బ్రోషూర్లతో రాజ్య సువార్తను ప్రకటించండి
1 సత్యాన్ని తెలుసుకోవడం, ఉత్సాహంతో సువార్తను ప్రకటిస్తున్నవారి మధ్య ఉండడం ఎంత సంతోషదాయకము! దేవుని సంస్థ వెలుపల ఉన్నవారు అత్యంత ఆవశ్యంగా రాజ్య సువార్తను వినవలసిన అవసరం ఉంది. రాజ్యమును గూర్చిన సత్యం, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? వంటి బ్రోషూర్లలో సరళమైన రీతిలో వివరించబడింది. అవి దేవుని రాజ్యం క్రింద భూమిపై జీవితాన్ని స్పష్టంగా వర్ణిస్తాయి, అవి దేవుని వాక్యంలో వివరించబడిన రాజ్య వాస్తవాల వైపుకి చదువరిని నడిపిస్తాయి. నిజమే, ఆసక్తిగల ఒక వ్యక్తికి బ్రోషూరును అందించడం, మన పనికి ప్రారంభం మాత్రమే. (1 కొరిం. 9:23) నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంతో పఠనాన్ని ప్రతిపాదించే లక్ష్యంతో సాహిత్యాన్ని అందించిన ప్రతిచోటకు మనం వెంటనే వెళదాము. దీన్ని మనం ఆగస్టులో ఎలా సాధించవచ్చు?
2 “మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?” అనే బ్రోషూరును ప్రతిపాదించేటప్పుడు మీరు ఇలా చెప్పడానికి ప్రయత్నించవచ్చు:
◼ “నేను మాట్లాడిన చాలామంది ప్రజలు నేడు లోకంలో పెద్ద సమస్యలు ఉన్నాయని తెలుసుకుంటున్నారు, అవి పరిష్కరించబడడాన్ని చూడాలని ఇష్టపడుతున్నారని వారు అంటున్నారు. [నిరుద్యోగం, పెరుగుతున్న నేరం, లేక మాదక ద్రవ్యాల దుర్వినియోగం వంటి స్థానిక సమస్యలను పేర్కొనండి.] ఈ విషయాలు మన భవిష్యత్తు గురించి, మన ప్రియమైన వారి భవిష్యత్తు గురించి ఎంతో అభద్రతగా భావించేలా చేస్తాయి. మనకు ఈ సమస్యల్లో ఏదీ ఉండని సమయం ఎప్పుడైనా ఉంటుందని మీరు అనుకుంటారా? [ప్రతిస్పందించనివ్వండి.] బహుశ బైబిలులో నుండి కొన్ని భాగాలను చదివే అవకాశం మీకు లభించి ఉండవచ్చు. మీకు అవకాశం లభించి ఉంటే, అది భవిష్యత్తు కొరకు ఏ వాగ్దానాలను చేస్తుందో మీరు చదివారా?” మన సమస్యలు బ్రోషూరులోని 19, 20వ పేజీలకు త్రిప్పి, నూతన లోకం గురించి అక్కడ ఎత్తి వ్రాయబడిన యెషయా 33:24; 35:5, 6, 7 మరియు కీర్తన 46:9 లేదా 72:16 వంటి కొన్ని ప్రోత్సాహకరమైన లేఖనాలను బిగ్గరగా చదవండి. బ్రోషూరును ప్రతిపాదించండి.
