ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రికల్ని పంచిపెట్టాలి!
1. జ్ఞాపకార్థ ఆచరణకు ముందు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతుంది?
1 ‘నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి.’ (లూకా 22:19) యెహోవా ఆరాధకులు, యేసు ఇచ్చిన ఈ ఆజ్ఞ ప్రకారం యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి 2010, మార్చి 30న ఆసక్తి గలవారితో కలిసి సమావేశమౌతారు. జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన ప్రత్యేక ఆహ్వాన పత్రికలు ప్రపంచవ్యాప్తంగా మార్చి 13 నుండి 30 వరకు పంచిపెట్టబడతాయి.
2. ఆహ్వాన పత్రికను ఎలా ఇవ్వవచ్చు?
2 ఎలా పంచిపెట్టాలి? ఈ ఆహ్వాన పత్రికలను ఎవరికి ఇస్తున్నామో జాగ్రత్తగా ఆలోచించుకుని ఇవ్వాలి. ఒక వ్యక్తికి యేసు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే ఆసక్తి ఉందని మీకు ఖచ్చితంగా అనిపిస్తేనే, ఆహ్వాన పత్రిక మీదున్న చిత్రాన్ని చూడడానికి వీలుగా మీరు దాన్ని ఆయనకు ఇవ్వాలి. ఆ తర్వాత ఇలా చెప్పాలి: “యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మార్చి 30 సాయంకాలాన సమకూడతారు. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం జరిగే సమయాన్ని, స్థలాన్ని దయచేసి గమనించండి.” పరిస్థితులను బట్టి, బైబిలు తీసి లూకా 22:19 లో ఉన్న ఆజ్ఞను చూపించవచ్చు. క్షేత్రంలోవున్న వారినందరిని కలవడానికి తగినంత సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్పడం మంచిదని గుర్తుంచుకోండి.
3. ఎవరెవరిని ఆహ్వానించవచ్చు?
3 సమస్య తలెత్తదని అనిపిస్తే ఆహ్వాన పత్రికతోపాటు పత్రికలు కూడా ఇవ్వవచ్చు. మీరు పునర్దర్శనం చేస్తున్నవాళ్లను, మీ బైబిలు విద్యార్థులను, మీ తోటి ఉద్యోగస్థులను, తోటి విద్యార్థులను, బంధువులను, ఇరుగుపొరుగు వాళ్లను, పరిచయస్థులను ఆహ్వానించడం మరచిపోకండి.
4. విమోచన క్రయధనం చెల్లించడంలో యెహోవా చూపించిన ప్రేమను అర్థం చేసుకుని కృతజ్ఞత చూపించాలంటే మనమేమి చేయాలి?
4 ఎక్కువగా పాల్గొనడానికి సిద్ధపడండి: జ్ఞాపకార్థ ఆచరణ జరిగే ఈ సమయంలో, ఎక్కువగా పరిచర్య చేయడానికి మనకు ఎంతో మంచి అవకాశం ఉంది. సహాయ పయినీరు సేవ చేయడానికి వీలుగా మీరు మీ పనుల్లో సర్దుబాట్లు చేసుకోగలరా? ఆధ్యాత్మిక విషయాల్లో మంచి ప్రగతి సాధిస్తున్న పిల్లలుగానీ, బైబిలు విద్యార్థులుగానీ మీకు ఉన్నారా? ఉంటే, వాళ్లు బాప్తిస్మం తీసుకోని ప్రచారకులై, ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందేమో పెద్దలను అడిగి తెలుసుకోవాలి. విమోచన క్రయధనం చెల్లించడంలో యెహోవా చూపించిన ప్రేమను అర్థం చేసుకుని కృతజ్ఞత చూపించాలంటే, జ్ఞాపకార్థ ఆచరణకు మనం మాత్రమే హాజరైతే సరిపోదుగానీ మనతోపాటు వీలైనంత ఎక్కువమందిని ఆహ్వానిస్తే బావుంటుంది.—యోహా. 3:16.