ఆసక్తిని కనుగొన్న ప్రతిచోటా నిజమైన శ్రద్ధను కనపర్చండి
1 ప్రపంచవ్యాప్త రాజ్య ప్రకటనాపని త్వరలోనే ఒక ముగింపుకు వస్తుంది, దానితర్వాత “దేవుని నెరుగని” వారందరికీ నాశనం సంభవిస్తుంది. (2 థెస్స. 1:6-10) అందుకని, సాధ్యమైనంత మందికి రాజ్య సందేశాన్ని అందించడానికి ఇతరుల జీవితాలపట్ల నిజమైన శ్రద్ధకల్గివుండడం యెహోవా ప్రజలను ప్రేరేపిస్తోంది.—జెఫ. 2:3.
2 ప్రతి నెలా, “సువర్తమానము”ను వినాలని ఇష్టపడేవారిని వెదకడానికి కోట్లాది గంటలు వెచ్చించబడుతున్నాయి. (యెష. 52:7) ప్రస్తుత సాహిత్య ప్రతిపాదనకు ప్రతిస్పందనగా చాలామంది కావలికోట, తేజరిల్లు!ల ప్రతులను తీసుకున్నారు, వాటికి చందాలను కట్టారు, లేదా దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరు ప్రతులను తీసుకున్నారు. ఈ ప్రజలపట్ల నిజమైన శ్రద్ధ, ఆసక్తిని కనుగొన్న ప్రతిచోటా దానిని వృద్ధిచేయడానికి సత్వరంగా వెళ్లేలా మనల్ని ప్రేరేపించాలి.—సామె. 3:27.
3 సరియైన రికార్డులను ఉంచుకోండి: ఆసక్తి ఎక్కడ కనపర్చబడిందో, సాహిత్యాన్ని ఎక్కడ అందజేశారో ఆ వివరాలను గురించి సంపూర్ణమైన, సరియైన రికార్డును ఉంచుకోవడం ద్వారా మీరు చాలా సాధించవచ్చు. ఇంటి యజమాని పేరూ అడ్రసు, మీరు కల్సిన తేదీ, సమయం, అందించబడిన సాహిత్యం, చర్చించబడిన విషయం వంటివాటిని గురించిన సమాచారం మీరు తిరిగి వెళ్లినప్పుడు మరింత ప్రభావవంతంగా ఉండడానికి సహాయపడుతుంది. దాంతోపాటు, మీరు తొలిసారి సంభాషించినప్పుడు ఇంటి యజమాని చేసిన కొన్ని వ్యాఖ్యానాలను మీరు వ్రాసుకుంటే, పునర్దర్శనంలో చర్చను కొనసాగించినప్పుడు మీరు ఆ వ్యాఖ్యానాలను ప్రభావవంతంగా సూచించగలరు.
4 పునర్దర్శనాలను సత్వరంగా చేయండి: క్రితం నెలలో మీ నుండి సాహిత్యాన్ని అందుకున్న ఎంతమంది దగ్గరకు మీరు మరలా తిరిగి వెళ్లడానికి ప్రయత్నించారు? మరలా కలవకుండానే కొన్ని వారాలు గడిచిపోయాయా? వారి నిత్య సంక్షేమంపట్ల మీకున్న నిజమైన శ్రద్ధ మీరు సాధ్యమైనంత త్వరలో తిరిగి వెళ్లడానికి మిమ్మల్ని కదిలించాలి, అది కొద్ది రోజుల్లోపలే అయితే మంచిది, ఆ విధంగా సంభాషణ మనస్సుల్లో ఇంకా తాజాగా ఉంటుంది. వారి ఆసక్తిని పెంపొందించడానికిగాను పునర్దర్శనాన్ని సత్వరంగా చేయడంద్వారా సాతాను “వారిలో విత్తబడిన వాక్య మెత్తికొని”పోవడానికి ముందే అతడి ప్రయత్నాలను మీరు విఫలం చేయగల్గవచ్చు.—మార్కు 4:15.
5 సిద్ధపడడం ప్రాముఖ్యం: పునర్దర్శనాలను చేయడంలో ప్రభావవంతంగా ఉండడమన్నది మీరెంత బాగా సిద్ధపడతారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. వెళ్లడానికి ముందే మీరేవిధంగా సమీపిస్తారో ఆలోచించుకోండి. ఏప్రిల్ 1997 మన రాజ్య పరిచర్యలోని వెనుక పేజీ కొన్ని అందింపుల్ని అందించింది, చందాలను ప్రతిపాదించేటప్పుడూ లేక దేవుడు కోరుతున్నాడు బ్రోషూరును అందించేటప్పుడూ వాటిని ఉపయోగిస్తూ చక్కని విజయాన్ని సాధించవచ్చు. తర్వాతి విషయమేమిటంటే మీరు తిరిగి వెళ్లినప్పుడు పంచుకోవడానికి కొన్ని తలంపులను మీ మనస్సులో ఉంచుకోవాలి. ఆసక్తివున్న చోటికి తిరిగి వెళ్లినప్పుడు మీరేమి చెప్పవచ్చు? ఒక బైబిలు పఠనాన్ని ఎలా ప్రారంభించవచ్చు?