3 “మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?” అనే బ్రోషూరును అందించినట్లైతే, పునర్దర్శనంలో మీరు ఇలా చెబుతూ చర్చను ప్రారంభించవచ్చు:
◼ “మన సమస్యలను పరిష్కరించడానికి, ఒక శ్రేష్ఠమైన లోకాన్ని స్థాపించడానికి దేవుడు చేసిన వాగ్దానాల గురించి మనం ఇంతకుముందు చర్చించాము. నేను మీకు ఇచ్చిన బ్రోషూరు మనం బైబిలును విశ్వసించవచ్చో లేదో, మన దినంలో శ్రేష్ఠమైన పరిస్థితులు వస్తున్నాయని మనకు ఎలా తెలుసు అన్న విషయాల్ని చర్చిస్తుంది. ఉదాహరణకు, వేలాది సంవత్సరాల క్రిందట మన కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయో బైబిలు ముందే కచ్చితంగా తెల్పిందని, లోక మార్పు ఆసన్నమైందన్న సూచనలో ఈ చెడ్డ పరిస్థితులు భాగమై ఉంటాయని చెప్పిందని అది చూపిస్తుంది.” మన సమస్యలు బ్రోషూరును 12వ పేజీకి తెరిచి, ‘సూచన’ అనే శీర్షిక క్రిందవున్న మొదటి పేరాను చదవండి. తరువాత ఇలా అడగండి: “మనం నేడు ఇటువంటి పరిస్థితులు చూడమా? అవి దేనిని సూచిస్తాయో మీకు తెలుసా?” ప్రతిస్పందించనివ్వండి. 2 పేతురు 3:9, 13 చదవండి. గృహ బైబిలు పఠనం ద్వారా ఇంకా ఎక్కువ నేర్చుకోవడాన్ని ప్రోత్సహించండి.
4 “భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!” అనే బ్రోషూరును ఒక క్లుప్త అందింపుతో ప్రతిపాదించవచ్చు. మీరు దాని ముఖపత్రాన్ని చూపిస్తుండగా, ఇలా చెప్పవచ్చు:
◼ “ఒక చక్కని వర్తమానం కలిగివున్న ఒకదాన్ని మీకు చూపించాలని అనుకుంటున్నాను.” భూమిపై జీవితము బ్రోషూరును తెరిచి, ఉపోద్ఘాతం నందలి మొదటి పేరాను చదవండి. తరువాత ఇలా కొనసాగించండి: “అది ఈ ప్రశ్నకు కూడా జవాబిస్తుంది [8వ చిత్రంపైనున్న శీర్షికకు త్రిప్పండి]: ‘మనుష్యుడెందుకు మరణించును?’ చిత్రాలను పరిశీలించి, ఈ బ్రోషూరులో ఉన్న ఉల్లేఖనాలను చదవడం ఆసక్తికరంగా ఉన్నట్లు మీరు కనుగొంటారు. మీరు అలా చేయాలని ఇష్టపడితే, మీరు ఈ ప్రతిని పొందవచ్చు.” బ్రోషూరును అంగీకరిస్తే, గృహస్థుడివద్ద ఇటువంటి ఒక ప్రశ్నను విడిచిపెట్టండి: “అటువంటి పరిస్థితులలో జీవించాలంటే మీరేమి చేయవలసి ఉంటుందని మీరు అనుకుంటారు?” తరువాత ఆ ప్రశ్నకు జవాబివ్వడానికి మీరు తిరిగి వస్తారని చెప్పండి.
5 “భూమిపై జీవితము” అనే బ్రోషూరును అందించిన చోట పునర్దర్శనాన్ని చేసేటప్పుడు మీరు ఏమని చెబుతారు? మీరు ఇలా ప్రయత్నించవచ్చు:
◼ భూమిపై జీవితము బ్రోషూరులోని 49వ చిత్రం చూపించి ఇలా అనవచ్చు: “ఇదొక అందమైన చిత్రం కాదా? [ప్రతిస్పందించనివ్వండి.] అది నేను క్రితంసారి సందర్శించినప్పుడు మీకు ఇచ్చిన బ్రోషూరులో ఉంది. నేను మిమ్మల్ని తరువాతి పేజీలో ఉన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను.” 50వ చిత్రానికి త్రిప్పి ప్రశ్నను చదవండి: “‘అందమైన పరదైసులో నీవు నిత్యము నివసింపగోరెదవా?’ [ప్రతిస్పందించనివ్వండి.] ఒకవేళ అదే మీ కోరికైతే, మీరేమి చేయాలన్న దానిగురించి అది ఏమి చెబుతుందో గమనించండి: ‘అట్లయిన, దేవుడు చెప్పువాటిని అధికముగా నేర్చుకొనుము.’ [యోహాను 17:3 చదవండి.] నేను మీతో బైబిలును ఉచితంగా పఠించేందుకు సంతోషిస్తాను. మీరు దాన్ని ఇష్టపడతారా?” తిరిగి వచ్చేందుకు నిర్దిష్టమైన ఏర్పాటును చేసుకోండి.
