పునర్దర్శనాలను చేసేందుకు ధైర్యాన్ని కూడగట్టుకోండి
1 పునర్దర్శనాలు చేయడంలో మీరు ఆనందిస్తారా? అనేకమంది ప్రచారకులు ఆనందిస్తారు. మొదట్లో మీరు భయపడివుంటారు. ప్రాముఖ్యంగా, మొదటిసారి కలిసినప్పుడు ఎక్కువ ఆసక్తిని చూపించని ఓ గృహస్థున్ని పునర్దర్శించడానికి భయపడివుంటారు. పునర్దర్శనాలు చేయడంలో సువార్తను గూర్చి మాట్లాడేందుకు మన దేవుని సహాయంతో మీరు ధైర్యాన్ని కూడగట్టుకుంటే, ఈ పని ఎంత సులభంగానూ ఎంత ప్రతిఫలదాయకంగానూ ఉంటుందో చూసి మీరు ఆశ్చర్యపోతారు. (1 థెస్స. 2:2) అదెలా?
2 అసలు విషయమేమిటంటే పునర్దర్శనానికీ మొదటిసారి మాట్లాడేందుకూ ముఖ్యమైన తేడా ఒకటి ఉంది. పరిచయస్థులను పునర్దర్శిస్తాం కానీ అపరిచయస్తులను కాదు, మరి సాధారణంగా అపరిచయస్థులకన్నా పరిచయస్థులతోనే సులభంగా మాట్లాడవచ్చు. మరి ఈ పనిలో భాగంవహించడం వల్ల వచ్చే సంతృప్తికరమైన ఫలితాల విషయానికి వస్తే పునర్దర్శనాలు ఫలవంతమైన బైబిలు పఠనాలకు నడిపించవచ్చు.
3 మనం మునుపు కలిసినప్పుడు ఆసక్తి కనపర్చని ప్రజలను కలవడం కూడా ఇంటింటి సేవలో ఇమిడి ఉంది. మరైతే మనం ఎందుకు వారిని కలుస్తూనే ఉంటాము? ప్రజల పరిస్థితులు మారుతుంటాయనీ అలాగే ముందు కలిసినప్పుడు అలక్ష్యంతో ప్రతిస్పందించిన వ్యక్తి లేక వ్యతిరేకించిన వ్యక్తి కూడా మనం మరోసారి కలిసినప్పుడు అసక్తిని కనపర్చగలరని మనం గ్రహిస్తాము. దాన్ని మనస్సులో ఉంచుకొని, మనం చెప్పే మాటల ద్వారా వారు ప్రతిస్పందించేలా చేసేందుకుగానూ మనం బాగా సిద్ధపడి యెహోవా ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తాము.
4 ఇంటింటి పరిచర్యలో ఇంతకు మునుపు ఏ ఆసక్తినీ కనపర్చని వారికి మనం ఇష్టపూర్వకంగా ప్రకటించినట్లైతే, రాజ్య సందేశంలో కొంచెం ఆసక్తిని కనపర్చిన వారెవరినైనా పునర్దర్శించడానికీ మనం మరింత ఇష్టపూర్వకంగా ఉండాలి కదా?—అపొ. 10:34, 35.
5 ఓ ప్రచారకుడు ఓపికగా పునర్దర్శించడం వల్లనే, మనలో అనేకులం ఈ రోజు సత్యంలో ఉన్నాము. ఇలాంటి వారిలో మీరొరకరైతే, ‘ఆ ప్రచారకునికి నేను ఎలాంటి అభిప్రాయాన్ని ఇచ్చివుంటాను? నేను రాజ్య సందేశాన్ని విన్న వెంటనే అంగీకరించానా? నేను దాన్ని అలక్ష్యం చేస్తున్నట్లుగా కనిపించానా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు. బదులుగా, మరలా దర్శించిన ప్రచారకుడు పునర్దర్శించేందుకు మనం తగినవారమని మనలను ఎంచినందుకూ ‘దేవునియందు ధైర్యము తెచ్చుకొన్నందుకూ’ పునర్దర్శించి మనకు సత్యాన్ని అందించినందుకూ మనం సంతోషించాలి. మొదట కొంత ఆసక్తిని కనపర్చి ఆ తర్వాత మనలను తప్పించుకోవాలని చూస్తున్నట్లుగా కనిపించేవారి విషయమేమిటి? ఈ క్రింది అనుభవం చూపించినట్లుగా ఓ అనుకూల దృక్పథం ఎంతో ప్రాముఖ్యం.
