దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్ నుండి పఠనాలను ప్రారంభించడం
1 ప్రపంచ నలుమూలల నుండి వస్తున్న నివేదికలు, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూర్ ప్రజలకు సత్యాన్ని బోధించేందుకు శక్తివంతమైన ఉపకరణంగా ఉందని చూపిస్తున్నాయి. ప్రతి వారం, ఈ బ్రోషూర్ నుండి వేలాది పఠనాలు ప్రారంభించబడుతున్నాయి. దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్ నుండి బైబిలు పఠనాన్ని ప్రారంభించి, నిర్వహించడంలో మీరు సఫలీకృతులౌతున్నారా?
2 ఈ బ్రోషూర్ను అందించడం సులభమేనని అనేకులు కనుగొంటున్నప్పటికీ, పఠనాన్ని ప్రారంభించగల్గేందుకు ఏమి చెప్పాలన్నది కష్టంగా ఉందని కొందరు కనుగొంటారు. దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్ను ఉపయోగిస్తూ బైబిలు పఠనాలను ప్రారంభించడంలో ఏ పద్ధతులు ఫలితమిస్తున్నట్లు ఇతరులు కనుగొంటున్నారు? ఈ క్రింది సూచనలు సహాయకరంగా ఉంటాయి.
3 పఠనాన్ని ఎలా నిర్వహిస్తామో చూపిస్తామని ప్రతిపాదించండి: మొదటిసారిగా వెళ్ళినప్పుడు, లేదా పునర్దర్శనం చేస్తున్నప్పుడు బైబిలు పఠనాన్ని నిర్వహిస్తామని గృహస్థునికి ప్రతిపాదించడమే కాక, బైబిలు పఠన కోర్సు ఎలా నిర్వహిస్తామో చూపించగలం. అలా చేసినప్పుడు, చాలా మంది గృహస్థుల మనసులో బైబిలు “పఠనం” అంటే ఏమిటా అన్న తలంపూ, దానితోపాటు కలిగే చింతా తొలగించబడే అవకాశం ఉంది. పఠనాన్ని ఎలా చేస్తామో చూపించడం నేర్చుకున్నాక, సరళమైన ఒక ఉపోద్ఘాతంతో, మనం నేరుగా పఠనాన్ని ప్రారంభించవచ్చని మనం కనుగొంటాం.
4 సిద్ధపాటే కీలకం: బైబిలు పఠనాలను ప్రారంభించడంలో మనం పొందే ఉత్సాహం, మనం ఎంత బాగా సిద్ధపడ్డాం అనేదాని మీద ఆధారపడి ఉంటుంది. బైబిలు పఠనాలను నిర్వహించే పనిలో భాగం వహించడానికి మనం జంకుతున్నట్లయితే, పఠనానికి ముందుగా సిద్ధపడడం ఆ జంకును అధిగమించడానికి సహాయపడుతుంది. మన అందింపును మనం అనేక సార్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా, మరెక్కువగా సంభాషణా శైలిలో మాట్లాడగల్గుతాం, మన మనస్సులో ఉన్నదాన్ని సహజంగాను, సొంత మాటల్లోను వ్యక్తీకరించుకోగల్గుతాం. అది మనం ప్రశాంతంగా చెప్పేందుకు సహాయపడడమే కాక, గృహస్థుడు కూడా ప్రశాంతంగా వినేందుకు సహాయపడుతుంది.
5 రిహార్సల్ చేస్తున్నప్పుడు, మీ అందింపుకు ఎంత సమయం పడుతుందో చూసుకోవడం మీకు సహాయకరంగా ఉంటుంది. అలా చేసినట్లైతే, పఠనం ఎలా నిర్వహిస్తాము అన్నది చూపించడానికి ఎంత సమయం పడుతుందో మీరు గృహస్థుడికి తెలియజేయవచ్చు. ఒక సహోదరుడు, తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత, “ఉచిత బైబిలు పఠన కార్యక్రమం ఎలా జరుగుతుందన్నది మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చాను. దానికి దాదాపు ఐదు నిమిషాలు పడుతుంది. ఐదు నిమిషాలివ్వగలరా?” అని అడుగుతారు. దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్లోని మొదటి పాఠాన్ని దాదాపు ఐదు నిమిషాల్లో చూపించవచ్చు. నిజమే, ఐదు నిమిషాల సమయంలో, కేవలం కొన్ని లేఖనాలనే చదవగలం. కానీ ఈ కొద్ది నిమిషాల్లో మొదటి పాఠాన్ని పూర్తి చేయడం ద్వారా, గృహస్థుడు తన మొదటి పఠనాన్ని చవిచూస్తాడు. ఆ తర్వాత, రెండవ పాఠాన్ని నిర్వహించేందుకు మీరు తిరిగి వెళ్ళినప్పుడు మేము కేవలం 15 నిమిషాలు తీసుకుంటాము అని ఆయనకు తెలపండి.