6 “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను” అనే బ్రోషూరును ప్రతిపాదించేటప్పుడు, మీరు పూర్తి ముఖపత్రాన్ని చూపించి, ఇలా అడుగుతూ ప్రారంభించవచ్చు:
◼ “భూమినంతటినీ ఇలా తయారు చేయడానికి ఏమి అవసరమని మీరు అనుకుంటారు?” ప్రతిస్పందించనివ్వండి. 3వ పేజీలో ఈ చిత్రం గురించి పేర్కొనబడిన కొన్ని విశేషాంశాలను వివరించండి. తరువాత ఇలా చెప్పండి: “చాలామంది ప్రజలు ఇటువంటి లోకాన్ని తయారు చేయడం అసాధ్యమని భావిస్తారు. కానీ దీన్ని సాధించడం దేవునికి అసాధ్యం కాదు. [43వ పేరాలోని అంశాలను పంచుకోండి; తరువాత యెషయా 9:6, 7 చదవండి.] అన్ని జనాంగముల నుండి వచ్చిన ప్రజలు ఒక అద్భుతమైన పరదైసును ఆనందించే ఒక నూతన లోకాన్ని తెస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మీరు ఈ బ్రోషూరును చదవాలని నేను కోరుకుంటున్నాను. దేవునిచే విరచితమైన ఒక అద్భుతమైన భవిష్యత్తును మీరూ, మీ కుటుంబము ఎలా ఆనందించవచ్చో అది చూపిస్తుంది.”
7 పునర్దర్శనంలో, బైబిలు గురించి ఎక్కువగా నేర్చుకోవలసిన అవసరం ఎందుకు ఉన్నదో వివరించడానికి మీరు “ఇదిగో!” బ్రోషూరును ఉపయోగించవచ్చు. బహుశ ముఖపత్రాన్ని మరలా చూపించి ఇలా చెప్పండి:
◼ “నేను మీకు మొదట ఈ చిత్రాన్ని చూపించినప్పుడు, అటువంటి అద్భుతమైన లోకంలో జీవించడానికి మనం ఇష్టపడతామని మనం అంగీకరించాము. దీన్ని సాధ్యపరచడానికి, మనమందరం చేయవలసినది ఒకటి ఉంది.” “ఇదిగో!” బ్రోషూరును 52వ పేరాకు తెరవండి; పేరాను, యోహాను 17:3 నందు ఉన్న లేఖనాన్ని చదవండి. అందులోని సమాచారాన్ని సరియైన బైబిలు విద్యాభ్యాసాన్ని గురించిన 53వ పేరాలోని దృష్టాంతానికి జోడించండి, తరువాత యెహోవాసాక్షులు అటువంటి ఉపదేశాన్ని ఉచితంగా గృహంలో అందిస్తారని వివరించండి. జ్ఞానము పుస్తకాన్ని ఉపయోగిస్తూ, మన పఠన విధానాన్ని ప్రదర్శిస్తానని చెప్పండి.
8 ఒకవేళ మీరు ఇతర బ్రోషూర్లను ఉపయోగిస్తున్నట్లైతే, పైన సూచించిన వాటిని మాదిరులుగా ఉపయోగిస్తూ, మీరు మీ స్వంత అందింపులను సిద్ధం చేసుకోవచ్చు. ఎక్కడ ఆసక్తి చూపించబడినప్పటికీ, పునర్దర్శనంలో ఫలవంతమైన చర్చను చేయగలిగేలా గృహస్థుని పేరు, చిరునామా, చర్చించిన అంశాన్ని తప్పకుండా వ్రాసుకోండి. మీరు రాజ్య సువార్తను ప్రకటిస్తుండగా చక్కగా సిద్ధపడి, యెహోవా ఆశీస్సులను కోరండి.