6 ఓ రోజు ఉదయం వీధి సాక్ష్యమిస్తుండగా, స్ట్రోలర్‌లో బిడ్డను తీసుకు వెళుతున్న స్త్రీని ఇద్దరు ప్రచారకులు కలిశారు. ఆ స్త్రీ ఓ పత్రికను తీసుకుని, ఆ పై ఆదివారం తన ఇంటికి రమ్మని ఆ సహోదరీలను ఆహ్వానించింది. ముందు అనుకున్న సమయానికి వారు వెళ్లారుకానీ వాళ్లతో మాట్లాడేందుకు తనకు అప్పుడు తీరికలేదని ఆమె చెప్పింది. అయితే, ఆ పై వారం ఉంటానని మాత్రం ఆమె మాట ఇచ్చింది. ఆమె తన మాట నిలబెట్టుకుంటుందో లేదో అని ఆ సహోదరీలు సందేహించారుకానీ వాళ్లు వెళ్ళినప్పడు ఆ స్త్రీ వారి కొరకు ఎదురుచూస్తూ ఉంది. పఠనం ప్రారంభించడం జరిగింది, మరి ఆ స్త్రీ ఆశ్చర్యకరంగా అభివృద్ధి చెందసాగింది. అతి తక్కువ కాలంలోనే ఆ స్త్రీ కూటాలకు హాజరై, ప్రాంతీయ సేవలో పాల్గొనడం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె బాప్తిస్మం తీసుకుంది.
7 మొదటి సందర్శనంలోనే మంచి పునాదిని వేయండి: తరచూ, ఫలభరితమైన పునర్దర్శనంకొరకు మొదటిసారి కలిసినప్పుడే పునాదిని వేయాలి. గృహస్థులుచేసే వ్యాఖ్యానాలను శ్రద్ధగా వినండి. వాళ్లు మీకు ఏమి చెబుతున్నారు? అతనికి మతాసక్తి ఉందా? అతనికి సామాజిక వివాదాంశాల్లో శ్రద్ధ ఉందా? అతనికి విజ్ఞానశాస్త్రంలో గానీ, చరిత్రలో గానీ, పర్యావరణంలో గానీ, లేక వీటన్నింటిలోనూ ఆసక్తి ఏమన్నా ఉందా? ఈ మొదటి సంభాషణ చివర్లో ఆలోచింపజేసే ప్రశ్నను వేసి, మరలా వచ్చినప్పుడు దాని విషయంలో బైబిలు ఇచ్చే జవాబులను చర్చిస్తారని వాగ్దానం చేయండి.
8 ఉదాహరణకు, గృహస్థుడు పరదైసు భూమిని గూర్చిన బైబిలు వాగ్దానానికి ప్రతిస్పందించినట్లైతే, ఆ విషయంపై ఇంకా చర్చించడం సమంజసంగా ఉంటుంది. మీరు వచ్చే ముందు ఇలా ప్రశ్నించవచ్చు: “దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అని మనం ఎలా ఖచ్చితంగా నమ్మవచ్చు?” ఆ తర్వాత, “బహుశ మీ కుటుంబంలోనివారందరూ ఉన్నప్పుడు నేను వస్తాను, అప్పుడు ఈ ప్రశ్నకు బైబిలు ఇచ్చే జవాబులను నేను మీకు చూపిస్తాను” అని కూడా అనవచ్చు.
9 ఏ ఒక్క విషయంపై కూడా గృహస్థుడు ఆసక్తిని కనపర్చకపోయినట్లైతే, మన రాజ్య పరిచర్యలోని వెనుక పేజీలో ఇచ్చిన అందింపులను ఉపయోగించి ఓ ప్రశ్నను అడగవచ్చు మరి దాన్ని మీ తర్వాతి చర్చకు ఆధారంగా ఉపయోగించండి.
10 ఖచ్చితమైన లిఖితపూర్వక రికార్డులను పెట్టుకోండి: మీ ఇంటింటి రికార్డు ఖచ్చితంగా, పూర్తి వివరాలను కలిగి ఉండాలి. మీరు ఆ ఇంటిని విడిచి వచ్చినవెంటనే ఆ గృహస్థుని పేరునూ చిరునామానూ రాసుకోండి. ఆ ఇంటి నెంబరునుగానీ లేక వీధి పేరునుగానీ ఊహించి రాయకండి—మీరు రాసుకున్న వివరాలు సరైనవేనని రూఢిపర్చుకునేందుకు దాన్ని గూర్చి కనుక్కోండి. ఆ వ్యక్తి ఎలా ఉంటాడన్న వివరాలను రాసుకోండి. మీరు చర్చించిన విషయాన్ని గూర్చీ చదివిన లేఖనాన్ని గూర్చీ, మీరు ఏదైనా సాహిత్యాన్ని ఇచ్చినట్లైతే దాన్ని గూర్చీ మరి తిరిగి వెళ్లినప్పుడు మీరు జవాబివ్వాల్సిన ప్రశ్నను గూర్చీ రాసుకోండి. మొదటి సారి ఏ రోజు ఏ సమయానికి కలిశారు అలాగే మరలా మీరు వెళ్ళే రోజూ సమయమూ కూడా రాసుకోండి. ఇప్పుడు మీ రికార్డు పూర్తైంది కనుక, ఇక దాన్ని పోగొట్టుకోకుండా చూసుకోండి సుమా! అవసరమైనప్పుడు చూసుకునేందుకు దాన్ని జాగ్రత్తగా ఉంచండి. ఆ వ్యక్తిని గూర్చీ మరి మరలా మీరు అతనిని కలిసినప్పుడు ఎలా మాట్లాడతారు అన్న విషయాన్ని గూర్చీ ఆలోచిస్తూ ఉండండి.
