విజయవంతమైన రీతిలో టెలిఫోను సాక్ష్యం ఇవ్వడం
1 యెహోవాసాక్షులుగా మన ధ్యేయం సువార్త ప్రకటనా పనిలో భాగంవహించడం మాత్రమే కాదుగానీ రాజ్య సందేశంతో వీలైనంత మేరకు ప్రతీ ఒక్కరినీ చేరుకోవడమే. (అపొ. 10:42; 20:24) ప్రజలను చేరుకోడానికి ఉన్న ముఖ్యమైన మార్గం ఇంటింటి పరిచర్యే అయినప్పటికీ, ఒక పద్ధతి ప్రకారం చేసే ఈ పని ద్వారా కూడా మనం ప్రతీ ఒక్కర్నీ కలుసుకోలేమని మనకు తెలుసు. కాబట్టి ‘మన పరిచర్యను సంపూర్ణంగా జరిగించేందుకు’ గొఱ్ఱెల్లాంటి వారిని కనుగొనేందుకు టెలిఫోన్ సాక్ష్యంతోసహా మనం ఇతర పద్ధతులన్నింటినీ ఉపయోగిస్తున్నాం.—2 తిమో. 4:5.
2 అనేక ప్రాంతాల్లో, ప్రజలు హై-సెక్యూరిటీ అపార్ట్మెంట్లలోనో, అనేక కుటుంబాలు నివసించే కాంప్లెక్సుల్లోనో లేక ఇతరులకు ప్రవేశ నిషేధమున్న ప్రాంతాల్లోనో నివసిస్తున్నారు. అటువంటి చోట్ల ఉన్న ప్రజలను ఇంటింటి పరిచర్యలో సువార్తతో చేరుకోవడం కష్టం. ఇంటింట మనం సేవ చేసే టెరిటరీల్లో కూడా, ఇళ్లల్లో ఉండని వారి సంఖ్య చెప్పుకోదగినంత ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ, అనేకమంది ప్రచారకులు టెలిఫోను ద్వారా వారిని చేరుకోవడంలో చక్కని విజయాన్ని సాధిస్తున్నారు. ఒక వివాహిత జంటకు తమ ఇంటింట పనిలో ఒక ఉదయాన ఎవ్వరూ లేని ఇళ్లు తొమ్మిది ఎదురయ్యాయి. రాజ్య మందిరానికి తిరిగి వచ్చిన తర్వాత, వ్యక్తుల చిరునామాల వారీగా టెలిఫోన్ నంబర్లుండే టెలిఫోన్ డైరక్టరీలో వారి ఫోన్ నంబర్ల కోసం చూశారు. ఆ నంబర్లకు ఫోన్ చేశారు, వారిలో ఎనిమిది మంది గృహ యజమానులు ఇళ్లల్లో ఉన్నారు!
3 మీ పరిచర్యలో టెలిఫోన్ సాక్ష్యం ఇవ్వడానికి మీరు వెనుకంజ వేస్తున్నారా? ఒక సహోదరుడు ఇలా ఒప్పుకున్నారు: “నాకు దేన్నైనా అమ్మడానికి ఎవరైనా నా ఇంటికి ఫోన్ చేయడం నాకు ఇష్టం ఉండదు, కాబట్టి ఈ విధంగా సాక్ష్యం ఇవ్వడంలో నాకొక మానసిక అడ్డంకు ఉంది.” అయినప్పటికీ, రెండు ఫోన్ కాల్స్ చేసిన తర్వాత ఆయన ఇలా అన్నారు: “నేను దాన్ని ఇష్టపడుతున్నాను! అది జరిగేపనని నేనెప్పుడూ అనుకోలేదు, కానీ నేను దాన్ని ఇష్టపడుతున్నాను! ఫోన్లో ప్రజలు రిలాక్స్డ్గా ఉంటారు, మీకు కావాల్సినదంతా మీకు అందుబాటులో ఉంటుంది. అదెంతో ప్రభావవంతంగా ఉంటుంది!” ఒక సహోదరి కూడా అలాగే ప్రతిస్పందించింది: “టెలిఫోన్ సాక్ష్యం ఇవ్వడం విషయంలో నేను నిజంగానే ఉత్తేజాన్ని చూపించలేదు. నిజం చెప్పాలంటే, నాకు అలా సాక్ష్యమివ్వడం ఇష్టంలేదు. కానీ నేను ప్రయత్నించాను, చాలా ప్రతిఫలదాయకంగా ఉన్నట్టు కనుగొన్నాను. ఫోన్ సాక్ష్యం ఇవ్వడం వల్ల నాకు 37 పునర్దర్శనాలు దొరికాయి, నేను చేయగల్గేవాటికన్నా ఎక్కువ బైబిలు అధ్యయనాలు ఇప్పుడు నాకు ఉన్నాయి!” మీరు టెలిఫోన్ సాక్ష్యం ఇచ్చేందుకు సుముఖంగా ఉంటే, మీరూ విజయులు కాగలరు.
