఫలితాన్ని గురించి తర్కించేందుకు యెహెజ్కేలు 18:4 తోపాటు దానికి సంబంధించిన లేఖనాలను ఉపయోగించగలిగాడు. దాని ఫలితంగా, చర్చిలోని కొందరు సభ్యులు పఠించనారంభించారు, వారిలో ఒకరు చివరికి సత్యాన్ని అంగీకరించారు. మరో సందర్భంలో, యెహోవాసాక్షులు క్రిస్ట్మస్ను, జన్మదినాలను ఎందుకు ఆచరించరో చెప్పమని ఆసక్తి గల ఒక స్త్రీ యొక్క వ్యతిరేకించే భర్త ఒక సహోదరీని అడిగాడు. ఆమె లేఖనాధార జవాబులను నేరుగా తర్కించుట (ఆంగ్లం) పుస్తకం నుండి చదివినప్పుడు ఆయన వాటిని అంగీకరించాడు, అలా ఆయన అంగీకరించగా ఆయన భార్య ఎంతో సంతోషించి, “మేం కూటాలకు వస్తాం” అని చెప్పింది. ఆమె భర్త అందుకు అంగీకరించాడు మరి!
4 అందుబాటులో ఉన్న సహాయాన్ని ఉపయోగించుకోండి: మన రాజ్య పరిచర్య మరియు సేవా కూటం కార్యక్రమం దేవుని వాక్యాన్ని బోధించడంలో మనకు సహాయపడే చక్కని నిర్దేశాన్ని ఇస్తాయి. మన ప్రయోజనార్థమై ప్రచురించబడిన, ప్రదర్శించబడిన, ఎంతో సమయోచితమైనవని, ఫలకరమైనవని నిరూపించబడిన, ఇవ్వబడిన వివిధ రకాల అందింపుల ఎడల అనేక మంది ప్రచారకులు మెప్పుదలను వ్యక్తం చేశారు. దేవుని వాక్యంలో చెప్పబడిన 70 కన్నా ఎక్కువగా ఉన్న ప్రాముఖ్యమైన అంశాలను సరైన విధంగా ఎలా వివరించాలనే దాని గురించిన ఆలోచనలు లేఖనాల నుండి తర్కించుట అనే పుస్తకంలో పుష్కలంగా ఉన్నాయి. క్రొత్తవారు అర్థంచేసుకోవలసిన ప్రాథమిక బైబిలు బోధలన్నింటి క్లుప్తమైన సంగ్రహం నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలో ఇవ్వబడింది. నిపుణతగల బోధకులు లేఖనాలను సరైన విధంగా ఎలా పరిచయం చేసి, చదివి అన్వయిస్తారో దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకములోని 24, 25 పాఠ్యభాగాలు మనకు చూపిస్తాయి. మనకు అవసరమైన వెంటనే లభ్యమయ్యే ఈ సహాయాన్నంతటినీ మనం సద్వినియోగం చేసుకోవాలి.
5 మనం దేవుని వాక్యాన్ని సరైన విధంగా ఉపయోగించినప్పుడు, అది “సజీవమై బలముగలదై” మనం ఎవరికి బోధిస్తున్నామో వారి “హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది” అని మనం కనుగొంటాం. (హెబ్రీ. 4:12) మనం దాని వలన పొందే సాఫల్యత మనం ఇంకా గొప్ప ధైర్యంతో సత్యాన్ని గూర్చి మాట్లాడేందుకు మనలను పురికొల్పుతుంది!—అపొ. 4:31.