11 మీ లక్ష్యాన్ని తెలుసుకోండి: మొదటిగా, ఆప్యాయతను కనబరుస్తూ స్నేహపూర్వకంగా ఉంటూ మీ గృహస్థుడు ఇబ్బందిగా భావించకుండా ఉండేందుకు మీ శాయశక్తులా ప్రయత్నించండి. అతని వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకుండానే, వ్యక్తిగా అతని గూర్చి మీకు ఆసక్తి ఉందని చూపించండి. ఆ తర్వాత, అంతకుముందు మీరు వేసిన ప్రశ్న ఏదైనా ఉంటే దాన్ని అతనికి జ్ఞాపకం చేయండి. అతని అభిప్రాయాన్ని జాగ్రత్తగా విని అతను వ్యాఖ్యానించినందుకు మీరు యథార్థమైన మెప్పుదలను వ్యక్తపర్చండి. తర్వాత, బైబిలు దృక్పథం ఎందుకు ఆచరణయుక్తమైనదో చూపించండి. సాధ్యమైతే, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంలో ఉన్న అలాంటి ఆలోచనవైపు అతని అవధానాన్ని మళ్ళించండి. పునర్దర్శనంలో మీ ముఖ్య లక్ష్యం బైబిలు పఠనం ప్రారంభించడమే అని జ్ఞాపకముంచుకోండి.
12 జ్ఞానము పుస్తకంలో ఉపయోగించిన సూటిదనం, బైబిలు పఠనాల్లో విద్యార్థులను కూటాలకు హాజరుకమ్మనీ యెహోవా సంస్థతో సహవసించమనీ ప్రోత్సహించేలా మనలో అనేకమందిమి ‘ధైర్యాన్ని కూడగట్టుకునేందుకు’ ప్రేరేపించింది. గతంలోనైతే, విద్యార్థులను మనతో సహవసించమని త్వరగా ఆహ్వానించేవాళ్లంకాదు. మరి ఇప్పుడు, అనేకమంది విద్యార్థులు పఠించడం మొదలుపెట్టిన వెంటనే కూటాలకు హాజరవుతున్నారు, తద్వారా వాళ్లు ఎంతో త్వరగా పురోభివృద్ధిని సాధిస్తున్నారు.
13 ఓ దంపతులు తమ తోటి పనివానికి అనియతంగా సాక్ష్యమిచ్చారు. అతను సత్యంలో ఆసక్తి వ్యక్తపర్చినప్పుడు, జ్ఞానము పుస్తకంనుండి బైబిలు పఠనం చేయడానికి వాళ్లు అతనిని ఆహ్వానించారు. అదే సమయంలో, అతనికున్న ప్రశ్నలకు ఎక్కువగా జవాబులిచ్చే కూటాలకు అతను తప్పక హాజరవ్వాలని వాళ్లు అతనితో చెప్పారు. ఆ వ్యక్తి పఠించేందుకు వారిచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించడం మాత్రమే కాకుండా వారానికి రెండుసార్లు పఠించేవాడు, అంతేకాకుండా రాజ్యమందిరంలోని కూటాలకు క్రమంగా హాజరవ్వడం ప్రారంభించాడు.
14 దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరును ఉపయోగించండి: “దైవిక శాంతి సందేశకులు” జిల్లా సమావేశాల్లో దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరును మనం అందుకున్నాము. ఎక్కువ చదువుకున్నా తక్కువ చదువుకున్నా, దైవ భయంగల ఆ ప్రజలతో బైబిలు పఠనాన్ని ప్రారంభించేందుకు ఈ బ్రోషూరు సహాయపడుతుంది. ఇది బైబిలు మూలబోధలన్నింటిని గూర్చి బోధిస్తూ, సమగ్రమైన పఠన అంశాలను కల్గివుంటుంది. దేవుని జ్ఞానాన్ని అందించేందుకు ఈ ప్రచురణ ఎంతో ప్రభావవంతమైన పనిముట్టు. అది సత్యాన్ని ఎంత స్పష్టంగానూ సరళంగానూ వివరిస్తుందంటే, దేవుడు మననుండి అపేక్షించేవాటిని ఇతరులకు బోధించేందుకు ఇంచుమించు మనమందరమూ దాన్ని ఉపయోగించగలము. బహుశ, ఈ బ్రోషూరులో బైబిలు పఠనాన్ని నిర్వహించే ఆధిక్యత అనేకమంది ప్రచారకులకు ఉంది.