4 టెలిఫోన్ సాక్ష్యం ఇవ్వడానికి వ్యవస్థీకరించుకోవడం: సంఘం సాక్ష్యం ఇవ్వడానికి సంబంధించిన కార్యశీలత సేవా పైవిచారణకర్త పర్యవేక్షణ క్రిందకు వస్తుంది. అవసరాన్నిబట్టి, టెలిఫోన్ సాక్ష్యం ఇవ్వడానికి సంబంధించిన వ్యవస్థీకరణలో ఆయనతో సన్నిహితంగా పని చేసేందుకు మరో పెద్దనో లేక అర్హుడైన మరో పరిచర్య సేవకుడ్నో నియమించాలని పెద్దల సభ ఎంపిక చేసుకోవచ్చు. టెరిటరీలను చూసుకుంటున్న సహోదరుడు సంఘ టెరిటరీలను నియమించడం, వాటి రికార్డును ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచడం చేస్తాడు గనుక ఆ వ్యవస్థీకరణలో ఆయన్ని కూడా చేర్చాలి. అదేవిధంగా, ఆ కార్యక్రమ పురోభివృద్ధినందు ప్రాంతీయ పైవిచారణకర్త ఆసక్తి చూపిస్తాడు.
5 ఇంటింటి సాక్ష్యపు పని ద్వారా చేరుకోవడానికి వీలుకాని ప్రాంతాలు మీ టెరిటరీలో ఉంటే, టెలిఫోన్ టెరిటరీలను తయారుచేయాలి. నియమించబడిన సహోదరుడు, అలాంటి టెలిఫోన్ టెరిటరీలుగా మార్చబడబోయే చిరునామాల లిస్టునొకదాన్ని జాగ్రత్తగా తయారు చేస్తాడు. క్రమంగా పనిచేయడానికి వీలుగా ఉండేందుకు వాటిని సాపేక్షికంగా చిన్నవిగా ఉండేలా చూడాలి. ఆ యా టెరిటరీల్లో ఉన్న సేవా ప్రాంతాలతోపాటు టెరిటరీ మ్యాప్లన్నింటిపైనా ఫలానా సెక్షన్‌ని టెలిఫోన్ సాక్ష్యం కోసం కేటాయించడం జరిగిందని సూచిస్తూ మార్క్ చేయాలి.
6 టెలిఫోన్ నంబర్లను మీరు ఎక్కడ నుంచి పొందగలరు? వ్యక్తుల పేర్లు వారి టెలిఫోన్ నంబర్లతోనూ, సంక్షిప్త చిరునామాలతోనూ అక్షరమాల క్రమంలో ఉంచిన ఒక టెలిఫోన్ డైరక్టరీ, టెలిఫోన్ బూత్‌లలో అందుబాటులో ఉండవచ్చు. హై-సెక్యూరిటీ ఉన్న ఒక కాంప్లెక్సుకు దాని సొంత టెలిఫోన్ లిస్టు ఉంటే, బహుశా మీరు నంబర్లను అక్కడ నుంచి పొందవచ్చు. అలా వీలుకాకపోతే, భవన ప్రవేశ ద్వారం దగ్గర అందులో కాపురముండే వారి పేర్ల లిస్టు ఉంటుంది, దాంట్లో నుంచి వారి పేర్లను రాసుకొని వాటిని ఒక స్టాండర్డ్ టెలిఫోన్ బుక్‌లో చూడడం సాధ్యమవ్వవచ్చు.