6 భూమిని శుభ్రంచేసి, దానిని నివాసయోగ్యమైన ప్రాంతంగా చేయడానికి ఏమి చేయాల్సిన అవసరం ఉందన్నదాన్ని గురించిన చర్చను కొనసాగించడానికి తిరిగి వెళ్లినప్పుడు మీరు ఇలా చెప్పవచ్చు:
◼ “నేను క్రితంసారి మిమ్మల్ని కల్సినప్పుడు, భూమిని శాంతిదాయకమైన పరదైసుగా చేయగల్గడానికి ముందు గొప్ప చర్యల్ని తీసుకోవాల్సిన అవసరం ఉందన్నదానిపై మనం ఏకాభిప్రాయానికి వచ్చాము. ఈ కార్యాన్ని సాధించడానికి అవసరమైంది మానవుల దగ్గర ఉందని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] మానవుల కార్యకలాపాల్లో దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు ఏమి జరుగుతుందో దయచేసి గమనించండి.” యెషయా 35:1 చదవండి. తర్వాత జ్ఞానము పుస్తకంలో 1వ అధ్యాయానికి త్రిప్పి, దేవుడు ఏమి సాధిస్తాడో చూపించడానికి 11-16 పేరాల్లోని ఎంపిక చేసుకున్న భాగాలను ఉపయోగించండి. ఈ పుస్తకాన్ని ఉపయోగిస్తూ ఒక బైబిలు పఠనాన్ని నిర్వహించడాన్ని ప్రతిపాదించడం ద్వారా ముందుకు సాగండి.
7 తొలిసారి కల్సినప్పుడు మీరు దేవుని రాజ్యం గురించి చర్చించి, “దేవుడు కోరుతున్నాడు” బ్రోషూరును అందించినట్లైతే, తిరిగివెళ్లినప్పుడు మీరు ఇలాంటిదేమైనా చెప్పవచ్చు:
◼ “మనం క్రితంసారి మాట్లాడుకున్నప్పుడు, దేవుని రాజ్యం భూమినంతటినీ పరిపాలించే ఒక వాస్తవికమైన ప్రభుత్వమని గుర్తించాము. క్రీస్తు యేసు దానికి పరిపాలకునిగా ఉంటాడని బైబిలు చూపిస్తోంది. ఇటువంటి ప్రభుత్వమూ, ఇటువంటి నాయకుడూ ఉండడం వలన వచ్చే ఏమైనా ప్రయోజనాలను మీరు ఊహించగలరా?” ప్రతిస్పందించనివ్వండి. దేవుడు కోరుతున్నాడు బ్రోషూరును పాఠం 6కు తెరవండి. 6-7 పేరాల్లోని ఎంపిక చేసుకున్న విషయాలనూ, 13వ పేజీలోని చిత్రాన్నీ ఉపయోగిస్తూ దేవుని రాజ్యం మానవజాతి కొరకు భవిష్యత్తులో ఏమి చేస్తుందో చూపించండి. దానియేలు 2:44 చదవండి, యుక్తమైతే జ్ఞానము పుస్తకాన్ని పరిచయం చేసి బైబిలు పఠనాన్ని ప్రతిపాదించండి.
8 ప్రపంచంలోని మతాలు మానవాళికి సమస్యల్ని సృష్టించాయన్న విషయాన్ని ఒప్పుకున్న వారినెవరినైనా మీరు కనుగొంటే మీరు పునర్దర్శనంలో ఇది అడగవచ్చు:
◼ “దేవుని ఆమోదం ఏ మతానికి ఉందో మనమెలా తెల్సుకోవచ్చాని మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే ఈ బ్రోషూరు నిజమైన మతానికి కావాల్సిన గుర్తింపు చిహ్నాలను ఇస్తుంది.” పాఠం 13కు త్రిప్పి, 3-7 పేరాల్లో ఇటాలిక్కుల్లో ఉన్న ఐదు పాయింట్లను నొక్కిచెప్పండి. మీరు ఇలా చెబుతూ కొనసాగించవచ్చు: “నిజమైన మతాన్ని కనుగొనడానికి తోడు దేవుడు మన నుండి వ్యక్తిగతంగా ఏమి కోరుతున్నాడో మనం కనుగొనాలి.” యోహాను 4:23, 24 చదవండి. దీనిగురించి ఇకముందు కూడా చర్చిస్తామని చెప్పండి. బ్రోషూరులోని పాఠం 1కి త్రిప్పి, మనం పఠనాన్ని ఎలా చేస్తామో ప్రదర్శించండి.
9 కుటుంబ సంతోషం గురించిన చర్చను కొనసాగించడానికి మీరు తిరిగివెళ్లినప్పుడు ఈ క్రిందిదానిని పోలిన ఏదైనా చెప్పవచ్చు:
◼ “మనం మొదటిసారి కల్సినప్పుడు నేను మీతో కుటుంబ సంతోషానికిగల రహస్యమేమిటో పంచుకున్నాను. దేవుని వాక్యమైన బైబిలులోని సలహాలను అన్వయించుకోవడమే ఆ రహస్యం. ఆధునిక కుటుంబ అవసరతల విషయానికొస్తే, బైబిలుకు కాలం చెల్లిందని మీరు అనుకుంటారా లేక అది నేటి అవసరతలకు సరితూగుతుందనుకుంటారా?” ప్రతిస్పందించనివ్వండి. జ్ఞానము పుస్తకాన్ని అందించండి. 2వ అధ్యాయానికి త్రిప్పి, 13వ పేరాలో ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యానాన్ని చదవండి. 3వ పేరాలోని విషయాలను ఉపయోగిస్తూ కుటుంబ బైబిలు పఠనాన్ని ప్రతిపాదించండి.
10 సరియైన రికార్డులను ఉంచుకోవడం ద్వారా, అవసరమైన సిద్ధపాటును చేసుకోవడం ద్వారా, వారి ఆసక్తిని పెంపొందించడానికి సత్వరంగా తిరిగి వెళ్లడం ద్వారా మనం రక్షణ మార్గానికి వారిని ఆకర్షించేటువంటి పొరుగువానికుండాల్సిన ప్రేమను ప్రదర్శించగలం.—మత్త. 22:39; గల. 6:10.