15 జ్ఞానము పుస్తకాన్ని చదివేంత సమయము లేదని భావించే కొంతమంది దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూరు నుండి కొద్ది కొద్దిగా పఠించేందుకు ఇష్టపడవచ్చు. తాము నేర్చుకునే దాన్నిబట్టి వారు పులకించిపోతారు! రెండు మూడు పేజీల్లోనే, దేవుడెవరు? అపవాది ఎవరు? భూమి కొరకు దేవుడు ఏమి సంకల్పించాడు? దేవుని రాజ్యం ఏమిటి? నిజమైన మతాన్ని మీరు ఎలా కనుగొనగలరు? వంటి శతాబ్దాలుగా ప్రజలు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఈ బ్రోషూరు సత్యాన్ని సరళమైన మాటల్లో అందించినప్పటికీ, దాని సందేశం ఎంతో శక్తివంతమైంది. బాప్తిస్మం తీసుకునేవారితో పెద్దలు పునఃసమీక్షించే కీలకమైన విషయాలు అందులో ఉన్నాయి మరి అవి జ్ఞానము పుస్తకాన్ని మరింత క్షుణ్ణంగా పఠించడానికి తొలి పనిముట్టుగా పనిచేస్తుంది.
16 పునర్దర్శనంలో మీరు పఠనాన్ని ప్రతిపాదించేందుకు సరళంగా ఇలా చెప్పవచ్చు: “మీకు తెలుసాండీ, కేవలం ఒకటి రెండు నిమిషాలు వెచ్చిస్తే మీకు ఓ ప్రాముఖ్యమైన ప్రశ్నకు జవాబు దొరుకుతుంది.” ఆ తర్వాత, బ్రోషూరులోని ప్రారంభ పాఠాల్లోని ఒక పాఠంలో కనిపించే ప్రశ్నను వేయండి. ఉదాహరణకు, చర్చికి వెళ్లేవారిని కలుస్తున్నట్లైతే, మీరు ఇలా చెప్పవచ్చు: “గతకాలంలో యేసు ప్రజలను స్వస్థపర్చాడు. కానీ భవిష్యత్తులో, అనారోగ్యుల విషయంలోనూ, వృద్ధుల విషయంలోనూ, మృతుల విషయంలోనూ యేసు ఏమి చేస్తాడు?” దీనికి జవాబు 5వ పాఠంలో ఉంది. మతంలో ఆసక్తి ఉన్న ఏ వ్యక్తైనా ఈ ప్రశ్నను గూర్చి ఎక్కువగా ఆలోచిస్తాడు: “అన్ని ప్రార్థనలనూ దేవుడు వింటాడా?” దాని జవాబు 7వ పాఠంలో ఉంది. కుటుంబ సభ్యులైతే, “తలిదండ్రులనుండీ పిల్లలనుండీ దేవుడు ఏమి కోరుతున్నాడు?” అన్నది తెలుసుకునేందుకు ఆసక్తి కనపరుస్తారు. 8వ పాఠాన్ని వారు పఠించినప్పుడు వారు దాని జవాబును కనుగొంటారు. ఇతర ప్రశ్నలేమిటంటే: “మృతులు జీవించినవారికి హానిచేయగలరా?” 11వ పాఠంలో వివరించడం జరిగింది; “క్రైస్తవులమని చెప్పుకునేవారిలో అనేక శాఖలు ఎందుకున్నాయి?” అన్నది 13వ పాఠంలో చర్చించబడింది; “మీరు దేవుని స్నేహితులు కావాలంటే మీరేమి చేయాలి?” 16వ పాఠంలో ఉంది.
17 పర భాష మాట్లాడే వారికి సహాయంచేయండి: మనకు రాని భాష మాట్లాడే గృహస్థుల విషయమేమిటి? సాధ్యమైతే, వారికి బాగా వచ్చిన భాషలో బోధించాలి. (1 కొరిం. 14:9) ఆ గృహస్థుని భాష మాట్లాడే ప్రచారకులు మీ సంఘంలో బహుశ ఒకరో ఇద్దరో ఉంటారు కనుక బహుశ ఆ గృహస్థునికి వారిని పరిచయం చేసి ఆ పునర్దర్శనాన్ని వారికి అప్పగించవచ్చు. ఆ భాషలో కూటాలు జరిగే ఓ సంఘంగానీ లేక పుస్తక పఠనం గానీ వాళ్లకు సమీపంలో ఉండవచ్చు కూడా. సంఘాలు లేక గుంపులూ లేకపోయినట్లైతే, మరి ఆ గృహస్థుని భాష మాట్లాడే స్థానిక ప్రచారకులెవరూ లేకపోతే, దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూరును రెండు భాషల్లో ఉపయోగిస్తూ ప్రచారకుడు ఆ వ్యక్తితో పఠించవచ్చు.