7 టెలిఫోన్ సాక్ష్యం ఇవ్వడంలో అనుభవం ఉన్న వారిని ఇతరులకు తర్ఫీదు ఇచ్చేందుకు ఏర్పాటు చేయడం ద్వారా, బహుశా పయినీర్లు ఇతరులకు సహాయపడతారు కార్యక్రమం ద్వారా పెద్దలు ఈ పనిలో చురుకైన ఆసక్తిని కనబర్చవచ్చు. అప్పుడప్పుడూ, సేవాకూటంలోని స్థానిక అవసరాలు భాగాన్ని, సాక్ష్యమిచ్చే పనిలోని ఈ రంగంలో సాధించిన సాఫల్యాన్ని తీవ్రతరం చేయడానికి కేటాయించవచ్చు.
8 బయటకు కదల్లేని స్థితిలో ఉన్న వారినిగానీ, అస్వస్థతకు గురైన వారినిగానీ పెద్దలు కాపరి సందర్శనం చేసినప్పుడు, టెలిఫోన్ సాక్ష్యం ఇవ్వడంలో భాగంవహించమని వారిని ప్రోత్సహించే విషయాన్ని వారు మర్చిపోకూడదు. బహుశా ఒక పెద్ద కొన్ని ఫోన్‌కాల్స్‌ని చేసి సాక్ష్యమెలా ఇవ్వాలో ప్రచారకునికి చూపించవచ్చు, ఆ తర్వాత ప్రచారకుడు ఒక ఫోన్‌కాల్ చేసి సాక్ష్యమివ్వవచ్చు. అలా ప్రారంభించిన అనేకమంది, ఈ పనిలో ప్రతీరోజు కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు; అలా చేయడాన్ని వాళ్లు నిజంగా ఇష్టపడుతున్నారు.
9 సాఫల్యానికి సలహాలు: ప్రకటించడానికి యేసు తన శిష్యుల్ని పంపించినప్పుడు, ఆయన వారిని “ఇద్దరిద్దరినిగా” పంపించాడు. (లూకా 10:1) ఎందుకు? కల్సి పనిచేయడం ద్వారా వాళ్లు ఒకరి నుంచి మరొకరు ప్రోత్సాహాన్ని పొందుతారనీ, నేర్చుకుంటారనీ ఆయనకు తెలుసు. టెలిఫోన్ సాక్ష్యం ఇవ్వడం విషయంలో కూడా అది వాస్తవం. టెలిఫోన్ సాక్ష్యంలో భాగస్వాములుగా పనిచేయడం ద్వారా, మీరు ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవచ్చు, మీరు పొందిన ఫలితాలను చర్చించుకోవచ్చు, తర్వాత చేయబోయే సంభాషణ కోసం పరస్పరం సలహాలను ఇచ్చుకోవచ్చు. ఫోన్లో సాక్ష్యాన్ని ఇస్తున్న సమయంలో కూడా, దానికి తగ్గ సమాచారాన్ని వెతికి పట్టుకోవడంలో మీరు ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు.
10 స్పష్టమైన ఆలోచననూ, అవధానాన్నీ పెట్టాలంటే, మీ సాక్ష్యమిచ్చే ఉపకరణాలు అంటే బైబిలు, తర్కించుట (ఆంగ్లం) పుస్తకం, దేవుడు కోరుతున్నాడు బ్రోషూరు, పత్రికలు మొదలైనవి మీ ఎదుట ఉంచుకోడానికి వీలుగా ఉండే చోట కూర్చోండి. కొన్ని మాట్లాడే అంశాలను రాసుకోండి, వాటిని మీరు చూడగల్గేంత దగ్గరలో ఉంచుకోండి. ఖచ్చితమైన పూర్తి రికార్డులను జాగ్రత్తపర్చుకునేందుకు సంసిద్ధులై ఉండండి. ఆ రికార్డులో గృహస్థునికి ఆసక్తి ఉంటే పునర్దర్శన ఫోన్‌కాల్‌ని ఏ తారీఖున, ఏ సమయాన చేయాలన్న విషయాన్ని చేర్చండి.