6 ఈ క్రింది అందింపు ఫలకరమైనదని నిరూపించబడింది:
◼ “దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే ఈ బ్రోషూర్ను ఉపయోగిస్తూ, ఒక గృహ బైబిలు పఠనాన్ని ఏ విధంగా నిర్వహిస్తానో నేను మీకు చాలా సరళంగా, చాలా వేగంగా చూపించాలనుకుంటున్నాను. వారానికి కేవలం 15 నిమిషాల చొప్పున, 16 వారాల్లో, ముఖ్యమైన బైబిలు ప్రశ్నలకు సంతృప్తికరమైన లేఖనాధారమైన జవాబులను కనుగొనవచ్చని అనేకులు గ్రహించారు.” క్లుప్తంగా, బ్రోషూర్లోని విషయ సూచికను చూపించండి. మొదటి పాఠానికి వెళ్ళి, “మీరు నాకు ఒక ఐదు నిమిషాలు ఇవ్వగల్గితే, ఇది ఎలా సహాయపడుతుందో మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. ‘దేవుడేమి కోరుతున్నాడో మీరు తెలుసుకునే విధానం’ అన్నది మొదటి పాఠం పేరు.” తర్వాత, మూడు ప్రశ్నలను చదివి, కుండలీకరణాల్లో ఉన్న నెంబర్లు ఏంటో వివరించండి. మొదటి పేరాను చదివి, జవాబును ఎలా కనుక్కోవాలో గృహస్థుడికి చూపించండి. రెండవ పేరాను చదవమని గృహస్థుడ్ని అడగవచ్చు. తర్వాత, “ఈ సమాచారం ఆధారంగా, మీరు ఈ ప్రశ్నకు ఎలా జవాబిస్తారు? [ప్రశ్నను మళ్ళీ చదివి, గృహస్థుడు వ్యాఖ్యానించేందుకు అనుమతించండి.] ప్రతి పేరాలోను ఉన్న లేఖనాలను గమనించండి. ఇవి, ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే సమాధానాల వైపుకు అవధానాన్ని మళ్ళిస్తాయి. ఉదాహరణకు, 2 తిమోతి 3:16, 17 చదివి, బైబిలు గ్రంథకర్త గురించి మీరు ఇచ్చిన జవాబును అది బలపరుస్తుందేమో చూద్దాం.” 3వ పేరాను చదివి, దాని ప్రశ్నకు జవాబును చర్చించి, యోహాను 17:3 చదివిన తర్వాత, ఒకటవ పాఠాన్ని పునఃసమీక్షించడం ద్వారా ఆయన గానీ, ఆమె గానీ సంపాదించిన జ్ఞానంపై అవధానాన్ని మళ్ళించండి. ఇప్పుడు, రెండవ పాఠానికి వెళ్ళి, “దేవుని గురించి మనం నేర్చుకోగల రెండు మార్గాలేవి?” అన్న చివరి ప్రశ్నను చదవండి. ఆ తర్వాత, “రెండవ పాఠాన్ని చేసి, జవాబును కనుగొనేందుకు మీకు ఒక 15 నిమిషాల సమయం ఎప్పుడు ఉంటుంది?” అని అడగండి.
7 చర్చను సరళంగా ఉంచడమూ, సాధ్యమైనప్పుడెల్లా గృహస్థుడ్ని మెచ్చుకోవడమూ చాలా ప్రాముఖ్యం. మరో సందర్శనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడు, ఈ పఠనాన్ని ఇంకా ఇలా కొనసాగించాలని మీరు కోరుకుంటున్నారా అనే బదులు, తర్వాతి పాఠంలో ఇలాగే చేద్దామని ఆయనను ప్రోత్సహిస్తే సరిపోతుంది. మీరు తిరిగి వెళ్ళాలని ఎదురుచూస్తున్నారని ఆయనకు తెలియజేయండి. సమయాన్ని నిర్ణయించుకోవడం గృహస్థుడికి కష్టంగా ఉన్నప్పుడు, ఫోన్లోనే ఒక పాఠం పూర్తి చేద్దామని కొందరు ప్రచారకులు ప్రతిపాదించారు. బ్రోషూర్ను సురక్షితమైన, సౌకర్యమైన స్థలంలో ఉంచమనీ అలాగైతే, ఈసారి వచ్చినప్పుడు అది అందుబాటులో ఉంటుందని కూడా మీరు విద్యార్థిని ప్రోత్సహించవచ్చు.
8 దృఢ నిశ్చయంతో ఉండండి: సాఫల్యానికి కీలకం సిద్ధపాటే, అయితే మనం తిరిగి వెళ్ళాలన్న దృఢ నిశ్చయం మనకు ఉండడం తప్పనిసరి. ఒక పాఠాన్ని కొన్ని నిమిషాల్లో నేర్పించడమనేది ఒక సవాలే కనుక, మీరు పఠనాన్ని ఎలా నిర్వహిస్తారన్నది చేసి చూపించేటప్పుడు, మీరు అనర్గళంగా మాట్లాడేందుకు గాను, ఎన్ని సార్లు అవసరమైతే అన్నిసార్లు అందింపును ప్రాక్టీస్ చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉండండి. మీరు ఇంటింట పని చేస్తున్నప్పుడు ఇండ్లలో మీకు కనిపించే ప్రతి ఒక్కరికీ, అలాగే అనియతంగా సాక్ష్యమిస్తున్నప్పుడూ, టెలిఫోన్ సాక్ష్యమిస్తున్నప్పుడూ మనం పఠనాన్ని ఎలా నిర్వహిస్తామో చూపించడానికి ప్రయత్నం చేయండి. బైబిలు పఠనాన్ని ప్రారంభించడం మీకు కష్టంగా ఉన్నట్లయితే, మీరు నిరుత్సాహపడవద్దు. బైబిలు పఠనాలను ప్రారంభించడంలో సఫలులవ్వడానికి దృఢ నిశ్చయమూ, ఇతరులకు సత్యాన్ని అందజేయాలన్న హృదయపూర్వకమైన కోరికా అవసరం.—గల. 6:9.
9 ఈ సూచనలను ఆచరణలో పెట్టడం ద్వారా, దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్లో పఠనాన్ని ప్రారంభించి, నిర్వహించడం ద్వారా నిత్యజీవానికి నడిపే మార్గంలోకి ఒకరిని తీసుకువచ్చేందుకు సహాయపడే ఆధికత్యను మీరు కూడా పొందవచ్చు.—మత్త. 7:14.