18 ఆంగ్లం మాట్లాడే ఓ ప్రచారకుడు, వియత్నామీస్ మాట్లాడే వ్యక్తితోనూ థాయ్ మాట్లాడే ఆయన భార్యతోనూ పఠించడం ప్రారంభించాడు. పఠించే సమయాల్లో ఆంగ్లంలోనూ వియత్నామీస్లోనూ థాయ్లోనూ ప్రచురణలనూ బైబిళ్లనూ ఉపయోగించేవారు. భాషాంతరం మొదట్లో కొంత సవాలుగా ఉన్నప్పటికీ ఆ ప్రచారకుడు ఇలా రాస్తున్నాడు: “ఆ దంపతులు ఆత్మీయంగా ఎంతో త్వరగా అభివృద్ధి చెందారు. తమ ఇద్దరి పిల్లలతో వారు కూటాలకు హాజరవ్వాల్సిన అవసరతను గుర్తించారు, అంతేకాకుండా వారు కుటుంబ సమేతంగా ప్రతి రాత్రీ బైబిలును పఠిస్తున్నారు. వారి ఆరేళ్ల కుమార్తె స్వయంగా బైబిలు పఠనాన్ని నిర్వహిస్తోంది.”
19 ఇతర భాషలను మాట్లాడే ప్రజలతో పఠించేటప్పుడు, నెమ్మదిగానూ, విడమర్చి స్పష్టంగానూ మాట్లాడండి, సరళమైన పదాలనూ వాక్యాలనూ ఉపయోగించండి. అయితే, ఇతర భాషలను మాట్లాడే ప్రజలను గౌరవంతో చూడాలని మనస్సులో ఉంచుకోండి. చంటి పిల్లలను చూసినట్లు వారిని చూడకూడదు.
20 దేవుడు కోరుతున్నాడు బ్రోషూరులోని అందమైన చిత్రాలను బాగా ఉపయోగించండి. “ఒక్క చిత్రం వేయిమాటలకు సమానమైతే,” బ్రోషూరులోవున్న అనేక చిత్రాలు గృహస్థునితో ఏన్నెన్నో విషయాలను చెబుతాయి. తన స్వంత బైబిలులోని లేఖనాలను చదవమని అతనిని ఆహ్వానించండి. మీరు మాట్లాడే భాష తెలిసిన కుటుంబ సభ్యుడు ఆ భాషను అనువదించేందుకు ఆందుబాటులో ఉన్నట్లైతే, అతనున్న సమయంలో పఠనాన్ని నిర్వహించినట్లైతే నిస్సందేహంగా ఎంతో సహాయకంగా ఉంటుంది.—మన రాజ్య పరిచర్య, నవంబరు 1990, పేజీలు 3-4; ఏప్రిల్ 1984 పేజీ 8 (ఆంగ్లం).
21 ఆలస్యం చేయకుండా పునర్దర్శనాలను చేయండి: ఎన్ని రోజుల తర్వాత పునర్దర్శనం చేయాలి? కొందరు ప్రచారకులైతే మొదట కలిసిన తర్వాత ఒకటి రెండు రోజులకే మరలా కలుస్తారు. మరి కొందరైతే ఆ రోజే కలుస్తుంటారు! మరీ త్వరగా వెళ్తున్నట్లు అనిపిస్తోందా? సహజంగా గృహస్థులు అభ్యంతరం చెప్పరు. మరలా కలిసే ప్రచారకునికే కాస్త ధైర్యంతో పాటు మరికాస్త ఎక్కువ అనుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం తరచూ అవసరమౌతుంది. ఈ క్రింది అనుభవాలను పరిశీలించండి.
22 ఒక రోజు ఓ 13 ఏళ్ల ప్రచారకుడు ఇంటింటి పనిని చేస్తుండగా ఇద్దరు స్త్రీలు కలిసి నడుస్తుండడం చూశాడు. ప్రజలు ఎక్కడ కలిసినా వారితో మాట్లాడాలని ఇచ్చిన ప్రోత్సాహాన్ని మనస్సులో ఉంచుకుని, వీధిలోని ఆ స్త్రీలను అతను సమీపించాడు. వారు రాజ్య సందేశంలో ఆసక్తి కనపర్చి ఇద్దరూ చెరొక జ్ఞానము పుస్తకాన్ని తీసుకున్నారు. ఆ చిన్న సహోదరుడు వారి చిరునామాలను తీసుకుని రెండు రోజుల తర్వాత వారిని కలిసి, ఇద్దరితోనూ వేరువేరుగా బైబిలు పఠనాలను ప్రారంభించాడు.