11 ఫోన్లో అపరిచిత స్వరాన్ని వింటున్నప్పుడు ప్రజలు తరచూ జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి ఉత్సాహంగా, స్నేహపూర్వకంగా, జ్ఞానయుక్తంగా మాట్లాడండి. మీ స్వభావాన్నీ, నిష్కాపట్యాన్నీ నిర్ధారించడానికి గృహస్థునికి ఉన్నది కేవలం మీ స్వరం మాత్రమే. ప్రశాంతంగా ఉండండి, హృదయంలో నుంచి మాట్లాడండి. నెమ్మదిగా స్పష్టంగా వినబడేంత తగు స్వరంతో మాట్లాడండి. గృహస్థుడు మాట్లాడడానికి అవకాశమివ్వండి. మీ పూర్తి పేరును చెప్పండి, మీరు ఎక్కడ ఉంటున్నారో తెలియజేయండి. మనల్ని టెలిమార్కెటర్లుగా ప్రజలు తలంచాలని మనం కోరుకోం. ఫలానా బిల్డింగ్‌లో ఉంటున్న లేదా కాంప్లెక్సులో ఉంటున్న వాళ్లందరితోనూ ఫోను చేసి మాట్లాడుతున్నామని చెప్పడానికి బదులుగా, మీ ఫోన్‌కాల్‌ని ఆ వ్యక్తికే చేస్తున్నామని చెప్పండి.
12 టెలిఫోన్ అందింపులు: తర్కించుట (ఆంగ్లం) పుస్తకంలో 9-15 పేజీల్లో ఉన్న అనేక ఉపోద్ఘాతాల్ని టెలిఫోన్ సాక్ష్యం ఇవ్వడానికి అనుగుణంగా మలచుకోవచ్చు. మీరిలా చెప్పొచ్చు: “నేను మిమ్మల్ని స్వయంగా కలుసుకొని మాట్లాడ్డానికి మీ దగ్గరకి రాలేకపోతున్నందున నేను మీకు ఫోన్ చేస్తున్నాను. ఒక ఆసక్తికరమైన ప్రశ్నపై మీ అభిప్రాయాన్ని తెలుసుకోడానికి మీకు ఫోన్ చేయాల్సి వచ్చింది.” ఆ తర్వాత ప్రశ్నను అడగండి.
13 “నేరము/భద్రత” అన్న ఉపశీర్షిక క్రింద ఉన్న మొదటి అందింపును ఈ విధంగా ఉపయోగించవచ్చు: “హల్లో. నాపేరు _____. మేం ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నాం. నేను వేటినీ అమ్మడానికిగానీ, సర్వే చేయడానికిగానీ ఫోన్ చేయడంలేదు. వ్యక్తిగత భద్రత విషయంలో నాకున్న శ్రద్ధనుబట్టే మీకు ఫోన్ చేస్తున్నాను. మన చుట్టూ ఎన్నో నేరాలు జరుగుతున్నాయి, అవి మన జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రజలంతా హాయిగా ఏ భయంలేకుండా రాత్రిపూట వీధిలో నడిచే కాలమొకటొస్తుందని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి] దాని విషయంలో దేవుడు ఏం చేస్తానని వాగ్దానం చేశాడో నేను చదువుతాను వినండి.”
14 ఫోన్ ద్వారా బైబిలు అధ్యయనాల్ని సూటిగా ప్రతిపాదించడం, చక్కని ఫలితాల్ని ఇచ్చింది. అధ్యయనం చేయడాన్ని కొన్ని నిమిషాల్లో ఫోన్లో ప్రదర్శించవచ్చు. బైబిలు అధ్యయనాన్ని కొనసాగించేందుకు వారి ఇంటికి వస్తామని చెప్పండి, లేక ఆ వ్యక్తి కొంచెం తటపటాయిస్తుంటే, మరో రోజున ఫోన్లో బైబిలు అధ్యయనాన్ని కొనసాగిద్దామని ప్రతిపాదించండి.
15 మీ సంభాషణను ముగించేటప్పుడు, ఆ వ్యక్తిని వాళ్ల ఇంటికి వెళ్లి మీరు కలుసుకోవడానికో లేక సాహిత్యాన్నొకదాన్ని తపాలాలో అతనికి పంపించేందుకో నడిపించే విషయాన్ని ప్రస్తావించాలని మనస్సులో ఉంచుకోండి. ఆ వ్యక్తి తన చిరునామాను మీకు ఇవ్వడానికి తటపటాయిస్తుంటే ఆయనకు మరలా ఫోన్ చేస్తానని చెప్పండి. ఆ వ్యక్తి మిమ్మల్ని తన ఇంటికి రమ్మని ఆహ్వానించడానికి ముందు బహుశా అనేక సార్లు ఫోన్లోనే సంభాషణ నెరపాల్సి ఉంటుంది.
16 చొరవ తీసుకోవడం: 15 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఒక సహోదరి తన ఉదయకాల సేవను ఫోన్‌కాల్ చేయడంతో ప్రారంభించింది. ఆమె ఒక స్త్రీతో మాట్లాడింది, ఆ స్త్రీ జ్ఞానము పుస్తకాన్ని తీసుకోడానికి సమ్మతించింది. జ్ఞానము పుస్తకాన్ని ఆ సహోదరి ఆమె ఇంటికి తీసుకెళ్లి ఇచ్చినప్పుడు, తన ఫోన్ నంబరు లిస్టులో లేదు గనుక తన నంబరు ఆ యౌవనస్థురాలికి ఎలా తెల్సిందని అడిగింది. సహోదరి పొరపాటున ఆ నంబరుకు డయల్ చేయడం మూలంగానేనని చెప్పింది! ఆ స్త్రీ బైబిలు అధ్యయనానికి ఒప్పుకుంది, ఆమె ఇప్పుడు బాప్తిస్మం తీసుకోని ప్రచారకురాలు.
17 టెలిఫోన్ టెరిటరీని తీసుకున్న ఒక సహోదరి, భయంతో మూడు వారాలపాటు పని చేయకుండా ఉండిపోయింది. ఫోన్ సాక్ష్యం ప్రారంభించేలా ఆమెకు ఏది ధైర్యాన్నిచ్చింది? తేజరిల్లు! (ఆంగ్లం) జనవరి 22, 1997 సంచికలోని “నేను ఎప్పుడు బలహీనురాలినో అప్పుడు బలవంతురాలిని” అన్న పేరుగల ఆర్టికల్‌ని ఆమె జ్ఞప్తికి తెచ్చుకుంది. అది, తాను అస్వస్థతతో బాధపడుతున్నా టెలిఫోన్ ద్వారా ప్రకటనాపనిని చేస్తున్న ఒక సాక్షిని గూర్చిన వృత్తాంతం. ఆ సహోదరి ఇలా తెలియజేసింది: “నేను యెహోవాకు ప్రార్థన చేసి, బలం కోసం అడిగాను. నేను చక్కగా మాట్లాడేలా నాకు సరియైన మాటల్ని ఇమ్మని ఆయన్ని అడిగాను.” తన మొదటిరోజు టెలిఫోన్ సాక్ష్యం ఫలితమేంటి? ఆమె ఇలా రిపోర్టు చేస్తోంది: “యెహోవా నా ప్రార్థనను విన్నాడు. ప్రజలు తమ అవధానాన్ని నిలిపారు, ఒక పునర్దర్శనం కోసం ఏర్పాటు చేసుకున్నాను.” తర్వాత ఆమె టెలిఫోన్ సాక్ష్యం ఒక బైబిలు అధ్యయనానికి నడిపించింది. ముగింపుగా ఆమె ఇలా అంటోంది: “నాపై గాక తనపైనే నమ్మకం ఉంచమని యెహోవా నాకు మరోసారి బోధించాడు.”—సామె. 3:5.
18 టెలిఫోన్ ద్వారా సత్యాన్ని అందించడం, సువార్త ప్రకటనాపనిలో ఒక విజయవంతమైన పద్ధతి అయ్యింది. బాగా సిద్ధపడండి, హృదయపూర్వకంగా భాగంవహించండి. మొదటి కొన్ని ఫోన్‌కాల్స్‌లో అనుకూలమైన ప్రతిస్పందన రాకపోతే నిరుత్సాహపడకండి. యెహోవా నడిపింపు కోసం ప్రార్థించండి, ఈ ఉత్తేజపూరితమైన మార్గంలో ప్రకటిస్తున్న ఇతరులు తయారు చేసుకున్న నోట్సుతో పోల్చి మీరు చెబుతున్న దాన్ని చూసుకోండి. మన టెరిటరీలో ఉన్న ఏ ఒక్కరూ తప్పిపోకుండా ఉండాలనే కోరికతో, మన పరిచర్యను అత్యవసర భావంతో పూర్తిగా చేద్దాం.—రోమా. 10:13, 14.