23 ఓ సహోదరి తాను మొదటిసారి కలిసిన తర్వాతి వారం మరలా కలిసేందుకు ఏర్పాట్లను చేసుకుంది. అయితే మొదటిసారి కలిసిన తర్వాత ఒకటి రెండు రోజుల్లోపే ఆ దారిలో వెళుతూ గృహస్థునితో ముందు మాట్లాడిన విషయంపై ఓ పత్రికను ఇస్తుంది. ఆమె ఆ గృహస్థునితో, “ఈ శీర్షికను చూసి ఇది చదివేందుకు మీరు ఇష్టపడతారని అనుకున్నాను. ఇప్పుడు నేను ఎక్కువసేపు మాట్లాడలేను, కానీ మనం అనుకున్నట్లుగానే నేను బుధవారం మధ్యాహ్నం వస్తానండీ. ఆ సమయానికి వస్తే ఫరవాలేదుగా?” అని అన్నది.
24 ఓ వ్యక్తి సత్యంలో ఆసక్తి కనపర్చినట్లైతే, అతను ఏదోక విధంగా వ్యతిరేకతను తప్పకుండా ఎదుర్కుంటాడు. మొదటిసారి కలిసిన వెంటనే మనం మరలా కలిసినట్లైతే, అతని బంధువులూ సన్నిహిత స్నేహితులూ మరితరులూ అతనిపై తీసుకువచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు అది సహాయపడుతుంది.
25 బహిరంగ స్థలాల్లో కనిపించే వారిలో ఆసక్తిని పెంపొందించండి: మనలో అనేకులం వీధుల్లోనూ, వాహనాలు పార్కుచేసే స్థలాల్లోనూ, ప్రజా రవాణా వాహనాల్లోనూ, షాపింగ్ సెంటర్లలోనూ, పార్కుల్లోనూ అలాంటి మరితర స్థలాల్లోనూ ప్రకటించేందుకు ఆనందిస్తాము. సాహిత్యాన్ని అందించడంతో పాటు, మనం ఆసక్తిని పెంపొందించాలి. అందునిమిత్తం, మనం కలిసే ఆసక్తిగలవారందరి పేర్లనూ చిరునామాలనూ తెలుసుకునేందుకు ప్రయత్నించాలి, మరి సాధ్యమైతే వారి టెలిఫోన్ నంబరును కూడా పొందాలి. ఈ సమాచారాన్ని పొందడం మీరనుకునేంత కష్టమైనది కాదు. సంభాషణ ముగుస్తుండగా, మీ పుస్తకాన్ని తీసి “మరోసారి మనం దీన్ని గూర్చి చర్చించుకోవాలంటే మిమ్మల్ని కలవడమెలా?” అని అడగండి. లేదా ఇలా అనండి: “మీరు ఓ శీర్షికను చదవాలని నాకోరిక, ఇది మీకు ఆసక్తికరంగా ఉంటుందని నేననుకుంటున్నాను. దాన్ని నేను మీ ఇంటికి గానీ మీ ఆఫీసుకుగానీ తీసుకురావచ్చా?” ఓ సహోదరుడు మామూలుగా ఇలా అడుగుతాడు: “మీ ఫోన్ నంబర్ ఏమిటండి?” మూడు నెలల్లో ముగ్గురు తప్ప అందరూ తమ ఫోన్‌నంబరును ఇవ్వడానికి ఇష్టపడ్డారని ఆయన నివేదిస్తున్నాడు.
26 ఆసక్తిని కనుగొనేందుకూ దాన్ని పెంచేందుకూ టెలిఫోన్ ఉపయోగించండి: పూర్తి భద్రతా ఏర్పాట్లున్న భవనాల్లో ఉండే ప్రజలతో మాట్లాడేందుకు ఓ పయినీరు సహోదరి టెలిఫోన్ ఉపయోగిస్తుంది. ఆమె పునర్దర్శనాలను కూడా అలాగే చేస్తుంటుంది. మొదట ఫోన్ కాల్ చేసినప్పుడు, “నేను మీకు పరిచయంలేదని తెలుసు. బైబిలులోని ఓ తలంపును ప్రజలకు చెప్పేందుకు నేను ప్రయత్నం చేస్తున్నానండీ. నాకు ఓ రెండు నిమిషాలు ఇస్తే, . . .లో ఉన్న వాగ్దానాన్ని మీకు చదివి వినిపిస్తాను” అని అంటుంది. ఆ లేఖనాన్ని చదివిన తర్వాత, “మనం అలాంటి కాలాన్ని చూడగలిగితే అద్భుతంగా ఉంటుంది, కాదంటారా? ఇది మీకు చదివి వినిపించి నేను ఆనందించాను. మీకు కూడా అది నచ్చినట్లైతే, నేను మరోసారి ఫోన్‌చేసి ఇంకొక లేఖనాన్ని గూర్చి మీతో మాట్లాడతానండీ” అని చెబుతుంది.
27 మరలా ఫోన్ చేసినప్పుడు, మునుపటి తమ సంభాషణను జ్ఞాపకం చేస్తుంది, అంతేకాకుండా దుష్టత్వం తీసివేయబడినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో బైబిలు నుండి చదవాలనుకుంటుందని చెబుతుంది. ఆ తర్వాత ఆ గృహస్థునితో క్లుప్తంగా బైబిలునుండి చర్చిస్తుంది. అలా ఎన్నో టెలిఫోన్ సంభాషణలను జరిపిన తర్వాత 35 మంది ఆమెను తమ ఇండ్లకు ఆహ్వానించారు, అలా ఏడు బైబిలు పఠనాలను ఆమె ప్రారంభించగలిగింది! వర్షాకాలంలో బురదగానూ జలమయంగానూ ఉండే రోడ్లవల్ల లేక అనారోగ్యం వల్ల ఆసక్తిగల వ్యక్తులను పునర్దర్శించడం కష్టమని మీకు అనిపిస్తోందా? అలాగైతే, సాధ్యమైతే టెలిఫోన్ ద్వారా వారితో ఎందుకు సంభాషించకూడదు?
28 వ్యాపార స్థలాల్లో ఆసక్తిని కనపర్చిన వ్యక్తులను పునర్దర్శించండి: ఇంటింటిపనిలోనూ షాపు నుండి షాపుకు చేసే పనిలోనూ కేవలం పత్రికలను అందించడం కన్నా ఇంకా ఎంతో ఇమిడి ఉంది. షాపు యజమానుల్లో అనేకమందికి సత్యంలో యథార్థమైన ఆసక్తి ఉంటుంది, మరి ఆ ఆసక్తిని పెంపొందించాలి. కొన్ని సందర్భాల్లో, బైబిలు చర్చలను చేయడం సాధ్యం కావచ్చు లేక అక్కడే పఠనాన్ని ప్రారంభించవచ్చు. ఇతర సందర్భాల్లో, మధ్యాహ్న భోజన సమయాల్లో లేక అనుకూలంగా ఉన్న ఇతర సమయాల్లో మీరూ, ఆసక్తిగల ఆ వ్యక్తీ కలుసుకోవచ్చు.
29 ఓ ప్రయాణ పైవిచారణకర్త ఓ చిన్న కిరాణా కొట్టుకు వెళ్ళి, బైబిలు పఠనాన్ని ఎలా చేస్తారో చూపిస్తానని చెప్పాడు. అలా చూపించేందుకు ఎంత సమయం పడుతుందని అడిగినప్పుడు, దానికి 15 నిమిషాలు మాత్రమే పడుతుందని ఆయన చెప్పాడు. దానితో ఆ కొట్టాయన, “20 నిమిషాల్లో వస్తాను” అని ఓ బోర్డుమీద రాసి తలుపుమీద పెట్టి, రెండు కుర్చీలు వేసుకుని జ్ఞానము పుస్తకంలోని మొదటి అయిదు పేరాలను ఇద్దరూ చర్చించుకున్నారు. తాను నేర్చుకున్న విషయాలను బట్టి ఈ వ్యక్తి ఎంతగా ముగ్థుడయ్యాడంటే ఆ ఆదివారం అతను బహిరంగ కూటానికీ కావలికోట పఠనానికీ హాజరై, తర్వాతి వారం పఠనాన్ని కొనసాగించేందుకూ అంగీకరించాడు.
30 వ్యాపార స్థలంలో పఠనాన్ని అందించేందుకు, మీరు ఇలా అనవచ్చు: “మా పఠన కార్యక్రమాన్ని చూపించేందుకు 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. అది మీకు అనుకూలమైనట్లైతే, దాన్ని ఎలా నిర్వహిస్తామో చూపించాలనుకుంటున్నాను.” తర్వాత, మీరు చెప్పిన సమయానికి కట్టుబడివుండండి. వ్యాపార ప్రాంతంలో ఎక్కువసేపు చర్చించడం సాధ్యం కాకపోతే, ఆ కొట్టు యజమానిని అతని ఇంటికి వెళ్ళి కలవడం మరింత సబబు కావచ్చు.
31 ఏ సాహిత్యాన్నీ ఇవ్వకపోయినప్పటికీ పునర్దర్శించండి: సాహిత్యాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ మాత్రం ఆసక్తిని కనపర్చినా పునర్దర్శనం చేయాలి. గృహస్థునికి రాజ్య సందేశంలో నిజంగా ఇష్టంలేదని స్పష్టమైతే, మీరు వేరే చోట ప్రయత్నించడం మంచిది.
32 ఇంటింటి పనిలో, బాగా స్నేహపుర్వకంగా ఉండే ఓ స్త్రీని ఓ సహోదరి కలిసింది. కానీ ఆమె పత్రికలను ససేమిరా వద్దనింది. ఆ ప్రచారకురాలు ఇలా రాసింది: “ఎన్నో రోజుల వరకూ నేను ఆమెను గూర్చి ఆలోచించిన తర్వాత మరలా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను.” చివరికి, ఆ సహోదరి ప్రార్థించి ధైర్యం తెచ్చుకుని, ఆ స్త్రీ ఇంటి తలుపును తట్టింది. ఆ స్త్రీ ఆమెను ఆహ్వానించినందుకు ఆమె ఎంతో సంతోషించింది. బైబిలు పఠనం ప్రారంభించబడింది, మరి తర్వాతి రోజుకూడా అది జరిగింది. కొంతకాలానికి ఆ గృహస్థురాలు సత్యంలోకి వచ్చింది.
33 ఎక్కువ సాధించేందుకు ముందుగానే పథకం వేసుకోండి: ప్రతివారమూ పునర్దర్శనాలు చేయడానికి కొంత సమయాన్ని కేటాయించమని సిఫారసు చేయడం జరుగుతోంది. మంచిగా పథకం వేసుకోవడం వల్ల ఎంతో సాధించవచ్చు. మీరు ఇంటింటి సేవచేసే ప్రాంతంలోనే పునర్దర్శనాలను చేసేందుకు ఏర్పాట్లు చేయండి. సాక్ష్యమిచ్చిన ప్రతి సారీ పునర్దర్శనాలు చేసేందుకు సమయాన్ని కేటాయించండి. మీరు ఓ గుంపుతో పనిచేస్తున్నట్లైతే ఇతరులకున్న నైపుణ్యాల నుండీ అనుభవాలనుండీ నేర్చుకునేందుకుగానూ, మీరు చేసే పునర్దర్శనాలకు వారిని తీసుకువెళ్ళండి వారు చేసే పునర్దర్శనాలకు మీరూ వెళ్లండి.
34 పునర్దర్శనాలను చేయడంలోనూ గృహ బైబిలు పఠనాలను ప్రారంభించడంలోనూ సఫలులైనవారు, ప్రజల యెడల యథార్థమైన ఆసక్తిని కనపర్చడం అవసరమనీ మరి వారితో మాట్లాడిన తర్వాత కూడా వారిని గూర్చి ఆలోచించాలనీ చెబుతున్నారు. ప్రజలతో చర్చించేందుకు వారికి ఆసక్తికరమైన బైబిలు అంశం ఉంచుకోవడమూ మొదటిసారి వారిని కలిసి వెళ్లిపోయేటప్పుడు పునర్దర్శనానికి మంచి పునాదిని వేసుకోవడమూ అవసరమైన విషయాలే. అంతేకాకుండా, పునర్దర్శించడంలో సమయాన్ని పాటించడం ప్రాముఖ్యం. బైబిలు పఠనాన్ని ప్రారంభించే ఉద్దేశాన్ని ఎల్లప్పుడూ మనస్సులో ఉంచుకోవాలి.
35 పునర్దర్శనాలను చేయడంలో విజయాన్ని సాధించేందుకు అవసరమైన ప్రాముఖ్యమైన లక్షణం ధైర్యం. దాన్ని ఎలా పొందవచ్చు? ‘మన దేవుని ద్వారా’ సువార్తను ప్రకటించేందుకు ‘ధైర్యమును కూడగట్టుకో’వాలని అంటూ అపొస్తలుడైన పౌలు జవాబిచ్చాడు. ఈ విషయంలో మీరు అభివృద్ధి సాధించవల్సి ఉన్నట్లైతే, సహాయం కొరకు యెహోవాకు ప్రార్థన చేయండి. తర్వాత మీ ప్రార్థనలకు అనుగుణంగా ఆసక్తి కనపర్చినవారిని సందర్శించండి. యెహోవా మీరు చేసే ప్రయత్నాలను నిశ్చయంగా బలపరుస్తాడు!
[3వ పేజీలోని బాక్సు]
పునర్దర్శనాలను చేసుకోవడంలో సఫలులు కావడం ఎలా
◼ ప్రజల ఎడల యథార్థమైన వ్యక్తిగతాసక్తిని కనపర్చండి.
◼ చర్చించేందుకు వారికి ఇష్టమయ్యే బైబిలు అంశాల్ని ఎన్నుకోండి.
◼ ప్రతి సందర్శనం తర్వాత మరో సందర్శనానికి పునాదిని వేసుకోండి.
◼ మీరు ఆ వ్యక్తి దగ్గరి నుండి వచ్చేసిన తర్వాత కూడా అతన్ని గూర్చి ఆలోచించండి.
◼ పునర్దర్శించేందుకు ఒకటి రెండు రోజుల్లో తిరిగి వెళ్లండి.
◼ బైబిలు పఠనాన్ని ప్రారంభించాలనే మీ గమ్యాన్ని మనస్సులో ఉంచుకోండి.
◼ ఈ పని కొరకు ధైర్యాన్ని కూడగట్టుకునేందుకు ప్రార్థించండి.